మహాభారత కథలు-73: ధర్మరాజుకి వరాలు ప్రసాదించిన సూర్యుడు

0
9

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

ధర్మరాజుకి వరాలు ప్రసాదించిన సూర్యుడు

[dropcap]పు[/dropcap]రోహితుడు ధౌమ్యుడు చేసిన ఉపదేశాన్ని అనుసరించి ధర్మరాజు గంగానదిలో నిలబడి నిష్ఠతో సూర్యుణ్ని గురించి జపం చేశాడు. వేద స్వరూపుడు పాపాల్ని పోగొట్టేవాడు, పద్మాలకి మిత్రుడు, మూడు లోకాల్ని రక్షించే సూర్యుడు ధర్మరాజుకి ప్రత్యక్షమయ్యాడు.

“ధర్మరాజా! నీ తపస్సు నాకు నచ్చింది. నువ్వు అడవిలో నివసించ వలసిన పన్నెండు సంవత్సరాలు అడవిలో దొరికే పండ్లు, దుంపలు, కాయకూరలు నీ వంట గదిలో ద్రౌపది వండగా తరగని నాలుగు రకాలైన వంటకాలుగా తయారవుతాయి” అని చెప్పి ఒక రాగి పాత్రని ఇచ్చి మాయమయ్యాడు.

ధర్మరాజు సూర్యుడి నుంచి వరంగా ఒక అక్షయ పాత్రని పొందాడు. ఆ పాత్రలో ద్రౌపది కాయకూరలు చక్కగా వండుతుండగా అవి రుచిగా ఉన్న రకరకాలైన భోజన పదార్థాలుగా మారి అందర్నీ తృప్తిగా తినేలా చేసింది. ధర్మరాజు తనతో వచ్చిన బ్రాహ్మణులందరినీ పోషించగలిగాడు. ఆ విధంగా వేలకొలదీ బ్రాహ్మణులకి ప్రతి రోజూ సంతర్పణ జరుగుతూ ఉండేది.

అతిథులు తిన్నాక మిగిలినదాన్ని, యజ్ఞంలో దేవతలకి సమర్పించాక మిగిలినదాన్ని పాండవులు తినేవాళ్లు. తన భర్తలు తినగా మిగిలిన ఆహారాన్ని ద్రౌపది తినేది. కొంత కాలం పాండవులు అక్కడే నివసించి తరువాత బ్రాహ్మణుల అనుమతి తీసుకుని కామ్యకవనానికి వెళ్లారు.

ఒకరోజు ధృతరాష్ట్రుడు విదురుణ్ని పిలిపించి “నువ్వు శుక్రాచార్యుడి కంటే బుద్ధిమంతుడివి, కౌరవులకి పాండవులకి ఇష్టుడివి” అని పొగిడాడు. తరువాత అడవులకి వెళ్లిన పాండవులు ఏం చేస్తారని అడిగాడు.

విదురుడు ధృతరాష్ట్రుడితో “పాండవులు దేవతల అంశలతో పుట్టినవాళ్లు. గొప్ప ధైర్యవంతులు. వాళ్ల గొప్పతనం నీకు తెలియనిది కాదు. భీముడు, అర్జునుడు లోకంలో ప్రసిద్ధి చెందిన పరాక్రమం కలవాళ్లు. ఎన్నో అస్త్రాలు పొందినవాళ్లు. యుద్ధం కనుక చెయ్య వలసి వస్తే శత్రువుల్ని వాళ్లు బ్రతకనియ్యరు.

మోసంతో ఆడే జూదం వల్ల కౌరవులకి, పాండవులకి మధ్య శత్రుత్వం వస్తుందని మొదటే చెప్పాను. నా మాటలు లెక్కచెయ్యలేదు. నువ్వు నీ కొడుకు దుర్యోధనుడి మాటలే విన్నావు. జరిగింది జరిగిపోయింది. ఇప్పుడైనా నువ్వు పాండవుల్ని రప్పించి వాళ్ల రాజ్యాన్ని వాళ్లకి ఇస్తే నీకు మంచి పేరు వస్తుంది.

నువ్వు ధర్మాన్ని నిలబెట్టినవాడివి అవుతావు. రాజ్యానికీ, అర్ధకామమోక్షాలనే త్రివర్గాలకీ ధర్మమే ఆధారం. కర్ణ, శకుని, దుశ్శాసనుల చెడు మాటలు విని దుర్యోధనుడు చేసే చెడ్డ పనుల్ని నువ్వు అంగీకరించావు.

