మహాప్రవాహం!-7

0
21

[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘మహాప్రవాహం!’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[ఇంటికొచ్చిన దావీదు కాళ్ళూచేతులు కడుక్కుని గుడిసె బయట నులక మంచం మీద బొంత పరుచుకుని విశ్రాంతిగా పడుకుంటాడు. అతనికి తన కూతురు మేరీ గుర్తొస్తుంది. కూతుర్ని బాగా చదివించి టీచర్‍ను గాని, నర్సుని గాని చెయ్యాలనుకుంటాడు. ఇంతలో భార్య మార్తమ్మ అన్నం తినడానికి పిలుస్తుంది. పప్పు చారు తక్కువ ఉండడంతో, ముందు దావీదుని తినమంటుంది. కానీ అతనొప్పుకోడు. ఉన్న పప్పు చారుని ఇద్దరికీ సమానంగా సర్దుతాడు, ఇద్దరూ ఒకేసారి తింటారు. వానలు పడతాయి. రైతులందరు పనిముట్లు సిద్ధం చేసుకుని, పద్మనాభయ్య దగ్గర ముహూర్తాలు పెట్టించుకుని పొలం పనులు మొదలుపెడతారు. సుంకులమ్మ గుడి చేనులో విత్తనాలు జల్లేందుకు కొండారెడ్డి దంపతులు సిద్ధమవుతారు. కూలీలు తక్కువగా ఉండడంతో విత్తనాలు వేయడం వచ్చిన కూతురు సుజాతని, సద్దుల మూటలు కాపలా కాయడానికి మిగతా పిల్లల్ని తీసుకుని పొలానికి వెళతారు. అప్పటికే అక్కడికి ఈ పనికి ఒప్పుకున్న యల్లసామి, సత్తెమ్మ వచ్చి ఉంటారు. అందరూ కలిసి పని చేస్తారు. కాసేపటికి రామాంజులు వచ్చి గుంటక తోలతాడు. కాసేపటికి అందరూ సద్ది తింటారు. పిల్లలు బడికి వెళితే, సుజతా స్థానంలో రామాంజులు ఉండి విత్తనాలు జల్లుతాడు. యల్లసామికి, సత్తెమ్మకు కూలీ డబ్బులు చేనులోనే ఇచ్చేస్తాడు కొండారెడ్డి. రామాంజులుకు కూడా గెడం బాడుగ చెల్లిస్తాడు. వెళ్ళొస్తామని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. నాగరత్నమ్మా, కొండారెడ్డి ఇంటికి బయల్దేరుతారు. ఇక చదవండి.]

[dropcap]ఖా[/dropcap]జా హుస్సేన్ తన యింటి ముందర దింపిన వారపాగులో కూసోని బీడీ తాగుతున్నాడు. ఆ యప్పకు యాబై ఏండ్లకు పైగానే ఉంటాయి. సైను గుడ్డతో కుట్టిన గెర్రెల (చారల) పైజామా ఏసుకున్నాడు. కాల్లకు అవాయి చెప్పులు తొడుక్కున్నాడు. పైన నల్ల అంగీ ఏసుకోన్నాడు. అది మోకాల్ల కాడికి వచ్చినాది. బుజాల మింద ఎర్రతువ్వాల కప్పుకున్నాడు. నెత్తిన తెల్లని టోపీ పెట్టుకున్నాడు.

ఆ యప్ప పెండ్లాము ఫాతింబీ లోపట్నుంచి అరిసినాది – “నాస్తా సల్లారిపోతుండాది. బెరీన రా!”

ఖాజా హుస్సేను బీడీతూట పారేసి లోపట్కి బోయినాడు. లోపల ఒక అంకణం గుడ్క లేని పడసాల ఉంది. దాని ఎనక మల్లా సిన్నవారపాగు దింపినారు. దాంట్లోనే వంట, తిండి తినడం. వారపాగు తంబానికి రెండు మ్యాకలు కట్టేసినారు. స్తంబానికి కొంచెంపైన అవిటికి అందేటట్టు అవిశె కొమ్మలు ఆకులతోని తాడుతో కట్టినారు. మ్యాకలు అవిశాకును నోళ్ళతో గుంజుకుని తింటున్నాయి.

పడసాలలోని ముక్కాలి పీట మింద గూసున్నాడు ఖాజా. ఫాతింబీ ఆయనకు సత్తు తట్టలో బన్సీరవ్వ ఉప్మా మూడు గంటలు ఏసి పక్కన కొరివి కారం ముద్ద ఏసినాది.

