మహాభారత కథలు-42: భీమసేనుణ్ని చూసి ఇష్టపడిన హిడింబ

0
10

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

భీమసేనుణ్ని చూసి ఇష్టపడిన హిడింబ

[dropcap]హి[/dropcap]డింబాసురుడు చెప్పింది విని వెంటనే అక్కడికి వెళ్లింది హిడింబ. అంత నిర్భయంగా పడుక్కుని నిద్రపోతున్నారు అంటే వాళ్లు ఎంత శక్తి కలవాళ్లో అనుకుంది. మొదట చెట్టు చాటున నక్కి వాళ్లవైపు చూసింది. పద్మాల్లా అందంగా ఉన్న కళ్లు, విశాలమైన, ఎత్తైన వక్షస్థలం, సింహంవంటి సన్నని నడుము, అందమైన ఆకృతి కలిగిన శరీరం, వజ్రాయుధాల్లాంటి ధృఢమైన బాహువులతో మన్మథుడిలా ఉన్న భీమసేనుణ్ని చూసి తన్మయత్వంలో తను వచ్చిన పని మర్చిపోయింది.

రకరకాల ఆభరణాలు ధరించి అందంగా అలంకరించుకుని వయ్యరంగా నడుస్తూ భీముడి దగ్గరికి వచ్చింది. భీముణ్ని చూసిన తరువాత హిడింబ తన అన్న చెప్పిన విషయాన్ని పూర్తిగా మర్చిపోయింది. తన దగ్గరికి వచ్చిన హిడింబని చూసి “ఎవరు నువ్వు? ఇంతరాత్రి వేళ ఒంటరిగా ఇక్కడికి ఎందుకు వచ్చావు? వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపో!” అన్నాడు భీముడు.

భీముడి మాటలు విని హిడింబ “నేను హిడింబాసురుడికి చెల్లెల్ని. నా పేరు హిడింబ. నేను నీకు భార్యగా ఉండాలని అనుకుంటున్నాను. నువ్వు నన్ను భార్యగా స్వీకరిస్తే నా అన్న మీకు అపకారం చెయ్యడు. అంతేకాదు, నేను జీవితంలో మరెవ్వర్నీ భర్తగా స్వీకరించను. హిడింబుడు చాలా బలవంతుడు. దేవేంద్రుడు కూడా అతడి ముందు నిలవలేడు. అతణ్ని తలుచుకుంటేనే అందరూ భయపడతారు. పాపం వీళ్లకి తెలియదనుకుంటాను. తెలిసి ఉంటే ఇంత నిర్భయంగా నిద్రపోతారా? పెద్ద పొరపాటు చేశారు.

ఇది హిడింబాసురుడి అడవి. దీంట్లోంచి బయట పడడమంటే యముడి నోట్లోంచి బయట పడడమే. హిడింబాసురుడు రాబోతున్నాడు. మిగిలినవాళ్ల సంగతి పక్కన పెట్టి నువ్వు నాకు భర్తవై ప్రాణాలు దక్కించుకో. నేను ఎక్కడికి వెళ్లాలన్నా వెళ్లగలను. నిన్ను నీకు ఇష్టమైన చోటికి తీసుకుని వెడతాను” అంది.

అమె మాటలు విన్న భీమసేనుడు “హిడింబా! తల్లినీ, తోబుట్టువుల్ని వదిలి పెట్టి నీతో గడపడం కోసం రమ్మంటున్నావా! ఇది సంస్కారుల లక్షణం కాదు. అటువంటి పనిని నేను చెయ్యను!” అన్నాడు. హిడింబ “అయితే వీళ్లని నిద్ర లేపు. నేను ఎత్తుకుని తీసుకుని పోతాను. నా అన్న హిడింబాసురుడు ఇటు వస్తే చాలా ప్రమాదం!” అంది.

