మహాప్రవాహం!-41

0
12

[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘మహాప్రవాహం!’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[వైద్యనాథన్ కేదారని ప్రభుదత్త మహారాజ్ అనే స్వామీజీ ఆశ్రమానికి తీసుకువెళ్తాడు. ఒక సన్యాసి వీళ్ళని పలకరించి, ముందు అల్పాహారం స్వీకరించమని ప్రసాదాలయ్‍కి పంపుతాడు. ఆశ్రమంలో ఎక్కడా కాంక్రీటు భవనాలు లేవు. అన్నీ వెదురుబొంగులోనూ, తడికలతోనూ నిర్మించినవే. ఎక్కడా ప్లాస్టిక్ వస్తువులు వాడకం కనిపించదు. గోశాలను, ధ్యానమందిరాన్ని చూస్తారు. అత్యంత నిరాడంబరంగా ఉంటుందా ఆశ్రమం. స్వామీజీ అనుగ్రహభాషణం చేసే హాల్లోకి వెడతారు. కొద్దిసేపటి తర్వాత మహారాజ్ ప్రవేశించి ఆశీనులై తమ సందేశాన్ని వినిపిస్తారు. సాటి మానవులలో భగవంతుని దర్శించమని చెప్తూ, విశ్వకవి టాగోర్ కవితను ఉదహరిస్తారాయన. మనకు ప్రత్యక్షంగా కనబడే ప్రకృతియే పరమాత్మ అనీ, ప్రకృతిని ప్రేమించేమని సూచిస్తారు. అన్ని మతాల సారమూ ఒకటేనని, మానవ సేవే మాధవ సేవ అని ఉద్ఘాటిస్తారు. ఆశ్రమ కార్యకలాపాల గురించి, సేవా కార్యక్రమాల గురించి చాలా తెలుసుకుంటాడు కేదార. మరుసటి వారం తానొక్కడే మళ్ళీ వెళ్ళి ఆశ్రమంలో సమయం గడుపుతాడు. ఒకరోజు తండ్రి ఫోన్ చేసి, రెండు సంబంధాలు వచ్చాయి, వీలున్నప్పుడు వచ్చి చూస్తే, ముందుకుపోవచ్చని చెప్తాడు. సరేనంటాడు కేదార. శుక్రవారం రాత్రికి ఇల్లు చేరతాడు. తల్లి ప్రేమగా వండిన వంటలు తిని, కంటినిండా నిద్రపోతాడు. మర్నాడు కారులో తాడిపత్రికి పెళ్ళిచూపులకు వెళ్తారు. పెళ్ళికూతురు తండ్రి పురోహితుడు. వాళ్ళది సొంతిల్లు. ఇద్దరు పిల్లలు. పెళ్ళకూతురు అన్నయ్య హైదరాబాదులో ఉద్యోగం. అమ్మాయి పేరు పరాన్ముఖి. స్థానిక కాలేజీలోనె బి.కాం చదివింది. సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబాల్లో ఆడపిల్లలు ఎలా ఉంటారో అలాగే ఉంది. కేదార తల్లిదండ్రులకు ఆ పిల్ల నచ్చినట్టే అనిపిస్తుంది. ఇంటికి వెళ్ళాకా, తల్లి అడిగితే, కేదార నవ్వి ఊరుకుంటాడు. ఇక చదవండి.]

[dropcap]సో[/dropcap]మవారం టిఫిను చెయ్యకుండా పదకొండు గంటలకల్లా తల్లిదండ్రులతో బాటు భోజనం చేసి బెంగుళూరుకు బయలుదేరాడు. నాలుగు గంటల ప్రయాణము. హైవే ఫోర్ లేన్స్ చేసి విస్తరించిన తర్వాత ప్రయాణ కాలము తగ్గింది కాని, సిటీలో ట్రాఫిక్ వలన లేటయింది.

పుండరి, అఖిలమ్మ బెంగుళూరులోనే ఉన్నారు. కూతుర్ని చూసిపోదామని వచ్చినారు. తాము కూడా కేదారను చూడక చాన్నాళ్లయిందని, అందరూ ఇక్కడికి వస్తే, కలిసి పెండ్లిచూపులకు వెళదామని పుండరి అన్నయ్యకు ఫోన్ చేసినాడు.

