మహాభారత కథలు-65: శిశుపాలుడి వృత్తాంతము

0
12

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

సభాపర్వము-రెండవ ఆశ్వాసము

శిశుపాలుడి వృత్తాంతము

శ్రీకృష్ణుడికి అర్ఘ్యమిచ్చిన ధర్మరాజు

[dropcap]మ[/dropcap]హాభారత కథని చెప్తున్న ఉగ్రశ్రవశ మహర్షి శౌనకుడు మొదలైన మహర్షులకి రాజసూయాన్ని గురించి చెప్పాడు. తరువాత నారదమహర్షి రాజసూయ మహోత్సవ వైభవాన్ని, ధర్మరాజు ధర్మపరాయణత్వాన్ని పొగిడాడు. ఆ సభలో ఉన్న రాజుల్ని, వాళ్లల్లో సామన్య మానవుడిలా కూర్చుని ఉన్న శ్రీకృష్ణుణ్ని చూశాడు.

పూర్వం బ్రహ్మాది దేవతలు ప్రార్థించడం వల్ల భూభారాన్ని తగ్గించడం కోసం శ్రీమహావిష్ణువు యాదవకులంలో పుట్టాడు. ఆయన కోసం దేవతలు, రాక్షసులు, యక్షులు, గంధర్వులు మొదలైనవాళ్లు తమ అంశలతో క్షత్రియ కులాల్లో జన్మించారు.

ఆ విషయం గురించి ఆలోచిస్తున్న నారదుడు మహాభారత యుద్ధం త్వరలోనే జరగబోతోందని అర్థం చేసుకుని మనస్సులోనే సంతోషించాడు.

జరిగిన రాజసూయ యాగం చూసిన శంతనుడి కుమారుడు భీష్ముడు సంతోషించాడు. దైర్యవంతుడు ధర్మపరాయణుడైన ధర్మరాజుతో “కురువంశ కీర్తిని పెంచిన ధర్మరాజా! స్నాతకుడు, ఋత్విజుడు, సద్గురుడు, ఇష్టుడు, భూపాలుడు, జ్ఞానసంపన్నుడు ఈ ఆరుగుర్ని పూజించవచ్చు. ఈ ఆరుగురిలో మంచి గుణాలు కలిగిన వాళ్లని పూజించు!” అని చెప్పాడు.

ఆయన మాటలు విని ధర్మరాజు “అటువంటివాడు ఎవరో నాకు మీరే చెప్పండి!” అని అడిగాడు.

అది విని భీష్ముడు “ధర్మరాజా! మానవులందర్నీ రక్షిస్తున్నవాడు, మంచివాళ్లతో పూజింప బడుతున్నవాడు, తెల్లతామరల వంటి కళ్లు కలవాడు, ఆది అంతము లేనివాడు, నాభిలో పద్మం ఉన్నవాడు, శ్రీమహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడు ఉండగా ఇంకా ఎవరు కావాలి?

యజ్ఞపురుషుడు, లోకులందరితో పూజించబడేవాడు, అచ్యుతుడు, శ్రీకృష్ణుణ్ని పూజించు. అతడే నీకు యజ్ఞఫలాన్ని ఇవ్వగలిగినవాడు!” అన్నాడు.

భీష్ముడి మాటలు విని ధర్మరాజు సహదేవుడి చేతిలో ఉన్న అర్ఘ్యాన్ని తీసుకుని శ్రీకృష్ణుణ్ని శాస్త్రోక్తంగా పూజించాడు.

ధర్మరాజుని ఆక్షేపించిన శిశుపాలుడు

ధర్మరాజు శ్రీకృష్ణుణ్ని అర్ఘ్యమిచ్చి పూజిస్తుంటే శిశుపాలుడు చూసి సహించలేక పోయాడు. ధర్మరాజుతో “ఈ సభలో మహారాజులు, పూజించ తగిన పెద్దలు, ఉత్తములైన బ్రాహ్మణులు ఎంతోమంది ఉన్నారు.

భీష్ముడు చెప్పాడని వృష్టివంశంలో పుట్టిన, చెడు ప్రవర్తన కలిగిన శ్రీకృష్ణుణ్ని పూజించావు. నువ్వు చాలా తెలివితక్కువవాడివి. యాదవ వంశం వాడైన శ్రీకృష్ణుడు పూజించడానికి అర్హుడా?

