మహాభారత కథలు-52: ఇంద్రప్రస్థపురంలో పాండవులు

0
14

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

ఇంద్రప్రస్థపురాన్ని నిర్మించిన విశ్వకర్మ

[dropcap]శ్రీ[/dropcap]కృష్ణుడు ఇంద్రుణ్ని తలుచుకున్నాడు. ఇంద్రుడు వచ్చి అమరావతితో సమానంగా ఉండే నగరాన్ని నిర్మించమని దేవ శిల్పి విశ్వకర్మని ఆజ్ఞాపించాడు. వ్యాసుడు, ధౌమ్యుడు మొదలైన పెద్దలు నగరానికి కావలసిన కొలతలు వేసి శాంతికర్మలు చేశారు. భూలోకానికి వచ్చిన విశ్వకర్మ ఇంద్రుడు ఆజ్ఞాపించినట్టు పవిత్రమైన అందమైన ప్రదేశంలో ఇంద్రప్రస్థపురం అనే మహానగరాన్ని నిర్మించాడు. ఆ నగరం ఇంద్రుడు (అమరావతి), కుబేరుడు (అలకాపట్టణం), వరుణుడు (శ్రద్ధావతి), నాగరాజు (భోగవతి) రాజధానులతో సమానంగా నిలిచింది.

ఇంద్రప్రస్థపురంలో పాండవులకి ప్రేమతో కట్టించిన ఎత్తైన బంగారు మేడలు హిమాలయపర్వతాలతో పోటీ పడుతున్నట్లు ఉన్నాయి. ఎత్తైన శిఖరాలు ఆకాశమంతా వ్యాపించి మేఘాల్లో ఉన్న మెరుపు తీగల్లా కాంతిని వెదజల్లుతున్నాయి. తెల్లటి చంద్రకాంతి మణులతో ఉన్న అరుగులు, పెద్దపెద్ద పొదరిళ్లు, వాటినుంచి జాలువారే నీటి ప్రవాహాలు, గంగానదిలో నిర్మలంగా కదులుతున్న నీటిలా కదులుతూ జండాలతో ప్రకాశిస్తోంది ఇంద్రప్రస్థపురం. నగరానికి బయట తెల్లతెగడ, తాటి, మామిడి మొదలైన వరుసగా ఉన్నచెట్లతో అందమైన ఉద్యానవనాలతో చూడ ముచ్చటగా ఉంది. నది అలలమీదుగా ఉద్యానవనాల మధ్య నుంచి రావడం వల్ల చల్లదనము, పూలపరిమళాలతో కలిసి నగరంలో తిరిగే గాలి ఆహ్లాదంగా ఉంది.

వ్యాసుడు, శ్రీకృష్ణుల అనుమతి తీసుకుని, ధౌమ్యుడు మొదలైన ఉత్తమమైన బ్రహ్మణుల వేదఘోషలు, ప్రజలందరి ఆశీర్వచనాలు, మృదువుగా మధురంగా వినిపించే శుభప్రదమైన సంగీత రాగాలు, వివిధ రకాలైన వాద్య ధ్వనుల మధ్య తమ్ముళ్లతో కలిసి ఇంద్రుడిలా వెలిగిపోతూ నగర ప్రవేశం చేశాడు ధర్మరాజు. తమ్ముళ్లు నలుగురు ప్రేమతో తన మాటని పాటిస్తూ ఉండగా, అన్ని లోకాలవాళ్లు ప్రశంసిస్తుండగా.. రాజ్యపాలనని పవిత్రమైన యజ్ఞంగాను, నలుగురు తమ్ముళ్లని నలుగురు ఋత్విక్కులుగాను భావించి సంతోషంగా రాజ్యపాలన చేస్తున్నాడు ధర్మరాజు.

