మహాభారత కథలు-29: విచిత్రవీర్యుడి వివాహము-మరణము

0
11

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

విచిత్రవీర్యుడి వివాహము-మరణము

[dropcap]భీ[/dropcap]ష్ముడు ధర్మం తెలిసిన బ్రాహ్మణులతో అంబ చెప్పిన విషయం గురించి ప్రస్తావించాడు. వాళ్లు అంబని సాల్వరాజుకి ఇచ్చి పెళ్లి చెయ్యమని చెప్పారు. ఆమె పెళ్లి సాల్వరాజుతో జరిపించమని చెప్పి గౌరవంగా కాశీరాజు దగ్గరకి పంపించాడు. అంబిక, అంబాలికల్ని విచిత్రవీర్యుడికి ఇచ్చి అత్యంత వైభవంగా పెళ్లి చేశాడు. భరతవంశ రాజు విచిత్రవీర్యుడు తన ఇద్దరు భార్యలతో విలాసంగా జీవితాన్ని గడుపుతున్నాడు. వివాహమయ్యక రాజ్య పరిపాలన విషయం వదిలేశాడు.

అతడు తెల్లగా అందంగా ఉన్న మేడల్లోను, కొత్తగా పూసిన పూల సువాసనలతో నిండిన ఉద్యానవనాల్లోను, కొండల గుహల్లో ఉన్న విలాసవంతమైన ఇళ్లలోను, రాజహంసలు తిరిగే సరోవరాలు, నడబావుల దగ్గర ఉన్న ఇసుక తిన్నెల మీద ఆడుతూ పాడుతూ తన ఇద్దరు భార్యలతో కలిసి జీవించాడు. ప్రజల మంచి చెడులు పట్టించుకోడం మానేశాడు. విచిత్రవీర్యుడు విలాస జీవితం గడపడం వల్ల అనారోగ్యంతో చిక్కి శల్యమై చివరికి మరణించాడు. భీష్ముడు అతడికి చెయ్యవలసిన పద్ధతిలో కర్మకాండలు జరిపించాడు.

వంశవృద్ధి కోరిన సత్యవతి

భీష్ముడు బాధలో మునిగిపోయిన తల్లిని మరదళ్లని ఓదార్చాడు. అన్ని ధర్మాలు తెలిసిన భీష్ముడు రాజు లేని రాజ్యాన్ని రాజ ప్రతినిధిగా ఉండి పాలిస్తూ ప్రజలకి ఏ లోటూ లేకుండా చూసుకుంటున్నాడు.

ఒకరోజు తల్లి సత్యవతి “నాయనా! శంతనుడి సంతానం అని చెప్పుకోడానికి, పితృదేవతలకి చేసే ఉత్తమ కర్మకి అవసరమైన అధికారము, అంతులేని సామ్రాజ్య భారము అన్నీ నీ మీదే పడ్డాయి. ప్రజలకి వ్యతిరేకత లేని అన్ని ధర్మాల గురించి, లోకంలో జరుగుతున్న మార్పుల గురించి, రాజవంశాలు పుట్టిన విధానాల గురించి నీకు పరిపూర్ణమైన జ్ఞానం ఉంది. మంచి గుణాలు కలిగిన నువ్వే ఈ సమయంలో భరత వంశానికి ఆధారంగా ఉన్నావు. నిన్ను నేను ఒక విషయంలో ఆజ్ఞాపిస్తున్నాను. నా ఆనందం కోసం నువ్వు దాన్ని చెయ్యాలి.

