మహాభారత కథలు-49: ద్రుపదుడి దగ్గరికి వచ్చిన వ్యాసమహర్షి

0
11

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

ద్రుపదుడి దగ్గరికి వచ్చిన వ్యాసమహర్షి

[dropcap]అం[/dropcap]దరూ సందేహంలో ఉన్న సమయంలో వాళ్ల సందేహాన్ని పోగొట్టడానికి సూర్యుడి తేజస్సుని కూడా కప్పేసేటంత తేజస్సుతో వేదవ్యాసుడు అక్కడికి వచ్చాడు. ఆయన వస్తుండగానే దిక్కులన్నీ గొప్ప కాంతితో వెలిగిపోయాయి. ఆయన్ని చూస్తూనే కుంతీదేవి, పాండవులు, ద్రుపదుడు లేచి వినయంతోను, భక్తితోను ఆయనకి నమస్కరించారు. బంగారం, మణులతో తయారైన ఎత్తైన ఆసనం మీద ఆయన్ని కూర్చోబెట్టారు. అర్ఘ్యపాద్యాలు ఇచ్చి పూజించారు.

ఆ మహర్షి వాళ్ల మంచి చెడ్డలు అడిగి తెలుసుకున్నాడు. ద్రుపదుడు తన రెండు చేతులూ జోడించి నమస్కరించి “మహర్షీ! ధర్మపరుడైన ధర్మరాజు మేము అయిదుగురం ఈ ద్రౌపదిని పెళ్లి చేసుకుంటాము అన్నాడు. మీకు లోకాచారం తెలుసు. పూర్వుల్లో ఎవరేనా పెద్దల అనుమతితో ఇలా చేసినవాళ్లు ఉన్నారా? మహాత్ముడా! ధర్మాధర్మాలు నిర్ణయించడం చాలా కష్టం. ధర్మబద్ధంగా ఉండేలా ఏం చెయ్యాలో మీరే నిర్ణయించి చెప్పండి. ఆ విధంగానే నడుచుకుంటాము” అన్నాడు.

 ద్రుపదుడి మాటలు విని ధర్మరాజు “వేళాకోళానికి కూడా నా మాటలో అబద్ధం, నా మనస్సులో అధర్మం ఉండదు. ధర్మప్రకారమే నేను చెప్తున్నాను. ఇవ్వచ్చా.. ఇవ్వకూడదా? అని ఆలోచించకుండా ద్రౌపదిని మా అయిదుగురికి ఇచ్చి పెళ్లి చెయ్యండి. పూర్వం గౌతమ వంశంలో పుట్టిన ‘జటిల’ అనే మహర్షి కూతురు తన తపోబలంతో ఏడుగురు ఋషులకి తను ఒక్కత్తే భార్య అయింది. దాక్షాయణి అనే ముని కన్యక ఒకే పేరుతో ప్రచేతసులు అనబడే పదిమందికి భార్య అయింది. ఈ విధంగా ఎక్కువమందిని పెళ్లి చేసుకున్నవాళ్లు ఎంతోమంది ఉన్నారు. అదీకాక గురువుల్లో తల్లి ఉత్తమ గురువు. అటువంటి తల్లి మాటని, బ్రహ్మ చేసిన పనిని మార్పు చెయ్యడం ఎవరికీ సాధ్యం కాదు” అన్నాడు.

ధర్మరాజు మాటలు విని ద్రుపదుడు “ధర్మసూక్ష్మాన్ని నిర్ణయించడం మన వల్ల కాదు. ముల్లోకాలతో నమస్కరించబడుతున్న వేదవ్యాసుడు మూల్లోకాల్లోనూ నడుస్తున్న విజ్ఞానానికి నిధి. ఆయన ఎలా ఆజ్ఞాపిస్తే అలాగే జరుగుతుంది” అన్నాడు.

