మహాభారత కథలు-85: దివ్యక్షేత్రాల వర్ణన – దర్శన ఫలము-2

0
14

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

పుణ్యక్షేత్ర దర్శనం- దర్శన ఫలము-2

‘బ్రహ్మతీర్థం’లో స్నానం చేసిన ఇతర వర్ణాలవాళ్లు బ్రాహ్మణులవుతారు. అక్కడ బ్రాహ్మణులు స్నానం చేస్తే బ్రహ్మలోకం కలుగుతుంది.

మంకణుడు అనే బ్రహ్మఋషి దర్భ పట్టుకున్నప్పుడు అతడి చేయి తెగింది. అందులోంచి ఆకుకూర ద్రవం కారింది. సంతోషంతో ఆ ముని నృత్యం చేయడం మొదలుపెట్టాడు.

మంకణ మహాముని ఆపకుండా చేస్తున్న నృత్యాన్ని చూడలేక దేవతలు, మునులు శివుడి దగ్గరికి వెళ్లి “మహాదేవా! మంకణమహాముని నృత్యం ఆపేట్లు చెయ్యి” అని మొరపెట్టుకున్నారు.

శివుడు ఋషి వేషంలో వెళ్లి “మహర్షీ! నువ్వు ఆపకుండా ఎందుకు నృత్యం చేస్తున్నావు? నువ్వు చూసిన వింత ఏమిటి? నీకు చెప్పాలని అనిపిస్తే చెప్పు” అన్నాడు.

మంకణమహర్షి “నా చేతి నుంచి శాకద్రవం వస్తే ఆశ్చర్యంతో ఆనంద తన్మయత్వంతో నృత్యం చేస్తున్నాను” అన్నాడు.

ఋషి రూపంలో ఉన్న శివుడు “అది కూడ వింతేనా?” అంటూ తన బొటనవేలిని వేలితో కొట్టాడు. అందులోంచి మంచులా తెల్లగా బూడిద రావడం కనిపించింది.

మంకణమహాముని సిగ్గుపడి “నువ్వు మహేశ్వరుడివి” అని నమస్కరించి వేదమంత్రాలతో ప్రస్తుతించాడు. “దేవా! నాకు ఇంకా తపస్సు చేసుకోగలిగే శక్తిని ప్రసాదించు” అని ప్రార్థించాడు. ఈశ్వరుడు కరుణించి “నీకు తపోవృద్ధి కలుగుతుంది. నేను నీ ఆశ్రమంలోనే ఉంటాను” అని చెప్పాడు.

అలా ఏర్పడిన ‘సప్త సారస్వతాల’ అనే తీర్థంలో స్నానం చేస్తే సారస్వతంలో సమగ్రప్రాప్తి కలుగుతుంది. బ్రాహ్మాదిదేవతలతో అధిష్టింపబడిన ‘ఔశనసము, కపాలమోచనం, విశ్వామిత్రం, కార్తికేయ’ మనే తీర్థాల్లో స్నానం చేస్తే పాపాలనుంచి విముక్తి కలిగి సత్యలోకాన్ని పొందుతారు.

వేదాల్లో చెప్పబడిన ‘పృథూదకతీర్థం’ దేవేంద్రుడు మొదలైన దేవతలకీ, వ్యాసుడు మొదలైన యోగులకి నివాసస్థలం (నెలవు) కనుక గొప్ప పుణ్యతీర్థం. అక్కడ దేహం విడిచినవాళ్లకి పాపాల నుంచి విముక్తి కలుగుతుంది. బ్రాహ్మణులు సంపూర్ణ యోగులవుతారు.

‘గంగానది సరస్వతి’ కలిసేచోట స్నానం చేస్తే బ్రహ్మహత్యపాతకం వంటి పాపాలు పోతాయి. దర్భి నిర్మించిన ‘అర్ధకీల’ తీర్థంలో స్నానం చేస్తే శూద్రులు బ్రాహ్మణులవుతారు. ‘శతం, సహస్రం’ అనే తీర్థాల్లో చేసిన జపాలు, దానాలు, ఉపావాసాలు లక్ష పుణ్యాలు ఇస్తాయి.