ధర్మతత్త్వాన్ని తెలుసుకోడం చాలా కష్టం. భీష్ముడు సరిగ్గా ఆలోచించలేదు. అర్హత ఉన్నవాళ్లు సభలో ఎంతోమంది ఉండగా వాళ్లందర్నీ వదిలేసి బుద్ధిలేని శ్రీకృష్ణుణ్ని పూజించమని నీకు చెప్పాడు. నువ్వు కూడా ధర్మాన్ని వదిలేసి అతణ్నే పూజించావు. ముసలివాళ్ల బుద్ధులు నిలకడగా ఉండవులే!” అన్నాడు.

మొదట శిశుపాలుడు శ్రీకృష్ణుణ్ని నిందించాడు. తరువాత ధర్మరాజుని నిందించాడు. చివరికి కురువంశానికే పితామహుడైన భీష్ముడు అవివేకి అని, ముసలివాడు కనుక బుద్ధి నిలకడ లేదని అన్నాడు. ఇంకా మాట్లాడుతూ “శ్రీకృష్ణుడికి మీరు స్నేహితులయితే అతణ్ని ఒక్కణ్నీ మీ ఇంటికి పిలిచి ధనం ఇవ్వండి. ఆయనకి ఇష్టమైన పనులు చెయ్యండి. మీకు ఇష్టమైనవాడు కనుక అతణ్ని పోషించండి.

అంతేకాని, గొప్ప మహారాజులు, బ్రాహ్మణులు ఉన్న ఈ సభలో శాస్త్రోక్తంగా జరుపవలసిన ఈ పూజని పొందడానికి శ్రీకృష్ణుడికి అర్హత లేదు. అయినా అతడే యోగ్యుడు అని చెప్పి పూజించడం న్యాయం కాదు.

ధర్మరాజా! అసలు శ్రీకృష్ణుణ్ని ‘వృద్ధుడు’ అని పూజించావా? అతడి కంటే సభలో ఉన్న అతడి తండ్రి వసుదేవుడు కదా వృద్ధుడు..! ‘ఋత్వుజుడు’ అని పూజించావా? సభలో వేదవ్యాసమహర్షి ఉన్నాడు కదా..! ‘గురువు’ అని వినయంతో పూజించావా? సభలో మహామేధావులైన కృపాచార్య, ద్రోణాచార్యులు ఉన్నారు కదా..! ‘మహారాజు’ అని పూజించావా? భూమి మీద యాదవులు రాజులా? పూజించతగిన పురుషుల్లో శ్రీకృష్ణుణ్ని ఎవరనుకుని పూజించావు?

అసలు పూజించ వలసిన వాళ్లని పూజించకుండా భీష్ముడు చెప్పాడు కదా అని శ్రీకృష్ణుణ్ని పూజించి వివేకం లేకుండా ప్రవర్తించావు. ధర్మరాజా! నువ్వు పురుషులందరిలో గొప్ప పేరు పొందినవాడివని, రాజుల్లో గౌరవించ తగినవాడివని లోకమంతా చెప్పుకుంటున్న నీ మంచి గుణాలు తెలుసుకుని నువ్వు చేస్తున్న యజ్ఞానికి వచ్చాము. ఇంతమందిని అవమానం చెయ్యడం నీకు తగిన పని కాదు.

నీకు జ్ఞానం లేక పోవడం వల్ల నువ్వు శ్రీకృష్ణుణ్ని పూజించి ఉండవచ్చు. అందుకు నేను తగిన వాడినా కాదా అని శ్రీకృష్ణుడు తను కూడా ఆలోచించాలి కదా? ఆలోచన లేకుండా సిగ్గు లేని శ్రీకృష్ణుడు నువ్విచ్చిన అర్ఘ్యాన్ని అందుకున్నాడు. అలా తీసుకోడం అతడికి తగిన పని కాదు.

ఈ భూమి మీద శ్రీకృష్ణుణ్ని పూజించడం అంటే నపుంసకుడికి పెళ్లి చెయ్యడం, చెవిటివాడికి కమ్మని పాట వినిపించడం, గుడ్డివాడికి అందమైన వస్తువుల్ని చూపించడం వంటిది” అన్నాడు చేదిరాజు శిశుపాలుడు.

ధర్మరాజుని ఇంకా ఎత్తిపొడుస్తూ “ధర్మరాజా! నువ్వు ఇలా అవివేకంగా ప్రవర్తించి ఇక్కడ ఉన్న రాజులందరూ నిన్ను చూసి నవ్వేటట్లు చేసుకున్నావు. ధర్మరాజు అనే నీ ప్రత్యేకమైన పేరుని కూడా పోగొట్టుకున్నావు!” అని ధర్మరాజుని, భీష్ముణ్ని, శ్రీకృష్ణుణ్ని నిందించాడు. తన కుమారుల్ని, బలగాన్ని తీసుకుని కోపంతో లేచి సభ నుంచి వెళ్లిపోయాడు.