ద్రుపదుడు చెప్పింది విని వేదవ్యాసుడు “ధర్మరాజు తత్త్వం తెలిసినవాడు. ధర్మ మార్గాన్ని విడిచి ఎందుకు మాట్లాడుతాడు? కుంతీదేవి అబద్ధం చెప్పదు. వీళ్లు చెప్పిన మాటలు దేవతల అభిప్రాయాలు ఒక్కటే. వేరే అలోచన వదిలిపెట్టి ద్రౌపదిని ఈ అయిదుగురికీ ఇచ్చి పెళ్లి చెయ్యి. దీనికి సంబంధించిన అసలు విషయాన్ని వినాలని ఉంటే నాతో రా!” అని చెప్పి ద్రుపదుడి చెయ్యి పట్టుకుని ఇంటి లోపలికి పిలుచుకుని వెళ్లాడు.

ద్రుపదుడికి ఇంద్రసేన కథ చెప్తున్న వేదవ్యాసుడు

వేదవ్యాసుడు ద్రుపద మహారాజుతో ఏకాంతంగా ద్రౌపది గురించి చెప్పాడు. “ఈమె పూర్వం నలుడి కుమార్తె అయిన ఇంద్రసేన. మౌద్గల్య మహర్షి భార్య, గొప్ప పతివ్రత. అతడు ముసలివాడు, కుష్ఠు రోగి. ఎముకలు, చర్మము మాత్రమే మిగిలి రోగంతో బాధపడుతూ ఉండేవాడు. ఎప్పుడూ బాధపడే శరీరంతోను, నెరిసిన వెండ్రుకలతోను, ముడుతలు పడిన చర్మంతోను, దుర్వాసన కల ముఖంతోను, బాధపడుతూ జీవించేవాడు. చాలా కోపంతోను, ఊడిపోతున్న గోళ్లతోను, పగులుతున్న చర్మంతోను ఉన్న ఆ మహర్షిని ఆమె పరమ భక్తితో సేవించింది. ఒకరోజు అతడు తిని వదిలిన ఎంగిలి అన్నాన్ని తింటూ ఉండగా అతడి బొటన వేలు తెగి అన్నంలో ఉండడం కనిపించింది. దాన్ని తీసి పడేసి అసహ్య పడకుండా మిగిలిన అన్నాన్ని ఇష్టంగా తింటున్న ఆమెని చూశాడు మహర్షి.

ఆమె పాతివ్రత్యానికి మెచ్చుకుని ఏం కావాలో కోరుకోమన్నాడు. ఆమె “మహాత్మా! నాకు శరీర సౌఖ్యాలు అనుభవించాలని ఉంది. మీరు ఈ రూపాన్ని వదిలి అందమైన మీకు ఇష్టమైన రూపంతో ఐదు భాగాలుగా విభాగం పొంది నాకు సౌఖ్యాన్ని అందించండి” అని అడిగింది.

మహర్షి ఆమె అడిగినట్టు అయిదు దేహాలు ధరించాడు. మానవలోకంలో, దేవలోకంలో ఉన్న బ్రహ్మర్షులు, దేవతలు తనను పూజిస్తూ ఉండగా సూర్య రథాన్ని ఎక్కి ఆకాశ గంగలో స్నానం చేసి చంద్రుడి కిరణాల్లో ఉండి, మేరుపర్వతం, కైలాసపర్వతాల్లో విహరిస్తూ కొన్ని వేల సంవత్సరాలు ఎన్నో చోట్ల ఇంద్రసేనతో కలిసి సుఖాన్ని అనుభవించాడు. తరువాత ఆమెని వదిలిపెట్టి గొప్ప తపస్సు చేసి బ్రహ్మత్వాన్ని పొంది బ్రహ్మలోకానికి వెళ్లాడు. ఆమె మాత్రం తృప్తి పడలేదు కాని కాలం గడిచాక మరణించింది. తరువాత జన్మలో కాశీరాజు అనే రాజర్షికి కూతురుగా పుట్టింది.

