మహాప్రవాహం!-33

0
12

[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘మహాప్రవాహం!’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[కూతురు అల్లుడు వెళ్ళిపోయాకా, ఇల్లంతా బోసిపోయినట్లవుంది ఖాజా హుసేనుకు. కుమ్ములో మిగిలిన గెలలు మగ్గితే రెండు రోజులు నాగలాపురం సంతలో అమ్ముకుంటాడు. తర్వాత సరుకు కోసం కాశినాయన తోటకి వెళ్ళి గెలలు అడిగితే, కర్నూలులో హోల్‍సేల్ వ్యాపారి అన్వర్ మియ్యాతో ఒప్పందం చేసుకున్నామనీ, అతనే లారీ పంపించి, గెలలు తీసుకెళ్తాడనీ, పండ్లు ఇవ్వడం కుదరదని చెప్తాడు కాశినాయిన. కనీసం రెండు గెలలయినా ఇవ్వమని బ్రతిమాలినా ఇవ్వడు. అక్కడ్నించి వెళ్ళి రామల్లకోటలో ఒక తోట వద్ద అడిగినా, ఇదే సమాధానం – కర్నూలు అన్వర్ మియ్యాకి పంపాలని. నీరసంగా ఇంటికి చేరతాడు. మొగుడిని చూస్తూనే ఫాతింబీ విషయం గ్రహిస్తుంది. ధైర్యం చెబుతుంది. అల్లుడు చెప్పినట్టు గద్వాల పోదామని అంటుంది. సరే ముందు అల్లునితో ఓ మాట చెప్పి వద్దాం అని దంపతులిద్దరూ మరునాడు బస్సెక్కి గద్వాల చౌరస్తాలో దిగుతారు. ఊరు అక్కడ్నించి ఇంకో పన్నెండు మైళ్ళుంటుంది. హాఠాత్తుగా వచ్చిన అత్తమామలను చూసిన ఖాదర్ ముందు వాళ్ళను కూర్చొబెట్టి, నిమ్మకాయ సోడా తాగించి, తరువాత విషయం అడుగుతాడు. తోటల వాళ్ళు సరుకు ఇవ్వడం ఆపేశారని చెప్తాడు ఖాజా. అన్వర్ మియ్యా కర్నూలులో బడే ఆద్మీ అని అంటాడు ఖాదర్. అయినా సైకిల్ మీద తిరిగి అరటిపళ్ళు అమ్మడం మానుకోమని మామకు చెప్తాడు. గద్వాలలోనే మామతో పళ్ళ కొట్టు పెట్టిస్తానంటాడు. కొద్దిసేపయ్యాకా, ముగ్గురు బస్సెక్కి గద్వాల ఊరికి చేరి, ఇంటికి వెడతారు. అమ్మానాన్నలను చూసిన హసీనా ఉబ్బితబ్బిబ్బవుతుంది. చేసిన వంట అందరికీ సరిపోదని అంటే ఖాదర్ అందరినీ దగ్గరలోని హోటల్‍కి తీసుకెళ్తాడు. భోజనం అయ్యాక వాళ్ళని విశ్రాంతి తీసుకోమని చెప్పి, తాను షాపుకి వెళ్ళిపోతాడు. మరునాడు అన్ని బజార్లు తిరిగి అంగడి కోసం బోగట్టా చేస్తారు. పూలబజారులో ఒకచోట ఒక మంచె ఖాళీగా కనపడుతుంది. అది మునిసిపాలిటీ వాళ్లదని తెలిసి, మున్సిపల ఆఫీసుకు వెళ్ళి యాదగిరి అనే అతన్ని కలిసి, అతని ద్వారా జోగయ్య అనే ఉద్యోగితో మాట్లాడి ఆ మంచె మీద కొట్టు తమకి వచ్చేలా చేసుకుంటారు. అంగడి కూడా సిద్ధమయ్యే సరికి, ఊరికి వెళ్ళి ఇల్లు అమ్మేసి రమ్మని అల్లుడంటాడు. సరేనని చెప్పి ఊరెళ్ళి బడేమియాని కలుస్తాడు. తన మిత్రుడు అనుమంతరెడ్డి కొడుకు సిమెంటు డీలర్‍షిప్పు తీసుకున్నాడనీ, సిమెంట్ బస్తాలు పెట్టుకోడానికి గోడవును కోసం చూస్తున్నాడనీ, అతనితో మాట్లాదామని చెప్పి, వాళ్ళింటికి తీసుకెళ్తాడు బడేమియా. మర్నాడు ఉదయం కొడుకుతో కలిసి వచ్చి ఇల్లు చూస్తామని చెప్తాడు అనుమంతరెడ్డి. ఇక చదవండి.]

