మహాభారత కథలు-87: దధీచి మహర్షి దగ్గరికి వెళ్లిన దేవతలు

0
14

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

అరణ్యపర్వము (మొదటి భాగము) మూడవ ఆశ్వాసము

అగస్త్యమహర్షి చరిత్ర

దధీచి మహర్షి దగ్గరికి వెళ్లిన దేవతలు

[dropcap]క[/dropcap]థకుడైన ఉగ్రశ్రవసుడు శౌనకుడు మొదలైన మునులకి మహాబారతకథ చెప్తున్నాడు. ధర్మరాజు అగస్త్యుడి గొప్పతనాన్ని విని అగస్త్యమహర్షి చరిత్రని వివరంగా చెప్పమని రోమశమహర్షిని అడిగాడు. రోమశమహర్షి “ధర్మరాజా! కృతయుగంలో కాలకేయులనే రాక్షసుల గుంపుతో కలిసి ‘వృత్రుడు’ అనే పేరుగల రాక్షసుడు గర్వంతో దేవేంద్రుడు మొదలైన దేవతల్ని బాధిస్తున్నాడు. దేవతలు ఆ రాక్షసుడి బాధలు పడలేక భయపడి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లారు. వృత్రుణ్ని యుద్ధంలో చంపడానికి ఏదైనా ఉపాయం చెప్పమని అడిగాడు.

బ్రహ్మదేవుడు “దేవతలారా! సరస్వతీనదీ తీరంలో నిష్ఠతో తపస్సు చేస్తున్న దధీచిమహర్షి దగ్గరికి వెళ్లి ప్రార్థించండి. ఆయన తన ఎముకల్ని దానం చేస్తాడు. ఆ ఎముకలు వజ్రాయుధము మొదలైన దివ్యాయుధాలుగా మారుతాయి. వాటితో శత్రువుల్ని జయించవచ్చు. దధీచిమహర్షి ఎముకల వల్ల ఏర్పడిన వజ్రాయుధం వల్ల ఇంద్రుడు వృత్రాసురుణ్ని సంహరిస్తాడు” అని చెప్పాడు.

బ్రహ్మ చెప్పిన ప్రకారం ఇంద్రుడితో సహా దేవతలందరూ దధీచిమహర్షి దగ్గరికి వెళ్లి నమస్కరించి “మహానుభావా! నువ్వు ఋషులలోకెల్ల గొప్ప ఋషివి. ఈ దేవతలందరికి మేలు జరిగేట్టు నీ ఎముకల్ని దానం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము” అని ప్రార్థించారు.

వాళ్ల ప్రార్థన విని దధీచి మహర్షి తన జన్మ ధన్యమైందని అనుకుని సంతోషంతో దేవతల మంచి కోసం తన ప్రాణాలు విడిచాడు. దేవతలందరూ ఆ మహర్షి ఎముకల్ని ఆయుధాలుగా స్వీకరించారు. ‘త్వష్ట’ అనే ప్రజాపతి నూరు మొనలుతేలి నిప్పురవ్వలతో భయంకరంగా ఉండే ‘వజ్ర’ అనే ఆయుధాన్ని తయారుచేసి దానితో రాక్షసుల్ని జయించమని చెప్పి ఇంద్రుడికి ఇచ్చాడు. ఆ వజ్రాయుధాన్ని ఉపయోగించి దేవేంద్రుడు వృతుణ్ని సంహరించాడు.

కాలకేయులు అనే రాక్షసులు దేవతలకి లొంగకుండా పగలంతా సముద్రంలో దాక్కుని, రాత్రి సమయాల్లో బలవంతులుగా బయటికి వచ్చి ప్రజల్ని అతి క్రూరంగా హింసించేవాళ్లు. విద్య, ధార్మిక ప్రవర్తన, తపస్సు కలిగి లోకాల్ని ప్రమాదాల నుంచి రక్షిస్తున్న పుణ్యాత్ముల్ని వెతికి, వెతికి చంపి జగత్తుకి కీడు చెయ్యాలనుకుని వశిష్ఠుడి ఆశ్రమంలోకి ప్రవేశించారు.