ప్రస్తుతం కురువంశంలో నువ్వు ఒక్కడివే జీవించి ఉన్నావు. ఈ రాజ్యాన్ని నువ్వే తీసుకుని అంతులేని నీ పరాక్రమంతో విస్తరించేలా చెయ్యి. అంతే కాదు, నువ్వు పెళ్లి చేసుకుని సంతానాన్ని కూడ పొందు. గొప్ప భుజబలం కలిగిన వాడివి.. బ్రహ్మదేవుడు మొదలుకుని ఎప్పుడు ఎక్కడా ఆగిపోకుండా పరంపరగా వస్తున్న ఈ వంశం నువ్వు జీవించి ఉండగానే ఆగిపోవడం ధర్మంగా లేదు” అని చెప్పింది

అమె మాటలు విని భీష్ముడు “ఈ రకంగా ఆజ్ఞాపించడం మీకు ధర్మంగా లేదు. అనాడు నేను చేసిన ప్రతిజ్ఞను, బ్రహ్మచర్య వ్రతాన్ని వదిలెయ్యడానికి నేను జ్ఞానం లేని వాణ్ని కాదు. చంద్రుడు తన చల్లదనాన్ని, సూర్యుడు అమితమైన తన కాంతిని, అగ్ని తన వేడిని వదిలితే వదలచ్చు కాని నేను మాత్రం నా తండ్రి కోసం పట్టిన ప్రతిజ్ఞని వదిలిపెట్టను. పంచ మహాభూతాలు తమ గుణాల్ని వదిలిపెట్టనట్లే నా తండ్రి ఉపయోగం కోసం, మీకు ఇవ్వవలసిన కన్యాశుల్కం కోసం ప్రజలు అందరి ముందు చేసిన ప్రతిజ్ఞని వదిలి పెట్టను.

ఆ సంగతి వదిలెయ్యండి. నాకు అన్ని ధర్మాలు తెలుసు. శంతన మహారాజు సంతానం నిలబడి ఉండేట్టు ఒక క్షత్రియ ధర్మాన్ని చెప్తాను. ధర్మం గురించి, లోకంలో జరుగుతున్న విషయాల గురించి బాగా తెలిసిన ప్రముఖులైన బ్రాహ్మణులతో సంప్రదించి ఆ విధంగా చెయ్యండి” అన్నాడు.

అక్కడ ఉన్న అందరూ వినేటట్టు “పరశురాముడు తన తండ్రిని క్షత్రియుడు చంపాడని తెలుసుకుని కోపంతో మండిపడ్డాడు. మహాబలపరాక్రమశాలి, గర్వంతో విర్రవీగేవాడు అయిన హైహయుణ్ని చంపేశాడు. రాజపత్నుల గర్భాల్లో ఉన్న బిడ్డలతో సహా రాజులందర్నీ చంపేశాడు. అటువంటి పరిస్థితుల్లో పూర్వం ధర్మశాస్త్ర ప్రకారం బ్రాహ్మణశ్రేష్ఠులు రాజపత్నులకి సంతానాన్ని ప్రసాదించారు.

దీర్ఘతముడి వృత్తాంతము

పూర్వం ఉతథ్యుడు అనే మహర్షి ఉండేవాడు. అతడి భార్య పేరు మమత. ఇంటికి అభ్యాగతుడుగా వచ్చిన మహర్షి బృహస్పతి తన కోరికని మమతకి చెప్పాడు. అప్పటికి మమత గర్భవతి. బృహస్పతి మాటలు విని అమె గర్భంలో ఉన్న బిడ్డ అది ధర్మానికి వ్యతిరేకమని అరిచి చెప్పాడు. తన కోరికకి అడ్డు తగిలాడని కోపంతో బృహస్పతి జీవితమంతా గుడ్డివాడుగా జీవించమని కడుపులో ఉన్న బిడ్డని శపించాడు.

అతడు దీర్ఘతముడు అనే పేరుతో జన్మించాడు. గుడ్డివాడుగా జీవిస్తూనే వేద వేదాంగాలు నేర్చుకున్నాడు. బ్రాహ్మణ కన్య ప్రద్వేషిణిని పెళ్లి చేసుకున్నాడు. గౌతముడు మొదలైన గొప్ప కొడుకుల్ని అనేకమందిని పొందాడు. ప్రద్వేషిణికి దీర్ఘతముడంటే ఇష్ఠముండేది కాదు. అందుకు కారణం చెప్పమని దీర్ఘతముడు ప్రద్వేషిణిని అడిగాడు.