పుండరి అల్లుడు జె.పి.నగర్‌లో ఉంటున్నాడు. సొంత అపార్టుమెంటే. పెండ్లిచూపులు కోరమంగళలో. వీండ్లు చేరేటప్పటికి మూడయింది. పండరి అల్లుడు కిర్లోస్కర్ కంపెనీలో చేస్తాడు. బావమరిది పెద్ద సైంటిస్టని శానా ఆదరించినాడు.

ప్లయిట్ ఎనిమిదికనీ, ఐదుకల్లా బయలుదేరితేగాని అందుకోలేననీ చెప్పినాడు కేదార. రెండు కార్లలో అంతా కోరమంగళ చేరుకున్నారు.

ఇండివిడ్యుయల్ ఇల్లు. శానా మాడర్నుగా కట్టినారు. వీండ్లను మర్యాదగా దింపుకొని హాల్లో కూచోబెట్టినారు. ఆయన పేరు మంజునాధరావు. స్టేట్ బ్యాంకు ఎ.జి.ఎమ్.గా చేస్తున్నాడు. ఇంకా సంవత్సరం సర్వీసు ఉంది. తల్లి బి.ఎస్.ఎన్.ఎల్.లో చేస్తూంది. ఒక్కతే కూతురు. పేరు అలేఖ్య. ఇంజనీరింగ్ చదివి చెంగుళూరు లోనే ఒక ఎం.యన్.సి.లో పని చేస్తూంది.

యథావిధిగా ఫలహారాలు వచ్చినాయి. క్యాజూ బర్ఫీ, మిక్చరు. అవి బయటి నుంచి తెప్పించినవని తెలిసిపోతూన్నది. వాండ్లు కూడా “ఇక్కడ ‘అగర్వాల్ స్వీట్స్’ అని చాలా ఫేమస్, తినండి బాగుంటాయి” అన్నారు. లిమ్కా పెద్దబాటిల్ లోంచి గాజుగ్లాసుల్లో డ్రింకు పోసి యిచ్చినారు.

అన్నదమ్ములు, యరాండ్లు ఏవీ ముట్టకోలేదు. ఆచారం పాటిస్తారు. బయటి తిండ్లు తినడం నిషిద్ధం.

కేదార, అల్లుడు, కూతురు మాత్రం కొంచెం రుచి చూసి, డ్రింకు తాగినారు. అలేఖ్య వచ్చింది. చుడీదార్ల ఉంది. చామనచాయ. పెదిమలకు రంగు వేసుకుంది. జుట్టు భుజాల వరకు కత్తిరించుకుంది. అందరి ఎదుట కాలు మీద కాలు వేసుకొని కూర్చుంది దర్జాగా.

పెద్దవాండ్లకు పిల్ల నచ్చలేదు. వాండ్ల ముఖాలు చూస్తూనే తెలిసిపోతూ ఉంది.

“అబ్బాయిని నీ గదికి తీసుకుపోమ్మా” అన్నాడు తండ్రి. అలేఖ్య లేచి, “ప్లీజ్ కమ్” అనగానే కేదార వెంబడించినాడు. ఆ పిల్ల రూము చిందరవందరగా ఉంది. వీండ్లు వస్తారు, పిల్లవాడు తన రూముకు వచ్చినా రావచ్చు అని కూడా లేదేమో.

తాను మంచం మీద కూర్చుని కాళ్లూపుతూ, కేదారకు కుర్చీ ఆఫర్ చేసింది.

“సో! యు ఆర్ వర్కింగ్ అట్ పుణె!” అన్నది నవ్వుతూ.

“యస్. యువర్ సెల్ఫ్?”

“ఐ వజ్ ఇన్ టెక్ మహేంద్ర ప్రీవియస్‍లీ. రీసెంబ్లీ ఐ జాయిన్డ్ ఇన్ టి.సి.యస్.” అన్నది గర్వంగా. “బై ది బై, వాట్ ఈజ్ యువర్ యాన్యుయల్ ప్యాకేజ్?”

“అవర్స్ ఈజ్ పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్. పే స్ట్రక్చర్ విల్ బీ డిఫరెంట్. వుయ్ గెట్ మంత్లీ శాలరీస్.”

ఇద్దరూ తమ తమ జీతాలు చెప్పుకున్నారు. తనకంటే ఆమెకే ఎక్కువ జీతమని తెలుసుకున్నాడు. అయినా అతనికేవీ అనిపించలేదు. ‘సోవాట్?’ అనుకున్నాడంతే.

“విల్ ది ఇన్-లాస్ బీ విత్ అజ్ ఆఫ్టర్ మ్యారేజ్?” అనడిగిందా పిల్ల.