అక్కడ నివసిస్తున్న పండితుల్ని, బ్రాహ్మణుల్ని నూటతొంభైఏడు మందిని చంపి తినేశారు. చ్యవనుడి ఆశ్రమంలోకి వెళ్లి వందమందిని, భరద్వాజుడి ఆశ్రమంలోకి వెళ్లి ఇరవై మందిని కూడా చంపి తినేసి ఋషుల ఆశ్రమాలని నాశనం చెయ్యడం మొదలు పెట్టారు.

భూలోకంలో యజ్ఞాలు మొదలైన పుణ్యకార్యాలు లేకపోవడం వల్ల భయపడిన యమధర్మరాజు, వరుణుడు, కుబేరుడు, మొదలైన దేవతలు దేవేంద్రుడిని తీసుకుని విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లారు. ఆయనకి నమస్కారం చేసి “ఓ పరమాత్మా! వరాహంగా అవతరించి భూమిని పైకి ఎత్తావు; నరసింహ రూపం ధరించి హిరణ్యకశిపుడనే మొదటి రాక్షసుణ్ని సంహరించావు; మరుగుజ్జు రూపం ధరించి బలిచక్రవర్తిని బంధించావు; యజ్ఞమూర్తివై యజ్ఞాలకి అంతరాయం కలిగించిన ‘జంభుడు’ అనే రాక్షసుణ్ని సంహరించావు. ఈ ప్రపంచంలోని ప్రాణులన్నింటినీ కాపాడుతున్న రక్షకుడివి నువ్వే. ఇప్పుడు లోకాలకి ఏర్పడిన విపత్తు గురించి చెప్పుకోవాలని వచ్చాము.

ఓ పద్మనాభా! పెద్ద పెద్ద శరీరాలు కలిగిన కాలకేయులు అనే రాక్షసులు సముద్రాన్ని జలదుర్గంగా చేసుకుని పగలంతా అందులోనే ఉండి, రాత్రి వేళ బయటికి వచ్చి, విజృంభించి ఋషుల ఆశ్రమాల్లో ధర్మాత్ములైన బ్రాహ్మణుల్ని సంహరిస్తున్నారు. బ్రాహ్మణులకి కీడు కలిగితే భూమండలానికి బాధ ఏర్పడుతుంది. అదే జరిగితే సమస్త లోకాలు బాధ పడతాయి. ఎందుకంటే, బ్రాహ్మణులు వేదాలని చదివి వేదవిహితాలైన పుణ్యకర్మలు చేయడం వల్ల; వారు యజ్ఞాల్లో వేసే హవ్యకవ్యలవల్ల; దేవతలు, పితృదేవతలు తృప్తి చెందుతారు. దేవతలు, పితృదేవతలు తృప్తిపడితే సమస్తలోకాలకి సుఖం కలుగుతుంది. కాబట్టి బ్రాహ్మణులకి దాపురించిన కీడుని తప్పించు” అని విష్ణువుని ప్రార్థించారు.

విష్ణువు “దేవతలారా! కాలకేయులు భయంకరమైన ప్రతాపం కలవాళ్లు, యముడితో సమానమైనవాళ్లు. నిండుగా నీరుగల సముద్రంలో ఉన్న కాలకేయుల్ని సంహరించాలంటే ముందు సముద్రాన్నంతా ఇంకించి అందులో ఉండే సమస్త ప్రాణికోటి బయటపడేటట్లు చెయ్యాలి. వాళ్లని వేరే విధంగా సంహరించడానికి వీలు పడదు. నీళ్లు వరుణదేవుడివి. మిత్రావరుణుల కుమారుడైన అగస్త్యుడు ఆ నీళ్లని తన ప్రభావంతో శ్రీఘ్రంగా తాగగలడు. మీరందరు ఆ మహర్షిని వేడుకోండి” అని చెప్పాడు.

వింధ్యపర్వతం పెరుగుదల ఆపిన అగస్త్యమహర్షి

విష్ణుదేవుడు చెప్పింది విని దేవతలందరు అగస్త్యమహర్షి దగ్గరికి వెళ్లి “మహానుభావా! పూర్వం వింధ్యపర్వతం పెరిగి ప్రపంచానికి కీడు కలిగినప్పుడు నువ్వే కాపాడావు. జగానికి ఏర్పడిన ఈ విపత్తునుంచి నువ్వే కాపాడాలని ప్రార్థించారు” అని రోమశమహర్షి ధర్మరాజుకి చెప్పాడు.

