మహాభారత కథలు-79: ధర్మరాజు దగ్గరికి వచ్చిన బృహదశ్వమహర్షి

0
13

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

అరణ్యపర్వము (మొదటిభాగము) రెండవ ఆశ్వాసము- నలోపాఖ్యానము

ధర్మరాజు దగ్గరికి వచ్చిన బృహదశ్వమహర్షి

[dropcap]కో[/dropcap]పంతోను, ఆవేశంతోను మాట్లాడుతున్న భీముణ్ని శాంతపరుస్తున్నాడు ధర్మరాజు. అదే సమయంలో బృహదశ్వమహర్షి అనే గొప్ప మహర్షి ధర్మరాజు దగ్గరికి వచ్చాడు. ఆయనకి అతిథిసత్కారాలు చేసి మహర్షి విశ్రాంతి తీసుకున్నాక ధర్మరాజు మహర్షితో తమకు జూదంలో జరిగిన మోసము పడుతున్న కష్టాలు అన్నీ వివరించి చెప్పాడు.

తరువాత “మహర్షీ! నివసించే ప్రదేశాన్ని, రాజ్యాన్ని, చుట్టాలని విడిచిపెట్టి జంతువులతో కలిసి మాలాగా కష్టాలు పడినవాళ్లు ఎవరైనా ఉన్నారా?” అని అడిగాడు.

ధర్మరాజు అడిగినదానికి బృహదశ్వమహర్షి “ధర్మరాజా! నువ్వు కష్టాలు పడుతూ అడవుల్లో నివసిస్తున్న మాట నిజమే. కాని, దేవతలతో సమానులైన తమ్ముళ్లు నీకు తోడుగా ఉన్నారు. విజ్ఞానబోధ చేస్తున్న ఉత్తములైన గొప్ప బ్రాహ్మణులు నీతో కలిసి ఉంటున్నారు. నీకు రథాలు, పరివారం ఉంది. ఈ రకంగా అరణ్యవాసం చెయ్యడం చూస్తే నువ్వెంత ధర్మపరుడివో తెలుస్తోంది.

పూర్వకాలంలో నలుడనే మహారాజు ప్రజలకి ఏ కష్టమూ లేకుండా రాజ్యాన్ని పాలించేవాడు. అతడు పుష్కరుడితో జూదమాడి తన సంపద మొత్తం పోగొట్టుకున్నాడు. ఒంటరిగా అడవుల్లో తిరిగి ఎన్నో కష్టాలు అనుభవించాడు కదా!” అన్నాడు. మహర్షి చెప్పినది విని ధర్మరాజు నలమహారాజు గురించి తనకు తెలియదని అదెలా జరిగిందో వివరంగా చెప్పమని అడిగాడు.

హంసరాయబారము

నిషధ దేశపు రాజు వీరసేనుడి కుమారుడు నలుడు. అతడు గొప్ప తేజస్సు కలవాడు. ఎన్నో అక్షౌహిణుల సేనకి అధినేత. అతడికి జూదమంటే చాలా ఇష్టం. అతడు తన పరాక్రమంతో రాజులందరిని జయించి ప్రజలకి ఏ కష్టాలు లేకుండా రాజ్యాన్ని పాలిస్తున్నాడు. అతడి పాలనలో బ్రాహ్మణులు ఎంతో తృప్తిగా జీవించారు.

విదర్భరాజ్యానికి రాజైన భీముడికి సంతానం కలగలేదు. అతడు భార్యతో కలిసి ‘దమనుడు’ అనే గొప్ప ఋషిని ఆరాధించాడు. వాళ్లకి దమయంతి అనే కూతురు; దముడు, దాంతుడు, దమనుడు అనే ముగ్గురు కొడుకులు పుట్టారు. దమయంతి గొప్ప సౌందర్యవంతురాలు, సుగుణవంతురాలు. సురలు, సిద్ధులు, సాధ్యుల కన్యలతో సమానంగా ఉండే వందమంది చెలికత్తెలు ఆమెని సేవించేవాళ్లు. గొప్ప వైభవంతో తులతూగుతూ ఉండేది దమయంతి.