‘తైజసము’ అనే తీర్థంలో దేవతలందరు కలిసి శ్రీ కుమారస్వామిని సేనాపతిగా పెట్టారు. దాన్నీ, దానికి తూర్పువైపు ఉన్న ‘కురుతీర్థాన్ని’, ‘స్వర్గద్వారం’ అనే తీర్థాన్ని చూసినవాళ్లకి స్వర్గలోకం ప్రాప్తిస్తుంది.

‘రుద్రపత్ని’ అనే తీర్థంలో శివకేశవుల్ని అర్చిస్తే అన్ని దుఃఖాల నుంచి విముక్తి దొరుకుతుంది. ‘స్వస్తిపురం’ అనే తీర్థం చుట్టూ ప్రదక్షిణ చేస్తే వేయి ఆవుల్ని దానం చేసిన పుణ్యం వస్తుంది. ‘గంగమడువు’ అనే తీర్థంలో ఒక నూతిలో మూడుకోట్ల తీర్థాలు చేరి ఉంటాయి. అందులో స్నానం చేస్తే తీర్థాలన్నింటిలోను స్నానం చేసిన పుణ్యం వస్తుంది.

‘బదరీవనం’ అనే తీర్థంలో వశిష్ఠాశ్రమం అనే తీర్థంలో మూడు రాత్రులు రేగుపండ్లు తింటే పాపాలు పోతాయి. ‘ఏకరాత్ర’ అనే తీర్థంలో ఒకరాత్రి ఉపవాసం చేస్తే సత్యలోకం సిద్ధిస్తుంది. ఆదిత్యాశ్రమం అనే అరణ్యంలో సూర్యుడిని ఆరాధిస్తే సూర్యలోకప్రాప్తి కలుగుతుంది.

‘దధీచ’ తీర్థంలో కన్యాశ్రమంలో మూడురాత్రులు నివసించినవాళ్లకి స్వర్గలోకం ప్రాప్తిస్తుంది. బ్రహ్మదేవుడు, దేవతలు, మునులు, సిద్ధులు, గరుడులు, పాములు అనే జాతులకి చెందిన దేవతలు, భూమిమీద ఉన్న సన్నిహిత అనే పేరుతో విలసిల్లే తీర్థాన్ని ప్రతి నెల దర్శిస్తారు. సూర్యగ్రహణకాలంలో ‘సన్నిహిత’ లో స్నానం చేసినవాళ్లు నూరు అశ్వమేధయాగాలు చేసిన పుణ్యం పొందుతారు.

యమధర్మరాజు తపస్సు చేసిన ‘ధర్మతీర్థం’లో స్నానం చేస్తే ధర్మస్వభావం కలిగి ఉంటారు. ‘జ్ఞానపావనం, సౌగంధిక’ అనే తీర్థాల్లో స్నానం చేసినా, దర్శించినా సర్వ పాపాలనుంచి విముక్తులవుతారు. ‘దేవశ్రవ’ మనే సరస్వతీ హ్రదంలో ఉన్న పుట్టనుంచి వెలువడే జలప్రవాహంలో స్నానం చేసి పితరులకి శ్రాద్ధకర్మలు నిర్వహించినవాళ్లు అశ్వమేధయాగం చేసిన ఫలితాన్ని పొందుతారు.

‘సుగంధ, శతకుంభ, పంచయక్ష, త్రిశూలఖా’ అనే తీర్థాల్లో స్నానం చేస్తే నరకబాధ ఉండదు. పూర్వం పార్వతీదేవి శాకాహారం తీసుకుని దేవమానం ప్రకారం వేయి సంవత్సరాలు తపస్సు చేసిన ‘శాకాంభరి తీర్థం’ లో ఒకరోజు శాకహార వ్రతం నిర్వహిస్తే పన్నెండు సంవత్సరాలు శాకాహార తపస్సు చేసిన పుణ్యం పొందుతారు.