అది విని ధర్మరాజు “మహర్షీ! వింధ్యపర్వతం ఎందుకు పెరిగింది? దాన్ని పెరగకుండా అగస్త్యమహర్షి ఎలా ఆపగలిగాడు? దాన్ని గురించి వివరంగా చెప్పండి” అని అడిగాడు.

మేరుపర్వతానికి సూర్యుడు ప్రదక్షిణ చేయడం చూసిన వింధ్యపర్వతానికి సూర్యుడి మీద కోపం వచ్చింది. “ఆదిదేవా! కొండలకి రాజునైన నాకు ప్రదక్షిణం చేయకుండా నువ్వు మేరుపర్వతాన్ని ఎందుకు ఆరాధిస్తున్నావు?” అని గర్వంగా అడిగింది. దాని మాటలు విని సూర్యుడు “ నేను బ్రహ్మదేవుడి ఆదేశం ప్రకారం ఎప్పుడూ మేరువుకి ప్రదక్షిణంగా తిరుగుతున్నాను. నా ఇష్టం వచ్చినట్టు చెయ్యాడనికి వీలు లేదు” అని చెప్పాడు.

ఆ మాటలు విని వింధ్యపర్వతానికి కోపం వచ్చింది. విధ్యపర్వతం మేరుపర్వతం మీద అసూయతో ఎంతో ఎత్తుకి ఎదిగిపోయి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు మొదలైనవి తిరగడానికి వీలు లేకుండా ఆకాశమార్గాన్ని కప్పేసింది. సూర్యచంద్రుల గమనానికి ఆటంకం కలగడం వల్ల ఇది రాత్రి, ఇది పగలు అని తెలుసుకోలేక ప్రజలు, దేవతలు, మహర్షులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దేవతలు కూడా వింధ్యపర్వతం పెరగడాన్ని ఆపలేకపోయారు.

అందరూ అగగస్త్యమహర్షిని కలిసి “మహర్షీ! వింధ్యపర్వతం పెరిగిపోవడం వల్ల లోకవ్యవహారం స్తంభించింది. తిరిగి సూర్యచంద్రగతులు యథాప్రకారం జరిగేట్టు చూడండి” అని ప్రార్థించారు. దేవతల ప్రార్థన విని అగస్త్యమహర్షి తన భార్య లోపాముద్రతో కలిసి వింధ్యపర్వతం దగ్గరికి వెళ్లాడు. వింధ్యపర్వతం అగస్త్యుణ్ని పూజించింది. అగస్త్యుడు “ఓ పర్వతమా! నేను దక్షిణ దిక్కుకి వెడుతున్నాను. నాకు దారి ఇయ్యి!” అని అడిగాడు.

వింధ్యపర్వతం పెరగడం మానేసి “స్వామీ! మీరు వెళ్లండి!” అని భక్తితో ఒదిగి భూతలానికి సమానంగా ఉండేలా కిందకి కుంచించుకుని నిలిచింది. అగస్త్యుడు వింధ్యపర్వతంతో “ఓ పర్వతమా! నేను తిరిగి వచ్చేవరకు ఇలాగే ఉండు. నాతో స్నేహంగా ఉండు” అని చెప్పాడు. వింధ్యపర్వతం అంగీకరించింది. అగస్త్యుడు దక్షిణ దిక్కుకి వెళ్లి విశ్వకల్యాణం కోసం అక్కడే ఉండిపోయాడు. వింధ్యపర్వతం అగస్త్యుడి రాకకోసం ఎదురు చూస్తూ మళ్లీ పెరగడానికి భయపడి అలాగే ఉండి పోయింది.

దేవతలు అగస్త్యుణ్ని స్తుతిస్తుంటే అగస్త్యుడు “మీరెందుకు వచ్చారో చెప్పండి” అన్నాడు. దేవతలు కాలకేయులవల్ల ప్రపంచానికి ఏర్పడిన విపత్తు గురించి వివరించి చెప్పారు. తరువాత వినయంగా “మహర్షీ! జగత్తుని కాపాడడానికి సముద్రాన్ని పానం చేసి మాకు సంతోషాన్ని కలిగించండి. మీరు ఆ జలాన్ని తాగిన వెంటనే మేము మా దివ్యాయుధాలతో ఆ రాక్షసుల్ని సంహరిస్తాము” అన్నారు.