అది విన్న భీమసేనుడు “హిడింబా! బలవంతుడైన రాక్షసుడు వస్తున్నాడని భయపడి మంచి నిద్రలో ఉన్న వాళ్లని లేపడం నా వల్ల కాదు. బలవంతుడు నీ అన్న ఒక్కడే కాదు. నా బలం గురించి కూడా నీకు చెప్తాను విను. ఒక్క రాక్షసుడే కాదు దేవదానవులు అందరూ ఏకమై వచ్చినా నాకున్న గొప్ప బలంతో వేగంగా వాళ్లని చీల్చి చంపుతాను. కాని, ఎంతో అలసటతో సుఖంగా నిద్ర పోతున్న వీళ్లని మాత్రం లేపను. ఆ రాక్షసుణ్నే ఇక్కడికి పంపించు!” అని ఖచ్చితంగా చెప్పాడు.

అప్పటికే హిడింబ రావడం అలస్యమైందని కోపంతో హిడింబాసురుడే అక్కడికి వచ్చేశాడు. నల్లటి మబ్బులా ఉన్న పెద్ద శరీరం, మేఘంలో మెరుపు తీగల్లా కనిపించే ఎనిమిది కోరలు, గట్టిగా పళ్లు కొరుకుతూ కోపంతో ఎర్రబడిన ముఖం, బాగా విప్పార్చుకున్న గుండ్రటి కళ్లని తిప్పుతూ.. బిరుసుగా ఉన్న వెండ్రుకలు గాలికి కదులుతుంటే యముడిలా ఉన్నాడు. హిడింబాసురుడే చెల్లెల్ని దగ్గరికి వచ్చి “నువ్వు నేను చెప్పినట్టు చెయ్యడం మానేసి ఈ నీచులైన మనుషులతో కలిసి మాట్లాడుతున్నావా?” అని గట్టిగా గర్జించాడు.

హిడింబ భయంతో భీముడి వెనక్కి వెళ్లి దాక్కుంది. గరుత్మంతుడికి ఉన్నంత బలం కలిగిన భీముడు హిడింబతో “భయపడకు నన్ను, నీ అన్నని చూడు” అంటూనే హిడింబాసురుడు మీదకి దూకి “నిన్ను చంపినా పాపం కలగదు. ఇప్పుడే నిన్ను చంపి ఈ అడవికి వచ్చే వాళ్లకి అసలు భయమే లేకుండా చేస్తాను” అన్నాడు.

రాక్షసుడు భీముడి మాటలు విని ఆశ్చర్యంతో “సరే అదీ చూద్దాము. ఇప్పుడు నువ్వు బలవంతుడివో.. నేను బలవంతుడినో తేల్చుకుందాము” అని భీముణ్ని ఎదుర్కున్నాడు. భీముడు యుద్ధం అక్కడే చేస్తే దాని వల్ల వచ్చే శబ్దానికి తన సోదరులకి, తల్లికి నిద్రా భంగం కలుగుతుందని అనుకున్నాడు. రాక్షసుణ్ని చిన్న జంతువుని ఈడ్చుకుని వెళ్లినట్టు కొంతదూరం ఈడ్చుకుని వెళ్లాడు. భయంకరమైన శక్తి కలిగిన భీముడు హిడింబుడు మదపుటేనుగుల్లా మల్లయుద్ధానికి దిగారు. శరీరమంతా బూడిద నిండిపోయి మంచుతో కప్పబడిన కొండల్లా కనిపిస్తున్నారు.

రాక్షసుడు భీముణ్ని పైకెత్తి గిరగిరా తిప్పుతూ భయంకరంగా గర్జించాడు. ఆ శబ్దానికి కుంతి, ఆమె కొడుకులూ నిద్ర లేచి దగ్గర్లో నిలబడి ఉన్న అందాల రాశిని చూశారు. కుంతి ఆమెని చూసి వనదేవతో, దేవకాంతో అనుకుని “నువ్వెవరివి? ఇక్కడికి ఎందుకు వచ్చావు?” అని అడిగింది. అమె మాటలకి హిడింబ తన అన్నవైపు చూపిస్తూ “నల్లని శరీరంతో కనపడుతున్న ఆ రాక్షసుడికి చెల్లెల్ని. మిమ్మల్ని బాధించమని నన్ను పంపించాడు. కాని, మీ కొడుకుని చూసి నేను ఆ పని చెయ్యలేదు. అందుకు కోపం వచ్చిన నా అన్న ఇక్కడికి వచ్చి నన్ను కూడా చంపబోయాడు. మీ కొడుకు అతడి గర్వాన్ని మల్లయుద్ధంతో అణగ్గొడుతున్నాడు. ఆ రాక్షసుణ్ని చంపి నన్నూ మిమ్మల్ని కూడా రక్షిస్తాడు చూడండి” అంది.

