మహాభారత కథలు-46: వశిష్ఠుడి వృత్తాంతము

0
16

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

వశిష్ఠుడి వృత్తాంతము

విశ్వామిత్రుడు, వశిష్ఠ మహర్షుల మధ్య విరోధము

[dropcap]అ[/dropcap]ర్జునుడు అంగారపర్ణుడితో “మా వంశంలో మొదటివాళ్లు, పుణ్యాత్ములు అయిన ప్రభువులకి పురోహితుడిగా ఉండి కీర్తింపబడిన వశిష్ఠులవారి గురించి తెలుసుకోవాలని ఉంది” అన్నాడు.

గంధర్వుడు అర్జునుడితో “ఇక్ష్వాకు వంశ రాజులు తాము చేసుకున్న పుణ్యం వల్ల వసిష్ఠమహర్షిని పురోహితుడిగా పొంది అనేక యజ్ఞాలు చేశారు. వసిష్ఠ మహర్షి పాదం మోపితే చాలు కామక్రోధాలు రెండూ నాశనమైపోతాయి. శాంతమంటే ఏమిటో తెలియని విశ్వామిత్రుడు వసిష్ఠ మహర్షికి అపకారం చెయ్యడం వల్ల ఆయన కొడుకులు మరణించారు.

తన తపోబలంతో తిరిగి బ్రతికించుకో గలిగినా కూడా యమధర్మరాజుని అతిక్రమించడానికి ఆయన ఇష్టపడలేదు. అటువంటి వసిష్ఠ మహర్షి గొప్పతనాన్ని గురించి నేను చెప్పడమా? అది నా వల్ల అయ్యే పనేనా?” అన్నాడు.

గంధర్వుడి మాటలు విని అర్జునుడు “అసలు విశ్వామిత్రుడికి, వసిష్ఠ మహర్షికి ఎందుకు విరోధం ఏర్పడింది?” అని మళ్లీ అడిగాడు.

గంధర్వుడు అర్జునుడితో “పూర్వం కన్యాకుబ్జాన్ని గాధి కుమారుడు విశ్వామిత్రుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. అతడికి శత్రువులు అనేవాళ్లు ఎవరూ లేరు. ఒకరోజు రాజు తనకున్న అపారమైన సైన్యాన్ని తీసుకుని భయంకరమైన అరణ్యానికి వెళ్లాడు. అక్కడ తిరిగి తిరిగి అలిసిపోయి విశ్రాంతి కోసం వశిష్ఠుడి ఆశ్రమానికి వెళ్లాడు.

ఆ మహర్షి రాజుని గౌరవించి అతడికి, అతడి సైన్యానికి తృప్తిగా ఆతిథ్యమిమ్మని తన దగ్గర ఉన్న ‘నందిని’ అనే హోమధేనువుకి చెప్పాడు. నందిని నేతితో నదుల్ని, అన్నంతో కొండల్ని, పెరుగుతో కాల్వల్ని ఎన్నోరకాల రసాల్ని, ఊరుగాయల్ని ఏర్పాటు చేసింది. భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్య అనే నాలుగు విధాలైన ఆహార పదార్థాలతో అందరూ తృప్తి పడేలా పెట్టింది.

నందిని అనే ఆ హోమధేనువుని చూసి విశ్వామిత్రుడు ఆశ్చర్యపడ్డాడు. తన మనస్సులో ఆలోచించాడు “మెత్తటి వెంట్రుకలు, బాణాలకి చివరిభాగంలా కనిపించే చెవులు, మెత్తని పొదుగు, అందంగా ఉన్న పొట్టి కొమ్ములు, నిర్మలమైన వెన్నెలవంటి శరీరకాంతి, శంఖాలతో సమానంగా ఉండే రంగు కలిగిన ఈ పాడి ఆవు చాలా విలువైంది. గొప్ప సంపద చేరినట్టు ఈ వసిష్ఠమహర్షి దగ్గరికి చేరింది” అని చాలాసేపు ఆలోచించాడు.

విశ్వామిత్రుడి మనస్సులో ఆ ఆవుని తనతో తీసుకుని వెళ్లిపోవాలన్న కోరిక పెరిగింది. వెంటనే వసిష్ఠమహర్షిని కలిసి “మహర్షీ! నీ దగ్గరున్న ఈ ఆవుని నాకు ఇయ్యి. నీకు ఇంతకంటే బాగున్న లక్ష పాడి ఆవుల్ని ఇస్తాను. రాజ్యం కావాలన్నా ఇస్తాను. ఈ ఒక్క ఆవుని నాకు ఇచ్చెయ్యి” అని అడిగాడు.