[dropcap]అం[/dropcap]దరూ ఇంటి కాడికి బోయినారు. అనుమంతరెడ్డి కొడుకు పేరు మారుతి రెడ్డి. ఇల్లంతా చూసి “సరిపోతాది గాని శానా ఖర్చు వస్తాది. ఏకాండము చేసుకోవల్ల. వారపాగు తీసేసి గోడ కట్టి కటాంజనమేయల్ల. తలవాకిలి శానా వీకుగా ఉండాది. ఒక్క తన్ను తంతే ఇరిగిపోయేటట్టుందాది” అన్నాడు.

బడేమియా నవ్వి “మీరు కొనుక్కున్నంక మీ యిస్టము. గోడవును కోసరము ఇల్లు కడతారా ఏంది? ఉళిందకొండలో దానికి బెట్టే మూడేండ్ల బాడిగతో ఈడ యిల్లే వస్తాది. దగ్గర. ట్రాక్టరుండాది. పైగా మా ఖాజా మంచోడు. బతకనీకె గద్దువాల జేరతాండాడు. ఆ యప్పకు సమయానికి సాయం చేసినోల్లవుతారు. మీకూ మంచిదే. ఆలోశన చెయ్యండి!” అన్నాడు.

“మంచిమాట చెప్పినావు” అన్నాడు అనుమంతరెడ్డి, “పాండి మా యింటి కాడ కూసోని మాట్లాడుకుందాము.”

అందరూ బోయి కూచున్నారు. టీలు పంపించింది రెడ్డెమ్మ. “బాగుండావా అన్నా!” అని బడేమియాను పల్కరించినాది. “ఈ యప్ప అరిటిపండ్ల సాయిబు గదా!” అనింది. ఖాజా ఆ యమ్మకు నమస్కారం బెట్టినాడు. “బుడ్డ లిత్తనం గొట్టనీకె మీ వాండ్లు (భార్య) శానా తూర్లు వచ్చింది మా యింటికి. అడిగినానని చెప్పు సాయిబూ!” అని చెప్పి లోపలికి బోయినాది.

“ఎంత చెప్పినావు ఉసేనూ!” అనడిగినాడు రెడ్డి. ఖాజా బడేమియా దిక్కు జూసినాడు. “మా బావ ఎట్టచెబితే అట్ల!” అన్నాడు.

బడేమియా అన్నాడు “రెండున్నర అంకనాలకు కొంచెం తక్కువుంటాందేమో! ఇరవై ఎనిమిది వేలు జేసుకోండి.”

“అంత చెయ్యదులే అజరత్! మాకు రిపేర్ల కర్చుండాది గదా!” అన్నాడు మారుతి రెడ్డి.

“గరీబోనికి రెండు వేలు ఎక్కువిస్తే మీ పేరు చెప్పుకుంటాడు. సూడండి మరి. పెద్దమనుసు జేసుకోండి”

“ఇరవై మూడయితే మాకు సరే” అన్నాడు మారుతి రెడ్డి,

“మీ మాట కాదు మా మాట కాదు గాని ఇరవై ఐదుకు తెంపుదాము” అన్నాడు బడేమియా.

“సరే! నా దోస్తువు నీవు! నీ మాట ఇనల్ల కదా!” అన్నాడు అనుమంతరెడ్డి.

పదివేలు సంచకారమిచ్చినారు. మిగతాది పదైదు రోజుల్లో చుప్తా చేసి కాయితం రాసుకుందామనుకున్నారు. అనుమంత రెడ్డికి, బడేమియాకు చేతులెత్తి మొక్కినాడు ఖాజాహుసేను.

మంచి దరే పలికి నాదని సంతోశపడినారందరూ.

