మహాభారత కథలు-20: కౌరవ వంశము – యయాతి మహారాజు చరిత్ర

0
10

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

కౌరవ వంశము

యయాతి మహారాజు చరిత్ర

[dropcap]దే[/dropcap]వతలు రాక్షసుల అంశాలతో భూమి మీద పుట్టిన వాళ్ల గురించి వైశంపాయనుడు చెప్పినదాన్ని విని జనమేజయుడు “మహానుభావా! వేదవేదాంగాలన్నీ చదివినవాళ్లు, యజ్ఞాలు చేసి ఎక్కువగా దక్షిణలు ఇచ్చినవాళ్లు, అశ్వమేథ యాగాలు ఎక్కువగా చేసి అవబృథస్నానం వల్ల పవిత్రమైన దేహాలు కలిగినవాళ్లు, పుణ్యచరిత్ర కలవాళ్లు, అరిషడ్వర్గాలు జయించినవాళ్లు, ధర్మార్ధకామమోక్షాలు పొందినవాళ్లు, సాత్విక గుణమే సంపదగా కలిగినవాళ్లయిన భరతుడు మొదలైన కీర్తికాంక్ష కలిగిన మహారాజులు పుట్టిన, కౌరవ పాండవ వంశాలు అని చెప్పబడే కౌరవ వంశాన్ని గురించి నాకు వివరంగా తెలియచెయ్యండి!” అని ప్రార్ధించాడు.

జనమేజయుడు అడిగినదానికి వైశంపాయనుడు “మహారాజా! సాటిలేని ధర్మమార్గంలో నడుస్తూ మొత్తం భూమిని కాపాడుతూ గొప్ప పేరు తెచ్చుకున్నారు పూరు, కురు, పాండురాజులు. వాళ్ల మంచి ప్రవర్తన వల్ల, బలపరాక్రమాల వల్ల పౌరవ, కౌరవ, పాండవ వంశాలు భూమి మీద నివసించే ప్రజలకి ఏ లోటూ కలగకుండా రాజ్యపాలన చెయ్యగలిగారు.

దక్షుడి కుమార్తె అయిన అదితికీ, కశ్యపుడికీ వివస్వంతుడు అనే పేరుగల వాడు జన్మించాడు. అతడికి వైవస్వతుడు అనే మనువు, యముడు, శని, యమున, తపతి పుట్టారు. వైవస్వతుడు అనే మనువు వల్ల బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు మొదలైన మానవులు పుట్టారు. వైవస్వతుడికి వేనుడు మొదలైన రాజులు యాభై మంది పుట్టి వంశాన్ని వృద్ధి చేసి చివరికి వాళ్లల్లో వాళ్లు కొట్టుకుని మరణించారు. ఆ మనువు కుమార్తె ఇలకి, చంద్రుడికి బుధుడు పుట్టాడు. అతడి కుమారుడు పురూరవుడు గొప్ప చక్రవర్తి అయ్యాడు.

శౌర్యవంతుడైన పురూరవ చక్రవర్తి భూమిని, పదమూడు ద్వీపాల్ని పాలిస్తూ గర్వంతో బ్రాహ్మణులకి సంబంధించిన ధనాన్ని దొంగిలించాడు. బ్రాహ్మణుల ధనాన్ని దొంగిలించడం వల్ల పురూరవుడికి కలిగిన పాపాన్ని పోగొట్టమని బ్రహ్మదేవుడు సనత్కుమారుడికి చెప్పాడు. అందువల్ల చాలామంది దేవమునులతో కలిసి దేవలోకం నుంచి భూలోకం వచ్చాడు సనత్కుమారుడు. రాజ్యగర్వంతో ఉన్న పురూరవుడు తన దగ్గరికి వచ్చిన దేవమునులకి ఆతిథ్యమివ్వక వాళ్లని పరిహాసంగా మాట్లాడాడు. సనత్కుమారుడికి కోపం వచ్చి వెర్రివాడుగా మారమని శపించాడు. పురూరవుడికి గంధర్వలోకంలో ఉండే అప్సరసకి ఆయువు, ధీమంతుడు, అమావసువు, దృఢాయువు, వనాయువు, శతాయువు అనే ఆరుగురు కుమారులు కలిగారు.

