మహాప్రవాహం!-8

0
12

[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘మహాప్రవాహం!’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[అరటిపళ్ళ వ్యాపారం చేసే ఖాజా హుస్సేన్ తన ఇంటి ముందర దింపిన వారాపాగులో కూసోని ఉంటాడు. ఇంతలో అతని భార్య ఫాతింబీ – నాస్తా తినడానికి లోపలికి రమ్మంటుంది. సత్తు తట్టలో బన్సీరవ్వ ఉప్మా వేసి, నంచుకోడానికి కొరివికారం ముద్ద వేస్తుంది. పుట్నాల పొడి ఉంటే బాగుంటుందంటాడు. తొందరగా తిని, రామల్ల కోటకు వెళ్ళి అరటిగెలలు తెచ్చుకోమంటుంది. ఉప్మా తిన్నాక, గాజు గ్లాసులో సొంటి కాఫీ ఇస్తుంది. ఘాటుగా ఉంది, కొన్ని పాలు పొయ్యమంటాడు. పాలు ఎక్కువ లేవని, ఉన్నవి కొడుకు జహంగీర్‍కి ఉంచానని అంటుందామె. కొడుకు కోసమనగానే ఊరుకుంటాడు. రామల్లకోట, పుల్లగుమ్మ, కలుగొట్ల ప్రాంతాల్లోని అరటి తోటల నుంచి గెల యింతని ఎత్తండం (హోల్‍సేల్‌)లో కొని తెచ్చి, మగ్గించి, పనలుగా, డజన్లుగా అమ్ముకుంటాడు.  రోజుకు ముఫై రూపాయల తక్కువుండదు అతని ఆదాయం. ఫాతింబీ కూడా సాయం చేస్తుంది. ఆ ఊర్లో మరో మూడు తురకోల్ల యిండ్లుంటాయి. కటికపని చేసే జాఫర్, టైలరు పని చేసే నజీర్ అహ్మద్, ఎర్రన్యాల ఉన్న బడేమియా. బడేమియా ఊర్లో పెద్దమనిషి లాంటివాడు. కాలం ఎవరి కోసం ఆగదు. మనుషుల జీవితాల్లో, జీవన విధానాల్లో చాలా మార్పులొస్తాయి. బొమ్మిరెడ్డిపల్లెలో జిల్లా పరిషత్తు హైస్కూలు వస్తుంది. ఊర్లోకి ఆర్‍టిసి బస్సు వేస్తారు, దాంతో ప్రైవేటు బస్సులు తగ్గుతాయి. కొండారెడ్డి కూతురు సుజాతని కొత్త హైస్కూలులో టెంత్ క్లాసులో చేర్పిస్తాడు. సుజాత తర్వాత పిల్లాడు లింగారెడ్డి ఎనిమిదిలోకొస్తాడు. తర్వాతి పిల్లాడు కంబిరెడ్డి, ఆరు లోకొస్తాడు. పిల్లల చదువుకయ్యే ఖర్చులు, పొలం ఖర్చులు, పశువుల మేత ఖర్చులు అన్నీ పెరిగిపోతాయి. కిరాణా కొట్లు మరో రెండు మూడు వచ్చాయి. వైశ్యులే కాక, వేరేవాళ్ళు కూడా కిరాణా కొట్లు నిర్వహిస్తున్నారు. పొలాల్లో బోర్లు వేయించుకుంటే సబ్సీడీ ఇస్తోందని తెల్సి తన పొలంలో కూడా బోరు వేయించుకుంటాడు కొండారెడ్డి. తక్కువ లోతులోనే నీరు పడుతుంది. అందరూ సంతోషిస్తారు. ఇక చదవండి.]

[dropcap]నా[/dropcap]గరత్నమ్మ ఆయాల పొటేలు మాంసం, ఉద్ది వడలు, వరన్నం జేసినాది. గంగమ్మ తల్లి కరునించినాదని అందరూ శాన సంతోషపడినారు

ఇల్లు అలికినంత మాత్రాన పండగ అయితాదా? బోరుకు తగినట్లు మోటారు పంపు, కరెంటు మీటరు, మోటారు ఎయ్యనీకె, ఆపనీకె స్టార్టరు, మోటారు పెట్టనీకె ఒక రేకుల శెడ్డు ఇవన్నీ గావాల. మరి దానికి లోను ఉళిందకొండ స్టేటు బ్యాంకులో ఇస్తారని చెప్పిరి

మంచి రోజు చూసి ఉళిందకొండకు బోయినాడు కొండారెడ్డి. బ్యాంకులో శానామంది ఉండారు. అందరు రైతులే. తన ఊరోల్లే ఐదారు మంది గనపడినారు.

