మహాప్రవాహం!-37

0
14

[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘మహాప్రవాహం!’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[రాజమ్మ ఆవులిస్తుంటే, వెళ్ళి పడుకోమని చెప్తాడు సంజన్న. తిరిపాలు చనిపోయాకా, కొన్నాళ్ళు రాజమ్మ ఒక్కర్తే బతికింది. వీళ్ళు వృద్ధాశ్రమంలో చేరేటప్పుడు, ఆమెను కూడా చేర్పించారు. ఆమె డబ్బులు కూడా ప్రదీపే కడతాడు. రాజమ్మ వెళ్ళిపోతుంది. విమలమ్మ అప్పటికే నిద్రపోయింది. సంజన్న గౌడుకి నిద్ర పట్టక గతాన్ని గుర్తు చేసుకుంటాడు. ప్రదీప్ కొడిగెనహళ్ళిలో టెంతు పూర్తి చేయడం, పార్వతీశం సారు చెప్పినట్టు ఎ.పి.ఆర్.జె.సి ఎంట్రన్సు రాసి, నిమ్మకూరు కాలేజీలో సీటు తెచ్చుకోవడం, అక్కడ్నించి రాజస్థాన్‍లోని బిట్స్ పిలానీలో ఇంజనీరింగ్ చదవడం, ఆ తరువాత ఎం.ఎస్. కోసం అమెరికా వెళ్ళటం, ఉద్యోగం సంపాదించడం, పిలానీలో చదువుతున్నప్పుడు ప్రేమించిన బీహార్ అమ్మాయి మాధురిని పెళ్ళి చేసుకోవటం, అమెరికాలో స్థిరపడిపోవడం, వాళ్ళకి పింకీ పుట్టడం అన్నీ జ్ఞాపకం చేసుకుంటాడు సంజన్న. ఒకసారి అమెరికాకి తీసుకెళ్ళాడు ప్రదీప్. కోడలు బాగా చూసుకున్నా, విమలమ్మకీ, సంజన్న గౌడుకి ఆ వాతావరణం నచ్చక మూడు నెలలకే ఇండియాకొచ్చేస్తారు. తర్వాత తనకి మైల్డ్‌గా పక్షవాతం రావటం, విమలమ్మకి కూడా ఆరోగ్యం క్షీణించటం వల్ల కొడుకు తమని ఈ వృద్ధాశ్రమంలో చేర్పించటం అన్నీ గుర్తు చేసుకుంటాడు సంజన్న. కొడుకు వాడి పరిధిలో చేయగలిగినంత చేస్తున్నా, సంజన్నకూ, విమలమ్మకూ ఏదో వెలితి! కాలం శక్తికి లొంగిపోయిందా కుటుంబం. ఇక చదవండి.]

[dropcap]శె[/dropcap]ప్పుల శాపు ముందల బండి ఆపి దిగినాడు చలమేశ్వర్. నల్లని పల్సరు బండి ఎండలో మెరుస్తోంది. మాదవ బండి కూడా ఆడనే నిలబెట్టి ఉన్నాది. అది హోండా ప్యాషన్.

దోస్తును చూసి నవ్వినాడు మాదవ. “పోదామా” అన్నాడు.

“పోదాంపా, ఇప్పటికే లేటయినాది” అన్నాడు చలమేశు. ఇద్దరూ బండ్లెక్కి బైపాసు రోడ్డు మీదికి బోయినారు. ఏడెనిమిదేండ్ల కిందట్నే హైదరాబాదు బెంగుళూరు హైవేను శానా ఎడల్పు చేసి, నాలుగు వరసల రోడ్లు చేసినారు. మధ్యన డివైడరు. అది నాలుగడుగుల వెడల్పుంది. దాంట్లో పచ్చిగడ్డి పెంచి గన్నేరు, తంగేడు పూల చెట్లు ఏసినారు. అవి బాగా పెరిగి గుత్తులు గుత్తులు పూలు పూసినాయి.