సముద్రజలాన్ని పానం చేసిన అగస్త్యమహర్షి

అగస్త్యుడు దేవతలు అడిగినదానికి అంగీకరించి గరుడులు, ఆకాశచారులు, సిద్ధులు, ఉరగులు, గంధర్వులు, యక్షులు మొదలైన దేవతాజాతులతో కలిసి భయంకరంగా ధ్వని చేస్తున్న సముద్రం దగ్గరికి వచ్చాడు. అందరూ చూస్తుండగా సముద్రజలాల్ని తాగేశాడు. అందులో ఉండే తిమింగలాలు, ఎండ్రకాయలు, మొసళ్లు, తాబేళ్లు, పాములే కాకుండా కాలకేయులు అని పిలవబడే రాక్షసులుకూడా భయపడుతూ బయటికి వచ్చారు.

దేవేంద్రుడితో కలిసి దేవతలు పరాక్రమంతో విజృభించి కాలకేయులతో యుద్ధం చేశారు. దేవతల అస్త్ర శస్త్రాల తాకిడికి కొందరు రాక్షసులు యుద్ధంలో చచ్చిపోయారు. మిగిలినవాళ్లు పాతాళానికి పారిపోయారు. కాలకేయులతోపాటు అనేకమంది రాక్షసుల్ని చంపి లోకాలకి మంచి చేసిన తర్వాత దేవతలు “ఋషుల్లో గొప్పవాడవైన మహర్షీ! నీ దయతో లోకాలన్నింటికీ బాధ లేకుండా పోయింది. ఇంక ఈ సముద్రాన్ని నీటితో నింపు. ఈ పని నువ్వు తప్ప వేరెవరూ చెయ్యలేరు. ఈ సముద్రంలో అనేక జీవరాశులు జీవిస్తున్నాయి. నీరు లేకుండా అవి జీవించలేవు” అని ప్రార్థించారు.

అగస్త్యుడు “నా పొట్టలో సముద్ర జలం అరిగిపోయింది. మళ్లీ సముద్రాన్ని నింపేంత నీటిని నేను పొందలేను” అని చెప్పాడు. దేవతలు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లి “దేవా! సముద్రాన్ని మళ్లీ నీటితో నింపే ఉపాయం చెప్పు” అని వేడుకున్నారు.

బ్రహ్మ చాలాసేపు ఆలోచించి “దేవతలారా! కొంతకాలం గడిచిన తరువాత భగీరథుడు అనేవాడు సముద్రాన్ని నీటితో నింపుతాడు. అంతవరకు ఎవరూ ఆ పని చెయ్యలేరు” అని చెప్పాడు.

రోమశమహర్షి చెప్తున్నదంతా వింటున్న ధర్మరాజు “మహర్షీ! భగీరథుడు సముద్రాన్ని అంత నీటితో ఎలా నింపగలిగాడు?” అని అడిగాడు.

కపిలమహర్షి కోపానికి భస్మమైన సగరపుత్రులు

పూర్వం ఇక్ష్వాకు వంశంలో సగరుడు అనే రాజు హైహయుల్ని జయించి మొత్తం భూమండలాన్ని పాలిస్తూ ఉండేవాడు. అతడికి కొడుకులు లేరు. అతడు తన భార్యలు వైదర్భి, శైబ్యలతో కలిసి కైలాసానికి వెళ్లి గొప్ప తపస్సు చేశాడు. పరమశివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. సగరుడు తనకి సంతానం ప్రసాదించమని ప్రార్థించాడు.

పరమేశ్వరుడు సగరుడికి వైదర్భికి అరవైవేలమంది కొడుకులు, శైబ్యకి ఒక కొడుకు కలిగేలా వరమిచ్చాడు. అరవైమంది కొడుకులూ ఎక్కువ గర్వంతో ప్రవర్తించి ఒకేసారి మరణిస్తారని మిగిలిన ఒక కొడుకు వంశోద్ధారకుడు అవుతాడని చెప్పి అంతర్థానమయ్యాడు.

