మహాభారత కథలు-38: కృపాచార్యుల వృత్తాంతము

0
15

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

కృపాచార్యుల వృత్తాంతము

[dropcap]వై[/dropcap]శంపాయన మహర్షి “జనమేజయ మహారాజా! గౌతముడు అనే పేరుగల మహర్షికి గొప్ప తేజస్సు, బాణాలు కలిగిన శరద్వంతుడు పుట్టాడు. అతడు వేదాలు చదవడానికి ఇష్టపడలేదు. గొప్ప తపస్సు చేశాడు. బ్రాహ్మణులు వేదాన్ని చదివినట్టు ధనుర్వేదాన్ని సాధించాడు. అప్పటికీ ఆపకుండా మహానిష్ఠతో తపస్సు చేస్తూనే ఉన్నాడు.

అతడి తపస్సుకి ఇంద్రుడు భయపడ్డాడు. అతడి తపస్సుకి భంగం కలిగించాలనే ఉద్దేశంతో ‘జలపద’ అనే పేరు గల సౌందర్యవంతురాలైన కన్యని అతడి దగ్గరికి పంపించాడు. శరద్వంతుడు అందమైన సుకుమారమైన జలపదని చూసి మోహంలో పడ్డాడు. అతడి చేతిలో ఉన్న ధనుర్బాణాలతో పాటు అతడి వీర్యం కూడా కింద పడింది. అంతలోనే మనస్సుని స్వాధీన పరుచుకుని శరద్వంతుడు ఆశ్రమాన్ని విడిచిపెట్టి మరో చోట తపస్సు చేసుకోడానికి వెళ్లిపోయాడు.

ఆయన వీర్యం రెల్లుదుబ్బులో రెండు భాగాలుగా పడింది. దాన్నుంచి ఒక కూతురు, ఒక కొడుకు పుట్టారు. ఒకరోజు శంతనమహారాజు వేటకోసం అడవికి వెళ్లాడు. అతడితో కలిసి వేటకి వెళ్లిన అతడి సేవకులు రెల్లు దుబ్బుల్లో ఉన్న పిల్లల్ని, పక్కనే పడి ఉన్న ధనుర్బాణాల్ని, జింకచర్మాన్ని చూశారు. పిల్లలిద్దరు ధనుర్వేదపండితుడైన బ్రాహ్మణుడి సంతానమనుకుని శంతన మహారాజుకి చూపించారు. మహారాజు వాళ్లని తనతో తీసుకుని వచ్చి పెంచాడు. శంతనమహారాజు కృపతో పెంచడం వల్ల కృపుడు. కృపి అని పిలవబడ్డారు.

కొంతకాలం తరువాత అతి పవిత్రుడైన శరద్వంతుడు వాళ్లిద్దర్నీ చూసి తన సంతానంగా తెలుసుకున్నాడు. కృపుడికి ప్రేమతో ఉపనయనం చేశాడు. అతడికి వేదాలు నేర్పించి ఆత్మజ్ఞానం కలిగినవాడిగా చేశాడు. తనే గురువుగా రథ, గజ, తురగ, పదాతి బలాలకి సంబంధించిన ధనుర్వేదాన్ని, అన్ని రకాలైన అస్త్రాల్ని ప్రయోగించడంలో నైపుణ్యం కలిగేలా నేర్పించాడు. కృపుడి నైపుణ్యం చూసి ధనుర్వేద పండితులందరూ అతణ్ని పొగిడారు.

భీష్ముడు కృపుణ్ని రప్పించి గౌరవించి తన మనుమలకి ఆచార్యుడిగా విలువిద్య నేర్పడానికి నియమించాడు. పాండవులు, కౌరవులు, యాదవులు మొదలైన రాజకుమారులు అందరూ కృపాచార్యుడి శిక్షణలో విలువిద్యలో నేర్పరులయ్యారు. ఈ విధంగా కృపుడు ఆచార్యుడిగా ప్రసిద్ధికెక్కాడు.