ఆయువు, సర్భనవి అనే దంపతులకి నహుషుడు, వృద్ధశర్మ, రజి, గయుడు, అనేనసుడు అనే అయిదుగురు కుమారులు కలిగారు. నహుషుడు ద్వీపాలు, అరణ్యాలు, పర్వత ప్రాంతాలు, నాలుగు సముద్రాలు కలిగిన భూమండలాన్ని తన అపార బాహుబలంతో పాలించాడు. నూరు యజ్ఞాలు చేసి తన కీర్తిని భూమండలం మొత్తం వ్యాపించేలా చేసుకున్నాడు. శత్రువులందర్నీ జయించి దేవేంద్ర పదవిని కూడా పొందాడు.

నహుషుడు, ప్రియంవద దంపతులకి యతి, యయాతి, సంయాతి, అయాతి, అయతి, ధ్రువుడు అనే ఆరుగురు కుమారులు జన్మించారు. వాళ్లల్లో యయాతి రాజ్యం చేస్తూ అనేక యజ్ఞాలు చేశాడు. యయాతి శుక్రాచార్యుడి కుమార్తె దేవయాని దంపతులకి యదువు, తుర్వసుడు అనే ఇద్దరు కుమారులు కలిగారు. యయాతి, వృషపర్వుడి కుమార్తె శర్మిష్ఠ దంపతులకి ద్రుహ్వి, అనువు, పూరుడు అనే ముగ్గురు కుమారులు కలిగారు.

మొత్తం అయిదుగురు కొడుకులతో కలిసి రాజ్యపాలన చేస్తూ శుక్రాచార్యుడి శాపం వల్ల ముసలితనంతో బాధ పడ్డాడు. యయాతికి కోరికలు తగ్గక తన కుమారులందర్నీ పిలిచి ఎవరేనా కొంతకాలం తన ముసలితనాన్ని తీసుకుని వాళ్ల యౌవనాన్ని తనకు ఇమ్మని అడిగాడు. అలా ఇచ్చినవాడు తన తరువాత సకల రాజ్యానికి రాజయ్యే యోగ్యతని పొందుతాడు అని చెప్పాడు. అయిదుగురు కొడుకుల్లో పూరుడు ఒక్కడే తన తండ్రికి కలిగిన ముసలితనాన్ని తను తీసుకుని తన యౌవనాన్ని తండ్రికి ఇచ్చాడు.

శుక్రాచార్యుడి శిష్యుడిగా బృహస్పతి కుమారుడు కచుడు

వైశంపాయనుడు చెప్తున్న బారత కురువంశ చరిత్ర వింటున్న జనమేజయుడు “మహర్షీ! వర్ణాశ్రమ ధర్మాల్ని రక్షిస్తూ భూమండలం మొత్తాన్ని పాలిస్తున్న యయాతి మహారాజు బ్రాహ్మణులలో ఉత్తముడైన శుక్రాచార్యుడి కూతురు దేవయానిని భార్యగా ఎలా చేసుకున్నాడో కొంచెం వివరంగా చెప్పండి! అంతేకాదు, గొప్ప తేజస్సు, తపోబలం, అన్ని లోకాల్ని కూడ కాపాడగలిగిన సమర్థత కలిగిన యయాతికి శుక్రాచార్యుడు ఎందుకు శాపం ఇచ్చాడో కూడా వివరించండి! మా వంశాన్ని వృద్ధి చేసిన యయాతి చరిత్ర మొత్తం వినాలని ఉంది!” అని వినయంగా అడిగాడు.

