మహాప్రవాహం!-4

0
14

[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘మహాప్రవాహం!’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[ఉదయాన్నే ఐదు గంటలకల్లా నిద్రలేచిన పద్మనాభయ్య కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి వంటింట్లో దండెం మీదున్న ధావళి కట్టుకుని, నుటున విభూతి కుంకుమ పెట్టుకుని పూజా చేస్తాడు. పూజయ్యాకా ధావళి విప్పి మామూలు పంచ గట్టుకుని వంటింట్లోకి వెళ్ళి కూచోగానే మీనాక్షమ్మ కాఫీ ఇస్తుంది. ఇంతలో బయట నుండి ఎవరో పిలుస్తే ఆమె వెళ్ళి చూస్తుంది. పద్మనాభయ్య కోసం మానుకింది మద్దయ్య వచ్చి ఉంటాడు. సామి లేడా అమ్మయ్యా అని అడిగితే, కాఫీ తాగుతున్నారు, వస్తారు కూచోమని చెప్తుందామె. పద్మనాభయ్య పంచాంగం, ముహూర్త దర్పణం తీసుకొని బయటకి వచ్చేసరికి మానుకింది మద్దయ్యతో బాటు మరి కొంతమంది సిరిసాపల మీద కూర్చుని కనబడతారు. ఒక్కొక్కరికి వాళ్ళకి కావల్సిన ముహూర్తాలు, మంచి కాలం చెప్తారాయన. వాళ్ళు కొంత డబ్బు తాంబూలంలో పెట్టి వెళ్తారు. ఆఖరున దాసప్ప మిగులుతాడు. ఏం పని మీద వచ్చావంటే, తన గేదె తప్పిపోయిందని, అది ఎక్కడ ఉందో చెప్పమని బాధపడుతూ అడుగుతాడు. దాసప్పని ఓదార్చి, అతను ప్రశ్న అడిగిన సమయాన్ని బట్టి గణించి, ఆ గేదె బొమ్మిరెడ్డి పల్లెకు దక్షిణాన ఉన్న మల్లేపల్లె, అల్లుగుండు గ్రామాలలో ఉండవచ్చని, అక్కడి బందెలదొడ్లలో చూడమని, పదిమందిని విచారించమని చెప్తారాయన. దాసప్ప దండం పెట్టి వెళ్ళబోతుండగా, తాను రమ్మన్నానని కొండారెడ్డికి చెప్పి వెళ్ళమని పద్మనాభయ్య చెప్తారు. తరువాత ఆయన జంధ్యాలు వడుకుతారు. సమయం పదకొండు అవుతుండగా భార్య భోజనం వడ్డిస్తుంది. అన్నం తినడం పూర్తవగానే కొండారెడ్డి వస్తాడు. మీనాక్షమ్మ అతనికి ఓ గ్లాసులో మజ్జిగ ఇస్తుంది. పలకరింపులయ్యాకా, తాను పిలిచిన పనిని వివరిస్తారు స్వామి. తమ చేనులో గుంటక పాపనం చేయించాలని చెప్తారు. ఒకటి రెండు రోజుల్లో చేయిస్తానని చెప్తాడు కొండారెడ్డి. చెరువులోని ఒండ్రుమట్టిని పొలంలోకి తోలించుకుంటే మంచిదని సలహా ఇస్తాడు కొండారెడ్డి. సరేనని, అందుకు ఎంత ఖర్చుతుందో అడుగుతారు పద్మనాభయ్య. గిత్తలు, బండీ తనవి ఉంటాయని ఓ మనిషి అవసరమవుతాడనీ, సుమారు రోజుకు అయిదు రూపాయలవుతుందని చెప్తాడు కొండారెడ్డి. ఆ పనికి దాసప్పని పెట్టుకుందామంటారు పద్మనాభయ్య. కొండరెడ్డి వెళ్ళిపోయాక కాసేపు విశ్రాంతి తీసుకుంటారాయన. ఇక చదవండి.]