పుణ్యాత్ముడు, వేదాలు చదివినవాడు, గొప్ప యజ్ఞాలు చేస్తున్నవాడు, మనువుతో సమానమైన ధర్మ ప్రవర్తన కలవాడు, అన్ని వర్ణాల ఆశ్రమాలను రక్షించేవాడు, ఇచ్చిన మాటని నిలబెట్టుకునేవాడు, శత్రువులు లేనివాడు, భరత వంశంలో గొప్ప కీర్తి కలిగిన ధర్మరాజుని రాజుగా పొందిన భూమండలం పులకరించింది. కురువంశ సంపద స్థిరంగా నిలబడింది. మంచి బంధువు దొరికినట్లు ధర్మం ఆనందపడింది. శరత్కాలంలో పూర్ణచంద్రుడి వెన్నెల్లో ఉన్నంత హయిగా ధర్మరాజు పాలనలో జీవించిన ప్రజలు సుఖంగా తమ జీవితాన్ని గడిపారు.

స్వచ్ఛమైన ధర్మ ప్రవర్తన కలిగిన ధర్మరాజు వల్ల ప్రజలు రోగాలు, దొంగలు, శత్రుదేశాల బాధలు లేకుండా సంపదలతో తులతూగుతున్నారు. రాజ్యంలో బ్రాహ్మణులు యజ్ఞాలు చేయించడం, వేదాలు చదివించడం, దానం చెయ్యడం, పుచ్చుకోవడం వంటి ఆరు విధాలైన పనులు చేస్తూ ఉండేవాళ్లు. క్షత్రియులు, వైశ్యులు బ్రాహ్మణులంటే భక్తి కలిగి ధర్మ మార్గంలో నడుస్తూ, పుణ్యకార్యాలు చేస్తూ, యజ్ఞాలు చేస్తూ, వేదాలు చదువుతూ దానాలు చేస్తూ జీవిస్తూ ఉండేవాళ్లు. నాలుగు వర్ణాల వాళ్లు బ్రాహ్మణులకి సేవ చేస్తూ ధర్మపరులై నడుచుకున్నారు. ధర్మరాజు రాజ్యం ధర్మరాజ్యంగా ప్రకాశించింది. కొంతకాలం గడిచాక పాండవులు కొంత స్థిరపడ్డారు.

ఒకరోజు శ్రీకృష్ణుడు పాండవులతో “నారదమహర్షి మీ దగ్గరికి వస్తాడు. అతడు చెప్పినట్టు నడుచుకోండి” అని చెప్పి ద్వారకా నగరానికి వెళ్లిపోయాడు. పాండవులు తమ పరాక్రమంతో రాజులందరితో స్నేహంగా ఉంటూ సుఖంగా ఉన్నారు

పాండవుల దగ్గరికి వచ్చిన నారదుడు

పవిత్రమైన వేదాలతత్వం తెలిసినవాడు, తపస్సంపన్నుడు, మూడు లోకాల్లో ఉండే ప్రజల మంచిని కోరేవాడు, దేవతలతో పూజింపబడేవాడు, సూర్యుడితో సమానమైన తేజస్సు కలవాడు, బ్రహ్మదేవుడి కొడుకు అయిన నారదమహర్షి పాండవుల దగ్గరికి వచ్చాడు. ధర్మరాజు తన తమ్ముళ్లతో కలిసి ఋషుల్లో గొప్పవాడైన నారదమహర్షికి భక్తితో నమస్కారం చేశాడు. ఎత్తైన ఆసనం మీద కూర్చోబెట్టి తగినట్టుగా పూజించాడు. వినయంగా నాదమహర్షితో “మహర్షీ! మీరు రావడం వల్ల మా జన్మ ధన్యమైంది. మీ దర్శనం కలగడానికి మేమెంతో పుణ్యం చేసుకుని ఉండాలి” అన్నాడు ధర్మరాజు.

