మహాభారత కథలు-84: దివ్యక్షేత్రాల వర్ణన – దర్శన ఫలము-1

0
14

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

ధర్మరాజుకి వివరించిన నారదమహర్షి

[dropcap]బృ[/dropcap]హదశ్వమహర్షి ధర్మరాజు దగ్గర నుంచి వెళ్లిపోయాక పాండవులు అర్జునుడి రాకకోసం ఎదురు చూస్తూ అతణ్ని చూడాలన్న కోరికతో నిరీక్షిస్తున్నారు. ఆ సమయంలో ఆకాశమంతా కాంతి ప్రసరిస్తూ ఉండగా నారదమహర్షి వచ్చాడు. ధర్మరాజు తన తమ్ముళ్లతో కలిసి నారదమహర్షిని అతిథిసత్కరాలతో గౌరవించాడు.

తరువాత మహర్షి “ధర్మరాజా! నీ మంచి నడవడికి, నీ ధర్మబుద్ధికి నేను పూర్తిగా సంతృప్తి చెందాను. నీకు ఇష్టమైనది కోరుకో!” అన్నాడు.

మహర్షి మాటలకి ధర్మరాజు సంతోషంతో “మహర్షీ! నువ్వు సంతృప్తి చెందితే మూడు లోకాలు సంతృప్తి చెందినట్లే. నీ దర్శనం లభించడం వల్ల నా జన్మ ధన్యమైంది. చాలాకాలంగా నాకు ఒక ధర్మసందేహం కలుగుతోంది. దాన్ని తీర్చి నన్ను కృతార్థుణ్ని చెయ్యమని ప్రార్థిస్తున్నాను.

భూలోకంలో ఉండే పుణ్యలోకాలు దర్శించి వాటికి ప్రదక్షిణ చేసిన మహానుభావులు పొందుతున్న పుణ్యఫలం ఎటువంటిదో అనేక దివ్యక్షేత్రాల వర్ణనతోపాటు నాకు తెలియచెప్పు” అని అడిగాడు.

నారదమహర్షి ధర్మరాజుతో – దైర్యం కలవాడు గంభీరస్వభావం కలిగిన భీష్ముడు గంగాద్వారంలో వేదాధ్యయన దీక్ష తీసుకుని తండ్రికి ఇష్టం కలిగించే మంచి పనులు చేస్తూ ఉండేవాడు. అతడి పితృదేవతా భక్తికి, ధర్మశీలానికి మెచ్చి అతణ్ని చూడాలని పులస్త్యమహర్షి అతడి దగ్గరికి వచ్చాడు.

భీష్ముడు ఆ మహర్షిని భక్తితో పూజించి దర్భాసనం మీద కూర్చోబెట్టి అర్ఘ్యం, పాద్యం మొదలైన స్వాగత సత్కారాలు చేశాడు. మహర్షి పాదాల్ని తన తలమీద పెట్టుకుని తన కుడికాలు భూమీద పెట్టి “నేను భీష్ముడిని, మీ సేవకుడిని” అని చెప్పి నమస్కరించాడు.

అతడితో పులస్త్యమహర్షి “ప్రతీపమహారాజు వంశంలో శ్రేష్ఠుడైన భీష్ముడా! పితృదేవతల్ని ఆరాధించడంలోను, పుణ్యకార్యాలు చెయ్యడంలోను నువ్వే అందరికంటే గొప్పవాడివి. అందుకే నువ్వు నన్ను ఇంత నిష్ఠతో ఆరాధించావు. నీ కోరిక చెప్పు. నన్ను సందర్శించడం వల్ల నీకు మేలు కలుగుతుంది” అన్నాడు.

