మహాభారత కథలు-28: భీష్ముడి ప్రతిజ్ఞ

0
14

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

భీష్ముడి ప్రతిజ్ఞ

[dropcap]ఒ[/dropcap]కరోజు శంతనుడు వేటకోసం యమునానదీ తీరంలో తిరుగుతున్నాడు. అతడికి నది మీద పడవ నడుపుకుంటూ ఉన్న ఒక అందమైన కన్య కనిపించింది. ఆమె దగ్గరికి వెళ్లి “ఎవరు నువ్వు? ఇలా ఒంటరిగా ఉండి పడవ ఎందుకు నడుపుకుంటున్నావు?” అని అడిగాడు.

శంతనుడి మాటలకి అమె “నేను దాశరాజు కుమార్తెని. నా పేరు సత్యవతి. ఈ పని చెయ్యమని నాకు నా తండ్రి చెప్పాడు కనుక చేస్తున్నాను” అంది.

రాజు అమె వివరాలు తెలుసుకుని దాశరాజు దగ్గరికి వెళ్లి ఆమెని తనకిచ్చి వివాహం చెయ్యమని అడిగాడు. దాశరాజు శంతనుడితో “మహారాజా! నీ తరువాత నీ రాజ్యాన్ని ఈమెకి పుట్టిన కొడుకుకి అప్పగించాలి!” అన్నాడు.

దాశరాజు మాటలు విని శంతనుడు ఇంతకు ముందే తనకు గంగ యందు కలిగిన కొడుకు గాంగేయుణ్ని తలుచుకుని అది తప్ప వేరే ఏదయినా అడగమన్నాడు. కాని, దాశరాజు తనకు ఇంకేదీ వద్దన్నాడు. శంతనుడు తిరిగి తన రాజ్యానికి వెళ్లిపోయాడు. సత్యవతినే తలుచుకుంటూ రాజకార్యాలన్నీ వదిలేశాడు. ఎప్పుడూ విచారంగా ఉంటున్నాడు. గాంగేయుడు తండ్రిని చూసి “మహారాజా! నీ రాజ్యంలో నీకు సమస్యలు తెచ్చిపెట్టే శత్రువులు లేరు. సామంత రాజులందరూ నువ్వు చెప్పినట్టే వింటున్నారు. ప్రజలు కూడా సుఖసంతోషాలతో జీవిస్తున్నారు. నువ్వు విచారంగా ఉండడానికి కారణం ఏమిటి?” అని అడిగాడు.

శంతనుడు చాలాసేపు ఆలోచించి కొడుకుతో “నాయనా! ఒకే కొడుకు ఉన్నవాడు, అసలు సంతానమే లేనివాడు సమానమే అని ధర్మశాస్త్రాల్లో చెప్పబడింది. నీకు తోడుగా ఇంకా కొంతమంది కొడుకులు ఉంటే బాగుంటుందని అలోచిస్తున్నాను. ఉత్తమ శాస్త్ర నిర్ణయాలలో అగ్నిహోత్రాన్ని, సంతనాన్ని, వేదాల్ని తమ ఇళ్లల్లో లేకుండా చేసుకోకూడదని ఉత్తమ ధర్మ శాస్త్రాల్లో జ్ఞానులైన మహర్షులు చెప్తున్నారు. నువ్వు అస్త్రశస్త్రవిద్యల్లో పండితుడివి. యుద్ధాల్లో దయదాక్షిణ్యాలు లేని కఠినాత్ముడివి. శత్రువుల్ని సంహరించడంలో వెనుకముందులు ఆలోచించని సాహసికుడివి. కనుక, నువ్వు ఎక్కువ కాలం బ్రతుకుతావని మనస్సులో నమ్మకం కుదరట్లేదు. అందుకే నేను ఇంకా కొంతమంది కొడుకుల్ని పొందాలని అనుకుంటున్నాను” అన్నాడు.

అది విని గాంగేయుడు పెద్దలు, మంత్రులు, పురోహితులు, మిత్రులు మొదలైన వాళ్లతో ఈ విషయం గురించి ఆలోచించాడు. రాజు మనస్సులో యోజనగంధి గురించి ఆలోచిస్తున్నాడని తెలుసుకున్నాడు. సామంతరాజుల్ని అనేక మందిని తీసుకుని దాశరాజు దగ్గరికి వెళ్లాడు. మా రాజుకి సత్యవతిని రాణిగా చెయ్యమని అడిగాడు.

