మహాదేవి అక్క వచనాలు – పర్యావరణ ప్రతీకలు

0
15

[శ్రీమతి రాజేశ్వరి దివాకర్ల రచించిన ‘మహాదేవి అక్క వచనాలు -పర్యావరణ ప్రతీకలు’ అనే వ్యాసం పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]అ[/dropcap]క్క మహదేవి శివ భక్తురాలు. సామాజిక నిబంధనలకు పోకడలకు అతీతమైన తీక్షణ భక్తురాలు. ఆమె అసలు పేరు మహాదేవి. అనుభవ మంటపము అనే శరణుల సభా మంటపంలో అల్లమ ప్రభు అనే శివ శరణ మీమంసాకరుని వాదనలో జయించి, అక్కడి పండితులందరి చేతా ‘అక్క’ అనే గౌరవాన్ని పొందింది.

అక్క మహాదేవి శివభక్తులైన నిర్మల, సుమతి శెట్టి దంపతులకు జన్మించింది. ఆమె జన్మస్థలం శివమొగ్గ జిల్లాలోని శికారి పురం తాలూకా ఉడుతడి. అక్క మహాదేవి చిన్నప్పటి నుంచి శివ భక్తురాలు. శివ పూజకు మల్లెలను తెచ్చి అందమైన మల్లెలవలె స్వచ్ఛంద రూపడైన శివుని చెన్నమల్లికార్జునుడను తలపుతో వరించింది. మాధుర్య భావ సాధనను ఆరంభించింది. దైవ ప్రేమలో కరగి పోయింది. వీరరాగిణిగా ప్రసిద్ధి చెందింది.

కన్నడ భాష లోని వచనకారులందరిలో అక్క మహాదేవి ఉజ్జ్వల నక్షత్రం.

ఆక్క పలికిన వచనాలన్నీ శివభక్తిలో పూచిన కవిత్వ పుష్పాలు. ఆమె వచనాలు హితోక్తులు కాదు. మహాదేవి అక్కగారి ప్రతి ఒక్క వచనము – నిర్వచనము. అమె పలికినవి సృష్టి రహస్యాలను భక్తి తన్మయత్వంతో నిర్వచించిన ఆత్మ నివేదనా గీతాలు.

‘చెట్టు చెట్టు ఘర్షించి నిప్పు పుట్టి

చుట్టూ తరువులను కాల్చినట్లు’

ఆత్మ అంతరాత్మలను మథనం చేసింది. ఆ అనుభవంతో కప్పుకున్న గుణాలను కాల్చి వేసుకుంది.

శరణులలో అక్క మహాదేవి భక్తినే తన ప్రవృత్తిగా మలచుకుంది. సుఖాలను, భోగ భాగ్యాలను త్యజించింది. తనను ‘శరణ సతి, లింగపతి’ అని చాటుకుంది. తాను ఆశించిన నియమాలను అనుసరించని భర్తను తృణీకరించింది. చిరు ప్రాయం లోనే వ్యక్తి స్వాతంత్ర్యాన్ని చూపింది. కట్టుబట్టలను కూడా వదలి దిగంబరిగా ఇల్లు వీడింది.

ఈ ప్రపంచమంతా ఆ దేవుడే నిండిపోయి ఉండగా,

తమ అంగవస్త్రం తొలగితే సిగ్గు పడతారెందుకో జనులు?

ప్రతి చోటా ఆ దేవుడి నయనమే వీక్షిస్తున్నప్పుడు,

నీవు దేనిని దాచగలవు? అని చెన్న మల్లికార్జునుని కాంతిని మేన ధరించింది.

దీర్ఘమైన తన కేశాలతో శరీరాన్ని కప్పుకుంది. తాను వలచిన ‘చెన్న మల్లి కార్జునుని’లో ఐక్యమయేందుకు ఒంటరిగా కానల వెంట, కోనల వెంట కాలి నడకన బయలు దేరింది.

అక్క మహాదేవి వచనాలను ‘చెన్న మల్లికార్జునుని నామాంకితం’గా పలికింది. ఈ వచనాలు 434 లభించాయి. అక్క వైశ్య కులానికి చెందిన ఏకైక వచనకారిణి. “యాత్రా కథనాన్ని, యాత్రానుభవాలను 12వ శతాబ్ది లోనే ప్రప్రథమంగా వివరించిన ప్రథమ మహిళ” అని కూడా పేర్కొనవచ్చు.