“ఆబ్వియస్లీ” అన్నాడు కేదార నవ్వుతూ.

ఆ పిల్ల ముఖం అప్రసన్నమైంది.

“ఓకె. లెటజ్ గో!” అన్నాడు.

ఇద్దరు బయటికి వచ్చినారు.

అమ్మను నాన్ననూ అక్కా బావ యింట్ల విడిచి, ఎయిర్‌పోర్టుకు వెళ్ళిపోయినాడు కేదార. వీండ్లు రేపు అనంతపురానికి పోతారట.

“మరి ఏం చెద్దామురా వాండ్లకు?” అనడిగితే, “ఇంకా ఏం అనుకోలేదని, వెళ్లి ఫోను చేస్తాను” అని అన్నాడు.

పుణెలో దిగి క్వార్టర్సు చేరేసరికి పదయింది. దారిలో క్యాబ్ ఆపించి ఒక ధాబాలో చపాతీలు తిన్నాడు. వెళ్లి స్నానం చేసి, మంచం మీద మేను వాల్చినాడు.

‘నేను చూసిన ఇద్దరాడపిల్లల్లో ఎంత వైరుధ్యం?’ అనుకున్నాడు. రెండో పిల్ల మరీ మెటిరియలిస్టులా ఉంది. తన న్యూక్లియర్ పిజిక్స్, రీసర్చ్, సైంటిస్టు ఉద్యోగం కంటికి ఆనినట్లు లేదు. ‘పెండ్లయిన తర్వాత అత్తమామలు మన దగ్గరే ఉంటారా?’ అని ఎంత నిర్మొగమాటంగా అడిగింది! ‘సో, అలేఖ్య ఈజ్ నాట్ సూటబుల్’ అనుకున్నాడు.

ఇంక పరాన్ముఖి పూర్తిగా భిన్నధృవము. కాని అమ్మానాన్నలను బాగా చూసుకోగలదనిపించింది. నాన్నకు అరవై ఎనిమిది. అమ్మకు అరవైనాలుగు. మహా అయితే రెండుమూడేండ్లు. తర్వాత తన దగ్గరకు తెచ్చికొని జాగ్రత్తగా చూచుకోవాలి. వాండ్లకు గూడ ఆ పిల్ల నచ్చింది. కానీ పరాన్ముఖిని చేసుకుంటే బాగుంటుందని వాండ్లు చెప్పలేదు. తనకే వదిలిపెట్నారు. అది వాండ్ల సంస్కారము .

చాలాసేపు నిద్ర పట్టలేదు కేదారకు. అర్ధరాత్రి దాటుంటుందేమో. స్వప్నావస్థ మాదిరి ఉంది. ప్రభుదత్త మహరాజ్ మంచం పక్కన నిలబడి ఉన్నాడు. ఆయన ముఖం ప్రసన్నంగా ఉంది. ఏదో చెబుతున్నాడు. అర్ధం కావడం లేదు. జాగ్రత్తగా విన్నాడు – “దిసీజ్ నాట్ యువర్ కప్ అఫ్ టీ” అంటున్నాడు. “డోన్ట్ ఎన్‍టాంగిల్ యువర్ సెల్ఫ్ ఇన్‍టు ఎర్తీ థింగ్స్! యు హావ్ టు ఫుల్‌ఫిల్ నోబ్లర్ టాస్క్. యు ఆర్ ఎన్‌లిస్టెడ్ బై ది ఆల్మైటీ!”.

కేదారకు అర్థమయింది. “ఇది నీకుద్దేశించినది కాదు. లౌకిక విషయలలో తగులుకోవద్దు. మరింత ఉన్నతమైన కార్యాన్ని నీవు నిర్వర్తించవలసి ఉన్నది. భగవంతుడు నిన్ను నియమించుకున్నాడు!” సరిగ్గా ఇదే గదా ఆయన చెప్పింది.

లేచి కూర్చున్నాడు. బాత్ రూముకు పోయి చన్నీళ్లతో మొగం కడుక్కున్నాడు. నిద్ర ఎగిరిపోయినాది. ఆలోచించడం మొదలుబెట్నాడు.

సరిగ్గా పెండ్లి గురించి ఆలోచిస్తున్నపుడే ఆయన కలలో కనబడినాడు. నీ పని ఇది కాదంటున్నాడు. మరి ఏది?

