మహాభారత కథలు-55: ఖాండవ వన దహనానికి సహాయపడిన కృష్ణార్జునులు

0
8

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

ఖాండవ వన దహనానికి సహాయపడిన కృష్ణార్జునులు:

[dropcap]అ[/dropcap]గ్నిహోత్రుడు తమకు ఇచ్చిన ఆయుధాల్ని చూసి కృష్ణార్జునులు సంతోషంతో “అగ్నిహోత్రా! దేవేంద్రుడు దేవదానవులు అందరితో కలిసి దండెత్తి వచ్చినా జయిస్తాము. ఇంక ఆలోచించకుండా ఖాండవవనాన్ని దహించడం మొదలుపెట్టు” అని రథమెక్కి సిద్ధంగా ఉన్నారు.

అగ్నిహోత్రుడు సంతోషంగా అంతులేని కాంతితో వెలిగిపోయాడు. మేరు పర్వతం విరిగి ముక్కలయిందేమో అనిపించేంత పెద్ద శబ్దాలతోను, పెద్ద పెద్ద మంటలతోను ఖాండవవనాన్ని అక్రమించాడు. మృగాలు, పక్షులు, పాములు మొదలైన ప్రాణులన్నింటినీ కాల్చడం మొదలుపెట్టాడు. చక్రాయుధాన్ని ధరించిన శ్రీకృష్ణుడు, గాండీవాన్ని ధరించిన అర్జునుడు వనానికి రెండువైపులా నిలబడ్డారు. అంతలో ఖాండవవనాన్ని రక్షించడానికి నియమించబడిన బలవంతులైన రక్షకభటులు పరుగులు పెడుతూ వచ్చి మంటల్ని ఆర్పడానికి ప్రయత్నించారు. అర్జునుడు వేసిన బాణాలకి వాళ్లు మరణించారు.

అగ్నిదేవుడు భయంకరమైన పొడవైన నాలుకలు చాపుకున్నట్టు తన జ్వాలలతో వాయువుని కూడ కలుపుకుని ప్రళయాగ్నిలా ఖాండవ వనంలో విజృంభించాడు. అగ్నిహోత్రుడితో దహించబడుతున్న లవలి తీగలు, కర్పూరాలు, తక్కోలాలు, మంచిగంధాలు, నల్ల అగరులు, అందుగులు అనే చెట్ల మీద నుంచి పొగతో కలిసి వస్తున్న సువాసనలతో ఆకాశంలో విహరించే దేవతల, విద్యాధరల విమానాలు నిండి పోయాయి.

అగ్నిహోత్రుడి మంటలు, అర్జునుడు వేసిన బాణాలు ఖాండవ వనంలో చుట్టుముట్టాయి, భయపడుతున్న ప్రాణుల ఏడుపు ధ్వని.. సముద్ర మథనం జరిగేప్పుడు సముద్రం నుంచి వచ్చిన భయంకరమైన శబ్దంలా అనిపించింది. తప్పించుకుందామని పైకి ఎగరిన పక్షులు, నిప్పురవ్వల వల్ల రెక్కలు కాలి అగ్నిలోనే పడ్డాయి. అనేక రకాల ప్రాణులు కాలి పైకి ఎగిరి పడుతుంటే, వెలిగిపోతున్న అగ్నిహోత్రుడి కాంతిలో అగ్నిహోత్రుడే అనేక రూపాల్లో ఉన్నట్టు కనిపించాడు.

విజృంభించి జ్వలిస్తున్న అగ్ని వల్ల జలాశయాల్లో చేపలు, పక్షులు మొదలైన ప్రాణులు నీళ్ల మీద తేలుతూ కనిపించాయి. ఎర్రకలువలు, తెల్లకలువలు, నాచు తీగలు మాడిపొయాయి. ఖాండవ వనంలో నివసించే పెద్ద పాములు విషం కక్కుతూ అగ్ని జ్వాలల్లో పడి నశించిపోయాయి. దేవతలందరు ఎగిసిపడే మంటల్ని చూసి భయపడి దేవేంద్రుడి దగ్గరికి వెళ్లారు. ఖాండవవనానికి జరుగుతున్న వినాశనాన్ని గురించి చెప్పారు.