ద్రోణాచార్యుడు వృత్తాంతము

ద్రోణాచార్యుడు జననము

జనమేజయ మహారాజుతో వైశంపాయన మహర్షి కౌరవులకి పాండవులకి ఆచార్యుడైన ద్రోణాచార్యుడి గురించి చెప్తాను, వినమన్నాడు. మంచి నడవడిక కలిగినవాడు, ప్రజలందరితో పూజింపబడేవాడు, పవిత్రుడైన భరద్వాజమహర్షి గంగానది పుట్టిన ప్రదేశంలో కూర్చుని తపస్సు చేసుకుంటున్నాడు.

ఒకరోజు భరద్వాజ మహర్షి గంగానదిలో స్నానం చెయ్యడానికి వెళ్లినప్పుడు అదే ప్రదేశంలో స్నానం చేస్తున్న ఘ్రుతాచి అనే అప్సరసని చూసి ఇష్టపడ్డాడు. అతడికి కలిగిన మోహం వల్ల జారి పడిన వీర్యాన్ని ఒక కలశంలో భద్రపరిచాడు. శుక్రుడి అంశతో అతడికి పుణ్యాత్ముడు, ధర్మం తెలిసిన ద్రోణుడు కుమారుడుగా పుట్టాడు. (వీర్యాన్ని ద్రోణంలో భద్రపరిచాడు కనుక ’ద్రోణుడు’ అనే పేరుతో పిలవబడ్డాడు).

భరద్వాజ మహర్షి స్నేహితుడు వృషతుడు పాంచాలదేశాన్ని పాలిస్తున్నాడు. అతడు గొప్ప తపస్సంపన్నుడు. ఒకరోజు పువ్వుల్ని కోస్తున్న మేనక అనే అప్సరసని చూసి ఇష్టపడ్డాడు. అతడికి మరుత్తుడి అంశతో ద్రుపదుడు అనే కుమారుడు కలిగాడు (కింద పడిన వీర్యాన్ని పాదంతో తొక్కి ఉంచాడు కనుక ఆ బాలుణ్ని ’ద్రుపదుడు’ అని పిలిచారు).

వృషతుడు ద్రుపదుణ్ని భరద్వాజమహర్షి ఆశ్రమంలో ఉంచి తన రాజ్యానికి వెళ్లిపోయాడు. వృషతుడు ద్రోణుడితో కలిసి వేదాలు చదివి, విలువిద్యలో ప్రావీణ్యాన్ని పొందాడు. తరువాత ద్రుపదుడు పాంచాల దేశానికి రాజయ్యాడు. ద్రోణుడు అగ్నివేశ్యుడు అనే మహర్షి దగ్గర ధనుర్విద్యని నేర్చుకున్నాడు. ఆయన అనుగ్రహంతో ఆగ్నేయాస్త్రము మొదలైన అనేకమైన దివ్యాస్త్రాల్ని పొందాడు.

భరద్వాజ మహర్షి తన కుమారుడు ద్రోణుడికి కృపితో పెళ్లి జరిపించాడు. ఆ దంపతులకి అశ్వత్థామ అనే కొడుకు కలిగాడు. జమదగ్ని కొడుకైన పరశురాముడు అందరికీ ధనమిస్తున్నాడని ద్రోణుడికి తెలిసింది. తను కూడా ధనం కోసం పరశురాముడి దగ్గరికి వెళ్లాడు. మంచి నడవడిక కలవాడు, లోకంలో అందరికంటే గొప్పవాడు, తపస్సంపన్నుడు అయిన పరశురాముడు మహేంద్ర పర్వతం మీద తపస్సు చేస్తున్నాడు.

అతడి దగ్గర వినయంగా నిలబడి “నా పేరు ద్రోణుడు. ధనం కోసం మీ దగ్గరికి వచ్చాను” అన్నాడు. అతడి మాటలు విని పరశురాముడు “అందరితో కీర్తింపబడుతున్న ద్రోణా! నా దగ్గర ఉన్న ధనం మొత్తాన్ని బ్రాహ్మణులకి ఇచ్చేశాను. సముద్రం వడ్డాణంగా కలిగిన భూమిని మొత్తాన్ని జయించి కశ్యపమహర్షికి ఇచ్చేశాను. ఇప్పుడు నా దగ్గర మిగిలి ఉన్నవి నా శరీరము, శస్త్రాలు, అస్త్రాలే. వీటిలో ఏది కావాలంటే అది అడుగు. నీకు తప్పకుండా ఇస్తాను” అన్నాడు.