ధర్మరాజా! భీష్ముడు కూడా నువ్వు అడిగినట్లుగానే పుణ్యచరిత్రుడైన పులస్త్యమహర్షిని అడిగాడు. పవిత్రచరిత్ర కలిగిన భీష్ముడికి పులస్త్యమహర్షి “బుద్ధీంద్రియ, కర్మేంద్రియాలలో నిగ్రహం కలిగినవాళ్లు, అహంభావం లేనివాళ్లు, ఇతరులనుంచి దేనినీ స్వీకరించక వైరాగ్యంతో ఉండేవాళ్లు, తక్కువ తిండి తినేవాళ్లు, ఉదాసీనంగా ఉండేవాళ్లు, సత్యాన్నే పలికేవాళ్లు, మంచి నడవడిక కలవాళ్లు, శాంతస్వభావం కలిగినవాళ్లు, ధర్మాన్ని ఆచరించేవాళ్లు అన్ని తీర్థాల్లో మునిగిన పుణ్యఫలాన్ని అన్ని యజ్ఞాల్ని చేసిన ఫలితాన్ని పొందగలరు. కాని పాపపు పనులు చేసేవాళ్లు గొప్ప తీర్థయాత్రలు చేసినా అటువంటి పుణ్యఫలితాన్ని పొందలేరు.

తిలలు, బంగారము, ఆవులు దానాలు చెయ్యనివాళ్లు; ఉపవాసాలు చెయ్యనివాళ్లు; పుణ్యతీర్థాలు సేవించనివాళ్లు స్వయంకృతపరాథం వల్ల నిరుపేదలు, రోగపీడితులు అవుతారు.

పాపపు పనులు చేసేవాళ్లు యజ్ఞయాగాదుల చేసినా కూడా వాటి ఫలితాన్ని పొందలేరు. అయినా అటువంటి పాపాత్ములు తీర్థయాత్రలు చేస్తే యజ్ఞయాగాదులు చేసిన ఫలితాన్ని పొందగలుగుతారు, తీర్థయాత్రలు చెయ్యడం వలన కలిగే పుణ్యం అన్ని పుణ్యాలకంటె గొప్పది.

పుష్కరమనే పుణ్యతీర్థం ప్రపంచంలో ప్రఖ్యాతి పొందింది. అది మునులు, సిద్ధులు సేవించుకునేది. అందులో బ్రహ్మదేవుడు దేవతలతో కలిసి నివసిస్తాడు.

మూడు పుష్కరాల్ని స్మరిస్తే చాలు పాపాలన్నీ పోతాయి. ఆ పుష్కరాల్లో పదివేలకోట్ల పవిత్ర క్షేత్రాలు ఉద్భవించాయి. గొప్ప ఋషులు, దేవతల్లో గొప్పవాళ్లు అక్కడ తపస్సు చేశారు. యజ్ఞాలు చేశారు. సంతృప్తి పొంది చరితార్థులయ్యారు.

ఆ పుష్కరాల్లో స్నానం చేసి దేవతలకి, ఋషులకి, పితృదేవతలకి తర్పణాలు విడిచినవాళ్లకి పది అశ్వమేధయాగాలు చేసిన పుణ్యఫలం లభిస్తుంది.

కార్తీకమాసంలో ఒకరోజు పుష్కరతీర్థాన్ని సేవించడం ఒక సంవత్సరం అగ్నికుండాన్ని ప్రజ్వలింప చేయండంతో సమానం. దేవతలలో విష్ణుమూర్తి ఎలా గొప్పవాడో అలాగే కోరిన కోర్కెలు తీర్చే మూడు పుష్కరాలు ఈ భూమి మీద గొప్పవి.

పుష్కర తీర్థంలో పది సంవత్సరాలు జీవించినవాళ్లు అన్ని యజ్ఞాలు చేసిన పుణ్యము, బ్రహ్మలోకము కలుగుతాయి. తండులికాశ్రమంలో ఉన్న అగస్త్యవటంలో మునిగినవాళ్లకి అశ్వమేథయాగం చేసిన ఫలితం దక్కుతుంది. కణ్వాశ్రమం, ధర్మారణ్యం, యయాతిపతనం అనే పుణ్యక్షేత్రాల్ని దర్శించినవాళ్లకి పాపాలన్నీ పోతాయి.

