మహాభారత కథలు-34: స్త్రీ పురుషుల విషయంలో కట్టడి చేసిన శ్వేతకేతుడు

0
11

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

స్త్రీ పురుషుల విషయంలో కట్టడి చేసిన శ్వేతకేతుడు

[dropcap]“ఈ[/dropcap] రోజు మొదలు స్త్రీలు పరపురుషుల్ని కోరకూడదు. వివాహం చేసుకున్న స్త్రీలు ఇతర పురుషులతో కలిస్తే పాపాలు కలుగుతాయి. ఈ కట్టుబాటు లోకంలో ఉన్న మానవులందరికీ చెందుతుంది” అని చెప్పాడు. మానవులందరికీ మంచి జరగాలని ధర్మమూర్తి, బ్రహ్మతో సమానమైన శ్వేతకేతుడు ధర్మపరమైన ఈ కట్టడిని ఏర్పాటు చేశాడు.

ఈ మర్యాదనే ఆయన శిష్యులందరు అనుసరించడం వల్ల లోకంలో ఇంకా ఆ ధర్మం నడుస్తూనే ఉంది. పశువులు, పక్షుల్లో మాత్రం సంతానం కోసం ఏ నియమం లేకుండా ఇష్టం వచ్చినట్టు మగప్రాణితో కలిసి ఉండే పద్ధతే ఉంది. శ్వేతకేతుడు మానవులకి ఏర్పాటు చేసిన ధర్మం వల్ల వివాహం చేసుకున్న భార్యలకు భర్తల మీద భక్తి కలిగి ఉండడం, పరపురుణ్ని వదిలి పెట్టడం అలవాటుగా మారింది.

“భర్త ఆజ్ఞ లేకుండా భార్య ఏ పనీ చెయ్యకూడదు. భర్త ఏది ఆజ్ఞాపించినా అది చెయ్యకుండా ఉండడం కూడా దోషమే” అనే విషయాన్ని మనువు చెప్పాడు. పూర్వం సుదాసుడి కుమారుడు కల్మాషపాదుడు తన భార్య మదయంతిని ఆజ్ఞాపించడం వల్ల ఆమె వసిష్ఠుడి అనుగ్రహంతో అశ్మకుడు అనే పేరుతో కుమారుణ్ని పొందింది. మేము కూడా అలాగే పుట్టాము. కురువంశం వృద్ధి పొందించడానికి మహర్షి కృష్ణద్వైపాయనుడి దయ వల్ల మేము పుట్టాము.

ఇన్ని కారణాలు ఉన్నాయి కనుక, నేను చెప్పినట్టు చెయ్యి” అన్నాడు పాండురాజు. “కుంతీ! ధర్మశాస్త్రాల్లోను, పురాణాల్లోను సంతానం పొందాలి అని చెప్పడం వింటున్నావు కదా! అందువల్ల కీర్తివంతులైన కొడుకుల్ని పొందు. నీకు నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను” అన్నాడు పాండురాజు. కొడుకుల్ని పొందాలన్న ఆరాటంతో పాండురాజు కుంతీదేవిని దీనంగా ప్రార్థించాడు. అతడు చెప్పగా చెప్పగా కొడుకుల్ని కనాలన్న కోరిక కుంతికి కూడా కలిగింది.

చిన్నతనంలో తనకు దుర్వాసుడు ఇచ్చిన మంత్రం గురించి పాండురాజుకి చెప్పింది. ఆ మంత్రాన్ని జపించడానికి అదే సమయమని నిశ్చయించుకుంది. ఏ దేవుణ్ని సేవించాలో పాండురాజుని చెప్పమంది ఆమె మాటలు విన్న పాండురాజు “ “కుంతీ! లోకాలన్నీ ధర్మాన్ని అనుసరించే స్థిరంగా నిలబడి ఉంటాయి. ధర్మంలోను, సత్యంలోను పెద్దవాడైన ధర్మదేవతని ప్రార్థించు” అన్నాడు.

భర్త కోరిక మీద కుంతి భర్తకి మూడుసార్లు ప్రదక్షిణ చేసింది. మనస్సులో మహర్షి దుర్వాసుడు ఇచ్చిన మహామంత్రాన్ని జపించింది తరువాత ధర్మదేవతని ప్రార్థించింది. ధర్మదేవత అనుగ్రహంతో కుంతి గర్భాన్ని ధరించింది.