విశ్వామిత్రుడి కోరిక విని వశిష్ఠుడు “రాజా! ఈ చిన్న ఆవు కోసం అంత ఎక్కువ ధనాన్ని, లక్ష పాడి ఆవుల్ని, రాజ్యాన్ని నేను తీసుకోడం ధర్మం కాదు. నాకు రాజ్యము, సంపదలు ఎందుకు? నేను దీని సహాయంతో పితృదేవతల్ని అతిథుల్ని సంతోష పెడతాను. నాకు ఈ ఆవు ఒక్కటే చాలు. ఋషులకి సంపదలెందుకు? దీన్ని నేను ఎవరికీ ఇవ్వను” అని చెప్పాడు.

మహర్షి మాటలు విని విశ్వామిత్రుడు కోపంతో “నేను క్షత్రియుణ్ని. శిక్షించడానికి, రక్షించడానికి సమర్థుణ్ని. నువ్వు నన్ను ఏం చెయ్యగలవు? లక్ష పాడి ఆవుల్ని ఇస్తానని చెప్తున్నా నువ్వు అంగీకరించట్లేదు. నేనే దీన్ని బలవంతంగా తీసుకుని వెడతాను” అని చెప్పి నందినిని తీసుకుని రమ్మని సైన్యాన్ని ఆజ్ఞాపించాడు. వశిష్ఠుడు మౌనంగా ఉండిపోయాడు.

కాపాడవలసిన రాజే ఎత్తుకుని పోతుంటే మహర్షి ఏం చెయ్యగలడు? విశ్వామిత్రుడు పంపించిన సైన్యం కర్రలతోను కొరడాలతో కొట్టి బాధిస్తుంటే నందిని అరుస్తూ వశిష్ఠుడి దగ్గరికి పరుగెత్తుకుంటూ వచ్చింది. “పండితులకి రాజువైన మహర్షీ! మీరు నన్నెందుకు విడిచి పెడుతున్నారు? అధర్మంగా ప్రవర్తిస్తున్నవాళ్ల దగ్గరికి నన్ను పంపించడం మీకు ధర్మంగా ఉందా?” అని అడిగింది. దాని మాటలు విని కూడా మహర్షి మాట్లాడలేదు. ఆయన మౌనంలోనే ఆయన అభిప్రాయాన్ని తెలుసుకుంది నందిని.

తన దూడని పట్టుకోడానికి వచ్చిన సైన్యాన్ని చూసి కోపంతో రెచ్చిపోయింది. ఒక్కసారి తన శరీరాన్ని విదిలించింది. నిప్పుల వాన కురిపించింది. తోకనుంచి శబరుల్ని; మల మూత్రాలనుంచి యవన, పుండ్ర, పుళింద, సింహళుల్ని; నురుగు నుంచి దరద, బర్బరుల్ని పుట్టించింది. నందిని నుంచి పుట్టిన సైన్యం విశ్వామిత్రుడి సైన్యం కంటే అయుదు రెట్లు ఎక్కువయ్యారు. వాళ్లందరూ కలిసి విశ్వామిత్రుడి సైన్యాన్ని దూరంగా తరిమి కొట్టారు.

బ్రాహ్మణ తేజస్సు నుంచి పుట్టిన తేజస్సుని చూసి విశ్వామిత్రుడు సిగ్గుపడి అన్ని బలాల్ని మించింది తపోబలమే అనుకున్నాడు. రాజ్యసంపదతో అనుభవిస్తున్న భోగాలన్నింటిని గడ్డిపరకలా భావించాడు. విరక్తితో రాజ్యాన్ని సంపదల్ని వదులుకున్నాడు. కొండలు అడవుల మధ్యకి వెళ్లి గొప్ప తపస్సు చేశాడు. తపోమహిమ వల్ల అన్ని సంపదల్ని బ్రహ్మర్షిత్వాన్ని, దివ్యశక్తిని పొందాడు.