పరశురాముడు చెప్పింది విని “మహర్షీ! అన్ని ధనాల్లోకి విలువైనవి అస్త్రాలు శస్త్రాలే! వీటిని నాకు ఇస్తే సంతోషంగా తీసుకుని వెడతాను!” అన్నాడు ద్రోణుడు. పరశురాముడి దగ్గర దివ్యాస్త్రాలు తీసుకుని, వాటిని ప్రయోగించే రహస్యాలన్నీనేర్చుకున్నాడు. ఇంకా పరశురాముడి దగ్గర అనేక మంత్రాలు ఉపదేశం పొందాడు. ద్రోణుడు విలువిద్యలో గొప్ప ప్రావీణ్యాన్ని సంపాదించాడు.

తరువాత ద్రోణుడు ధనం కోసం తన స్నేహితుడు పాంచాలదేశపు రాజు ద్రుపదుడి దగ్గరికి వెళ్లాడు. తను అతడికి చిన్ననాటి స్నేహితుణ్నని, కలిసి చదువుకున్నామని గుర్తు చేశాడు. స్నేహితుడే కదానని ద్రుపదుడితో స్నేహంగా మాట్లాడాడు. కాని, ద్రుపదుడు ద్రోణుడి మాటలు విని “చిన్నప్పుడు మనిద్దరం కలిసి చదువుకుని ఉంటే చదువుకుని ఉండచ్చు. ఇప్పుడు నువ్వు బీద బ్రాహ్మణుడివి, నేను మహారాజుని!

నీకూ నాకూ మధ్య ఉన్న అంతరం నీకు తెలియలేదా? పేదవాడైన బ్రహ్మణుడికి, ప్రజల్ని పాలించే మహారాజుకి మధ్య స్నేహం ఉంటుందా? బ్రాహ్మణుడు రాజుకి స్నేహితుడు ఎలా అవుతాడు?

ధనవంతుడితో దరిద్రుడికీ; పండితుడితో మూర్ఖుడికీ; నిర్మలమైనవాడితో క్రూరుడికీ; వీరుడితో పిరికివాడికీ; కవచ రక్షణ కలిగిన వాడితో రక్షాకవచం లేని వాడికీ; మంచి నడవడిక కలిగినవాడితో దుర్మార్గుడికీ మధ్య స్నేహం కుదురుతుందా? స్వభావము, విద్య, సంపద, మంచి నడవడిక సమానంగా ఉన్నవాళ్ల మధ్య స్నేహము, వివాహము వంటి బంధాలు ఏర్పడుతాయి. సమానం లేనివాళ్ల మధ్య వాటికి అవకాశం లేదు.

అంతేకాదు, రాజులకి ఎవరితో అయినా స్నేహంకాని, శతృత్వంకాని ఉందంటే అది అవసరాన్నిబట్టే ఉంటుంది. మా వంటి గొప్ప రాజులకి నీ వంటి పేద బ్రాహ్మణులతో ఎప్పుడూ ఉపయోగం ఉండదు. కనుక, మన మధ్య స్నేహం ఏర్పడదు!” అని తనకున్న ఐశ్వర్యం వల్ల కలిగిన అహంకారంతో ద్రుపద మహారాజు ద్రోణుడితో హీనంగా మాట్లాడాడు.

