మహాభారత కథలు-81: సుబాహుపురం చేరిన దమయంతి

0
18

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

సుబాహుపురం చేరిన దమయంతి

[dropcap]తె[/dropcap]ల్లవారగానే చచ్చిపోగా మిగిలిన వర్తకులు వేగంగా నడుస్తూ చేది దేశం చేరుకుని జనసమ్మర్దం ఉన్న రాజమార్గం దగ్గరికి చేరుకున్నారు. తేజస్సు పోగొట్టుకుని అలిసిపోయి కూడా అందమైన ఆకృతి కలిగిన దమయంతిని మేడపైన ఉన్న రాజమాత చూసింది.

తన దాదివైపు చూసి “చిరిగిన, మాసిన చీర కట్టుకుని దుమ్ముతో ఎర్రబడ్డ జుట్టుతో పిచ్చిదాని వేషం వేసుకున్న లక్ష్మీదేవిలా ఉన్న అమె మీద నాకు చాలా ఇష్టం కలుగుతోంది. వెంటనే వెళ్లి నువ్వు ఆమెని తీసుకునిరా!” అని చెప్పింది.

దాది దమయంతిని చెయ్యి పట్టుకుని రాజమాత దగ్గరికి తీసుకుని వచ్చింది. రాజమాత దమయంతిని చూసి “నువ్వు ఎవరిదానివి? ఎందుకు బాధపడుతున్నావు?” అని అడిగింది.

“అమ్మా! నా భర్త గొప్ప వీరుడు. శత్రువుల్ని జయించినవాడు. కాని, జూదమాడి రాజ్యాన్ని వదిలి వెళ్లిపోతుంటే నేను కూడా ఆయన్ని అనుసరించాను. విధివశాన విడిపోయాము. అప్పటి నుంచి ఏకవస్త్రం మాత్రమే కట్టుకుని, నిలువనీడలేకుండా తిరుగుతున్న నా భర్తని వెతుకుతున్నాను.

సైరంధ్రిలా దుంపలు, వేళ్లు, పండ్లు తింటూ, మృగాలే సహాయంగా పొద్దుకుంకిన తరువాత ఎక్కడ ఉంటే అదే నివాసంగా తిరుగుతున్నాను” అని ఏడుస్తూ మాటలు రాక ఆగిపోయింది.

రాజమాత దమయంతి బాధ చూసి “నువ్వు నా దగ్గరే ఉండు. నీ భర్తని వెతకడానికి బ్రాహ్మణుల్ని పంపిస్తాను” అని చెప్పింది.

రాజమాత చెప్పినదానికి దమయంతి “అమ్మా! నేను సైరంధ్రి వృత్తిలో ఉన్నాకూడా ఎంగిలి తినను, కాళ్లు పిసకడం వంటి పనులు చెయ్యను, నా భర్తని అన్వేషించడానికి వెళ్లే బ్రాహ్మణులతో తప్ప ఇతర పురుషులతో మాట్లాడను. ఇందుకు అంగీకరిస్తే నీ దగ్గర ఉంటాను” అని చెప్పింది.

దమయంతి చెప్పినవన్నీ విని రాజమాత “నీ ఇష్టం వచ్చినట్టు ఉండవచ్చు” అని చెప్పి తన కూతురు సునందకి అప్పగించింది. పట్టపురాణి దమయంతి నోములు నోస్తూ, భర్తని హృదయంలో ధ్యానిస్తూ, వియోగదుఃఖంతో బాధపడుతూ సైరంధ్రిగా చేదిభూపతి పురంలో ఉండిపోయింది.

అయోధ్య చేరిన నలుడు

దమయంతిని వదిలిపెట్టి అడవిలో తిరుగుతున్న నలుడు పెద్ద పెద్ద చెట్లని కూడా దహించేస్తున్న  దావాగ్నిని చూశాడు. దానిలోంచి “మహారాజా! దయతో వచ్చి నన్ను రక్షించు” అనే ఆర్తనాదం విన్నాడు.