‘సువర్ణం’ అనే తీర్థంలో శివుణ్ని అర్చిస్తే కైలాసం సిద్ధిస్తుంది. ధూమావతి అనే తీర్థంలో రథావర్తం, ధార అనే తీర్థంలో స్నానం సేసినవాళ్లు దుఃఖాల నుంచి విముక్తి పొందుతారు. మునులతో సేవించబడేది, స్వర్గానికి ప్రవేశద్వారమయిన ‘గంగాద్వారం’ అనే క్షేత్రంలో స్నానం చేసిన ధన్యులకి నూరుకోట్ల తీర్థాల్ని సేవించిన భాగ్యం దక్కుతుంది.

‘సప్తగంగా సంగమం, త్రిగంగా సంగమం, శక్రావర్తం, కనస్వలం, గంగా సరస్వతీ సంగమం’ మొదలైన పుణ్యతీర్థాల్లో స్నానం చేస్తే పుణ్యలోకాలు; భద్రకర్ణేశ్వరంలో రుద్రపూజ, అరుంధతి నాటిన మర్రిచెట్టు గల స్థలం, అరుంధతీవటం, సింధునది పుట్టినచోటు, యమున పుట్టినచోటు వంటి పుణ్యస్థలాలు సేవిస్తే సర్వసిద్ధులు; ’వేదిక, ఋషికుల్య, కృత్తిక, మఘ, విద్య, వేతసి’ అనే తీర్థాల్ని సేవిస్తే పాపాలు పోతాయి.

‘బ్రహ్మతీర్థం’ లో స్నానం చేస్తే పద్మవర్ణం కల విమానంలో సత్యలోకానికి చేరుకుంటారు.

నైమిశంలో మహాభారత పురాణ ప్రవచనం సత్రయాగసందర్భంగా పన్నెండు సంవత్సరాలు జరిగింది. భారతీయ వాఙ్మయంలో సుప్రసిద్ధమైన క్షేత్రమహత్య ప్రవచనాలు; వ్రతాలు ఆచరించడం వల్ల కలిగే ఫలితాలు వంటి ప్రబోధాలు జరిగాయి. ఈ విధంగా నైమిశానికి భారతీయ సాహిత్యంలో సాటిలేని గొప్పతనం ఏర్పడింది.

గంగానది ఉద్భవించిన స్థలం ‘గంగోద్భేదం’ అనే తీర్థం, ‘ఇందీవర’ తీర్థం, గంగానది భూమికి దిగిన గంగాద్వారం అనే ‘హరిద్వార’ తీర్థం, ‘దిశాపతి’ తీర్థాల్లో స్నానం చేస్తే వాజపేయయాగం చేసిన పుణ్యం కలుగుతుంది. ‘బహుద’ అనే తీర్థంలో స్నానం చేస్తే అనేక సత్రయాగాలు చేసిన పుణ్యం కలుగుతుంది.

శ్రీరాముడు స్వర్గాన్ని చేరిన సరయూనది ప్రదేశంలో ‘గోప్రదానము’ అనే పేరుగల పుణ్యతీర్థంలో స్నానం చేస్తే అశ్వమేధయాగం చేసిన పుణ్యాన్ని ఆర్జిస్తారు. ‘కోటితీర్థం’ లో శ్రీకుమారస్వామిని ఆరాధించినా, కాశీలో శివుడిని పూజించినా, ‘కపిలహ్రదం’లో స్నానం చేసినా రాజసూయయాగం చేసిన పుణ్యం దొరుకుతుంది.

