మహాభారత కథలు-70: ద్రౌపదిని సభలోకి ఈడ్చుకుని వచ్చిన దుశ్శాసనుడు

0
14

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

ద్రౌపదిని సభలోకి ఈడ్చుకుని వచ్చిన దుశ్శాసనుడు

[dropcap]రా[/dropcap]జసూయ యాగం పూర్తయ్యాక చివర చేసిన అవబృథ స్నానంలో బ్రాహ్మణుల మంత్రాలతో పవిత్రమైన నీళ్లతో తడిసిన ద్రౌపది తల వెంట్రుకల్ని పట్టుకున్నాడు దుశ్శాసనుడు. ద్రౌపదిని సభలోకి ఈడ్చుకుంటూ తీసుకుని వస్తుంటే అందరూ భయంతో చూస్తున్నారు.

కర్ణుడు, దుర్యోధనుడు, శకుని, సైంధవుడు మొదలైన వాళ్లందరూ సభలో ఉన్నారు. కోపము, సిగ్గు, చెదిరిన జుట్టు, వెలవెలబోయిన ముఖంతో వచ్చింది ద్రౌపది. అక్కడ ఉన్న పెద్దల్ని ఉద్దేశించి “దురదృష్టం వల్ల ఎన్ని దెబ్బలు తగిలినా ధర్మరాజు ఎప్పుడూ ధర్మ సంపదతో ప్రకాశిస్తూనే ఉంటాడు.

ధర్మమార్గం తప్పి నడుచుకోడు. కోపిష్టి, దుర్మార్గుడు, ఈ దుశ్శాసనుడు నన్ను ఎందుకు ఈ సభలోకి ఈడ్చి తెచ్చాడు. ఈ కురువంశంలో పెద్దలు అందరూ చూస్తుండగా నన్ను అవమానపరుస్తున్నాడు.

ధర్మాలన్నీ తెలిసిన ఈ భరతవంశం ఈ రోజు అధర్మాన్నిఆచరించింది. దీని వల్ల ఈ వంశాన్ని నిందించేందుకు ఇతరులకి అవకాశం కలిగింది” అని బాధతో మనస్సులో శ్రీకృష్ణుణ్ని తలుచుకుంది. తమ బలపరాక్రమాలతో ముల్లోకాల్ని జయించ గలిగిన భర్తలు ఉండి కూడా దిక్కులేని దానిలా బాధపడుతోంది. మనస్సులో పరమాత్ముడైన శ్రీకృష్ణుణ్ని వేడుకుంటోంది.

ఆమె దుఃఖం చూసిన భీమసేనుడు ధర్మరాజుతో “ధర్మరాజా! ధనము, బంగారము, రత్నాలు, వాహనాలు, ఆయుధాలు, రాజ్యము, మా నలుగురు తమ్ముళ్లకు నువ్వు ప్రభువు కనుక మమ్మల్ని జూదంలో ఓడిపోవడం సహజమే! కాని ఈ జూదంలో ద్రౌపదిని పణంగా పెట్టి ఓడిపోవడం తగిన పని కాదు. ఆ దుర్మార్గులు అమెను అవమానిస్తున్నారు. శకుని మోసం తెలిసి కూడా నువ్వు జూదమాడి అధర్మ మార్గంలో నడిచావు. కనుక, నీ చేతులు కాల్చాలి” అన్నాడు.

భీముడి మాటలు విని అర్జునుడు “ధర్మరాజే ధర్మం తప్పితే భూమండలమంతా దద్దరిల్లదా? స్నేహంగా ఆడుకునే జూదానికి, ధర్మం కోసం చేసే యుద్ధానికి ఎక్కువసార్లు పిలిస్తే వెళ్లకుండ ఉండకూడదు. కనుక, ఆ ధర్మాన్ని ఆచరించి ధర్మరాజు గొప్ప క్షత్రియ ధర్మాన్ని లోకంలో నిలబెట్టాడు.

అంతేకాని ధర్మరాజు జూదమాడడం అజ్ఞానం వల్ల కాదుకదా? దైవానుగ్రహం లేక అది తారుమారైతే అందుకు బాధపడకూడదు. ధర్మారాజు యొక్క ధర్మగౌరవం శాశ్వతమైంది. ఆయన ధర్మాన్ని అర్థం చేసుకోలేక బాధ పెట్టాలని అనుకున్నవాళ్లు ధర్మహీనులు” అన్నాడు.