ఒకసారి విశ్వామిత్రుడు ఇక్ష్వాకు వంశంలో పుట్టిన కల్మాషపాదుడు అనే రాజుతో యజ్ఞం చేయించాలని అనుకున్నాడు. అతడి పురోహితుడు వశిష్ఠుడి మీద శతృత్వంతో అతడికి అపకారం చెయ్యాలని ఆలోచిస్తున్నాడు. ఒకరోజు కల్మాషపాదుడు అడవిలో వేటకి వెళ్లి అలిసిపోయి దగ్గర్లో ఉన్న వశిష్ఠుడి ఆశ్రమానికి బయలుదేరాడు. అదే సమయంలో వశిష్ఠుడి పెద్ద కొడుకు ఎదురుగా వచ్చాడు. వశిష్ఠుడి నూరుగురు కొడుకుల్లో పెద్దవాడు, గొప్ప తపసంపన్నుడు శక్తి మహర్షి. కల్మాషపాదుడు తను రాజుననే అహంకారంతో శక్తిమహర్షిని అవమానించాడు.

కల్మాషపాదుణ్ని శపించిన శక్తిమహర్షి

శక్తి మహర్షి కల్మాషపాదుడితో “రాజా! గొప్ప తపస్సంపన్నులైన బ్రాహ్మణులు ఎదురుగా వస్తున్నప్పుడు వినయంగా పలకరించి, భక్తితో పక్కకి తప్పుకుని దారి ఇవ్వాలి. నువ్వు నీ ధర్మాన్ని వదిలి పెట్టి నన్ను తప్పుకోమని అవమానంగా మాట్లాడుతున్నావు” అన్నాడు.

మహర్షి మాటలకి కోపగించిన కల్మాషపాదుడు “నేను ధర్మమార్గంలోనే ఉన్నాను. నేనెందుకు తప్పుకోవాలి?” అని చేతిలో ఉన్న కొరడా కర్రతో మహర్షిని కొట్టాడు. మహర్షి కోపంతో ఎరుపెక్కిన కళ్లతో అతణ్ని “నువ్వు రాక్షస బుద్ధితో కారణం లేకుండానే నన్ను అవమనించావు కనుక, రాక్షసుడిగా నరమాంసం తింటూ జీవించు” అని శపించాడు. అతడు వశిష్ఠుడి కొడుకు శక్తి మహర్షి అని తెలుసుకుని కల్మాషపాదుడు శాపవిమోచనం కలిగించమని వేడుకున్నాడు.

ఆ సమయంలో విశ్వామిత్రుడు అక్కడికి వచ్చి కనపడకుండా దాక్కుని జరుగుతున్నదాన్ని చూస్తున్నాడు. వెంటనే కింకరుడు అనే రాక్షసుణ్ని పిలిచి కల్మాషపాదుడి మనస్సులో ప్రవేశించమని చెప్పాడు. కింకరుడు విశ్వామిత్రుడు ఆజ్ఞపించడం, శక్తిమహర్షి శాపం రెండింటి వల్ల కల్మాషపాదుడి మనస్సులోకి తేలికగా ప్రవేశించగలిగాడు.

రాక్షసుడు తనలో లేనప్పుడు కల్మాషపాదుడు రాజ్యానికి సంబంధించిన పనులు చేసేవాడు. రాక్షసుడు తనలో ఉన్నప్పుడు రాచకార్యాలు పట్టించుకునేవాడు కాదు. ఒకరోజు కల్మాషపాదుడి దగ్గరికి ఆకలితో బాధపడుతున్న ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. అతడికి భోజనం పెడతానని మాట ఇచ్చి మర్చిపోయాడు. మర్నాడు ఉదయం అప్పటికే రాక్షసుడు ఆవహించి ఉన్న కల్మాషపాదుడు వంటవాణ్ని పిలిచి బ్రాహ్మణుడికి నరమాంసంతో భోజనం పెట్టమని చెప్పాడు.

అది తెలుసుకున్న బ్రాహ్మణుడు నేను తినకూడని మాంసంతో నాకు భోజనం పెట్టావు కనుక, రాక్షసుడుగా మరుతావని శపించాడు. బ్రాహ్మణుడి శాపంతో కల్మాషపాదుడు మనిషి రూపం విడిచి రాక్షసుడిగా మారాడు. శక్తి మహర్షి దగ్గరికి వచ్చి “నీ కారణంగానే ఈ శాపాలన్నీ వచ్చాయి. దీని ఫలితాన్ని నువ్వే అనుభవించు” అని చెప్పి అతణ్ని చంపేశాడు. తరువాత విశ్వామిత్రుడి ప్రేరణ వల్ల వశిష్ఠుడి కొడుకులందరినీ చంపేశాడు.