మార్కండేయమహర్షి నిర్మించిన ‘గంగా గోమతి సంగమం’ అనే క్షేత్రంలో స్నానం చేసినా, బ్రహ్మ నిర్మించిన యూపస్తంభానికి ప్రదక్షిణ చేసినా వాజపేయయజ్ఞం చేసిన ఫలితం కలుగుతుంది.

ధర్మరాజా! ఎక్కువమంది కొడుకులు కలగాలని అందులో ఏ ఒక్కడైనా గయకు వెడతాడా అని, అశ్వమేధయాగం చేస్తాడా అని, తెల్లని ఆబోతుని దానంగా విడిచిపెడతాడా అని నిర్మలమైన హృదయం కలిగిన గృహస్థు కోరుకుంటాడు.

అటువంటి పుణ్యక్షేత్రమైన గయకి వెళ్లి ఒక నెల రోజులు నివసిస్తే తండ్రివైపువాళ్లని, తల్లివైపువాళ్లని ఉద్ధరించినవాళ్లవుతారు. అక్కడ పిండప్రదానం చేస్తే దేవతల దయవల్ల చరితార్థులవుతారు. అక్కడ ఉన్న ‘ఫల్గుతీర్థం’ లో స్నానం చేసినవాళ్లకి గొప్ప పుణ్యఫలంతోపాటు అభ్యున్నతి కూడా కలుగుతుంది.

‘యక్షిణీ’ తీర్థంలో నీళ్లని తాగితే బ్రహ్మహత్య మొదలైన పాపాలనుంచి విముక్తులవుతారు. ’ ‘మణినాగం’ అనే తీర్థంలో స్నానం చేసినవాళ్లకి సర్పాల వల్ల హాని కలుగదు. గౌతమవనంలో ‘అహల్యాహ్రదం’ లోను, ‘ఉదపాన’ అనే తీర్థంలోను స్నానం చేస్తే అశ్వమేధయాగం చేసిన పుణ్యం కలుగుతుంది.

రాజర్షి జనకుడి పేరుమీద వెలిసిన ‘జనకకూపం’లో స్నానం చేస్తే వైకుంఠప్రాప్తి కలుగుతుంది. ‘కంపన, మహానద’ అనే తీర్థాల్లో స్నానం చేసినవాళ్లు పౌండరీక యాగం చేసిన ఫలితాన్ని, ‘దేవపుష్కరిణి, మహేశ్వరధర, మహేశ్వరపద’’ నీటిలో స్నానం చేసినవాళ్లకి అశ్వమేధయాగం చేసిన ఫలం పొందుతారు.

పూర్వ కాలంలో ఒక రాక్షసుడు తాబేలు రూపంలో కోటితీర్థాల్ని దొంగిలించాడు. విష్ణుమూర్తి వాటిని తెచ్చి మహేశ్వరపథంలో ఉంచాడు. ఆ నీటిలో స్నానం చేస్తే, విష్ణుస్థానమైన ‘సాలగ్రామం’ అనే తీర్థంలో స్నానం చేసి విష్ణువుని పూజిస్తే, అందులో నాలుగు సముద్రాలు చేరిన నూతిలో స్నానం చేస్తే వైకుంఠానికి వెడతారు.

భరతాశ్రమంలో చంకారణ్యంలో దేవీసమేతుడైన శివుడిని పూజిస్తే మిత్రావరుణలోకం పొందుతారు. ‘కన్యాసంవేద్యం’ అనే తీర్థంలో కన్యాదానం చేస్తే అక్షయపుణ్యం లభిస్తుంది. ‘దేవకూటం’ అనే తీర్థంలో స్నానం చేస్తే సత్యలోకం సిద్ధిస్తుంది.

విశ్వామిత్రుడు తపస్సిద్ధి పొందిన ‘కౌశికహ్రద’ లో స్నానం చేస్తే, ‘కుమార వీరాశ్రమం’ లో ఒక నెల నివసిస్తే అశ్వమేధయాగం చేసిన పుణ్యం లభిస్తుంది. ‘అగ్నిధార’ అనే తీర్థంలోను బ్రహ్మసరస్సునుంచి పుట్టిన ‘కుమారధార’ అనే తీర్థాల్లో స్నానం చేసి మూడు రాత్రులు ఉపవాసం చేసినవాళ్లు బ్రహ్మహత్య మొదలైన పాపాలనుంచి విముక్తులవుతారు.

