మహాభారత కథలు-37: కురుపాండు కుమారులకి గురువుగా ద్రోణుడు

0
12

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

కురుపాండు కుమారులకి గురువుగా ద్రోణుడు

[dropcap]భీ[/dropcap]ష్ముడు తన మనుమలందరినీ ద్రోణుడికి చూపించి “ద్రోణాచార్యా! విలువిద్యలోను, పరాక్రమంలోను, నీతిలోను పరశురాముడు కూడా నీకు సమానం కాదని విన్నాను. వీళ్లందరికీ గురువుగా ఉండి విలువిద్య నేర్పించు” అన్నాడు.

ద్రోణాచార్యుడు కౌరవ, పాండవ రాజకుమారుల్ని తన శిష్యులుగా స్వీకరించాడు. వాళ్లందర్నీ దగ్గరికి తీసుకుని “నా దగ్గర అస్త్ర శస్త్ర విద్యలన్నీ నేర్చుకున్నాక నాకు ఉన్న ఒక కోరికని మీరు తీర్చాలి. దాన్ని మీలో ఎవరు తీరుస్తారు?” అని అడిగాడు.

కౌరవులు అందరూ మౌనంగా ఉండిపోయారు. అర్జునుడు మాత్రం తను తీరుస్తానన్నాడు. తన కోరికని తీరుస్తానని ముందుకు వచ్చిన అర్జునుణ్ని ప్రేమగా కౌగలించుకున్నాడు ద్రోణుడు. ఎంతో సంతోషంగా కురుకుమారులందరికీ విలువిద్య నేర్పిస్తున్నాడు ద్రోణుడు. వాళ్లతో కలిసి అనేక దేశాలనుంచి వచ్చిన రాజకుమారులు కూడా ద్రోణుడి దగ్గర విలువిద్య నేర్చుకుంటున్నారు. సూతుడి కుమారుడు రాధేయుడు మాత్రం విలువిద్యా నైపుణ్యంలో అర్జునుణ్ని ద్వేషిస్తూ దుర్యోధనుడి పక్షంలో ఉన్నాడు.

అర్జునుడు శస్త్రాస్త్ర విద్యల్లో ఆరితేరుతూ వినయంతో ప్రవర్తిస్తూ గురుపూజ చేస్తూ ద్రోణుడికి దగ్గరయ్యాడు.  విద్య నేర్చుకోడంలో అర్జునుడితో విరోధం ఉన్న అశ్వత్థామ చీకట్లో బాణాలు వెయ్యడం అర్జునుడు నేర్చుకోకూడదని అనుకున్నాడు. అందుకోసం వంటవాణ్ని పిలిచి అర్జునుడికి చీకట్లో అన్నం పెట్టవద్దని చెప్పాడు. వంటవాడు అశ్వత్థామ చెప్పినట్టు చేస్తున్నాడు.

ఒకరోజు ఇంద్రుడి కుమారుడైన అర్జునుడు అన్నం తింటూ ఉండగా పెద్ద గాలి వచ్చి దీపం ఆరిపోయింది.  దీపం లేకపోయినా అలవాటు ప్రకారం చీకట్లోనే అన్నం తిన్నాడు అర్జునుడు. అప్పుడు అతడికి చీకట్లో కూడా సాధన చేసుకోవచ్చని అర్ధమైంది. పట్టుదలతో చీకట్లోనే బాణాలు వేస్తూ సాధన చెయ్యడం మొదలుపెట్టాడు. ఒకరోజు రాత్రి ద్రోణుడికి అర్జునుడి వింటి అల్లెతాడు ధ్వని వినిపించింది. ద్రోణుడు సంతోషంగా అర్జునుడి దగ్గరికి వచ్చాడు.