[dropcap]పొ[/dropcap]ద్దున్న ఐదయ్యింది. మంగలి శరభయ్య నిద్ర లేచినాడు. రెండుచేతులూ రుద్దుకుని, అరచేతుల్లో ‘శ్రీరామ’ చుట్టుకుని కండ్ల కద్దుకున్నాడు. ఆ యప్ప యిల్లు శానా చిన్నది. ఒకటిన్నర అంకనం ఉంటుందో ఉండదో. ఈది లోకే ముందు వాకిలి. శరభయ్య వీధిలోనే మంచ మేసుకుని పడుకొని ఉండె. ముందువాకిలి దాటంగనే చిన్న పడసాల. అదే అన్నీ. దాన్ని ఆనుకుని వారపాగు దించి ఉంది. అది కూడా శానా చిన్నది. దాంట్లోనే పొయ్యి, ఆడనే తిండ్లు తినేది. ఎనక దొడ్డేమీ లేదు.

శరభయ్య బార్య రామక్క, కొడుకు మాదవ పడసాలలో పండుకుని ఉన్నారు. ఆ యప్ప వారపాగులో ఉన్న గాబు అంచి రేకుడబ్బాతో నీళ్లు దీసుకుని ఊరి బయటికి నడిసినాడు. ఇంట్లో కక్కసు దొడ్డి లేదు మల్ల! కాలకృత్యాలకు ఊరి బయటకు బోవాలిసిందే. దాన్నే ‘శెంబట్క బోవడ’మంటారు, ‘కాల్మడుసుకోవడం’ అని కూడా అంటారు.

దోవలో యాపమండ ఒకటి ఇరిసి నోట్లో పెట్టుకొని నములుతా ఊరిబయట దిబ్బ వెనక్కుబోయి, రేకు డబ్బా పక్కన చెట్టుకుని, గొంతుకూర్చున్నాడు. పనయినంక ఊరికి పడమట పారుతున్న వంక కాడికి పోయినాడు. ఆ వంక పెద్దదే. సుమారు ఇరబై పగ్గాల పట్టు ఎడల్పుంటాది. మొన్న కురిసిన తొలకరి వానలకు నీళ్లు బాగానే పారుతుండాయి కూడా. శరభయ్య నీల్లల్లో దిగి మొగం కడుక్కున్నాడు. బట్టలు విప్పి గట్టు మీన బెట్టి మొలకు తలగుడ్డని గోచీ మాదిరి పెట్టుకుని వంకల కింద కూర్చున్నాడు. నీళ్లు ఆ యప్పకు దొమ్మల కాడికి వచ్చినాయి. పెయ్యంతా మెత్తని తడి యిసుకతో రుద్దుకుని తానం చేసినాడు.

ఈరన్నగట్టు ఎనక బారెడు ఎక్కిన సూర్య బగమానునికి చేతులెత్తి దండం బెట్నాడు శరబయ్య. గుడ్డలు కట్టుకుని తడి తలగుడ్డ పిండి భుజాన ఏసుకున్నాడు.

దోవలో తిరిపాలు హొటలు కాడ నిలబడి బెల్లం కాపీ తాగినాడు. “లెక్కరాసుకో” అని తిరిపాలుకు చెప్పినాడు. తిరిపాలుది దిన్నెదేవరపాడు. ఈ ఊరిపిల్ల రాజమ్మను మనువాడినాడు. రాజమ్మ ఒక్కత్తే ఆడపిల్ల. వాండ్ల నాయిన మల్లికార్జున గూడ్క ఓటలే నడిపేటోడు. రాజమ్మ తల్లి అనసూయమ్మ రాజమ్మకు రెండేండ్లప్పుడే పచ్చ కామెర్లొచ్చి సచ్చిపోతే మల్లికార్జున మల్లా పెండ్లి చేసుకోకుండా పిల్లను కండ్లల్లో బెట్టి సాక్కున్నాడు . తిరిపాలు ఆ యప్పకు వరుసకు బావమరిదే. బిడ్డను తిరుపాలు కిచ్చి మనువు జేసి ఇల్లటం దెచ్చుకున్నాడు. అల్లునికీ ఎవరూ లేరు. ఈ మద్యనే మల్లికార్జున కూడా కాలం సేసె.