బ్యాంకు ముందర ఒక పెద్ద సింతమానుండాది. దానికింద ఒక ఓటలుండాది. ముందల పీల్డు ఆపీసరు కాడికి బోయి మాట్లాడినారు. గంటపైన బడతాది అని పేరు రాసుకుండాడాయప్ప.

కాపీ అన్నా తాగుదామని ఓటలుకి పోయినాడు. కుంటి సుబ్బాడ్డి కూడ ఆడ ఉండాడు.

“ఏందినా, బోరు ఏపిచ్చి నావంట! నీల్లు పైనే పడినాయంట!” అన్నాడు సుబ్బాడ్డి.

“ఔ రా, ఉత్త బోరుతో యాడయితాది, మోటరు పెట్టించాల గదా! అందుకే లోను కోసర మొచ్చినా”

సుబ్బారెడ్డి ఓటలాయనతో “రెండు ‘టీ’ లు చెయ్యప్పా” అని చెప్పినాడు. టీ అనేది ఒకటుంటాదని ఇనడమే గాని యానాడు దాన్ని తాగిన పాపాన బోలేదు కొండారెడ్డి.

“ఏమన్న తిందామాన్నా” అని, “నాలుగు అలచంద వడ లియ్యప్పా” అని చెప్పినాడు.

ఇద్దరూ వడలు తినేయాలకి గాజు గ్లాసుల్లో టీలు తెచ్చిచ్చినాడు. కొండారెడ్డి టీ రెండు గుటికెలు తాగి “ఇదేందో శానా బాగుండాడి కుంటి బావా!” అన్నాడు నాలిక సప్పరిస్తూ.

“ఇప్పుడు యాడ జూసినా ఇదే తాగుతుండారు లేన్నా” అన్నాడు సుబ్బాడ్డి. తర్వాత గొంతు తగ్గిచ్చి ఇట్లా చెప్పినాడు – “లోను శాంక్సను గానీకె బ్యాంకోల్లు ముప్పతిప్పలు బెట్టి మూడు చెరువుల నీల్లు దాగిస్తాండారు. గురప్ప అని ఒకన్ని గలిసినా. వాడు శానా టక్కుటమార విద్దెలు తెలిసినాడు. వానిది ఉళిందకొండే. బ్యాంకోల్లకు ఎంతో కొంత ఇప్పించి, తొందరగ లోను శాంక్సను చేయిస్తాడు. మనం సొంతం లోను చేయిచుకోవాలంటే అయ్యే పని గాదు.”

“లంచాలిచ్చేది మన యింటా వంటా లేదు గదరా కుంటి బావ! లోను మనమే కట్టుకుంటుంటిమి, వడ్డీతో సా. మన శేను కుదువ పెట్టించుకుంటారంట. ఇంక ఈ గురప్పగాడు చేసేదేంది మజ్జన!” అన్నాడు కొండారెడ్డి

“అంత సలీసుగ పనులయ్యే కాలాలు కాదు. గవుర్మెంటు కాడి నుంచి ఏది రావాలన్నా, ఈ గురప్పలాంటి బోకర్లుండాల. అంతెందుకు బోరు ఎయ్యనీకె పంచాయతి ఆపీసులో నీవేమీ ఇయ్యకుండనే ఏసిరా ఏంది?”

“ఔ రా, ఐదు నూర్లు అడిగినారు. బంగపోతే మూడు నూర్ల కొప్పుకున్నారు.”

“మల్ల! మన పని సలీసుగ గావాల. అది ముక్యం.”

ఇద్దరూ బ్యాంకు ముందు అరుగు మింద గూసున్న గురప్ప కాడికి బోయినారు. ఆయప్ప సిన్నోడే. నలబై ఏండ్లుంటాయి. ప్యాంటు, అంగీ ఏసుకోని నల్ల కల్లద్దాలు పెట్టుకొని ఉండాడు. మెడలో ఒక మప్లరు ఏసుకున్నాడు. నోట్లో సిగిరెట్టు ఎలుగుతా ఉంది. సిగిరెట్లు ఎక్కవగా తాగుతాడేమో ఆ యప్ప పెదిమలు నల్లగా ఉండాయి. “రాండి రాండి” అని పక్కకు జరిగి వాండ్లకు కూసునేందుకు చోటిచ్చినాడు గురప్ప.

“ఈన కొండారెడ్డి, మా ఊరే” అని చెప్పినాడు సుబ్బారెడ్డి.

