మహాభారత కథలు-67: పాండవ సభని చూసిన దుర్యోధనుడు

0
10

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

మయసభలో అవమానపడిన దుర్యోధనుడు

[dropcap]మ[/dropcap]యసభలో ఉన్న విశేషాలు చూడడానికి దుర్యోధనుడు, శకుని కొన్ని రోజులు ఇంద్రప్రస్థపురంలోనే ఉండిపోయారు. ఒకరోజు దుర్యోధనుడు మయసభ అపురూప సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యపడి మొత్తం తిరిగి చూస్తున్నాడు.

ఒక చోట తెరిచి ఉన్న ద్వారాన్ని చూసి, మూసి ఉందనుకుని వెనక్కి వెళ్లిపోయాడు. మరొక చోట మూసి ఉన్న ద్వారాన్ని తెరిచి ఉందనుకుని ముందుకు వెళ్లబోయి నుదుటికి కొట్టుకున్నాడు.

మామూలుగా ఉన్న ప్రదేశాన్ని చూసి ఎత్తుగా ఉందనుకుని ఎక్కబోయాడు. ఒకచోట నీలపురాళ్ల కాంతులతో నిండిన ప్రదేశాన్ని నీటి మడుగు అనుకుని కట్టుకున్న బట్టలు పైకి పట్టుకుని నడిచాడు.

మరొక చోట స్ఫటికపు రాళ్ల కాంతులతో నిండిన నీటి మడుగుని మామూలు నేల అనుకుని ముందుకి నడిచాడు. అక్కడ నీళ్లు ఉండడం వల్ల కట్టుకున్న బట్టలు తడిశాయి. వెంటనే వెనక్కి తిరిగాడు. ఆ సమయంలో అతణ్ని చూసి ద్రౌపదితో పాటు పాండవులు కూడా నవ్వారు.

దుర్యోధనుడు కట్టుకున్న బట్టలు తడిసిపోవడం చూసి ధర్మరాజు ప్రేమగా వస్త్రాలు, ఆభరణాలు భీముడితో పంపించాడు. మయసభలో అవమానపడిన దుర్యోధనుడు సిగ్గుపడ్డాడు. పాండవుల దగ్గరనుంచి హస్తినాపురానికి వెళ్లిపోయాడు. ధర్మరాజు చేసిన రాజసూయ యాగం చూసిన తరువాత దుర్యోధనుడికి అసూయ కలిగింది.

అందరూ సంతోషంగా మయసభని చూసి ఆనందించారు. కాని, మయసభ వైభవం చూసిన తరువాత దుర్యోధనుడి మనస్సు అసూయతో నిండిపోయింది. దుఃఖంతో కుమిలి, కృశించి పోయాడు. మనోవేదన వల్ల అతడి శరీరం నలుపెక్కి కళావిహీనంగా మారిపోయింది. రాజ్యవ్యవహారాలు చూడడం, స్నేహితుల్ని కలవడం మానేశాడు. ఎవరితోనూ మాట్లాడకుండా ఉండిపోయాడు.

అతడి బాధ చూసి శకుని “దుర్యోధనా! నువ్వు నాతో ఎందుకు మాట్లాడడం లేదు? ఎందుకు బాధ పడుతున్నావు? నీ బాధ ఏమిటో నాకు చెప్పు. నువ్వు గొప్ప బలపరాక్రమవంతుడివి. నేను నీకు అండగా ఉన్నాను. అసలు విషయ మేమిటో నాకు వివరంగా చెప్పు” అని అడిగాడు.

దుర్యోధనుడి దురాలోచన

శకుని దుర్యోధనుణ్ని అనునయించాక దుర్యోధనుడు శకునితో “నువ్వు కూడా మయసభని చూశావు కదా! ఏ యుగంలోను అటువంటి సభ ఉందని వినలేదు. ఆ సభ భూమండలంలోకే అపూర్వమైంది. చాలా అందంగా ఉంది. కోరిన సుఖాలన్నీ ఇస్తుంది. ధర్మరాజుకి ఆ సభ ఎలా వచ్చిందో! సూర్యుడి తేజస్సుతో వెలిగే ధర్మరాజు ఆ సభ వల్ల ఈ లోకంలో ఇంకా గొప్ప భాగ్యవంతుడయ్యాడు.