హైవే నుంచి రైల్వేస్టేషనుకు సరిగ్గా అటు పక్క ఒక సింగిల్ రోడ్డు పోతాది. అదీ డాంబరుదే. చెరుకులపాడు, పుట్లూరు మింద బోయి – కోడుమూరు దగ్గర కలుస్తాది. దోస్తులిద్దరూ ఆ రోడ్డులోకి తిరిగినారు. హైవేని ఆనుకోని, ఉన్న శేన్లలో రియలెస్టేట్ వెంచర్లేసి, బూమిని ప్లాట్లుగా చేసి సరిహద్దు రాల్లు పాతి ఉన్నారు. మద్యన రోడ్లు కోసరం స్తలం వదిలినారు.

వీండ్లు రెండు పర్లాంగుల దూరంబోయి బండ్లు నిలబెట్టినారు. షేరింగ్ ఆటోలు జనాలను నిండా కుక్కుకొని ఆ పక్క ఈ పక్క తిరగతాండాయి. రోడ్దుకు ఎండంపక్క ఒక శేనుండాది. హైవే నుంచి బాగా కనపడతాది. వీండ్లు పోయేటప్పటికి శేను సొంతదారు రామసుబ్బన్న, ఇంకా యిద్దరు శేను కాడ ఉండారు.

“రాండి, రాండి!” అని వీండ్లను పిలిచినారు.

“మొత్తం విస్తీర్ణము ఎంత మామా, శేను?” అనడిగినాడు చలమేశు.

“ఎకరా ఎనబై మూడు సెంట్లురా” అన్నాడు రామసుబ్బన్న.

దోస్తులద్దరూ శేనంతా తిరిగి చూసినారు. పత్తిపంట కాశి, ఉడిగిపోయి ఉంది.

“కార్నర్లు శానా బోతాయి. రెండున్నర సెంట్లు ఒక్క ప్లాటు చేస్తే సమంగ యాబై ప్లాట్లు ఎయ్యొచ్చు. రోడ్లకు ముపై సెంట్లన్నా బోతాది. ఎంత చెప్తున్నారో మరి” అన్నాడు మాదవ.

“కుచ్చోని మాట్లాడితే తేలతాది” అన్నాడు చలమేశ్వరు.

“పాండి మామా, మన ధాబా కాడ కూర్చోని మాట్లాడుకుందాము” అన్నాడు వాండ్లతో.

వాండ్లకూ బండి ఉంది. మూడు బండ్ల మింద మల్లా హైవే మీదకు వచ్చి డోను వైపుకు మల్లినారు. వెల్దుర్తి ఊర్లోంచి వచ్చే రోడ్డు హైవేను కలిసేచోట పెట్రోలు బంకున్నాది. రిలయన్స్ వాండ్లది. దాన్ని దాటినంక కొంచెం దూరం లోనే కనబడింది – ‘ఫుడ్ కోర్ట్ ప్లాజా’ అనే హైవే ధాబా.

అప్పుడు తొమ్మిది గంటలవుతూండాది పొద్దున. ధాబా ముందర ఏడెనిమిది కార్లు, ఒక వోల్వో బస్సు, ఒక ఆర్‌టిసి వాండ్ల సూపర్ లగ్జరీ బస్సు నిలబెట్టి ఉండాయి.

వీండ్లు లోపలికి బోతూనే రిసెప్షన్‍లో ఉన్న ఒక యువకుడు లేచి మాదవకు, చలమేశుకు నమస్కారము పెట్టినాడు. అందరూ బోయి ఒక టేబులు దగ్గర కూచున్నారు.

“దీనికి గుడ్క యన్టీ రామారావు పేరు బెడతారేమో అనుకుంటమి” అన్నాడు రామసుబ్బన్న నవ్వుతా.

“అప్పుడేదో సిన్నతనం లే మామా. ఇప్పటికీ ఆయన మింద అభిమానము తగ్గల్యా . కాని హైవే మింద ఇంత పెట్టుబడి పెట్టి ధాబా కట్టుకొని, దానికి తగినట్లు ప్యాశను పేరుండాల గదా” అన్నాడు చలమేశు.