మహాకాళం, కోటితీర్థం దర్శిస్తే అశ్వమేధయాగ ఫలం కలుగుతుంది. భద్రవటము అనే రుద్రస్థానంలో రుద్రుణ్ని అర్చిస్తే గణాధిపత్యం దొరుకుతుంది. నర్మదానది స్నానము, దక్షిణ సింధువులో స్నానము, చర్మణ్వతీనది తీర్థాల్లో స్నానం చేస్తే అగ్నిష్టోమ యాగఫలం దక్కుతుంది.

పరమ పవిత్రమైన వశిష్ఠాశ్రమంలో ఒక రోజు శాకాహారంతో కూరలు దుంపలు తిని ఉంటే గొప్ప ధనము, ఐశ్వర్యము, వేయి గోవుల్ని దానం చేసిన పుణ్యం పొందగలరు. పింగం అనే తీర్థాన్ని సేవిస్తే నూరు కపిలగోవుల్ని దానం చేసిన పుణ్యం కలుగుతుంది.

అగ్నిహోత్రుడు సాక్షాత్కరించి ఉన్న ప్రభాసతీర్థంలో స్నానం చేస్తే అగ్నిష్టోమం, అతిరాత్రం, అనే యజ్ఞాలు చేసిన పుణ్యం సంక్రమిస్తుంది. విష్ణుదేవుడు దుర్వాసుడికి వరమివ్వడం వల్ల ‘వరదానము’ అని పేరు పొందిన వరదాన తీర్థంలో స్నానం చేస్తేను, సరస్వతీనది సముద్రంలో కలిసే చోటులో స్నానం చేస్తేను వేయిగోవులు దానం చేసిన పుణ్యఫలం కలుగుతుంది.

ద్వారవతీ పురంలో పిండరకము అనే తీర్థంలో ఉంగరాల రూపంలో త్రిశూలరూపంలో పద్మాలు కనిపిస్తాయి. పిండరకతీర్థంలో పరమేశ్వరుణ్ని సేవిస్తే పాపాలు నశిస్తాయి. సింధునది సముద్రంలో కలిసేచోట స్నానం చేస్తే వరుణలోకాన్ని పొందుతారు.

శంకుకర్ణేశ్వరంలో శివుడిని అర్చిస్తే పది అశ్వమేధయాగాలు చేసిన పుణ్యం వస్తుంది. వసుధార, వసుసరం అనే పుణ్యతీర్థాల్లో స్నానం చేస్తే ధనలాభం కలుగుతుంది. సింధూత్తమ తీర్థంలో స్నానం చేస్తే గొప్ప సువర్ణదాన ఫలితాన్ని పొందవచ్చు.

బ్రహ్మతుంగ తీర్థాన్ని సేవించడం వల్ల సత్యలోకం ప్రాప్తిస్తుంది. శుక్రకుమారీ క్షేత్రయాత్ర వల్ల స్వర్గం సిద్ధిస్తుంది. శ్రీకుండంలో బ్రహ్మదేవుడికి నమస్కరించినా, బంగారు చేపలు గల విమలతీర్థంలో స్నానం చేసినా దేవేంద్రుడితో కలిసే అవకాశం లభిస్తుంది.

బడబ అనే తీర్థంలో అగ్నిదేవుడికి నివేదన చేస్తే ఆ పుణ్యం తరగకుండా పితృదేవతలకి సంతృప్తి కలిగిస్తుంది. అది వేయి ఆవులు దానం చేస్తే వచ్చే పుణ్యం కంటె, వేయి అశ్వమేధయాగాలు చేసిన పుణ్యం కంటె గొప్పది. దేవిక అనే పుణ్యక్షేత్రంలో పరమశివుడు దేవతాగణాలతో నివసిస్తాడు. ఆ క్షేత్రాన్ని దర్శించడం వల్ల ధర్మ పురుషార్థం, కామపురుషార్థం, అర్ధపురుషార్థం సంప్రాప్తమవుతాయి.

