మహాభారత కథలు-8: నాగజాతి పుట్టిన విధానం

0
6

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

ఆదిపర్వము రెండవ ఆశ్వాసము నుండి

నాగజాతి –అనూరుడు – గరుత్మంతుల జననం

[dropcap]అ[/dropcap]ప్పటి వరకు సూతమహర్షి చెప్పినదాన్ని విని శౌనకుడు మొదలైన మహర్షులు “మహర్షీ! పాములకి కద్రువ తల్లి కదా! ఆమె తన పిల్లలకి నాశనం జరగాలని ఎందుకు శపించింది?” అని అడిగి, సూతమహర్షి తరువాత చెప్పబోయే కథల్ని వినడానికి సిద్ధంగా ఉన్నారు.

నాగజాతి జననం

కశ్యపబ్రహ్మకి ఇద్దరు భార్యలు. వాళ్ల పేర్లు కద్రువ, వినత. సంతానం కోసం కొన్నివేల సంవత్సరాలు ఆయనకి సేవ చేశారు. ఒకరోజు కశ్యపుడు వాళ్లిద్దర్నీ పిలిచి “మీకు ఏ వరం కావాలో కోరుకోండి ఇస్తాను!” అన్నాడు. తమ కోరిక తీరుతున్నందుకు వాళ్లిద్దరు చాలా సంతోష పడ్డారు.

కద్రువ “నాథా! నాకు అగ్నిలా గొప్ప కాంతి, చాలా పొడవైన శరీరము, అమితమైన పరాక్రమము కలిగిన వెయ్యి మంది కొడుకుల్ని ప్రసాదించండి!” అని అడిగింది.

అమె అడిగిన తరువాత వినత “స్వామీ! నాకు కద్రువకు కలిగే కొడుకులకంటె ఎక్కువ పరాక్రమము, ముఖ్యంగా బాహుబలం ఎక్కువగా కలిగిన ఇద్దరు కొడుకుల్ని ప్రసాదించండి!” అని కోరుకుంది.

తపస్సంపన్నుడైన కశ్యప మహర్షి మంచి సంతానం కోసం పుత్రకామేష్టి అనే యాగం చేశాడు. కద్రువకి వెయ్యిమంది కొడుకుల్ని, వినతకి ఇద్దరు కొడుకుల్ని వాళ్లు కోరుకున్నట్టుగా అనుగ్రహించాడు. గర్భాల్ని జాగ్రత్తగా కాపాడుకోమని చెప్పాడు.

కొంతకాలం గడిచాక వాళ్ల గర్భాలు అండాలుగా మారాయి. వాటిని నెయ్యితో నిండిన కుండల్లో ఉంచి కాపాడుకుంటున్నారు. అయిదు వందల సంవత్సరాలు అలాగే గడిచిపోయాయి.

కద్రువ కుండల్లో పెట్టిన అండాలు పగిలి:- శేషుడు, వాసుకి, ఐరావతుడు, తక్షకుడు, కర్కోటకుడు, ధనంజయుడు, కాళీయుడు, మణినాగుడు, ఆపూరణుడు, పింజరకుడు, ఏలాపుత్రుడు, వామనుడు, నీలుడు, అనీలుడు, కల్మాషుడు, శబలుడు, ఆర్యకుడు, ఉగ్రకుడు, కలశపోతకుడు, సురాముఖుడు, దధిముఖుడు, విమలపిండకుడు, ఆప్తుడు, కర్కోటకుడు, శంఖుడు, వాలిశిఖుడు, నిష్ఠానకుడు, హేమగుహుడు, నహుషుడు, పింగళుడు, బాహ్యకర్ణుడు, హస్తిపదుడు, ముద్గరుడు, పిండకుడు, కంబలుడు, అశ్వతరుడు, కాళీయకుడు, వృత్తుడు, సంవర్తకుడు, పద్ముడు, శంఖముఖుడు, కూష్మాండకుడు, క్షేమకుడు, పిండారకుడు, కరవీరుడు, పుష్పదంష్ట్రుడు, బిల్వకుడు, బిల్వపాండరుడు, మూషకాదుడు, శంఖశిరుడు, పూర్ణభద్రుడు, హరిద్రకుడు, అపరాజితుడు, జ్యోతికుడు, శ్రీవహుడు, కౌరవ్యుడు, ధృతరాష్ట్రుడు, శంఖపిండుడు, వీర్యవంతుడు, విరజుడు, సుబాహువు, శాలిపిండుడు, హస్తిపిండుడు, పిఠరకుడు, సుముఖుడు, కౌణపాశనుడు, కుఠరుడు, కుంజరుడు, ప్రభాకరుడు, కుముదుడు, కుముదాక్షుడు, తిత్తిరి, హలికుడు, కర్దముడు, బహుమూలకుడు, కర్కరుడు, అకర్కరుడు, కుండోదరుడు, మహోదరుడు మొదలైన పేర్లతో వెయ్యిమంది గొప్ప బలవంతులైన, పొడవైన సర్ప రాజులు జన్మించారు. కద్రువకి కలిగిన సంతానం పాములన్నమాట!