“ఫుడ్ అంటే తెలుసు, తిండి అని! మరి కోర్టు అని ఎందుకు బెట్నారు?” అన్నాడు ఇంకొక ఆయన.

“మనం హైదరాబాదుకు పోయేటప్పుడు, షాద్‌నగర్ దాటిన తర్వాత ఒక ధాబా తగుల్తాది. దాని పేరు చూసి మన దానికి బెట్టినా, కోర్టు అంటే ఆవరనమని గుడ అర్థముందంట. కనుక్కున్నాలే” అన్నాడు మాదవ.

“మొత్తానికి దోస్తులిద్దరూ గట్టోండ్లే రోయ్” అన్నాడు రామసుబ్బన్న.

“ఏందో మీ మాదిరి పెద్దోండ్ల దీవెనలు, దేవుని దయ మామా! శేను ఎంత చెబుతుండారు?” అన్నాడు చలమేశు వ్యవహారం లోకి వస్తూ.

“నీకు తెలియనిదా ఏమన్నానా, హైవేనానుకొని ఎకరా ముపైలక్షలు పలుకుతుంది. ఇది కొంచెం లోపలికుంది కాబట్టి, ఐదు తగ్గించుకోండి. పదిహేడు సెంట్లు తక్కువుండాది కాబట్టి దాన్ని బట్టి లెక్కసుకో.”

“అంత చెయ్యదులే మామా, కార్నర్లు, రోడ్లు తీసేయాల గదా! మొన్న బ్రహ్మగుండం రోడ్డు నానుకొని ఎకరా పది సెంట్లు ఇరవై రెండుకు తీసుకోని గదా డెవలపు తీసి ప్లాట్లేసినాము. ఆ పదేడు సెంట్ల కేమిగాని మొత్తం నలభై చేసుకోండి.”

“మరీ తీసేసి చెబుతుండావు.”

“సరే మామా! ఇంకో రెండేసిస్తా. అంతకంటే మా శాతగాదు.”

అకిరికి నలభై మూడుకు తెగినాది. టోకను అడ్వాన్సు లచ్చ రూపాయలిచ్చేసినారు. రెండు నెలల లోపల మిగతాదిచ్చి రిజిస్ట్రేషను చేయించుకొనేటట్లు, అంతవరకు శేను శుభ్రం చేయించి, రోడ్లు ఏర్పాటు చేసి డెవలప్మెంటు జేసుకొనీకె ఒప్పుకొనేట్లు మాట్లాడుకున్నారు.

వాండ్లు వెళ్లిపోయిన తర్వాత ధాబాలో ఎట్లా పనులు జరుగుతుండాయో చూసినారు. పొద్దున్న పదకొండు వరకు టిపన్లుంటాయి. మెనూ బోర్డులో దోశలే పది రకాలుండాయి. వంట మాస్టర్లను ఉడిపి నించి పిలిపించుకున్నారు. మద్యాహ్నం పన్నెండున్నర నించి లంచ్ టైము మూడువరకు. రకరకాల రోటీలు, అంటే బటర్ నాన్ రోటీ, రుమాలీ రోటి, పరోటా, పుల్కాతో పాటు రకరకాల రైసులు, పలావులు దొరుకుతాయి. దరలు శానా ఎక్కువుంటాయి.

పోలీసు టేషను ఎదురుగ్గా ఉండే వీండ్ల ‘పిడుగు రాముడు’ ఓటల్లో మసాలాదోశ ముఫై రూపాయలైతే, ఈడ నూట నలభై. ఆ ఓటలును ఇంకా నడుపుతుండాడు చలమేశు. దోస్తులిద్దరూ టిఫను మాత్రం ఆడనే తింటారు! పుడ్ కోర్టులో యాపారం రోజూ అరవైవేలకు తక్కువుండదు.

మాదవ చెప్పల శాపు గూడ ఉంది. అసిస్టెంటు చూసుకుంటాడు. పోలీసు టేసను నుంచి మదారుపురం గేటు వరకు సెంటు పదిపన్నెండు లక్షలుందిప్పుడు. మంచి మంచి ఇండ్లు లేసినాయి. లోకల్ మేస్త్రీలు గాకుండా బెంగులూరు, హైదరాబాదు నుంచి ఇంజనీర్లను బిలిపించి కట్టిస్తున్నారు.