బాధపడుతున్న పాండవుల్ని, సభలో ద్రౌపదిని అవమానిస్తున్న దుశ్శాసనుణ్ని చూసి వికర్ణుడు “సభాసదులు అన్యాయాన్ని గురించి వినడానికి కూడా ఇష్టంగా లేరు. పక్షపాతం లేని పెద్దలు ఇప్పుడు ద్రౌపది అడిగిన దానికి సమాధానం చెప్పాలి. ఆ విషయం గురించి మాట్లాడకుండా వదిలేస్తే నరకానికి వెడతారు.

కురువంశ పెద్దలు భీష్ముడు, ధృతరాష్ట్రుడు, విదురుడు మొదలైనవాళ్లు; గురువులు ద్రోణుడు, కృపుడు అందరూ మౌనంగా ఉన్నారు. సభలో ధర్మజ్ఞులైన వాళ్లు ఇంకా ఉన్నారు. న్యాయమార్గంలో ఆలోచించి చెప్పండి!” అన్నాడు.

ఎవరూ మాట్లాడలేదు. అప్పుడు వికర్ణుడు “నేనే ఇక్కడ ధర్మ నిర్ణయం చేస్తాను. అందరూ వినండి. జూదం, వేట, మద్యపానం, అతిగా తినడం అనే నాలుగూ చెడు వ్యసనాలు. వీటికి అలవాటు పడినవాళ్లు ధర్మాన్ని వదిలేస్తారు. అటువంటి వాళ్ల మాటలు లెక్కలోకి తీసుకోకూడదు.

జూదగాడు ఆహ్వానిస్తే వచ్చిన ధర్మరాజు పాండవులందరికీ ఉమ్మడి సొమ్ము అయిన పాంచాలిని జూదంలో పందెంగా పెట్టి ఓడిపోయాడు. అందువల్ల ఆమెని అధర్మంగా జయించినట్టు. ఒకే వస్త్రం ధరించి ఉన్న ఆ సుకుమారిని సభలోకి తీసుకుని రావడం అన్యాయం!” అన్నాడు.

వికర్ణుడి మాటలకి అడ్డు పడి కర్ణుడు “ఇక్కడ ఎవరికీ ధర్మాన్ని తెలుసుకోవాలనే కోరిక లేదు. ధర్మం గురించి మూర్ఖుడిలా నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? ఇక్కడ ఇంతమంది పెద్దవాళ్లు ఉన్నారు. చిన్నవాడివి నీకెందుకు? ద్రౌపది అధర్మంగా ఓడిందని చెప్పావు.

కాని, సభలో ధర్మరాజు ధర్మజ్ఞులందరూ చూస్తుండగానే తన సర్వస్వాన్ని పందెంగా పెట్టి ఓడిపోయాడు. ద్రౌపది అతడికి పరాయి మనిషి కాదు. కాబట్టి, ఆమె కూడా ఓడిపోయింది అనడం ధర్మమే. అలా కాకపోతే ఆమె ఓడిపోయిందని పాండవులు ఎందుకు అంగీకరిస్తారు.

ఒకే వస్త్రాన్ని ధరించినదాన్ని సభకి తీసుకుని రావడం తప్పని అన్నావు. భార్యకి భగవంతుడు నిర్దేశించిన ప్రకారం ఒక భర్తే ఉండాలి. ఈమెకి చాలామంది భర్తలు ఉన్నారు. ఇటువంటిదాన్ని బట్టలు లేకుండా తీసుకుని వచ్చినా కూడా తప్పులేదు” అన్నాడు.

దుర్యోధనుడు దుశ్శాసనుడితో “పాండవులవి, ద్రౌపదివి వస్త్రాలు లాగి తీసుకో!” అని ఆజ్ఞాపించాడు.

జూదంలో ఓడిపోవడం వల్ల గొప్ప కీర్తి కలిగిన పాండవులు తమ పై బట్టలు ముందే తీసి పక్కన పెట్టారు.

ద్రౌపది వస్త్రాలు ఒలిచిన దుశ్శాసనుడు

దుర్మార్గుడైన దుశ్శాసనుడు తను చేస్తున్న పని మంచిది కాదు అని అనుకోలేదు. ద్రౌపది కట్టుకున్న వస్త్రాన్ని నిండు సభలో విప్పాడు. అతడు ఆపకుండా విప్పుతున్నా అటువంటి వస్త్రం ద్రౌపది శరీరం నుంచి ఆగకుండా వస్తూనే ఉంది. అది చూసి సభలోవాళ్లు అందరూ సంతోషించారు. ఎన్ని విప్పినా వస్త్రాలు కొండగుట్టలా వచ్చి పడుతున్నాయి. ఇంక విప్పలేక దుశ్శాసనుడు సిగ్గుతో విప్పడం ఆపేశాడు.