వెంటనే నలుడు దావాగ్ని మధ్యలోకి ఉరికాడు. అక్కడ చుట్టలు చుట్టలుగా శరీరాన్ని ముడుచుకుని భయపడుతున్న నాగరాజుని చూశాడు.

నాగకుమారుడు నలుణ్ని చూసి నమస్కరించి “నాపేరు కర్కోటకుడు. ఒక బ్రహ్మర్షిని నిందించడం వల్ల పొందిన శాపంతో కదలలేక పడి ఉన్నాను. ఈ దావాగ్ని అన్ని వైపుల నుంచి విజృంభిస్తోంది. నన్ను ఎత్తుకుని ఒక చల్లని సరోవరం దగ్గరికి చేర్చి రక్షించు, నీకు మేలు చేస్తాను” అన్నాడు.

నలుడు కర్కోటకుణ్ని ఎత్తుకోగానే నాగరాజు ఎత్తుకునేందుకు వీలుగా తన దేహాన్ని తగ్గించుకున్నాడు. సరోవరానికి దగ్గరలో విడిచిపెట్టబోతుండగా కర్కోటకుడు ఇంకొక్క పది అడుగులు వేసి వదలమన్నాడు.

నలుడు లెక్కపెట్టుకుంటూ పదవ అడుగు వేయబోతుండగా కర్కోటకుడు నలుణ్ని కాటు వేశాడు. వెంటనే నలుడు రూపం వికృతంగా మారింది. కర్కోటకుడు నలుడికి తన నిజరూపాన్ని చూపించి “మహానుభావా! నేను కరిచినందుకు నువ్వు బాధపడకు. ఇప్పుడు నీ రూపం వికృతంగా ఉండడమే నీకు మంచిది.

నా విషం నీ శరీరంలో ఉన్నంత కాలం నీకు విషసర్పాల వల్లగాని; రాక్షసులు, పిశాచాలు, శత్రువుల వల్ల గాని భయం ఉండదు. అన్ని యుద్ధాలలోను నీకు జయం కలుగుతుంది. నీ భార్య నీకు కనిపిస్తుంది. పూర్వపు రాజ్యసంపద మళ్లీ పొందుతావు.

నీకు అసలు రూపం ఎప్పుడు కావాలని అనుకుంటావో అప్పుడు నన్ను తల్చుకో. నీ రూపం నీకు వచ్చేస్తుంది. నీ దగ్గరికి ఈ వస్త్రం వస్తుంది. ఈ వస్త్రాన్ని కప్పుకోగానే నీ అసలు రూపం నీకు వస్తుంది” అని చెప్పాడు.

కర్కోటకుడు నలుడితో ఇంకా ఇలా చెప్పాడు “ఇక్ష్వాకు వంశంలో పుట్టిన ఋతుపర్ణుడు అనే మహారాజు భూమండలంలో సుప్రసిద్ధుడు, సేవించ తగినవాడు. నువ్వు అతణ్ని సేవిస్తూ ఉండు. నీకు తెలిసిన ‘అశ్వహృదయ’ విద్యని అతడికి ఉపదేశించి, అతడికి తెలిసిన ‘అక్షహృదయ’ విద్యని నువ్వు తెలుసుకో. ‘బాహుకుడు’ అనే పేరు పెట్టుకుని అతడి దగ్గర రథసారథిగా ఉండు” అని చెప్పి మాయమయ్యాడు.

కర్కోటకుడు చెప్పినట్టు నలుడు అయోధ్యాపురానికి వెళ్లి ఋతుపర్ణుణ్ని దర్శించి “నా పేరు బాహుకుడు. అశ్వశిక్షణలో నేర్పరిని; పాకకళలో నిపుడిని; శిల్పవిద్యలో నిష్ణాతుడిని. సేవ చెయ్యడానికి నీ దగ్గరికి వచ్చాను” అని చెప్పాడు. ఋతుపర్ణుడు బాహుకుణ్ని సేవకుడిగా ఉండడానికి అంగీకరించాడు.

