మహాభారత కథలు-33: పాండురాజు చేసిన తపస్సు

0
12

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

పాండురాజు చేసిన తపస్సు

[dropcap]సి[/dropcap]ద్ధులు, దేవతలు, యక్షులు పూజించే ఎత్తైన శిఖరాలు కలిగిన శతశృంగము అనే పర్వతం మీదకి చేరుకున్నాడు. పవిత్రమైన నడవడికతో, ఎల్లప్పుడూ వ్రతాలు చేస్తూ మహర్షులు ఆశ్చర్యపడేలా ఘోరమైన తపస్సు మొదలుపెట్టాడు. శతశృంగ పర్వతానికి ఉత్తరభాగంలో బ్రహ్మర్షులతో సమానంగా పాండురాజు తపస్సు చేసుకుంటున్నాడు. వెయ్యిమంది మునులు ఉత్తర దిక్కుగా బయలుదేరి శ్రమపడకుండా స్వర్గలోకానికి వెడుతూ కనిపించారు. పాండురాజు వాళ్లని “మీరందరు ఎక్కడికి వెడుతున్నారు?” అని అడిగాడు.

మహర్షులు పాండురాజుతో “ఈ రోజు అమావాస్య కనుక, మహర్షులు, పితృదేవతలు, బ్రహ్మాండంలో ఉన్న వాళ్లు అందరు బ్రహ్మదేవుణ్ని సేవించడానికి బ్రహ్మలోకానికి వెడతారు. అందుకే మేము కూడా అక్కడికే వెడుతున్నాము” అన్నారు. వాళ్ల మాటలు విన్న పాండురాజు తన భార్యలిద్దరితో కలిసి ఆ మునుల వెనక బయలుదేరాడు. సమంగాను మిట్టపల్లాలుగాను ఉన్న భూమి మీద నడుస్తూ వెడుతున్నాడు.

పాండురాజుని చూసి మహర్షులు “నీ భార్యలు సుకుమారమైన శరీరం కలవాళ్లు. కొండలు, మిట్టపల్లాలతో ఉండే గుహల్లోకి వాళ్లు రాలేరు. పైగా ఇవి దేవమార్గాలు. మీరు ఇక్కడే ఆగిపొండి” అన్నారు. ఋషుల మాటలు విని పాండురాజు సామాన్య మనుషులు అక్కడికి వెళ్లలేరని తెలుసుకున్నాడు. మహర్షులతో “సంతానం లేని మహర్షులు కూడా స్వర్గద్వారాన్ని చూడలేరని, పుత్రులు లేనివాళ్లకి పుణ్యలోకం లేదు అని విన్నాను అది నిజమేనా? నాకు సంతానం లేదు అందుకని అడిగాను. సంతానం కలగాలంటే నేను ఏం చెయ్యాలి?” అని అడిగాడు.

పాండురాజు మాటలకి ఋషులు జాలిపడి యోగదృష్టితో చూసి జరగబోయేదాన్ని తెలుసుకున్నారు. పాండురాజుతో “నీకు పుత్రులు ఉండరని ఎందుకు అనుకుంటున్నావు? యమధర్మరాజు, వాయువు, ఇంద్రుడు, అశ్వినీదేవతల వరంతో నీకు సంతానం కలుగుతుంది. పుణ్య లోకాలు కూడా పొందుతావు. కనుక, సంతానం కోసం ఏం చెయ్యలో ఆలోచించు” అన్నారు.