ద్రుపదరాజు కుమార్తెకి దుశ్శాసనుడు చేసిన అవమానాన్ని చూసి భీముడు కళ్ళెర్ర చేసి, పళ్లు కొరుకుతూ భయంకరమైన మొహంతో యముడిలా మాట్లాడాడు. “కురువంశపు పెద్దలు, గురువులు, వృద్ధులు, బంధువులు, ఎంతోమంది చూస్తుండగా పొగరుతో ద్రౌపదిని అవమానం చేశాడు. ఈ దుశ్శాసనుణ్ని దుర్యోధనుడు చూస్తూ ఉండగానే లోకంలో ఎవరూ ఎవర్నీ చంపని విధంగా భయంకరంగా చంపుతాను. పర్వతంలా ఉన్న అతడి విశాలమైన వక్షస్థలంలో ఏరులా ప్రవహించే రక్తాన్ని భయంకరమైన ఆకారంతో త్రాగుతాను. నేను అన్న మాట నిలబెట్టుకోకపోతే తండ్రి తాతల మార్గాన్ని తప్పినవాడిని అవుతాను” అన్నాడు.

భీముడు ఏ మానవమాత్రుడు చెయ్యలేని శపథాన్ని చేశాడు. అది విని సభలో ఉన్న వాళ్లందరూ ఆశ్చర్యపడ్డారు. తరువాత ధృతరాష్టుడి వైపు అసహ్యంగా చూశారు. ద్రౌపది అడిగిన ప్రశ్నకి పెద్దలైన రాజులు సమాధానం చెప్పకుండ వదిలేశారని అన్నారు.

విదురుడు చేతులు పైకెత్తి అందర్నీ ఆపి “వివేకం కలిగినవాళ్లు ద్రౌపది అడిగిన ప్రశ్నకి సమాధానం స్పష్టంగా చెప్పండి. ధర్మ సందేహం తీర్చకపోతే సభలో ఉన్న ధర్మపరులందరికీ పాపం అంటుకుంటుంది. వికర్ణుడు చిన్నవాడైనా బృహస్పతిలా శాస్త్రప్రకారం స్పష్టంగా ధర్మాన్ని తెలిసేలా చెప్పాడు. ఇతడి ఆలోచనని తక్కువ భావంతో చూడకండి. అతడి మాటని అంగీకరించండి.

అన్ని పరిస్థితుల్లోను ధర్మానికి సరైన అర్థాన్ని నిర్ణయించడం ఏ ఒక్కళ్లకీ.. బ్రహ్మకి కూడా సాధ్యం కాదు. సభకి వచ్చినవాళ్లు ఎవరైనా సరే ధర్మసందేహం అడిగితే చెప్పి తీరాలి. తెలిసి కూడా చెప్పకపోతే అబద్ధం చెప్పినట్టే అవుతుంది. అబద్ధం చెప్పడం వల్ల ఏ ఫలితం కలుగుతుందో ఆ ఫలితంలో సగం పొందుతారని ధర్మం తెలిసిన మహర్షులు చెప్పారు.

ధర్మం తెలిసి కూడా లాభం, లోభం, పక్షపాతం, ఊగిసలాడే బుద్ధి ఉండడం వల్ల వేరే విధంగా చెప్తే.. వాళ్లు అబద్ధం చెప్పడం వల్ల కలిగే ఫలితాన్ని పొందుతారు” అన్నాడు.

విరోచన, సుధన్వుల వృత్తాంతము

విదురుడు ఇంకా చెప్తున్నాడు. “ఈ న్యాయం ఇతిహాసాల్లో కూడా ఉంది. పూర్వం ప్రహ్లాదుడి కొడుకు విరోచనుడు, అంగీరసుడనే బ్రాహ్మణుడి కొడుకు సుధన్వుడు ఒక కన్యని దానం పుచ్చుకునే విషయంలో నేను మంచివాణ్ని.. నేను మంచివాణ్ని అని ప్రాణాన్ని పందెంగా పెట్టి ఇద్దరూ ప్రహ్లాదుడి దగ్గరికి వెళ్లారు.