పాండవులు కౌరవవుల పుట్టుక

ధర్మరాజు జననము

చంద్రుడు జ్యేష్ఠా నక్షత్రంతో కలిసి గొప్ప స్థితిలోను, సూర్యుడు మొదలైన గ్రహలన్నీ శుభస్థానాల్లోను ఉండగా అష్టమి రోజు అభిజిత్ ముహూర్త ప్రారంభంలో ధర్మదేవత అంశవల్ల దిక్కులన్నీ ప్రకాశిస్తుండగా శత్రువులందరినీ జయించ గలిగిన పరాక్రమం కలిగిన ధర్మరాజు పుట్టాడు. గుణవంతుడైన ధర్మరాజు పుట్టిన రోజున బ్రాహ్మణులతో సహా భూమి మీద ఉన్న ప్రాణులన్నీ ఆనందాన్ని పొందాయి.

పాండురాజు మొదటి కొడుకుకి శతశృంగం మీద ఉన్న బ్రాహ్మణులందరూ కలిసి ఎంతో గొప్పగా జాతకర్మ చేశారు. ఆ సమయంలో ఆకాశవాణి “ఇతడు కురువంశానికి రాజు అవుతాడు. ధర్మ ప్రవర్తనలో ఇతడికి ఇతడే సాటి అవుతాడు. దైర్యం వల్ల యుధిష్టురుడు అవుతాడు” అని అతడికి లోకమంతా మెచ్చుకునే విధంగా ‘యుధిష్ఠిరుడు’ అని నామకరణం చేసింది.

గాంధారి తపన

కొడుకుని చూసుకుని ఆనంద పడుతూ పాండురాజు కుంతి, మాద్రిలతో కలిసి శతశృంగ పర్వతం మీద సంతోషంగా ఉన్నాడు. హస్తినాపురంలో ధృతరాష్ట్రుడి వల్ల కుంతి కంటే కూడా ముందే గర్భవతి అయిన గాంధారి సంవత్సరం పూర్తయినా తనకు కానుపు రాలేదని బాధ పడుతోంది. ఎప్పుడు కొడుకుని చూస్తానా అని ఎదురు చూస్తోంది. ఈ లోగా కుంతికి కొడుకు పుట్టాడన్న విషయం తెలిసింది. ఆ బాధతో గాంధారి తన కడుపు మీద బాదుకుంది. అమెకి గర్భస్రావం అయింది.

ఆ వార్త విన్న కృష్ణద్వైపాయనుడు వచ్చి గాంధారిని మందలించాడు. “ఇటువంటి పనిచెయ్యచ్చా? ఎంతో అవివేకంగా ప్రవర్తించావు. ఈ మాంసపు ముద్ద నుంచి నూరుగురు కొడుకులు ఒక కూతురు పుడతారు. నన్ను నమ్మి దీన్ని జాగ్రత్తగా కాపాడుకో. నేను చెప్పింది నిజం. ఈ మాంసపు ముద్దని వేరు వేరుగా నూటొక్క ముద్దలుగా చెయ్యండి. వాటిని నేతితో ఉన్న నూటొక్క కుండల్లో పెట్టండి. చల్లటి నీళ్లతో తడుపుతూ ఉండండి. వీటి నుంచి నూరుమంది కొడుకులు, ఒక కూతురు పుడతారు” అని చెప్పి వెళ్లాడు.

గాంధారి ధృతరాష్ట్రులు వేదవ్యాసుడు చెప్పినట్టు చేయించారు. శతశృంగ పర్వతం దగ్గర ఉన్న పాండురాజు ఒక రోజు కుంతీదేవిని చూసి “నువ్వు గొప్ప నడవడిక, వేగము, బలము కలిగిన కుమారుణ్ని ఇమ్మని వాయుదేవుణ్ని ప్రార్థించు! అతడు తన భుజబల పరాక్రమంతో కురువంశాన్ని రక్షిస్తాడు” అని చెప్పాడు.

పాండురాజు ఆజ్ఞప్రకారం కుంతీదేవి వాయుదేవుణ్ని ప్రార్థించింది. అతడి దయవల్ల ఏడాది పూర్తవగానే వాయుదేవుడి అంశతో మహాబలవంతుడైన కొడుకు పుట్టాడు. శతశృంగ పర్వతం మీద నివసించే మహర్షులందరూ అతడికి జాతకర్మ చేశారు. అతడి అధికమైన బలపరాక్రమాలు చూస్తూ సంతోషిస్తూ ఉండగా ఆకాశవాణి అతడికి ‘భీమసేనుడు’ అని నామకరణం చేసింది.

దుర్యోధనుడు అతడి తమ్ముళ్లు పుట్టుక

వైశంపాయన మహర్షి జనమేజయుడికి ఇంతవరకు చెప్పి “జనమేజయమహారాజా! వాయువు అంశవల్ల భీముడు పుట్టినరోజునే హస్తినాపురంలో గాంధారీ ధృతరాష్ట్రులకి కలి అంశతో పెద్దకొడుకుగా గొప్పవాడైన ‘దుర్యోధనుడు’ పుట్టాడు. అతడు పుట్టగానే క్రూరమృగాల అరుపులు, నక్కల కూతలు, పెద్ద పెద్ద గుడ్లగూబల ఝూంకారాలు, గాడిదల ఓండ్రలు, భూమి ఆకాశం దద్దరిల్లేలా వినిపించాయి. ఆకాశం నుంచి రక్తపు వర్షం భయంకరంగా కురిసింది.