తరువాత ద్రౌపదిని పిలిచి నారదమహర్షికి నమస్కారం చెయ్యమని చెప్పాడు. నారదమహర్షి అందరినీ ఆశీర్వదించి, ద్రౌపదిని లోపలికి పంపించి పాండవులతో మాట్లాడాడు. “మీకు అన్ని ధర్మాలు తెలుసు. రాజులందరూ మిమ్మల్ని గౌరవిస్తారు. మీరు కూడా ఒకళ్లతో ఒకళ్లు స్నేహంగా ఉంటారు. ద్రౌపది ఒక్కతే మీ అయిదుగురికీ భార్య అయింది. ఇది లోకవిరుద్ధమే కాదు, శాస్త్రవిరుద్ధం కూడా. ఆందమైన ఈ ద్రౌపది వల్ల మీలో మీకు విరోధం కలగకుండా చూసుకోవాలి. పూర్వం సుందోపసుందులు అనే పేరుగల రాక్షసవీరులైన అన్నదమ్ములు ఒక స్త్రీ కోసం ఒకళ్లతో ఒకళ్లు పోట్లాడుకుని మరణించారు. ఆ కథ వినిపిస్తాను వినండి” అని చెప్పాడు.

సుందోపసుందుల కథ

ధర్మరాజు నారదుణ్ని సుందోపసుందుల గురించి చెప్పమన్నాడు. నారదుడు చెప్పడం మొదలుపెట్టాడు. “పూర్వం దితి కొడుకు హిరణ్యకశిపుడి వంశంలో నికుంభుడు అనే రాక్షసుడికి సుందోపసుందులు అని ఇద్దరు కొడుకులు కలిగారు. తపస్సు చేసి తమకి కావలసినవన్నీ పొందాలనుకుని వింధ్యపర్వత ప్రాంతానికి వెళ్లారు. ఇంద్రియాల్ని అదుపులో పెట్టుకుని ఎండాకాలంలో అయిదు అగ్నుల మధ్య.. వర్షాకాలం, చలికాలాల్లో నీటిమడుగుల్లోను గాలిని భోంచేస్తూ.. ఒంటికాలి మీద నిలబడి చేతులు పైకెత్తి, తలలు వంచి చాలాకాలం తపస్సు చేశారు. వాళ్లు చేస్తున్న తపస్సు తీవ్రతకి వింధ్యపర్వత గుహల్లో విపరీతమైన పొగ బయలుదేరింది.

ఆ పొగ ఆకాశమంతా వ్యాపించింది. దాన్ని చూసి దేవతలు భయపడ్డారు. వాళ్ల తపస్సు భగ్నం చెయ్యాలని ప్రయత్నించి విఫలమయ్యారు. అందరూ కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లి విషయం చెప్పారు. దేవతలకి మేలు చెయ్యాలని అనుకుని బ్రహ్మదేవుడు సుందోపసుందుల దగ్గరికి వచ్చాడు. వాళ్లకి ప్రత్యక్షమై “మీకు ఏం కావాలో అడగండి ఇస్తాను” అన్నాడు.

సుందోపసుందులు బ్రహ్మదేవుణ్ని చూసి సంతోషంతో నమస్కారంచేసి “దేవా! మాకు కావలసిన కోరికలు చెప్తాము – ఇష్టమైన రూపం కలిగి, ఎక్కడికి కావాలనుకుంటే అక్కడికి వెళ్లగలిగి, మాయలన్నీ తెలుసుకుని, ఎవరితోనూ చావు లేకుండాను, అసలు చావే లేకుండా ఉండేలా మమ్మల్ని అనుగ్రహించు” అన్నారు. బ్రహ్మదేవుడు చావు లేకుండా ఉండడం అనే కోరిక తప్ప మిగిలినవన్నీ ఇచ్చాడు. బ్రహ్మదేవుడు ఇచ్చిన వరాలతో రాక్షసులు గొప్ప రాజ్య వైభవాన్ని పొందారు. లోకాలన్నింటినీ జయించాలని అనుకున్నారు. ఆనందంగా ‘అకలకౌముది’ అనే ఉత్సవాన్ని జరిపి ఇంకా బలాన్ని పొందారు.