నలుడి మంచి గుణాల గురించి దమయంతికి, దమయంతి మంచి గుణాల గురించి నలుడికి తెలియడం వల్ల వాళ్లకి ఒకరంటే మరొకరికి ఇష్టం ఏర్పడింది. ఒకరోజు నలుడు దమయంతి అందము, గుణము గురించి ఆలోచిస్తూ ఉద్యానవనంలో విహరిస్తున్నాడు. అప్పుడు ఆకాశంలో తిరిగే సౌందర్యరాశి మెడలోంచి జారి పడిన హారంలా హంసల గుంపు నేలమీద వాలింది. వాటి అందం చూసి తరుముతూ వాటిని పట్టుకోవాలని ప్రయత్నించాడు. చివరికి ఒక హంసని పట్టుకున్నాడు.

నలుడి చేతికి చిక్కిన హంసని వదిలి వెళ్లలేక, ఆకాశంలో అటు ఇటు తిరుగుతున్న హంసలు.. శరత్కాలంలో మబ్బులు గాలివల్ల విడిపోయి ముక్కలుగా మారినట్టు కనిపిస్తున్నాయి. నలమహారాజు తనకి కీడు చేస్తాడని అనుకుని హంస, మనిషి భాషలో “మహారాజా! నేను నీకు మంచి ఉపకారం చేస్తాను. నువ్వు ఇష్టపడుతున్న దమయంతి దగ్గరికి వెళ్లి నీ గుణగణాలు అమెకి వర్ణించి చెప్పి నీ మీద ఇష్టం కలిగేలా చేస్తాను” అంది. దాని మాటలకి నలుడు సంతోషించి వెంటనే దాన్ని విడిచిపెట్టేశాడు.

ఆ హంస మిగిలిన హంసలతో కలిసి విదర్భరాజ్యానికి వెళ్లింది. ఉద్యానవనంలో చెలికత్తెలతో విహరిస్తున్న దమయంతి దగ్గర వాలింది. వాటిని చూసి దమయంతి చాలా సంతోషించింది. చెలికత్తెలందరు పరుగులు పెడుతూ ఆ హంసల్ని పట్టుకున్నారు. నలుడితో పట్టుబడ్డ హంస మాత్రం చాకచక్యంగా దమయంతికే పట్టుబడింది. దమయంతికి నలుడికి ఒకళ్లమీద ఒకళ్లకి ఇష్టం పెరిగేలా చెయ్యడం కోసం హంస మనిషి భాషలో మాట్లాడింది.

“దమయంతీ! నేను నీ హృదయేశ్వరుడైన నలుడి దగ్గరనుంచి వస్తున్నాను. సముద్రం వరకు విస్తరించి ఉన్న ఈ అపార భూమండలంలో ఉన్న రాజులెవ్వరు అందంలోను, గుణాల్లోను నలుడికి సాటిరారు. నీకు ఉన్న గొప్ప లక్షణాలు, సౌందర్యం, లావణ్య సంపద, ఐశ్వర్యం, నిత్య సౌభాగ్యం, అదృష్టం, వంశ గౌరవం అన్నీ నలుడితో సరితూగుతాయి. నువ్వు స్త్రీలలో రత్నానివి, అతడు పురుషులలో రత్నము. మీ ఇద్దరి కలయిక శోభాయమానంగా ఉంటుంది” అంది.

హంస మాటలు విని దమయంతి ఆనందంతో “నాకు అతడి గురించి ఎలా చెప్పావో.. నా గురించి అతడికి కూడా చెప్పు” అని హంసని విడిచి పెట్టింది. హంస నిషధ దేశానికి వెళ్లి నలమహారాజుకి దమయంతి గుణము, రూపము, వైభావాల్ని గురించి వర్ణించి చెప్పింది. నలదమయంతులిద్దరు ఒకరి మీద ఒకరు ప్రేమని పెంచుకున్నారు.