అతడి సందేహానికి ప్రద్వేషిణి “భార్యని భరిస్తాడు కనుక మగడిని ‘భర్త’ అంటారు. భర్తచేత భరించబడేది కనుక ఇల్లాలిని ‘భార్య’ అంటారు. నిన్ను ఎల్లకాలం నేనే పోషిస్తున్నాను కనుక అది మన విషయంలో తిరగబడింది. ఇంకా నిన్ను ఇలాగే భరించడం నా వల్ల కాదు. కనుక, నువ్వు వేరే ప్రదేశానికి వెళ్ళిపో!” అంది.

దీర్ఘతముడికి కోపం వచ్చింది. “ఇల్లాళ్లు అందరూ దయలేకుండా ప్రవర్తిస్తున్నారు. ఎంత ధనవంతులైనా, ఎంత గొప్ప వంశంలో పుట్టినా భర్తల్ని పోగొట్టుకున్న భార్యలు ఇప్పటి నుంచి అలంకారాలు లేకుండా, తాళి లేకుండా జీవిస్తారుగాక!” అని శపించాడు.

అతడి శాపం విన్న ప్రద్వేషిణి కోపంతో “ఈ ముసలివాడిని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్లండి” అని కొడుకుల్ని ఆజ్ఞాపించింది. దీర్ఘతముడి కొడుకులు తల్లి ఆజ్ఞపించినట్టు ముసలివాడు, గ్రుడ్డివాడు, ఉతథ్యమహర్షి కుమారుడు అయిన దీర్ఘతముణ్ని కట్టెలతో కలిపి కట్టి గంగానదిలో విడిచిపెట్టారు. ఆ మహర్షి గంగానదిలో అనేక దేశాలు దాటి వెళ్లాడు.

ఒకరోజు బలి అనే పేరు గల రాజు గంగానదికి స్నానానికి వెళ్లాడు. కొయ్యలకి కట్టి ఉన్నా కూడా చక్కటి స్వరంతో లక్షణ సహితంగా వేదాల్ని చదువుతూ అలల తాకిడికి ఊగుతూ ఒడ్డుకి చేరిన దీర్ఘతముణ్ని చూశాడు. అతణ్ని ఒడ్డుకి తీసుకుని వచ్చి తాళ్లు విప్పి అతడు ఉతథ్యమహర్షి మమతలకి కుమారుడు దీర్ఘతమ మహర్షిగా తెలుసుకుని వినయంగా నమస్కారం పెట్టాడు.

“మహర్షులలో ఉత్తమమైనవాడా! విద్వాంసులందరితో నమస్కారాలు అందుకునేవాడా! ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కడికి వెడతావు? నువ్వు ఇక్కడికి చేరడం నా పూర్వ జన్మ ఫలితమే. నిన్ను చూడగలిగినందుకు నాకు సంతోషంగా ఉంది. నేను సంతానం లేక బాధ పడుతున్నాను. దయచేసి నాకు సంతాన భాగ్యం కలిగేట్టు అనుగ్రహించు” అని వేడుకున్నాడు.

దీర్ఘతముణ్ణి గౌరవంగా తన రాజ్యానికి తీసుకుని వెళ్లాడు. తన భార్య సుదేష్ణని మహర్షి దగ్గరికి పంపించాడు. పుట్టుకతోనే గ్రుడ్డివాడు, ముసలివాడు, వేదం తప్ప ఇంకేమీ తెలియనివాడు అయిన దీర్ఘతమ మహర్షిని చూసింది. అసహ్యంతో తనకు బదులు తన దాది కుమార్తెని మహర్షి దగ్గరికి పంపించింది. దీర్ఘతముడి అనుగ్రహం వల్ల దాది కూతురుకి కక్షీపదుడు మొదలైన పదకొండు మంది కుమారులు కలిగారు.

వాళ్లని చూసి రాజు సంతోషంతో దీర్ఘతముణ్ని వీళ్లందరూ “నా కొడుకులేనా?” అని అడిగాడు. అందుకు దీర్ఘతముడు “రాజా! ఈ పిల్లలు నీ దాది ముద్దుల కుమార్తె పిల్లలు. వీళ్లు గొప్ప ధర్మపరాయణులు, ఎదురులేని బలశక్తి కలవాళ్లు. నీ వంశంలో పుట్టినవాళ్లు మాత్రం కాదు” అన్నాడు.