పుత్రశోకంతో ఆత్మహత్యకి ప్రయత్నించిన వశిష్ఠుడు

వశిష్ఠుడు గొప్ప తపస్సంపన్నుడే అయినా రాక్షసుడి చేతిలో మరణించిన తన కొడుకుల్ని చూసి చాలా దుఃఖపడ్డాడు. పర్వతరాజు హిమవంతుడు భూభారాన్ని ఎలా మోస్తున్నాడో అంత కష్టంగా వశిష్ఠుడు కూడా తన కొడుకుల్ని పోగొట్టుకున్న దుఃఖభారాన్ని మోస్తున్నాడు. ఆత్మహత్య మహాపాపమని తెలిసికూడా మనస్సు స్వాధీనంలో లేక అగ్ని ప్రవేశం చేశాడు. అతడి తపోమహిమ వల్ల అగ్ని చల్లగా మారిపోయింది.

ఎలాగయినా ప్రాణాలు వదిలెయ్యాలని అనుకుని మెడకి ఒక పెద్ద రాయిని కట్టుకుని సముద్రంలోకి దూకాడు. సముద్రుడు భయపడి తన అలల చేతులతో జాగ్రత్తగా మహర్షిని ఒడ్డుకి చేర్చాడు. వందమంది కొడుకులు ఒకేసారి చచ్చిపోవడం వల్ల మనస్సు వికలమై ఉన్న వశిష్ఠుడు బాధ తీరక మేరు పర్వతం మీదకి ఎక్కి కిందకి దూకాడు. ఎప్పుడూ వ్రత నియమాలతో ఉండే పవిత్రమైన అతడి శరీరానికి ఏ కష్టమూ కలగ లేదు. ఇంకా పట్టుదలతో మొసళ్లు ఎక్కువగా ఉన్న నదిలోకి దూకాడు. ఆ మహానది అతణ్ని తాకడానికి కూడా భయపడింది. నూరు మార్గాల్లో ప్రవహించి అతడు పడిన చోట మెరక ఏర్పడింది. అప్పటి నుంచి ఆ నది ’శతద్రువు’ అనే పేరుతో ప్రసిద్ధికెక్కింది.

వశిష్ఠుడు పెద్ద పెద్ద తాళ్లతో తనని తాను కట్లు కట్టుకుని నదిలో దూకాడు. ఆ నది బాధపడి అతడి తాళ్లన్నీ విప్పి ఒడ్డుకి చేర్చింది. అప్పటి నుంచి ఆ నదికి ’విపాశ’ అని పేరుతో పిలవబడింది. ఆత్మహత్య చేసుకోడానికి అనేక రకాలుగా ప్రయత్నించి సాధ్యపడక తిరిగి తన ఆశ్రమం వైపు బయలుదేరాడు. తన వెనుకే నడిచి వస్తున్న కోడల్ని చూశాడు. ఆమె శక్తిమహర్షి భార్య, పేరు ‘అదృశ్యంతి’. ఆమె గర్భం నుంచి ఆరు అంగాలతో కలిసిన వేదధ్వని చాలా మనోహరంగా వినిపిస్తోంది. అది విని వశిష్ఠుడు ఆశ్చర్యపోయాడు.

శక్తిమహర్షి చదివినట్టు వేదనాదం స్పష్టంగాను, మధురంగాను వినిపిస్తోంది. గొప్ప విద్వాంసులతో పొగడబడే కుమారుడు ఆమె గర్భంలో ఉన్నాడని తెలుసుకున్నాడు. శక్తి మహర్షి ఎప్పుడూ వేదాలు చదువుతూనే ఉండేవాడు. పన్నెండు సంవత్సరాలు తండ్రి చేసిన వేదపారాయణ వింటూ వేదాలన్నీ నేర్చుకున్న మనుమడు కోడలు గర్భంలోనే ఉన్నాడని, త్వరలో బయటకి రాబోతున్నాడని అర్థం చేసుకున్నాడు. తన మనుమడి ముఖం చూసి ధన్యుణ్నవుతాను అనుకున్నాడు.