రాజమ్మ ఉగ్గాని కోసరం బొరుగులు నానబెట్తండాది. హోటల్లో పని జేయనీకే లింగయ్య అనే పొట్టెగాన్ని పెట్టుకున్నారు. వానికి పద్నాలుగేండ్లుంటాయి. పొద్దున్న ఐదుగంటలకే లేచి పాలకేంద్రం కాడ పది లీటర్లు పాలు క్యాన్‍లో తెచ్చి పెట్టుకుంటాడు తిరుపాలు. బెల్లం కాఫీ, సొంటి కాఫీ పొద్దున్నించి సాయంత్రం వరకు చేస్తాడు. పొద్దున ఉగ్గాని, బజ్జీ చేస్తారు. పదిగంటలకు అలసంద వడలు ఏస్తారు. హోటలంటే ఏమీ లేదు. ఒక పెద్ద గుడిసె. చుట్టూ ఐదడుగుల ఎత్తున మట్టి గోడలు లేపి, తాటి దూలాల మీద బోది గడ్డి కప్పించినారంతే! వీళ్ల యిల్లు కూడా అదే. మద్యాన్నం ఇంత వండుకొని తింటారు.

“శరభయ్య సిన్నాయనా, కుంచేపుంటే ఉగ్గాని బజ్జీ అయితాయి. తినిపో” అని పిలిచింది రాజమ్మ,

“నా తల్లి ! సల్లగుండే! ఇంత పొద్దున తింటే పని చేయలేను. అంబటి పొద్దుకు వచ్చి తింటా! నా బాగము తీసిపెట్టమ్మే” అన్నాడు శరబయ్య.

సాయంత్రం నాలుగు గంటల నుండి కారం బొరుగులు, కారం సుట్టలు అమ్ముతారు ఆలు, మగడు. ఆరు గంటలకు హోటలు మూసేస్తారు.

శరభయ్య ఇంటికి పొయ్యేటప్పటికి ఏడయ్యింది. రామక్క లేసి ఇల్లంతా కసువు ఊడ్సుకుంటాది. పదసాలలోని మంగలిపొది తీసినాడు. కత్తికి పదును బెట్నాడు. కత్తెర, ఇంకా క్రాపింగ్ చేసే చిన్నమిషను, దువ్వెన అన్నీ సర్దుకున్నాడు. పొది తోలుతో చేసినారు. నీళ్లు బోసుకోనికె చిన్ని సత్తుగిన్నె కూడపెట్టుకున్నాడు.

అప్పటికింకా మంగలి షాపులు రాలేదు బొమ్మిరెడ్డిపల్లెలో. ఊరి కంతటికి శరభయ్యే మంగలాయన.

శరభయ్య పెద్దీదిలో నడుసుకుంటా బోత ఉన్నాడు.

సంజన్నగౌడు ఆ యప్పను పిలిసినాడు.

“ఓ శరబయ్య మామా! గడ్డం చేసి పోదురా! నీ కోసరమే జూచ్చాండా పొద్దున్నించి”

ఇంటిముందు అరుగుమీన పొది పెట్టుకుని గొంతుకూర్చున్నాడు శరబయ్య. సంజన్న గౌడు గెర్రెల సల్యాడం మాత్రం ఏసుకుని, పైన తువ్వాల కప్పుకున్నాడు. మంగలాయన ముందు కూర్చున్నాడు.

“సబ్బుందా మామా” అనడిగితే

“యానాడయిన సబ్బు తీస్కరావడం జూస్తివా అల్లుడూ! పని చేపిచ్చుకొనేటోల్ల కాడుంటే సబ్బు, నురగ పూచ్చా. లేకుంటే నీల్లు పట్టించి చెయ్యడమే” అన్నాడు మంగలాయన.

“ఉండుండు” అని “అమ్మే! సబ్బు దీస్కరా” అని అరిచినాడు సంజన్న. ఆ యమ్మ లైప్‌బాయి సబ్బు తెచ్చియిచ్చింది.

“సిన్నాయనా, బాగు౦డావా? మా పిన్నమ్మ ఎట్లుండాది” అని పలకరించింది శరభయ్యను.

“బాగుండామమ్మా! అదే బాగు!” అన్నాడా యప్ప.

“ఇదిగో! నీవు చేపిచ్చుకున్న తర్వాత మామకు కూడ చేపిచ్చు! అడివి మాదిరి పెరిగినాది” అనిందామె.

“ఆయన నా మాటినాలగద!” అన్నాడు సంజన్న.

సబ్బుబిళ్లతోనే గడ్డానికి నురగ వచ్చేవరకు పామినాడు. అప్పటికి బ్రష్‌లు లేవు. డోను, కోడుమూరు లాంటి పెద్దూర్లలో ఐతే మంగలి షాపులుంటాయి. కత్తిని మల్లొక సారి నునుపు రాయి మీద పదునుపెట్టి లాంగవంగా గడ్డం లాగేసినాడు.