అక్క సంచార పథంలో ఆమె జన్మస్థలం శివమొగ్గ తాలూకా ఉడుతడి నుండి బీదర్‌ జిల్లాలోని పశ్చిమ చాళుక్యుల రాజధాని కళ్యాణలోని అనుభవమంటపాన్ని చేరుకుంది. ఆమె కల్యాణ నగరాన్ని చేరినప్పుడు ‘అనుభవ మంటప మణి’ గా విరాజిల్లింది. స్పష్టమైన పలుకు, ధీరగా అల్లమప్రభువు అడిగిన ప్రశ్నలకు జవాబు నిచ్చింది.

“విరాగిణి వైతే కేశాలతో దేహాన్ని కప్పుకొన్నావు ఎందుకు?” అని వారడిగిన ప్రశ్నకు “కాముని ముద్రకు మీ వంటి వారు బెదరిపోకూడదని యిలా దేహమును కప్పుకున్నాను” అని వైచారిక యుక్తిని ప్రదర్శించింది. “మీ తలలకు పూలు తెచ్చెదను కాని పుల్లు తేను, మీ అడుగుల బడెదను అవధరించండి” అని యెంతో వినయంతో ప్రవర్తించింది.

“అమ్మా. నీ తపస్సుకూ నివాసానికీ అనువైన స్థలం శ్రీశైలక్షేత్రంలోని కదళీవనమే. నీవు వెంటనే బయలుదేరి అక్కడకు వెళ్ళి తపస్సులో ఉండు” అని అల్లమప్రభువు చెప్పగా ఆయన ఆదేశాన్ని అనుసరించి శ్రీశైలములోని కదళీవనములోని గుహాప్రాంతానికి చేరుకుని తపస్సమాధిలో తనువు చాలించింది. అప్పటికి ఆమె వయసు కేవలం ముప్పయి సంవత్సరాలు.

అక్కమహాదేవి శ్రీశైల చెన్న మల్లికార్జునుని పతిగా తలచి సతతవిరహిణిగా ఆతనిని గురించిన భావావేశాన్ని పొందింది. అక్కను గురించి ఆనాటి కవులు కావ్యాలను రాసారు. ఆధునికులు నవలలు ఆదిగా రచనలను కావించారు. అక్క మహాదేవి జీవన స్వాతంత్ర్యం సాహిత్య భావాభివ్యక్తి ఆధునిక స్త్రీలను ఈనాటికీ ఆబ్బురపరుస్తుంది. కన్నడ రచయిత్రులు తాము అక్క మహాదేవిలా రచించాలని ఉవ్విళ్ళూరుతుంటారు.

అక్క మహాదేవి వచనాలన్నీ భావ తీవ్రతతో, చక్కని భావగీతాలుగా ఉంటాయి. ఆమె తాను నడచిన బాటలో ప్రకృతిని నిశితంగా పరిశీలించింది. తన చుట్టూ గల పర్యావరణాన్ని ఆధ్యాత్మిక దృఢత్వానికి ఆలంబనగా గ్రహించింది. ఆమె లోని భావ లహరులు ప్రకృతి చేతనలో చెన్న మల్లికార్జునుని తలపించాయి. ‘ఆమె వచనాలలో గల పర్యావరణ ప్రతీకలను నిరూపించడం’ ఈ వ్యాస ఉద్దేశం.

ఆమె తాను పుట్టిన ఉడుతడి నుండి శ్రీశైలం వరకు నడచి వెళ్ళిన దారిలో ఆమె అనేక కష్టాలనెదిరించింది

ఆకలివేస్తే ఊళ్ళో భిక్షాలున్నాయి

దాహమేస్తే చెరువు వాగులలో నీళ్ళున్నాయి

అంటూ ఆకలినీ దాహాన్నీ ప్రకృతి ఒడికి అప్పగించింది.

ఆకలీ నువ్వాగు ఆగు

దాహమా నువ్వాగు ఆగు,

అంటూ వాటిని శాసించింది. దారిలో యెదురైన అల్లరిమూకలను “వాడిన పూవును వాసన చూస్తారా! చిన్ని పాపలో కన్నె సొగసు చూస్తారా?” అని దృఢ వ్యక్తిత్వంతో నిగ్రహించింది. “అమృతం తాగే శిశువుకు విషం పోస్తారా? నీడ చలువలో పెరిగే మొక్కకు మంటల కంచె పెడతారా?” అని ఆర్ద్రత ఉట్టి పడినట్లు నివారించింది.

