మహాత్ములు

1
12

[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘మహాత్ములు’ అనే రచనని అందిస్తున్నాము.]

యథా చిత్తం తథా వాచో, యథా వాచస్తథా క్రియాః।
చిత్తే వాచి క్రియాయాం చ సాధూనామేకరూపతా॥

వేదాలలో మంచి ప్రాచుర్యం పొందిన  నరసింహ సుభాషితం లోనిది ఈ శ్లోకం. ఇది  చాలా అర్థవంతమైనది, అజ్ఞానం, అశాంతి, అలజడులలో నిత్యం సతమతమయ్యేవారికి చక్కని రాచబాట చూపిస్తుంది పై శ్లోకం. మహాత్ములకు వారి మనస్సు, వాక్కు మరియు వారి కర్మలు ఒకటే.

అదే ఇతరులకి వారి ఆలోచనలు భిన్నం, మాటలు భిన్నం, మరి వారి చేతలు మరీ భిన్నం. వారు తోటివారికి హాని తల పెట్టడానికి సర్వదా సంసిద్ధులై ఉంటారు. ఇటువంటి వారికి సదా దూరంగా వుండాలి. మనసా వాచా కర్మణా ఒకే విధంగా ప్రవర్తిస్తేనే మానవాళికి శ్రేయస్సు కలుగుతుందని ఈ శ్లోకం భావం.

మానవాళికి అనుక్షణం రెండు రెండు రకాలైన మార్గాలు ఎదురవుతూ వుంటాయి. మంచి బాటన నడవడం చాలా కష్టం. అనుక్షణం అనేక సవాళ్ళూ ఎదురవుతూ వుంటాయి. అయితే అంతిమ విజయం ఈ బాటన ప్రయాణించేవారికే లభిస్తుంది. మంచి వారికి వారి ఆలోచనలు ఏ విధముగా ఉంటాయో వారు మాట్లాడే తీరు, మాటలు కూడా అదే విధంగా ఉంటాయి. వారి మాటలు ఏ విధంగా ఉంటాయో వారి చేతలు, కర్మలు కూడా అదే విధంగా ఉంటాయి. మనం పోయేటప్పుడు – లౌకికంగా సంపాదించిందంతా ఇక్కడే వదిలేసి పోతామని.. జీవుడు ఒక దేహం విడిచి మరొక దేహం పొందేటప్పుడు తన వెంట ఇంద్రియాలు, మనస్సు తీసుకు వెళతాడని, మనం చేసే కర్మల ఫలితం ఇంద్రియాలకు, మనస్సుకు అంటుకుని ఉంటుందని.. ఈ కర్మలే జీవుల ఉత్తమ, అధమ జన్మలను నిర్ణయిస్తాయని వేదం స్పష్టంగా చెబుతోంది. అందుకే జీవితంలో సాధ్యమైనంతగా మంచి పనులు చేస్తూ, సర్వ మానవ సౌభ్రాతృత్వం, సర్వ జీవ సమానత్వం ఆచరణలో చూపిస్తూ, సమాజ శ్రేయస్సులే పరమావధిగా యథాశక్తిన కృషి చేయడం మన తక్షణ కర్తవ్యం. హిందువుల జీవన విధానానికి ప్రాతిపదిక అని చెప్పబడే కర్మ సిద్ధాంతంలో భగవంతుడు ప్రతి జీవికి, వారి కర్మానుగుణంగా పరిపక్వమైన కర్మలను తీసి ఏడు జన్మలకు కేటాయిస్తాడు అని చెప్పబడుతోంది.. ఏ కర్మఫలం ఎప్పుడు, ఏ విధంగా అనుభవించాలో నిర్ణయిస్తాడు.

ఈ ప్రపంచములో ప్రతి జీవి జన్మించడానికి కారణము ఆ జీవి అంతకు ముందు చేసిన కర్మఫలాలే. చెడు కర్మకి ఫలితము పాపం, పాపానికి దుఃఖము, మంచి కర్మకి ఫలితము పుణ్యము. పుణ్యానికి సుఖము అనుభవించాలి. వాటిని అనుభవించడానికే ప్రతి జీవి జన్మని తీసుకుంటుంది.

జన్మాంతరాల్లో చేసిన పాప, పుణ్య కర్మలే దుఃఖాలుగా, సుఖాలుగా ఈ జన్మలో అనుభవంలోకి వస్తాయి. ఈ జన్మలో సత్కర్మలు ఆచరిస్తే కర్మ ఫలం నశించి సద్గతులు కలుగుతాయి. మనం చేసే పనులన్నీ భగవత్‌ సంకల్పంగా భావించినప్పుడు మంచి కర్మలు మాత్రమే చేయగలుగుతాం. అప్పుడు ప్రతీ మానవుడు ఒక మహాత్ముడు కాగలుగుతాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here