దుర్యోధనుడు పుట్టినప్పుడు ఎన్నో చెడు శకునాలు కనిపించాయి. ఆ రోజే నేను వీడి వల్ల కౌరవులకి కీడు కలుగుతుందని చెప్పాను. కులానికి చేటు తెచ్చేవాడిని నిందించి కులాన్ని రక్షించడం ధర్మం. సమస్త రాజ్యానికి ధర్మరాజుని రాజుగా చెయ్యి. అందువల్ల నీ కొడుకులు, మనుమలు, మిత్రులు, చుట్టాలు అందరూ సుఖంగా జీవిస్తారు. ద్రౌపదికీ, భీముడికీ నిండు సభలో దుశ్శాసనుడితో క్షమాపణలు చెప్పించు.

ఇంద్రుణ్ని మించినవాడు, సూర్యుడి తేజస్సు వంటి తేజస్సు కలవాడు, అజాతశత్రుడు, గొప్పవాడు, జయించడానికి సాధ్యం కానివాడు ధర్మరాజు. అతడు నీ కొడుకులు చేసిన కీడు మనస్సులో పెట్టుకోడు. ప్రతీపమహారాజు కులంలో పుట్టిన ధృతరాష్ట్రా! ధర్మరాజుకి పట్టాభిషేకం చెయ్యి. అలా చేస్తే కౌరవ వంశం పాపం లేకుండా కీర్తితో వెలుగుతుంది” అని చెప్పాడు.

విదురుడు చెప్పిన మాటలు విన్న ధృతరాష్ట్రుడికి కోపం వచ్చింది. విదురుడితో  “విదురా! దుర్యోధనుడు నా పెద్ద కుమారుడు. ఎవరేనా కుమారులకి చెడు తలపెడతారా? నువ్వు ఇలా చెప్పడం బాగుండలేదు. నా కొడుకులు వృద్ధిలోకి రావడం చూసి నువ్వు ఎప్పుడూ సహించలేవు. నువ్వు చేసే సహాయం నాకు అవసరం లేదు. వెంటనే పాండవుల దగ్గరికిగాని, మరెక్కడికైనా సరే నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్లిపో!” అన్నాడు.

పాండవుల దగ్గరికి వెళ్లిన విదురుడు

ధృతరాష్ట్రుడి మాటలకి కలతపడిన మనస్సుతో వెంటనే మనోవేగంతో వెళ్లగలిగిన రథాన్ని ఎక్కి పాండవులు నివసిస్తున్న కామ్యకవనానికి వెళ్లాడు.

విదురుడు తమ దగ్గరికి రావడం ధర్మరాజు చూశాడు. భీముడివైపు చూసి “ఇంతకు ముందు జూదమాడి ఓడించినప్పుడు గాండీవము మొదలైన ఆయుధాల సంగతి మర్చిపోయాడు. శకుని చేసే దుష్టబోధ వల్ల వాటి గురించి ఇప్పుడు గుర్తుకొచ్చి మళ్లీ జూదమాడించాలని విదురుణ్ని పంపించాడేమో. ఇంకొకసారి జూదమాడ్డం ఇష్టం లేదు. . అలాగని విదురుడి మాట జవదాటడం కూడా ఇష్టం లేదు” అన్నాడు.

వాళ్లల్లో వాళ్లు మాట్లాడుకుంటూ ఉండగానే విదురుడు అక్కడికి వచ్చాడు. పాండవులు ఆయనకి ఎదురువెళ్లి వినయంగాను, ప్రేమగాను తీసుకుని వచ్చి సత్కారం చేసి కూర్చోబెట్టి అక్కడికి రావడానికి కారణం ఏమిటో చెప్పమన్నారు.

విదురుడు పాండవులవైపు చూసి “ధర్మరాజా! ధృతరాష్ట్రుడు నన్ను ఏకాంతంగా పిలిచి నువ్వు మాకు, పాండవులకి కావలసినవాడివి. ఇప్పుడు నేను ఏం చెయ్యాలో చెప్పు అని అడిగాడు. నేను ఇరువైపులవాళ్లకి,  లోకానికి మేలు జరిగే మార్గం సూచించాను. రుచిగా ఉండే ఆహారం అందరికీ రుచిగా ఉంటుంది కాని, జబ్బుతో బాధపడేవాడికి రుచించదు కదా? అలాగే నేను చెప్పిన మంచి అతడికి నచ్చలేదు.