దాశరాజు దేవవ్రతుణ్ని గౌరవించి కూర్చోబెట్టాడు. తరువాత “నాయనా! నువ్వు ధర్మస్వభావం కలవాడివి. ఉచితానుచితాలు తెలిసినవాడివి. అన్ని పనులు నిర్వహించ కలవాడివి. తండ్రి కోసం కన్యని అడగడానికి వచ్చావు. నేను ధన్యుణ్నయ్యాను. సత్యవతి నా కుమార్తె కాదు. రాజర్షి ఉపరచరవసువు కుమార్తె. ఆమెని శంతనుడికి తప్ప ఇతరులెవరికీ ఇచ్చి పెళ్లిచెయ్యద్దని నాకు చెప్పాడు. ఇంతకు ముందు అసిత వంశానికి చెందిన దేవలుడు అడిగినప్పుడు ఇవ్వనని చెప్పాను. ఇప్పుడు శంతనుడికి సత్యవతిని ఇచ్చి పెళ్లి చెయ్యమని అడుగుతున్నావు. అందుకు నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. కాని, శంతనుడికి సత్యవతిని ఇచ్చి పెళ్లి చేస్తే అమెకి పుట్టే సంతానానికి సవతి సంతానంగానే గుర్తింపు ఉంటుంది. అది నీ వల్లే ఏర్పడుతుంది. నీకు కోపం వస్తే నీ ఎదుట త్రిమూర్తులు కూడా నిలబడలేరు. నువ్వు అంత పరాక్రమశాలివి. కనుక, ఎలా చేస్తే బాగుంటుందో నువ్వే ఆలోచించి చెప్పు” అన్నాడు.

అది విని దేవవ్రతుడు “ఇక్కడ ఉన్న గొప్ప పేరు గల రాజులందరూ వినండి. నేను తండ్రిగారి కోసం గొప్ప ప్రతిజ్ఞ చేస్తున్నాను. సత్యవతీ శంతనులకి పుట్టిన కొడుకే రాజ్యం చెయ్యడానికి అర్హుడౌతాడు. అతడే మాకందరికీ రాజవుతాడు. అతడే గొప్ప దైవబలంతో కౌరవ వంశాన్ని నిలుపుతాడు” అని గట్టిగా చెప్పాడు.

అక్కడ ఉన్న వాళ్లందరూ నిశ్ఛేష్టులయ్యారు. అది విన్న దాశరాజు “గాంగేయా! నువ్వు అన్ని ధర్మాలు తెలిసినవాడివి కనుక ఇలా మాట్లాడుతున్నావు. రాబోయే కాలంలో నీ కొడుకులు నీలాగే ఉంటారని అనుకోలేము కదా. నువ్వు చేస్తునట్టు వాళ్లు చేస్తారా?” సందేహంగా అడిగాడు.

అది విన్న గాంగేయుడు “నేను కఠినమైన బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తున్నాను” అని ప్రతిజ్ఞ చేశాడు. సత్యవతిని శంతనుడికి ఇచ్చి పెళ్లి చేస్తే గాంగేయుడు అడ్డుగా ఉంటాడు. అతడి సంతానం వల్ల కూడా ఇబ్బందులు ఉంటాయి. చిన్నరాణి అయిన సత్యవతి కొడుకులకే రాజ్యం దక్కాలి అని దాశరాజు అనుకున్నాడు. అందుకోసమే గాంగేయుడు సత్యవతిని తన తండ్రి శంతనుడికి ఇచ్చి పెళ్లి చేస్తే తనకు వారసత్వంగా వచ్చే రాజ్యాన్ని వదిలి పెట్టడము, బ్రహ్మచర్య వ్రతాన్ని స్వీకరించడము అనే ప్రతిజ్ఞ చేశాడు. దేవవ్రతుడి సత్యనిష్ఠకి, తండ్రి ఇష్టాన్ని గ్రహించి తెలివిగా సమస్యని పరిష్కరించినందుకు మెచ్చుకుని దేవతలు, ఋషులు అతడి మీద పూలవాన కురిపించి ‘భీష్ముడు’ అని ప్రశంసించారు.