***

ఆ షాపుకు ఆధారంగా ఉన్న తాటి దూలాలు బాగానే ఉండాయి గాని, పైన చెక్కలు పాడయినాయి. కార్పెంటరును తెచ్చి కొన్ని చెక్కలు మార్పించినారు. సమంగ పరిపించి శీలలు గొట్టించినారు. ఖాజ శాపులో కూచోనీకె ఒక అడుగున్నర ఎత్త నాలుగు కాల్ల ఎత్తు పీట చేయించినారు. మ్యాదరాయనను బిలిపించి నాలుగు పక్కల లావువి ఎదురు బొంగులు నిలబెట్టించినారు. వాటి మింద తడకలు అల్లించి ఏయించినారు. ఖాదరు నేస్తుడు ఒకడు లారీ డ్రైవరున్నాడు. వాడు ఒక పాత టార్పాలిను గుడ్డ ఇచ్చినాడు. దానిని పైన తడకల మింద ఏసి సన్న యినప తీగెతోని అంచులు కుట్టించినారు. శాపు రడీ అయినాది.

జహంగీరు పరీక్షలు ఐపోయినాయి. ఆర్.టి.సి.లో అప్రెంటిసుకు అర్జీ పెట్టుకున్నాడు. కర్నూలు కార్బైడు ఫాక్టరీకి గూడ్క. నంద్యాల నుంచి వచ్చేసినాడు.

కింద సైడు కాలవ మింది నాప బండలతో నీటుగా మూయించినారు. శాపు ఎత్తుగా ఉంటాది. దానిమీదికి ఎక్కి కూసునీకె తాటి దూలానికే చెక్కపలకలు గొట్టించి మెట్ల మాదిరి చేసినారు. జహంగీరు రంగు కాయితాలు తెచ్చి మైదా పిండి ఉడికించి తాటి దూలాలకు, వెదురు బొంగులకు కరిపించినాడు. షాపు ఎనక ఉన్న గోడకు మరకలు ల్యాకుండా సున్నం ఏయించినారు. గోడ మిందనే బ్లాక్ బోర్డు పెయింటుతో ‘హసీనా ఫ్రూట్ స్టాల్’ అని రాయించినారు తెలుగులో.

ఎన్నాల్లు బిడ్డ యింట్లో ఉండాలని, వేరే యిల్లు చూడమని ఫాతింబీ పిసుక్కుంటా ఉంది. ఎంత చెప్పినా యినదే! ఆకిరికి వాండ్లకు వీండ్లలో చెపితే, పూలబజారుకు దగ్గరలోనే టేసను రోడ్డులో, ఒక సందులో ఇల్లు దొరికినాది. మట్టి మిద్దె. ఈది లోకే తలవాకిలి. లోపల పడసాల, ఒక మూలన వంట చేసుకోనీకె, ఇంకోమూల ఒక ఇటికె వరస కట్టి పండుకోనీకె సౌకర్యము చేసినారు. వాడుక నీల్లు బయట బోరింగులో కొట్టుకోని తెచ్చుకోవాల్సిందే. మంచినీల్ల కొలాయి పక్కనే ఓనర్ల యింట్లా ఉంది. వచ్చినపుడు పట్టుకొచ్చుకోవాల. ఓనర్లు కూడా సాయిబులే కాబట్టి పరవాలేదు. బాడిగ నూటపది. కరెంటు ఏరే. మంచినీల్లకు ఏరే. అంతా నూట ముపై ఏసుకోవచ్చు. వంటింటి లోంచి వాకిలుండాది. ఆడ నాలుగడుగుల వెడల్పు, పదడుగుల పొడుగు ఉన్న స్థలముంది. దానికి ఐదడుగుల ఎత్తు గోడ అడ్డము. దాంట్లో ఒక పక్క అంట్లు గిన్నెలు కడుక్కునీకె, గొడ్డలుతుక్కోనీకె ఒక చిన్న గట్టు. ఇటు పక్క బాత్ రూము, లెట్రిన్.