సుందోపసుందులు గర్వంతో దేవతలు, గరుడులు, నాగులు, కిన్నరల పట్టణాల్ని కొల్లగొట్టారు. భూలోకంలో ఉన్న రాజుల్ని, ఋషుల్ని, బ్రాహ్మణుల్ని బాధించారు. బ్రాహ్మణులు చేస్తున్న యాగాలు, వేదపఠనాలు, శ్రాద్ధాలు, హోమాలు, తపస్సులు, దానాలు, జపాలు చెయ్యడం వల్ల పితృదేవతలు తృప్తిగా ఉంటున్నారన్న కోపంతో వాళ్ల పనులకి ఆటంకం కలిగిస్తున్నారు. సింహం, పెద్దపులి, ఏనుగు మొదలైన జంతువుల రూపాలతో అడవుల్లో తిరుగుతూ మునిపల్లెల్లోకి వెళ్లి మునుల్ని భయపెడుతున్నారు. వాళ్ల చేష్టలు భరించలేక మహర్షులందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లి సుందోపసుందులు లోకాలకి కీడు కలిగిస్తున్నారని చెప్పారు.

బ్రహ్మ మహర్షులు చెప్పింది విన్నాడు. వాళ్లని ఎవరూ చంపలేరు. ఒకళ్లతో ఒకళ్లు యుద్ధం చేసుకుని మాత్రమే చావాలి. కొంతసేపు ఆలోచించి విశ్వకర్మని పిలిచి అందమైన ఒక స్త్రీని సృష్టించమన్నాడు. విశ్వకర్మ బ్రహ్మ చెప్పినట్టు ‘తిలోత్తమ’ అనే అందమైన ఒక స్త్రీని సృష్టించాడు. దేవేంద్రుడు మొదలైన దేవతల, మహర్షుల పూజలు అందుకుంటున్న బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లి నమస్కారం చేసింది తిలోత్తమ.

బ్రహ్మ అమెని చూసి “వింధ్యపర్వత గుహల్లో సుందుడు, ఉపసుందుడు అనే ఇద్దరు రాక్షసులున్నారు. వాళ్లిద్దరూ అన్నదమ్ములు. వాళ్లు అన్ని లోకాల్లో ఉన్న ప్రజల్ని బాధలు పెడుతున్నారు. వాళ్లిద్దర్నీ ఎవరూ చంపలేరు. ఒకళ్లతో మరొకళ్లు పోట్లాడుకుని మరణించేలా నువ్వే చెయ్యాలి” అని ఆజ్ఞాపించాడు. తిలోత్తమ బ్రహ్మ చెప్పింది విని అలాగే చేస్తానని చెప్పి దేవసభకి ప్రదక్షిణం చేసింది.

తిలోత్తమ దేవసభకి ప్రదక్షిణం చేస్తున్నప్పుడు ఆమె అందం చూడ్డం కోసం బ్రహ్మ నాలుగు వైపుల నాలుగు ముఖాలు సృష్టించుకుని చతుర్ముఖుడయ్యాడు. దేవేంద్రుడు తన రెండు కళ్లతో చూస్తే తృప్తి కలగదని వెయ్యికళ్లవాడయ్యాడు. దేవతలు తిలోత్తమని చూసి మోహంలో పడ్డారు. అందరూ తన అందాన్ని చూస్తుండగా మెరుపు తీగలా వెలిగిపోతూ మానవ లోకంలో ఉన్న వింధ్యపర్వత ప్రాంతానికి చేరుకుంది.

తిలోత్తమని చుస్తూనే సుందోపసుందులు తాము అన్నదమ్ములమన్నమాట మర్చిపోయారు. తమ మధ్య ఉన్న స్నేహ బంధాన్ని కూడా మర్చిపోయారు. తిలోత్తమని చూడ్డంలో మునిగి పోయారు. ఒక ఆసనం మీదే కూర్చుంటూ, ఒక విస్తర్లోనే తింటూ, ఒక వాహనం మీదే ఎక్కుతూ, ఒకే ఇంట్లోనే ఉంటూ, ఒకే మంచం మీద పడుక్కుంటూ, ఒకళ్ల మాటని మరొకళ్లు గౌరవించుకుంటూ గొప్ప బలంతో కలిసి మెలిసి జీవిస్తున్న సుందోపసుందులు ఇద్దరు ఒకే అమ్మాయిని ఇష్టపడ్డారు.