సగం ఆమడ విస్తరించి, అయిదు ఆమడల నిడివి కలిగిన దేవిక నదిని; కమం అనే పేరుగల పుణ్యక్షేత్రాన్ని; రుద్రక్షేత్రాన్ని; యజ్ఞాలు చేయడానికి, చేయించడానికి అనువుగా ఉండే బ్రహ్మవాలుకాన్ని; బ్రహ్మాది దేవతలు దీర్ఘసత్రమనే యజ్ఞం చేసిన దీర్ఘసత్రాన్ని సేవించిన వాళ్లకి కోరికలు తీరుతాయి.

వినశనం అనే తీర్థంలో కనిపించకుండా పోయిన సరస్వతీనది, మేరుపర్వతానికి వెళ్లే దారిలో ఉండే నాగోద్భేదం, శివోద్భేదం, చమసోద్భేదం అనే పుణ్యతీర్థాల్లో ఎక్కడ కనబడుతుందో అక్కడ సరస్వతీ నదిలో స్నానం చేసినవాళ్లు నాగలోకానికి చేరుతారు.

కుందేటి ఆకారం కలిగిన పద్మాలుండే శశయనం అనే తీర్థంలో స్నానం చేస్తే వేయి ఆవుల్ని దానం చేసిన పుణ్యఫలం దక్కుతుంది. మేమే ముందు, మేమే ముందు అని శివుణ్ని అర్చించడానికి మహర్షులు పోటీ పడుతుంటే రుద్రుడు అందరికీ సంతోషం కలిగించాలని కోటి రూపాలలో ఆవిర్భవించిన ప్రదేశం ’రుద్రకోటి’ అనే పుణ్యక్షేత్రం.

అక్కడ రుద్రుణ్ని అర్చించినవాళ్లు కైలాసాన్ని పొందుతారు. ధర్మరాజా! ఈ లోకంలో కురుక్షేత్రం, నైమిశతీర్థం, పుష్కరత్రయం అనే పుణ్యక్షేత్రాలు దాట శక్యంకాని పాపాలన్నింటినీ దూరం చేస్తాయి.

కురుక్షేత్రంలో నివసించే ప్రజలు స్వర్గలోకంలో నివసించేవాళ్లే అని జ్ఞానులు చెప్తారు. సరస్వతీనదికి దక్షిణ దిశలో దృషద్వతీనదికి ఉత్తర దిక్కున గొప్పగా విలసిల్లుతున్న కురుక్షేత్రం గొప్ప మహిమ కలది.

కురుక్షేత్రంలో ఉన్న శమంతపంచకాల మధ్యగల ‘రామహ్రదం’ అనే సరస్సు మధ్య బ్రహ్మదేవుడి ఉత్తరవేది ఉంది. అటువంటి కురుక్షేత్రాన్ని చూసినవాళ్లకి, స్పృశించినవాళ్లకి, అక్కడికి వెళ్లాలని అనుకున్నవాళ్లకి, నివసించాలని ఆలోచించినవాళ్లకి అన్ని పాపాలు నశిస్తాయి.

తరువాత విష్ణుస్థానంలో విష్ణుమూర్తిని అర్చిస్తే అశ్వమేధం చేసిన ఫలితం కలుగుతుంది. ‘పారిప్లవ’ తీర్థంలో స్నానం చేసినవాళ్లకి అగ్నిష్టోమయాగం చేసిన ఫలితాన్ని పొందుతారు. ‘పృథివీతీర్థం’ లో స్నానం చేస్తే వేయి ఆవులను దానం చేసిన పుణ్యం; ‘శాలూకిని’ అనే నదిలో స్నానం చేస్తే పది అశ్వమేధయాగాలు చేసిన పుణ్యం; ‘సర్పతీర్థం’ లో స్నానం చేసి ‘తరండకుడు’ అనే ద్వారపాలకుడిని దర్శిస్తే కోరిన కోరికలు తీరుతాయి.