దాన్ని సూసి శానా కోపం వచ్చినది ఆ యప్పకు.

“ఉప్మా లేకి ఇదేం బాగుంటాది, పుట్నాల పొడి ఐతే బాగుంటంది” అన్నాడు.

ఫాతింబీ నవ్వినాది. “పుట్నాల పొడిగావాల్నా? దాంట్లోకి నెయ్యి వద్దూ? మీ నాయన సంపాంచి పోయిన ముల్లె యాదయినా ఉండాదా ఏమి?” అనిందాయమ్మి.

“మా నాయనే కేమ్మే, నవాబు లెక్క బతికినాడు. మన తురకొల్ల కుటుమానాలు బొమ్మిరెడ్డిపల్లెలో నాలుగే అయినా, రెడ్లతోసా, అందురూ ఆ యప్పకు ఇజ్జత్ ఇచ్చేటోల్లు. ఆ యప్ప నమాజు చదివితే రెండీదులకినపడేది. మాయమ్మ బీమారికి ఈరన్నగట్టు కాడ ఎకరన్నర శేను అమ్మకున్యాడు మా నాయన. ఆయమ్మ దక్కల్యా. ఆ ఎదారుతోనే ఆ యప్ప చచ్చిపాయ. నాకేమో అరటిపండ్ల యాపారం దప్ప యింకోటి రాదు” అన్నాడాయప్ప.

“రోజుకు మూడు సార్లు సమాజన్నా జదవడేమో గాని, మా ‘అజరతు’ ఈ దువా మాత్తరం సదవకుండా ఉండడు” అన్నాదాయమ్మ.

“సర్లె, తిను బెరీన. రామల్ల కోటకు బోయి అరటి గెలలు దెచ్చుకోవాల. ఎనిమిది మైల్లు సైకిలు దొక్కనీకె బలం గావాల గద”

ఉప్మా తిని నీల్లు దాగినాడు. గాజుగ్లాసుతో సొంటి కాపీ తెచ్చి యిచ్చినాది. రెండు గుక్కలు తాగి, “ఇదేందమ్మీ యింత గాటుగా ఉండాది? కుంచెం దూద్ త్యాపో” అన్నాడు.

“దూద్ యాడుంతాయి? పిల్లోనికి కుంచెం తీసి పెట్నా. వాడు బడికి పోయేటప్పుడు నాస్తా దిన్నాక వానికియ్యనీకె. వాడు మన మాదిరి సొంటి కాపీ తాగడు కద!”

కొడుకు కోసరం అనంగనే నాయన ఊరుకున్నాడు. “సర్లె, సర్లె సన్నపిల్లోడు వాడు ముక్యం!” అన్నాడు.

వాండ్లకు ఇద్దురు పిల్లలు. పెద్దది ఆడపిల్ల హసీనా బేగం. ఐదు వరకు జదివిచ్చినారు. గద్వాల కాడ మానపాడు కిచ్చినా రాయమ్మను. ఆ యమ్మిమొగుడు ఖాదర్‌ హైదరాబాదు అయివే మింద గద్వాల చౌరస్తాలో సోడాలంగడి నడుపుతాడు.

తర్వాత పదేండ్లకు ల్యాకల్యాక కొడుకు పుట్టినాడు. వాండ్ల పానాలన్నీ వాడి మిందే. వానికి జహంగర్ అని పేరు పెట్టుకున్నారు. వాడు బొమ్మిరెడ్డిపల్లె లోనే ఎలిమెంటరీ స్కూలులో ఐదు జదువుతాండాడు. దానికి మాత్రం ఇంట్లో తిండి గాని, బట్టలు గాని మంచివే పెడతారు.

ఖాజా హుస్సేను అరటిపండ్ల యాపారం జేచ్చాడు. రామల్లకోట, పుల్లగుమ్మ, కలుగొట్ల ప్రాంతాల్లో అరటి తోటలెక్కువ. ఆడ గెల యింతని ఎత్తండం (హోల్‍సేల్‌)లో కొంటాడు. అవి పచ్చివి. అవి నాలుగైతే సైకిలుకు ముందు వెనక కట్టుకుంటాడు. అగ్గవకు దండిగ దొరికితే ఒక బండి మాట్లాడుకొని ఏసుకొచ్చుకుంటాడు.