అక్క శివుని లలితమైన భావాభివ్యక్తితో పతిగా భావించింది. ఆమె ప్రేమించిన పురుషుడు ప్రకృతి అంతటా వ్యాపించాడు. అందుకనే ప్రకృతిని తన విరహం లోని ఆత్మ నివేదనకు ఆలంబనగా గ్రహించింది.

ఆమె ప్రకృతి లోని సహజ పరిణామక్రమాన్ని జీవన సంయమనానికి ప్రాతిపదికగా గ్రహించింది. భక్తి తత్వాన్ని సరళీకరించుకుని ఆత్మాభ్యుదయానికి త్రోవను ఏర్పరచుకున్న మేధాశక్తిని తన వచనాలలో వెల్లడించింది.

“వరి లేని పొట్టుకు నీళ్ళెన్ని పోసినా! పెరిగి ఫలమిస్తుందా? ఎన్నటికైనా!” అని ఆచరణ లేని ఆచారాలను గురించి చెప్పింది.

“వీచే పరిమళం స్థిరంగా ఉండగలదా?” అంటూ చంచలము కాని నిజ భక్తికి ఉదాహరణనిచ్చింది.

“నెరలు విచ్చిన చెరువుకు వరద వచ్చినట్లయింది./ఒరిగి పోయిన మొక్కమీద వాన కురిసినట్లయింది” గురువు పాదాలను చూసి ధన్య నయ్యానని సంభ్రమిస్తుంది.

భక్తి తత్వం తెలిసిన వారితోను, తెలియని వారితోనూ చేసిన స్నేహం లోని మంచి చెడులను సహజ సిద్ధమైన అనుభావంతో ‘తెలియని వారి స్నేహం రాళ్ళు విసిరి నిప్పు రవ్వను రేపినట్లని, తెలిసిన వారితో స్నేహం పెరుగు చిలికి వెన్నను తీసినట్ల’ని వివేచన చేసింది.

ఇక ఆమె చెన్న మల్లికార్జునుని చూచి తీరాలనే తపనను కూడా మరొకరితో కాక ప్రకృతితో మొర పెట్టుకుంటుంది.

“తుమ్మెదలారా! మావి తరువా! వెన్నెలా! చకోరమా!” అంటూ పిలిచి

చెన్నమల్లికార్జునుని చూపమని వేడుకుంటుంది.

తాను దిగంబరి అయితేనేమి, దేహం కాదు, మనసు బిత్తలగా ఉండాలి. నాలుక కొసకు రుచి తెలియకుండా ఉండాలి. భక్తి తప్ప మరొక తలపు లేక దృఢ చిత్తమును కలిగి ఉండాలని తలచింది.

తానున్న స్థితిని “ఎండుటాకులు తిని నేనున్నాను, బండ మీద పడుకుని నేనున్నాను” అని శివునికి మాత్రమే కాదు, సర్వ సృష్టికీ విశుద్ధ భక్తిని నిరూపించింది.

నిజభక్తి చాటు మాటు లేదు. “భూమి తలవరి అయినప్పుడు, దొంగ ఎక్కడికి పోగలడు?” అని భూమి సాక్ష్యంగా ఆత్మ నిరూపణను కావించుకొంది.

ఈత. నిమ్మ మావి నేరేళ్ళు పుల్లగా ఉండడానికి పులుపు నీళ్ళనెవరు పోసారు? చెరకు అరటి, నారి కేళాలకు తీపి నీళ్ళనెవరు పోసారు, రాజాన్నము, శాల్యన్నాలకు ఆహారం నీళ్ళనెవరు పోసారు, మరువానికి, మల్లెకు పరిమళాల నీళ్ళను ఎవరు పోసారు, వీటన్నింటికీ నేలా, ఆకాశాలు ఒకటే, కాని వాటి తీరు వేరు, అలాగే పలు జగాలను మల్లికార్జునుడు వహించి ఉంటే మటుకు ఏమిటి? అతడు వాటిని కాపాడే తీరు వేరు, అని చెన్న మల్లికార్జునుని భక్త పరిపాలనా విధానాన్ని వృక్ష సముదాయ మూల గుణాలతో వింగడించి వివిధ ప్రకృతి రీతులకు ఆధార భూతమైన మల్లికార్జునుని రక్షణా దక్షతను వివరించింది.