గౌరీశిఖర కుండంలోను, నందినీకూపంలోను స్నానం చేస్తే అశ్వమేధయాగం చేసిన ఫలితాన్ని పొందుతారు. ‘కాళిక, కౌసిక’ అనే తీర్థాలు కలిసినచోట మూడురాత్రులు ఉపవాసం చేసినవాళ్లు అన్ని పాపాలనుంచి విముక్తులవుతారు. ’ఊర్వశీ’ తీర్థంలో స్నానం చేసినవాళ్లు పూజలన్నింటికీ యోగ్యులవుతారు.

‘గోకర్ణ తీర్థం’లో స్నానం చేసినవాళ్లకి పూర్వజన్మస్మృతి లభిస్తుంది. సరస్వతీ తీర్థంలో స్నానం చేసినవాళ్లు, వృషభద్వీపంలో కుమారస్వామిని అర్చించినవాళ్లు దేవతల విమానాలని అధిరోహిస్తారు.

‘నంద, ఔలకం, కరతోయం, గంగాసాగరసంగమ’’ అనే తీర్థాల్లో స్నానం చేసినవాళ్లు నూరు అశ్వమేధయాగాల్ని చేసిన పుణ్యం పొందుతారు. ‘శోణనది, నర్మదానది’ పుట్టిన చోట్లో ‘బదరీతీర్థం’ లో స్నానం చేస్తే ఆయుర్దాయం పెరుగుతుంది.

‘మహేంద్ర, రామతీర్థ, మతంగ, కేదార, వంశ, గుల్మల’ అనే తీర్థాల్లో స్నానం చేస్తే అశ్వమేధయాగం చేసిన పుణ్యాన్ని పొందుతారు.

పుణ్యక్షేత్రాల్లో గొప్పదైన శ్రీశైలంలో గల ‘దేవహ్రదం’ అనే మడుగులో స్నానం చేసి, ఆదిదేవుడైన శివుడిని పూజిస్తే అశ్వమేధయాగం చేసిన పుణ్యం లభిస్తుంది.

పూర్వం దేవహ్రదలో ఇంద్రుడు నూరుయాగాలు చేశాడు కనుక మిగుల పవిత్రమైన కృష్ణవేణిలో ఉన్న దేవహ్రదం తీర్థంలో స్నానం చేస్తే పాపాలన్నీ పోతాయి. పాండ్య పర్వతంలో ఉన్న కావేరీ తీర్థంలో, తుంగభద్రలోను, సముద్రతీర్థంలోను, ఆ సమీపంలో ఉన్న కన్యకుమారీ తీర్థంలోను స్నానం చేస్తే అశ్వమేధయాగం చేసిన పుణ్యం దక్కుతుంది.

గాయత్రీస్థానంలో మూడురాత్రులు గాయత్రీ మంత్రజపం చేస్తే జన్మరాహిత్యం కలుగుతుంది. ‘పెన్న’ అనే మహానదిలో స్నానం చేస్తే నెమలి, హంస రూపాలతో ఉన్న విమానాల్లో విహరిస్తారు. గోదావరీ స్నానం చేస్తే పది అశ్వమేధయాగాలు చేసిన పుణ్యం దక్కుతుంది.

పయోష్ణితీర్థంలోను, దండకారణ్యం, శరభంగాశ్రమం, శుక్రాశ్రమం, జమదగ్ని మహర్షి సేవించిన శూర్పారకం, దక్షారామ క్షేత్రంలో సప్తగొదావరీ తీర్థ’ లోను స్నానం చేసిన పుణ్యాలకి పుణ్యలోకాలు సిద్ధిస్తాయి.