గురప్ప కొండారెడ్డికి నమస్కారం బెట్టినాడు. “అన్నా, అంతా నేను జూసుకుంటా. పీల్డాపీసరు మనోడే. సేను కాయితాలు తెచ్చినావా?”

కొండారెడ్డి చేతి సంచిలోంచి కాయితాలు తీసిచ్చినాడు. అవి ఒకసారి సదివినాడు గురప్ప.

“బ్యాంకోడిచ్చేది తక్కువ. మన శేను ఇలువ ఎక్కువ. అయినా శేను కుదువ బెట్టంది లోనియ్యరు” అన్నాడు.

“అన్నా నీకు ఫైవ్ హెచ్.పి. మోటరు కిర్లోస్కర్ కంపినీది గావాల, అది రెండు వేలయితాది. కిల్‌బర్న్ కంపెనీ స్టార్టరు ఎనిమిది వందలైతాది. కరెంటు కనెక్షనుకు లోను రాదు. పైపులు, పిటింగులు, బిగించే మెకానికు చార్టీలు, షెడ్డు ఎయ్యనీకె సుట్టూ నాలుగడుగులు గోడ లేపాల్నా, సిమెంటు రేకులు, మేస్త్రీ కూలీలు అంతా ఐదు వేల వరకు ఐతాది. బ్యాంకు దాంట్లో ఎనబై పర్సెంటు యిస్తాది. అంటే నాలుగు వేలు. వారం పదిరోజుల్లో పనయ్యేటట్లు జూస్తా. నా కమిసను నీ దయ, నా అదృస్టము” అన్నాడు గురప్ప.

“దయేముంది లేప్పా. నేనిచ్చినంతే ఇస్తాడు మా బావ” అన్నాడు సుబ్బడ్డి.

“రైతుల కాడ నేనేం ఎక్కువ దీసుకోను. సరే. అట్టే గానీ”

“ఎంత ఇయ్యాల మరి?” అన్నాడు కొండారెడ్డి.

“నాలుగునూర్లు. దాంట్లోంచే ఆ యప్ప బ్యాంకోల్లకిచ్చుకుంటాడు”

“గాడిది కంటె గడ్డిమోపే పిరం (ఖరీదు) ఐతుందే, దీనమ్మ!” అన్నాడు కొండారెడ్డి.

గురప్ప నవ్వినాడు. “గడ్డిమోపు లేకుండా గాడిదని సాకలేం గదా, కొండారెడ్డిన్నా!” అన్నాడు

విది లేక సరే అన్నాడు కొండారెడ్డి. అన్నింటికి బిల్లులు తీసుకోవాలని, కర్నూల్లో బస్టాండు కాడే ‘కుసుమ హరనాథ మోటారు కంపెనీ’ అని తనకు తెలిసినోల్లదే ఉండాదని, వేరేసోట కంటె దర తగ్గిస్తారనీ చెప్పినాడు గురప్ప.

“ఒక తూరి మర్యాదకు సారును గలిసి ఎల బారండి. రేపాదివారము. ఎల్లుండి వస్తే పారాల మింద సంతకాలు అయితాయి. బిల్లులన్నీ ఇస్తే గాని లోను డబ్బులు రిలీజు చెయ్యరు” అన్నాడు

“సెట్టు ముందా, యిత్తు ముందా అన్నట్లు, డబ్బులిస్తే గద అయన్ని కొనుక్కునేది”

“మోటారు కంపెనీ డీలరు అన్నీ ముందుగానే యిస్తారు లేన్నా. నీకా ఎదారు లేదు” అన్నాడు గురప్ప.

ముగ్గురూ పీల్డాపీసరు కాడికి బోయినారు. ఆ యప్ప ముందల టేబుల్ మింద శానా కాయితాలుండాయి. ఆ యప్ప కూర్చున్న కుర్చీ ఎనక ఎం.కనకరాజు, బి.కాం, ఫీల్డ్ ఆఫీసర్ అని రేకు ప్లేటు మింద నల్లని అచ్చరాలతో రాసి ఉంది.

గురప్ప, “నమస్కారం సార్” అని ఏదో సెప్పనీకెబోతూంటే “వీండ్లకు చెప్పాల్సినవన్నీ చెప్పినావు గద! సోమరం పిల్చుకురా. ప్రాసెస్ చేద్దాము” అన్నాడా యప్ప వీండ్లు నమస్కారం చేస్తే చూడనయినా చూడలేదు.

పైటాల యాలకు కోడుమూరు బస్సులో ఉరు జేరినాడు కొండారెడ్డి. నాగరత్నమ్మకు అంతా ఇవరంగా సెప్పినాడు.