తరువాత కొంతకాలానికి వైదర్భికి ఒక సొరకాయ, శైబ్యకి ‘అసమంజసుడు’ అనే ఒక కొడుకు కలిగారు. శివుడు వరమిచ్చినా కొడుకులు కాకుండా సొరకాయ పుట్టిందని అనుకుంటూ దాన్ని పారెయ్యాలని అనుకున్నారు.

అంతలో ఆకాశవాణి “మహారాజా! ఈ సొరకాయని పారెయ్యద్దు. దీని విత్తనాలు తీసి నేతి కుండల్లో ఉంచండి. దీని నించి అరవై వేలమంది బలవంతులైన కొడుకులు పరమేశ్వరుడి దయవల్ల నీకు జన్మిస్తారు” అని చెప్పింది. మహారాజు ఆకాశవాణి చెప్పినట్టు చేశాడు.

రెండు నెలలు గడిచాక అరవైవేలమంది కొడుకులు పుట్టి పెరిగారు. వాళ్లు ఆకాశంలో తిరుగుతూ దేవేంద్రుడి లోకంతోపాటు అన్ని లోకాల్ని బాధించడం మొదలెట్టారు. వాళ్ల బాధలు భరించలేక దేవతలు, పన్నగుల నాయకులు, ఋషీశ్వరులు కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లి చెప్పుకున్నారు. బ్రహ్మ వాళ్లకి ధైర్యం చెప్పి “గర్వంతో ప్రవర్తించేవాళ్ల ఆధిక్యం ఎంతో కాలం నిలవదు. సగరుడి కొడుకులు తగులబడిపోతారు” అని చెప్పాడు. సగరుడి కొడుకులు ఎప్పుడు నాశనమవుతారో అనుకుని వచ్చినవాళ్లు తిరిగి వెళ్లిపోయారు.

సగరుడు అశ్వమేధయాగం చెయ్యాలని దీక్షపట్టాడు. యాగాశ్వాన్ని రక్షించే బాధ్యత సగరుడి కొడుకులు తీసుకున్నారు. అశ్వం భూమండలమంతా తిరిగి నీళ్లు లేని సముద్రంలో మాయమయింది. ఈ విషయం తండ్రికి చెప్పి తండ్రి ఆజ్ఞ తీసుకుని అందరూ కలిసి ఒకేసారి పాతాళాన్ని తవ్వడం మొదలుపెట్టారు.

వాళ్లు వాడిన పదునైన గడ్డపారల వల్ల సముద్రపు బురదలో ఉన్న జంతువులు ముక్కలు ముక్కలుగా తెగిపోతున్నాయి. చివరికి సముద్ర ప్రదేశంలో ఈశాన్య దిక్కున ఉన్న కపిలమహర్షి ఆశ్రమం దగ్గర తమ అశ్వాన్ని చూసి సంతోషించారు.

దున్నపోతులా ఉన్న ఈ ముని యాగాశ్వాన్ని అపహరించి సముద్రగర్భంలో ఎటువంటి భయం లేకుండా కూర్చున్నాడు అనుకుని అతణ్ని అవమానించారు. ఆ ఋషి సగరుడి కొడుకులవైపు కోపంతో నిప్పులుకక్కుతూ చూశాడు. వాళ్లందరు మండి బూడిదయ్యారు.

పరాక్రమవంతులైన సగరుడి కొడుకులు కపిలమహర్షి కోపాగ్నికి బలయ్యారని నారదుడు ఆలస్యం చెయ్యకుండా సగరుడికి తెలియచేశాడు. కొడుకులు మరణించినవార్త విని సగరుడు బాధపడ్డాడు. అయినా పరమేశ్వరుడు చెప్పిన మాట గుర్తుకొచ్చి దుఃఖాన్ని తగ్గించుకున్నాడు.

అసమంజసుడి కొడుకు అంశుమంతుడితో “నాయనా! నీ తండ్రి అసమంజసుడు పురంలో ఉన్న బాలకుల్ని చంపి నదిలో విసిరేస్తూ ఉండేవాడు. పురప్రజల మీద జాలి పడి అతణ్ని విడిచిపెట్టేశాను. ఇప్పుడు నీ తండ్రులు అరవైవేలమంది కపిలమహర్షి కోపాగ్నికి బలైపోయారు. కొడుకులు పోయారని నేను బాధ పడట్లేదు. అశ్వమేధయాగం ఆగిపోతుందని భయపడుతున్నాను. నువ్వే ఏదయినా చేసి నా బాధ పోగొట్టాలి” అన్నాడు. అంశుమంతుడు వెంటనే బయలుదేరి సగరుడి కొడుకులు తవ్విన మార్గంలో వెళ్లి వేయిసూర్యుల కాంతితో ప్రకాశిస్తున్న కపిలమహర్షికి నమస్కారం చేసి తనెందుకు వచ్చాడో చెప్పాడు.

