మహాభారత కథలు-4: శ్రీ రాజరాజ నరేంద్రుడు

0
11

[dropcap]శ్రీ[/dropcap] వ్యాసభగవానుడు ఎంత వేగంగా చెప్పాడో దాన్ని అంత వేగంగానూ రాసిన ఆది దంపతుల కుమారుడు విఘ్నేశ్వరుడు.. అంత గొప్ప మహాభారతాన్ని తెనిగించినది కవిత్రయమే అయినా ప్రోత్సహించింది శ్రీ రాజరాజ నరేంద్రుడు. అందుకే ఆయన గురించి తెలియచెయ్యడం నా ధర్మంగా భావించి వ్యాసభగవానుల వారికి, కవిత్రయానికి, నా తల్లితండ్రులకు నమస్కరిస్తూ ఈ మహాభారత కథలు ఆరంభిస్తున్నాను.

ముందుగా శ్రీ వేదవ్యాసుల వారు సంస్కృతంలో రచించిన మహాభారతాన్ని తెలుగులోకి అనువదించాలన్న సంకల్పం కలిగిన శ్రీ రాజరాజ నరేంద్రుణ్ని, అనువదించడానికి ప్రారంభించిన ఆదికవి నన్నయ గారిని గురించి కొంత తెలుసుకుందాం.

అన్ని లోకాల్ని రక్షించడంలో సమర్థత కలిగినవాళ్లు, సృష్టికి మొదటి వాళ్లు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. వాళ్ల ధర్మపత్నులు సరస్వతి, లక్ష్మి, పార్వతులు. వాళ్లని సేవించి వాళ్ల అనుగ్రహంతో శత్రువులే లేని గొప్ప రాజ్యసంపద పొంది.. అన్ని లోకాల్లో ఉన్న ప్రజలతో కీర్తింపబడి.. మణులతో నిండిన సముద్రంలా మంచి గుణాలు కలిగి.. రాజ్యాన్ని పాలించాడు తూర్పు చాళుక్య వంశానికి చెందిన రాజరాజ నరేంద్రుడు.

చంద్రవంశానికి అలంకారంగాను, చంద్రుడిలా అందంగాను, ఇతర రాజులందర్నీ జయించ గలిగినంత పరాక్రమంతోను, ఓటమి తెలియని గొప్ప బాహుబలంతోను, అన్ని లోకాల్లోను కీర్తితో ప్రకాశించాడు రాజరాజ నరేంద్రుడు.

విమలాదిత్యుడు, రాజరాజచోళుడి కుమార్తె కుందవాంబ దంపతులకి కుమారుడు. పవిత్రమైన మనస్సు, అస్త్రవిద్యలో గొప్ప నేర్పరితనము కలిగి చాళుక్య వంశానికి దీపంలా ప్రకాశించాడు. శాస్త్రాలన్నీ పరిపూర్ణంగా తెలుసుకున్నాడు. చంద్రకాంతితో ప్రకాశించే దేహంతో బుద్ధిబలము, ధర్మప్రవర్తనలతో అనేక సంపదలు పొందాడు.

‘సర్వలోకాశ్రయుడు’ అనే వంశానికి చెందిన బిరుదుకి అర్హత పొందాడు. ధర్మాల్ని రక్షించడం రాజు ధర్మం. మనువు, నలుడు, నృగుడు, నహుషుడు, రంతిదేవుడు, భగీరథుడు, రాముడు మొదలైన పూర్వపు రాజులు అతడికి ఆదర్శం. వాళ్ళతో సమానమైన ధర్మ ప్రవర్తన కలవాడు రాజరాజ నరేంద్రుడు.

తన రాజ్యంలో ఉండే ప్రజల్ని ప్రేమగా చూసేవాడు. సామంతరాజుల దగ్గరనుంచి పన్నులు ధన రూపంలో తీసుకునేవాడు. బలగర్వంతో కప్పాలు ఇవ్వని రాజుల్నితన పరాక్రమంతో ఓడించి వసూలు చేసేవాడు.

బ్రాహ్మణుల్ని రక్షిస్తూ, వాళ్ళకి అగ్రహారాలు ఇస్తూ, గొప్ప వైభవంతో దైవ కార్యాలు జరిగేలా చూస్తూ, తనను ఆశ్రయించినవాళ్లని కాపాడుతూ పూర్వం మనువు అనుసరించిన మార్గంలో నడిచి వంశ గౌరవాన్ని పెంచాడు రాజరాజ నరేంద్రుడు.