నలుడు ఋతుపర్ణుడి దగ్గర గుర్రాలకి అధినేత అయ్యాడు. అతడు చెడు గుర్రాల్ని లొంగదీసేవాడు. రౌతులకి స్వారీ చేయడం నేర్పేవాడు. రుచికరాలైన ఆహారపదార్థాల్ని వండి వడ్డించేవాడు. ఋతుపర్ణుడు నియోగించిన వార్ష్ణేయుడు, జీవలుడు నలుడికి సహాయంగా ఉండేవారు. నలుడు ఇలా అజ్ఞాతవాసంలో గడిపాడు.

బాహుకుడు దమయంతి కోసం పరితపిస్తూ ఉండేవాడు. అతణ్ని చూసి జీవలుడు “ఈ బాహుకుడు చేతులు పొట్టివి. గూనివాడు. వంకర టింకర  శరీరం కలవాడు. ఈ కురూపి ప్రేమించడం, ఆమె కోసం పరితపించడం! ఇతడు ప్రేమించిన ఆమె ఇంకా ఎంత కురూపి అయి ఉంటుందో అనుకునేవాడు. ఒకరోజు బాహుకుడితో “నీ భార్యకీ నీకూ ఎడబాటు ఎందుకు కలిగింది?” అని అడిగాడు.

నలుడు “నాకు ప్రేయసి కూడానా. ఎవరేనా వింటే నవ్వుతారు. ప్రేయసే లేనప్పుడు నాకు వియోగం ఎక్కడిది? మందప్రజ్ఞుడు అనే సైనికుడికి తన భార్య కనిపించక ఎక్కడెక్కడో వెతికి ఆమె కనిపించక పరితపించి కలవరించేవాడు. అతడిని అనుకరించాను అంతే” అని తప్పించుకున్నాడు. అయోధ్యలో బాహుకుడు అనే మారుపేరుతో నలుడు జీవితాన్ని గడుపుతున్నాడు.

దమయంతిని గుర్తించిన సుదేవుడు

విదర్భలో భీమరాజు నలుడు తన రాజ్యం పోగొట్టుకున్నాడని విని కూతురు, అల్లుడు ఎక్కడ ఉన్నారోనని ఆందోళనపడుతున్నాడు. అమితమైన బలం కలిగిన భీమరాజు నలదమయంతుల్ని వెదకడానికి తనకు అనురక్తులు, మంచి నడవడిక కలవాళ్లు, పెద్ద చదువులు చదువుకున్నవాళ్లయిన బ్రాహ్మణుల్ని నియోగించాడు. నలదమయంతులు ఎక్కడ ఉన్నారో తెలుసుకుని వచ్చినవాళ్లకి ఒక్కొక్కళ్లకి వేయి గద్యాణాలు; నలదమయంతుల్ని తమతోపాటు వెంటపెట్టుకుని వచ్చినవాళ్లకి వేలకొద్దీ గోవులు, అగ్రహారాలు బహుమానంగా ఇస్తానని చెప్పాడు.

భీమరాజు నియోగించిన బ్రాహ్మణులు భూమండలంలో ఉన్న నగరాలు, పెద్దపల్లెలు, పట్టణాలు అన్నీ వెతికారు.  సుదేవుడనే బ్రాహ్మణుడు చేదిరాజు సుబాహుడి రాజధానికి చేరుకున్నాడు. పుణ్యాహం నిర్వర్తించే బ్రాహ్మణులతో కలిసి రాజమందిరంలోకి వెళ్లాడు. అంతఃపురంలో సునందతో ఉన్న దమయంతిని చూశాడు. ఆమె కనుబొమల మధ్య ఉండే పుట్టుమచ్చని చూసి గుర్తించిన సుదేవుడు తనలో తను ‘ఈ దమయంతి భర్తనుంచి విడిపోయి నీరు ఎండిన ఏరులా, పద్మాలు లేని తామర తీగలా, మామిడి చెట్టు లేని ఉద్యానవనంలా సౌందర్యం తగ్గినా.. పాతివ్రత్య మహిమవల్ల ప్రకాశిస్తోంది’ అనుకున్నాడు.