ధర్మరాజు వెళ్లిపోతున్న శిశుపాలుడి వెనక వెళ్లాడు. అతడితో మృదువుగా “మంచి గుణాలు కలిగిన నువ్వు మంచివాళ్లతోను, పండితులతోను, మహారాజులతోను కఠినంగా మాట్లాడడం మంచి పని కాదు. కఠినంగా మాట్లాడడం విషం కంటే, అగ్ని కంటే కూడా భయంకరమైంది.

పితామహుడు భీష్ముడు చెప్పినది సత్యమే. సృష్టికి మొదట పుట్టినవాడు, బ్రహ్మ పుట్టడానికి కారణమైనవాడు, వేదాలతో సహా అన్ని గ్రంథాల్లోనూ కీర్తింపబడినవాడు, లోకాలకే మొదటివాడు, మూడు లోకాలతో పూజలందుకుంటున్నవాడు శ్రీకృష్ణుడు.

ఈ విషయం తెలిసిన భీష్ముడు శ్రీకృష్ణుణ్ని పూజించమని, అందుకు అతడే అర్హుడని చెప్పాడు. ఆయన అలా చెప్పడం తప్పుకాదు. శిశుపాలా! జ్ఞానవంతుడైన భీష్ముడు శ్రీకృష్ణుణ్ని అర్థం చేసుకున్నాడు.. అది నీకు సాధ్యం కాదు. వివేకం లేనివాళ్లు గొప్పవాళ్ల చరిత్రని అర్థం చేసుకోలేరు.

శ్రీకృష్ణుడే అర్ఘ్యం తీసుకోడానికి అర్హుడని ఇక్కడున్న వాళ్లు అందరూ అంగీకరిస్తుంటే నువ్వు ఒక్కడివే ఇలా వ్యతిరేకంగా మాట్లాడడం బాగుండలేదు” అని శిశుపాలుణ్ని ఒప్పించడానికి ప్రయత్నించాడు.

శిశుపాలుణ్ని నిందించిన భీష్ముడు

ధర్మరాజు అనేక విధాలుగా శిశుపాలుడికి నచ్చ చెప్పాడు. అది విని భీష్ముడు “ధర్మరాజా! శిశుపాలుడు మంచి నడవడిక లేనివాడు. బుద్ధి వికసించనివాడు. అతడికి చెప్పి ఒప్పించే ప్రయత్నం చెయ్యడం వల్ల ఉపయోగం లేదు.

అతడి మనస్సులో అసూయ, కోపము నిండి ఉంది. ఉన్న కొంచెం రాజ్యానికే అహంకారంతో వివేకాన్ని పోగొట్టుకున్నాడు. ఏ కారణమూ లేకుండానే మహాత్ముల్ని నిందించే వాడికి ధర్మతత్త్వం గురించి ఏం తెలుస్తుంది?” అన్నాడు.

తరువాత శిశుపాలుడితో “అహంకారంతో సాక్షాత్తూ శ్రీమహావిష్ణువైన శ్రీకృష్ణుడికి అర్ఘ్యమివ్వడం తప్పని అంటున్నావు. ఇక్కడున్న రాజులందరూ జరాసంధుడి చెర నుంచి విడిపించబడ్డారు. అంటే, వీళ్లు అతడితో యుద్ధం చేసి ఓడిపోయిన వాళ్లు, అతణ్ని శరణు వేడిన వాళ్లే! ఇతరులు ఎవరూ ఇక్కడ లేరు.

గొప్ప జ్ఞానవంతుడైన బ్రాహ్మణుడు వయస్సులో చిన్నవాడైనా, బాలుడైనా, పూజించడానికి అర్హుడే! అలాగే గొప్ప బలం కలిగిన రాజు కూడా తనకి ఉన్న బలం కారణంగా రాజుల్లో గొప్పవాడుగా పూజించడానికి అర్హుడు! గొప్ప జ్ఞానము, అమితమైన పరాక్రమము రెండూ ఉండడం వల్ల రాక్షసులకి శత్రువైన శ్రీకృష్ణుడే అర్ఘ్యం తీసుకోవడానికి అర్హుడు.

మొత్తం జగత్తుకే ఆధారమైన శ్రీకృష్ణుడు మాకే కాదు ముల్లోకాల్లో నివసించే వాళ్లకి అందరికీ ఎప్పుడూ పూజించ తగినవాడే. వయస్సులో పెద్దవాళ్లు లక్షమంది ఉన్నా జ్ఞానంలో గొప్పవాళ్లనే పూజిస్తాం. రాజులందరిలో ఉండవలసిన గుణము, పరాక్రమము రెండింటిలో గొప్పవాడైన శ్రీకృష్ణుణ్ని భక్తితో పూజించాం.