అందరికీ యిల్లు నచ్చినాది. రెండు నెలల అడ్డుమాన్సు ఇచ్చి జేరినారు. జహంగీరు పోయి బొమ్మిరెడ్డిపల్లెలో సామాన్లన్నీ ఏసుకొచ్చినాడు. అనుమంతరెడ్డి ట్రాక్టరిచ్చినాడు. “డీజిలు కొట్టించి డ్రైవరు బత్తా ఇయ్యండి సాలు” అన్నాడు.

మున్సిపాలిటీ నుంచి లీజు కాయితం, లైసెన్సు తెచ్చిచ్చినాడు యాదగిరి. తనకు రెండు నూర్లియ్యమని అడిగి యిప్పించుకున్నాడు.

కార్బైడ్ ప్యాక్టరీలో ఆరునెలలు అప్రెంటీసు చేయనీకి మౌకా వచ్చింది జహంగీరుకు. అది దూపాడు టేసను దాటినంక వస్తాది.

అనుకున్నట్లుగానే అనుమంతరెడ్డి మిగతా డబ్బులు ఇచ్చేసి స్టాంపు పేపరు మింద రాయించుకున్నాడు. సాచ్చి సంతకము బడేమియా చేసినాడు.

ఒక శుక్రవారము శాపు ప్రారంబము చేయాలని అనుకున్నారు. దానికి ముందుగానే అందరూ కలిసి రాయిచూరు కాడ మాసుం బాషా దర్గాకు పోయి దర్శనము చేసుకోని వచ్చినారు. శాపు బాగా జరగాలనీ, కొడుక్కు ఉద్యోగం రావాలనీ, బిడ్డ కడుపు పండాలనీ మొక్కుకున్నారు దేవునికి.

పండ్లు హోల్‌సేల్ యాడ తెచ్చుకోవాల అని ఇశారించుకుంటే కర్నూలులోగాని, రాయిచూరులో గాని తెచ్చాకోవాలని చెప్పినారు వేరే షాపులవాండ్లు. ఖాజామియ్యకు ఎందుకో కర్నూలు ఇష్టం లేదు. ఎవరో ఖాదరుకు చెప్పినారు, ‘మాబునగరం (మహబూబ్ నగర్) లో ఈ మధ్య పెద్ద మండీ పెట్టినారనీ, మన సాయిబులదేననీ, వాండ్లకు సిద్ధియంబరు బజారు, హైదరాబాదులో శానా పెద్ద మండీ ఉన్నదనీ ‘హనీఫ్ అండ్ కో’ అని పేరనీ; రేట్లు గూడ్క తక్కవ అనీ, మాబునగరం నుండి గద్దువాలతో ప్యాసెంజర్ల పండ్ల గంపలు ఏస్కరానీకె గూడ్క సులబమనీ, టి.సి.కి పదిరూపాయలిస్తే ఏమీనడ’నీ.

తండ్రీకొడుకూ, అల్లుడూ మాబునగరం పోయినారు ద్రోణాచలం కాచిగూడ ప్యాసెంజరులో. హనీఫ్ మండీ శానా పెద్దది. ఎం.వి.ఎస్. కాలేజీ దాటినంక పెద్ద మార్కెట్‌కి ఇవతలే ఉంది. లారీలు గుడ్క లోపలికి పోయేంత పెద్దది. హనీఫ్ మియా లోపల ఒక అరుగు మింద దూది పరుపులు పరచిన ఆఫీసులో కూచున్నాడు. నలుగురు గుమాస్తాలు ముందర డెస్కులు పెట్టుకోని రాసుకుంటున్నారు. పదిమంది హమాలీలు లారీలలో సరుకును దింపుతున్నారు. సొంతంగా ట్రాక్టర్ల మీద, బండ్ల మీద సరుకు తెచ్చిన రైతులు గుడ్క శానా మంది ఉన్నారు.

పోయి శావుకారికి నమస్కారం బెట్టినారు.

ఖాదర్ అన్నాడు – “సలామాలేకుం సాహెబ్. హమ్ గద్వాల్ సే ఆయే. ఉధర్ హమారా ఏక్ ఫ్రూట్ స్టాల్ హై. ఇస్ కేలియే హామే ఆప్ కీ మండీ సే మాల్ లేనేకే లియే ఆయే. కృపా కర్ కే ఆప్ హామే మదద్ కర్ నా జీ! హమ్ బీ ముసల్మాన్ లోగ్ హై. గరీబ్ లోగ్ హై.”