ఈమెని నేను పెళ్లి చేసుకుంటాను అంటే, కాదు నేనే పెళ్లి చేసుకుంటాను అంటూ ఆమె రెండు చేతుల్ని చెరొకళ్లు పట్టుకుని తమ వైపు లాక్కుంటున్నారు. చివరికి మా ఇద్దరిలో ఎవరిని ఇష్టపడుతున్నావో చెప్పమని తిలోత్తమనే అడిగారు. ఒకసారి వాళ్లిద్దరి వైపు చూసింది తిలోత్తమ. “మొదట మీరు ఇద్దరూ ఒకళ్లతో ఒకళ్లు యుద్ధం చెయ్యండి. ఎవరు నెగ్గుతారో వాళ్లని నేను పెళ్లి చేసుకుంటాను” అని చెప్పింది.

సుందోపసుందుల మధ్య యుద్ధము

ఒకప్పుడు ఇద్దరూ స్నేహంగా మెలుగుతూ, అనందంగా మాట్లాడుకుంటూ, ఒకళ్ల మేలు మరొకళ్లు కోరుకుంటూ ఉండే వజ్రంవంటి శరీరం కలిగిన సుందోపసుందులు ఒకళ్లతో ఒకళ్లు విజృంభించి భయంకరంగా యుద్ధం చేసి చివరికి ఇద్దరూ చచ్చిపోయారు. ఎంత ధైర్యవంతులైనా స్త్రీల వల్ల విరోధం కలగక మానదు. కనుక, చక్కగా ఆలోచించుకుని ఒక ఏర్పాటు చేసుకోండి” అని చెప్పాడు.

పాండవులు నారదమహర్షి చెప్పినట్టు నడుచుకోడానికి అంగీకరించారు. అందరూ ఆలోచించుకుని ఒక ఒప్పందానికి వచ్చారు. ద్రౌపది ఒక్కొక్కళ్ల దగ్గర ఒక సంవత్సరం ఉండాలనీ, ద్రౌపది ఎవరి దగ్గర ఉంటుందో ఆ ఇంటికి మిగిలిన నలుగురూ వెళ్లకూడదనీ, ఒకవేళ ఎవరైనా తెలియక వెడితే వాళ్లు పన్నెండు నెలలు తీర్థయాత్రలుగాని, పవిత్రమైన వ్రతాలుగాని చెయ్యాలనీ అనుకున్నారు. అదే విషయాన్ని మహర్షి ఎదురుగా ప్రతిజ్ఞ చేశారు. తరువాత నారదుడు వెళ్లిపోయాడు. పాండవులు తమ ప్రతిజ్ఞ ప్రకారం నడుచుకుంటున్నారు.

కొంతకాలం గడిచాక ఒక బ్రాహ్మణుడు పాండవుల దగ్గరికి ఏడుస్తూ వచ్చాడు. అతడి ఏడుపు విని అర్జునుడు బ్రాహ్మణులకి కలిగిన బాధని తీర్చకపోతే పాపం వస్తుంది అనుకుని “ఎందుకు బాధపడుతున్నావు?” అని అడిగాడు. బ్రాహ్మణుడు “ధర్మపరుడైన ధర్మరాజు రాజ్యపాలన చేస్తుంటే బ్రాహ్మణులందరూ మాది ధర్మరాజ్యమని చెప్పుకుంటూ చాలా ఆనందంగా జీవిస్తున్నారు. అటువంటి రాజ్యంలో నేను నా హోమధేనువుని పోగొట్టుకున్నాను. ప్రజలందరితో కీర్తింప బడుతున్న అర్జునా! నా గోవుని ఎవరు ఎత్తుకెళ్లారో అతణ్ని వెతికి బంధించి నా గోవుని నాకు అప్పగించు. అది పోయిన దగ్గర్నుంచీ దాని దూడ ఆపకుండా అరుస్తూనే ఉంది. ఇంకా అలస్యం చేస్తే అది కూడా నాకు దక్కదు. వెంటనే ధనుర్బాణాలు తీసుకుని బయలుదేరు” అన్నాడు.