“నీ పాసుగూల! కాడీకె మాదిరి మెత్తగా తెగినాది కత్తి!” అంటూ నున్నగా ఐన గడ్డాన్ని నిమురుకున్నాడు. పొది లోంచి చిన్న కత్తెర దీసి మీసాలను అంటకత్తిరించినాడు శరభయ్య. ముక్కులో ఎంటికలు కూడ కత్తిరించినాడు.

“సంకలెత్తు!” అని సంజన్న చంకల్లోని వెంటుకలు కూడ తీసీసినాడు.

“ఉండు మామా! నాయిన జేపిచ్చుకుంటాడేమో అడిగొస్తా” అని లోపలికి బోయినాడు. కాసేపటికి తిరిగివచ్చి “ఆ యప్ప ఈ రోజు చేపిచ్చకోడంటలే. నీవు పోయిరా” అని ఒక రూపాయ బిల్ల తీసి శరభయ్య చేతిలో ఏసినాడు. దాన్ని కండ్లకద్దుకుని సల్యాడం జేబిలో ఏసుకున్నాడు.

అది బోణీ!

“అల్లుడూ! ఒక బీడీ ఉంటే పారెయ్యి!” అనడిగి, బీడీ ముట్టించుకొని పొగ వదులుతూ దారెంట పోబట్నాడు. రామానుజ శెట్టి కిరాణ సామాన్ల అంగడిలో కూర్చుని ఉన్నాడు. ఎవరికో పొట్లాలు కడుతూన్నాడు. శరభయ్యను చూసి పిలిసినాడు.

‘మావోనికి క్రాపు జేయాల. రా శరభయ్య”

ముందు అంగడి. దానెకనక యిల్లు. ఇంటి ప్రక్క సందు లోంచి ఎనక దొడ్లోకి బోయినాడు మంగలాయిన. శెట్టి కొడుకు నాగేంద్ర నిక్కరుతో రడీగున్నాడు. శెట్టి పెండ్లాము వచ్చి “బాగా పెరిగినాది. మిశిను కొట్టాలి. శెవులెనక దుబ్బుగట్టినాది. మల్లా మూడు నెల్లవరకు నీతో పని ల్యాకుండ జెయ్యి, మంగలాయనా!” అని చెప్పినది.

ఆ పిల్లోనికి ఆరేండ్లుంటాయి. శరభయ్యను ముప్పతిప్పలు బెట్నాడు. కదలొద్దంటే ఇనడు. యాడయినా తగిలి గాటు బడిందంటే మాటొస్తాదని ఆ యప్ప బయము. మొత్తానికి పిల్లోని తలకాయ ఒక రూపానికొచ్చినాది.

ఒక పొరక్కట్టు అడిగి క్రిందపడిన వెంట్రుకలన్నీ ఊడ్సి బయట కాలవలో పడేసినాడు. శెట్టి బార్య వచ్చి “బాగుందన్నా” అని మెచ్చుకున్నాది. “పోయి మీ నాయినకు సూపించు పో” అని చెప్పినది. కొడుకును చూసి, “ఇంకా తగ్గించాల్సుండె. కాన్లె” అని అర్ధరూపాయి ఇవ్వబోయినాడు.

“శెట్టిగారో! గడ్డం గీస్తేనే రూపాయిస్తారు. బాగా పెరిగినాది. క్రాపింగు జేస్తి. పిల్లడు నన్ను నానా పాట్లు బెట్టె. చూసి యియ్యి. నాకు డబ్బులొద్దు గానీ, శేరు బియ్యము, పావు శేరు కంది బ్యాడలు, పావుకేజి ఉర్లగడ్డలు, పావులీటరు నూనె కట్టియ్యి. నీ పీరు చెప్పుకుని పప్పన్నం దింటాం.”

కోమటాయన లెక్కలు వేసినాడు. మంగలాయన అడిగినవన్నీ యివ్వాలంటే ఐదు రూపాయలు పైనే ఐతాది. ఆలోచించి అన్నాడు –

“సరే, తీస్కపో. కాని వచ్చే వారం వచ్చి నాకు క్రాపు జేసి, గడ్డం జేసిపోవాల మరి!”

శరభయ్య సంతోషంగా ఒప్పుకున్నాడు. కొడుక్కు గుప్పెడు నిమ్మొప్పులు (పిప్పరమెంట్లు) కూడా కట్టిచ్చుకున్నాడు.