అతడి మాటలు విన్న ద్రోణుడు అవమానము, కోపము, బాధ కలిగిన మనస్సుతో భార్యని, కొడుకుని, అగ్నిహోత్రాన్ని, శిష్యుల్ని తీసుకుని హస్తినాపురానికి చేరుకున్నాడు. అదే సమయంలో నగరానికి బయట ధృతరాష్ట్రుడి కొడుకులు, పాండురాజు కొడుకులు కలిసి ఆడుతున్న బంగారు బంతి ఎగురుతూ వెళ్లి ఒక బావిలో పడింది. నీళ్లల్లో మెరుస్తూ పైకి తేలుతూ కనబడుతున్న ఆ బంతిని ఎలా తీసుకోవాలో రాజకుమారులకి తెలియలేదు. వాళ్లందరూ ఆ బావి చుట్టూ మూగి దాని వైపే చూస్తున్నారు.

అనేక రకాల బాణాల్ని, అమ్ములపొదుల్ని, ఎత్తైన ధనుస్సుని ధరించి అప్పటి వరకు వాళ్లవైపే చూస్తున్న ద్రోణుడు వాళ్ల దగ్గరికి వచ్చాడు. జరిగిన విషయం తెలుసుకున్నాడు. రాజకుమారులతో “మీరందరు భరతవంశంలో పుట్టారు. ప్రసిద్ధుడైన కృపాచార్యుడి దగ్గర శిష్యరికం చేస్తున్నారు. శస్త్రాస్త్ర విద్యల్లో గొప్ప నైపుణ్యాన్ని సంపాదించారు. బావిలో పడిన బంతిని తీసుకోలేక ఒకళ్ల ముఖం ఒకళ్లు చూసుకుని నవ్వుకోవడం బాగుండలేదు. ఈ బంతిని బాణాల వరుసతో నేను తీస్తాను చూడండి. ఇలా తియ్యడం ఎవరికీ చేతకాదు” అన్నాడు.

ఒక బాణాన్ని తీసి మంత్రించి బంతిలో నాటుకునేలా వేశాడు. తరువాత ఆ బాణం చివర మరో బాణాన్ని, దాని చివర మరో బాణాన్ని వేస్తూ బాణాల్ని తాడులా చేసి బంతిని పైకి లాగి ఇచ్చాడు. పిల్లలందరు ఆశ్చర్యంగా చూసి ద్రోణుణ్ని తీసుకుని భీష్ముడి దగ్గరికి వెళ్లి జరిగినదంతా వివరించారు. పుణ్యాత్ముడు, ధనుర్విద్యలో ప్రావీణ్యుడు, గొప్ప బలవంతుడు, బాగా చిక్కిన నల్లని శరీరం కలవాడు, బ్రాహ్మణులలో గొప్పవాడు, మంచి గుణాలతో కలిగిన తేజస్సుతో ప్రకాశించేవాడు అయిన ద్రోణుణ్ని చూసాడు భీష్ముడు.

అతడి గుణగణాలు ఇంతకు ముందే వినడం వల్ల సంతోషంతో “ఆచార్యా! నువ్వు ఎక్కడినుంచి వచ్చావు? ఇక్కడ ఎక్కడ ఉంటావో చెప్పు, నీ ఇష్ట ప్రకారమే నీకు వసతి ఏర్పాటు చేస్తాను” అన్నాడు.

భీష్ముడి అడిగిన దానికి ద్రోణుడు “నా పేరు ద్రోణుడు. నేను భరద్వాజ మహర్షి కుమారుణ్ని. అగ్నివేశ్యుడు అనే మహర్షి దగ్గర బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించి ధనుర్వేదం నేర్చుకున్నాను. ఆ రోజుల్లో పాంచాలదేశపు రాజు వృషతుడి కొడుకు ద్రుపదుడు కూడా నాతో కలిసి విద్యలన్నీ నేర్చుకున్నాడు. అప్పుడు మేమిద్దరం మంచి స్నేహితులం. తను పాంచాల రాజ్యానికి రాజుగా ఉన్నప్పుడు నన్ను రమ్మని, రాజభోగాలు అనుభవించడానికి నేను కూడా అర్హుణ్నని ఎంతగానో చెప్పాడు.