మహర్షి అంశుమంతుడికి యాగాశ్వాన్ని ఇచ్చి “సగరుడి కొడుకులకి సద్గతులు కలుగుతాయి. నువ్వు ఈ గుర్రాన్ని తీసుకుని వెళ్లడం వల్ల సగరుడు అశ్వమేధయాగం పూర్తి చేసి ధన్యుడవుతాడు. నీ మనుమడు భగీరథుడు తెచ్చే గంగనీటి ప్రవాహంతో తడిసి సగరుడి కొడుకులు స్వర్గలోకానికి చేరుకుంటారు. సముద్రం మళ్లీ నీటితో నిండుతుంది” అని చెప్పాడు.

కపిలమహర్షి దయవల్ల దొరికిన యాగాశ్వాన్ని తీసుకునివెళ్లి అంశుమంతుడు సగరుడికి ఇచ్చి కపిలమహర్షి చెప్పిన మాటల్ని కూడా చెప్పాడు. సగరుడు అశ్వమేధయాగం పూర్తిచేసి సముద్రుణ్ని తన కుమారుడిగా స్వీకరించాడు. అప్పటినుంచి సముద్రం ‘సాగరం’గా పిలబడింది.

సముద్రాన్ని నీటితో నింపిన భగీరథుడు

అంశుమంతుడు కూడా తాతగారిలా ప్రజారంజకంగా రాజ్యాన్ని పాలించాడు. తన కొడుకైన దిలీపుడికి రాజ్యభారాన్ని అప్పగించి వానప్రస్థాన్ని స్వీకరించి తపస్సు చేసుకునేందుకు అడవికి వెళ్లాడు. దిలీపమహారాజు తన తాతగారి కొడుకులు అధమలోకాలకి వెళ్లకుండా గంగని భూలోకానికి తీసుకుని రావడానికి కృషి చేశాడు. అతడి శక్తి అందుకు చాలలేదు.

దిలీపమహారాజు కుమారుడు భగీరథుడు గొప్ప కీర్తిమంతుడు. ఎన్ని కష్టాలు పడడానికైనా వెనుకాడడు. గొప్ప పరాక్రమంతో వేలకొలదీ వీరుల్ని ఎదిరించగల మహావీరుడు. ఎంతమందో రాజుల్ని సాంమంతులుగా చేసి రాజ్యం చేసిన చక్రవర్తి. అపజయం తెలియనివాడు. తన వంశాన్ని దుర్గతి నుంచి కాపాడగల సమర్థుడు. దేవనది అయిన గంగని భూమిపైకి తీసుకుని రాగల సామర్థ్యంతో పాటు తపో మహిమ కలవాడు. భగీరథుణ్ని సువిశాలమైన తన రాజ్యానికి రాజుగా చేసి దిలీపుడు వానప్రస్థాన్ని స్వీకరించి తపస్సు చేసుకోవడానికి వెళ్లిపోయాడు.

కపిలమహర్షి ఆగ్రహానికి బలయిన సగరుడి కొడుకులు ఉత్తమలోకాలకి వెళ్లకుండా ఉండిపోయారని, వాళ్లకి మేలు చెయ్యాలని మహావీరుడైన భగీరథుడు అనుకున్నాడు. ఆలోచించి గంగానదిని దివినుంచి భూలోకానికి దింపాలని నిశ్చయించుకుని హిమాలయపర్వతానికి వెళ్లాడు. దేవతల కాలమానం ప్రకారం వెయ్యేళ్లు ఆకుకూరలు, పళ్లు, వేళ్లు, నీళ్లే ఆహారంగా తింటూ, ఉపవాసాలు చేస్తూ దేవతల్ని అర్చిస్తూ సాటిలేని తపస్సు చేశాడు.