చాలాకాలం కన్యగానే ఉండిపోయి తన దురదృష్టానికి బాధపడి శివుణ్ని గురించి తపస్సు చేసింది. సౌందర్యవంతురాలైన ఆమె దగ్గరికి యముడు, వాయువు, ఇంద్రుడు, అశ్వినీదేవతలు వేరువేరుగా వచ్చి తరువాత జన్మలో తమ అంశలతో పుట్టినవాళ్లకి ఆమెని భార్యగా ఉండమని కోరుకున్నారు. తరువాత అమె కొంతకాలం గాలి, నీరు ఆహారంగా తీసుకుని, మరి కొంతకాలం ఏ ఆహారమూ లేకుండాను ఒకే పాదం మీద నిలబడి, అయిదు అగ్నుల మధ్యలో ఉండి మహా భయంకరమైన తపస్సు చేసింది.

ఈశ్వరుడు ప్రత్యక్షమై ఆమెని వరం కోరుకోమన్నాడు. “నాకు పతిదానం ఇయ్యి” అని ప్రబలమైన కోరికతో అయిదుసార్లు అడిగింది. ఈశ్వరుడు అమె కోరిక ప్రకారం తరువాత జన్మలో ఆమెకి అయిదుగురు భర్తలుండేలా వరమిచ్చాడు. అది విని అమె “ఈశ్వరా! స్త్రీకి భర్త ఒక్కడు ఉంటాడుగాని చాలామంది భర్తలు ఉంటారా? ఇంతకుముందు ఎక్కడైనా ఉందా? లోకానికి విరుద్ధంగా ఉండే కోరిక పొందడం నాకు ఇష్టం లేదు” అంది.

ఆమె మాటలు విని ఈశ్వరుడు “నువ్వు అయిదుగురు భర్తలతో జీవించినా కూడా ధర్మానికి ఏ ఆపదా రాదు. అందుకే నీకు ఈ వరమిచ్చాను” అని చెప్పి ఆమెకు కావలసిన వరాలు ఇంకా ఇచ్చాడు. తరువాత ఈశ్వరుడు గంగా తీరంలో ఉన్న ఇంద్రుణ్ని తన దగ్గరికి తీసుకుని రమ్మని చెప్పాడు. కాశీరాజు కూతురు ఈశ్వరుడికి ప్రదక్షిణ నమస్కారం చేసి వెంటనే గంగా తీరానికి వెళ్లింది. అక్కడ ఇంద్రుడి కోసం ఎదురు చూస్తూ కూర్చుంది.

పంచేంద్రియాల గురించి ద్రుపదుడికి చెప్పిన వేదవ్యాసుడు

యముడు నైమిశారణ్యంలో సత్రయాగదీక్ష ప్రారంభించాడు. ప్రాణిహింస మానెయ్యడం వల్ల మానవులందరూ మరణం లేకుండా జీవిస్తున్నారు. దాన్ని చూసి ఓర్వలేక ఇంద్రుడు మొదలైన దేవతలందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లారు. “మహానుభావా! మానవులందరూ మరణం లేకుండా జీవిస్తే ఇంక దేవతలమైన మాకు, మానవులకీ తేడా ఏముంటుంది?” అని అడిగాడు.

ఇంద్రుడి బాధని అర్థం చేసుకున్న బ్రహ్మ “ఇంద్రా! ఇందులో నువ్వు భయపడాల్సింది ఏదీ లేదు. ముందు యముడి సత్రయాగం పూర్తకానియ్యి. తరువాత ఇంతకు ముందు ఎలా చేశాడో అలాగే మనుషులకి మరణం వచ్చేలా చేస్తాడు. యముడి తేజస్సు, మీ తేజస్సు ధరించి సూర్యుడి తేజస్సు వంటి తేజస్సు కలవాళ్లు అయిదుగురు యముడు చేసే పనికి కారణంగా జన్మిస్తారు” అని చెప్పాడు.

బ్రహ్మదేవుడు చెప్పినది విని దేవతలందరూ వెనక్కి తిరిగి వెళ్లిపోయారు. ఇంద్రుడు ముందు నడుస్తుండగా దేవతలు అతణ్ని అనుసరించారు. అందరూ గంగానదీ తీరానికి చేరుకున్నారు. వాళ్లకి నీళ్లల్లో ఏడుస్తూ కూర్చుని ఉన్న ఒక అమ్మాయి కనిపించింది. ఏడ్చి ఏడ్చి ఆమె కళ్లు ఎర్రతామర పువ్వుల్లా అయిపోయాయి. ఇంద్రుడు ఆశ్చర్యంతో అమెను చూసి “ఎందుకు ఏడుస్తున్నావు? ఎక్కడి నుంచి వచ్చావు?” అని అడిగాడు.