నాలుగు సముద్రాల మధ్య ఉన్న మొత్తం భూభాగాన్ని తూర్పు చాళుక్యులు పరిపాలించారు. ఆ వేంగీ దేశానికి రాజధాని రాజమహేంద్ర నగరం. సంతోషంగా రాజ్యభారాన్ని వహిస్తూ.. దానివల్ల కలిగిన సుఖాలు అనుభవిస్తూ.. ఇంద్రుడికి ఉన్నంత గొప్ప వైభవము, అన్ని లోకాలకి సంబంధించిన సంపదలు, విలాసాలు, అందమైన భవనాలు, మంత్రులు, పురోహితులు, సేనానాయకులు, ద్వారపాలకులు, మహామంత్రులు, సామంతరాజులు, అంత:పురస్త్రీలతో కొలువై ఉండేవాడు రాజరాజ నరేంద్రుడు.

వ్యాకరణ శాస్త్రాన్ని మొదటినుంచి చివరి వరకు చదివిన వ్యాకరణ పండితులు; భారతము, రామాయణము మొదలైన పురాణాలు ఇతిహాసాలు చెప్పడంలో నేర్పరులైన పండితులు; గొప్ప భావాలు, కొత్త అర్థాలతో వాక్యాలు రాయగల కవులు; అన్ని తర్కశాస్త్రాలకి సంబంధించిన శాఖలతో రూపొందించబడిన శాస్త్రాలన్నింటిలోను ప్రవేశం కలిగిన ప్రజ్ఞావంతులైన తర్కశాస్త్ర పండితులు.. చుట్టూ కూర్చుని ఉండగా చర్చలతోను, వినోదాలతోను గడిపేవాడు.

ఒకరోజు పరమ ధర్మవేత్త, ‘వంశ పారంపర్యంగా వస్తున్న బ్రాహ్మణుడు, తన మీద ప్రేమ కలవాడు, జపాలు హోమాలు మానకుండా చేసేవాడు, శబ్దాల స్వరూపాన్ని అందరికీ అర్థమయ్యేలా వివరంగా చెప్పగలిగిన వాడు, వేదమంత్ర భాగాన్ని అధ్యయనం చేసినవాడు, పురాణ విజ్ఞానాన్ని ఔపాసన పట్టినవాడు, అర్హత కలిగినవాడు, ఆపస్తంబసూత్రుడు, ముద్గలముని గోత్రంలో పుట్టినవాడు, ప్రజలతోను, పండితులతోను కీర్తింపబడినవాడు, లోకజ్ఞానం మెండుగా కలిగినవాడు, ఎప్పుడూ సత్యమే పలికేవాడు, బుద్ధిలో బృహస్పతి వంటి వాడు, మంచివాడు’ అయిన నన్నయభట్టుతో చాళుక్య వంశానికి అలంకారమైన రాజరాజ నరేంద్రుడు ఇలా చెప్పాడు.

“నిర్మలమైన మనస్సుతో అనేక పురాణలు విన్నాను. అర్థ, ధర్మ శాస్త్రాల పద్ధతుల్ని తెలుసుకున్నాను. ప్రౌఢాలు, రసవత్తరమైన రఘువంశ కావ్యాలు, శకుంతల మొదలైన నాటకాల తీరులు అనేకం పరిశీలించాను. లోకంలో ఎక్కువగా పూజించబడే శైవ, ఆగమ శాస్త్రాల్లో నా చిత్తాన్ని భక్తితో నిలకడగా ఉంచాను. అయినా కూడా నాకు శ్రీమత్ భారతంలో ఉన్న తత్త్వమే గొప్పగా అనిపిస్తోంది.

బ్రాహ్మణులకి తృప్తి కలిగించడం, భారతాన్ని వినడం, శివుడి పాదపద్మాల్ని ధ్యానించడం, పూజించడం, దానాలు ఇవ్వడం, మంచివాళ్లతో సహవాసం నాకు ఇష్టమైన విషయాలు. చంద్రుడు మొదలు పూరువు, భరతుడు, కురురాజు, పాండురాజు వరుసగా వంశాన్ని స్థాపించి నడిపించారు. ఈ భూమి మీద ప్రసిద్ధికెక్కిన మా వంశంలో మంచి గుణాలు, మంచి చరిత్ర కలిగిన పాండవుల చరిత్ర వినడం నాకు ఇంకా ఇష్టం.