దుర్యోధనుడు పుట్టాక దృతరాష్ట్రుడికి వైశ్యకులానికి చెందిన మరొక భార్య వల్ల యుయుత్సుడు అనే కొడుకు పుట్టాడు. ఆ తరువాత గాంధారికి వరుసగా రోజుకి ఒక్కడుగా మొత్తం నూరుమంది కొడుకులు పుట్టారు.

నూరుమంది పేర్లు కూడా మీకు తెలియచేస్తాను. దుర్యోధనుడు, దుశ్శాసన, దుస్సహ, దుశ్శల, జలసంధ, సమ, సహ, విందానువింద, దుర్ధర్ష, సుబాహు, దుష్ప్రధర్షణ, దుర్మర్షణ, దుర్ముఖ, దుష్కర్ణ, కర్ణ, వివింశతి, వికర్ణ, శల, సత్త్వ, సులోచన, చిత్రోపచిత్ర, చిత్రాక్ష, చారుచిత్ర, శరాసన, దుర్మద, దుర్విగాహ, వివిత్సు, వికటాన, నోర్ణనాభ, సునాభ, నందోపనందక, చిత్రబాణ, చిత్రవర్మ, సువర్మ, దుర్విమోచనాయోబాహు, మహాబాహు, చిత్రాంగ, చిత్రకుండల, భీమవేగ, భీమబల, బలాకి, బలవర్ధ, నోగ్రాయుధ, సుషేణ, కుండధార, మహోదర, చిత్రాయుధ, నిషంగి, పాశి, బృందారక, దృఢవర్మ, దృఢక్షత్త్ర, సోమకీర్త్యనూదర, దృఢసంధ, జరాసంధ, సద, సువా, గుగ్రశ్రవ, ఉగ్రసేన, సేనానీ, దుష్పరాజ, యాపరాజిత, కుండశాయి, విశాలాక్ష, దురాధర, దుర్జయ, దృఢహస్త, సుహస్త, వాతవేగ, సువర్చ, ఆదిత్యకేతు, బహ్వాశి, నాగదత్తాగ్రయాయి, కవచి, క్రధన, కుండి, ధనుర్ధ, రోగ్ర, భీమరథ, వీరబాహ్వ, లోలు, పాభయ, రౌద్రకర్మ, ధృడరథాశ్ర, యానాధృష్య, కుండభేది, విరావి, ప్రమథ, ప్రమాథి, దీర్ఘరోమ, దీర్ఘబాహు, వ్యూఢోరు, కనకధ్వజ, కుండాశి, విరజసు మొదలైన కొడుకులు కలిగారు.

తరువాత వాళ్లందరికీ చెల్లెలుగా ‘దుశ్శల’ అనే కూతురు పుట్టింది. ఆమె వల్ల దౌహిత్రులు. (దుహిత అంటే కూతురు. కూతురు పిల్లలు దౌహిత్రులు) కలగడం వల్ల కలిగే పుణ్యాలు కూడా పొందుతాను అని సంతోషించాడు ధృతారాష్ట్రుడు. నూటొక్క మంది పిల్లల్ని పొంది ఆనందంగా ఉన్న ధృతరాష్ట్రుడి దగ్గరికి భీష్ముడు, విదురుడు మొదలైన బంధువులు, పురోహితులు, గొప్ప బ్రాహ్మణులు వచ్చారు. అతడితో ఒంటరిగా కూర్చుని మాట్లాడారు.

“ధృతరాష్ట్ర మహారాజా! దుర్యోధనుడు పుట్టినప్పుడు ఎన్నో రకాల దుశ్శకునాలు కనిపించాయి. అలా కనిపిస్తే ఆ పుట్టినవాడు లోకాన్ని నాశనం చేస్తాడని జ్ఞానులు అంటారు. కులానికి, లోకాలకీ కీడు కలిగించే ఈ దుర్యోధనుణ్ని వదిలేసి కులాన్ని, లోకాన్ని రక్షించడం మంచి పని కదా? కనుక ఇప్పుడే దుర్యోధనుణ్ని విడిపెట్టు. నీకు ఇంకా నిండుగా నూరు మంది పిల్లలు పెరుగుతున్నారు” అన్నారు. కాని, ధృతరాష్ట్రుడు కొడుకు మీద ఉన్న ప్రేమతో వాళ్ల మాటల్ని లక్ష్యపెట్టలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here