దాశరాజు సత్యవతిని శంతనుడికి అప్పగించాడు. సూర్యుడిలా ప్రకాశిస్తున్న భీష్ముణ్ని భూప్రజలందరు జయజయధ్వానాలతో కీర్తిస్తున్నారు. భీష్ముడు తన తండ్రి పొందే ఆనందాన్ని మనస్సులోనే తల్చుకుంటూ సంతోషపడుతున్నాడు. విశాలమైన కీర్తిని పొందిన శంతనుడి కొడుకు భీష్ముడు, దాశరాజు కూతురు సత్యవతిని తన తండ్రికి ఇచ్చి పెళ్లి జరిపించాలని హస్తినాపురానికి తీసుకుని వెళ్లాడు.

చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు

భీష్ముడు సత్యవతిని తీసుకుని హస్తినాపురానికి చేరుకున్నాడు. శంతనుడు సత్యవతిని పెళ్లి చేసుకున్నాడు. మానవులు ఎవరూ చెయ్యలేని ప్రతిజ్ఞ చేసిన భీష్ముడి సత్యనిష్ఠకి సంతోషించి ఎప్పుడు కోరుకుంటే అప్పుడే మరణించ కలిగే శక్తిని భీష్ముడికి వరంగా ఇచ్చాడు.

శంతనుడికి సత్యవతి యందు చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అనే పేరుగల ఇద్దరు కొడుకులు పుట్టారు. వాళ్ల చిన్నతనంలోనే శంతనుడు మరణించాడు. భీష్ముడు తండ్రికి చెయ్యవలసిన కర్మలు జరిపించి పెద్దకొడుకు చిత్రాంగదుడికి రాజ్యపట్టాభిషేకం జరిపించాడు. చిత్రాంగదుడు అహంకారంతో మానవులు, రాక్షసులు, గంధర్వులు ఎవరినీ లెక్కచేసేవాడు కాదు. అతడి ప్రవర్తనకి విసిగిపోయిన చిత్రాంగదుడు అనే పేరు గల గంధర్వుడు కౌరవ రాజు చిత్రాంగదుణ్ని తనతో ద్వంద్వ యుద్ధానికి పిలిచాడు. మానవుల నాయకుడు, గంధర్వుల నాయకుడు ఇద్దరు చిత్రాంగదులకీ హిరణ్వతీ నదీతీరంలో ద్వంద్వ యుద్ధం జరిగింది. ఇద్దరూ ఒకళ్లతో ఒకళ్లు తీసిపోకుండా యుద్ధం చేశారు.

జరుగుతున్నది ద్వంద్వ యుద్ధం కనుక భీష్ముడు కలగ చేసుకునేందుకు వీలు కలగలేదు. మాయా యుద్ధం తెలిసిన గంధర్వుడు చిత్రాంగదుడు కౌరవ రాజు చిత్రాంగదుణ్ని చంపేశాడు. తరువాత భీష్ముడు విచిత్రవీర్యుణ్ని కౌరవ రాజ్యానికి రాజుగా పట్టాభిషేకం జరిపించాడు. వసురాజుకి ఉన్న గుణగణాలు కలిగిన విచిత్రవీర్యుడు భీష్ముడు చెప్పినట్టు రాజ్యపాలన చేసి గొప్ప కీర్తి గడించాడు. యువకుడైన విచిత్రవీర్యుడికి పెళ్లి చెయ్యాలని అనుకున్నాడు భీష్ముడు. కన్యని వెతకడం కోసం గూఢచారుల్ని నియమించాడు. కాశీరాజు కూతుళ్లకి స్వయంవరం జరగబోతోందని విని భీష్ముడు ధనుస్సుని తీసుకుని రథమెక్కి కాశీనగరానికి వెళ్లాడు. స్వయంవరం కోసం అక్కడికి వచ్చిన రాజులందరు చూస్తుండగా రాజకుమార్తెల్ని తీసుకుని రథమెక్కి వెళ్లిపోయాడు.

వెడుతూ వెడుతూ అక్కడున్న రాజులకి వినబడేలా “ఈ కన్యల్ని తీసుకుని వెళ్లి నా తమ్ముడు విచిత్రవీర్యుడికి ఇచ్చి వివాహం జరిపిస్తాను. మీలో ఎవరేనా నాకు అడ్డు తగలాలి అనుకుంటే వచ్చి నాతో యుద్ధం చెయ్యచ్చు” అన్నాడు.

కాశీరాజు వైపు చూసి “ఎనిమిది రకాల పెళ్లిళ్లలో క్షత్రియులకి గాంధర్వం, రాక్షసం అనేవి రెండూ చెప్పుకోతగ్గవి. స్వయంవరంలో యుద్ధం చేసి జయించి పెళ్లిచేసుకోడం అంతకంటే విశేషమైంది. కనుక, ఇక్కడున్న రాజులందర్నీ జయించి నేను ఈ కన్యల్ని తీసుకుని వెళ్లడం ధర్మమే” అని చెప్పి భీష్ముడు హస్తినాపురం వైపు బయలుదేరాడు.