మంచి బుద్ధి కలవాళ్లు ఉన్నదాన్ని ఉన్నట్టు చెప్తే ఆదరిస్తారు. అవినీతిపరులకి మంచి మాటలు విషంలా అనిపిస్తాయి. అందుకే ధృతరాష్ట్రుడు నా మీద నిందలు మోపి నువ్వు మాకు ఎప్పుడూ చెడు జరగాలనే చూస్తావు. మా దగ్గర ఉండద్దు పాండవుల దగ్గరికే ఫో! అన్నాడు. ధర్మాన్ని వదిలేసిన కౌరవుల దగ్గర రాజ్యలక్ష్మి స్థిరంగా ఉండదు. ఆ రాజ్యసంపదలన్నీ వాటంతట అవే నీ దగ్గరికి వచ్చి చేరుతాయి. ఇంక మీరు నేను చెప్పినట్టు నడుచుకోండి” అన్నాడు. ధర్మరాజూ తప్పకుండా వింటాము చెప్పమన్నాడు.

అదే సమయంలో ధృతరాష్ట్రుడికి విదురుడు పాండవుల దగ్గర ఉన్నట్టు తెలిసింది. విదురుడు ధృతరాష్ట్రుడికి  హృదయం వంటి వాడు, చూపులేని అతడికి చూపువంటివాడు. అటువంటి విదురుడు లేకపోతే ఉండలేక పోయాడు. వెంటనే సంజయుణ్ని పిలిచి “సంజయా! నేనంటే ప్రేమ కలవాడు, నా మనస్సు తెలిసినవాడు, సోదరుడు, ధర్మమార్గాన్ని ఇష్టపడేవాడు విదురుడు. అతడు అందమైన కామ్యకవనంలో పాండవుల దగ్గర ఉన్నాడు. నువ్వు ఇప్పుడే వెళ్లి విదురుణ్ని వెంటబెట్టుకునిరా!” అని చెప్పాడు.

ధృతరాష్ట్రుడు ఆజ్ఞాపించగానే సంజయుడు బయలుదేరి కామ్యకవనానికి వెళ్లాడు. అక్కడ వేలకొద్దీ బ్రాహ్మణ సమూహలు; పురోహితుడు ధౌమ్యుడు; ధర్మము, క్షమ అనే ఆభరణాలు ధరించిన నలుగురు తమ్ముళ్లు; విదురుడు; ద్రౌపది వంటి గొప్ప గుణవంతురాలు; బంధువుల మధ్య దేదీప్యమనంగా వెలిగిపోతున్న ధర్మరాజుని చూశాడు. అడవిలో నివసిస్తూ కూడా ముల్లోకాల్ని పరిపాలిస్తున్నంత  గొప్పగా కనిపిస్తున్న ధర్మరాజుని చూసి సంజయుడు నమస్కరించాడు.

అందరివైపు వినయంగా చూసి ధర్మరాజుతో “మా ధృతరాష్ట్ర ప్రభువు మిమ్మల్ని, ధర్మవేత్త అయిన విదురుణ్ని ఎప్పుడూ తలుచుకుంటూనే ఉంటాడు. తన తమ్ముడైన విదురుణ్ని తీసుకుని రమ్మని నన్ను పంపించాడు” అన్నాడు.

అతడు చెప్పింది విని ధర్మరాజు విదురుడితో “ధృతరాష్ట్రుడు చక్రవర్తి. ఆయన మాట శిలాశాసనం. ప్రజలు కూడా ఆయన చెప్పినట్టే నడుచుకుంటారు. ప్రజలకంటే ఎక్కువగా ఆయన ఆజ్ఞని పాటించడం మన ధర్మం. కనుక వెంటనే బయలుదేరి వెళ్లడమే కర్తవ్యం” అన్నాడు. విదురుడు వెంటనే లేచి హస్తినాపురానికి బయలుదేరాడు.

ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్లి రెండు చేతులు జోడించి నమస్కరించాడు. ధృతరాష్ట్రుడు విదురుణ్ని ప్రేమగా కౌగలించుకుని “క్షమాగుణం కలిగినవాడివి కనుక నన్ను క్షమించగలిగిన సంస్కారం నీ దగ్గర ఉంది. నేను వివేకం లేకుండ మాట్లాడాను. నువ్వే నన్ను క్షమించు” అని వేడుకున్నాడు.