వైద్యనాథన్ తమిళనాడు నుంచి తిరిగి వచ్చినాడు. పెండ్లి కుదిరిందట. వచ్చే ఎండకాలంలోనే పెండ్లి.

తాను కూడ రెండు సంబంధాలు చూసి వచ్చినాననీ, ఇంకా ఏమీ తేల్చుకోలేదని మిత్రునితో అన్నాడు కేదార. “మేక్ ఇట్ క్విక్” అన్నాడు వైద్య నవ్వుతూ. కేదార తనకు వచ్చిన కలను గురించి చెప్పినాడు. అతనంత పట్టించుకోలేదు.

“డోన్ట్ టేకిట్ సీరియస్‌లీ, మై ఫ్రెండ్! ఇట్ మే బీ యువర్ హెలూసినేషన్” అన్నాడు.

తర్వాతి వీకెండు ఆశ్రమానికి పోయినాడు కేదార. అంతా కోలాహలంగా ఉంది. మహారాజ్ జన్మదినమంట. చాలామంది వచ్చినారు. ఆ రోజు ఆయన అనుగ్రభాషణం చెయ్యలేదు. శిష్యల మధ్యకు వచ్చి అందర్ని ఆశీర్వదిస్తున్నాడు. మహారాజ్ పాదాలకు నమస్కరించడం నిషిద్ధం. అట్లని అస్పృశ్యత కాదు. కొందరు మహారాజ్ చేతులను కండ్లకు అద్దుకుంటున్నారు. ఆయన వద్దనడం లేదు. ఆయన కండ్లు దయను వర్షిస్తున్నాయి. చలిస్తున్న జ్ఞానజ్యోతి మాదిరున్నాడు.

కేదార కూర్చున్న వరుసలోకి వచ్చినాడు మహరాజ్. ఆయనను అంత దగ్గరగా చూచి ఒక రకమైన పారవశ్యానికి లోనయినాడు. స్వామి కేదార తల మీద చేతిని పెట్టనాడు. ఏదో విద్యుత్తరంగము తనలోకి ప్రవేశించినట్లు ఒళ్లంతా ఝల్లుమనింది కేదారకు. మహరాజ్ అతని కండ్లల్లోకి చూస్తూ ఇట్లా చెప్పినాడు.

“డోన్ట్ బి పర్‌ప్లెక్స్‌డ్, మై సన్! వాట్ యు హెర్డ్ దట్ నైట్ ఈజ్ రియల్. ఇటీజ్ నాట్ ఎ హెలూసినేషన్. కమ్ టు మి ఫర్ ఫరదర్ ఎన్‌లైటెన్‌మెంట్” అని ముందుకు సాగిపోయినాడు మహరాజ్.

కేదార కన్నులనుంచి ఆనందబాష్పాలు కారబట్నాయి. బోజనాల దగ్గర ఒక యువకుడు కలిసినాడు. అతడు బెంగాలీ అట. కేదార గమనించినదేమిటంటే కొందరు శిష్యులు మాత్రం ఒకే విధమయిన దుస్తులు ధరించి ఉండడము. లేత ఆకుపచ్చని పైజమా, అదే రంగు లాల్చీ. లాల్చీకి ఎడమ పక్కన ఒక బ్యాడ్జీ పెట్టుకున్నారు. దాని చుట్టూ ఆకుపచ్చ రంగు రిబ్బను కట్టి ఉంది. మధ్యలో కొమ్మల నిండా గుబురుగా పెరిగిన ఆకులతో, కాయలతో, పూతలో ఒక గున్నమామిడి చెట్టు బొమ్మ ముద్రించి ఉంది. దాని చుట్టూ ‘ప్రకృతిమాతాకీ జయహో!’ అని వ్రాసి ఉంది.

బెంగాలీ యువకుడు కూడా అదే డ్రస్సుతో ఉన్నాడు. ఆయన పేరు ‘దేబీబ్రత ముఖర్జీ’ అని చెప్పినాడు. ఒరిస్సా, బెంగాల్‍లలో ‘వ’కారాన్ని ‘బ’కారంగా పలుకుతారు. ‘విమల’ ను ‘బిమల’ అంటారు. ‘భువనేశ్వర్’ను ‘భుబనేశ్వర్’ అంటారు. విశ్వకవిని ‘రబీంద్రనాథ్’ అంటారు. ‘ఆ లెక్కన ఈన పేరు ‘దేవీవ్రతముఖర్జీ’ అన్నమాట!’

అనుకున్నాడు కేదార.