అందరూ వాళ్లిద్దరు చేస్తున్న యుద్ధం చూస్తున్నారు. కొంత సేపటికి అర్జునుడు భీముడి దగ్గరికి వెళ్లాడు. “అన్నా! సంధ్యాసమయం అవుతోంది. చీకటిపడితే రాక్షసుల శక్తి పెరుగుతుంది. అలస్యం చెయ్యకుండా అతణ్ని చంపెయ్యి” అన్నాడు. అర్జునుడి మాటలు విని భీముడు తన బలాన్ని, యుద్ధనైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ రాక్షసుణ్ని బలహీనుడిగా చేశాడు. అతడి ముక్కునుంచి, నోటినుంచి రక్తం ధారలు కడుతుంటే అతడి కుడికాలు పట్టుకుని పకెత్తి గిరగిరా వందసార్లు తిప్పాడు. రాక్షసుడి అవయవాల పటుత్వం తగ్గాక నేల మీద పడేసి అతడి వెన్నెముక విరిచి చంపేశాడు.

తన అన్న హిడింబుణ్ని భీముడు చిత్రవధ చేసి చంపడం చూసి ఆశ్చ్యర్యపడింది హిడింబ. అతణ్ని పొగుడుతూ అందరితో కలిసి అతడి దగ్గరికి వెళ్లింది. ఆమె రావడం ఇష్టం లేక భీముడు “రాక్షసులు పగబడతారు, మాయలు చేస్తారు, చివరికి చంపేస్తారు. నువ్వు మాతో రావద్దు” అన్నాడు. హిడింబ భయంతో చూస్తూ నిలబడింది.

ఆమె పరిస్థితి చూసి ధర్మరాజు భీముడితో “చంపవలసినవాడిని చంపేశావు. అంతవరకు నువ్వు చేసింది ధర్మమే. కాని, హిడింబ అబల. ఆమెని కరుణతో చూడాలి. ధర్మాచరణ చేసే వాళ్లకి ఆత్మరక్షణ కంటె ధర్మరక్షణే ఉత్తమైంది. ధర్మాత్ములు తమకి అపదలు కలిగినా ధర్మాన్నే రక్షించాలి. ఇది నిజం. ఎందుకంటే, తరువాత జన్మలో వెంట వచ్చేది ధర్మమే. కాబట్టి ధర్మం చెడిపోతే ధర్మాత్ములకి చెడు కలుగుతుంది. ఈ హిడింబని రాక్షసిగా చూడకు. బంధు భావంతో చూడు” అన్నాడు.

ధర్మరాజు మాటలు విన్న హిడింబ కుంతితో “అమ్మా! నేను భీముడి మీద మనసు పడ్డాను. అందుకే బంధువుల్ని, స్నేహితుల్ని విడిచి వచ్చేశాను. నన్ను మీరు అనుగ్రహిస్తే మీకు అవసరమైన సహాయం చేస్తాను. మీకు మార్గం అనుకూలంగా లేనప్పుడు మిమ్మల్ని ఎత్తుకుని అవసరమైన చోటికి చేరుస్తాను. భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్ని తెలుసుకుని చెప్పగలను.

ఇప్పుడు జరగబోతున్నది ఏమిటో దాన్ని చెప్తాను వినండి. ముందుకు వెడితే ఒక సరోవరం, ఒక వృక్షం ఉన్నాయి. శాలిహోత్రుడు అనే మహర్షి తపస్సు యొక్క ప్రభావం వల్ల అవి రెండూ ఏర్పడ్డాయి. ఆ సరోవరంలో ఉన్న నీళ్లు తాగితే ఆకలి దాహం ఉండవు. చలి, ఎండ, గాలి నుంచి ఆ చెట్టు రక్షిస్తుంది. మీరు అక్కడకి వెళ్లిన తరువాత మీ దగ్గరికి కృష్ణద్వైపాయనుడు వచ్చి మీకు మంచి కలిగించే మాటలు చెప్తాడు” అని చెప్పింది.