ఆయమ్మ అనింది, “మిడియ్యాలం కాలాలు గాకపోతే, నాలుగేలు లోనుకు నాలుగు నూర్లు లంచమా? శానా ఎక్కవ.”

“మనమే గాదమ్మే, అందురూ ఇచ్చాండారు. ఏం జేచ్చాం, తప్పదు మల్ల. బగుమంతుని దయవలన ఏదో నీల్లు బడినాయి. మోటరు పెట్టుకుంటే ‘తరి’ పొలం అయితాది. ఇలవ పెరుగుతోంది. బుడ్డలే గాకుండా వేరే పంట కూడ ఏసుకోవచ్చు. ఎండకాలం ఒక ఎకరా కూరగాయలు పండిచ్చుకోవచ్చు. పంటలు ఏసుకోనీకి గూడ్క అదేదో ‘క్రాపు లోను’ గుడ్క యిస్తారట” అన్నాడు మొగుడు.

“రెండు మూడేండ్లు కస్టపడి శేను యిడిపించుకుంటే, ఈ లోన్ల కత ల్యాకుండ మనమే సాగు జేసుకునే స్తితి రావాల దేవుడా!” అనింది పెండ్లాము.

కాలమే వాండ్ల ఆలోశనలను తీర్చేది!

***

సంజన్న గౌడు ఇంటి ముందల మంచం మింద గూసోని అలోసిస్తా ఉండాడు. నాయన చచ్చిపోయి అప్పుడే రెండేండ్లాయ. సంవత్సరం కాడ్నించి కల్లు దిగుబడి బాగా తగ్గినాది. తాటిమాన్లకు గూడ్క శానా వయసయిపోయినాయి. సంసారం జరగనీకె కల్లమ్మితే వచ్చిన డబ్బులు సరిపోవడం ల్యా.

ఈ మజ్ఞన జనం కల్లు తాగడం గుడ్క తగ్గించినారు. లద్దగిరిలో, ఆకిరికి అల్లుగుండులో గూడ్క వైను షాపులు తెరిసినారు. ఈ లొట్టలు, ముంతలు జనానికి నచ్చడం లేదు.

కొడుకు ప్రదీపు అయిస్కూల్లో ఏడుకు వచ్చినాడు. వాన్ని మంచి కాన్వెంటులో చదివించాలని ఉంది. ఊరిడిసి పోదామంటే.. బతకగలమా లేదా అని బయము. ఉన్న తాటితోపును అమ్మేసి కోడుమూరికో డోనుకో బోయి తానూ ఒక వైను షాపు పెట్టుకుంటే?

ల్యాకుంటే, తాటిసెట్లన్నీ నరికేసి, రీపులు కోయించి టింబరు డిపోకు అమ్ముకొని, ఇనుప నాగేండ్లతో మొదుళ్లు ఏర్లకు పెల్లగించేసి, ఒక బోరు ఏయించుకొని సేద్యం జేస్తామా? అంటే అది అంత నాన్యమైన భూమి గాదు. మొరుసు సేను. మూడెకరాలు మాత్రం జొన్న పండుతాది, అదునుకు వానలు పడితే! ఈ మధ్య రెండేండ్లుగా సరైన వానలు గూడ్క లేవు!

పెండ్లాము యిమలమ్మ నడిగితే “నీకు ఏది బాగనిపిస్తే అది సెయ్యి. మామ బతికుంటే యాదయిన ఆలోశన చెప్పేటోడు. ఇంటికి పెద్ద దిక్కు ఎల్లిపాయ” అని బాదపడతాదాయమ్మ. మామంటే శానా ఇది యిమలమ్మకు.

ఆకరికి తెగించినాడు సంజన్నగౌడు. తాటివనం అమ్మకానికి పెట్నాడు. పదమూడు వేలు వచ్చింది. రుక్మాంగద రెడ్డి కొనుక్కున్నాడు. డోనుకు బోయి ఇచారించినాడు, వైను షాపు పెట్టనీకె యాడయితే బాగుంటాదని. అప్పటికీ డోనులో రెండు శాపులుండాయంట. ఒకటి ఈడిగోల్లదే. రెండోది ప్యాపిలి కోంటోల్లదంట.

ముందల మాళిగె (షాపు) బాడికి దొరకాల. డోను అయివే మింద ఉంటాది. రైలు టేసను గుడ్క ఉంది. అది జన్సను. టేసను పేరు ద్రోణాచలం అని ఉంటాది. రెండు లైన్లు ఆ టేసన్లోనే శీలతాయి. అయిదరాబాదు బెంగుళూరు లైను ఒకటి, నంద్యాల మింద పోయే గుంటూరు లైను ఒకటి.