రాక్షసుల భయంతో అణిగిమణిగి ఓకారం మొదలైన వేదాలని ఉద్ధరించి, అంగిరసుడు, సారస్వతుడు మొదలైన ముఖ్యులతో ఎక్కడ చదివించాడో, భృగుమహర్షి దేవతలతో నియోగింపబడి ఎక్కడ యజ్ఞం చేశాడో అటువంటి అందమైన తుంగకారణ్యాన్ని గౌరవపూర్వకంగా చూస్తే చాలు పాపాలన్నీ పటాపంచలౌతాయి.

కాలంజరము అనే పర్వతంలో ఉండే దేవహ్రదంలో స్నానం చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. ‘మేధికం’ అనే తీర్థంలో స్నానం చేస్తే మేధావులవుతారు. చిత్రకూటంలో మందాకినిని సేవించి, పితృస్థానంలో కుమరస్వామిని పూజించి, అగ్రస్థానంలో శివుడిని అర్చించి, శ్రీరామచంద్రుడు ఒకరోజు నివసించిన శృంగిబేరపురంలో గంగాస్నానం చేసి, శివుడిని అర్చించిన వాళ్లకి పాపాలన్నీ పోతాయి.

ప్రయాగ బ్రహ్మదేవుడి యజ్ఞవేదిక. అందులో నిరంతరం మూడు అగ్నికుండాల్లో త్రేతాగ్నులు వెలుగుతూ కనిపిస్తాయి. అంతేకాదు, వేదాలు, యజ్ఞాలు సాకారాలై అరవైకోట్ల పదివేల తీర్థాలు కలిసి చేరి, గంగా యమునా సంగమంలో ఆ పవిత్ర తీర్థాన్ని సేవిస్తూ ఉంటాయి. అక్కడ స్నానం చేసినవాళ్లు రాజసూయ అశ్వమేధ యాగాలు చేసినవాళ్లకి, సత్యవ్రతం ఆచరించేవాళ్లకి, చతుర్వేదాలు అధ్యయనం చేసేవాళ్లు పొందే పణ్యలోకాల్ని పొందుతారు.

వివరంగా తీర్థాల్ని గురించిన వర్ణన చదివిన, ఆలకించిన ధన్యులైన సజ్జనులకి మంచి జరుగుతుంది. సమస్త తీర్థాల్లో స్నానం చేస్తే వచ్చే పుణ్యం, అనేక క్రతువులు చేస్తే కలిగే పుణ్యం దక్కుతుంది.

వ్రతాలు చెయ్యనివాళ్లు, ఉపవాసాలకి విముఖత చూపించేవాళ్లు, చెడ్డవాళ్లు, శుచిత్వం లేనివాళ్లు తీర్థయాత్రలు చేయలేరు. నువ్వు మంచి గుణాలు కలిగినవాడివి, అన్ని ధర్మాలు తెలిసినవాడివి. కనుక తీర్థాలు సేవించి వస్తే నీ కోరికలు నెరవేరుతాయి.

పులస్త్యమహర్షి చెప్పిన పుణ్యతీర్థాల వృత్తాంతం విని భీష్ముడు అన్ని పుణ్యతీర్థాలు సేవించి ధన్యుడయ్యాడు. ధర్మరాజా! నువ్వు కూడా తీర్థయాత్రలు చేసి పూరుడిలా, పురూరవుడిలా, భగీరథుడిలా, శ్రీరాముడిలా కర్తవ్యాల్ని నెరవేర్చి ఈ భూమిని కాపాడు.

రోమశుడు అనే దేవఋషి నీ దగ్గరికి వస్తాడు. ఆ మహర్షి చెప్పినట్టు నీ పురోహితుడు ధౌమ్యుడి అనుమతి తీసుకుని తీర్థయాత్ర చెయ్యి” అని చెప్పి నారదమహర్షి వెళ్లిపోయాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here