అతడి కఠోర తపస్సుకి మెచ్చుకుని గంగాదేవి ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంది. భగీరథుడు గంగాదేవికి నమస్కరించి “సూర్యుడి తేజస్సువంటి తేజస్సు కలిగిన కపిలమహర్షి కోపానికి గురయిన సగరుడి కొడుకులు నా తాతలు పుణ్యగతులు పొందకుండా అల్లాడిపోతున్నారు. నీ పుణ్యజలాల మహిమవల్ల సగరపుత్రులు స్వర్గలోకాన్ని పొందగలుగుతారు. గంగాదేవీ! నువ్వు దేవమార్గం నుంచి భూమార్గానికి దిగి రావాలని ప్రార్థిస్తున్నాను” అన్నాడు.

గంగాదేవి “నేను దివినుంచి భువికి దిగి వచ్చేటప్పుడు ఎడతెగని నా నీటివెల్లువని భరించగలిగినవాడు ఆ పరమేశ్వరుడొక్కడే. ఇతరులు ఎవరికీ అది సాధ్యం కాదు. కనుక, నన్ను భరించడానికి ఆ పరమేశ్వరుణ్ని నువ్వు ప్రసన్నం చేసుకో” అని చెప్పింది.

భగీరథుడు ఆమె చెప్పిన ప్రకారం కైలాసం వెళ్లి ఈశ్వరుడి గురించి కఠోర తపస్సు చేశాడు. భగీరథుడి తపస్సుకి మెచ్చి పరమేశ్వరుడు “నువ్వు గంగానదిని దివి నుంచి భువికి అవతరించేలా చెయ్యి. నేను గంగని ధరిస్తాను” అని చెప్పాడు.

భగీరథుడు మళ్లీ గంగని అర్చించాడు. గంగ భగీరథుణ్ని కరుణించింది. దిక్కులు, ఆకాశము కప్పేస్తూ గొప్ప ప్రాణికోట్ల సముదాయంతో విలసిల్లుతూ గంగానది భూమి పైకి వచ్చింది. అలా వచ్చిన గంగని శివుడు తన ఎత్తైన గోరోజనం రంగుతో ఉండే జటాజూటం పైభాగంలో తామరపువ్వురేకు రూపంలో విలాసంగా ధరించాడు.

ఆకాశంలో తిరిగే దేవతలు, ఋషులు, సిద్ధులు మొదలైన వాళ్లందరు గంగావతరణాన్ని ఆశ్చర్యంగా చూశారు. ప్రజలందరితో పూజింపబడే గంగానది శివుడి జటాజూటం అలంకరిస్తూ దివి నుంచి భువికి దిగింది. కలహంస నడక, నురుగు అనే చిరునవ్వు, కదిలే చేపలు అనే చూపులు, వీస్తున్న గాలివల్ల ధ్వనించే కెరటాల సవ్వడులు అనే నెమ్మదైన మాటలతో సంతోషంగా భగీరథుడు అనే దూత వెంటపెట్టుకుని తీసుకుని వెడుతుండగా అగస్త్యమహర్షి తాగడం వల్ల నీరు లేకుండ ఉన్న సముద్రుడి దగ్గరికి చేరింది.

సగరపుత్రులకి మంచి చెయ్యడం కోసం ప్రయాణమై వెళ్లి ఆ సముద్రుణ్ని అంతులేని నీటితో నింపేసింది. సగరుడి కొడుకులకి పుణ్యగతి కలిగేలా, సముద్రం నిండుగా నీరు ఉండేలా గంగానది భూలోకానికి వచ్చి భగీరథుడి కీర్తిని అన్ని లోకాలకి వ్యాపించేలా చేసింది” అని చెప్పాడు.

రోమశమహర్షి చెప్తున్న భగీరథుడి కథ వింటూ ప్రయాణం చేసిన ధర్మరాజు తన తమ్ముళ్లతో కలిసి నంద, అపరనంద నదుల్లో స్నానం చేశాడు. హేమకూట పర్వతంలో ఉండే రాళ్ల నుంచి పుట్టిన అగ్నివల్ల వస్తున్న మబ్బుల్ని చూసి ఆశ్చర్యపోయి పాండవులు ఆ వింత గురించి చెప్పమని రోమశమహర్షిని అడిగారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here