వైశంపాయనుడు యయాతి చరిత్ర జనమేజయుడికి వివరిస్తున్నాడు. “ఓ రాజా! వృషపర్వుడనే రాక్షస రాజుకి శుక్రాచార్యుడు గురువుగా రాజ్య పాలనలో అనేక సలహాలు ఇస్తున్నాడు. దేవదానవ యుద్ధంలో మరణిస్తున్న రాక్షసుల్ని మృతసంజీవని విద్యతో బ్రతికిస్తున్నాడు. ఆ విషయం తెలిసిన దేవతలు ఇలా జరుగుతుంటే రాక్షసుల్ని జయించడం కష్టమని భయపడ్డారు. శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్లి మృతసంజీవని విద్యని నేర్చుకుని రాగల సమర్థత ఎవరికి ఉందా.. అని ఆలోచించి చివరికి బృహస్పతి కుమారుడైన కచుడి దగ్గరికి వెళ్లారు.

“నాయనా! గొప్ప బలపరాక్రమాలు కలిగిన రాక్షసుల్ని చంపడమే కష్టం. కష్టపడి చంపినా శుక్రాచార్యుడు తన మృతసంజీవని విద్య వల్ల మళ్లీ బ్రతుకిస్తున్నాడు. మనవాళ్లందర్నీ రాక్షసులు చంపేస్తున్నారు. వాళ్లని బ్రతికించుకునేందుకు మనలో ఎవరికీ మృతసంజీవని విద్య తెలియదు. అందరూ యముడి దగ్గరికి వెళ్లిపోతున్నారు. కనుక, నువ్వు శుక్రాచార్యుణ్ని మంచి చేసుకుని మృతసంజీవని విద్యని పొంది విద్యాబలంతో దేవగణ బలాన్ని కాపాడాలి. నువ్వు చిన్నవాడివి, నియమాలు, వ్రతాలు అన్నీ చెయ్యగల సమర్థుడివి.

శుక్రాచార్యుడు నిన్ను శిష్యుడుగా స్వీకరించి, సంతోషంతో నీకు ఆ విద్యని తప్పకుండా నేర్పిస్తాడు. శుక్రాచార్యుడికి కుమార్తె మీద ప్రేమ ఎక్కువ. ఆమె చెప్పిన మాటని తప్పకుండా వింటాడు. ఆయనకి సేవ చేస్తూ అమె మనసుని కూడా లోబరుచుకుంటే నువ్వు అనుకున్న పని నెరవేరుతుంది” అని చెప్పారు. కచుడు దేవతలకి మేలు చెయ్యడం కోసం వృషపర్వుడి పట్టణానికి వెళ్లాడు.

ఎప్పుడూ వేదాధ్యయనం చేస్తూ ఉండే రాక్షసగురువైన శుక్రాచార్యుడికి నమస్కారం చేసి “మహర్షీ! నేను బృహస్పతి కుమారుణ్ని. నా పేరు కచుడు. మిమ్మల్ని సేవిద్దామని వచ్చాను!” అన్నాడు వినయంగా. సుకుమారంగా కనిపిస్తున్న కచుణ్ని చూస్తూ అతడు వినయంగా, ఇష్టంగా, మృదువుగా, మధురంగా పలికిన మాటల్ని విన్నాడు. నియమనిష్ఠల వల్ల కలిగిన తేజస్సుతో అతడి ముఖంలో వెలుగుతున్న ప్రశాంతతని కూడా చూశాడు శుక్రాచార్యుడు. ఇతణ్ని పూజిస్తే దేవగురువుని పూజించినంత ఫలితం కలుగుతుంది అనుకుని కచుడికి అతిథి మర్యాదలు చేసి తన శిష్యుడిగా స్వీకరించాడు.