ఆ పిల్లవాని వినయం హనీఫ్ సాబ్‌కు నచ్చింది. “లేలో మాల్ తుమ్ కో క్యా చాహియే. దో తీన్ బార్ అనే కే బాద్ ఆప్ కే బారే మే హమ్‌కో పతా చల్తా హై. తబ్ ఉద్దర్ లే సక్‌తే” అన్నాడాయన.

బైట మ్యాదర బుట్టలు ఎక్కడమ్ముతారో కనుక్కోని పది బుట్టలు, కొన్ని ప్లాస్టిక్ ట్రేలు, పండ్ల కట్టియ్యడానికి దారం చుట్టలు, ప్లాస్టిక్ కవర్ల పాకెట్లు కొనుక్కొచ్చుకున్నారు

ఒక గుమాస్తా వచ్చి గ్రోసుల ప్రకారము కొన్ని రకాలు, తూకం ప్రకారం కొన్ని రకాలు ఇస్తామని చెప్పినాడు. ఆ రోజు మార్కెటు రేటు ప్రకారము వచ్చిన సరుకును డిమాండును బట్టి రేటు ఉంటుందన్నారు. పండ్లు రిటైల్‌లో ఎంత కమ్మాలో కూడ వివరించినాడు.

“తాజా మాల్ బేచో! ఏక్ రుపయా కమ్ బోలో, బిజినెస్ అచ్ఛీ తరహ్ బడ్ జాయేగీ!” అన్నాడాయన.

మొత్తం సరుకు మూడు వేల ఎనిమిది వందలయింది. డబ్బు కౌంటర్లో కట్టేసినారు. రెండు రిక్షాలు మాట్లాడుకోని స్టేషను చేరినారు. కాచిగూడ కర్నూలు టవున్ ప్యాసింజరుతో బుట్టలు ఎక్కించుకున్నారు. ఎవ్వరూ చెక్ చెయ్యలేదు.

మర్సటి రోజు శుక్రవారం నమాజు ముగించి, ఖాజా హుసేను నాస్తా జేసి ఏడు గంటల కల్లా షాపు మీద కూర్చున్నాడు. అల్లుడు, కొడుకు వచ్చి బుట్టలన్నీ సర్దినారు. మూడు అరటి గెలలు తెచ్చుకొన్నారు. పనలు కోసి వెదురు బొంగులకు యాలాడ దీసినారు.

మొదటి రోజు అంత బాగా అమ్మకాలు కాలేదు. సాయంత్రానికి ఐదు వందలు అమ్మింది. ‘జనాలకు అలవాటు కావాల కదా’ అనుకున్నారు. నెలరోజుల్లో అమ్మకాలు పెరిగినాయి. ఖాజా హుసేను నిదానము, ఆడవాళ్లతో కూడ మర్యాదగ మాట్లాడడం, తాజా సరుకు ఇవ్వడం, ధర వేరేచోట్ల కన్నా కొంచెం తక్కువే అనిపించడం, షాపును కస్టమర్లకు దగ్గర చేసింది. సులబంగ రోజూ వెయ్యి నుంచి పన్నెండు వందలు అమ్ముతాంది. హనీఫ్ సాహెబ్ డబ్బు కట్టకపోయినా మాల్ తీసుకుపొమ్మంటున్నాడు. యాపారం నిలబడినట్లే.

హసీనా, ఖాదర్ లను మాసుంబాషా సామి కరునించినాడు. ఆ యమ్మి కడుపుతో ఉంది. అమ్మమ్మ, తాతా బహుత్ కుశ్!

జహంగీరు అప్రెంటిస్ ఐపోయింది. కార్బైడు ఫ్యాక్టరీలోనే తీసుకున్నారు. నెలకు ఎనిమిది నూర్లు జీతం, ఓవర్ టైము, నైట్ డ్యూటీ అలవెన్సులు, పి.ఎఫ్, అన్నీ వస్తాయి. కర్నూలు బి. క్యాంపులో ముగ్గురు తనతోపాటు పనిచేసి కార్మికులతో కలిసి రూము తీసుకున్నాడు. వండుకోని తింటాన్నారు. ప్రతి బుధవారము వానికి ‘ఆఫ్!’. ఆ రోజున గద్వాలకు పోయి అందర్నీ చూసి వస్తాన్నాడు.