వృషతుడి తరువాత ద్రుపదుడు పాంచాల దేశానికి రాజయ్యాడు. నేను నా తండ్రి చెప్పినట్టు కృపిని పెళ్లి చేసుకున్నాను. నాకు అశ్వత్థామ అనే ఒక కొడుకు ఉన్నాడు. నా దగ్గర ధనం లేకపోయినా వ్యక్తుల యోగ్యతని గుర్తించలేని రాజుల దగ్గరికి వెళ్లలేక, చెడు దానాలు పట్టలేక ధర్మమార్గంలో నడుస్తూ జీవిస్తున్నాను. ధనం కలిగినవాళ్ల పిల్లలు అందరూ పాలు తాగడం చూసిన నా కొడుకు ‘నాకు కూడా పాలు కావాలి’ అని ఏడ్చేవాడు.

దారిద్ర్యాన్ని భరించలేక నన్ను తన రాజ్యానికి రమ్మని ఆహ్వానించాడని నేను ద్రుపదుడి దగ్గరికి వెళ్లాను. కాని, యాచించడం చాలా కష్టమైన పని. అయినా ద్రుపదుడు స్నేహితుడే కనుక, అతణ్ని యాచించడంలో తప్పులేదు అనుకున్నాను. అతడు ధనం కాకపోయినా అశ్వత్థామకి పాలు తాగడానికి గోవుల్నయినా ఇస్తాడని అనుకుని అతడి దగ్గరికి వెళ్లాను. అతడికి నన్ను నేను పరిచయం చేసుకున్నాను. కాని, ద్రుపదుడు అహంకారంతో పేద బ్రాహ్మణుడికి, మహారాజుకి మధ్య స్నేహమేమిటని అడిగాడు. అవమానంతో ఆ ప్రదేశాన్ని వదిలి వచ్చేశాను” అని తన గురించి చెప్పాడు. భీష్ముడు ద్రోణుణ్ని సత్కరించి అతడికి ధనమిచ్చి సంతోషపరిచాడు.

ద్రోణుణ్ని మొసలి నుంచి విడిపించిన అర్జునుడు

ఒకరోజు ద్రోణుడు శిష్యులందరితో కలిసి గంగాస్నానం చెయ్యడానికి వెళ్లాడు. ద్రోణాచార్యుడు స్నానం చేస్తుండగా భయంకరమైన ఒక మొసలి అతడి పిక్క పట్టుకుంది. శిష్యులందరూ ఆ మొసలిని చూసి భయపడి పోయారు. తనను తాను విడిపించుకో గలిగిన ద్రోణాచార్యుడు తన వెంట ధనుర్బాణాలతో వచ్చిన శిష్యుల్ని చూసి తనని మొసలి నుంచి విడిపించమని ఆజ్ఞాపించాడు. రాజకుమారులకి మొసలిని విడిపించడం రాలేదు.

గొప్ప పరాక్రమవంతుడు, శక్తిలో కుమారస్వామి వంటివాడు, పర్వతాల రెక్కలు నరికిన ఇంద్రుడి కుమారుడు అర్జునుడు నీళ్లల్లో కనిపించకుండా ఉన్న మొసలిని అయిదు బాణాలతో కొట్టి ద్రోణాచార్యుణ్ని విడిపించాడు. భయంకరమైన ఆ మొసలి అర్జునుడు వేసిన బాణాలకి శరీరం చీలిపోయి అప్పటికప్పుడే మరణించింది. అది చూసిన ద్రోణాచార్యుడు అర్జునుడి విలువిద్యా నైపుణ్యానికి, తన మీద అతడికి గల ప్రేమకి మెచ్చుకున్నాడు. ద్రోణుడికి ద్రుపదుడు, అతడి బంధువులు కూడా అర్జునుడి చేతిలో ఓడి పోగలరన్న నమ్మకం కలిగి సంతోషించాడు. ఇంకా అనేక దివ్య బాణాలు అర్జునుడికి ఇచ్చాడు! అని అర్జునుడి చిన్ననాటి పరాక్రమాల గురించి వైశంపాయనుడు జనమేజయుడికి వివరించాడు.

ఆదిపర్వంలోని అయిదవ ఆశ్వాసం సమాప్తం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here