శుక్రాచార్యుడు ఏ పని చెప్పినా కాలయాపన చెయ్యకుండా వెంటనే చేస్తూ, అంతకంటే ఎక్కువగా దేవయాని చెప్పినట్టు వింటూ ఆమెకి పువ్వులూ పండ్లూ తెచ్చి ఇస్తూ సంతోష పెడుతున్నాడు. కచుడు తక్కువ సమయంలోనే దేవతలు చెప్పినట్టు మసులుకుని రాక్షస గురువు శుక్రాచార్యుడికి, ఆయన కుమార్తె దేవయానికి ఇష్టుడయ్యాడు.

మృతసంజీవనితో బ్రతికిన కచుడు

కచుడు గొప్ప నేర్పరితనంతో సేవ చేస్తూ శుక్రాచార్యుడికి ప్రియ శిష్యుడిగా మారిపోయాడు. అతడి తండ్రి బృహస్పతికి తమకి మధ్య గల వైరం గుర్తుకొచ్చిన రాక్షసులు మాత్రం అతడి మీద కోపంగా ఉన్నారు. ఒకరోజు కచుడు అడవిలో ఆవుల్ని కాపుకాయడానికి ఒక్కడే వెళ్లాడు. రాక్షసులు కూడా అతడి వెనక వెళ్లి అతణ్ని కొట్టి చంపి ఒక చెట్టుకి కట్టి వచ్చేశారు. సూర్యాస్తమయం అవగానే ఆవులు తిరిగి ఇంటికి వచ్చేశాయి. వాటి వెంట కచుడు రాలేదు. దేవయాని కంగారుపడి తండ్రి దగ్గరికి వెళ్లి “తండ్రీ! ఆవుల్ని మేపడానికి అడవికి ఒంటరిగా వెళ్లిన కచుడు తిరిగి రాలేదు. ఆవులు మాత్రం సంధ్యా సమయం అవగానే తిరిగి వచ్చేసాయి!” అని చెప్పింది.

దేవయాని చెప్పింది విని తన దివ్యదృష్టితో చూశాడు శుక్రాచార్యుడు. అడవిలో రాక్షసులు అతణ్ని చంపి చెట్టుకి కట్టేసినట్టు తెలుసుకున్నాడు. మృతసంజీవని విద్యని అక్కడికి పంపించాడు. అంత గొప్ప దేవకుమారుణ్ని రక్షించడం తన భాగ్యంగా అనుకుని మృతసంజీవని విద్య అతి వేగంతో వెళ్లి కచుణ్ని బ్రతికించి తీసుకుని వచ్చింది. దేవయాని చాలా సంతోష పడింది.

కొంతకాలం గడిచాక పువ్వులు కొయ్యడానికి వెళ్లిన కచుణ్ని రాక్షసులు మళ్లీ చంపేశారు. ఈసారి కచుణ్ని శుక్రాచార్యుడు బతికించకుండా ఉండేలా రాక్షసులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అతణ్ని చంపి, కాల్చి బూడిద చేసి దాన్ని మద్యంలో కలిపి శుక్రాచార్యుడితో తాగించేసారు. మద్యం తాగిన శుక్రాచార్యుడు మత్తులో ఉన్నాడు. చీకటిపడిపోయినా కచుడు తిరిగి ఇంటికి చేరలేదని దేవయాని కంగారు పడుతోంది. రాక్షసులు అతణ్ని మళ్లీ చంపేశారేమో అని ఏడుస్తూ తండ్రి దగ్గరికి వెళ్లి చెప్పింది. ఆమె మాటలు విన్న శుక్రాచార్యుడు “కచుడి మీద శత్రుత్వం పెంచుకుని రాక్షసులే మళ్లీ అతణ్ని చంపేసి ఉండచ్చు. అతడికి ఉత్తమ గతులు కలగాలని కోరుకుందాము, ఏడుస్తావెందుకు?” అన్నాడు.