ఇంద్రుడు అడిగిన దానికి అమె “ఇంద్రా! నా ఏడుపుకు కారణం తెలుసుకోవాలని అనుకుంటే వెంటనే బయలుదేరి నా వెంట రండి!” అంది. అమె వెంట బయలుదేరి వెడుతున్నాడు ఇంద్రుడు. అతడికి హిమాలయ పర్వత గుహలో రత్నాలతో నిండిన అరుగు కనిపించింది. దాని మీద ఉన్న సింహాసం మీద ఒక యువకుడు యువతితో జూదమాడుతూ కనిపించాడు.

అతణ్ని చూసి ఇంద్రుడు కోపంతో “స్థావరజంగమాలతో నిండిన ఈ బ్రహ్మాండమంతా నాది. ఈ మూడు లోకాలు నా చేతిలో ఉన్న వజ్రాయుధంతోనే రక్షించబడుతున్నాయి. నేను దేవేంద్రుణ్ని! నన్ను లక్ష్యపెట్టకుండా నా ఎదురుగా ఇంత గొప్ప సింహాసనం మీద కూర్చుని విలాసంగా జూదమాడుతున్నారు. ఇటువంటి పనిని మీరు చెయ్యకూడదు” అని అన్నాడు.

ఆ మాటలు విని ఆ యువకుడు కోపంతో భయంకరంగా ఉన్న ఆకారంతో ఇంద్రుణ్ని చూసి “నేను ఆనందంగా ఆడుకుంటూ ఉంటే అడ్డువచ్చిన ఆ పొగరుబోతుని పట్టి తీసుకుని రా!” అని తనతో కలిసి ఆడుతున్న యువతిని పంపించాడు. అమె వచ్చి అతడి చెయ్యి పట్టుకోగానే ఆ చేతి స్పర్శకి ఇంద్రుడు చలనం లేకుండా నేలమీద పడిపోయాడు. అతడితో యువకుడు “నువ్వు నాతో చాలా అహంకారంతో మాట్లాడావు. ఈ పర్వత రంధ్రాన్ని తెరిచి దాన్ని విరక్కొట్టి నీ బలాన్ని నిరూపించుకో” అన్నాడు.

శివుడు చెప్పినట్టు ఇంద్రుడు పర్వత రంధ్రాన్ని రెండు చేతులతో ఎత్తి పట్టుకుని స్యూర్య కిరణాల్ని రెండు పాయలుగా చేసినట్టు చీల్చాడు. ఆ రంధ్రంలో తనలాగే గొప్ప శరీరంతో వెలుగుతున్న మరో నలుగురు కనిపించారు. వాళ్లని చూసి “నేను ఇలా అయిదు రూపాలుగా ఎందుకు కనిపిస్తున్నాను?” అని అడిగాడు.

ఇంద్రుడి సందేహానికి ఆ యువకుడు “దేవతల మేలు కోసం మీ అయిదుగురు ఇంద్రులు మానవస్త్రీకి మహానుభావులైన కొడుకులుగా జన్మించండి” అని ఆజ్ఞాపించాడు. ఇంద్రుడు ఆ యువకుడు శివుడని గుర్తించాడు. ఆ అయిదుగురు ఇంద్రులు యముడు, వాయుదేవుడు, ఇంద్రుడు, అశ్వనీదేవతలు. వాళ్ల అంశలతో ధర్మరాజు భీమార్జున నకులసహదేవులుగా జన్మించారు.