దోస్తులిద్దరూ గేటు కివతల రోడ్డు నానుకోని పక్కపక్కనే రెండు డూప్లెక్సు ఇండ్లు కట్టించుకొన్నారు. ముపై లచ్చలపైనే అయినాది ఒక్కోటి. ఓటలు గూడ శానా మటుకు కుశకుమారు, సుందరయ్యకీ అప్పచెప్పినారు.

“టిపను జేసిపోండన్నా” అని అడిగినాడు మేనేజరు. మాదవ నవ్వి “వద్దులే. టైమయింది. పోవాల” అన్నాడు.

“నాకు తెల్సులేన్నా, ‘పిడుగు రాముడు’ లోనే గద మీరు తినేది” అన్నాడు మేనేజరు తాను గూడ నవ్వుతూ.

ఇద్దరూ ఓటలుకు బోయి ఉగ్గాని బజ్జీ తిన్నారు. వీండ్లు వస్తారని రెండు ప్లేట్లు తీసిపెట్నాడు సుందరయ్య.

నారయ్య నడిగి చెప్పుల షాపు మింద ఒక రూము ఏసుకున్నారు. దానికి పక్క నుంచి రడీమేడ్ వంపులు తిరిగిన ఇనపమెట్ల సెట్టు పెట్టించినారు. అది రియలెస్టేటు ఆపీసు.

‘చలం అండ్ మాదవ్: రియల్ ఎస్టేట్ డెవలపర్స్ – ఇచ్చట ఇండ్ల స్థలములు అమ్మబడును మరియు కొనబడును’ అని బయట బోర్డున్నాది. పైన శానా ప్యాషనుగ పాల్సుసీలింగు చేయించి, గోడలకు గూడ సోకుగ టైల్లు కరిపించినారు. కింద కార్పెట్టు. పెద్ద టేబులు దానినక రెండు ఎగ్జిక్యూటివ్ కుర్చీలు. వచ్చి నోండ్లు కూచోనీకె కరీదయిన కుర్చీలు.

ఒక మూల టేబులుంది. ఆడ ఆపీసు మేనేజరు పని చేసుకుంటున్నాడు. పద్దెనిమిదేండ్ల పొట్టిగాడు, ఇరవై ముఫై నోట్ల కట్టలు, రకరకాలవి కౌంటింగ్ మిశనులో పెట్టి చూసి, ఒక బుక్కులో నోట్ చేసి, బీరువాలో పెడతాన్నాడు. ఆడకుబోయి కలెక్సను చూసుకున్నారు.

“బ్రహ్మగుండం రోడ్డు లోని సైటులో ఇయ్యాల మూడు ప్లాట్లు బోయినాయి సార్. అమకతాడు దగ్గర హైవే మింద సైటులో ఒకటి బోయినాది. లద్దగిరి రోడ్డులో కావాలనీ, ఈష్టు పేసింగు, కార్నరు ఫ్లాట్లు కావాలని ఒకాయప్ప వచ్చినాడు. లేవు, ఐపోయినాయని చెప్పి పంపిచ్చినాను. రేపు డోనులో ఒక రిజిస్ట్రేషనుండింది, పోవాల మనము” అని వివరించినాడు మేనేజరు.

ఈరోజు ఖాయమైనది నాలుగో వెంచరు. బుల్‍డోజరును రేపు రమ్మని పోను చెయ్యమన్నారు. ఉడిగిపోయిన పత్తిశేనును ఏర్లకు బీకి, రాయీరప్పా ఏరీసి, సలీసుగ చెయ్యనీకె నలుగురు కూలీలను మాట్లాడమన్నారు.

బోజనాల టైమయినాది. ఇద్దరూ ఇండ్లకు బోయినారు.

