మహాభారత కథలు-25: భరతుడి జననము

0
11

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

భరతుడి జననము

[dropcap]ఒ[/dropcap]కరోజు కణ్వుడు శకుంతలని చూసి “అమ్మా! నీ కులగోత్రాలకి, అందచందాలకి తగిన భర్తని పొందగలిగావు. ఇప్పుడు నువ్వు గర్భవతివి. నీ గర్భంలో ఉన్నవాడు ఈ సమస్త భూమిని పాలించగల గొప్ప చక్రవర్తి అవుతాడు. నీ ధర్మ ప్రవర్తనకి మెచ్చుకున్నాను, ఏం కావాలో కోరుకో” అన్నాడు.

“తండ్రీ! నా మనస్సు ఎప్పుడూ ధర్మంలోనే లగ్నమై ఉండాలి. నాకు పుట్టే కుమారుడికి దీర్ఘాయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం, బలం కలిగి వంశకర్తగా ప్రసిద్ధికెక్కాలి” అని కోరుకుంది. కణ్వమహర్షి ఆమె కోరుకున్నట్టే వరమిచ్చాడు. గర్భవతికి చెయ్యవలసిన సంస్కార రక్షణ విధులన్నీ శకుంతలకి యథావిధిగా చేయించాడు. తరువాత అమెకి కొడుకు కలిగాడు. కణ్వమహర్షి అతడికి ‘భరతుడు’ అని పేరు పెట్టి జాతకర్మ మొదలైనవన్నీ పూర్తి చేయించాడు.

అరచేతిలో చక్రరేఖ కలవాడు, చక్రవర్తి లక్షణాల్ని పోలిన శరీరం కలవాడు, సర్వాంగ సుందరుడు, సింహం వంటివాడు, పొడుగైన చేతులు కలవాడు, అమితమైన వేగము, గొప్ప బలము కలిగిన భరతుడు కణ్వమహర్షి ఆశ్రమంలో పెరుగుతున్నాడు.

భరతుడు అపారమైన బలంతో అడవుల్లో తిరుగుతూ అడవిపందుల్ని, పాముల్ని, ఖడ్గమృగాల్ని, మదించిన ఏనుగుల్ని ఇంకా ఇతర మృగాల్ని అవలీలగా పట్టుకుని తీసుకుని వచ్చి ఆశ్రమంలో ఉన్న చెట్లకి కట్టేసేవాడు. ఏనుగుల మీద ఎక్కి స్వారీ చేసేవాడు. అడవిలో ఉన్న జంతువులన్నింటి గర్వాన్ని అణిచి వాటితోనే ఆడుకునేవాడు. తన బాల్యమంతా అటువంటి ఆటలతోనే గడుపుతున్నాడు. మహర్షులు మహాబలవంతుడైన భరతుణ్ని ఆశ్చర్యంతో చూసేవాళ్లు.

అతడి బాహుబలం, శౌర్యం, పరాక్రమం చూసి ‘సర్వదమనుడు’ (అన్నింటినీ అణిచేసేవాడు) అని పిలిచేవాళ్లు. కణ్వమహర్షి ఆ బాలుడిలో కనిపించే ఉదాత్తమైన తేజస్సు, అతడి రూపము, పరాక్రమము, గుణాలు చూసి అతడికి యువరాజ పట్టాభిషేకం జరుపవలసిన సమయం వచ్చిందని అనుకున్నాడు.

శకుంతలని దుష్యంతుడి దగ్గరికి పంపించిన కణ్వమహర్షి

ఒకరోజు కణ్వమహర్షి శకుంతలని పిలిచి “అమ్మా! ఎటువంటి పతివ్రతలైనా పుట్టిన ఇంట్లో ఎక్కువ కాలం ఉండకూడదు. భర్తల దగ్గర ఉండడమే ధర్మం. భార్యలకి భర్తలే సర్వరక్షకులు. కనుక నీ కుమారుణ్ని తీసుకుని నీ భర్త దగ్గరికి వెళ్లడం నీకు, నీ కుమారుడికి మంచిది” అని చెప్పాడు. ఒక మంచి రోజు చూసి  కొంతమంది తపస్సంపన్నులైన శిష్యుల్ని తోడిచ్చి శకుంతలని దుష్యంతుడి దగ్గరకు పంపించాడు. తన కుమారుడు భరతుణ్ని తీసుకుని శకుంతల అందరితో కలిసి దుష్యంతుడి రాజ్యానికి వచ్చింది.