తరువాత ఆత్మహత్య ప్రయత్నాన్ని మానుకుని ఆశ్రమంలోనే ఉండిపోయాడు. ఒకరోజు రాక్షసుడి రూపాన్ని ధరించి వచ్చిన కల్మాషపాదుణ్ని చూసి అదృశ్యంతి భయపడింది. వశిష్ఠుడు అమెని భయపడవద్దని ధైర్యం చెప్పి ఒకసారి హుంకరించి రాక్షసుణ్ని కదలకుండా చేశాడు. తన కమండలం నుంచి నీళ్లు తీసి ఆ రాక్షసుడి మీద చల్లాడు. అప్పటికి పన్నెండేళ్ల నుంచి రాక్షస రూపంలో ఉండి అనేక పాపాలు చేసిన కల్మాషపాదుడు మనిషి రూపాన్ని పొందాడు.

వశిష్ఠుడికి నమస్కారం చేసి “మహర్షీ! మీ దయ వల్ల శాపవిముక్తుణ్ని అయ్యాను” అన్నాడు. అతణ్ని చూసి వశిష్ఠుడు “మంచిగుణాలతో బ్రాహ్మణ భక్తుడవై, భూమి మీద నివసించే ప్రజలందరికీ ఇష్టుడవై, కోపాన్ని జయించి, సుఖంగా జీవించు. బ్రాహ్మణుల్ని అవమానిస్తే ఇంద్రుడి పరాక్రమం కూడా నిలబడదు” అన్నాడు. వశిష్ఠుడి మాటలు విని కల్మాషపాదుడు అప్పటి నుంచి ఆయన చెప్పినట్టే నడుచుకోవాలని నిర్ణయించుకున్నాడు. వసిష్ఠమహర్షిని హస్తినాపురానికి తీసుకుని వెళ్లి ఆయన్ని పూజిస్తున్నాడు.

కల్మాషపాదుడు రాక్షసుడుగా ఉన్నప్పుడు ఒకసారి తన భార్య మదయంతితో కలిసి అడవిలో తిరుగుతున్నాడు. ఆ సమయంలో ఆకలిగా ఉన్న కల్మాషపాదుడు కలిసి కబుర్లు చెప్పుకుంటున్న బ్రాహ్మణ దంపతుల్ని చూసి బ్రాహ్మణుణ్ని పట్టుకుని చంపి తినేశాడు. అతడి భార్య తన భర్తని చంపి తనకి సంతానం లేకుండా చేసాడన్న బాధతో కల్మాషపాదుడికి సంతానం లేకుండా పోతుందని చెప్పింది. మళ్లీ దయతలిచి వసిష్ఠమహర్షి వల్ల పుత్రలాభం కలుగుతుందని శాపవిమోచనం కూడా ఇచ్చి అగ్ని ప్రవేశం చేసింది.

తరువాత ఆ విషయం మదయంతి కల్మాషపాదుడికి చెప్పింది. జరిగినదంతా కల్మాషపాదుడు వసిష్ఠమహర్షికి చెప్పాడు. “మహర్షీ! మనువు వంశాన్ని పవిత్రం చేసేవాడు, సూర్యుడితో సమానమైన మంచి కొడుకు కలిగేలా అనుగ్రహించండి. మీ దయ వల్ల నేను పితృదేవతల ఋణం తీర్చుకుంటాను” అని ప్రార్థించాడు.

మదయంతి వశిష్ఠుడి అనుగ్రహంతో గర్భం దాల్చింది. పన్నెండేళ్లు గర్భాన్ని మోసి మోసి విసుగు పుట్టి ఒకరోజు మదయంతి ఒక రాతిముక్కతో తన కడుపుని తనే చీల్చుకుంది. ఆమెకి అశ్మకుడు అనే పేరుగల రాజర్షి కలిగాడు. వశిష్ఠుడి కోడలు అదృశ్యంతికి పరాశరుడు పుట్టాడు. పరాశరుడికి వశిష్ఠుడు జాతకర్మ మొదలైనవి జరిపించాడు. పరాశరుడు తన తండ్రిని రాక్షసుడు చంపేశాడని తల్లి ద్వారా తెలుసుకుని కోపగించాడు. తన తపోమహిమతో లోకాలన్నింటినీ నాశనం చెయ్యాలని నిర్ణయించుకున్నాడు.