ఆ యప్పకు వంకగడ్డన ఒక కొట్టడి (చిన్న గోదాము) ఉండాది. బాడిక్కి తీసుకున్నాడు అరటి గెలలన్నీ దాంట్లో మగ్గిస్తాడు. లోన ‘కుమ్ము’ ఉంటాంది. కుమ్ములోని రంపపు పొట్టు పోసి, రాత్రి నిప్పుకనికే ఏస్తారు. పొట్టు రాజుకుని, కొట్టడి లోకి ఒక గొట్టంగుండా ఏడిమిని వదుల్తది. అది అరటి గెలలు మగ్గిస్తాది సలీసుగ.

అరముగ్గిన గెలలను పనలు కోసి పెట్టుకుంటాడు ఖాజా హుస్సేన్. లద్దగిరి, గోరంట్ల, కోడుమూరు బస్టాండుల్లా అమ్ముకుంటాడు. పావలాకి మూడు. డజను రూపాయ. సిల్లర యాపారులకు గుడ్క ఎత్తండం ఇస్తాడు. ఒక్క గెలలో పది పన్నెండు పనలు తెగుతాయి. పనకు డజన్నర కచ్చితంగా ఉంటాయి. అంటే గెలకు పదైదు డజన్లకు తగ్గవు.

తోటల కాడ గెల ఏడెనిమిది రూపాయలు పడతాది. దాంట్లో అడుగువి పనికిరావు. కుమ్ములో కొన్ని పనికి రాకుండా బోతాయి. పెతీ గెల మింద ఆ యప్పకు ఆరు, ఏడు రూపాయలు గిట్టుబాటవుతాది. సిల్లర యాపారులకు మాత్రం డజను ముప్పావలాకే ఇస్తాడు. దినరోజు ముఫై రూపాయల తక్కువుండదు ఆ యప్ప ఆదాయము.

ఫాతింబీ గుడ్క ఆ యప్పకు సాయం జేస్తాది. బండి మించి గెలలు కొట్టడి లోకి మొయ్యడం, కుమ్ము రాజేయడం, మగ్గినంక పనలు కొడవలితో తీయడం అన్నీ జేస్తాది.

ఇవిగాక బొరుగుముద్దలు, పప్పుల గట్టాలు, నూల గట్టాలు, నిమ్మొప్పలు సీసాల్లో పెట్టుకొని ఎలిమెంటరీ స్కూలు కాడ ‘ఇంటర్బేలు’ లో అమ్ముకుంటాది. బుడ్డలు వేయించినవి, ఉడకబెట్టినవి, తుంటలు, గంగరేగు పండ్లు కూడ అమ్ముతోంది. రోజుకు ఏదెనిమిది రూపాయలు సలీసుగ సంపాదిస్తాది ఆ యమ్మ.

ఖాజా హుస్సేను పెండ్లానికి చెప్పి, సైకిలెక్కి, రామల్ల కోటకు ఎలబారినాడు. ఆ యమ్మ ఆ యప్పకు సిల్వరు కారేజిలో కొర్రబియ్యం అన్నం, గోగాకు (గోంగూర) ఊరిమిండి కట్టిచ్చినాది. పైటాలకు తోటల కాడనే తింటాడు.

కొడుకును బాగా సదివిచ్చుకోని, మంచి ఉజ్జోగస్తున్ని జెయ్యాలని తల్లిదండ్రీ కల కంటున్నారు. జహంగీరు గూడ్క మంచి సమజ్‌దార్ లడకా అని అయ్యవార్లు చెబుతూంటారు. వాండ్ల ఆశలన్ని వాని మీదనే.

వీండ్లు గాక బొమ్మిరెడ్డిపల్లెలో ఇంకా మూడు తురకోళ్ల యిండ్లుండాయి. ఒకాయన జాఫర్, కటిక పని జేచ్చాడు. అంటే మాంసం అంగడి నడుపుతాడు. అమ్మవార్లకు కోళ్లనో, మేకలనో బలి యియ్యాలన్నా ఆ యప్పనే పిలుస్తారు. ఇంకొకాయన నజీర్ అహ్మద్. ఇంటిముందు అరుగు మిందే టైలరు పని చేస్తాడు.