డోనులో ఒక టూరింగు సినిమా టెంటు, ఒక పక్కా సినిమా హాలు కూడా ఉండాయి. టెంటు పేరు ‘గౌరీశంకర టూరింగ్ టాకీసు’, హాలు పేరు ‘శికామని టాకీసు’.

బొమ్మిరెడ్డిపల్లె ఆయన రామగిరి అని మ్యాదరోల్లు ఒకాయన డోనులో శికామని టాకీసు ముందల ఓటలు పెట్టుకుని ఉన్నాడు. ఆ ఓటలు పేరు ‘డీలక్సు టిఫన్ సెంటర్’. దాని పేరు మాత్రం గొప్పదే గాని అది ఒక పెద్ద కొట్టం ఓటలు.

సంజన్న గౌడుకు ఆ యప్ప మతికొచ్చినాడు. పోయి కలిసినాడు. రామగిరి శానా సంతోషపడినాడు. సంజన్న కంటే శానా పెద్దోడా యప్ప.

“ఊల్లో అంతా బాగుండారా నాయినా? మీ నాయన చచ్చి పాయనంట గదా! శానా మంచోడు! మనూరోండ్లు నా ఓటలుకు వస్తాంటారు కదా! సమాచారాలు తెలుస్తోంటాయిలే” అని, “ఒరేయ్ పొట్టిగా, రమీసూ, అన్నకు ఒక ‘టీ’ తీస్కరా” అని అరిశినాడు.

అది సాయంత్రం టైము. “ఏమయినా తింటావాప్పా?” అనడిగి, “తినాల, తినాల. ల్యాక ల్యాక వచ్చినావు. ఇప్పుడే మిరపకాయ బజ్జీ దిగినాది. బాగుంటాది మన కాడ. ఉండు. తెప్పిస్తా” అని “టీ కంటె ముందు ప్లాటు బజ్జీ దీస్కరారొరేయ్!” అనరిశినాడు.

ఆ యప్ప అభిమానానికి సంజన్నకు శానా బాగనిపించినాది. ఒక సత్తు ప్లేటులోన నాలుగు బజ్జీలు దెచ్చినాడు పొట్టిగాడు, వానికి పన్నెండేండ్లుంటాయి. నిక్కరు, బనియను ఏసుకున్నాడు. బజీల ప్లేటు సంజన్నకిచ్చి నోరంతా తెరిచి నవ్వినాడు.

“వీనిది రంగాపురం లే. తెలిసినోండ్లు చెబితే పనికి చెట్టుకున్నా. శానా మంచోడు. నా కాడనే ఉంటాడు” అన్నాడు రామగిరి.

టీ తాగడం అయినంక అడిగినాడు “ఏమన్నా పని మీదొచ్చినావా డోనుకు?”

సంజన్న తన పరిస్తితంతా ఇవరించినాడు. డోను లోన వైన్ షాపు పెట్టుకోవాలని ఉందన్నాడు. రామగిరి కుంచేపు అలోశన చేసినాడు. “మంచిదే. కాని మళిగె సెంటర్లో దొరకాల. మిడిమ్యాలం బాడిగలడుగుతారు. బాడిగకు ఎనకాడితే యాపారం తేజుగా ఉండదు. నీవు యాడండావు ఇప్పుడు?”

“బస్టాండు కాడ మడతమంచం దీస్కున్నాన్నా. రోజూ ఊరికి బోయివచ్చేది కష్టమని!”

“మరి బోజనం?”

“రైలు గేటుకివతల ఒక కోంటాయన పెడతాడు. ఇంట్లోనే. రెండు రూపాయలు తీసుకుంటున్నాడు. ఒక జొన్న రొట్టె, అన్నం, పప్పు, చారు, మజ్జిగ – బానే ఉంటాది.”

“సరే, బాగుంది. కానీ మా యింటికొచ్చేయి. మీ పిన్నమ్మ, నేనే కదా ఉండేది. బిడ్డను సంజామల కిస్తిమి. అల్లునికి ఆడ సోడాల అంగుడుండాది. ఇదిగో ఈ రమేసుగాడు గుడ్క మాతోనే ఉంటాడు.”

“ఎందుకులే సిన్నాయనా, మీకు స్రెమ!” అన్నాడు సంజన్న.

“స్రెమెందిరా తిక్కోడా! ఒక ఊరోల్లం ఆ మాత్రం సాయం చేసుకోకపోతే ఎట్టా! మొగమాటపడగాకు. రేపు పొద్దున్న ఎలబారి రా!”

“సరే సిన్నాయన!” అన్నాడు సంజన్న.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here