ఆయుధాలు ఉన్న ఇంట్లో ధర్మరాజు నివసిస్తున్నాడు. ఆ సమయంలో ద్రౌపది ధర్మరాజు దగ్గర ఉంది. ధనుర్బాణాలు తీసుకోవాలంటే ధర్మరాజు ఇంటికి వెళ్లాలి. తమ నియమం ప్రకారం అలా వెళ్లడం తప్పు. ఆ విషయం తెలిసి కూడా అర్జునుడు ఆపకుండా ఏడుస్తున్న ఆ బ్రాహ్మణుడి బాధ చూడలేక ఆయుధాలు ఉన్న ఇంటి వైపు వెళ్లాడు. ధనస్సు తీసుకుని దొంగల్ని పట్టుకుని మహాధేనువుని తీసుకుని వచ్చి బ్రాహ్మణుడికి అప్పగించాడు.

తరువాత ధర్మరాజు దగ్గరికి వెళ్లి నమస్కరించి “మహారాజా! లోక నియమాల్ని రక్షించ వలసిన మనమే నియమాన్ని తప్పి ప్రవర్తించేమని అపవాదు వస్తుంది. అది మనకి అపకీర్తిని కలిగిస్తుంది. కనుక, నేను ‘దశమాసిక’ వ్రతాన్ని చేస్తాను” అన్నాడు.

అతడి మాటలు విని ధర్మరాజు “అర్జునా! ఆవులకి, బ్రాహ్మణులకి ఆపద కలిగినప్పుడు రక్షించే సమయంలో ఎవరికీ పాపాలు అంటవు. నియమాన్ని అతిక్రమించేవని అనుకుని ఎందుకు బాధ పడుతున్నావు? దొంగల్ని చంపి ప్రజలకి రక్షణ కలిగిస్తే అశ్వమేథ యాగం చేసినంత పుణ్యం వస్తుందని, వాళ్లని వదిలేస్తే కడుపులో ఉన్న పసిపాపని చంపినంత పాపం కలుగుతుందని వేదాలు చెప్తున్నాయి. దొంగల్ని చంపి బ్రాహ్మణులకి మంచి చేసావు. కనుక, నియమం తప్పినప్పుడు చేసుకునే ప్రాయశ్చిత్తం నీకు అవసరం లేదు” అన్నాడు.

తీర్థయాత్రలకి వెళ్లిన అర్జునుడు

ధర్మరాజు మాటలు విని అర్జునుడు “ధర్మరాజా! కారణం లేకపోయినా ప్రజల వల్ల కలిగే నిందని మనం పోగొట్టుకోవాలి. మనం పాలకులం కాబట్టి ఏదో ఒక సాకు పెట్టి ధర్మం తప్పామని అనుకుంటారు” అన్నాడు. అర్జునుడి మాటకి అంగీకరించాడు ధర్మరాజు. ద్వాదశమాసిక వ్రత దానాన్ని అనుగ్రహించమని చెప్పి ధర్మరాజుకి నమస్కారం చేశాడు. అన్న దగ్గర, పెద్దలందరి దగ్గర అనుమతి తీసుకున్నాడు. నాలుగు వేదాలు పూర్తిగా చదువుకున్న బ్రాహ్మణులూ, శాస్త్రాలన్నీ ఔపాసనపట్టిన పండితులూ, పురాణకథలన్నీ వివరించి చెప్పగలిగిన పౌరాణికులూ తన వెంట నడుస్తుండగా తీర్థయాత్రలకి బయలుదేరాడు అర్జునుడు.

చంద్రవంశంలో గొప్పవాడైన అర్జునుడు బ్రాహ్మణుల్ని, పెద్దల్ని, గొప్ప యోగుల్ని, పుణ్యాత్ముల్ని పూజిస్తూ వాళ్లు చెప్తున్న పుణ్య కథల్ని వింటూ వెడుతున్నాడు. గంగాద్వారంలో శివుడి జటాజూటం నుంచి ప్రవహించి ఎప్పుడూ కదులుతూ ఉండే అలలతో పవిత్రమైన, విశాలమైన గంగానదిని పూజించి తన పాపాలన్నీ పోగొట్టమని ప్రార్థించాడు. ఆ గంగానదీ ద్వారంలోనే ఉంటూ ప్రతి రోజు గంగలో స్నానం, గంగ ఒడ్డు మీద హోమం చేస్తూ బ్రాహ్మణ శ్రేష్ఠులతో గడుపుతున్నాడు.