భూమ్మీద ఉన్న గొప్ప పేరుగల రాజులందరూ కూడా ధర్మరాజుకి లొంగిపోయారు. ధన రాశులు తెచ్చి కప్పాలుగా అందించారు. ఇప్పుడు కుంతీదేవి పెద్దకొడుకు చక్రవర్తి అయ్యాడు. పాండవుల పరాక్రమం అన్ని వైపులా వ్యాపించింది.

శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రంతో శిశుపాలుడి తల నరికేశాడు. ఆ సమయంలో మిగిలిన ప్రసిద్ధులు, వీరులు అయిన రాజులు అతణ్ని ప్రశంసించారు. అతణ్ని ఎదిరించడానికి ఎవరూ ముందుకి రాలేదు.

పాండవుల సాటిలేని పరాక్రమంతో సంపాదించిన సంపదలు, అంతకంతకీ పెరుగుతున్న ఐశ్వర్యము చూసి నేను సహించలేక పోతున్నాను. వాళ్ల అభివృద్ధిని చూస్తూ.. కనిపిస్తున్న నా తగ్గుదలకి తట్టుకోలేక పోతున్నాను. పాండవుల సంపదని ఏ రకంగా నేను దక్కించుకోగలనో చెప్పు!” అన్నాడు.

దుర్యోధనుడి మాటలకి శకుని “దుర్యోధనా! వాళ్ల సంపదల్ని మనం దక్కించుకోవాలని అనుకుంటే ముందు మనం ధృతరాష్ట్రుడి అనుమతి తీసుకోవాలి” అన్నాడు.

తరువాత శకుని దుర్యోధనుణ్ని వెంట పెట్టుకుని ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్లాడు. దుర్యోధనుడి మానసిక పరిస్థితిని వివరించాడు. అతడు శారీరకంగా ఎంత కృశించి పోయాడో చెప్పాడు. ధృతరాష్ట్రుడు కుమారుడి శరీరాన్ని తడివి చూసి ఎంతో బాధ పడ్డాడు.

“కుమారా! కౌరవ సంపద నీకే ఎక్కువగా ఇచ్చాను. తమ్ముళ్లు, స్నేహితులు, సేవకులు అందరూ నీకు ఇష్టమైనవాళ్లే. వాళ్లల్లో నీకు కానివాళ్లు ఎవరూ లేరు. దేవేంద్రుడికి ఉన్నన్ని సుఖాలు, భోగాలు నీకూ ఉన్నాయి. రాజులందరూ గౌరవంతో నీ చుట్టూ చేరి నువ్వు చెప్పినట్టు వింటున్నారు. గొప్పతనంలో నీకేమీ తక్కువ లేదు. నువ్వు కృశించడం, రాజ్యభోగాల్లో విరక్తిని పెంచుకోవడం ఎందుకు?” అన్నాడు.

పాండవుల వైభవం వర్ణించిన దుర్యోధనుడు

ధృతరాష్ట్రుడి మాటలకి దుర్యోధనుడు “తండ్రీ! పాండవుల ఐశ్వర్యం దేవేంద్రుడి ఐశ్వర్యం కంటే ఎక్కువగా పెరిగి పోయింది. వాళ్ల పరాక్రమం గురించి అన్ని దిక్కుల్లోనూ వ్యాపించింది. అర్జునుడు విష్ణుమూర్తితో సమానమైన పరాక్రమంతో ఉత్తర కురుభూములతో సహా రాజులందర్నీ జయించాడు. ఇది సామాన్యమైన విషయం కాదు.

స్నేహంతోను, బంధుత్వంతోను శ్రీకృష్ణుడు ద్రుపదుడు తప్ప ఈ సమస్త భూమండలంలో ఉన్న రాజులందరూ ఇష్టంతోనే పాండవులకి కప్పం కట్టారు. కొండలతో, అడవులతో ద్వీపాలతో నిండిన ఈ భూమండలం మొత్తం పాండవుల అధీనంలోనే ఉంది.

నేను ఒక రాజకుమారుడిలా అధికారం లేని వాడుగా చూస్తూ ఎలా ఉండిపోగలను? మనస్సు కలిసినవాళ్లు, ఎవరినయినా రక్షించ కలిగిన, గుణవంతులైన కృష్ణార్జునులు రాజసూయంలో ఒకళ్లకి ఇష్టమైన పనులు మరొకళ్లు చేస్తూ స్నేహంగా కనిపించారు.