బ్రహ్మాది దేవతలు ప్రార్థించడం వల్ల విష్ణుమూర్తి యొక్క తెలుపు, నలుపు వెంట్రుకల జంట దేవతల మేలు కోసం బలరామకృష్ణులుగా అవతరించారు. వాళ్లల్లో శ్రీకృష్ణుడు ఆ అయిదుగురికీ సహాయపడుతూ ఉంటాడు. ఆ అయిదుగురు ఇంద్రులకీ ఒకే భార్యగా తపస్సు చేసి లక్ష్మీస్వరూపురాలైన యాజ్ఞసేని యజ్ఞవేదిలో జన్మించింది. నీకు నమ్మకం లేకపోతే వీళ్ల పూర్వ శరీరాలు చూపిస్తాను చూడు” అని వ్యాసమహర్షి ద్రుపదమహారాజుకి దివ్యదృష్టిని ఇచ్చాడు.

అందమైన రత్నాల కాంతులు గుంపులుగా ప్రసరిస్తున్న చిత్రమైన రంగులు కలిగిన కిరీటాలు, బరువైన దండలతో సూర్యుడిలా ప్రకాశిస్తూ, అగ్నివంటి రూపాలు, బంగారంతో చెయ్యబడిన కడియాల వంటి ఆభరణాలు, తాటిచెట్టంత పొడవైన దేహాలు కలిగిన ఆ అయిదుగురినీ ద్రుపదుడు చూశాడు. అంతేకాకుండా అపురూపమైన సౌందర్యంతో ఆ అయిదుగురికీ బార్య అవడానికి తపస్సు చేసిన కన్య యొక్క మొదటి శరీరాన్ని చూసి ఆశ్చర్యపడ్డాడు.

సంతోషంతో వెలిగి పోతున్న ముఖంతో ఉన్న ద్రుపదుడితో వ్యాసుడు “పూర్వం ‘నితంతుడు’ అనే పేరుగల రాజర్షికి సాల్వేయ, శూరసేన, శ్రుతసేన, బిందుసార, అతిసారులు అనే అయిదుగురు కొడుకులు. వాళ్లు అంతులేని బలపరాక్రమాలు కలవాళ్లు. వాళ్లు ఒకళ్లమీద ఒకళ్లు ప్రేమ, వినయం కలిగి గొప్పవాళ్లుగా పెరుగుతూ స్వయంవరంలో ఔశీనర రాజకుమార్తె ‘అజితని’ వివాహం చేసుకున్నారు.

సౌందర్యవంతురాలైన ఆ రాజకుమార్తె యందు నితంతుడి కుమారులు అయిదుగురు ఎవరికి వాళ్లు సంతానాన్ని పొందారు. పూర్వం కూడా ఇటువంటివి చాలా జరిగాయి. ఇది దైవ నిర్ణయం. కనుక, పాండవులు అయిదుగురికి ద్రౌపదిని ఇచ్చి వివాహం జరిపించు” అని చెప్పి ద్రుపదమహారాజుని ద్రౌపదీపాండవుల వివాహానికి ఒప్పించాడు.

ద్రౌపది వివాహ మహోత్సవము

వ్యాసమహర్షి ద్రుపదుడు కుంతీ పాండవులు ఉన్న చోటుకి తిరిగి వచ్చాడు. ధర్మరాజుతో “ఈ రోజు మంచి రోజు. చంద్రుడు ప్రేమగా రోహిణితో కలిసి ఉన్నాడు. మీ అయిదుగురు శాస్త్రోక్తంగా ద్రౌపదిని వివాహం చేసుకోండి!” అని ఆజ్ఞాపించాడు.

ద్రుపదమహారాజు అంతులేని సంతోషంతో పట్టణానికి ఎనిమిది రకాల మంగళ చిహ్నాల్ని అలంకరించేలా చేసి వివాహ మహోత్సవానికి అంకురార్పణ చేశాడు. లోపల వెలుపల ద్వారాల్ని పోక, అరటి స్తంభాలతోను; కొత్త మామిడి, రావి చిగుళ్లతో ఉన్న దండలతోను అలంకరించారు. ద్వారాల ముందు ఉన్న ముంగిళ్లలో మంచిగంధం నీళ్లు చల్లి, పచ్చకర్పూరాలు, మంచిముత్యాలతో ముగ్గులు వేసారు. వివాహమహోత్సవం కోసం మంగళ ప్రదమైన అలంకారాలతో వచ్చిన వేశ్యలు తమకు నియమించిన పనుల్లో నిమగ్నమయ్యారు.