అట్లా, కాలమహాప్రవాహంలో కొట్టుకోని, మరో కుటుంబం ప్రయానం సాగిస్తాంది. దానికి ఎదురీదడం ఎవరి తరం కాదు. పోతా ఉండడమే!

***

మహాప్రవాహం! సుల్లు తిరగుతా, నురగలు తేలతా, ఓరున అరుపులు పెట్టుకుంటా శానా బీబత్సంగ సాగిపోతాన్నాది. ఇంతకు ముందు నించే నిలబడి ఉన్న పాత నీల్లను ముందుకు దొబ్బుకుంటా ఉరకతాన్నాది. శిన్నా శితక కంప శెట్లు, పాత తడికెలు, పాత శెక్కలు, పాత మంచాలు ప్రవాగములో సరాసరా కొట్టకపోతాన్నాయి.

ఒక్కటేమిటి. ఇది ముంచక రాక ముందుండేదీ నిలబడల్యాకపోతాంది. దానికి  రెండు పక్కలా ఒడ్లను వొరుసుకోని బిరబిరా పారతన్నాది. ఒడ్లు నానిపోయి ప్రవాహములోకే కూలిపోతాన్నాయి. ఒడ్డు మింద అంతవరకు నిమ్మలంగ నిలబడుకోనున్న పెద్దవి శిన్నవి శెట్లు ఒడ్డుతో బాటు ఏర్లకు పెల్లగించుకోని నీల్లల్లో పడిపోయి కొట్టకపోతాన్నాయి. ఇసనాగులు గూడ్క కొమ్మల మింద సచ్చుకోని (ఆశ్రయం), ఇదేమి ప్రలయమురా అని గుండెలు పగలకొట్టుకుంటా సాగిపోతాన్నాయి. ఈ పెనెల్లువ యాదాన్నీ ఇటిసి పెట్టడం లేదు. అన్నిటినీ తన తోనే తీస్కపోబట్నాది.

ప్రవాగం తన పరిధి దాటుకోని శేన్లను, తోటలను ముంచెత్తుతాన్నాది. పసరాలు గూడు దీనంగా అరుస్తనీల్లలో కొట్టక పోతాన్నాయి. మెరప, వంగ, టమాట తోటలన్నీ నేలకు వరిగిపోయి ఎల్లవకు దారిస్తానాయి. వరిమల్లు పెద్ద పెద్ద నీల్లతొట్ల మాదిరి తొనుకుతుండాయి.

ఎవురో ఒక పెద్దాయన ఎల్లవలో కొట్కబోతాన్నాడు. శేతులు పైకెత్తి అరస్తాన్నాడు. శిన్న ఆధారము గుడ్క దొరకడం లేదా యప్పకు. మునకలేస్తా లేస్తా పోతాన్నాడు. దాని వడి ఎంత ప్రశండముగా ఉన్నాదంటే అది అందర్నీ తీస్కపోతాండాద్యా ల్యాక అందురూ, అన్నీ తమ వశములో లేకుండానే, తమంతట తామే ఎల్లువలో పోతాంతారా అనేది అర్తం గావడముల్యా.

కొట్టుకపోతున్న పెద్దాయనకు రెండు పగ్గం పట్ల దూరములో పెద్ద బండశిల కనబడినాది. దాన్ని గాని పట్టుకొని దాని మీదకెక్కితే పానాలు నిలబెట్టుకోవచ్చా కదా అనుకున్నాడా యప్ప, బండశిల కాడికి ప్రవాగము ఈడ్సకపోయి బండకు పెడీమని కొట్టి పక్కకు ఇసిరేసినాది.