అది విని దేవేంద్రుడు తక్షకుణ్ని కాపాడాలని అనేక మేఘాల్ని వెంట పెట్టుకుని వచ్చాడు. అగ్నిహోత్రుడి మీద పెద్ద నీటి ధారలు కురిపించాడు. నిప్పుమంటల వేడి వల్ల ఆ నీటి ధారలు మధ్యలోనే ఎండిపోయాయి. ఉరుముతూ మెరుస్తూ నాలువైపులా పిడుగులు పడేట్టు అగ్నిహోత్రుడి మీద వానలు కురిపించమని దేవేంద్రుడు మేఘాల్ని ఆజ్ఞాపించాడు. దేవేంద్రుడు కురిపించే వర్షపు ధారలు ఒక్క చినుకు కూడా కింద పడకుండా అర్జునుడు ఖాండవ వనానికి వేలకివేల బాణాలతో ఇల్లు కట్టాడు. అర్జునుడు కట్టిన ఆ ఇంటిని దాటి బయటకి రాలేక వనంలో ఉన్న ప్రాణులన్నీ మంటల్లో పడి నాశనమవుతున్నాయి.

తక్షకుడి కుమారుడు అశ్వసేనుడు అనే పాము మంటలకి భయపడి తల్లిని తన తోకకి కరిపించుకుని అకాశంలోకి పరుగెత్తింది. దాన్ని అర్జునుడు చూశాడు. తల్లి తలతో సహా అతడి తోక తెగి నిప్పుమంటల్లో పడేలా బాణంతో కొట్టాడు. అశ్వసేనుణ్ని మళ్ళీ కొట్టబోతుంటే దేవేంద్రుడు అర్జునుడి మీద మోహిని అనే మాయని ప్రయోగించి అశ్వసేనుణ్ని విడిపించాడు.

కృష్ణార్జునులతో యుద్ధం చేసిన దేవేంద్రుడు

ఖాండవ వనంలో తక్షకుడు కాలిపోయాడేమో అని దేవేంద్రుడు కోపంతో మండిపడ్డాడు. అతడి ఆజ్ఞతో పెద్ద నీటి ధారలతో అనేక మేఘాలు ఒక్కసారిగా వచ్చి అన్ని దిక్కుల మధ్య ఉన్న ప్రదేశాల్ని, ఆకాశాన్ని కప్పేశాయి. దేవేంద్రుడు అర్జునుడి మీద వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. కొత్తగా వచ్చిన మేఘాల సమూహాన్ని చూసి అగ్నిహోత్రుడు భయంతో అర్జునుడి దగ్గరికి వచ్చాడు. అతణ్ని చూసి అర్జునుడు భయపడవద్దని చెప్పి వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించాడు.

అది మేఘాల గుంపుని చెదరగొట్టింది. దేవేంద్రుడికి కృష్ణార్జునుల మీద అంతులేని కోపం వచ్చింది. సురలు, గరుడులు, నాగులు, అసురులు, సిద్ధులు, గంధర్వులు అందర్నీ ఒకేసారి కృష్ణార్జునుల మీదకి యుద్ధానికి పంపాడు. అర్జునుడు తన దగ్గర ఉన్న దివ్య బాణాలతో దేవతల్ని అప్పటికప్పుడే ఓడించాడు. శ్రీకృష్ణుడు తన చక్రబలంతో గరుడుల్ని, నాగుల్ని, అసురుల్ని, ఆకాశ సంచారుల్ని ఓడించాడు. కృష్ణార్జునుల్ని చూసి దేవదైత్య నాయకులందరూ భయపడడం చూసి దేవేంద్రుడు ఆశ్చర్యపోయాడు.

దేవేంద్రుడు కృష్ణార్జునుల పరాక్రమం తెలుసుకోవాలనుకుని రాళ్లవర్షం కురిపించాడు. బాణాల్ని ప్రయోగించడంలో నిపుడైన అర్జునుడు అవలీలగా తన బాణ వర్షంతో రాళ్ల వర్షాన్ని ఆపేశాడు. దేవేంద్రుడు తన కుమారుడి పరాక్రమం చూసి చాలా సంతోషపడ్డాడు. ఇంక తృప్తి కలగక అగ్నిహోత్రుణ్ని అణిచివెయ్యాలని దివ్యరత్నాలతో వెలుగుతున్న మందర పర్వతాన్ని ఎత్తి వేగంగా అతడి మీద వేశాడు.