దుష్యంతుడు సామంతులు, మంత్రులు, పురోహితులు, ముఖ్యులు, పౌరజనులతో కలిసి సభలో ఉన్నాడు.  ఆ సభలోకి భరతుణ్ని వెంటబెట్టుకుని వెళ్లింది శకుంతల. దుష్యంతుడు అమెని చూసి కూడా పలకరించలేదు. ఇంతకు ముందు తన తండ్రి ఆశ్రమానికి వచ్చినప్పుడు తన మీద చూపించిన ప్రేమ, ఆదరము, దయ, అసక్తి శకుంతలకి ఇప్పుడు దుష్యంతుడిలో కనిపించలేదు.

ఆమె మనస్సులో ‘ఈ మహారాజు నన్ను గుర్తించలేదు. ఒకవేళ గుర్తించి గుర్తించనట్టు నటిస్తున్నాడా.. చాలాకాలం గడిచిపోయింది కనుక, మర్చిపోయి ఉంటాడా? రాజులకి అనేక పనులు ఉంటాయి కదా! ఆ పనుల ఒత్తిడిలో మరుపు ఉండడం సహజమే. ఏమో ఈ రాజు పెళ్లి రోజు చెప్పిన మాటలన్నీ నిజం కావేమో. ఇక్కడికి వచ్చాక మనస్సు మార్చుకున్నాడేమో. నావైపు చూస్తున్నప్పుడు అతడి కళ్లల్లో కఠినత్వం కనిపిస్తోంది. ఎప్పటికప్పుడే కొత్తదనాన్ని కోరుకుంటారు రాజులు. ఇతడు కూడా నన్ను అలాగే పలకరించి పెళ్లి చేసుకున్నాడేమో. నా అవివేకమే నన్ను ఇంతవరకు తీసుకుని వచ్చింది’ అని ఆలోచిస్తోంది.

శకుంతల మనస్సులో దుఃఖపడుతూ ఇంకా ఆలోచిస్తోంది ‘ఎవరేనా నిజంగా మర్చిపోతే జ్ఞాపకం చెయ్యచ్చు. తెలియని వాళ్లకి తెలిసేలా చెప్పచ్చు. తెలిసీ, గుర్తు ఉండీ నటించేవాడికి తెలియ చెప్పడం బ్రహ్మకి కూడా సాధ్యం కాదు. అయినా ఇంత దూరం వచ్చాను కనుక ఏమీ సాధించకుండా ఊరికే వెళ్లిపోడం వల్ల ఉపయోగం లేదు. ఇంతకు ముందు జరిగినదాన్ని గుర్తు చేసి అతడి కొడుకుని అతడికి చూపిస్తాను’ అని మనస్సులోనే నిశ్చయించుకుంది.

దుష్యంతుడితో “రాజా! వేట అనే వంకతో కణ్వుడి ఆశ్రమానికి వచ్చి అక్కడ నన్ను చూసి, నాకు మాట ఇచ్చి గాంధర్వ పద్ధతిలో వివాహం చేసుకున్నావు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకో. దీన్ని నిరూపించడానికి సాక్షులు ఎవరూ లేరు. బాలసూర్యుడిలా వెలుగుతున్న ఈ పసివాడు నీ కొడుకు. ఇతడు పౌరవ వంశానికి గొప్ప కీర్తిని తెస్తాడు. ఉత్తమ గుణాలు కలిగిన నీ కొడుకుకి యువరాజ పట్టాభిషేకం చెయ్యి” అని అడిగింది.