వీండ్లందరిలో అంతో యింతో కలిగినాయన బడేమియా. ఆయనకు మూడెకరాలు ఎర్రన్యాల ఉండాది జత జిర్రలుండాయి (ఎద్దులు). ఆ యప్పకు ఇద్దురు కొడుకులే. ఒకడు మస్తాన్. కోడుమూరు ఎమ్మెల్యే రాజమణి కాడ జీపు డ్రయివరు. రెండోవాడు కలీల్. వాడు అల్లుగుండు కాడ అయివేలో సైకిలుషాపు పెట్టుకున్నాడు. పది సైకిళ్ల బాడిగలకిచ్చాడు. పంచర్లేస్తాడు. రిపేర్లు చేస్తాడు. ఇద్దరికి పెండ్లిండ్లు గుడ్క జేసినాడు బడేమియా. ఊర్లో పెద్దమనిసి కింద లెక్క. రెడ్లు గూడ్క ఆ యప్పను పక్కన కూసోబెట్టుకుంటారు. యాదన్న పంచాయితి అయినా, ఆ యప్పను బిలుస్తారు.

***

కాలం ఎవురి కోసరం నిలబడదు. అట్ట నిలబడితే అది కాలం ఎట్టయితాది? దాన్ని నిలబెట్టే సత్తా ఉన్న మానుబావులు యింకా పుట్టల్యా. పదేండ్లు గడిసిపోయినాయి. మనుసుల జీవితంలో, బతికే పద్దతిలో, ఆలోశన జేసే తీరులో కొన్ని మార్పులొచ్చినాయి. అవి వచ్చినట్టు గుడ్క మన్సులకు తెలియదు. దాన్ని కాలమగిమ అంటారు.

బొమ్మిరెడ్డిపల్లెలో జిల్లా పరిషత్తు హైస్కూలు బెట్టినారు. టెంతు వరకు పిల్లకాయలు యాడికి బోయే పనిల్యా అని అనుకున్నారు తల్లిదండ్రులు.

ఉళిందకొండ కాడ్నించి అల్లుగుండు, మల్లెపల్లె, బొమ్మిరెడ్డిపల్లె మిందగా ఆర్.టి.సి. బస్సు పడినాది. అది బోయి వెల్దుర్తి కోడుమారు రోడ్డులో గలుచ్చాది. లద్దగిరికి మూడుమైళ్ల దిగువన డాంబరు రోడ్డే, సింగిలుది. బస్సులు కోడుమూరు వరకు బోతాయి.

కర్నూలు – అనంతపురము మజ్చన అయివే మింద, వెల్దుర్తి, డోన్, ప్యాపిలి, గుత్తి, పామిడి మిందుగా ప్రయివేటు బస్సులు గంట కొకటి ఉండేవి. ఆర్‌టిసి బస్సులొచ్చినంక అవి తగ్గిపోబట్నాయి. ఇంతవరకు బొమ్మిరెడ్డిపల్లె నుంచి యాడికి బోవాలన్న నడిసి మెయిన్ రోడ్డుకు బోతే తప్ప బస్సు ఎక్కనీకె అయ్యేది గాదు. ఇప్పుడు బస్సు ఊల్లోకే నాలుగు తూర్లు వస్తాది. లగేజి టికట్టు కూడ గవర్మెంటు బస్సులో శానా తక్కువ.

హైస్కూలు ఉరిబయట కిలోమీటరు దూరంలో ఈరన్న గట్టుకు దిగువన కట్టినారు. ఆరు నుంచి పది వరకు చెప్తారక్కడ. శానా మంది అయ్యవార్లు, అమ్మయ్యలు (లేడీ టీచర్లు) ఆడ పని చేస్తారు. కానీ వాండ్లంతా కాపురం ఉండనీకె బొమ్మిరెడ్డిపల్లెలో ఇండ్లేవీ? బాడిక్కిచ్చేటోల్లు గూడ్క లేరు.

అందుకని టీచర్లందరూ డోన్ నుంచి గానీ, కర్నూలు నించి గాని బస్సులో వచ్చిపోతాండారు. కాని వాండ్లు రెండు బస్సులు మారాల. డోస్ నుంచి వచ్చేటోల్లు వెల్దుర్తిలో, కర్నూలు నించి వచ్చేటోల్లు ఉళిందకొండ, కోడుమూరు బస్సెక్కి బొమ్మిరెడ్డిపల్లెలో దిగాల. కర్నూలు – డోను ప్యాసింజరు రైలుండాది గాని వెల్దుర్తి, ఉళిందకొండ టేసన్లకు ఆ రైలు వచ్చేటయానికి స్కూలు టయానికి కుదరదు.

కొండారెడ్డి బిడ్డ సుజాతను ఆరు నుండి నందికొట్కూరు లోని షడ్డకునింట్లో పెట్టి చదివిస్తాండ్రి. నందికొట్కూరు శానా పెద్దది. డోనంత ఉంటాది. మన ఊర్లోనే అయిస్కూలు వచ్చినంక ఇంక ఆడేందుకులే అని టీ.సీ. దీస్కుని ఊర్లోనే చేర్చినారు. ఇప్పుడాయమ్మ టెంతు కొచ్చినాది.