శుక్రుడి మాటలు విని దేవయాని “అన్ని ధర్మాలు తెలిసిన మహానుభావా! బుద్ధియందు లోకాలకే అతీతుడైన అంగీరస మహర్షి మనుమడు; గొప్ప వాడైన బృహస్పతికి కుమారుడు; మీకు శిష్యుడు; మిమ్మల్నే ఆశ్రయించినవాడు; మంచి రూపము, గుణగణాలు కలవాడు; బ్రహ్మచర్య వ్రతాన్ని అవలంబిస్తున్నవాడు అయిన కచుణ్ని ఏ కారణమూ లేకుండా రాక్షసులు చంపేస్తే ఏడుపు రాదా?” అని అన్నం తినకుండా ఏడుస్తూ కూర్చుంది.

శుక్రాచార్యుడు చాలాసేపు కూతుర్ని అనునయించి చివరికి తన దివ్యదృష్టితో ప్రపంచమంతా చూశాడు. కచుడు ఎక్కడా కనిపించలేదు. మళ్లీ మళ్లీ వెతికి చివరికి తను తాగిన మద్యంలో కలిసి బూడిద రూపంలో తన పొట్టలోనే ఉన్నాడని తెలుసుకున్నాడు. ప్రతి జన్మల్లోను పుణ్యకార్యాలు చేస్తూ సంపాదించుకున్న గొప్ప జ్ఞానాన్ని ఒక్క క్షణంలోనే పోగొడుతుంది మద్యపానం. ఇది పంచమహాపాతకాల్లో ఒకటి. నేను మద్యపానం చెయ్యడం వల్ల కచుడికి ఇంత కీడు జరిగినా తెలుసుకోలేక పోయాను కనుక “ఈ రోజు నుంచి ఎవరేనా మద్యపానం చేస్తే పాపం కలిగి దుర్గతిని పొందుతారు!” అని శపించాడు.

తరువాత తన పొట్టలో ఉన్న కచుణ్ని బ్రతికించాడు. పొట్టలో ఉన్న కచుడు “గురువర్యా! నీ దయతో ప్రాణాన్ని, దేహాన్ని, బలాన్ని పొందాను. దయచేసి బయటకి వచ్చే మార్గం చెప్పండి!” అని ప్రార్థించాడు. కచుడి మాటలు విన్న శుక్రాచార్యుడు ‘కచుడు బయటకు రావాలంటే నా పొట్టని చీల్చుకుని రావాలి. అలా వస్తే నా ప్రాణం పోతుంది. అతడు నన్ను బ్రతికించలేడు’ అని ఆలోచించి తన పొట్టలో ఉన్న కచుడికి సంజీవనీ విద్యని ఉపదేశించాడు.

పండితులతో స్తుతింపబడిన కచుడు తను ఏది కావాలనుకున్నాడో.. దేని కోసం ఇంత దూరం వచ్చి కష్టపడ్డాడో.. దాన్ని పొంది ఉదయిస్తున్న చంద్రుడిలా ప్రకాశిస్తూ గురువు శుక్రాచార్యుడి పొట్టలోంచి బయటకు వచ్చాడు. తను బయటకు రాగానే వేదవేదాంగ విశారదుడు, రాక్షస జాతికే గురువు అయిన శుక్రాచార్యుడు ప్రాణం లేని వాడిగా ఉండడం చూశాడు. వెంటనే ఆలస్యం చెయ్యకుండా మృతసంజీవని విద్యతో ఆయన్ని బ్రతికించాడు. కచుడు అనుకున్నట్టుగా ఎంతో కష్టపడి మృతసంజీవని విద్యని నేర్చుకున్నాడు. కొంతకాలం అక్కడే ఉండి ఒకరోజు శుక్రాచార్యుడి దగ్గర శలవు తీసుకుని స్వర్గలోకం బయలుదేరాడు. బయలుదేరుతూ సంతోషంగా దేవయానికి ఈ విషయాన్ని చెప్పాడు.