అన్ని దేశాలకి అధిపతులైన రాజులు అందరూ ఏకమై ఏనుగులు, అశ్వాలు, కాలిబలాలు ఉన్న మొత్తం సైన్యాన్ని తీసుకుని భీష్ముడి మీద యుద్ధానికి వెళ్లారు. అందరూ ఒకచోట చేరుకుని ఒకళ్ల నొకళ్లు ప్రోత్సహించుకుంటూ, జబ్బలు చరుచుకుంటున్నారు. సముద్రపు హోరుతో సమానంగా శబ్దం చేస్తూ అమితమైన కోపంతో ఆకాశమంతా కప్పేస్తూ రాజులందరూ ఏకమై భీష్ముడి మీదకి బాణాలు విసిరారు. కాని, భీష్ముడి పరాక్రమం ముందు వాళ్ల ప్రయాస విఫలమైంది. అపర పరశురాముడిలా విజృంభించి రాజులందర్నీ తన శౌర్యంతో ఓడించాడు భీష్ముడు. రాజులందరూ వెనక్కి తిరిగి వెళ్లిపోయారు.

సాల్వుడు భీష్ముల యుద్ధము

కాశీరాజు కుమార్తెల్ని తీసుకుని వెళ్లిపోతున్న భీష్ముణ్ని ఎదిరించి ఓడిపోయి రాజులందరూ వెనక్కి వెళ్లిపోయారు. కాని సాల్వుడు ఒక్కడూ ఆగిపోయి ఎదిరించాడు. పూరువంశానికి గొప్పవాడైన భీష్ముణ్ని చూసి “ఈ రాజుల్ని జయించడం అంత గొప్ప కాదు. తిరిగి వెళ్లిపోకుండా నిలబడి నా ఒక్కడితో యుద్ధం చెయ్యి” అన్నాడు.

అతడి మాటలకి భీష్ముడు తన రథాన్ని వెనక్కి తిప్పి ప్రళయ కాలంలో యముడిలా భయంకరమైన ఆకారంతో నిలబడ్డాడు. మిగిలిన రాజులందరూ భీష్ముణ్ని, అతడి సైన్యాన్ని వెనక్కి మళ్లించిన సాల్వుడి ధైర్యాన్ని ఆశ్చర్యంగా చూస్తూ అతడి పరాక్రమాన్ని పొగుడుతూ నిలబడ్డారు.

సాల్వుడు ధైర్యంతో భీష్ముడి మీద వరుసగా వందలు, వేలు, లక్షల సంఖ్యలో బాణాలు వదిలాడు. భరతకులంలో గొప్పవాడైన భీష్ముడు సాల్వుడు వేసిన బాణాల్ని మధ్యలోనే తుంచేశాడు. అతడి కంటే వేగంగా బాణాలు వేసి సాల్వుడి రథాన్ని, రథసారథిని, గుర్రాల్ని నేల మీద పడేటట్లు చేశాడు. సాల్వుడికి తనకు విజయం కలుగుతుందన్న ఆశ పోయింది. వెనక్కి తిరిగి వెళ్లి పోయాడు. భీష్ముడు సాల్వరాజుకి అతడి సైన్యానికి బాధ కలిగించకుండా వదిలేశాడు. స్వయంవరానికి వచ్చిన రాజులందర్నీ జయించి కాశీరాజు కుమార్తెలు అంబ, అంబిక, అంబాలికల్ని తీసుకుని హస్తినాపురానికి వచ్చాడు.

విచిత్రవీర్యుడికి ఆ ముగ్గురితో పెళ్లి చెయ్యాలని అనుకున్నాడు. వాళ్లల్లో పెద్దదైన అంబ భీష్ముడితో “నా పెళ్లి ఇంతకు ముందే సాల్వరాజుతో చెయ్యాలని నా తండ్రి నిర్ణయించుకున్నాడు. అందుకు మేమిద్దరం కూడా ఇష్టపడ్డాము. సాల్వరాజుని ఓడించి నన్ను తీసుకుని వచ్చావు. ఇప్పుడు ఏది ధర్మమో నిర్ణయించుకుని చెయ్యి” అని చెప్పింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here