అనూరుడు జననం

తన గర్భం నుంచి వచ్చిన అండాలు ఇంకా పగలలేదని, తను కోరుకున్నట్టుగా తనకి సంతానం కలగలేదని వినత బాధ పడింది. తన సవతి కద్రువ తనకంటే ముందు తల్లయింది. తనని అందరూ ఏమనుకుంటారో అని సిగ్గుపడింది. తన అండాలు వాటంతట అవి పగలక ముందే కంగారుగా ఒక అండాన్ని పగుల కొట్టింది. ఆ అండం నుంచి శరీరంలో కింద భాగం లేకుండా, పై శరీరం మాత్రమే ఉన్న గొప్ప నీతివంతుడైన కుమారుడు జన్మించాడు.

అతడి పేరు అనూరుడు. శరీరం పూర్తిగా ఏర్పడకుండా జన్మించిన అనూరుడు (తొడలు లేనివాడు) తల్లి మీద కోపగించాడు. “తల్లీ! నాకు పూర్తిగా శరీరం ఏర్పడకుండానే అండాన్ని పగలకొట్టి పొరపాటు చేశావు. నన్ను వికలాంగుడిగా పుట్టించావు. కనుక, నువ్వు అయిదు వందల సంవత్సరాలు నీ సవతి కద్రువకి దాసిగా జీవించు!” అని తల్లిని శపించాడు.

అనూరుడు కోపంతో శపించినా అంతలోనే దయ కలిగి “అమ్మా! రెండవ అండం నుంచి గొప్ప బలము, పరాక్రమము కలిగినవాడు పుడతాడు. నీ దాసీత్వాన్ని అతడే పోగొడతాడు. తొందరపడి ఆ గుడ్డుని మాత్రం పగలకొట్టద్దు!” అని చెప్పాడు.

వినత మళ్లీ పొరపాటు చెయ్యకుండా తన రెండవ అండాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటోంది. ఆమె పెద్ద కుమారుడు అనూరుడు సూర్యుడికి సారథిగా వెళ్లిపోయాడు.

కద్రువ వినతల పందెము

కద్రువ వినతలు పాలసముద్రం ఒడ్డు దగ్గర కూర్చుని ప్రకృతి సౌందర్యాన్ని తిలకిస్తున్నారు. మొసళ్లు, నీటి ఏనుగులు బలంగా నీళ్లమీద పడి ఎగురుతున్నప్పుడు నీటి బిందువులు పైకి లేచి సముద్రపు అలల మీద వర్షం కురుస్తున్నట్టు, పైకి లేచిన అలలు ఆకాశాన్ని కప్పేస్తున్నట్టు కనిపిస్తోంది.

పాములు, చేపలు, మొసళ్లతో నిండిన సముద్రం ఎగిసిపడే అలలతో అందంగా కనిపిస్తుంటే చూస్తూ కూర్చున్నారు. మధ్య మధ్య ఒడ్డు మీద ఉన్న వనాల్లో నడుస్తూ.. ఏలకిలతలు, లవలీలతలు, మాదీలతలు, లవంగలతల్ని; తెల్లటి పద్మాలు, సముద్రపు అంచుకి చేరిన నురుగుతో అందంగా ఉన్న ప్రదేశాల్ని అసక్తిగా చూస్తున్నారు.