“యు ఆర్ వెరీ ఫార్చునేట్, మిస్టర్ కేదార!” అన్నాడు. శిష్యులలో కొందరిని, వారి పూర్వజన్మ పుణ్యఫలితంగా, మహారాజ్ ఎన్నిక చేస్తారని, వారు లౌకికమయిన ఉద్యోగాలు, వ్యాపారాలు మానుకొని ఆశ్రమ సేవకే అంకితమౌతారని చెప్పినాడు.

“నేను ఐ.ఐ.టి. ఖరగపూర్ స్టూడెంట్‌ని. మహారాజ్‌కు శిష్యుడిని కాకముందు గుర్గావ్‌లో ఒక పెద్ద కంపెనీలో మెకానికల్ ఇంజనీర్‌గా పనిచేసేవాడిని, మహారాజ్‌ను నేను ఢిల్లీలో కలిసినాను. అక్షరధామ్‌లో జరిగిన ఒక ఆధ్యాత్మిక సభలో మహారాజ్ ప్రసంగం విని ప్రేరణ పొందినాను. సెలవు పెట్టి ఇక్కడి కొచ్చి కొన్ని రోజులు ఉండి, మళ్లీ నా జాబ్‌లో చేరినాను. మహారాజ్ నాకు కలలో కనబడి ‘ఇది నీ పని కాదు, ఇంకా ఉన్నతమయిన పనిని నిర్వర్తించవలసి ఉంద’ని చెప్పినారు. వెంటనే వచ్చి స్వామీజీని కలిసినాను. ఉద్యోగానికి రాజీనామా చేసినాను. ‘రెనన్సియేషన్ ఓత్’ తీసుకున్నాను. నా యావదాస్తి ఆశ్రమానికే ఇచ్చినాను.

ప్రస్తుతం నేను నాసిక్ శాఖకు ఇన్‍ఛార్జిని. నన్ను ‘శ్యామలానంద మహరాజ్’ అని అంటారు. నాసిక్ ఆశ్రమ కార్యకలాపాలు చూస్తూ ఉంటాను. ప్రస్తుతం మహారాజ్ జన్మదినానికని వచ్చినాను. ఆయనకు జన్మదినాలు జరపడం నచ్చదు. కాని ఈ విధంగా ఇన్‍ఛార్జి లందరూ వస్తారు కాబట్టి రెండు మూడు రోజులు సమీక్షలు జరిపి, మేము చేసే సూచనలను స్వీకరించి, చేపట్టబోయే కార్యక్రమాలకు మమ్మల్ని కర్తవ్యోన్ముఖుల్ని చేస్తారు. ఎప్పడైనా మీకు పిలుపు రావొచ్చు.”

మహరాజ్ శిష్యుడు ఇంకొకాయన వచ్చి ‘మిమ్మల్ని రాత్రి ఉండిపొమ్మన్నారు, ఎప్పుడైనా పిలుస్తార’నీ చెప్పినాడు.

రాత్రి పదిగంటలకు పిలుపు వచ్చింది. మహారాజ్ ఒక పేము కుర్చీలో వాలి కూర్చొని ఉన్నారు. వెళ్లి రెండు చేతులెత్తి నమస్కరించినాడు కేదార.

“ఆయుష్మాన్ భవ! పరహితార్థీ భవ!” అని దీవించి నాడాయన. ఎదురుగ్గా ఉన్న వెదురు బొంగులతో చేసిన స్టూలు మీద కూర్చోమన్నా డు. ఇద్దరి మధ్య సంభాషణ ఇంగ్లీషులో సాగుతున్నది.

“నాయనా జాగ్రత్తగా విను. లౌకికమయిన శాస్త్రాలు చదివి ఉద్యోగాలు అందరూ చేస్తారు. గృహస్థ జీవితం గడుపుతారు. వాండ్లు తక్కువని నా అభిప్రాయం కాదు. కానీ పూర్తి కాలాన్ని విశ్వకల్యాణం కోసము వినియోగించగల వాండ్లు వేలల్లో కొందరే ఉంటారు.