***

మాదవ ఇంట్లోకి బోయే తలికి రామక్క బోంచేసి వక్కాకు దంచుకుంటాన్నాది చిన్న స్టీలు రోలులో. ఆ యమ్మకు పండ్లన్నీ ఊడిపోయినాయి. కర్నూలులో లవకుశరెడ్డి డాక్టరు కాడ కట్టిస్తానంటే ఇనదు. ఇనికిడి గూడ తగ్గింది. దగ్గరికి బోయి అరిసి సెప్పాల ప్రతీది.

కొడుకును జూసి బోసి నోటితో నవ్వినాది రామక్క. “ఏంది నాయినా ఇంత లేటు? పా బోంచెయ్యి. టిపనన్నా చేసినావా లేదా?” అనడిగినాది. డిల్లీకి రాజైనా తల్లికి కొడుకే గద మరి.

లోపల్నుంచి బాగ్యమ్మ వచ్చినాది, “నీవొస్తే ఇద్దురం తిందామని సూపెట్టుకోని ఉండా” అనింది.

లుంగీ కట్లుకోని బోజనానికి పోయినాడు. “సింత సిగురు ఊరిమిండి నువ్వులేసి నూరినా, బుడంకాయ పప్పు జేసినా. పాపము మామకు ఈ ఊరిమిండంటే శానా యిష్టము. మొత్తము అన్నమంత దాంతోనే తింటానంటే అత్త తిట్టి పెరుగన్నం పెట్టేది” అనింది బాగ్యమ్మ.

మాదవకు నాయిన గుర్తొచ్చినాడు.”అప్పడే మూడేండ్లుగా వస్తుంటాది నాయిన సచ్చిపోయి” అన్నాడు.

శరబయ్య తిరగతా తిరగతానే బోయినాడు. ముందు రోజు రాత్రి కుంచెం జరం తగిలినాది. మిరియాల చారు గావాలని రామక్కతోని చేయించుకోని రెండో ముద్దలు తిని పండుకున్నాడు. మామూలుగ నసుకు లోనే లేసేది ముసిలాండ్ల కలవాటు. రామక్క పిలిస్తే పలకల్యా. ఒల్లు సల్లగైపోయినాది. మసీదు కాడ ఉండే ఆర్.ఎం.పి డాక్టరు నంజుండప్పను తీసుకొచ్చి సూపించినాడు మాదవ. ఆ యప్ప పరీచ్చ చేసి రాత్రి పానం పోయిందని చెప్పి పోయినాడు.

డెబై నాలుగేండ్లు బతికినాడు శరబయ్య. యానాడు జర్రుమని శీదల్యా, కల్లుమని దగ్గల్యా. రోజూ సాయంత్రము చెప్పల శాపు కాడికి బోయి కూసునేటోడు. చలమేశు ఓటల్నించి ఆ యప్పకు బుగ్యాలు, టీ తెచ్చిచ్చేవారు. మనవరాలికిస్టమని పైవ్ స్టారు చాక్లెట్ బార్ కొనుక్కోని పోయేవాడు.

ఆ యప్ప చచ్చిపోయిన తర్వాత సంమచ్చరానికి కొడుక పుట్టినాడు మాదవకు. ‘శరభకుమార్’ అని నాయిన పేరు కలిసొచ్చేటట్లు పేరు పెట్టుకున్నాడు. వానికిప్పుడు రెండేండ్లు దాటి మూడే యేడు పడింది.

బిడ్డ పేరు ‘కలిమి’, ఆ పిల్ల పుట్టినప్పట్నుంచి కలిసొచ్చినాది మాదవకు. చలమేశుతో బాటు ఇంకా ఇద్దరు బాగస్తులు కలిసి రియలెస్టేటు యాపారం మొదలుబెట్నారు. దానికి కొంత పెట్టుబడి నారయ్యే సగేసినాడు. ఇప్పుడు ఇద్దరే చేసుకుంటాన్నారు