పాలసముద్రాన్ని చిలికినప్పుడు అమృతంతో పాటు పుట్టిన ఉచ్ఛైశ్రవము అనే అందంగా బలంగా ఉన్న ఇంద్రుడి తెల్లటి గుర్రం పాలసముద్ర తీరంలో హాయిగా తిరుగుతూ కనిపించింది. దాన్ని చూసి కద్రువ “శరీరమంతా నిండు చంద్రుడిలా తెల్లగా ఉన్నా కూడా ఆ గుర్రానికి తోక మాత్రం నల్లగా ఉంది చూడు!” అంది.

అది విని వినత నవ్వి “కద్రువా! నీకు నలుపు ఎలా కనిపించిందో గానీ, గొప్పవాళ్ల కీర్తి ప్రపంచమంతా వ్యాపించినట్టు దాని శరీరమంతా తెలుపు రంగు కాంతితో ప్రకాశిస్తోంది. దాని శరీరంలో అసలు నలుపు మచ్చ ఎక్కడ ఉంది?” అంది.

అది విని కద్రువ “అయితే, ఆ తెల్లని గుర్రానికి నల్లటి మచ్చ ఉంటే నువ్వు వెంటనే నాకు దాసిగా ఉండాలి. ఒకవేళ దాని శరీరం మీద నల్ల మచ్చ లేదనుకో నేనే నీకు దాసిగా ఉంటాను!” అంది.

ఇద్దరూ ఒకళ్లకి ఒకళ్లు దాసిగా ఉండేట్టు పందెం వేసుకున్నారు. “అయితే దగ్గరగా వెళ్లి ఆ గుర్రాన్ని చూసి వద్దాం రా!” అంది వినత.

కద్రువ “ఇప్పుడు సమయం చాలదు. రేపు ఉదయాన్నే వచ్చి చూద్దాం!” అంది. ఆ రోజు ఇద్దరూ ఇంటికి వెళ్లిపోయారు.

ఇంటికి వెళ్లిన తర్వాత కద్రువ తన పాము పిల్లల్ని పిలిచి జరిగిన విషయం చెప్పి “నేను, వినత పందెం వేసుకున్నాం. కనుక, మీరు ఆ గుర్రం తోకని నలుపు చెయ్యండి. లేకపోతే నేను వినత దగ్గర దాసిగా పడి ఉండాలి!” అని చెప్పింది.

అది ధర్మం కాదని వాళ్లు ఎవరూ అందుకు అంగీకరించలేదు. కద్రువకి తన కుమారుల మీద కోపం వచ్చింది. “నా మాట మీద మీకు గౌరవం లేదు. నేను చెప్పిన పని చెయ్యడం మీకు ఇష్టం లేదు. కనుక, పరీక్షిత్తు కుమారుడైన జనమేజయ మహారాజు చేసే సర్పయాగంలో మీరందరు మరణిస్తారు!” అని శపించింది.

అందరికంటే చిన్నవాడైన కర్కోటకుడు మాత్రం తల్లి ఇచ్చిన శాపానికి భయపడ్డాడు. మర్నాడు ఉదయాన్నే వెళ్లి గుర్రం తోకకి నల్లని మచ్చలా కనిపించేట్లు దాని తోకని పట్టుకుని వ్రేలాడుతూ ఉండిపోయాడు.

కద్రువ, వినత గుర్రాన్ని చూడ్డానికి వెళ్లారు. కర్కోటకుడు గుర్రం తోకని చుట్టుకుని ఉండడం వల్ల గుర్రం తోక నల్లగా కనిపించింది. పందెంలో ఓడిపోయిన వినత కద్రువకి దాసిగా వచ్చింది.