విష్ణుమూర్తి ఆదివరాహంగా అవతరించిన ‘వరాహతీర్థం’లో స్నానం చేస్తే అగ్నిష్టోమయాగం చేసిన పుణ్యం; ‘అశ్వినీతీర్థం’లో స్నానం చేస్తే అందమైన రూపాలు; జయంతిలో ఉన్న ‘సోమతీర్థం’లో స్నానం చేస్తే రాజసూయ యాగం చేసిన పుణ్యం; ‘క్రుతశౌచతీర్థం’లో స్నానం చేస్తే పౌండరీకయజ్ఞం చేసిన పుణ్యం; అగ్నివట క్షేత్రం, ముంజివట క్షేత్రంలో పరమశివుడిని అర్చిస్తే గణాలపైన ఆధిపత్యం; ‘యక్షిణీతీర్థం’లో స్నానం చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. అనేక పుణ్యక్షేత్రాలకి ఉనికిపట్టయిన కురుక్షేత్ర ప్రవేశద్వారానికి ప్రదక్షిణ చేస్తే పాపాలు నశిస్తాయి.

పరశురాముడు శమంతపంచకము అనే నదుల్లో తర్పణాలు ఇస్తున్నప్పుడు పితృదేవతలు ప్రత్యక్షమై కావలసిన వరం కోరుకోమని అడిగారు. పరశురాముడు తను రాజుల్ని సంహరించడం వలన కలిగిన పాపం నశించాలి; పుణ్యలోక ప్రాప్తి కలగాలి; శమంతకపంచకాలనే ఈ సరస్సులు భూలోకంలో పవిత్ర తీర్థాలుగా విలసిల్లాలి అని అడిగాడు.

పరశురాముడి మడుగుల్లో స్నానం చేసినవాళ్లకి అశ్వమేధయాగం చేసిన పుణ్యం; ‘కాయశోధనం’ అనే తీర్థంలో స్నానం చేస్తే దేహసౌచం; విష్ణుదేవుడు లోకాల్ని ఉద్ధరించిన ‘లోకోద్ధారంలో’ స్నానం చేస్తే వంశ వృద్ధి జరుగుతుంది.

‘శ్రీతీర్థం’లో స్నానం చేస్తే సంపద; ‘కపిలతీర్థం’లో స్నానం చేస్తే కొంచెం ఎరుపు, కొంచెం నలుపు కలిగిన వేయి ఆవుల్ని దానం చేసిన పుణ్యం; ‘సూర్యతీర్థం’లో స్నానం, ఉపవాసం చేస్తే సూర్యలోకం; ‘గోభవనం’లో స్నానం చేస్తే అనేక గోవులు లభిస్తాయి. ‘శంఖినీతీర్థం’లో అందమైన అకృతి; ‘మాతృతీర్థాన్ని’ దర్శిస్తే సంతానాభివృద్ధి; ‘బ్రహ్మవర్తం, శరవనం’ దర్శిస్తే సమస్త రోగాలనుంచి విముక్తి పొందుతారు.

‘శ్వవిల్లోమాపహం’ అనే తీర్థంలో పదకొండు తీర్థాలు ఉన్నాయి. అందులో ప్రాణాయామం చేసి యోగాభ్యాసం చేసిన బ్రాహ్మణులకి రోమాలు తొలగిపోతాయి. కిరాతకుడు కొట్టినపుడు లేళ్లు మనిషి రూపం పొందిన చోట ఏర్పడిన ‘మానుషతీర్థం’లో స్నానం చేస్తే దేవత్వం పొందుతారు.

మానుషతీర్థానికి తూర్పువైపు ఉన్న ‘ఆపగ’ అనే నదిలో పితృదేవతలకి శ్రాద్ధకర్మలు చేసి వాళ్లని ఉద్దేశించి ఒక బ్రాహ్మణుడికి భోజనం పెడితే కోటిమంది బ్రాహ్మణులకి అన్నదానం చేసిన పుణ్యము, పితృదేవతలకి తృప్తి కలుగుతుంది.