అంతేకాదు, లోకంలో శ్రీకృష్ణుడు కాకుండా వేరేవాళ్లని ఎవర్నేనా పూజిస్తే పూజించబడ్డవాడు ఒక్కడే సంతోషిస్తాడు. శ్రీకృష్ణుణ్ని పూజిస్తే కలిగిన పుణ్యం వల్ల ముల్లోకాలు పూజింపబడతాయి.

బుద్ధి, మనస్సు, జీవుడు, ఇంద్రియాలకి కనిపించని పరమాత్మ.. ఆకాశం , భూమి, సూర్యుడు, అగ్ని, చంద్రుడు, వాయువు, దిక్కులు, కాలాలు అన్నీ తానుగా.. చరచరాలైన సమస్త ప్రాణులతో ఉన్న ప్రపంచాన్ని అంతటినీ తన దివ్య శక్తితో ధరించి.. సర్వమూ తానై, అన్ని ప్రాణులకీ ప్రభువై, అందరకూ పూజ్యుడైన అతణ్ని గురించి యోగనిష్ఠలో ఉన్న మహాయోగులు యదార్థ జ్ఞానంతో తెలుసుకుంటారు. అలా తెలుసుకోవడం నీకు సాధ్యమవుతుందా?” అన్నాడు భీష్ముడు.

అది విన్న తరువాత సహదేవుడు “మేము అర్ఘ్యం ఇచ్చాము. దీనికి తిరుగులేదు. దుర్బుద్ధితో ఎవరేనా దీన్ని కాదని అంటే వాళ్ల తల మీద నా పాదం పెట్టి అణగ తొక్కుతా!” అని పాదాన్ని పైకి ఎత్తాడు. సభలో ఉన్నవాళ్లందరూ భయంతో మాట్లాడకుండా కూర్చున్నారు.

అదే సమయంలో సహదేవుడి మీద పూలవాన కురిసింది. ఆకాశంలోంచి ‘బాగుంది’ అని వినిపించింది. నారదుడు తన చామరాన్ని, కృష్ణాజినాన్ని ఎగరేస్తూ ఆనందంగా నృత్యం చేశాడు.

శిశుపాలుడి సేనాధిపతి కోపంతో తనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ తన వైపు రాజులందర్నీ ఒక్కటిగా చేశాడు. శిశుపాలుడి అనుమతి తీసుకుని యుద్ధానికి సిద్ధమయ్యాడు. అది చూసి యదు, వృష్టి, భోజ, కుకురాంధక వంశానికి చెందిన వీరుల సైన్యం ఒక్కసారి కదిలింది. ఆ సైన్యం నది మీద వేగంగా అసహనంగా కదులుతున్న అలల్లా కనిపించింది.

అలాగే అక్కడ ఉన్న రాజులందరిలో అలజడి ఏర్పడింది. అది చూసి ధర్మరాజు భీష్ముడితో “పితామహా! భూమి మీద ఉన్న రాజులందరూ ప్రళయకాలంలో ఉన్న సముద్రాల్లా అలజడిగా ఉన్నారు. రాజసూయ యాగానికి భంగం కలగకుండా, ప్రజలకి కీడు జరగకుండా వెంటనే నువ్వే రాజులందర్నీ సముదాయించు!” అన్నాడు.

ధర్మరాజు మాటలకి భీష్ముడు “ధర్మరాజా! ఆందోళన ఎందుకు? రాక్షసుల్నే జయించి, ఎవరి చేతిలోనూ ఓడిపోని సాక్షాత్తూ శ్రీమహావిష్ణువైన శ్రీకృష్ణుడు నీకు అండగా ఉన్నాడు. నువ్వు చేస్తున్న యాగానికి కీడు తలపెట్ట కలిగిన వాళ్లు ఎవరుంటారు?

శ్రీకృష్ణుడు ఒక చూపు చూస్తే చాలు శిశుపాలుడి కోసం యుద్ధం చెయ్యడానికి ముందుకు వచ్చే రాజులందరూ ఒక్క క్షణంలో యమలోకానికి చేరుకుంటారు. యుద్ధం జరిగితే శిశుపాలుడి పొగరు ఇప్పటికిప్పుడే అణిగిపోతుంది.

కుక్కలు ఎన్ని ఉన్నా.. ఏనుగుల కుంభస్థలాన్నే చీల్చగలిగిన గోళ్లున్న సింహం మీదకి వెళ్లి మొరిగి ఏం చెయ్యగలవు? మహాబలపరాక్రమశాలి శ్రీకృష్ణుణ్ని గురించి తెలియనివాళ్లు ఎవరు?” అన్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here