ఆ విషయం తెలుసుకున్న వశిష్ఠుడు పరాశరుడితో “నాయనా! పూర్వం కార్తవీర్యుడు అనే రాజు భృగువంశానికి చెందిన బ్రాహ్మణుల్ని యజ్ఞకర్తలుగా నియమించుకున్నాడు. ఎన్నో యాగాలు చేసి వాళ్లకి ఎక్కువ ధనాన్ని దానంగా ఇచ్చాడు. కొంతకాలానికి అతడు స్వర్గానికి చేరాడు. అతడి వంశం వాళ్లు ధనాశతో కార్తవీర్యుడి ధనాన్ని భృగువంశంలో ఉన్న బ్రాహ్మణులు తీసేసుకుని దాచుకున్నారని అందరికీ చెప్పడం మొదలెట్టారు.

కొంతమంది బ్రాహ్మణులు తమ దగ్గర ఉన్న ధనాన్ని పోగుచేసి వాళ్లకి ఇచ్చేశారు. మరి కొంతమంది తమ దగ్గరున్న ధనాన్ని ఇతర బ్రాహ్మణులకి పంచి ఇచ్చేశారు. ఇంకా కొంతమంది తమ ఇళ్లల్లోనే పాతిపెట్టుకున్నారు. ఆ క్షత్రియులు వదలకుండ భృగువంశ బ్రాహ్మణుల ఇళ్లన్నీ తవ్వి దాచిన ధనాన్ని చూశారు. కోపంతో రాజధనాన్ని దొంగిలించారని చెప్పి బ్రాహ్మణుల్ని పిల్లల్ని అందరినీ చంపేశారు.

ఆడవాళ్లని కూడా వెదికి పట్టుకుని వాళ్ల కడుపులో ఉన్న బిడ్డల్ని చంపెయ్యడం మొదలుపెట్టారు. ఆ విషయం తెలుసుకున్న బ్రాహ్మణుల భార్యలందరూ హిమలయాలకి పరుగెత్తి అక్కడ దాక్కున్నారు. అందులో ఒక బ్రాహ్మణుడి భార్య కడుపులో ఉన్న తన కుమారుణ్ని తొడలో దాచుకుని రక్షించింది.

భార్గవుడైన ఔర్వుడి పుట్టుక

అది తెలుసుకున్న క్షత్రియులు ఆమె గర్భంలో ఉన్న పసివాణ్ని చంపెయ్యాలని హిమాలయాలకి వెళ్లారు. అప్పటికే ప్రళయకాలంలో సూర్యుడికి ఉన్నంత కాంతితో ఔర్వుడు అనే పేరుతో పసివాడు భూమి మీదకి వచ్చేశాడు. ఔర్వుడికి ఉన్న అమితమైన తేజస్సుని చూడలేక అక్కడికి వెళ్లిన కృతవీర్యుడి వంశంలో పుట్టిన క్షత్రియులు అందరూ గుడ్డివాళ్లయ్యారు. ఎక్కడికీ వెళ్లలేక అక్కడున్న పర్వతాల్లోనే తిరుగుతున్నారు. దుర్మార్గులకి ఎప్పటికైనా శిక్షపడే తీరుతుంది.

గుడ్డివాళ్లైన క్షత్రియులందరూ ఔర్వుడి తల్లి దగ్గరకి వచ్చి “అమ్మా! మాకు చూపుని ప్రసాదించు!” అని వేడుకున్నారు. ఆమె వాళ్లతో “మీ చూపుని నేను పోగొట్టలేదు. నా కుమారుడు సూర్యుడి తేజస్సుతో సమానమైన తేజస్సు, గొప్ప తపోబలం కలవాడు. వంద సంవత్సరాలు నా తొడలోనే ఉండి వేదవేదాంగాలు అన్నీ నేర్చుకున్నాడు. తన తండ్రితాతల్ని మీరు అవమనించారని కోపగించి మీ పాపపు బుద్ధికి తగినట్టు చేశాడు. మీరు అతణ్నే ప్రార్థించండి. మిమ్మల్ని కరుణిస్తాడు” అని చెప్పింది.