వాళ్ల మాటలు విని పాండురాజు మనస్సులో ఆలోచిస్తున్నాడు. “దేవ, ఋషి, పితృ, మనుష్య ఋణాలు నాలుగింటితో పురుషుడు పుడతాడు. వాటి కోసం చెయ్యవలసిన కర్మలు చేసి ఆ ఋణాలన్నీ తీర్చుకుంటేనే పుణ్య లోకాలు దక్కుతాయి. యజ్ఞాలు చేసి దేవతల ఋణాన్ని; తపస్సు, వేదాధ్యయనం, బ్రహ్మచర్య వ్రతం చేసి ఋషుల ఋణాన్ని; శ్రాద్ధాలు పెట్టి, కొడుకుల్ని పొంది పితృదేవతల ఋణాన్ని; మానవత్వంతో మానవ ఋణాన్ని తీర్చుకోవాలి. నేను ఒక్క పితృఋణం తప్ప మిగిలినవన్నీ తీర్చుకున్నాను. శరీరం నశించగానే ఋణాలన్నీ తీరిపోతాయి. కాని. పితృఋణం మాత్రం శరీరం నశించినా తీరదు. దాన్ని నేను ఎలా తీర్చుకోగలను?” అని ఆలోచించాడు.

మృగం ఇచ్చిన శాపాన్ని తలుచుకున్నాడు. ఒకరోజు ఒంటరిగా కూర్చుని ఉన్న కుంతితో “దానాలు చేసినా, గొప్పగా దక్షిణలు ఇచ్చి యజ్ఞాలు చేసినా సంతానం లేని వాళ్లకి పుణ్య లోకాలకు చేరే అదృష్టం ఉండదు. సంతానం కలిగినవాళ్లే పుణ్యవంతులు. కనుక, నువ్వు మిగిలిన విషయాలన్నీ పక్కనపెట్టి ధర్మ మార్గంలో నాకు సంతానం కలిగేట్లు చెయ్యి” అన్నాడు.

పాండురాజు కుంతితో “ఔరసుడు (వివాహం చేసుకున్న భార్య యందు పుట్టినవాడు), క్షేత్రజుడు (ఇతరులని నియోగించంచడం వల్ల భార్యకు పుట్టినవాడు), దత్తకుడు (ఇతరుల వల్ల కుమారుడుగా ఇవ్వబడినవాడు), కృత్రిముడు (అభిమానంతో పెంచుకున్నవాడు), గూడోత్పన్నుడు (తెలియకుండా భార్యకు ఇతరుల వల్ల పుట్టినవాడు), అపవిద్ధుడు (తల్లితండ్రుల చేత విడువబడి తమ దగ్గర పెరిగినవాడు) అనే అరుగురు కుమారులుగా చెప్పబడతారు. వీళ్లు బంధువులు, ఆస్తిలో భాగస్వాములు కూడా.

కానీనుడు (పెళ్ళికి ముందు భార్య కన్యగా ఉన్నప్పుడు పుట్టినవాడు), సహోఢుడు (వివాహ సమయానికే గర్భిణిగా ఉండి వివాహమైన తరువాత భార్యకు పుట్టినవాడు), క్రీతుడు (తల్లి తండ్రులకి ధనమిచ్చి కొనబడ్డవాడు), పౌనర్భవుడు (భర్త వదిలేసిన లేక మరణించిన స్త్రీకి తనవల్ల పుట్టినవాడు), స్వయందత్తుడు (పుత్రుడుగా ఉంటానని తనంతట తాను వచ్చినవాడు), జ్ఞాతుడు (తన గోత్రంవాడు) అనే ఆరుగురు కుమారులూ బంధువులే కాని, ఆస్తిలో వాళ్లకి భాగస్వామ్యం ఉండదు.

ఈ పుత్రులందరిలో క్షేత్రజుడు ఔరసుడి కంటే కొంచెం తక్కువ. తక్కిన వాళ్లకంటే ఎక్కువ. దేవరన్యాయం వల్ల పుట్టిన క్షేత్రజుడు ఉత్తముడు. కనుక, నువ్వు నేను చెప్పినట్లు విని ధర్మ మార్గంలో క్షేత్రజుల్ని పొందితే పుత్రులు కలవాళ్లు పొందగలిగిన పుణ్య లోకాల్ని నేను కూడా పొందుతాను. పూర్వం కేకయరాజు శరదండాయనికి పుత్రులు లేరు. అందువల్ల అతడి ధర్మపత్ని, అంటే నీ చెల్లెలు శ్రుతసేన బ్రాహ్మణులు చెప్పినట్టు ‘పుంసన’ హోమం చేసింది. దానివల్ల ఆమె దుర్జయుడు మొదలైన ముగ్గురు కొడుకుల్ని పొందింది. సంతానం కలిగితే అంతులేని పుణ్యం కలుగుతుంది. కనుక భగవంతుడి దేవర న్యాయంతో సంతానాన్ని పొందడం ధర్మపరమైన అచారమే” అన్నాడు పాండురాజు.