అస్త్రవిద్య నేర్చుకోవడంలో అర్జునుడి పట్టుదలకి, అతడి గురుభక్తికి సంతోషించిన ద్రోణుడు అతడి కంటే గొప్ప విలుకాడు ఎక్కడా లేనంత గొప్పగా అర్జునుణ్ని తయారు చేస్తానని చెప్పాడు. ద్వందయుద్ధము, సంకుల యుద్ధము వాటి పద్ధతులు; రథం మీద, నేలమీద, గుర్రాలమీద, ఏనుగులమీద ఉండి గట్టిగాను, చిత్రంగాను, చక్కగా ఉండే స్థితుల్లో బాణాలు వెయ్యడం నేర్పించాడు. అనేక రకాల వ్యూహాల్నిభేదించే ఉపాయాలు, బాణాల్ని ప్రయోగించే రహస్యాలు అర్జునుడికి ప్రేమగా నేర్పించాడు. ఒకప్పటి పరశురాముడు కూడా విలువిద్యలో ఇంత గొప్పగా ఉండేవాడు కాదు అని పొగడ్తలు అందుకునే విధంగా అర్జునుణ్ని తీర్చి దిద్దాడు.

ద్రోణుణ్ని ఆరాధించి విలువిద్య నేర్చుకున్న ఏకలవ్యుడు

విలువిద్యే కాకుండా గద, ధనుస్సు, ఈటె, కత్తి, తోమరం, కుంతం, శక్తి, మొదలైన అనేక విధాలైన ఆయుధ విద్యల్ని రాకుమారులందరికీ నేర్పిస్తున్నాడు ద్రోణాచార్యుడు. అతడి కీర్తి విని హిరణ్యధన్వుడు అనే ఎరుకల రాజు కొడుకు ఏకలవ్యుడు విలువిద్య నేర్చుకోవాలని వచ్చాడు. ఏకలవ్యుడు ఎరుకలవాడి కొడుకు కనుక తన శిష్యుడిగా స్వీకరించనన్నాడు ద్రోణాచార్యుడు. ఏకలవ్యుడు ద్రోణుడికి నమస్కరించి తను వచ్చిన దారిన అడవికి వెళ్లిపోయాడు. అడవిలో మట్టితో ద్రోణాచార్యుడి బొమ్మని చేసి పెట్టుకుని ఆ బొమ్మే గురువుగా అనుకుని భక్తి వినయాలతో దానికి ప్రదక్షిణ నమస్కారాలు చేసాడు. తరువాత ఆపకుండా విలు విద్యని సాధన చేసి తనకు తానే విలువిద్యా రహస్యాలన్నీ తెలుసుకున్నాడు.

హస్తినాపురంలో పాండవులు, కౌరవులు కలిసి ద్రోణాచార్యుడి అనుమతి తీసుకుని వేటకోసం అడవికి వెళ్లారు. బాగా వేగంగా పరుగెత్తగల వేటకుక్కల్ని, సేవకుల్ని కూడా వెంటపెట్టుకుని వెళ్లారు. వాళ్లందరూ అడవిలో స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఒక వేటకుక్క తప్పిపోయి పరుగెత్తుకుంటూ అడవిలోకి వెళ్లి ఎవరూ కనిపించక మొరగడం మొదలుపెట్టింది. ఆ అరుపు విని ఏకలవ్యుడు వరుసగా ఏడు బాణాలు దాని నోట్లోకి వెళ్లేట్టు చాకచక్యంతో కొట్టాడు. అది నోట్లో ఉన్న బాణాలతో పరుగెత్తుకుంటూ కురుకుమారుల దగ్గరికి వెళ్లింది. దాని నోట్లో ఉన్న బాణాలు చూసి ఇంత చాకచక్యంగా ఎవరు కొట్టి ఉంటారా అని రాజకుమారులు ఆశ్చర్యపోయారు. బాణాలు వేసినవాళ్లని వెతుక్కుంటూ వస్తున్నారు.

పదును పెట్టిన బాణాన్ని చేత్తో పట్టుకుని బలిష్ఠమైన, పొడవైన, ధూళితో కప్పబడి నల్లటి రంగు కలిగిన శరీరంతో, జింక చర్మాన్ని వస్త్రంగా ధరించి, అస్త్రవిద్యలో ఆరితేరిన ఒక అడవి బాలుడు ఎదురుగా కనిపించాడు. రాజకుమారులందరు అతణ్ని చూసి అసూయతో ముఖాలు పక్కకి తిప్పుకున్నారు. తరువాత ఒకరి ముఖం ఒకళ్లు చూసుకుని అతడి వైపు చూసి “ఎవరు నువ్వు? ఎవరి దగ్గర విలువిద్య నేర్చుకున్నావు?  విలువిద్యలో నీకు ఉన్న ప్రావీణ్యత మాకు చాలా నచ్చింది” అన్నారు.