శకుంతలని నిరాకరించిన దుష్యంతుడు

శకుంతల చెప్పిన మాటలు విన్న దుష్యంతుడు ఆ విషయం అతడికి తెలియనివాడిలా “నాకు నువ్వు ఎవరివో తెలియదు. పనికిరాని మాటలు మాట్లాడకుండా ఎక్కడనుంచి వచ్చావో అక్కడికే వెళ్లు!” అన్నాడు.

దుష్యంతుడి మాటలకి శకుంతల ఆశ్చర్యపోయింది. కదలిక లేకుండా నిలబడి పోయింది. తామరపువ్వుల్లా ఎర్రబడ్డ కళ్లల్లోంచి కన్నీరు కారుతోంది. కొంచెంసేపు ఆ రాజువైపు చూస్తూ మనస్సులో కలిగిన బాధని అణుచుకుంది. మళ్లీ రాజుతో “అన్నీ తెలిసి కూడా ఏదీ తెలియని వాడిలా మాట్లాడుతున్నావు. నేను తప్ప సాక్షులెవరూ లేరనీ, ప్రజల్ని రక్షించే రాజువనీ అహంకారంతో ధర్మాన్ని విడిచిపెట్టి అబద్ధం చెప్పవచ్చా? రాజా! నిర్మలమైన కీర్తికి నిధివంటి వాడివి. వేదాలు, పంచభూతాలు, ధర్మం, రెండు సంధ్యలు, హృదయం, యముడు, చంద్రసూర్యులు, పగలు, రాత్రి ఇవన్నీ మనిషి ప్రవర్తనని ఎప్పుడూ గమనిస్తూనే ఉంటాయి.  మనిషి చేసే ప్రతి పనికి, సంకల్పానికి అంతరాత్మే సాక్షి. అంతరాత్మని చంపుకున్న మనిషి తనను తను మోసం చేసుకున్నట్టే. నాకు ముందు చెప్పినట్టే నువ్వు నన్ను అనురాగంతో చూసుకో. నన్ను అవమానించడం నీకు మంచిది కాదు.

బాగా ఆలోచించు.. పతివ్రత, గుణవంతురాలు, సంతానవతి, అనుకూలవతి అయిన భార్యని తిరస్కరిస్తే ఇహపర సుఖాలు ఉండవు. భార్య అనుకూలంగా ఉంటేనే భర్త కర్మలు ఆచరించగలుగుతాడు. ఇంద్రియ నిగ్రహం కలవాడు పుత్రసంతానాన్ని పొందగలడు. గృహస్థాశ్రమంలో నిర్వహించవలసిన ధర్మాన్ని ఆచరించిన గృహస్థుడే మంచి ఫలితాన్ని పొందగలుగుతాడు.

ధర్మం, అర్థం, కామం, అనే పురుషార్థాల్ని సాధించడానికి సాధనము, గృహనీతి అనే విద్యలకి నెలవు, నిర్మలమైన శీలాన్ని గురించి ప్రబోధించే  గురువు, వంశం నిలవడానికి ఆధారము, ఉత్తమ గతులు పొందడానికి ఊతకర్ర, మర్యాద పొందడానికి ముఖ్య కారణము, ఆదర్శవంతము, కలకాలం నిలిచే మంచి గుణాలకి నెలవై హృదయానికి అనందాన్ని కలిగించేది భార్యే. భర్తకి ఇల్లాలి కంటే మించినది మరొకటి లేదు. ఆలుబిడ్డలని ఆప్యాయంగా చూసేవాళ్లకి ఎక్కడైనా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఆపదల్లోను, ఇబ్బందుల్లోను కూడా దుఃఖాలన్నీ తొలగి పోతాయి.