ఆమె మాటలు విని క్షత్రియులు అతణ్ని భక్తితో ప్రార్థించారు. ఔర్వుడు కనికరించి వాళ్లకి చూపుని ప్రసాదించాడు.వాళ్లు తిరిగి తమ రాజ్యానికి వెళ్లిపోయారు. ఔర్వుడు తన తండ్రులు, బంధువులు అందరూ ఒక్కసారిగా మరణించినందుకు బాధపడ్డాడు. కోపంతో లోకాలన్నీ నాశనం చెయ్యాలన్న దీక్షతో తపస్సు చెయ్యడం ప్రారంభించాడు.

ఔర్వుణ్ని శాంతింపచేసిన పితృదేవతలు

ఔర్వుడు చేస్తున్న తీవ్రమైన తపస్సుకి ముల్లోకాలు వణికి పోతున్నాయి. పితృలోకంలో ఉన్న అతడి తాత తండ్రులందరూ ఔర్వుడి దగ్గరికి వచ్చేశారు. తపస్సు వల్ల వచ్చిన గొప్ప తేజస్సుతో ప్రకాశిస్తున్న ఔర్వుణ్ని సంతోషంగా చూస్తూ ప్రశాంతంగా “నాయనా! నీ తపస్సు తీవ్రతకి లోకాలన్నీ భయపడి పోతున్నాయి. నువ్వు కోపాన్ని వదిలిపెడితే లోకాలకి మేలు జరుగుతుంది.

మమ్మల్ని క్షత్రియులు చంపలేదు. ధనం మీద ఆశతో మేము ధనాన్ని కూడా దాచలేదు. మాకు ధనం కావాలంటే కుబేరుడు తనే తెచ్చి ఇస్తాడు. తపోమహిమ వల్ల మాకు ఆయుష్షు పెరిగిపోయింది. మానవ లోకంలో ఉండడం మాకు ఇష్టం లేదు. ఆత్మహత్య చేసుకుంటే పుణ్యలోకాలు రావు. అందుకని క్షత్రియులతో వైరం కల్పించుకున్నాము. అదే కారణంతో శరీరాన్ని వదిలి వెళ్లిపోయాము. భృగువంశ బ్రాహ్మణుల తేజస్సుని తగ్గించగల వాళ్లు ఎవరున్నారు. నువ్వు ప్రజలకి బాధ కలిగించవద్దని కోరుకుంటున్నాము” అని చెప్పారు.

వాళ్లు చెప్పినది విని ఔర్వుడు “ పితృదేవతలారా! గొప్పదైన నా తపోమహిమతో లోకాలన్నీ నాశనం చేస్తానని ఇంతకు ముందే ప్రతిజ్ఞ చేశాను. దాన్ని నెరవేర్చే తీరాలి. భూమి, ఆకాశము, దిక్కులు, సూర్యచంద్రులు ఉన్నంత వరకు నేను అన్నది జరిగే తీరుతుంది. పాపాన్ని ఆపడానికి లోకంలో సామర్థ్యం ఉన్నవాళ్లు కూడా అసలు ప్రయత్నించలేదు. అందుకే కోపం వచ్చి నేను ఈ ప్రతిజ్ఞ చేశాను. లోకాలన్నింటినీ దహించ వలసిన కోపాగ్నిని ఆపితే అది నన్నే దహించి వేస్తుంది. నాకు, ఈ లోకాలకి మంచి జరిగేలా ఇప్పుడేం చెయ్యాలో ఉపాయం చెప్పండి” అన్నాడు

పితృదేవతలు ఔర్వుడితో “నాయనా! అన్ని లోకాలు నీటిలోనే ఉంటాయి. కనుక, భయంకరమైన నీ కోపాగ్నిని సముద్రంలో విడిచిపెట్టు. నీ ప్రతిజ్ఞ నెరవేరుతుంది. అది సముద్రంలో ఉన్న నీటిని దహిస్తుంది” అన్నారు. పితృదేవతల మాటలు విని ఔర్వుడు తన కోపాగ్నిని సముద్రంలో వదిలేశాడు. అది ఔర్వాగ్ని అనే పేరుతో గుర్రపు ముఖంతో సముద్రపు నీటిని తాగుతూ ఉంటుంది.

ఇది వేదాల్లో వినిపిస్తున్న కథ. నువ్వు కూడా ఔర్వుడిలా ధర్మం తెలిసినవాడివి కనుక, లోకాల్ని నాశనం చేసే నీ కోపాన్ని విడిచిపెట్టు” అని వశిష్ఠుడు చెప్పినది విని పరాశరుడు తన కోపాన్ని తగ్గించుకున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here