బ్రమ్మగుండం రోడ్డులోన ఎందుకూ పనికి రాని చవుడు భూమిని ఎకరా లచ్చన్నరకు కొన్నారు మొదట. ఐదెకరాలది. సంమచ్చరానికే అక్కడ బి.సి.గురుకుల సంక్షేమ పాఠశాల, హాస్టలు కట్టినారు. కొంచెం యిటు పక్క పెట్రోలు బంకు బెట్నారు. యుగందర రెడ్డి సారని ఒకాయన రావల్లకోట హైస్కూలులో రిటైరై, యోగా క్లాసులు నేర్పించబట్నాడు వెల్దుర్తిలో. ఆ యప్ప వీండ్ల శేను పక్కనే ‘పిరమిడ్ ధ్యాన కేంద్రము’ అని కట్టించి ఒక ఆశ్రమము మాదిరి జేసినాడు. డోను నుంచి కర్నూలు నుంచి గూడ యోగా నేర్చుకోనికి శానామంది బండ్ల మీద కార్ల మీద రాబట్నారు. తర్వాత ఎదురుగ్గా రంగముని అనే సారు, డోనాయిన, సెకండరీ గ్రేడు టీచరు ట్రయినింగు (డి.ఇడి) కాలేజి శాంక్సను చేయించుకోని, స్టార్టు జేసినాడు, హాస్టలు తోసా.

అట్లా బ్రమ్మగుండం రోడ్డు డెవలప్ అయినాది. సింగిల్ రోడ్డును డబల్ రోడ్డు చేసినారు. బుక్కాపురం మీదుగా నంద్యాల బస్సులు, నన్నూరు మీదుగా కర్నూలు బస్సులు, నర్సాపురం మీదుగా బేతంచర్ల బనగానిపల్లె బస్సులు నడవబట్నాయి. నంద్యాల నుంచి వెల్దుర్తి, కోడుమూరు, ఎమ్మిగనూరు మీదుగా మంత్రాలయానికి ఎక్స్‌ప్రెస్ బస్సు, మంత్రాలయం నుంచి శ్రీశైలానికి ఇదే రూట్‌లో నంద్యాల మీదుగా ఇంకో ఎక్స్‌ప్రెస్ బస్సు పడినాయి. ఇవి గాక షేరు ఆటోలు తిరగబట్నాయి. ఆర్టిసి వాండ్లు డి.యిడి కాలేజి కాడ బస్సు స్టాపు పెట్టినారు.

వీండ్ల భూమికి దశ తిరిగినాది. ఐదేండ్లలో పదింతలు పెరిగినాది దర. సలీసుగా సదును చేసి, రాల్లేసి, ప్లాట్లు చేసినారు. హైవే మీద కొనలేని వాండ్లందరూ ఇటు పక్క మొగ్గు చూపించబట్నారు. కొన్నేండ్ల కిందటి వెల్దుర్తికి జూనియర్ కాలేజి, గర్ల్స్ హైస్కూలు వచ్చినాయి. కర్నుల్లో, డోనులో స్తలాలు కొనుక్కోని ఇండ్లు కట్టుకునే స్తోమత లేనోండ్లకు వెల్దుర్తి ఒక వరమయినాది.

రోడ్లకు ఒక ఎకరా పోను మూడు సెంట్ల ప్లాట్లు డెబై, ఐదు సెంట్ల ప్లాట్లు నలబై మొత్తం నూటపది ప్లాటయినాయి. సెంటు యాభైవేలు పెట్టినా వేడి వేడి మిరపకాయ బజ్జీల మాదిరి అయిపోయినాయి. అన్ని కర్చులు పోను కోటి రూపాయలు మిగిలినాయి. నారయ్యకు బాగమిచ్చినారు. తను ఇంక ఈ తగలాటాలు పెట్టుకోలేననీ, బతికినన్ని రోజులు బ్రతకననీ, పెండ్లాము గుడ్క చచ్చిపోయింది గనుక తిక్కతాత ఆశ్రమానికి బోయి ఉంటాననీ చెప్పినాడు. ఈ డబ్బును ఆశ్రమానికి రాసిస్తానన్నాడు. కొడుక్కిచ్చేది ముందే ఇచ్చేసినాడు.