సుధన్వుడు ప్రహ్లాదుడితో “నువ్వు ధర్మం తెలిసినవాడివి. మా ఇద్దరిలో మంచి గుణాల్లో ఎవరు గొప్పో చెప్పు. నీ కొడుకు మీద ఉన్న పక్షపాతంతో అబద్ధం చెప్తే ఇంద్రుడి వజ్రాయుధం నీ తలని పగుల కొడుతుంది” అన్నాడు.

ప్రహ్లాదుడు భయపడి కశ్యపుడి దగ్గరికి వెళ్లాడు. విరోచనుడు, సుధన్వుల మధ్య వచ్చిన తగవు తనని అడిగిన తీర్పు గురించి కశ్యపుడికి చెప్పాడు. కశ్యపుడు “సాక్షీ, ధర్మాన్ని చూసే న్యాయమూర్తీ కూడా సాక్షి నియమాల్ని, ధర్మనియమాల్ని వదిలి సాక్ష్యం, ధర్మం చెప్పకూడదు. అలా చెప్పినవాడిని వెయ్యి వరుణపాశాలు బంధిస్తాయి. సంవత్సరానికి ఒక పాశం వంతున వదులుతాయి” అని చెప్పాడు.

ధర్మం అధర్మం వల్ల బాధించబడి సభకి వస్తే దాన్ని తీర్చని సభ్యుల్ని అధర్మం బాధిస్తుంది. సభ్యులు కామక్రోధాల్ని విడిచి పెట్టి అధర్మాన్ని ఆపకపోతే ఆ అధర్మంలో నాలుగవ భాగం సభ్యులకి.. మరొక నాలుగవ భాగం రాజుకి.. మిగిలింది చేసినవాడికి సంక్రమిస్తుంది. కాబట్టి, ధర్మం తప్పకుండా చెప్పాలి” అన్నాడు.

ప్రహ్లాదుడు ధర్మబుద్ధితో ఆలోచించి తన కొడుకు కంటే సుధన్వుడే గొప్ప సుణవంతుడు అని చెప్పాడు. సుధన్వుడు ప్రహ్లాదుణ్ని “కొడుకు మీద ప్రేమ చూపించకుండా ధర్మంగా చెప్పావు” అని పొగిడి వెళ్లిపోయాడు. కనుక, మీరు కూడా ద్రౌపది అడిగిన ప్రశ్నని ధర్మబుద్ధితో ఆలోచించండి” అని చెప్పాడు విదురుడు.

కీడుని సూచిస్తూ కనిపించిన అపశకునాలు

దుర్యోధనుడికి భయపడి సభలో ఉన్నవాళ్లు ఎవరూ పెదవి విప్పి మాట్లాడలేదు. ద్రౌపది అవమనాన్ని భరించలేక పోయింది. “స్వయంవరం జరిగిన రోజున రాజులందరితో గొప్పగా గౌరవించబడ్డాను. పాండవులకి ఇల్లాలినై, శ్రీకృష్ణుడికి చెల్లెలినై ఇప్పుడు సభా మధ్యంలో రాజులందరి మధ్య దుశ్శాసనుడితో అంతులేని అవమానం పొందాను.

ఇంత దుఃఖాన్ని అనుభవిస్తున్నాను కదా.. నేను అడిగినదానికి ఎవరూ బదులు చెప్పట్లేదు. నేను దాసినా.. కాదా.. పూర్తిగా తెలిసేలా చెప్పి అప్పుడు నన్ను ఆజ్ఞాపించండి!” అంది.

ద్రౌపది అడిగినదాన్ని విని భీష్ముడు “అమ్మా! నీ ప్రశ్నకి సమాధానం ఆ యుధిష్ఠిరుడే చెప్పాలి. అతడు చెప్పకపోతే ధర్మసూక్ష్మాన్ని తెలుసుకోవడం ఇతరులకి ఎవరికీ సాధ్యం కాదు. కురువంశంలో తప్పు చేసిన కౌరవులు ఫలితాన్ని వెంటనే అనుభవిస్తారు” అన్నాడు.

భీష్ముడు మాట్లాడుతుండగానే కర్ణుడు “ద్రౌపదీ! ఐదుగురు భర్తల కంటే ఒక్క భర్త ఉంటేనే మంచిది. జూదంలో భార్యను ఓడిపోని ఒక భర్త ఉంటే సుఖంగా ఉంటావు” అని ఎగతాళిగా మాట్లాడాడు. ధృతరాష్ట్రుడి పెద్ద కొడుకు దుర్యోధనుడు కర్ణుడి మాటలు విని విశాలమైన తన తొడ మీద కూర్చోమని ద్ర్రౌపదికి సైగ చేశాడు.