అర్జునుణ్ని కోరిన ఉలూచి

ఒకరోజు అర్జునుడు ఉదయాన్నే లేచి నియమ నిష్ఠలతో స్నానం చేసి, దేవ, ఋషి, పితృ తర్పణాలు చేసి, హోమం చెయ్యడానికి బయటికి వచ్చాడు. అందమైన నల్లటి శరీరం, ఐరావతం తొండంలా ఉన్న పెద్ద బాహువులు కలిగి ఉన్న పార్థుణ్ణి చూసి ఒక నాగ కన్య అతణ్ని నాగలోకానికి తీసుకుని వెళ్లింది. అక్కడ వెలుగుతున్న అగ్నిలో హోమకార్యం పూర్తి చేశాడు. తరువాత నాగకన్యని చూసి నవ్వుతూ “ఎవరు నువ్వు? నీ పేరేమిటీ? నన్ను ఎందుకు తీసుకొచ్చావు?” అని అడిగాడు.

నాగకన్యక అర్జునుణ్ని చూసి “నా పేరు ‘ఉలూచి’. ఐరావతుడు కద్రువ కొడుకు. ఐరావత వంశంలో పుట్టిన కౌరవ్యుడికి కూతుర్ని. ఇతరుల మేలు కోరే వాడివని నీ గుణగణాలు నాగకన్యకలు పాడే పాటల్లో విన్నాను. నిన్ను ఇష్టపడ్డాను. గంగానది ఒడ్డు మీద ఉన్న నిన్ను చూసి వచ్చాను” అని చెప్పింది.

ఉలూచి మాటలు విన్న అర్జునుడు “ఉలూచీ! నేను మా అన్నగారి ఆజ్ఞతో ద్వాదశమాసిక వ్రతాన్ని చేస్తున్నాను. అన్ని పుణ్య తీర్థాల్లో స్నానం చేస్తూ వేదవిదులైన బ్రాహ్మణులతో కలిసి బ్రహ్మచర్య దీక్షలో ఉన్నాను. ఇప్పుడు నీ కోరికని ఎలా తీర్చగలను?” అన్నాడు. అర్జునుడి మాటలు విని ఉలూచి తలవంచుకుని “మీ అన్నదమ్ములు అయిదుగురూ ద్రౌపది విషయంలో తీసుకున్న ప్రతిజ్ఞ, మీరు యాత్ర చెయ్యడానికి గల కారణము నాకు తెలుసు. నా కోరిక తీరకపోతే నేను ప్రాణత్యాగం చేస్తాను. తీర్థాలన్నీ సేవించడం, వ్రతాలు, దానాలు, ధర్మకర్మలు చెయ్యడం అన్నీ ప్రాణదానం కంటే గొప్పవి కావు. నేను ప్రాణం పోగొట్టుకోకుండా ఉండాలంటే నువ్వు నా కోరిక తీర్చాలి” అంది.

అర్జునుడు ఆమె కోరిక ప్రకారం అక్కడే ఉండిపోయాడు. అతడికి ‘ఇరావంతుడు’ అనే కుమారుడు కలిగాడు. ఆ రాత్రి అక్కడే గడిపిన అర్జునుడు ఉదయాన్నే గంగాతీరాన్ని చేరుకున్నాడు. జరిగిన విషయాన్ని బ్రాహ్మణులకి చెప్పాడు. తరువాత అందరూ కలిసి అక్కడనుంచి బయలుదేరారు. ప్రపంచమంతా కీర్తి కలిగిన అర్జునుడు హిమాలయానికి పక్కన ఉన్న ‘అగస్త్యవట’ పుణ్య క్షేత్రాన్ని, చాలా ఎత్తుగా ఉండే ‘భృగుతుంగ’ క్షేత్రాన్ని దర్శించాడు. తరువాత ‘హిరణ్యబిందు’ తీర్థానికి వెళ్లాడు. అక్కడ గోదానం, భూదానం, సువర్ణదానం వంటి అనేక దానాలు చేసాడు. యజ్ఞం చెయ్యడం కోసం వేలకొద్దీ ఆవుల్ని బ్రాహ్మణులకి ఇచ్చాడు.