బ్రహ్మోదుంబరం, సప్తర్షికుండం, కేదారం అనే క్షేత్రాల్ని దర్శిస్తే బ్రహ్మలోకప్రాప్తి కలుగుతుంది. ‘కేదారం’ అనే తీర్థాన్ని దర్శిస్తే పాపాలు తొలగి పోతాయి. ‘సరకం’ అనే తీర్థంలో స్నానం చేసి చతుర్దశినాడు శివుడిని అర్చిస్తే కోరిన కోరికలు సిద్ధిస్తాయి. మూడుకోట్ల నూతులు ఉన్న ‘ఇలాస్పద’ అనే తీర్థంలో స్నానం చేసి పితరులకి తర్పణాలు అర్పిస్తే వాజపేయయాగం చేసిన పుణ్యం; ‘కిందానం, కింజప్య’’ తీర్థాల్లో చేసిన దానాలు జపాలపుణ్యం ఎప్పటికీ తరగదు. నారదమహర్షి నిర్మించిన ‘అంబజన్మం’ అనే తీర్థంలో ప్రాణాలు వదిలితే పుణ్యలోకాలు కలుగుతాయి.

‘పుండరీకం’ అనే తీర్థంలో శుక్లపక్షదశమినాడు స్నానం చేస్తే పుండరీకయజ్ఞం చేసినంత ఫలితం కలుగుతుంది. ‘వైతరణీ’ నదిలో స్నానం చేసి శివుణ్ని అర్చిస్తే పాపాలన్నీపోతాయి.

దేవతల వేలకొలదీ సంవత్సరాలు తపస్సు చేసిన ‘ఫలకీవనం’ అనే తీర్థంలో స్నానం చేస్తే అగ్నిష్టోమం అతిరాత్రం అనే యజ్ఞాలు చేసిన ఫలితం పొందుతారు. ఎక్కువ తీర్థాల్ని కలిపి వేదవ్యాసుడు నిర్మించిన ‘మిశ్రకం’ అనే తీర్థంలో స్నానం చేస్తే, అన్ని తీర్థాల్లో స్నానం చేసిన పుణ్యం; ‘వ్యాసవనం, మనోజవం, మధువట’ అనే తీర్థాల్లో స్నానం చేస్తే వేయి ఆవుల్ని దానం చేసిన పుణ్యం; ‘కౌశికీనది, దృషద్వతీనది’ కలిసే చోట సర్వపాపాలు పోతాయి.

‘కిందత్తతీర్థం’లో ఒక ప్రస్థం తిలలు దానం చేస్తే పితరుల ఋణాల్ని తీర్చుకుంటారు. ‘అహస్సు సుదినం’ అనే తీర్థాల్లో సూర్యలోకం, ‘మృగధూమం’ అనే క్షేత్రంలో గంగాస్నానం చేసి శివుణ్ని ఆరాధిస్తే అశ్వమేధ ఫలం దక్కుతుంది.

‘వామనం’ అనే తీర్థంలో వామనవిష్ణువుని ఆరాధిస్తే విష్ణులోకం, ‘పావన’ అనే తీర్థంలో స్నానం చేస్తే వంశాన్ని పవిత్రం చేస్తారు. ‘శ్రీకుంజం’ అనే తీర్థాన్ని దర్శించి ‘సరస్వత’ తీర్థంలో స్నానం చేస్తే అగ్నిష్టోమ యాగం చేనిన ఫలితం, మహర్షులు ఎక్కడనుంచి కురుక్షేత్ర తీర్థయాత్ర మొదలుపెడతారో ఆ ‘నైమిశకుంజం’ అనే తీర్థంలో స్నానం చేస్తే ఋషులు సంతృప్తి చెందుతారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here