దుర్యోధనుడు సైగ చేస్తుంటే దూరం నుంచి సింహంవంటి భీముడు చూశాడు. సభలో ఉన్న రాజులందరూ ఆశ్చర్యంతోను భయంతోను చూస్తూ ఉండగా భీముడు యమధర్మరాజులా భయంకరంగా “రాజసంపద ఉందన్న పొగరుతో అన్న భార్య అయిన ద్రౌపదిని వచ్చి తన తొడ మీద కూర్చోమని చెప్తున్నాడు.

ఈ దుర్యోధనుణ్ని భయంకరమైన యుద్ధరంగంలో ఎదుర్కుంటాను. ఎవరికీ లొంగని నేను నా చేతులతో తిప్పే భీకరమైన గదతో అతడి తొడలు విరిగేలా కొడతాను” అని కోపంగా చెప్పి అన్నగారి ముఖంవైపు, తన ఆయుధం వైపు చూస్తున్నాడు.

అతడి భయంకరమైన ఆకారాన్ని చూసి బీష్ముడు, ద్రోణుడు, విదురుడు అది కోపగించడానికి తగిన సమయం కాదని భీమసేనుణ్ని శాంత పరిచారు. ఆ సమయంలో ధృతరాష్ట్రుడి అగ్నిహోత్రం ఉండే గృహంలో నక్కలు అరిచాయి. ఉజ్వలంగా వెలుగుతున్న అగ్నిహోత్రం ఆరిపోయింది. కౌరవ వంశంలో ఉన్న స్త్రీలు ఆందోళనగా ఉన్నారు.

క్రూరమైన మనస్సు, చెడు నడవడిక కలిగిన కౌరవ వీరుల గదుల్లో భయంకరంగా కాకుల, గుడ్లగూబల అరుపులు వ్యాపించాయి. అటువంటి పెద్ద అపశకునాలు చూసి భీష్మ, ద్రోణ, విదురులు ధృతరాష్ట్రుడి కొడుకులకి కీడు కలగబోతోందని అనుకున్నారు.

అప్పటి వరకు జరిగిన విషయాల్ని తెలుసుకున్న గాంధారి, విదురుణ్ని వెంటబెట్టుకుని ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్లింది. జూదంలో పాండవులు ఓడిపోవడం, ద్రౌపదికి అవమానం జరగడం, అపశకునాలు కనిపించడం అన్నీ ధృతరాష్ట్రుడికి వివరంగా చెప్పింది.

అది విని దృతరాష్ట్రుడు దుర్యోధనుణ్ని పిలిచాడు “దుర్యోధనా! పరమ పతివ్రత, తపస్విని, పాండవుల ఇల్లాలు, ధర్మాన్ని అనుసరించేది, అగ్ని నుంచి పుట్టినది అయిన ద్రౌపదిని సామాన్య స్త్రీగా అనుకుని భరించ శక్యం కాని విధంగా సభలో అవమానించడం మంచి పని కాదు.

నువ్వు చిన్నప్పటి నుంచి చెడు ఆలోచనలతోనే పెరిగావు. నీ వల్ల పాండవులు చాలా దుఃఖాలు అనుభవించారు. వాళ్ల మీద కోపం తగ్గించు” అని చెప్పాడు.

ద్రౌపదికి వరాలు ఇచ్చిన ధృతరాష్ట్రుడు

దుర్యోధనుడికి అతడు చేసిన పని తప్పని చెప్పి, ద్రౌపదిని అనునయిస్తూ “ద్రౌపదీ నా కోడళ్లందరిలో నువ్వే ఎక్కువ గౌరవనీయురాలివి. నీకు ఏం కావాలో అడుగు ఇస్తాను!” అన్నాడు.

“ధృతరాష్ట్ర మహారాజా! నాకు వరం ఇవ్వాలని మీకు అనిపిస్తే లోకంలో అందరితో గౌరవింపబడే మనువుతో సమానమైన ధర్మరాజుకి దాస్యం నుంచి విముక్తి కలిగించు! దానివల్ల గురువులు, పెద్దల మధ్య పెరిగిన నా కొడుకు ప్రతివింధ్యుణ్ని సేవకుడి కొడుకు అని కౌరవులు పిలవకుండా ఉంటారు!” అని అడిగింది.

ధృతరాష్ట్రుడు “నువ్వడిగినట్టే ఇచ్చాను. ఇంకో వరం కూడా కోరుకో!” అన్నాడు.