హెడ్డు మాస్టరు శివ కోటీశ్వరరావు శానా క్రమశిచ్చన గల మనిషి. అయ్యవార్లయినా, పిల్లోండ్లయినా టయానికి రావాల్సిందే. ఆ యప్పను జూస్తే అందరికి బయమే. మగపిల్లలకు కాకి నిక్కరు, తెల్లంగీ, ఆడపిల్లలకు తెల్లంగ మింద కాకి గౌను యానిపారం జేసినాడు – ఏసుకోని రాకపోతే మోకాలు ఏయించడం, అరచేతులు తిరగ దిప్పమని చెప్పి కనుపుల మింద ఈత బరికెలతో కొట్టడం చేస్తారు. మద్యాన్నం ఒంటి గంట నుంచి రెండు వరకు భోజనానికి యింటికి బంపిస్తారు. సుట్టుపక్కల నాగలాపురం, తొగర్చీడు, పుట్లూరు, నార్లాపురం నుంచి వచ్చే పిల్లకాయలు సద్దులు తెచ్చుకుంటారు. శానా మంది పిల్లలు సైకిల్ల మింద వస్తారు. సైకిల్లు ఎండకు ఎండకుండ వానకు నానకుండా ఒక పెద్ద షెడ్డు గుడ్క కట్టించినాడు హెడ్డు మాస్టరు.

సుజాత తర్వాత లింగారెడ్డి ఎనిమిదిలో ఉండాడు.

తర్వాత వాడు కంబిరెడ్డి, వాడు ఆరులోకొచ్చినాడు. అందరికి పుస్తకాలు, పెన్నులు, పెనిసిల్లు, కంపాసు పెట్టిలు, యానిఫారాలు – కర్చులు పెరుగుతూండాయి కొండారెడ్డికి. కర్చులు పెరుగుతాయి గాని భూమి పెరగదు గదా! ఈ అయిదేండ్లలో బుడ్డల దర కింటం మూడింతలు బెరిగినాది. కాని గెడం కర్చులు, పసరాల మ్యాత, కూలీల రేట్లు కూడ అదేం సిత్రమో మూడింతల కంటే ఎక్కువే పెరిగినాయి.

ఇంతకుముందు లేనివి ఐస్ ఫ్రూట్ బండ్లు! అయిస్కూల్లో ఇంటర్బెల్ కాడ పెట్టుకుంటారు. లేనపుడు ఊర్లో తిరిగి “ఐస్ క్రయిం ఐస్ క్రయిం, పాలయిస్” అంటూ అరుస్తూ అమ్ముకుంటారు. మామూలు ఐస్ (పుల్ల ఐసు) రూపాయ. పాల ఐసు ఐతే రెండు రూపాయలు. సైకిలు ఎనక ఐసు డబ్బా కట్టుకొని, ఎనక చక్రానికి పూసలు కదుల్తాంటే ‘డుర్రు’మని సప్పుడు వచ్చేటట్లు ఒక చిన్న రేకు డబ్బా అమర్సుకుంటారు.

కిరానం అంగల్లు కూడ రెండు మూడు పెరిగినాయి. ఇంతకు ముందు రామానుజ శెట్టి దొకటే అంగడి. కోంటోల్లు మాత్రమే కిరాణా యాపారం జేసేది పోయింది. మిగతా అంగల్లు వేరే కులం వాల్లే పెట్టుకున్నారు

సేన్లలో ప్రబుత్వం వాల్లు రైతులకు బోర్లు ఏపిచ్చుకుంటే సబ్సిడీ ఇయ్యబట్నారు. కొండారెడ్డి గుడ్క సుంకులమ్మ గుడి సేనులో బోరు ఏపిచుకుంటె మాటిమాటికి ఆకాశం దిక్కు సూడకుండా మన కాడే ‘జల’ ఉంటాది గదా అనుకుని పంచాయతి ఆపీసు కాడ పేరు రాయిచుకుండాడు.

దాపున వంక పారతాది గాబట్టి డెబై నుంచి నూరు పట్ల లోపునే నీల్లు బడుతుండాయి. కొండారెడ్డి సేన్లో కూడ బోరు ఏసిపోయినారు. ఆ యప్ప కుటుమానమంతా కుశాలుగ ఉండాది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here