మరి రెండు మూడు చోట్ల గడ్డాలు చేసినాడు. ఒకచోట సంవత్సరం పాపకు తలకాయంతా అట్లు కట్టి, కురుపులు లేచినాయి. శానా నైపున్యంగ ఆ పాపకు గుండు చేసినాడు. ముందు ఏడ్చింది కానీ, పూర్తయి తలంతా చల్లనీళ్లతో తడిపిన తర్వాత ఆయిగా నవ్వింది.

‘ఆరింతర్వాత గుండుకు గందం పూయ’మని సలహా యిచ్చి ఎలబార్నాడు శరబయ్య. అప్పటికి పది దాటింది. ఐదారు రూపాయలు సంపాదించినాడు. తిరుపాలు ఓటల్లో ఉగ్గాని బజ్జీ తిని, పెండ్లానికి, కొడుక్కు రెండు పొట్లాలు కట్టించుకుని యిల్లు చేరినాడు. మళ్లీ పొద్దున వరకు ఆ యప్పకు పని ఉండదు. ఒకేళ ఏదైనా శుబకార్యమో, అశుబకార్యమో జరిగితే మటుకు సన్నాయి మేళం వాయించడానికి పోతాడు. అప్పుడు మాత్రం తన తమ్ముడు సుంకన్నను డోలు వాయిద్యానికి పిలుస్తాడు. సుంకన్న మంగలి పని చేయడు. డోలు, కళ్లాలతో వాములు ఏయడం లాంటి పనులు జేస్తాడు.

***

బొమ్మిరెడ్డి పల్లె లోని ఒకే ఒక్క రెండంతస్తుల మహాడీ. చుట్టారా ప్రహరీ గోడ. సింహద్వారం. రెండు ఇనప గేట్లు. వాటి కడ్డీల సివరన శూలాల మాదిరి కొశ్శగా (వాడి) ఉంటాయి. గేట్లు రెండు సిమెంటు దిమ్మలకు తాపడం చేసినారు. దిమ్మల మీద రెండు సిమెంటు సింహాలు నోర్లుదెరుసుకోని, మన్సుల మీద దుంకుతాయా ఏమి అన్నట్లు ఎన్నక కాల్ల మీద కూసొని ఉంటాయి. అవిటికి జేగురురంగు పెయింటు జేసినారు. అవిటి కోరలు మాత్రం తెల్లగా ఉండాయి. నీరెండకు మెరుస్తా ఉండాయి.

సింహద్వారం దాటంగనే కుడి వైపున పెద్ద గాడిపాడుండాది. అది ఎంత పెద్దదంటే మూడు జతల ఎద్దులు, నాలుగు ఎనుములు, రెండావులు దానికి రెండుపక్కల నిలబడి మేత తింటాండాయి. ఎద్దుల్లో ఒక జత కన్నడ దేశం జర్రలు. అవిటి కొమ్ములు

పెద్దగా ఉండి, శివర్న ఇత్తడి తొడుగులుండాయి. మరొక జత మాంచి ప్రాయంలో ఉన్న కోడెలు. అవి తెల్లగా నున్నగా బలిసి ఉండాయి. వాటి కొమ్ములు కూడా ఇలకా సరిగ్గ మొలవల్యా. వాటి కండ్లు శానా పెద్దవి. కాటుక పెట్టినట్లు అంచులు నల్లగా ఉండాయి.

మూడో జత ఒంగోలు గిత్తలు. అవి సేద్దె౦ జెయ్యనీకె గాదు – పండుగలపుడు బండలు లాగనికి, పది బండ్లు గాన్లు (చక్రాల) తిరక్కుండా ఒకదానితో ఒకటి కట్టేస్తే సతిసుగ గుంజుకుని పోతాయి. బగుమతులు గెలుచుకుంటాయి. వాటి నడుము సుట్టు, దిస్టి తగలకుండా కంబడి తాళ్లు పేని కట్టినారు. వాటికి బెట్టే మేత కూడా ఏరేగా ఉంటాది. పందాలకు బోయినపుడు వాటికి సారాయి కూడా తాపిస్తారు.