అతడి మాటలు విని కుంతీదేవి “భరత వంశంలో గొప్పవాడవైన నీకు మేము ధర్మపత్నులం. ఇతరుల గురించి మనస్సులో కూడా అలోచించలేము. నీ దయవల్ల మాకు సంతానం కలుగుతుంది. పౌరాణికులు చెప్పిన ఒక పుణ్య కథని మీకు చెప్తాను వినండి” అని పాండురాజుకి ఆ కథని వినిపిస్తోంది.

రాజు వ్యుషితాశ్వుడు వృత్తాంతము

పూరు వంశంలో నీతి, ధర్మం, అంతులేని బలపరాక్రమాలతో జన్మించిన వ్యుషితాశ్వుడు నూరు అశ్వమేధ యాగాలు చేశాడు. తన భుజబలంతో నాలుగు దిక్కుల్లో ఉన్న రాజులందరినీ జయించి గొప్ప కీర్తితో ప్రకాశించాడు. ఆయన యజ్ఞం చేసేప్పుడు దేవేంద్రుడు మొదలైన దేవతలందరూ ఇష్టంగా వచ్చి చేతులు చాపి అగ్నిదేవుడి ద్వారా ఆహుతులు అందుకునేవాళ్లు. అటువంటి వ్యుషితాశ్వుడు తన భార్యతో అమితమైన కోరికతో ప్రవర్తించి క్షయ రోగంతో మరణించాడు.

అతడి భార్య భద్ర భర్త మరణించడం, సంతానం లేక పోవడం భరించలేక పోయింది. భర్త లేకుండా జీవించడం కంటే చావడమే మంచిది. “నేను ఇక్కడ ఉండలేను నీతోనే వస్తాను. లేకపోతే నీ వంటి గొప్ప రూపంతో ఉండే కొడుకుల్ని ప్రసాదించు” అని వేడుకుంది. దర్భల పరుపుమీద పడుక్కుని తన భర్త శవాన్ని గట్టిగా పట్టుకుని ఏడ్చింది. ఆమె ఏడుస్తున్న సమయంలో అతడి శరీరం నుంచి “నీకు నేను వరమిస్తున్నాను. బాధపడకు లే! గొప్ప సుగుణాలు కలవాళ్లు, మంచి నడవడిక కలిగినవాళ్లు నీకు కొడుకులుగా పుడతారు. అవసర సమయంలో నన్ను తల్చుకో” అని చెప్పాడు.

అతడు చెప్పినట్టే భద్రకి ముగ్గురు సాల్వులు, నలుగురు మద్రలు మొత్తం ఏడుగురు కొడుకులు కలిగారు. కనుక నువ్వు కూడా మా యందు దైవానుగ్రహంతో సంతానాన్ని పొందు” అని కుంతి పాండురాజుకి చెప్పింది.

పాండురాజు కుంతితో తను కూడా ఒక కథ చెప్తాను వినమన్నాడు. “పూర్వం స్త్రీలకి భర్త కట్టడి లేక పోవడం వల్ల సంతానం కోసం స్వేచ్ఛతో ప్రవర్తిస్తూ ఉండేవాళ్లు. అతిథిగా వచ్చిన ఒక వృద్ధుడైన బ్రాహ్మణుడు ఉద్దాలక మహర్షి భార్య మహాపతివ్రతని తనకు సంతానం కావాలని అడిగాడు. అప్పుడు ఆమె కొడుకు శ్వేతకేతుడు కోపంతో అది ధర్మవిరుద్ధమని చెప్పాడు.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here