అది చూసిన అర్జునుడు శక్తివంతాలైన బాణాల్ని ప్రయోగించి దాన్ని ముక్కలు ముక్కలుగా చేశాడు. యుద్ధం చేస్తున్న వాళ్లల్లో దేవతలు, గరుడులు, నాగులు, సిద్ధులు, సాధ్యులు ఎవరూ శ్రీకృష్ణుడి చక్రయుధాన్నిగాని, అర్జునుడి బాణాల్నిగాని ఆపలేకపోయారు. ఆ సమయంలో ఆకాశవాణి ఇంద్రుడితో “దేవేంద్రా! గొప్ప తపస్సంపన్నులయిన నరనారాయణులు అనే మహర్షులే ఇప్పుడు కృష్ణార్జునులు అనే పేరుతో భూమి మీద పుట్టారు. నీకు వాళ్ల ఇద్దరి గొప్పతనం ఆశ్చర్యం కలిగిస్తోందా? వాళ్లిద్దరు చాలా గొప్పవాళ్లు, మహాత్ములు, యాదవ కౌరవ వంశాల కీర్తి ప్రతిష్ఠలు పెంచే ధర్మపరులైన ప్రభువులు. వీళ్లని ఓడించడం నీకు సాధ్యంకాదు.

పూర్వం దేవదానవ యుద్ధంలో రాక్షసుల్ని ఓడించారన్న విషయం నీకు తెలుసుకదా? నీ ప్రియ స్నేహితుడు తక్షకుడు ఇక్కడ లేడు. అగ్నిహోత్రుడు ఈ ఖాండవ వనాన్ని దహించడానికి ముందుగానే కురుక్షేత్రానికి వెళ్లిపోయాడు. కాబట్టి, అతడు తప్పించుకోగలిగాడు. అగ్నిహోత్రుడి వల్ల ఖాండవ వనం కాలిపోతుందని పూర్వమే బ్రహ్మదేవుడు చెప్పాడు. అందువల్లే ఈ ఖాండవవనం అగ్నిహోత్రుడికి ఆహారమైంది. ఇప్పుడు నువ్వు బాధపడ వలసింది ఏదీ లేదు” అని చెప్పింది. ఆకాశవాణి చెప్పిన మాటలు విని ఇంద్రుడు దేవతలతో కలిసి వెళ్లిపోయాడు.

మానవలోకానికే గొప్పవాళ్లు, బలవంతులైన కృష్ణార్జునులు మూడు లోకాలవాళ్లు భయపడేట్టు, ఆకాశం, దిక్కులు చిల్లులు పడేట్టు గట్టిగా సింహనాదం చేశారు. అదే సమయంలో నముచి అనే రాక్షసుడి తమ్ముడు ‘మయుడు’ ఖాండవవనంలో మంటల్లో చిక్కుకుని పోయాడు. బయటపడేందుకు దారి దొరకక తక్షకుడి ఇంట్లో తిరుగుతున్నాడు. అగ్ని తనని చుట్టుముట్టడం, కృష్ణుడు తనని చంపడానికి రావడం చూసి అర్జునుడి వెనుక దాక్కున్నాడు. శరణని అడిగిన వాళ్లని కాపాడే మనసుగల అర్జునుడు మయుణ్ని రక్షించాడు.

అగ్నిహోత్రుడి నుంచి మొత్తం ఆరుగురు తప్పించుకో గలిగారు. వాళ్లు మయుడు, అశ్వసేనుడు, మందపాలుడి కుమారులు శారంగకులు అనే వాళ్లు నలుగురు. మిగిలిన ప్రాణులన్నీ అగ్నిహోత్రుడికి ఆహుతయ్యారు.

మందపాలోఖ్యానము

వైశంపాయనుడు చెప్పినదాన్ని విని జనమేజయుడు “నిర్మలమైన జ్ఞానసంపద కలిగిన వైశంపాయన మహర్షీ! మయుడు, అశ్వసేనుడు అగ్నిహోత్రుడి బారి నుంచి ఏ విధంగా తప్పించుకున్నారో పూర్తిగా తెలిసింది. కాని, మందపాలుడి కుమారులు శారంగకులు నలుగురు ఎలా తప్పించుకున్నారో తెలుసుకోవాలని ఉంది. అది కూడా వివరించండి” అని అడిగాడు.