హిడింబ చెప్పిన మాటలు విని కుంతి, పాండవులు ఆశ్చర్యపడ్డారు. ఆమెని మంచి అభిప్రాయంతో చూసి ఆదరించారు. హిడింబ వినయానికి, వివేకానికి సంతోషించి కుంతీదేవి భీముడితో “నాయనా! భీమసేనా! నన్ను, నీ అన్న ధర్మరాజుని గౌరవించి మేము చెప్పిన మాటని ధర్మబద్ధంగా పాటించు. ఈ హిడింబ ఉత్తమ పతివ్రత. మనస్సులో ఆమె గురించి చెడుగా ఆలోచించకు. ఈమెకి పాండురాజుకి కూడా మంచి జరిగేలా కొడుకు కలుగుతాడు” అని భీమసేనుణ్ని ఒప్పించింది.

హిడింబతో “మీ ఇద్దరు పగలంతా మీ ఇష్టం వచ్చిన చోట తిరగండి. రాత్రికి మాత్రం ఇక్కడికి వచ్చెయ్యండి” అని చెప్పింది. భీముడు కొడుకు పుట్టేవరకే ఆమెతో ఉంటానని చెప్పాడు. అందరూ కలిసి శాలిహోత్ర మహర్షి ఆశ్రమానికి వెళ్లారు. ఉదయాన్నే అక్కడ ఉన్న కొలనులో స్నానం చేసి సంధ్యావందనాలు చేసుకుని శాలిహోత్రుణ్ని కలిశారు. అక్కడ ఉన్న చెట్టు నీడలో ఆకలి దాహం లేకుండా విశ్రాంతిగా ఉన్నారు.

వ్యాసుడు పాండవులకి చేసిన హితోపదేశము

గొప్ప తప్పస్సుతో పవిత్రమైనవాడు, మహర్షులతో పూజింప తగినవాడు, బ్రహ్మదేవుడితో సమానమైన తేజస్సు కలవాడు, బ్రాహ్మణులకి ఇష్టమైనవాడు, వర్షాకాల మేఘానికి ఉండే రంగు వంటి రంగు కలవాడు, పాపాలన్నింటినీ పోగొట్ట కలిగినవాడు అయిన వ్యాసమహర్షి కుంతీదేవి ఆమె కొడుకులు ఉన్న ప్రదేశానికి వచ్చాడు. ఆయన్ని చూడగానే అందరూ ఎంతో సంతోషపడ్డారు.

పాండవులు మహర్షి వేదవ్యాసుడికి భక్తితో నమస్కారం చేసి ఆసనం చూపించి, పూజించారు. వ్యాసుడు వాళ్ల వైపు దయతో చూసి “ధృతరాష్ట్రుడు తన కొడుకు మాట విని వాళ్లని వారించకుండా దుర్మార్గుడై మీకు అపకారం చేసి మిమ్మల్ని రాజ్యం నుంచి వెళ్లగొట్టాడు. దుర్మార్గుల్ని ఎప్పుడూ ఎక్కడా ఉపేక్షించ కూడదు, నమ్మకూడదు. ఈ విషయం తెలుసుకుని మీకు హితోపదేశం చెయ్యాలని వచ్చాను.

అన్ని ధర్మాలు తెలిసినవాళ్లు, వినయం కలిగినవాళ్లు అయిన మీకు బంధువుల ఎడబాటు కలగడం పూర్వజన్మ సుకృతం. బాధపడకండి, కొన్ని రోజుల తరువాత మీరు కూడా బంధువులందరితో కలిసి ఉంటూ రాజ్యం చేస్తారు. ఇక్కడ ఉన్న సరోవరం శాలిహోత్ర మహర్షి తపస్సు వల్ల ఏర్పడింది. దీనిలో నీళ్లు తాగితే మీకు ఆకలి దాహం ఉండవు. ఈ చెట్టు చలి, గాలి, ఎండలనుంచి కాపాడుతుంది. మీరు ఎవరికీ కనిపించకుండా కొంతకాలం ఇక్కడే గడిపి తరువాత ఏకచక్రపురానికి వెళ్లండి. అక్కడ బ్రాహ్మణ రూపంలో బ్రాహ్మణులతో కలిసి ఉండండి. నేను మళ్లీ అక్కడికి వచ్చి మిమ్మల్ని కలుస్తాను” అని చెప్పాడు.