వేదాధ్యయనం చేసిన బ్రాహ్మణులకి బంగారపు తొడుగుతో ఉన్న కొమ్ములు, గిట్టలు కలిగిన కపిలవర్ణం కలిగిన వంద ఆవుల్ని దానంగా ఇస్తే ఎంత ఫలితం కలుగుతుందో భారత కథని వినడం వల్ల కూడా అంతే ఫలితం కలుగుతుంది. నాకు ఎప్పుడూ భారత కథని వినాలనే ఉంటుంది.

ప్రజలందరూ మెచ్చుకుంటున్న నన్నయకవీ! వ్యాసమహర్షి మహాభారతంలో చెప్పిన విషయాల్ని అందరికీ అర్థమయ్యేలా మీకు గల పాండిత్యంతో తెలుగులో వ్రాయండి. అన్ని భాషల్లోను, ప్రక్రియల్లోను చెప్పగలిగిన వాళ్లు ఉంటే భారత కథని విన్నవాళ్లు కూడా అనేక యజ్ఞాలు చేసినంత ఫలితాన్ని పొందుతారు” అని రాజు నన్నయని ఆజ్ఞాపించాడు.

“నన్నయ రాజరాజనరేంద్రుడితో “రాజా! ఆకాశంలో ఉన్న నక్షత్రాల్ని లెక్కపెట్టడం, అన్ని శాస్త్రాల్లో ఉన్న మొత్తం సారాన్ని గ్రహించడం, భుజబలంతో పొందలేని భారతవాఙ్మయాన్ని తెలుసుకోవడం బ్రహ్మకు కూడా సాధ్యం కాదు కదా! వ్యాసుడు సంస్కృతంలో రాసిన అటువంటి భారతాన్ని తెలుగులోకి అనువదించడం అసాధ్యమే! అయినా కూడా నువ్వు ఆజ్ఞాపించావు కనుక మిగిలిన పండితుల సహాయంతో నాకు తెలిసిన విధంగా అనువదిస్తాను” అన్నాడు.

విష్ణువు, శివుడు, బ్రహ్మ, వినాయకుడు, సూర్యుడు, కుమారస్వామి; తల్లులైన లక్ష్మి, పార్వతి, సరస్వతి మొదలైన దేవతలందరికీ మొక్కాడు.

తప్పస్సంపన్నుడు, అజ్ఞానాన్ని పోగొట్టే ఆచార్యుడు, శ్లోక రచనా సంప్రదాయాన్ని మొదట ప్రారంభించిన ఆది కవి, బ్రహ్మతో సమానమైనవాడు, ప్రచేతన మహర్షి కుమారుడు వాల్మీకిమహర్షిని భక్తితో స్మరించాడు.

పండితుల్ని సంతోషపెట్టగలిగినవాడు, యోగ్యుడు, దేవతలతో సమానమైనవాడు, మహర్షులతో పూజింపబడేవాడు, గొప్ప కీర్తితో ప్రకాశించేవాడు అయిన వ్యాసుణ్ని పూజించాడు.

గొప్ప జ్ఞానమనే సువాసనతో, మంచి గుణాలు కలిగినవాళ్లు, పూజ్యులు అయిన పండితులతో నిండిన సభల్ని ప్రశంసించాడు.

భారతవీరుల మధ్య జరిగిన భయంకరమైన కురుక్షేత్ర మహా యుద్ధంలో అర్జునుడిని విడవకుండా ఉన్న కృష్ణుడిలా.. ‘వానస’ అనే బ్రాహ్మణ వంశానికి అలంకారమైనవాడు, అనేక సారస్వతాల్లో సమర్థుడూ, తనకు ప్రియమిత్రుడు, సహపాఠి, అయిన నారాయణభట్టు అనే పండితుడి సహాయాన్ని పొందాడు.

గొప్ప గొప్ప కవులు “చాలా బాగుంది” అని ప్రశంసించే విధంగాను; సామాన్య ప్రజలు కూడా విని ఆనందించే విధంగాను; అక్షరాల కూర్పులో ఉన్న అందాన్ని అందరూ మెచ్చుకునే విధంగాను; హృదయానికి హత్తుకుపోయే అర్థాలతో, వివిధ రకాల నీతులకి, జాతీయాలకి, నానుడులకి నిలయమై ఉండేలా లోకానికి మంచి చెయ్యడం కోసం సంస్కృతంలో వ్యాసమహర్షి రాసిన మహాభారతాన్ని తెలుగులోకి అనువదించి నన్నయభట్టు ప్రజలందరికీ పూజ్యుడయ్యాడు.

శ్రీమదాంధ్రమహాభారతాన్ని ప్రజలకు చేరువచేసి శ్రీ రాజరాజ నరేంద్రుడు కీర్తిమంతుడయ్యాడు!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here