ఇటు పక్కన పెద్ద సింత చెట్టుండాది. అది కొమ్మలు బారుగా పర్సుకోని, ఎండ కిందికి తగలకుండా జేచ్చాండాది. తర్వాత పెద్దరుగులు, మజ్జన పదిపదైడు త్యాపలు. అరుగుల మీంద ఆడ కూలీలు ఇత్తనం బుడ్డలు వలుచ్చాండారు . పొరపాట్న ఎవురైనా రెండిత్తుల నోట్లో ఏసుకుంటే జీతగాడొకడు వాండ్లను కసిరిచ్చుకుని అరుస్తాండాడు.

ఆ మాడీ (భవనం) రుక్మాంగద రెడ్డిది. అరుగుల ఎనక పెద్ద పడసాలలో లాలి చెక్క (ఉయ్యాల బల్ల) మింద ఆ యప్ప గూచోని ఊగతా, మాలన బల్ల మిందున్న పెద్ద రేడియో లోంచి వస్తూన్న ప్రాంతీయ వార్తలు ఇంటాన్నాడు. చేయెత్తు మనిసి. ఆరడుగుల నాలుగించీలుంటాడు. తెల్లగా లావుగా ఉండాడు. నల్లగా, ఒత్తుగా మీసాలు చివర్నీ వంపులు తిరిగి ఉండాయి. ఆ యప్ప కండ్లు ఎర్రగా ఉండాయి. ఎమ్మెల్లె అంచు తెల్లని పంచ అడ్డ పంచగా కట్టుకొన్నాడు. కద్దరు అంగీ వేసుకున్నాడు. చెక్క మింద పక్కన సిగిరెట్టు పెట్టి, లైటరు ఉండాయి. నోట్లో సిగిరెట్టుతో పొగ ఇడుస్తాండాండు.

సింహద్వారం కాడనే ఇద్దరు వస్తాదుల మాదిరి ఉన్న జీతగాండ్లు కావలి గాస్తాండారు. గేటు ముందర బుల్లెట్టు ఆగినాది. దాని మింద నుంచి ఒకాయన ఒక కాలు కిందబెట్టి నిలబడినాడు.

ఆ యప్పను జూసి జీతగాండ్లు దండం బెట్టినారు.

“సిన్నాయన ఉండాడా” అనడిగినాడు వచ్చినాయన.

“ఉండాడు రెడ్డి! పడసాలతోనే ఉండాడు!” అని చెప్పినారు వాండ్లు.

బండి లోపలికి పోనిచ్చి, సింత మానుకాడ నిలబెట్టి స్పాండేసినాడు. త్యాపలెక్కి పడసాలలోకి బోయినాడు. ఇత్తనం బుడ్డలు వలుస్తున్న ఆడోండ్లలో వయసు పిల్లలు, ఆ యప్ప కంట బడకుండా ముకాలు తిప్పుకున్నారు.

రుక్మాంగద రెడ్డి వచ్చినాయనను జూసి ముకం ఇంత జేసుకుని, “రారా, కేశవా! ఏమి పొద్దున్నే ఎలబార్నావు?” అని అడిగినాడు.

కేశవ రెడ్డి రుక్మాంగద రెడ్డికి అన్న కొడుకు. వాండ్లది పక్కనే ఉన్న తొగర్చేడు గ్రామం. ఆ యప్ప సిన్నాయన పక్కన కూసోని రగస్యంగా అన్నాడు.

“లోపలికి పోదాంపా సిన్నాయినా!”

ఇద్దురూ లేసి పక్కనున్న రూములోకి బోయినారు. ఆ రూము శానా పెద్దది. పెద్ద పట్టెమంచం, నగిషీలు చెక్కినాది మూలకు ఏసి ఉండాది. అతి ఎత్తుగా ఉండి దాని మింద ఎక్కనికి దిగువన ఒక ముక్కాలిపేట ఏసి ఉండారు. ఒక పక్కన టేకు సోపాలు, వాటి మింద మెత్తలు ఉండాయి. ముందు ఒక యిరుగుడు కర్రతో చేసిన బల్ల ఉండాది.

“టిపన్ జేసినావా లేదా?” అనడిగినాడు సిన్నాయన

“యాడజేస్తి? ముందు నీ కాడికి బోయి రమ్మని మా నాయిన కాల్ల కింద మంటలు బెడ్తంటే” అన్నాడు కేశవ రెడ్డి.

“సరే నేను గుడ్క ఇంకా జెయ్యలేదులే” అని, “ఇదిగో! మన కేశవ వచ్చినాడు! ఇద్దురికీ టిపన్ బంపిచ్చు” అని లోపలికి యినపడేటట్టు అరిసినాడు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here