జనమేజయుడి సందేహాన్ని తీర్చడానికి వైశంపాయనుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. “జనమేజయ మహారాజా! పూర్వం మందపాలుడు అనే మహారాజు ఉండేవాడు. అతడు బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తూ వెయ్యి దేవతా సంవత్సరాలు నిష్ఠతో తపస్సు చేశాడు.

తరువాత యోగాభ్యాసంతో శరీరాన్ని విడిచిపెట్టాడు. కాని, పుణ్యలోకాలు చేరలేకపోయాడు. పుణ్యలోకాలు చేరలేక పోడానికి తను చేసిన పాపం ఏమిటని దేవతల్ని అడిగాడు. గొప్ప తపస్సంపన్నుడైన ఆ మహర్షితో దేవతలు “మునీశ్వరా! ఎంత తపస్సు చేసినా నీకు సంతానం లేదు. సంతానం లేని వాళ్లు పుణ్యలోకాలకి అర్హులు కాదు. కనుక, నువ్వు ముందు సంతానాన్ని పొందు” అని చెప్పారు.

దేవతలు చెప్పింది విని మందపాలుడు మళ్లీ మానవ లోకానికి వచ్చాడు. వెంటనే సంతానాన్ని పొందాలంటే ఏం చెయ్యాలా.. అని ఆలోచించాడు. సంతానం పక్షుల్లో ఎక్కువ కనుక తను మగ ‘లావుక’ పక్షి ఆకారాన్ని పొందాడు. ఆడ లావుక పక్షి ‘జరిత’తో కలిసి జరితారి, సారిసృక్క, స్తంబమిత్ర, ద్రోణుడు అనే నలుగురు కొడుకుల్ని పొందాడు. వాళ్లుగొప్ప బ్రహ్మజ్ఞానం కలిగిన వాళ్లని ఖాండవ వనంలో ఉంచాడు. తరువాత తన మొదటి భార్య ‘లపిత’ దగ్గరికి వచ్చేశాడు.

ఒక రోజు ఖాండవ వనం దగ్గర భార్యతో కలిసి తిరుగుతూ అగ్నిహోత్రుడు ఖాండవవనాన్ని కాల్చెయ్యడం చూశాడు. అగ్నిసూక్తాలతో అగ్నిహోత్రుణ్ని స్తోత్రం చేసి “లోకాలకి ఉపకారం చేసే గొప్ప గుణం కలవాడా! అగ్నిహోత్రా! నువ్వు పరిపూర్ణమైన ధర్మమూర్తివి. ఈ అడవిలో నాకు పుట్టిన నలుగురు కుమారులు లావుకపిట్టలు ఉన్నారు. వాళ్లని దయతో రక్షించు” అని ప్రార్థించాడు. అందువల్ల ఆ నలుగుర్ని అగ్నిదేవుడు రక్షించాడు.

అడవిలో అన్ని వైపులా మంటలు వ్యాపించడం చూసిన జరిత తన నలుగురు కుమారుల వైపు చూసి బాధపడింది. “అయ్యో! వీళ్లకి ఇంకా రెక్కలు కూడా రాలేదు. నిప్పు మంటలు చూసి భయంతో వణికిపోతున్నారు. ఎక్కడికీ వెళ్లలేని పసివాళ్లు. వీళ్లని వెంట తీసుకుని వెళ్లలేను. వీళ్ల తండ్రి విడిచిపెట్టి వెళ్లినట్టు వీళ్లని ఇక్కడే వదిలి పెట్టి నిర్దయగా కూడా వెళ్లలేను. అయినా కర్మని తప్పించుకోవడం ఎవరికి సాధ్యమవుతుంది!” అని ఏడుస్తోంది.