తర్వాత దోస్తులు ఎనిక్కి తిరిగి చూసుకోల్యా. ఐదారు వెంచర్లు పూర్తి జేసినారు. హైవేలో ‘ఫుడ్ కోర్టు ధాబా’ పెట్టినారు. డబ్బు పిల్లల్ని పెడతాదని సామతి. ఎంత వచ్చినా ఇద్దరికి కుంచెమైనా మనస్పర్తలు రాల్యా. డబ్బు శానా సెడ్డది, అన్నదమ్ముల్నెనా ఇడదీస్తాదంటారు. అట్లా కాదని చలమేశు, మాదవ ఋజువు చేసినారు.

చలమేశు ఇంటికి బోయేటప్పటికి శర్వాణి చూపెట్టుకోని ఉండాది. ఈశ్వరమ్మ కాలం చేసి సంవత్సరమాయ. శివరాత్రి రోజు జాగారము చేస్తూ బాత్ రూంలో కింద బడి పానం ఇడిచినాది. ‘ఎంత పున్యాత్మురాలు! శివుని కాడికి ఎలబారి పోయినాద’ని అందరూ సంతోసించినారు.  ఆయమ్మ గుడ్క డెబైఏండ్లు పైనే బతికినాది.

సనిపోయే ముందల కొడుక్కు చెప్పినది.

“ఆ ఉరుకుందప్ప మీ నాయినకు శానా నేస్తుడు. పాపం మెత్తబడినాడు. కొడుకూ కోడలు ఈ యప్పను పట్టించుకోరు. నీవయినా చేరదీసి పున్యం కట్టుకో!”

అమ్మ చెప్పినట్లుగానే ఉరుకుందప్పను ఇంటికి తెచ్చుకున్నాడు చలమేశు. బండి, ఎద్దులు ఎప్పుడో పోయినాయి. ఆ యప్పకు దగ్గర దగ్గర ఎనబై ఉంటాయేమో. కానీ ఏ రోగాలు లేవు. తన పని తాను చేసుకుంటాడు. చలమేసు కొడుకు ‘పినాకపాణి’ని ఆడిస్తాడు. శర్వాణికి సాయం చేస్తాడు. కాలం ఎవరి దగ్గరికి ఎవర్ని చేరుస్తాదో ఎవరికెరుక?

చలమేశు కొడుకూ, మాదవ బిడ్డా ఒకే నెలలో పుట్నారు. ఇద్దరికీ ఐదుదాటి ఆరు నడుస్తున్నాది. డోనులో చైతన్య టెక్నోస్కూలని బెట్నారు. దాంట్లో ఇద్దరూ ఒకటో క్లాసు చదువుతాన్నారు. వాండ్ల స్కూలు బస్సు వెల్దుర్తికి వచ్చి పిల్లోండ్లను ఎక్కించుకోని, మల్లా సాయింత్రము ఇండ్ల దగ్గర దింపి పోతాది.

శర్వాణి కూడ శానా మంచిపిల్ల. సచ్చిపోయేంతవరకు ఈశ్వరమ్మను శానా బాగ జూసుకొనింది. ఉరుకుందప్పను ఆ యమ్మ ఒక బరువుగా యానాడు అనుకోదు. సొంత నాయిన లెక్క జూసుకుంటాంది.

ఉరుకుందప్ప చలమేశుని జూసి” వస్తివా! అన్నం దిను పో! పొద్దయింది. నేను దినేసినాలే” అన్నాడు.

ఆలూ మొగుడూ బోంచేసినారు. మటిక్కాయ తాలింపు చేసినాది శర్వాణి. అటిక మామిడాకు పప్పు జేసి, దాంట్లో ముదురొంకాయలు కలిపినాది. తింటూ “మా రామక్క పిన్నమ్మకు ఈ తాలింపు శానా యిస్టము. సాయంత్రం బోయినప్పడు ఇచ్చొస్త” అన్నాడు చలమేశు.

తన తల్లి లేదని, మాదవ తల్లినే శానా యిదిగా జూస్తాడు చలమేశు. శర్వాణి నవ్వి “అత్త మల్లా తాలింపును వక్కాకు రోట్ల ఏసుకోని, కచ్చాపచ్చా దంచుకోని గాని తినదు” అన్నది. చలమేశు గూడ్క నవ్వినాడు.