బాధపడుతున్న దమయంతిని చూసి చెలికత్తెలు విషయాన్ని దమయంతి తండ్రి భీమరాజుకి చెప్పారు. “మహారాజా! దమయంతి రాజహంస వెళ్లిన వైపే చూస్తూ ఉంటుంది. దాని మాటలే తలుచుకుంటుంది. చెలికత్తెలతో మాట్లాడడం మానేసింది. ఏ పనీ చెయ్యకుండానే అలిసిపోతోంది. అందమైన ఆభరణాల మీద, విహారాల మీద ఇష్టం చూపించట్లేదు. ప్రతి రాత్రి నిద్ర లేకుండానే గడిపేస్తోంది. ఎప్పుడూ నలమహారాజు గురించే ఆలోచిస్తుంది. ఎంత సంపద ఉన్నవాళ్లైనా, ఎంత గొప్ప గుణాలు కలిగినవాళ్లైనా ఇతర రాజుల గురించి వినడానికి ఇష్టపడదు” అని చెప్పారు.

దమయంతి స్వయంవరము

చెలికత్తెలు చెప్పింది విని భీమరాజు నలమహారాజుని ఎలా రప్పించాలా అని ఆలోచించాడు. భూమండలంలో ఉన్న రాజుల్ని దమయంతీ స్యయంవరం అనే వంకతో రప్పించాడు. రాజులందరు ఉత్సాహంతో దమయంతీ స్వయంవరానికి వచ్చేశారు. వాళ్ల సేనలు, రథాల రాపిడికి భూమి మొత్తం కదిలిపోయింది.

అదే సమయంలో పర్వతుడు, నారదుడు అనే ప్రాచీన ఋషులు భూమండలమంతా తిరిగి చూసి ఇంద్రుడి దగ్గరికి వెళ్లారు. ఇంద్రుడు వాళ్లని పూజించి కుశల ప్రశ్నలు వేసి “మునీంద్రులారా! ఇంతకు ముందు ధర్మపరిపాలన చేసి యుద్ధాల్లో వీరమరణం పొందిన రాజులు అక్షయలోకాల సుఖాలు అనుభవించడానికి స్వర్గలోకానికి వచ్చేవాళ్లు. చాలాకాలంగా వాళ్లు రావట్లేదు. కారణం ఏమిటో చెప్పగలరా?” అని అడిగాడు.

నారదమహర్షి “విదర్భ రాజకుమారి దమయంతి జగదేక సుందరి. నరులలో, సిద్ధుల్లో, సాధ్యుల్లో, విద్యాధరుల్లో, దేవతల్లో అటువంటి సౌందర్యవతి లేదు. ఆమె స్వయంవర మహోత్సవం భూలోకంలో అసాధరణ వైభవంతో జరుగుతోంది. ఆ స్వయంవరంలో పాల్గోడానికి భూలోకంలో ఉన్న రాజులందరు తమ మధ్య ఉండే విరోధాలు, అభిప్రాయభేదాలు వదిలి పెట్టి ఉత్సహంతోను, వేడుకతోను స్నేహభావంతో ఉంటున్నారు” అని చెప్పాడు.

నారదమహర్షి చెప్పినది విని ఇంద్రుడు, దిక్పాలకులు దమయంతీ స్వయంవరాన్ని చూడాలన్న కోరికతో రత్నాలు పొదిగిన అందమైన బంగారు విమానాలు ఎక్కి బయలుదేరారు. దారిలో వాళ్లకి భూమి మీద నలమహారాజు కనిపించాడు. సూర్యుల్లో విష్ణువులా, గొప్ప తేజస్సుతో వెలిగిపోతూ అతడు కూడా దమయంతీ స్వయంవరానికి వెడుతున్నాడు. సౌందర్యంలో తనకి సాటి ఎవరూ లేనట్టు అపరమన్మథుడిలా కనిపిస్తున్నాడు.

దేవతలు తమ విమానాలు ఆకాశంలోనే ఆపుకుని భూమి మీదకి వచ్చి “నలమహారాజా! మాకు దూతగా ఉండి మా కోరిక నెరవేరుస్తావా?” అని అడిగారు. అది విని నలుడు “తప్పకుండా చేస్తాను కాని, అసలు మీరెవరో.. మీకు నేను చెయ్యవలసిన పనేమిటో చెప్పండి!” అన్నాడు.