పిల్లలతో “నాయనలారా! అగ్నిదేవుడు దిక్కులన్నీ కప్పేస్తూ వేగంగా ఇటువైపు కూడా వచ్చేస్తున్నాడు. ఏం చెయ్యాలో తెలియట్లేదు. మీరు నలుగురు ఈ బొరియలోకి వెళ్లండి. మంటల వేడి మీకు తగలకుండా మట్టితో ఈ బొరియని కప్పేస్తాను. మహర్షి కోరుకున్నట్టు బ్రహ్మజ్ఞానం కలిగిన నలుగురు కొడుకుల్ని కన్నాను. మహాత్ములైన మీకు ఆపద కలగకుండా పెంచమని నాకు చెప్పారు. ఇటువంటి ప్రమాద పరిస్థితుల్లో ఆయన మన దగ్గర లేరు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఎలా రక్షించుకోగలనూ?” అని ఏడుస్తోంది.

తమను రక్షించడం కోసం బాధ పడుతున్న తల్లిని చూసి పెద్ద కొడుకు జరితారి “అమ్మా! కలుగులోకి దూరితే అందులో ఉన్న ఎలుక మమ్మల్ని చంపేస్తుంది. బయట ఉంటే అగ్నిదేవుడు కాలుస్తాడు. ఎలుక చేతిలో చచ్చిపోడం కంటే అగ్నిజ్వాలల్లో పడి చచ్చిపోతే మాకు పుణ్యలోకాలు కలుగుతాయి. అంతేకాదు, మేము ఇంకా మాంసపు ముద్దలం కనుక, బొరియలో దూరితే ఎలుక మమ్మల్ని తప్పకుండా తినేస్తుంది. మేము బయటే ఉంటే అగ్నిప్రమాదం తప్పే అవకాశం ఉంటుంది. పెద్ద గాలి వచ్చి మంటలు మమ్మల్ని తాకకుండా ఉండవచ్చు.

కష్ట సమయాల్లో బాధ ఉండవచ్చు లేదా తప్పిపోవచ్చు. బాధ తప్పిపోడానికి అవకాశం ఉన్న చోటే ఉండాలి. బాధ తప్పదు అన్నచోట ఉండకూడదు. అమ్మా! మేము బిలం లోపలికి వెళ్లం. నువ్వు మా మీద ఉన్న మమకారాన్ని వదిలిపెట్టు. మేము కాలిపోయినా ఫరవాలేదు. నువ్వు బతికి ఉంటే మళ్లీ కొడుకుల్ని పొందవచ్చు. నువ్వు చేసుకున్న పుణ్యం వల్ల మాకు అగ్ని ప్రమాదం తప్పిపోతే నువ్వు మళ్లీ మా దగ్గరికి వచ్చి ఎప్పటిలా మమ్మల్ని కాపాడుతూ ఉంటావు” అని కొడుకులు నలుగురూ తల్లిని ప్రార్థించారు.

కన్నీళ్లతో జరిత పిల్లలవైపు చూస్తూండగానే పక్కన ఉన్న చెట్లని, పొదల్ని దహించడానికి ఉత్సాహంగా వచ్చేస్తున్న అగ్నిహోత్రుడు కనిపించాడు. అతణ్ని చూసి ప్రాణభయంతో జరిత ఆకాశంలోకి ఎగిరిపోయింది. బ్రహ్మజ్ఞానులైన జరిత కొడుకులు నలుగురూ బ్రహ్మదేవుడి నాలుగు ముఖాల్లా నాలుగు వేదాలతో స్తోత్రం చేస్తూ తమను కాపాడమని అగ్నిహోత్రుణ్ని ప్రార్థించారు. అగ్నిహోత్రుడు అంతకు ముందే మందపాలుడు చేసిన ప్రార్థన గుర్తుకు వచ్చి ఆ నలుగురూ ఉన్న చెట్టుని భక్షించకుండా వదిలేశాడు. జరిత అది చూసి సంతోషంతో కొడుకుల దగ్గరికి వచ్చి వాళ్లతో సంతోషంగా ఉంది.