అంతేకాదు, భార్య భర్తలో సగం కాబట్టి, భర్తకంటే ముందే మరణించిన పతివ్రత పరలోకంలో కూడా తన భర్తతో కలిసి ఉండాలని అతడి రాక కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. భర్త ముందుగా మరణిస్తే తను కూడా వెంట వెడుతుంది. అటువంటి భార్యని అవమానించడం అధర్మం. అంతే కాదు భర్త భార్యయందు ప్రవేశించి గర్భంలో వసించి కొడుకై పుడతాడు. వేదాల్లో చెప్పినట్టు తండ్రి కొడుకులకి బేధం లేదు. గార్హ్యపత్యం అనబడే అగ్ని ప్రజ్వలింపబడి ఎలా వెలుగుతుందో అదే విధంగా తండ్రి తానే పుత్రుడై తన ప్రకాశంతో వెలుగుతాడు. దీన్ని అర్థం చేసుకో.  రాజా! పురుషుడు నీళ్లల్లో తన ప్రతిబింబాన్ని స్పష్టంగా ఎలా చూస్తాడో ఆ విధంగా తండ్రి తనలాగే ఉన్న కొడుకుని చూసి సంతృప్తితో మహదానందాన్ని పొందుతాడు.

ఒక దీపం నుంచి మరొక దీపం వెలిగినట్టు నీ పుణ్య శరీరం నుంచి ఈ పుత్రుడు జన్మించి ప్రకాశిస్తున్నాడు.   ఇన్ని మాటలెందుకు? ఒక్కసారి నీ కొడుకుని కౌగలించుకుని చూడు ఎంత ఆనందం కలుగుతుందో! పచ్చకర్పూరం పొడి, మంచిగంధము, వెన్నెల కూడా జీవులకి పుత్రుడి కౌగిలి ఇచ్చినంత చల్లదనాన్ని కలిగించలేవు. పుణ్యాత్ముడైన నీ కుమారుడు నూరు వాజపేయ యాగాలు చేసి వంశాన్ని ఉద్ధరిస్తాడని మహర్షులందరూ వింటుండగా ఆకాశవాణి నాతో చెప్పింది.

ధర్మపరుడవైన ఓ మహారాజా! మన వివాహం జరిగిన రోజు నువ్వు నాకిచ్చిన వరం నాకు పుట్టిన కుమారుడికి యువరాజపట్టాభిషేకం చెయ్యడం. గుణవంతుడు, వంశాన్ని విస్తరింప చేసేవాడు అయిన నీ కుమారుణ్ని వద్దని చెప్పడం నీవంటి గుణవంతుడికి తగదు. సత్యవంతుడవైన రాజా! మంచి నీటితో నిండిన నూరు చేదుడు బావులకంటే ఒక దిగుడుబావి మంచిది. నూరు బావులకంటే ఒక యజ్ఞం మంచిది. అటువంటి నూరు యజ్ఞాలకంటే సుగుణవంతుడైన ఒక పుత్రుడు కలగడం మంచిది.

నూరుమంది పుత్రులకంటే ఒక సత్యవాక్కు మేలు. ఒక త్రాసులో వెయ్యి అశ్వమేథ యాగాల ఫలితాన్ని ఒకవైపు, ఒక్క సత్యాన్ని మరొక వైపు ఉంచి తూచి చూస్తే సత్యం వైపే బరువు మొగ్గు చూపుతుంది. అన్ని తీర్థాల్నీ సేవించినా, వేదాలన్నింటినీ అధ్యయనం చేసినా అవి సత్యంతో సమానం కావు. పూర్తిగా ధర్మం తెలిసిన ఋషులు అన్ని ధర్మాలకంటే సత్యమే గొప్పదని ఎప్పుడూ చెప్తుంటారు. కాబట్టి నిర్మలమైన మనస్సుతో ఆలోచించి, సత్యమే గొప్పదని తెలుసుకుని, కణ్వమహర్షి ఆశ్రమంలో చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చి ఆత్మీయతతో నీ కొడుకుని దగ్గరకి తీసుకుని ఆదరించు. రాజా! క్షత్రియుల్లో గొప్పవాడైన విశ్వామిత్రుడికి, పవిత్రురాలైన మేనకకి కలిగిన గుణవంతురాలినైన నేను అబద్ధం చెప్పను.