తరువాత నైమిశారణ్యం వెళ్లి జగన్నాథుణ్ణి పూజించాడు. అక్కడి నుంచి ఉత్పలిని, కౌశిక, నంద, అపరనంద, గయ, గంగ, అంగాసాగర సంగమ స్థలము మొదలైన ప్రదేశాలు చూశాడు. తరువాత కళింగ దేశంలో ప్రవేశించాడు. అర్జునుడితో వచ్చిన కొంతమంది బ్రాహ్మణులు అక్కడి నుంచి ఉత్తర కురు దేశాలకి తిరిగి వెళ్లిపోయారు. మిగిలిన బ్రాహ్మణులతో కలిసి అర్జునుడు తూర్పు సముద్ర తీరంలో ఉన్న జగన్నాథుణ్ని సేవించాడు. మహేంద్ర పర్వతాన్ని చూసుకుంటూ దక్షిణగంగ అని పిలవబడుతున్న గోదావరీ నదిని, లోకానికే మొదటిదిగా పిలవబడుతున్న భీమేశ్వరాన్ని, గొప్పదైన శ్రీశైలాన్ని దర్శించాడు. శ్రోత్రియ బ్రాహ్మణుల అగ్రహారలతోను, ఉత్తములైన బ్రాహ్మణులు చేసిన యజ్ఞాల వల్ల కలిగిన పుణ్య ఫలంతోను నిండిన వేంగీదేశ గొప్పదనాన్ని చూశాడు. దక్షిణ సముద్ర తీరానికి వెళ్లి పాపాల్ని పోగొట్టే కావేరీ సముద్ర సంగమంలో బ్రాహ్మణోత్తములకి అనేక దానాలిచ్చాడు.

అర్జునుడు చిత్రాంగదల వివాహము

అర్జునుడు బయలుదేరి పదమూడవ మాసం జరుగుతోంది. అప్పటికి మణిపురమనే పేరు గల నగరానికి వెళ్లాడు. ఆ దేశపు రాజైన చిత్రవాహనుడి ఆదరాన్ని పొందాడు. అతడి కుమర్తె చిత్రాంగదని వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. అతడి కోరిక తెలుసుకున్న చిత్రావాహనుడు అర్జునుడితో “అర్జునా! నువ్వు నా కూతురు చిత్రాంగదని వివాహం చేసుకుంటానంటే నాకు సంతోషంగానే ఉంది. కాని, మొదట నేను చెప్పేది విను. పూర్వం మా వంశంలో ప్రభాకరుడు అనే గొప్ప రాజు ఉండేవాడు. అతడు సంతానం కోసం పరమేశ్వరుడి గురించి తపస్సు చేశాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షమై అతడికి ఒక కొడుకే కలుగుతాడని, అతడి వంశంలో వాళ్లందరికీ కూడా ఒకొక్క కొడుకే పుడతాడనీ వరమిచ్చాడు. అప్పటి నుంచి మా వంశంలో వాళ్లందరికీ ఒక్కొక్క కొడుకే పుడుతూ వచ్చారు.

నాకు మాత్రం కూతురు కలిగింది. నేను వంశాన్ని నిలబెట్టే విధంగా ఈమెని పెంచాను. కనుక చిత్రాంగదకు పుట్టే కుమారుడు మా వంశాన్ని నిలబెట్టే వాడుగా పెరగాలి. ఇది ఈమెకి నువ్వు ఇవ్వవలసిన కన్యాశుల్కం. అందుకు ఇష్టమైతే చిత్రాంగదని నువ్వు వివాహం చేసుకోవచ్చు” అన్నాడు. చిత్రవాహనుడి చెప్పినదానికి అర్జునుడు అంగీకరించి చిత్రాంగదని పెళ్లి చేసుకున్నాడు. సౌందర్యవంతురాలైన చిత్రాంగదతో కలిసి అర్జునుడు మణిపూర నగరంలో సంతోషంగా గడుపుతున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here