బలి మహారాజు సంతానం కోసం ఎదురుచూస్తున్నాడు కనుక మహర్షిని మళ్లీ ప్రార్థించి తన భార్య సుదేష్ణకి సంతానాన్ని ప్రసాదించమని అడిగాడు. మహర్షి సుదేష్ణ దేహన్ని ఒకసారి తన చేతితో తాకి వంశాన్ని నిలిపేవాడు, గొప్ప బలవంతుడు అయిన ఒక కుమారుణ్ని అనుగ్రహించాడు.

సుదేష్ణకి అంగరాజు అనే పేరుగల రాజర్షి జన్మించాడు. ఈ రకంగా ఉత్తమ క్షత్రియుల భార్యలయందు ధర్మ మార్గంలో బ్రాహ్మణులతో అనుగ్రహించబడి జన్మించిన వంశోద్ధారకులైన క్షత్రియులు అనేకమంది ఉన్నారు.

కురువంశాన్ని నిలబెట్టిన వ్యాసుడు

భీష్ముడు సత్యవతికి ఎన్నో ధర్మబద్ధమైన విషయాలు వివరించి చెప్పాడు. మనో నిగ్రహం కలవాడు, లోకపావనుడు, ధర్మపరుడైన బ్రాహ్మణ శ్రేష్ఠుణ్ని అతణ్ని ప్రార్థిస్తే అతడు విచిత్రవీర్యుడి భార్యలకి సంతానం అనుగ్రహిస్తాడు అని సలహా చెప్పాడు.

అతడు చెప్పిన ధర్మసూక్ష్మాలు విని సత్యవతి సంతోషపడింది. పూర్వం తను కన్యగా ఉన్నప్పుడు పరాశర మహర్షి తనను కోరడం.. ఆ మహర్షి వరం వల్ల యమునా నదీ ద్వీపంలో కన్యగా ఉన్న తనకు వ్యాసుడు కుమారుడుగా పుట్టడం.. తనకు ఎప్పుడైనా అవసరమైతే తలుచుకుంటే వస్తానని చెప్పడం.. అతడు అప్పుడే తపస్సు చేసుకోడానికి వెళ్లి పోవడం అన్ని విషయాలు భీష్ముడికి వివరంగా చెప్పింది. కృష్ణద్వైపాయనుడు తన తపస్సు వల్ల అగ్నిహోత్రంలా ప్రకాశిస్తుంటాడు. అన్ని ధర్మాలు తెలిసినవాడు, ఎప్పుడూ సత్యమే పలికేవాడు. అతడు మన వంశానికి పుత్రుల్ని ప్రసాదిస్తాడు అని కూడా చెప్పింది.

ఆ మహర్షి గొప్పతనాన్ని విని భీష్ముడు వ్యాసమహర్షి ఉన్న దిక్కు వైపు తిరిగి నమస్కారం చేసి “పూర్వం లోకాల్ని సృష్టించిన మొదటి బ్రహ్మదేవుడికి ఉన్నంత సామర్థ్యం కలిగిన వేదవ్యాసుడే ఈ కురువంశాన్ని నిలబెట్టాలి. ఇది ఇక్కడున్నవాళ్లందరికీ అంగీకారమే!” అన్నాడు.

సత్యవతి కురువంశాన్ని ఉద్ధరించడానికి వేదవ్యాసుణ్ని మనసులో తలుచుకుంది. పవిత్రమైన నల్లటి కొండ శిఖరం మీద నిజమైన బంగారు తీగల పోగుల్లా గోరోజినం రంగుతో ఉన్న జడలతో ప్రకాశిస్తూ మృదువైన మాటలతో ఇంద్రనీలమణిలా ప్రకాశిస్తూ తల్లి ముందర నిలబడ్డాడు. చాలాకాలం తరువాత వచ్చిన మొదటి కొడుకుని చూసి సత్యవతి అమితమైన ఆనందంతో కౌగలించుకుని కన్నీటి ధారలతో అభిషేకించింది. తల్లి కన్నీళ్లు తుడిచి నమస్కారం చేశాడు వ్యాసమహర్షి. నియమాన్ని అనుసరించి భీష్ముడు వ్యాసమహర్షిని పూజించాడు. విశ్రాంతి తీసుకుంటున్న మహర్షిని క్షేమసమాచారాలు అడిగింది సత్యవతి.