గరుత్మంతుడు జననం

అనూరుడు తల్లి వినతకి శాపం ఇచ్చి అయిదు వందల సంవత్సరాలు గడిచింది. శాప ఫలాన్ని అనుభవిస్తున్న వినత తన సవతి కద్రువ దగ్గర దాసిగానే జీవిస్తోంది.

ఒకరోజు వినత పెట్టిన రెండవ గుడ్డు పగిలింది. సూర్యుడి కాంతే తక్కువగా ఉందేమో అనిపించేంత గొప్ప కాంతి; పర్వతాల్ని కూడా కదిలించ కలిగినంత వేగము, బలము ఉన్న రెండు రెక్కలతో అతిపెద్ద శరీరం కలిగిన గరుత్మంతుడు జన్మించాడు. గొప్ప బలశాలి, పెద్ద శరీరం ఉన్న కుమారుణ్ని చూసుకుని ఆనందపడింది వినత. అతడు వెంటనే ఆకాశంలోకి ఎగిరిపోయాడు. ఇంద్రుడు వజ్రాయుధానికి కూడా తెగనంత పెద్దపెద్ద రెక్కలతో ఉన్నాడు. పర్వతంలా ఆకాశ మార్గంలో ఎగురుతూ వెళ్లి, వెంటనే కిందకి దిగి వచ్చి తల్లి వినతకి నమస్కరించాడు.

పుడుతూనే తన పెద్ద శరీరంతో ఆకాశంలోకి ఎగిరి, తిరిగి వచ్చి తల్లికి నమస్కరిస్తున్న గరుడుణ్ని చూసిన కద్రువకి అసూయ కలిగింది. వెంటనే “నీ తల్లి వినత నాకు దాసి. నువ్వు కూడా నేను చెప్పినట్టే వినాలి. నా పిల్లల్ని అందర్నీ ఎత్తుకుని తీసుకుని వెళ్లి ప్రదేశాలన్నీ చూపించు!” అని ఆజ్ఞాపించింది.

సవతి తల్లి కద్రువ చెప్పిన పనులన్నీ గరుత్మంతుడు వినయంగా చేస్తున్నాడు. ఒకరోజు గరుత్మంతుడు పాముల్ని వీపు మీద ఎక్కించుకుని, అతి వేగంతో ఎగురుతూ సూర్యమండలం వరకు వెళ్లాడు. సూర్యుడి తీక్ష్ణమైన కిరణాల వేడిని భరించలేక పాములు జారి నేలమీద పడి మూర్ఛపోయాయి.

అది చూసిన కద్రువ కోపంతో గరుత్మంతుణ్ని నిందించింది. తన పిల్లల్ని బ్రతికించమని ఇంద్రుణ్ని ప్రార్థించింది. ఇంద్రుడు ఆ పాముల మీద పెద్ద వాన కురిపించి వాటికి వేడి తగ్గేట్టు చేశాడు. కద్రువ ఇంతకు ముందు కంటే ఎక్కువగా వినతకి, గరుత్మంతుడికి పనులు చెప్పి చేయించుకుంటోంది.

ఒకరోజు గరుత్మంతుడు తల్లి దగ్గరికి వెళ్లి “మనం కద్రువకి దాసులుగా ఎందుకు ఉంటున్నాము?” అని అడిగాడు.

తను కద్రువ పందెం వేసుకున్నామనీ; అందులో తను ఓడిపోడం వల్ల అమెకి దాసీగా ఉండవలసి వచ్చిందనీ; తన పెద్దకుమారుడు అనూరుడు కూడా తనను శపించాడనీ వివరంగా చెప్పింది వినత. గరుత్మంతుడు చాలా బాధ పడ్డాడు.

“నాయనా! తల్లితండ్రులయందు భక్తి, శక్తి, మంచి బుద్ధి కలిగిన కుమారులు ఉంటే ఏ తల్లితండ్రులకీ కష్టాలు ఉండవు. నీ వంటి యోగ్యుడైన కుమారుణ్ని పొందిన నాకు ఈ దాస్యం ఎంతకాలమో ఉండదు. తప్పకుండా విముక్తి కలుగుతుంది, బాధపడకు” అని ఆత్మవిశ్వాసంతో చెప్పింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here