బయముతో ఒక్క పెను క్యాక పెట్టి లేసి కూర్చున్నాడు కొండారెడ్డి, ఒల్లంతా దిగ సెమటలు కారతాన్నాయి. ఏసుకున్న బనియను అంగీ తడిసినాయి. కొంచేపు అట్నే కూసున్నాడు మంచము మింద. పక్కన స్టూలు మింద పెట్టిన నీల్ల జగ్గులో నించి గలాసులోకి నీల్లు వంపుకొని, తాగినాడు. పైపంచ తోని ముకము మెడ, శేతులు తుడుసుకున్నడు. కరెంటు పోయిందనుకొన్నాడు ముందల. అయినా జనరేటరు ఉంది గద! అనుకున్నాడు. కానీ పైన ప్యాను తిరగుతానే ఉండింది.

‘దీనమ్మ! ఎంత బయంకరమైన కల!’ అనుకున్నాడు కొండారెడ్డి. గోడకున్న గడియారము చూసినాడు. తెల్లవారు జామున ఐదు దాటి పది నిమిసాలు అయతా ఉంది. ఆ యప్పకు తానింకా ఎల్లవలో కొట్టుకుపోతా ఉన్నట్లే అనిపించి నవ్వుకున్నాడు

‘ఇంకేం కొట్టుకపోతాం! కొట్టుకొచ్చి కొట్టుకొచ్చి ఈడ దేలినా!’ అనుకున్నాడు.  ఇంట్లో ఎవురూ నిద్ర లెయ్యలేదు. బయట ఆల్లోకి బోయినాడు. గోడకు నాగరత్నమ్మ పోటోలో నవ్వుతాండాది.

“యానాడు నవ్వుకుండా ఉండిన్నావు గనక” అన్నాడు పోటో ముందు నిలచడి. “ఎన్ని ఒడిదొడుకులొచ్చినా నీ ముకంలో నవ్వు సెరగల్యా. నాకు ధైర్యం సెప్తానే ఉంటివి. నీ వెల్లిపాయినంక ఎందుకో నా గుండె జారిపోయినాది. ఇంకా ఎన్నాల్లు ఈ ఎల్లవలో పోతాండాల్నో” అన్నాడు.

అప్పుడు మతి కొచ్చినాది కొండారెడ్డికి! తనకి ఆ కల మాటిమాటికి ఎందుకొస్తాండాదో. ఆ ప్రవాహము తన బతుకే!

అల్లో లైటు ఏసి సోపాలో కూసున్నాడు. ఆరుకు పనిమనిసి వచ్చి బెల్లు కొట్టినాది. లేసి పోయి తలవాకిలి తీసినాడు. గుమ్మము బయట పాలపాకిట్లు మూడు ఒక బ్యాగులో ఏసిపోయినాడు పాలాయన. గుమ్మము కంటే ముందు కటాంజనము తలుపుండాది. ఆ బ్యాగు దానికి తగిలిచ్చి ఉంటారు.

పనిమనిసి కనీసం కొండారెడ్డిని పలుకరించల్యా. శీపురు దీసుకోని యిల్లంతా కసువూడ్సింది. వస్తువులను పక్కకు జరపల్యా. తలుపు వెనకాల శుభ్రము చెయ్యల్యా. ఒక బక్కెట్టులో నీల్లు బోసుకోని వచ్చి ఒక కట్టకు కట్టిన కుచ్చతోని ఇల్లంతా తుడిసింది.

వంటింట్లోకి బోయి అంట్లగిన్నెలన్నీ సింకుతోనే కడిగి పెట్టింది నిలబడుకోనీ. ఇంతలో ఆ యమ్మకు పోను వచ్చింది. జాకిట్టు లోంచి పోన్ దీసి “వస్తున్నా మేడమ్. కంబిరెడ్డి సారింట్లో చేయడం ఐపోయింది. టెన్ మినిట్స్ వెయిట్ చెయ్యండి” అని ఎవరితోనో మాట్లాడుతూ వెళ్లిపోయింది. పోయేటప్పుడు కనీసం చెప్పలేదు.