నలమహారాజుతో దేవేంద్రుడు “నేను ఇంద్రుణ్ని. వీళ్లు దిక్పాలకులు, సుప్రసిద్ధులు. మేము భూలోకంలో జరుగుతున్న దమయంతీ స్వయంవరం చూడాలన్న కోరికతో వచ్చాము. నువ్వు రాజకుమారి దమయంతికి మా పేర్లు, బిరుదులు చెప్పి గొప్పగా అనిపించేలా పరిచయం చెయ్యాలి. నువ్వు చెప్పినదాన్ని బట్టి ఆమె మాలో ఒకరిని ఎంచుకుంటుంది” అని చెప్పాడు.

ఇంద్రుడు చెప్పింది విని నలుడు వాళ్లకి నమస్కారం చేసి “మీరూ, నేను ఒకే ధ్యేయంతో వెడుతున్నామనే విషయం మీకు పూర్తిగా తెలుసు. ఈ పనికి నన్ను నియోగించడం న్యాయంగా ఉందా?” అని అడిగాడు.

ఇంద్రుడు “మహారాజా! నువ్వే కదా మీరు ఏదడిగినా చేస్తాను అని ఉత్సాహంతో చెప్పావు. మరి ఇప్పుడు చెయ్యకపోతే ఆడిన మాట తప్పినట్టు అవుతుంది కదా. నువ్వు సత్యసంధుడివని తెలుసు. ఈ పని చెయ్యగల శక్తిసామర్థ్యాలు నీకు ఉన్నాయనీ తెలుసు. అందుకే నిన్ను దూతగా ఎంచుకున్నాము. ఇది దేవతల మేలుకోసం చేస్తున్న పని. నువ్వు ఈ పని తప్పకుండా చెయ్యాలి. ఆయుధాలు ధరించిన భటులు కాపలా కాస్తున్న అంతఃపురంలోకి ప్రవేశించడానికి వీలుపడదని అనుకోకు. దమయంతి మందిరంలోకి ప్రవేశించేటప్పుడు నిన్ను ఎవరూ అడ్డుపెట్టకుండా మేము జాగ్రత్తలు తీసుకుంటాము” అని చెప్పాడు.

దేవదూతగా వెళ్లిన నలుడు

నలుడు ఇంద్రుడు చెప్పినట్టుగా విదర్భరాజధానికి చేరుకుని దమయంతి మందిరంలోకి ప్రవేశించాడు. మొదటిసారి దమయంతిని చూసాడు. అంతకు ముందు హంస తనతో చెప్పినదాని కంటె కూడా అందంగా కనిపించింది. దేవకన్యల అందంతో సమానమైన అందం కలిగిన నూరుమంది చెలికత్తెలు ఆమెని కొలుస్తున్నారు.

నలమహారాజు గురించి చెలికత్తెలు ఆపకుండా చెప్తూ ఉంటే వింటూ కొంత ఊరట పొందుతోంది. నలుణ్ని చూడగానే దమయంతి చెలికత్తెలు ఆశ్చర్యపోయారు. అపూర్వమైన అందంతో వెలిగిపోతున్న ఈ మనిషి ఎవరు? ఎటువైపు నుంచి వచ్చాడు? అని అనుకుంటూ ఆనందంతో తమకు తెలియకుండానే ఆసనాలు దిగి గౌరవంగా నిలబడ్డారు.

దమయంతి తనకు కలుగుతున్న సిగ్గు కనిపించకుండా దివ్యసుందర విగ్రహం కలిగిన రాజకుమారుడితో “నువ్వు గొప్పవాడిలా కనిపిస్తున్నావు? ఎవరివో? ఎక్కడి నుంచి వచ్చావో? దేనికోసం వచ్చావో? ఈ అంతఃపురం చండశాసనుడైన నా తండ్రి రక్షణలో ఉంది. నువ్వు ఎవరికి కనబడకుండ ఎవరూ రాలేని ఈ చోటికి ఎలా రాగలిగావు?” అని అడిగింది.