సుదేవుడు దమయంతి దగ్గరికి వచ్చి “అమ్మా! దమయంతీ! నీ తల్లితండ్రులు, నీ సంతానం, నీ బంధువులు అందరూ క్షేమంగా ఉన్నారు. నీ క్షేమం తెలియక దుఃఖంతో పరితపిస్తున్నారు. ఇంక నీ కుశలవార్త విని సంతోషిస్తారు. నేను నీ సోదరుడికి స్నేహితుణ్ని. నా పేరు సుదేవుడు. నేను బ్రాహ్మణుడిని. విదర్భరాజు నువ్వు ఉండే చోటు వెతకడానికి చాలామంది బ్రాహ్మణుల్ని అనేక దేశాలు పంపించాడు. నేను ఇక్కడికి వచ్చి నా సుకృతం వల్ల నిన్ను చూడగలిగాను” అన్నాడు.

దమయంతి తన పిల్లల గురించి, తల్లితండ్రుల గురించి, చుట్టాల గురించి కుశలం అడిగి ఏడుస్తూ ఉండడం చూసి సునంద తన తల్లి రాజమాతకి చెప్పింది. వాళ్లు మాట్లాడుకుంటూ ఉండగా రాజమాత వచ్చి బ్రాహ్మణుడితో “అయ్యా! ఈమె ఎవరి కూతురు? ఎవరి భార్య? భర్తని బంధువుల్ని వదిలి ఎందుకు పుణ్యప్రదమైన నోములు నోస్తోంది. ఈమె ఇక్కడ ఉందని నీకు ఎలా తెలిసింది? ఈమె పేరేమిటి?” అని అడిగింది.

ఆమె ప్రశ్నలకి సుదేవుడు “రాజమాతా! ఈమె విదర్భరాజు కుమార్తె, నలమహారాజు పట్టపురాణి దమయంతి. విధివశం వల్ల నలమహారాజు తన రాజ్యం పోగొట్టుకుని వెళ్లిపోయేప్పుడు ఈమె కూడ అనుసరించింది. ఈ వార్త తెలిసిన విదర్భరాజు ఈమెను వెతకడానికి బ్రాహ్మణుల్ని పంపించాడు.

నేను ఇక్కడికి వచ్చి మీతో కాపాడబడుతున్న ఈమెని చూసి ఈమె కనుబొమలమధ్య ఐశ్వర్యానికి గుర్తుగా బ్రహ్మదేవుడు సృష్టించిన పుట్టుమచ్చ చూసి ఆమెని గుర్తించ గలిగాను” అన్నాడు. సునంద మంచినీళ్లు తెప్పించి ముఖం కడిగింది. దమయంతి ముఖం మీద ఉన్న పుట్టుమచ్చ స్పష్టంగా కనబడింది. అందరూ ఆశ్చర్యపోయారు.

రాజమాత ఆనందంతో దమయంతిని కౌగలించుకుంది. “తల్లీ! నువ్వూ నా కూతురివే!  మీ అమ్మ, నేను దశార్ణవరాజు కూతుళ్లం. మీ అమ్మ విదర్భరాజుకి దేవేరి అయింది. నేను వీరబాహుడికి భార్యనయ్యాను” అంది.

దమయంతి సంతోషంగా రాజమాత పాదాలకి నమస్కరించింది. సునంద దమయంతి పాదాలకి నమస్కరించింది. దమయంతి సునందని కౌగలించుకుంది.

దమయంతి కొన్నాళ్లు అక్కడే ఉండి ఒకరోజు రాజమాతతో  “ఈ పురమూ, విదర్భా కూడా నాకు పుట్టిళ్లే. ఇక్కడా, అక్కడా కూడా నాకు సమానమే కాని, నాకు నా తల్లితండ్రుల్ని, సోదరుల్ని, కన్నబిడ్డల్ని చూడాలని అనిపిస్తోంది. మీరు అనుజ్ఞ ఇస్తే విదర్భకి వెడతాను” అని నమస్కరించింది.

రాజమాత సంతోషంగా తన కొడుకు సమకూర్చిన భటులతో, మణులు పొదిగిన బంగారు రథం మీద దమయంతిని పుట్టింటికి పంపించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here