నీవు న్యూక్లియర్ ఫిజిక్స్ చదివినావని, సైంటిస్టువని తెలుసు. నిన్ను మెటాఫిజిక్స్ (ఆదిభౌతికం) పిలుస్తున్నది. నీలాంటి వారు ప్రపంచానికి అవసరం. నీవు సమ్మతిస్తే నీకు ‘రెనన్సియేషన్ ఓత్’ ఇస్తాను. దానితో నీకు ఐహిక బంధాలుండవు. ప్రకృతే నీకు బాస్. ఆమెను పరిరక్షించుకోవడమే నీ ఉద్యోగం. సామాన్య ప్రజానీకానికి, ముఖ్యంగా పేదవారికి, అణచివేతకు గురయిన వారికి అవిద్యను పోగొట్టి, వారిలో చైతన్యం కలిగించే బాధ్యత నీవు వహిస్తావు. నీ కోసం, నీ వారి కోసం బతకడం కన్నా అందరి కోసం బతకడం అమితానందాన్నిస్తుంది. దాన్నే బ్లిస్ (Bliss) అంటారు ఫిలాసఫీలో.

అటువంటి అద్భుతమైన అవకాశం పరమాత్మ నీకు ఇచ్చినాడు. ఇందులో నా పాత్ర నిమిత్తమాత్రమే. ఆయన చెప్పింది చేయడమే నా పని. మన ఆశ్రమానికి వేలాదిమంది వస్తారు, విరాళాలు, భూములు ఇస్తారు. కానీ అతికొద్దిమందే నాకు స్ఫురిస్తారు.

ఇందులో బలవంతము ఏమి లేదు.. మనసా వాచా కర్మణా ప్రకృతి సేవకుడివి కావాలి అంతే.”

“మహరాజ్ నా తల్లిదండ్రులకు నేను ఒక్కగానొక్క కొడుకును. నన్ను కని, పెంచి చదివించి ఇంతవాన్ని చేసినారు. వాండ్లను వదిలి నేను సన్యాసదీక్ష స్వీకరించలేను.”

మహరాజ్ నవ్వినారు. ఆ నవ్వుతో ఆధ్యాత్మిక పరిమళాలు పరిఢవిల్లినాయి! “గౌతమబుద్ధుడు కూడ నీలాగే భావించి ఉంటే, ప్రపంచానికి ఒక గొప్ప మతం దొరికేదా! ఆదిశంకరుని కంటే గొప్పవాడివా నీవు? నీలో ఇంకా నేను నాది అనే బంధం బలంగా ఉంది. ఏమీ తొందరలేదు. అలోచించుకొని చెప్పు. వెళ్ళు. మే గాడ్ బెస్టో విజ్‌డమ్ అపాన్ యు”

రెండు రోజులు తర్జన భర్జన పడినాడు కేదార. ‘పరాన్ముఖిని పెండ్లి చేసుకుని, అమ్మానాన్నలతో హాయిగా ఉందామా! వృద్ధాప్యంలో వారిని వదిలివేయడం ధర్మమేనా’ అని తర్కించుకున్నాడు తనలో. మహారాజ్ చెప్పిన బుద్ధుని ఉదాహరణ గుర్తుకువచ్చింది. ఒక దేశానికీ యువరాజు. అందమైన యవ్వనవతి ఐన భార్య, ముద్దులు మూటగట్టే కొడుకు. అన్నీ తృణప్రాయంగా వదిలేసి బుద్ధుడైనాడు. విశ్వమానవాళి దుఃఖానికి కారణాలు అన్వేషించినాడు. దుఃఖాన్ని మాపటానికి మార్గాలను బోధించినాడు. మొసలి కాలు పట్టుకుందని అబద్ధం చెప్పి, మరీ, సన్యాసం స్వీకరించినాడు ఆదిశంకరుడు. భగవంతుడూ, మనిషి వేరు కాదనీ, ఇద్దరూ ఒకటేనన్న అద్వైత సిద్ధాంతాన్ని ఆసేతుహిమాచలమూ పర్యటించి చాటినాడు. వైదికమతము లోని లోపాలను సవరించినాడు. మహరాజ్ చెప్పినట్లు, వారికంటే గొప్పవాడా తాను?

చివరికి ఒక స్థిరనిశ్చయానికి వచ్చినాడు కేదార. మహారాజ్ ఆదేశాన్ని శిరసావహిస్తాడు తాను! అంతే! తర్వాత అతని మనసంతా దూదిపింజ మాదిరి తేలిక పడింది.

మర్నాడే ఆశ్రమానికి వెళ్లి మహారాజ్‌కు తన నిర్ణయాన్ని తెలిపాడు. ఆయనేమీ కేదారను అభినందించలేదు! మెచ్చుకోలేదు. “గాడ్స్ విల్ ఆల్వేస్ ప్రివెయిల్స్” అన్నాడంతే.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here