తండ్రీ! అందరూ రత్నాలు కానుకలుగా తెచ్చి ఇస్తుంటే వాటిని అందుకోడానికి ధర్మరాజు నన్ను నియమించాడు. అన్ని సముద్రాల్లోనూ దొరికే విలువైన రత్నాలతో ధర్మరాజు ఇల్లు నిండి పోయింది. యజ్ఞ దీక్ష తీసుకున్న ధర్మరాజుకి గౌడ, కాంభోజ దేశాల రాజులు – రంగు రంగుల కంబళ్లు, చిలుక రంగు కలిగిన గుర్రాల్ని తెచ్చి ఇచ్చారు.

గొప్ప ఐశ్వర్యము, మంచి గుణాలు ఉన్న సింహళ, కేరళ, చోళ, పాండ్య దేశ రాజులు – గుణవంతుడు, శత్రువులు లేని ధర్మరాజుకి మంచి ముత్యాలు, పగడపు చెట్లు, ఏలకులు, అగరు చెక్కలు, గంధపు చెక్కల్ని ప్రేమతో ఇచ్చారు.

దేవకీదేవి కుమారుడు – సూర్యకాంతి కూడా వెలవెలబోయేంత కాంతి కలిగిన మణిహారాల్ని, పధ్నాలుగు వేల ఏనుగుల్ని యమధర్మరాజు – కుమారుడు ధర్మరాజుకి ఇచ్చాడు. అంతేకాదు, ధర్మరాజు మీద ఉన్న అభిమానంతో విరాటరాజు – రెండు వేల ఏనుగుల్ని ఇచ్చాడు. ద్రుపదుడు – వెయ్యి ఏనుగులు, పదివేల గుర్రాలు, పధ్నాలుగు వేలమంది వేశ్యలు, పదివేల దాసీ కుటుంబాల్ని ఇచ్చాడు.

కురు, కుకుర, ఉలూక మొదలైన దేశ రాజులు, ప్రాగ్జ్యోతిష దేశాధిపతి భగదత్తుడు, మరుకచ్ఛ నివాసులు, చేది దేశ రాజులు, ఆజానేయ, బహ్లిక, హూణ, పారశీక దేశాల్లో పేరుపొందిన గుర్రాల్ని, పర్వతాలంత పెద్ద మదపుటేనుగుల్ని, మంచి బట్టలతో అలంకరించబడిన వేలకొలది స్త్రీలని, మేకల్ని, గొర్రెల్ని, ఆవుల్ని, బర్రెల్ని, బంగారాన్ని, రత్నాల్ని, వెండిని, కంబళ్లని, వస్త్రాల్ని ఇచ్చారు.

మేరు, మందర పర్వతాల మధ్య ఉండే సన్నవెదుళ్ల అడవుల్లో నివసించే గుళింద, పారద, బర్బర, తురుష్క, టెంకణ, కొంకణ దేశాల రాజులు – హిమశైల, రామశైల, కురుదేశాల్లో ఉండే పూలతేనెతో నిండిన పాత్రల్ని; మంచి మందుల్ని; ఇంద్రనీలమణి, ఆరుద్రపురుగు, కోకిల, నెమలి, చంద్రుడు, చిలుక రంగులు కలిగిన గుర్రాల్ని ఇచ్చారు.

బంగారంతో నిండిన పట్టుపురుగుల వంటి పురుగుల నుంచి తీసిన పట్టు వంటి మెత్తని పదార్థంతోను, చెట్లబెరళ నుంచి పుట్టిన మెత్తటి పదార్థంతోనూ, గుడ్డునుంచి పుట్టిన పక్షుల ఈకల వంటి మెత్తని పదార్థంతోనూ తయారయిన పరుపులు; పదునైన, పొడవైన ఖడ్గాలు; మణులు, బంగారం పొదగబడి ఏనుగు దంతాలతో తయారు చెయ్యబడిన పల్లకీలు, పీఠాలు ఇచ్చారు. దేవేంద్రుడి స్నేహితుడు గంధర్వరాజైన చిత్రరథుడు – నాలుగు వందల గంధర్వ జాతి గుర్రాలు ఇచ్చాడు. తుంబురుడు అనే గంధర్వుడు – వంద గుర్రాల్ని ఇచ్చాడు.