వ్యాసుడి మాటలు విని పాండవులు తలలు వంచి వినయంగా నమస్కరించారు. మనుమల్ని దీవించి, కన్నీరు కారుస్తూ నిలబడిన కోడలు కుంతిని ఓదార్చి “అమ్మా! నీ కొడుకు యుధిష్టిరుడు గొప్ప ధర్మాత్ముడు. అతడు నారాయణుడి భుజాలవంటి నలుగురు తమ్ముళ్ల బలంతో రాజులందరినీ జయిస్తాడు. సార్వభౌముడై అశ్వమేధయాగాలు చేసి తాత తండ్రుల రాజ్యాన్ని ధర్మబద్ధంగా ఏలుతాడు. కురువంశానికి పవిత్రతని చేకూరుస్తాడు” అని చెప్పి వాళ్ల బాధని తగ్గించాడు.

హిడింబని చూసి “ఈమె పేరు ‘కమలపాలిక’. భీముణ్ని సేవించి మహాబలవంతుడైన కొడుకుని పొందుతుంది. ఆపదలు వచ్చిన సమయంలో అతడు మిమ్మలి రక్షిస్తాడు” అని చెప్పి వేదవ్యాసుడు అదృశ్యమయ్యాడు.

వ్యాసమహర్షి చెప్పినట్టు పాండవులు శాలిహోత్రుడి ఆశ్రమంలో సుఖంగా ఉన్నారు. భీముడు హిడింబ కలిసి భూమండలంలో ఉన్న అనేక వనాల్లోను, హంసలు, కొంగలు, బెగ్గురు పక్షులు మొదలైనవాటి ధ్వనులతో మనోహరంగా ఉన్న కొలనులు, నదులయొక్క ఇసుకతిన్నెల్లోను, పర్వతాల్లోను మనసుకు నచ్చిన అన్ని ప్రదేశాల్లోను విహరించారు.

ఘటోత్కచుడి పుట్టుక

భీమ హిడింబలకి భయంకరమైన ముఖం, మోడువంటి చెవులు, వికారంగా ఉన్న కళ్లు, నల్లని శరీరం, ఒకే వరుసలోలేని భయంకరమైన కోరలు, చాల పెద్ద శరీరం కలిగిన ఘటోత్కచుడు అనే పేరుగల కుమారుడు కలిగాడు. అప్పటికప్పుడే తనకు ఇష్టమైన రూపాన్ని పొందగలిగిన ఘటోత్కచుడు వెంటనే నవయవ్వవనము, వివిధశస్త్రాల్లో నైపుణ్యము, అపరిమితమైన రాక్షస పిశాచ బలము పొందాడు. తల్లి తండ్రులకి, కుంతీదేవికి నమస్కారం చేశాడు.

పాండవులకి ఘటోత్కచుడు మొదట పుట్టిన కుమారుడు కావడం వల్ల అతణ్ని అందరూ ప్రేమగా చూశారు. అక్కడ కొన్నాళ్లు ఉండి ఒకరోజు అందరికీ నమస్కారం చేసి “నేను ఉండవలసిన ప్రదేశం రాక్షస పిశాచాల మధ్య కనుక, నేను అక్కడికి వెళ్లిపోతున్నాను. మీకు అవసరమైనప్పుడు నన్ను తల్చుకుంటే వెంటనే వచ్చేస్తాను” అని చెప్పి తల్లిని వెంటబెట్టుకుని ఉత్తర దిశగా వెళ్లిపోయాడు.

పాండవులు శాలిహోత్రుడి దగ్గర అనేక ధర్మశాస్త్రాలు, నీతిశాస్త్రాలు నేర్చుకున్నారు. తరువాత ఆయన దగ్గర సెలవు తీసుకుని విదర్భ, మత్స్య, త్రిగర్త, కీచక దేశాలు దాటి ‘ఏకచక్రం’ అనే అగ్రహారానికి చేరుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here