చాలాకాలం కలిసి మెలిసి ఉన్న కచుడు వెళ్లిపోతుంటే దేవయాని బాధపడి తనని వివాహం చేసుకోమని అడిగింది. ఆమె మాటలకి కచుడు “దేవయానీ! గురువుగారి కుమార్తె సోదరితో సమానం. గురువులకి శిష్యులు కొడుకులతో సమానం. నువ్వు అడుగుతున్నది అధర్మం! లోకంలో ఎవరూ ఇలా చెయ్యరు. గురువుగారి కుమార్తెవైన నీకు ఇలా అడగడం అసలు ఉచితం కాదు” అని చెప్పాడు.

కచుడి తన మాట కాదన్నందుకు దేవయానికి కచుడి మీద కోపం వచ్చింది. అతడితో “నువ్వు నా కోరికని మన్నించలేదు కనుక, నీకు సంజీవనీ విద్య ఉపయోగపడకుండుగాక!” అని శపించింది.

కచుడు దేవయాని శాపానికి మొదట బాధపడ్డాడు. కొంత సేపటికి తేరుకుని “దేవయానీ! నేను ధర్మ మార్గాన్ని తప్పని వాడిని. కనుక, సంజీవనీ విద్య నాకు పనిచేయక పోయినా నాతో ఉపదేశం పొందినవాళ్లకి పనిచేస్తుంది గాక! నువ్వు అధర్మంగా ఆలోచించావు కనుక, బ్రాహ్మణుడితో నీ వివాహం జరగకుండు గాక!” అని తిరిగి దేవయానిని శపించాడు. తరువాత బృహస్పతి కుమారుడు కచుడు దేవతల నివాసమైన స్వర్గానికి వెళ్లి దేవతల ప్రశంసలు అందుకున్నాడు. తను నేర్చుకున్న విద్యతో దేవతలకి మంచి చేస్తూ ఉండిపోయాడు.

కచుడు వెళ్లిపోయాక రాక్షసరాజైన వృషపర్వ మహారాజు కూతురు శర్మిష్ఠ తన చెలికత్తెలతోను దేవయానితోను కలిసి ఉద్యానవనానికి వెళ్లింది. ఒక కొలను దగ్గర తమ బట్టలు పెట్టుకుని కొలనులో స్నానం చేస్తున్నారు. సుడిగాలి రావడం వల్ల అందరి బట్టలు కలిసిపోయాయి. అందరూ బయటకి వచ్చి కలిసిపోయిన బట్టల్లోంచి ఎవరి బట్టలు వాళ్లు వెతుక్కోవడం కష్టమైంది. కంగారులో ఎవరికి దొరికినవి వాళ్లు కట్టేసుకున్నారు. అదే కంగారులో దేవయాని చీరని శర్మిష్ఠ కట్టుకుంది. శర్మిష్ఠ చీరని దేవయాని కట్టుకోలేదు. శర్మిష్ఠతో “అసాధరణ ప్రజ్ఞావంతుడైన శుక్రాచార్యుడి కూతుర్ని; ప్రసిద్ధమైన బ్రాహ్మణ కులంలో పుట్టినదాన్ని; నీకు పూజింపతగ్గదానిని; నువ్వు కట్టుకుని వదిలిన చీరని నేను కట్టుకోను” అంది.

దేవయాని మాటలు విని శర్మిష్ఠ “నీ తండ్రి శుక్రుడు నా తండ్రి వృషపర్వుణ్ని విడిచి పెట్టకుండా పొగుడుతూ సేవిస్తూ ఉంటాడు. నీ గొప్పతనం నా దగ్గర చెప్పకు. నేను కట్టుకున్న బట్టలు నువ్వు ఎందుకు కట్టుకోకూడదు?” అని అహంకారంతో మాట్లాడి దేవయానిని ఒక బావిలోకి తోసేసి తన చెలికత్తెలతో కలిసి వెళ్లిపోయింది. తరువాత..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here