ద్రౌపది “మహారాజా! ధర్మరాజు నలుగురు తమ్ముళ్లు తమ ఆయుధాలు, కవచాలు, గృహాలతో సహా దాస్యం నుంచి విముక్తి పొందాలి!” అని కోరుకుంది.

ధృతరాష్ట్రుడు ద్రౌపదిని మూడో వరం కూడా కోరుకోమన్నాడు. ద్రౌపది అందుకు అంగీకరించలేదు. “ధృతరాష్ట్ర మహారాజా! వైశ్యస్త్రీ ఒక వరము, ఉత్తమ క్షత్రియస్త్రీ రెండు వరాలు, శూద్రస్త్రీ మూడు వరాలు, బ్రాహ్మణస్త్రీ వంద వరాలు కోరుకోవచ్చు. నేను క్షత్రియ స్త్రీని కనుక, రెండు వరాలకే అర్హురాల్ని కాబట్టి మూడో వరం నేను అడగను” అంది.

ద్రౌపది మాటలు విని ధృతరాష్ట్రుడు కోడలి గుణగణాలకి, ధర్మపరిజ్ఞానానికి, సంతోషించి ధర్మరాజుని అతడి తమ్ముళ్లని రప్పించాడు. “ధర్మరాజా! నువ్వు నీ మొత్తం సంపదలు, రాజ్యము తీసుకుని మునుపటిలాగే ఇంద్రప్రస్థ పురానికి వెళ్లి సుఖంగా జీవించు. నీకు మంచి జరుగుతుంది.

నువ్వు పెద్దలకి సేవ చేసి వాళ్ల నుంచి అనేక ధర్మాలు తెలుసుకున్నావు. నా కొడుకు అజ్ఞాని కనుక నీకు కీడు చెయ్యాలని అనుకున్నాడు. అన్నీ తెలిసిన నీకు నేను చెప్పవలసింది ఏదీ లేదు. మనస్సులో ఎవరి మీదా శత్రుత్వం లేకుండా, ఓర్పు కలిగి, మంచిని మాత్రమే గ్రహించి, తప్పులు వదిలెయ్యడం వివేకవంతుడికి ఉండ వలసిన మంచి గుణాలు.

జూదం ఆడుతున్నారని తెలిసినా నేను అవివేకంతో పట్టించుకోలేదు. వివేకం లేని ముసలివాణ్ని నన్ను, మీ తల్లి గాంధారిని చూసి దుర్యోధనుడు సహచరులతో కలిసి చేసిన చెడ్డ పనులు మనస్సులో పెట్టుకోకు. అన్ని శాస్త్రాలు తెలిసిన విదురుడూ, అన్ని ధర్మాలు తెలిసిన నువ్వూ రక్షిస్తూ ఉంటారు కనుక, ఈ కురువంశానికి ఎప్పుడూ మంచే జరుగుతుంది” అని చెప్పి పాండురాజు రాజ్యాన్ని ధర్మరాజుకి అప్పగించాడు.

పాండవులకీ, కౌరవులకీ మధ్య ఉన్న తీవ్రమైన కోపాన్ని తగ్గించింది ద్రౌపది. మహాసముద్రంలో పూర్తిగా మునిగి పోయినట్టు అన్ని సంపదల్ని పోగొట్టుకున్నారు పాండవులు. కీర్తివంతులు, ధైర్యవంతులు అయిన తన భర్తల్ని కాపాడుకుంది.

జరిగినదంతా విన్న భీమసేనుడు “పరాక్రమవంతులు, గొప్ప సంపదలు కలిగిన పాండవులకి భార్య వల్ల రాజ్యం వచ్చిందని చెప్పుకోవడం కంటే మించిన కష్టం ఏముంటుంది? ఎప్పుడూ వీరత్వాన్ని ప్రదర్శించడమే రాజులకి గొప్ప. అవి లేని రాజు లోకువ అవుతాడు కదా! శత్రురాజులతో భయంకరంగా యుద్ధం చేసి, జయించి పరాక్రమంతో రాజ్యాన్ని పొందుతాను” అంటూ కోపంతో ఎర్రబడ్డ కళ్లతో సింహంలా ముందుకు దూసుకువెళ్లాడు.

అలా వెడుతున్న భీముణ్ని ధర్మరాజు చేత్తో ఆపాడు. ధృతరాష్ట్రుడి ఆజ్ఞప్రకారం ధర్మరాజు తమ్ముళ్లతోను, ద్రౌపదితోను కలిసి ఇంద్ర ప్రస్థపురానికి వెళ్లిపోయాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here