ఆమె మాటలకి నలుడు “నేను దేవదూతని. నా పేరు నలుడు. ఇంద్రుడు, అగ్ని, యముడు, వరుణుడు నీ స్వయంవరం చూడాలని వచ్చారు. వాళ్లల్లో ఎవరినయినా ఒకరిని వరించమని చెప్పమని నన్ను నీ దగ్గరికి దూతగా పంపించారు. వాళ్లవల్లే నేను ఎవరికీ కనిపించకుండా ఈ అంతఃపురంలోకి ప్రవేశించ గలిగాను. నువ్వు వాళ్ల ఇష్టాన్ని నెరవేర్చు” అని చెప్పాడు.

దమయంతి హంస చెప్పినప్పటి నుంచి నలుడి మీద ఇష్టం పెంచుకుంది. ఇప్పుడు నలుణ్ని కళ్లారా చూసింది. అతడి మాటలు విని బాధపడుతూ “మానవమాత్రురాలిని నేనెక్కడ? దేవతలు ఇంద్రుడు మొదలైన వాళ్లెక్కడ? నేను వాళ్లని ఎప్పుడూ పూజిస్తూ ఉంటాను. నీ గురించి హంస చెప్పిన రోజు నుంచి నిన్నే నా భర్తగా నిర్ణయించుకున్నాను.

నీ కోసమే ఇంతమంది రాజుల్ని ఆహ్వనించవలసి వచ్చింది. ప్రపంచంలో గొప్ప కీర్తి కలిగిన నలమహారాజా! నువ్వే నన్ను వరించు. నువ్వు నా భర్తగా ఉండడానికి అంగీకరించకపోతే ఉరివేసుకునో.. విషం తాగో.. నిప్పుల్లో దూకో.. నీళ్లల్లో పడో ప్రాణాలు విడుస్తాను” అని చెప్పింది.

దమయంతి మాటలు విని నలుడు “దమయంతీ! భూలోకంలో దేవతలకి ఇష్టంలేని పనులు చేసినవాళ్లు కష్టాలు పడతారు. వాళ్ల ఇష్టాన్ని అంగీకరించి నన్ను రక్షించు!” అన్నాడు.

దమయంతి దుఃఖపడుతూ చాలాసేపు అలోచించింది. “నలమహారాజా! నీ అభిప్రాయానికి అపాయం లేకుండా ఉండేలా ఒక ఉపాయాన్ని ఆలోచించాను. ఇంద్రుడు దిక్పాలకులతో కలిసి నా స్వయంవరానికి వస్తే వాళ్ల సమక్షంలోనే నిన్ను నా భర్తగా ఎంచుకుంటాను. అప్పుడు నీ తప్పు ఉండదు కదా!” అంది.

నలుడు దిక్పాలకుల దగ్గరికి వెళ్లి తను దమయంతికి తను చెప్పిన మాటలు, అందుకు దమయంతి బదులుగ చెప్పిన మాటలు వివరించాడు. తరువాత ఒక మంచి తిథి నక్షత్రబలం కలిగిన లగ్నంలో దమయంతీ స్వయంవరం జరిగింది. పద్మాలవంటి కళ్లు గలిగిన దమయంతి తెల్లని పూలదండని చేతుల్లో పట్టుకుని వచ్చింది. స్వయంవర మహోత్సవాన్ని దర్శించడానికి వచ్చిన రాజులందరినీ చూసింది.

అక్కడ నలుడితో పాటు మరో నలుగురు దేవతలు నలుడి ఆకారంలో కనిపించారు. ఆ అయిదుగురిలో అసలు నలుడు ఎవరో తెలుసుకోలేక బాధపడుతూ “దేవతలారా! నాకు నలుణ్ని భర్తగా ఎంచుకోగలిగే జ్ఞానాన్ని ప్రసాదించండి. మీ నిజస్వరూపాలు ధరించండి” అని మనస్సులో ప్రార్థించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here