తరువాత “నాయనా! ఆజ్ఞాపించే అధికారం తండ్రికి ఉన్నట్టే తల్లికి కూడా ఉంటుంది. కనుక, నీకు పని చెప్పి చెయ్యమని అడిగే అర్హత నాకు ఉంది. అంతులేని ఈ రాజ్య సంపదకి అర్హుడైనవాడు, వంశాన్ని వృద్ధి చెయ్యగల ఉత్తమమైన ప్రవర్తన కలవాడు, పాపమే లేనివాడు అయిన ఇతడు భీష్ముడు. తన తండ్రి సంతోషం కోసం మొత్తం సామ్రజ్యాన్ని త్యాగం చేసి బ్రహ్మచర్య వ్రతాన్ని జీవిత కాలం ఆచరిస్తానని ఘోర ప్రతిజ్ఞ చేశాడు.

ఈ వంశం ఇంతటితో ఆగిపోవడం అన్ని కాలాలు తెలుసుకోగలిగిన నీకు తెలియనిది కాదు. నీ తమ్ముడిగా చెప్పబడిన విచిత్రవీర్యుడి భార్యలకి కుమారుల్ని అనుగ్రహించు. ఈ వంశం ఎప్పుడూ అంతులేని సంతానంతో తులతూగుతూ ఉండేలా అనుగ్రహించు. నీ వల్ల భరత వంశం చెదిరి పోకుండా స్థిరంగా ఉంటుంది. నాకు, భీష్ముడికి సంతోషంగా ఉంటుంది” అంది.

ఆమె మాటలు విని వ్యాసుడు “తల్లీ! నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఈ ధర్మం పురాణాల్లోను, వేదాల్లోను, ప్రజా జీవితంలోను వినబడుతూనే ఉంది. కాశీరాజు పుత్రికలకి ధర్మ నియమం ప్రకారం కుమారులు కలిగేలా చేస్తాను. నేను చెప్పిన ఈ వ్రతాన్ని ఒక సంవత్సరం పవిత్రమైన మనస్సుతో ఆచరిస్తే ఉత్తమమైన సంతానం కలుగుతుంది” అని చెప్పాడు.

వ్యాసమహర్షి చెప్పినది విని సత్యవతి “రాజ్యంలో రాజు లేకపోతే రాజ్య ప్రజల్లో ధర్మాలేవీ మిగలవు. దేవతలు, ఋషిశ్రేష్ఠులు రాజ్యాన్ని వదిలి వెళ్లిపోతారు. క్రమంగా వానలు కురవడం ఆగిపోతుంది. వస్తువుల విలువలు కూడా పడిపోతాయి. కనుక అలస్యం చెయ్యకుండా వెంటనే రాజ్యం నిలబడేట్టు చెయ్యి. నీ అనుగ్రహం వల్ల కలిగిన కుమారులు పెరిగి రాజ్యం చెయ్యగల నేర్పు వచ్చే వరకు భీష్ముడే తన సామర్థ్యంతో రాజ్యకార్య భారాన్ని నిర్వహిస్తాడు” అని చెప్పింది.

సత్యవతి అంబిక దగ్గరికి వెళ్లి “న్యాయమైన పద్ధతిలో రాజ్యభారాన్ని మొయ్యగల సమర్థుడైన కుమారుణ్ని పొందు. ధర్మాలన్నింటిలోకి వంశాన్ని నిలబెట్టడం ఉత్తమమైన ధర్మం” అని కోడలు అంగీకరించేలా నచ్చచెప్పింది. తరువాత బ్రాహ్మణులకి, దేవతలకి, మహర్షులకి తృప్తిగా విందు భోజనం పెట్టింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here