మందపాలుడు దేవేంద్రుడి ఖాండవవనం అగ్నిహోత్రుడు దహించేసాడని విన్నాడు. అందులో ఉన్న తన నలుగురు కొడుకుల్ని తలుచుకుని దుఃఖించాడు. తన మొదటి భార్య లపితతో “చిన్నవాళ్లు, రెక్కలు, కాళ్లు రానివాళ్లు అయిన శారజ్ఞ్గేయుల్ని జరిత ఒక్కతే ఆపద నుంచి కాపాడి ఎక్కడికి తీసుకెళ్లగలదు? అగ్నిహోత్రుడికి నా ప్రార్థన గుర్తు ఉందో లేదో? ఒకవేళ గుర్తు ఉన్నా నా పిల్లల్ని గుర్తించలేడేమో? గుర్తుపట్ట కలిగిన సమయం వచ్చినప్పుడు రక్షించకుండా మోసగిస్తాడేమో? ఎవరినీ నమ్మలేము కదా” అన్నాడు.

మందపాలుడితో లపిత “మునీశ్వరా! నువ్వు అగ్నిదేవుణ్ని నా ఎదురుగానే కదా ప్రార్థించావు? అప్పుడు ఆయన నీ పిల్లలు శారజ్ఞ్గేయుల్ని రక్షిస్తానని చెప్పాడు కదా! భార్య మీద ప్రేమతో నువ్వు దాని యోగక్షేమాలు విచారిస్తున్నావు. జరిత ఒక పక్షి. ఎక్కడికైనా ఎగిరిపోగలదు. దానికోసం విచారించకు” అని చెప్పింది. లపిత మాటలు విని మందపాలుడు చిరునవ్వు నవ్వుతూ “వసిష్ఠుడి వంటి పురుషుణ్ని కూడా అరుంధతి వంటి భార్య కూడా అనుమానించకుండా ఉండదు. ఇది స్త్రీలకి సహజమే!” అన్నాడు.

మందపాలుడు లపితని వదిలి ఖాండవవనం వెళ్లాడు. అక్కడ సురక్షితంగా ఉన్న జరితని నలుగురు కొడుకుల్ని చూసుకుని సంతోషంగా వెళ్లిపోయాడు. అగ్నిదేవుడు కూడా ఖాండవ వనంలో ఉన్న ఔషధాల్ని తినడం వల్ల అతడి ఆరోగ్యం బాగుపడి కృష్ణార్జునులని దీవించి వెళ్లిపోయాడు.

అర్జునుడికి దివ్యబాణాలు ఇచ్చిన దేవేంద్రుడు

మనుషులు చెయ్యలేని పని చేసిన కృష్ణార్జునుల గొప్పతనాన్ని మెచ్చుకుని దేవేంద్రుడు దేవతలతో కలిసి వాళ్ల దగ్గరికి వచ్చాడు. పూర్వం నరనారాయణులే అయినా ప్రస్తుతం మానవులుగా పుట్టారు కనుక వాళ్లు దేవేంద్రుడికి వినయంగా నమస్కారం చేశారు. ఇంద్రుడు కృష్ణార్జునుల్ని ప్రేమతో కౌగలించుకుని అర్జునుడికి ఆగ్నేయాస్త్రం, వారుణాస్త్రం, వాయవ్యాస్త్రం వంటి దివ్యాస్త్రాలు ఇచ్చాడు.

శ్రీకృష్ణుణ్ని “నువ్వు ఎప్పుడూ వదలకుండా అర్జునుడికి ప్రియ స్నేహితుడిగా ఉండు” అని ప్రార్థించాడు. తరువాత దివ్య విమానం ఎక్కి దేవతలు, అప్సరసలు సేవిస్తుండగ దేవేంద్రుడు స్వర్గలోకానికి వెళ్లిపోయాడు. కృష్ణార్జునులు కూడా మయుడిని వెంటబెట్టుకుని ఇంద్రప్రస్థానికి వచ్చారు. ధర్మరాజుకి నమస్కారం చేసి ఖాండవవనం కాలిపోయిన సంగతి చెప్పి, మయుణ్ని పరిచయం చేసి అందరూ సుఖంగా ఉన్నారు.

దేవేంద్రుడికి ఉన్నంత వైభవం కలిగిన రాజరాజనరేంద్రా! పుణ్య చరిత్ర కలిగిన జనమేజయ మహారాజుకి వైశంపాయనుడు అభిమానంతో ఆదిపర్వ కథని ఇంపుగా చెప్పాడు” అని సూతుడు శౌనకాది మహామునులకి చెప్పాడు.

ఆదిపర్వంలోని ఎనిమిదవ ఆశ్వాసం సమాప్తం

ఆదిపర్వం సమాప్తం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here