ద్రౌపదీపాండవుల స్వయంవరం చూడ్డానికి వచ్చిన అనేకమంది రాజులు, మిత్రులు, బంధువులు, బ్రాహ్మణులతో క్రిక్కిరిసిపోయి ఉంది ద్రుపదుడి ఇల్లు. రంగు రంగు బట్టలతో కట్టబడిన తెరల మీద నుంచి వేలాడుతున్న ముత్యాలు, పూలదండలు, స్తంభాలకి చుట్టూ చక్కగా చుట్టబడిన పట్టువస్త్రాలు, కొత్త చివుళ్లు, బియ్యపు అక్షతలు నిండిన బంగారు పూర్ణ కలశాలు, పేలాలు నేతితో నిండిన బంగారు పాత్రలు, సువాసనలు విరజిమ్మే రకరకాల పువ్వులు, సమిధలు, దర్భలు, సన్నెకల్లు, యజ్ఞపాత్రలతో ఎంతో అందంగా ఉంది.

వివాహవేదికని నల్లని మరకత మణుల కాంతి కలిగిన రంగుతో అలికి, దానికి మధ్యలో మండుతున్న హోమకుండం ఉంచారు. కళ్యాణమంటపాన్ని అనేక విధాలుగా అందంగా అలంకరించారు. పాండవుల పురోహితుడు ధౌమ్యుడు, బ్రాహ్మణులందరితో కలిసి వచ్చాడు. పుణ్యాత్ములైన పాండవులు మంగళస్నానం చేసి, విలువైన రత్నాభరణాలు ధరించి వచ్చారు.

నిండుచంద్రుడి వంటి ముఖం కలిగిన ద్రౌపదిని ముత్తైదువులు అలంకరించారు. కమలాలవంటి కళ్లు గల ద్రౌపదిని వెంట తీసుకుని అందమైన వెయ్యిమంది స్త్రీలు వచ్చారు. బ్రాహ్మణుల పుణ్యాహధ్వని; మంగళగీతాల మధురమైన ధ్వని; పిల్లనగ్రోవులు, వీణలు మొదలైన వాద్యాల ధ్వని దిక్కులన్నీ వ్యాపిస్తూ మధురంగా వినిపించాయి.

పండితులందరికీ ఇష్టమైన పురోహితుడు ధౌమ్యుడు అన్నివైపులకి విస్తరించి ప్రజ్వరిల్లుతున్న అగ్నిహోత్రంలో దహనమయ్యేట్టు వివాహ సమయంలో చెయ్యవలసిన మంత్రపూర్వకమైన ఆహూతుల్ని వేశాడు. తరువాత మొదట ధర్మరాజుకి ద్రౌపదిని ఇచ్చి వివాహం చేశాడు. ఒకసారి వివాహమైనా కూడా ఆమె కన్యగానే ఉండేట్టు ఈశ్వరుడు వరమిచ్చాడు. కనుక, ఆ కన్యని ధౌమ్యుడు భీమార్జున నకుల సహదేవులకి కూడా ఇచ్చి వివాహం జరిపించాడు.

ఆ సమయంలో ద్రౌపదీపాండవుల వివాహం చూడ్డానికి వచ్చిన ప్రజల ఆశీర్వాదాలు, ఆకాశంలో మోగుతున్న దేవతల భేరుల ధ్వనితో కలిసి ముల్లోకాలు వ్యాపించాయి. అప్పుడే వికసిస్తున్న పువ్వుల వాసన నెమ్మదిగా వీస్తున్న గాలితో కలిసి ఆ ప్రదేశమంతా నిండిపోయి వాతావరణం ఆహ్లాదంగా మారింది.

వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పిన ధృష్టద్యుమ్నుడు, ద్రౌపది జన్మించిన కథలని సూతమహర్షి శౌనకుడు మొదలైన మునులకి చెప్పాడు.

ఆదిపర్వంలోని ఏడవ ఆశ్వాసం సమాప్తం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here