ఆ బోయవాడు “నేను నేను కిరాత వంశంలో పుట్టాను. నాతండ్రి హిరణ్యధన్వుడు అనే పేరుగల కిరాతరాజు. ద్రోణాచార్యుడికి శిష్యుణ్ని. నా పేరు ఏకలవ్యుడు” అన్నాడు.

ఆ మాటలు విని రాజకుమారులందరు ద్రోణాచార్యులవారి దగ్గరికి వచ్చి అతడు చెప్పిన విషయాన్ని చెప్పారు. ఒకరోజు గురువుగారు ఒక్కరే ఉన్నప్పుడు అర్జునుడు వెళ్లి “ఆచార్యా! మీరు విలువిద్యలో నాకంటే గొప్పవాడు మరొకడు లేకుండా ఉండేలా నాకు విలువిద్య నేర్పుతాను అని చెప్పారు. కాని, ఇప్పుడు ముల్లోకాల్లోను లేనంత గొప్పవాడైన విలుకాడు ఒక ఎరుకలవాడిని చూశాము. నిజంగా అతడు నాకంటే, మీకంటే కూడా గొప్ప బలవంతుడు, గొప్ప విలుకాడు కూడా. అతడు మీకు ప్రియ శిష్యుణ్నని కూడా చెప్పాడు” అన్నాడు.

అర్జునుడు మాటలు విని ద్రోణుడు ఆశ్చర్యంతో అతణ్ని చూపించమని అడిగాడు. అర్జునుడితో కలిసి అడవికి బయలుదేరాడు ద్రోణాచార్యుడు. ఇద్దరూ కలిసి విలువిద్య అపకుండా సాధన చేస్తున్న ఏకలవ్యుడి దగ్గరకి వెళ్లారు. ఏకలవ్యుడు వాళ్లిద్దర్ని చూసి ఎదురుగా వచ్చి ద్రోణాచార్యుడికి వినయంగా వంగి నమస్కారం చేశాడు. తరువాత  “నేను మీ శిష్యుణ్ని, మీకు సేవ చేస్తూ ఈ విలువిద్య నేర్చుకున్నాను” అన్నాడు.

అతడి మాటలు విన్న ద్రోణాచార్యుడు “నేను నీ గురువుని కదా.. మరి నాకు గురుదక్షిణ ఇస్తావా?” అన్నాడు. ఏకలవ్యుడు తన ధనాన్ని, సేవకుల్ని గురువుగారి ఎదురుగా పెట్టి, తనతో సహా అన్నిటినీ ఆయనకి సమర్పించి గురువుగారికి ఎదురుగా చేతులు కట్టుకుని నిలబడ్డాడు.

అతణ్ని చూసిన ద్రోణుడు ఏకలవ్యుడితో “నువ్వు నాకు గురుదక్షిణ ఇవ్వాలి” మళ్లీ అన్నాడు. గురువుగారి మాటలు విని ఏకలవ్యుడు గురువుగారు తనని గురుదక్షిణ అడగడమే మహాభాగ్యం అనుకుని “గురువర్యా! ఇది నా దేహం, ఇది నా ధనం, ఇది నా సేవకుల సమూహం. వీటిలో మీరు దేన్ని అడిగితే దాన్ని సంతోషంగా ఇస్తాను తీసుకోండి” అన్నాడు.

అతడి మాటలు విని ద్రోణాచార్యుడు “నీ కుడిచేతి బొటన వేలిని కోసి నాకు గురుదక్షిణగా ఇయ్యి!” అన్నాడు. వెంటనే ఏకలవ్యుడు తన కుడిచేతి బొటనవేలిని కోసి వినయంతో గురువుగారికి దక్షిణగా ఇచ్చాడు. కుడిచేతి బొటన వేలిని కోసి ఇవ్వడం వల్ల ఏకలవ్యుడికి విలువిద్యలో ఉన్న ప్రావీణ్యం పోయింది.    అందువల్ల అర్జునుడికి సంతోషం కలిగింది. ఏకలవ్యుడి బొటన వేలుని గురుదక్షిణగా తీసుకుని “విలువిద్యలో నీ కంటే గొప్పవాళ్లెవరూ లేనట్టు నీకు విలువిద్యని నేర్పుతాను” అని అర్జునుడికి ఇచ్చిన మాటని నెరవేర్చాడు  ద్రోణాచార్యుడు.