భూత భవిష్యత్వర్తమాన కాలాల్లో కూడా రాజుల ఐశ్వర్యాలు ఏవీ ధర్మరాజు ఐశ్వర్యంతో సరితూగవు. అందరు రాజుల మధ్య దాయాదుల గొప్పతనం చూసి ఓర్వలేక నేను ఎంత బాధపడ్డానో, ఎంత కృశించానో చూడు.

తండ్రీ! ఒక లక్షమంది బ్రాహ్మణులు భోజనం చేసినప్పుడు శంఖం దానికదే మోగుతుంది. ఆ శంఖం రాజసూయ యాగం జరిగినప్పుడు ఆగకుండా మోగింది. ద్రౌపది అన్ని దేశాల నుంచి వచ్చిన రాజుల్ని, బ్రాహ్మణుల్ని, వైశ్యుల్ని, శూద్రుల్ని, దగ్గరి బంధువుల్ని, స్నేహితుల్ని, వీరభటుల్ని, పనివాళ్లని, పేదల్ని, బైరాగుల్ని, ప్రతి రోజు తనే స్వయంగా అడిగి వాళ్లకి తగినట్టు భోజనం పెట్టి అందరూ తిన్నాక అర్ధరాత్రి అయ్యేదాకా తను తినలేదు.

అంతే కాదు, ఆ మహాయాగంలో అన్ని రకాల వాళ్లని కూడా ప్రేమతో గౌరవించారు. అందరికీ కోరుకున్నవి అన్నీ దొరికాయి. ఈ భూమి మీద హరిశ్చంద్రుడు రాజసూయం చేసి గొప్ప కీర్తిని పొందాడు. కాని, వైభవంలో ధర్మరాజుకి దక్కిననంత వైభవం హరిశ్చంద్రుడికి కూడా దక్కలేదు.

అంత గొప్ప రాజసూయ యాగం పూర్తయ్యాక అవభృథస్నాన సమయంలో నారదుడు, వ్యాసుడు మొదలైన మహర్షులతో కలిసి బ్రహ్మర్షులు, రాజర్షులు, దిక్పాలకులు కొలుస్తున్న ఇంద్రుడిలా వెలిగి పోతున్న ధర్మరాజుని పాండవ పురోహితుడు ధౌమ్యుడు అన్ని పుణ్య నదుల నీళ్లతోను అభిషేకించాడు.

రాజసూయ యాగంలో ధర్మరాజుకి అభిషేకం జరుగుతున్నప్పుడు సాత్యకి ముచ్చటగా ముత్యాల గొడుగు పట్టాడు. భీమార్జునులు మణులు పొదిగిన బంగారు కాడలు ఉన్న రెండు చామరల్ని పట్టుకుని చెరొకవైపు నిలబడ్డారు. శ్రీకృష్ణుడు, నకుల సహదేవులు, ద్రుపదరాజు కుమారుడు దృష్టద్యుమ్నుడు పట్టాభిషేకం చేసుకున్న రాజులందర్నీ వేరు వేరుగా తీసుకుని వెళ్లి ధర్మరాజుకి మొక్కించారు.

ఆ వైభవాన్ని చూసి నేను, మిగిలిన రాజులు వెలవెలబోతుంటే శ్రీకృష్ణుడు, పాండవులు, ద్రౌపది, సాత్యకి మమ్మల్ని చూసి నవ్వారు.

అంతేకాదు, పుణ్యాత్ముడైన ధర్మరాజు ఎనభై ఎనిమిది వేలమంది బ్రహ్మజ్ఞానం కలిగిన బ్రాహ్మణోత్తములకి అగ్రహారాలు ఇచ్చాడు. వాళ్లకి ముప్ఫైమంది సేవకుల్ని ఇచ్చాడు. సంతోషంగా వాళ్లని కాపాడుతూ, పదివేలమంది బ్రాహ్మణుల్ని ప్రతిరోజూ తన పక్కన కూర్చోబెట్టుకుని భోజనం పెడుతూ, బట్టలు, సొమ్ములు, మైపూతలు, ఇవ్వగలగడం అంటే జీవితం ధన్యమైనట్టే! నేను హీన స్థితిలో ఉన్న సామాన్య మానవుడిలా ఇతరుల గొప్పతనాన్ని చూసి సహించి ఉండలేక పోతున్నాను” అన్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here