కొండారెడ్డి తలుపేసుకోని, బాత్రూంలోకి బోయి ముకం కడుక్కున్నాడు. వాష్ బేసిను తెల్లగా మెరుస్తోందాది. స్టీలు కొళాయి లోంచి నీల్లు దుంకినాయి. బ్రష్షు మింద పేస్టు ఏసుకోని పల్లు తోముకొన్నాడు. స్టీలుది వంగిన బద్దతో నాలిక గీసుకున్నాడు. గొంతులో రెండు వేళ్ళూ జొనిపి గల్ల బయటికి తీయాలనుకున్నాడు గాని ఆ శబ్దానికి కోడలు లేచిందంటే విసుక్కుంటోంది. “న్యాస్టీ ఓల్డ్ మ్యాన్! క్రియేట్స్ హెల్ వైల్ వాషింగ్ ది మౌత్!” అంటాది. అదేందో పూర్తి అర్తంగాక పోయినా, తిడుతూందని తెలుసు.

ముకం కడుక్కున్నపుడంతా బొమ్మిరెడ్డిపల్లెలో యాప పుల్ల గుర్తొస్తాది కొండారెడ్డికి. దాన్ని కొసనముల, పండ్లు తోముకుంటే దాని శీదుకు వగరకు నోరంతా పాచి వాసన అయి, ఆయిగా ఉంటాది. దాన్నే సగానికి శీల్చి నాలిక గీక్కునేవాడు. రెండు వేల్లను గొంతులోకి బోనిచ్చి, లోపలి కశ్మలమంతా బయటకు తెచ్చేవాడు.

తర్వాత ఇత్తడి చెంబెడు నీల్లు తాగితే, ఆ నీల్లు ఎంత కమ్మగా ఉండేవి? తర్వాత ఎక్కడ లేని ఆకలయ్యేది. అప్పటికప్పుడు పితికి, నురగ తేలిన గోపెమ్మ పాలతో నాగరత్నమ్మ ఇచ్చే బెల్లం కాపీ అమృతం మాదిరుండేది.

టవలుతో ముకం తుడుచుకోని వంటింట్లోకి బోయినాడు కొండారెడ్డి. పాల పాకెట్లు బైటే ఉండిపోయినాయి.

‘వయసు పెరిగేకొద్దీ మతిమరుపు జాస్తి ఐనాది’ అనుకుంటా పోయి తలుపుతీసి ప్యాకెట్లు తెచ్చినాడు. అవి శానా సల్లగా ఐసు మాదిరుండాయి. రెండు ఫ్రిజ్జు లోన బెట్టినాడు. లోపల నిన్నటి సాంబారు, కొబ్బెరచట్నీ, పెరుగు ప్యాకిట్లు కనబడి ముకము శిట్లించుకున్నాడు.

ఒక ప్యాకెట్టు పాలు కత్తెరలోని కత్తిరించి స్టీలు గిన్నెలో పోసి గ్యాసు పొయ్యి మింద బెట్టినాడు. లైటరుతోన ఎలిగించాలంటే బయమా యప్పకు. టిక్కు టిక్కుమని మూడు నాలుగు సార్లు కొట్టినాక గుప్పున ఎలుగుతాది. పేల్తుందేమో అనిపిస్తాది. గట్టు కింద గ్యాసు బండను జూస్తే ఎర్ర పెద్ద బాంబు మాదిరి అనిపిస్తాది.

పాల కాడ నిలబడి కాగేంత వరకూ సూపెట్టుకోని ఉండాడు కొండారెడ్డి. ‘చనం బెసిగితే పొంగి చస్తాయి’ అనుకున్నాడు. సీసా ల్లోంచి కాపీ పొడి, శక్కెర స్టీలు గ్లాసులో ఏసుకోని, పాలు పోసుకున్నాడు. ఇంకా గ్లాసులోకి తిరగదిప్పుకొని, ఆల్లోకి వచ్చి సోపాలో గూసోని తాగబట్నాడు. ఒక గుక్క తాగి ముకం సిట్లించుకున్నాడు. ‘తు! దీనెమ్మ బ్రు కాపీ! నోరంత బంక బంక అయితాది’ అనుకున్నాడు.

ఎనిమిది గంటలయినాది. మనుమడు హేమాంశు రెడ్డి లేచి బయటకొచ్చి “హాయ్ గ్రాండ్ పా!” అని తాతను పలకరించినాడు.

“సిట్టి తండ్రి లేసినాడే! నా బంగారు నాయిన! రా నా దగ్గరికి” అని పిలిస్తే వాడు రాల్యా. వానికి నిండా నాలుగిండ్లు గుడ్క ఉండవు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here