విదురుడు ధృతరాష్ట్రుడితో “మహారాజా! నువ్వు, నీ కొడుకు దుర్యోధనుడు న్యాయం వదిలి మాట్లాడుతున్నప్పుడు మీ మంచిని కోరుతూ మాట్లాడడం నా కర్తవ్యం. పరాక్రమవంతులైన పాండవులతో కలిసి మెలిసి ఉండడమే అన్ని విధాలా మంచిది” అన్నాడు. విదురుడు ఎప్పుడూ ఉన్నట్టే ధృతరాష్ట్రుడికి పరిపాలనలో తగిన సలహాలు ఇస్తూ సహాయంగా ఉన్నాడు.

వాళ్లిద్దరు కలిసిమెలిసి ఉండడం చూసి కర్ణుడు, శకుని, దుశ్శాసనుల్ని పిలిచి దుర్యోధనుడు “ఈ విదురుడికి పాండవులంటే చాలా ఇష్టం. వెళ్లిపోయినవాడు మళ్లీ వచ్చి ధృతరాష్ట్రుడికి మంత్రి అయ్యాడు.  ధృతరాష్ట్రుడు కూడా విదురుడితో అన్ని విషయాలు సంప్రదించి అతడు చెప్పినట్టుగానే చేస్తున్నాడు.

వీళ్లిద్దరూ కలిసి పాండవుల్ని వనవాసం నుంచి ఇక్కడికి రప్పిస్తే వాళ్లకి నిప్పు, నీరు, విషం ఉపయోగించి అపాయం కలిగేలా చేద్దాం” అన్నాడు.

దుర్యోధనుడి మాటలు విని శకుని “దుర్యోధనా! నువ్వు చాలా తెలివితక్కువగా ఆలోచిస్తున్నావు. విదురుడు, ధృతరాష్ట్రుడు ఏదో ఒకరకంగా అలోచించి వాళ్లని రప్పించడానికి ప్రయత్నించినా సత్యదీక్షాపరులైన పాండవులు ఇంతకు ముందు తాము చేసిన ప్రతిజ్ఞని వదిలిపెట్టి ఎందుకు వస్తారు?” అన్నాడు.

శకుని మాటలు విని కర్ణుడు “దుర్యోధనా! ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకుని వాళ్లతో యుద్ధం చేసి వాళ్లని చంపేద్దాం. భూమి మీద మనకి అసలు శత్రుశేషం లేకుండా చేసేద్దాం” అన్నాడు. కర్ణుడి మాటలకి అహంకారపరుడైన దుర్యోధనుడు చాలా సంతోషపడ్డాడు. వెంటనే సేనల్ని సమీకరించుకుని పాండవుల మీదకి యుద్ధానికి బయలుదేరాడు.

వ్యాసమహర్షి దివ్యదృష్టితో జరుగుతున్నదాన్ని తెలుసుకున్నాడు. దుర్యోధనుడి దగ్గరికి వచ్చి అతడు చేస్తున్న పని ధర్మం కాదని వారించాడు. ధృతరాష్ట్రుణ్ని కలుసుకుని “మహారాజా! అన్నీ పోగొట్టుకుని ఒంటరిగా అడవుల్లో నివసిస్తున్న పాండవులని చంపాలని నీ కొడుకు దుర్యోధనుడు దండెత్తి వెడుతున్నాడు. ఇటువంటి ఆలోచన మంచిదా?

సత్యదీక్ష, పరాక్రమము, ఓర్పు కలిగిన పాండవులు తమ ప్రతిజ్ఞ పదమూడేళ్లు గడిచాక యుద్ధానికి వస్తారు. నువ్వు, నేను, విదురుడు, భీష్ముడు బ్రతికి ఉండగా ఇటువంటి అధర్మాన్ని సహించడం న్యాయమా? పాండవుల మీద ఇప్పుడు పగసాధించడం మంచిదా?” అని అడిగాడు.

వ్యాసుడి మాటలకి ధృతరాష్ట్రుడు దుఃఖపడ్డాడు. వ్యాసుడితో “నాకు, గాంధారికి, భీష్ముడికి, విదురుడికి, కృప ద్రోణులకి ఇష్టం లేకుండానే చెడు జూదం జరిగింది. ఏం చెయ్యను. దుర్యోధనుడి మీద ఉండే ప్రేమతో నేను అతడిని వదలలేక పోతున్నాను” అన్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here