కాలం వీండ్ల బతుకులను అద్భుతంగ తీర్చిదిద్దినాది. యానాడు ఊహించని సంపద యిచ్చినాది. కాని వాండ్లకు గర్వము రాల్యా. మనస్పర్తలు రాల్యా. ఓటలు పేరుకు చలమేశుదే గాని, దాని శాదానము ఆదాయము అంతా సుందరయ్యకు కుశకుమారుకే ఇస్తాడు. క్లీనింగు చేసే మస్తానమ్మ బిడ్డ పెండ్లికి ఇద్దరూ గలిసి నలబై వేలిచ్చినారు.

ఎందుకో వాండ్లకు పోలీసు స్టేషనన్నా, పోలీసులన్నా అభిమానము. వాండ్లు గూడ ఎవరొచ్చినా వీండ్లను శానా ఆదరంగ జూసినారు క్రిస్టఫర్ సారు, ఇంకా కొంతమంది పోలీసులు రిటైరైనంక వెల్దుర్తిలో సెటిలయితామంటే, శానా అగ్గవ రేటుకు వాండ్లకు ఇండ్ల స్తలాలిచ్చినారు నేస్తులు. వాండ్లందరూ వీండ్లకు మామలు, బావలు, సిన్నాయనలే. టీలు టిపన్లు టేసనుకు ‘పిడుగు రాముడు’ హోటల్నుంచీ బోతాయి. డబ్బులడగరు. వాండ్లే సుందరయ్య చేతిలో ఎంతో కొంత పెట్టి పంపిస్తుంటారు

చెప్పుల శాపులో పని చేసే కిశోరుకు గుడ్క శాపు ఇచ్చేసినట్లే. వాడు బాగుబడి పెండ్లి చేసుకున్నాడు.

డోనుకు ఇంకా నాలుగు మైల్ల ఇవతలే ఉడుములపాడని ఒక ఊరుండాది. అది హైవీ మీద ఉంటాది. అక్కడ వెంచరు వేసినారు. ఆ ఊరిపక్కనే, ప్యాపిలి సారు ఒకాయన అద్దెకరా స్తలం తీసుకోని దత్తాత్రేయ స్వామి మందిరము కట్టించి, నిత్యం హోమాలు చేయించబట్నాడు. కాళికాదేవి అమ్మవారి దేవళము కట్టించినాడు. ఆ యప్ప జూనియర్ కాలేజీ ప్రిన్సిపాలుగా రిటైరై. సన్యాసము తీసుకున్నాడు. పిల్లాడు అమెరికాలో ఉంటాడు. భార్య కాలము చేసింది. గానగాపూరు అని మహారాష్ట్ర దేశములో ఒక దత్త క్షేత్రముంది. అక్కడ ఆయన సిద్ది పొందినాడంటారు. ఆయిన పేరు తిరుమలరావయితే, ‘దత్తదేవానంద స్వామి’ అని పేరు మార్చుకున్నాడు. ఆ ఆశ్రమము, దేవలాలు కట్టేటపుడే మాదవ, చలమేశు ఆయన శిష్యులైనారు. దత్తస్వామి భక్తులైనారు. ఆక్రమానికి పది లక్షలు ఇచ్చినారు. అక్కడ గోశాలలో ఇరవై ఆవులున్నాయి.

దిక్కులేని పిల్లల కోసరము బేతంచెర్లలో ఒక అనాథాశ్రమం ఉంది. అన్ని కులాల, మతాల పిల్లలనూ, చేరదీసి చదివిస్తారు. దోస్తులు దానికి ప్రతి నెలా ఐదు క్వింటాల్ల బియ్యము ఇస్తారు. లేనోల్లకు సాయం చేసెటోల్లకు దేవుడు యింకా సంపదలిస్తాడు మరి! ఇట్లా కాలం శానా మంచి చేసినా, దాన్ని దుర్వినియోగం చేయకుండా, పదిమందికి మంచి చేస్తా బ్రతకతాన్నారు నేస్తులిద్దరూ.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here