కురుపాండు కుమారుల విలువిద్యా నైపుణ్యాన్ని పరీక్షించిన ద్రోణుడు

రాజకుమారులందరికి ద్రోణాచార్యుడు సమానంగానే విలువిద్య నేర్పినా అర్జునుడు మాత్రం సాధన చేసి అందరికంటే గొప్ప విలుకాడుగా నిలిచాడు. భీముడికి ఉన్న బలాన్ని, అర్జునుడికి విలువిద్యలో ఉన్న నైపుణ్యాన్ని చూసి కౌరవులకి చాలా అసూయ కలిగింది.

ఒకరోజు ద్రోణాచార్యుడు కౌరవులు, పాండవులు తన దగ్గర నేర్చుకున్న విద్యలో ఎంత నైపుణ్యాన్ని సంపాదించారో తెలుసుకునేందుకు ఒక పరీక్ష పెట్టాడు. ‘భాస’ అనే పక్షిని తయారు చేసి ఒక చెట్టు కొమ్మ చివర కట్టాడు. దాన్ని శిష్యులందరికీ చూపించాడు. “నేను చెప్పినప్పుడు మీరు మీ ధనుస్సులు ఎక్కుపెట్టి ఆ పక్షి తలని కొట్టండి. నేను ఒక్కొక్కళ్లనే పిలుస్తాను!” అన్నాడు.

మొదట ధర్మరాజుని పిలిచి “చెట్టు కొమ్మ చివర ఉన్న పక్షిని చూసి నేను చెప్పినప్పుడు కొట్టు!” అన్నాడు. ధర్మరాజు గురువుగారు చెప్పినట్టు పక్షిని కొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు ద్రోణుడు “ధర్మరాజా! చెట్టు కొమ్మ చివర ఉన్న పక్షి తలని స్పష్టంగా చూశావా?” అని అడిగాడు. ధర్మారాజు “స్పష్టంగా చూస్తున్నాను” అన్నాడు. ద్రోణుడు ధర్మరాజుతో “ధర్మరాజా! చెట్టుని, కొమ్మని, నన్ను, నీ తమ్ముళ్లని చక్కగా చూశావా?” అని అడిగాడు. ధర్మారాజు “గురువర్యా పక్షితో సహా అన్నింటినీ చక్కగా చూశాను” అన్నాడు.  ద్రోణుడు ధర్మరాజుని “నీ దృష్టి చెదిరింది. నువ్వు పక్షి తలని కొట్టలేవు పక్కకి తప్పుకో!” అన్నాడు.

కౌరవకుమారుల్ని, అర్జునుడు తప్ప మిగిలిన పాండవుల్ని అందరినీ పిలిచి అదే ప్రశ్న అడిగాడు. వాళ్లందరూ ధర్మరాజు ఇచ్చిన సమాధానమే ఇచ్చారు. విదేశాల నుంచి వచ్చిన రాజకుమారుల్ని కూడా అదే ప్రశ్న అడిగాడు. అందరూ ఒకే విధంగా సమాధానం చెప్పారు. అందర్నీ పక్కకి తప్పుకోమన్నాడు.

చివరగా ద్రోణుడు అర్జునుణ్ని పిలిచి అందర్నీ అడిగినట్టే అడిగాడు. అర్జునుడు “పక్షి తల తప్ప నాకు ఇంకేదీ కనిపించడం లేదు” అని చెప్పాడు.  ద్రోణుడు అర్జునుడి సూక్ష్మదృష్టిని తెలుసుకుని “గురి చూసి కొట్టు” అని ఆజ్ఞాపించాడు. గురువు చెప్పినట్టు అర్జునుడు బాణాన్ని వదిలాడు. వెంటనే పక్షితల తెగి చెట్టు కొమ్మ నుంచి నేల మీద పడింది.

తను ఏర్పాటు చేసిన పక్షి తలని కొట్టిన అర్జునుడి నిశ్చలమైన దృష్టికి, గురిని కొట్టగలిగిన అతడి సామర్థ్యానికి మెచ్చుకున్నాడు ద్రోణుడు. తరువాత అతడికి అనేక విలువిద్యా రహస్యాలు బోధించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here