శకుంతల ఎంత చెప్పినా దుష్యంతుడు అంగీకరించలేదు. “నేనెక్కడ? నువ్వెక్కడ? నీ కొడుకెక్కడ? నిన్ను ఇంతకు ముందు నేను ఎప్పుడూ చూడలేదు. ఆడవాళ్లు అబద్ధాలు ఆడతారు అన్నది నిజం. అందువల్లే నువ్వు అబద్ధం చెప్తున్నావు. చూడగానే రూపంలోను, గుణంలోను, బలంలోను నాకంటే సాటిలేనివాడిగా కనిపిస్తున్నాడని నా కుమారుడిగా చెప్పి అందరికీ చూపించి అందరూ నన్ను చూసి నవ్వాలని తీసుకుని వచ్చావా? అనవసరమైన మాటలు మాట్లాడక నువ్వు నీ ఆశ్రమానికి వెళ్లిపో” అన్నాడు దుష్యంతుడు.

రాజు మాటలు విని శకుంతల బాధ పడుతూ “పుట్టినప్పుడు తల్లితండ్రులు వదిలేశారు. ఇప్పుడు భర్త వదిలిపెడుతున్నాడు. ఇంక మాటలెందుకు.. పూర్వం నేను ఏ నోములు నోచేనో నా బ్రతుకు ఇలా అయింది” అని దు:ఖపడింది.  అతడి మీద ఆశ వదులుకుని కన్నీళ్లు కారుస్తూ ఇంక తనకు దేవుడే దిక్కు అనుకుంటూ కొడుకుని తీసుకుని వనానికి వెళ్లిపోడానికి సిద్ధమైంది.

శకుంతలని గ్రహించిన దుష్యంతుడు

శకుంతల వనానికి వెళ్లాలని బయలుదేరుతూ ఉండగా సభలో వాళ్లందరు వినేటట్లు “ఈ భరతుడు నీకూ శకుంతలకు పుట్టిన ముద్దుబిడ్డ. ఇతణ్ని నీ కుమారుడుగా స్వీకరించు. నీ ఇల్లాలు శకుంతల గొప్ప కీర్తి కలది, మహా పతివ్రత, జ్ఞానవంతురాలు. ఆమె చెప్పింది మొత్తం సత్యం” అని ఆకాశవాణి రాజుకి వివరించింది.

సభలో ఉన్నవాళ్లు ఆకాశవాణి చెప్పింది విని ఆశ్చర్యపోయారు. ఆకాశవాణి చెప్పిన మాటలు విని దుష్యంతుడు శకుంతల పాతివ్రత్యాన్ని గురించి, భరతుడి గురించి, జరిగినదాన్ని గురించి ఎంతో సంతోషంతో సభలో ఉన్నవాళ్లకి వివరించాడు. “కణ్వమహర్షి ఆశ్రమంలో ఎంతో ఇష్టంతో గాంధర్వ పద్ధతిని నేను ఈ శకుంతలని వివాహం చేసుకున్నాను.  ఆ విషయం నాకు, ఈమెకు తప్ప ఇంక ఎవరికీ తెలియదు. లోకులు నింద వేస్తారన్న భయంతో నాకు తెలిసి కూడా తెలియదని కఠినంగా చెప్పాను. ఇప్పుడు అందరికీ తెలిసే విధంగా ఆకాశవాణి చెప్పింది” అన్నాడు.

తనకు శకుంతలకు జరిగిన వివాహం గురించి సభలో ఉన్న అందరికి వెల్లడించాడు. ప్రేమతో తన కొడుకుని ఎత్తుకుని పులకరించి పోయాడు. శకుంతలని పట్టమహిషిగా గౌరవించాడు. భరతుడికి యువరాజ పట్టాభిషేకం చేశాడు. చాలాకాలం రాజభోగాలు అనుభవించి రాజ్యభారాన్ని భరతుడికి అప్పగించి దుష్యంతుడు తపోవనానికి వెళ్లిపోయాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here