ఉదయ అస్తమయాలను ఆయువునకు కొలతశేరులుగా ప్రతీకమానం కావించింది.

మంటలు పైకెగసినా మలయ పర్వతమే, నని మందరగిరి పైబడినా పుష్పమే నని, సముద్రం పైన బడినా కాలువే నని, శివునికై తను పడిన తపనలో తలవంచి భారాన్ని సహించింది. తన ఊపిరినే పరిమళముగా శివుని ఆరాధించింది. సంసారమనే తనువున తల్లీనమయింది. బిల్వాన్ని వెలగ పండును ఒక్కటిగా చూచి రెంటికీ చెడిన రేవడిలా కాక భిన్నత్వాన్ని తరచి చూసింది.

పర పురుషులను ముళ్ళ పందుల్లా ద్వేషించింది, “చెంగు విడువరా! మూర్ఖా” అని కామ చింత గల పురుషుని తిరస్కరించింది. చెన్న మల్లికార్జునుడు తనను ప్రేమించునో లేదో అని ఒకే ఒక చింత గల అక్క పురుషద్వేషి అని అనుకోకూడదు. గురువులను భక్తితో సేవించింది. ఎల ప్రాయంలో పుట్టిన మోహపు మొలక గురు హస్తమున అంకురించిందని, ఆ బలగము, నడుమ ఏడాకులు తొడిగిందని, తొమ్మిదాకులు ఇప్పటికి పరిపూర్ణం అయ్యాయని, సత్యమూలమును జూపు జ్ఞాన గురువు: అతని శ్రీ పదములకు మొక్కులను సమర్పించింది.

ఆమె భక్తితో నల్ల రేగడిలా కరిగి కరిగి, ఇసుకలా జరిగి జరిగి, కలలో కలవరించింది, ఆవమున నిప్పులా కమలిపోయింది.

ఆమె చెన్న మల్లికార్జునుని చేరడానికి అడవిని ప్రవేశించింది. చెట్టు చెట్టునూ వేడుకుంది. ఆమె లింగార్థమై అంగమును నిలుపుకుంది. భవికి ప్రాణ చైతన్యమునిచ్చిన చెట్లు భక్తులని శరణు వేడింది. అక్క మహాదేవి తన నిశ్చల భక్తిని “ఎండిన వెదురు మళ్ళీ చిగురు వేస్తుందా? కాల్చిన మూకుడు తొల్లిటి వలె మన్ను కాగలదా? తొడిమ వీడిన పండు మళ్ళీ తొడిమకు అంటుకుంటుందా!” వంటి నిర్వచనాలతో తాను మర్త్యానికి మరలి రానని నిర్థారణ చేసింది.

కాండంలో గట్టితనం లేకపోతే చెట్టులో క్రిములు చేరుతాయి.

ఆకాశం వెడల్పు చంద్రునికి తెలుసు,బయట ఉండి ఎగిరే గ్రద్దకు తెలుస్తుందా! పూల పరిమళం తుమ్మెదకు తెలుస్తుంది, బయట ఉండి ఆడే తూనీగకు తెలుస్తుందా!.. గిరులలో కాక మావి చివురును తినక స్వరం ఎత్తుతుందా! కోకిల? గడ్డి పొదలలో ఆడుతుందా! నెమలి?

గూబ కళ్ళతో చూడలేక రవిని తిడుతుంది, కాకి కళ్ళతో చూడక శశిని తిడుతుంది.

చందనాన్ని కోసి రుద్ది తీస్తే నొప్పి అని సువాసన మానుతుందా? అంటూ పర్యావరణానుశీలనతో, తన ఆశయానికి గట్టి అంకురార్పణను కావించుకుంది.

తనువు నిండా భక్తి సాగరం నిండింది, మనసు పడవ అయింది. ఈ ప్రవాహాన్ని దాటించగా రమ్మని నావికుని శ్రీశైల మల్లికార్జునుని కోరింది.

ఆమె ప్రకృతి పరిశీలనముతో తన వాక్కులకు నిత్య ప్రతిభా కాంతిని అలమిందనడానికి అతి గొప్ప ఉదాహరణ “పట్టు పురుగు జిగురుతో ఇల్లు కట్టుకుని తన నూలు వలన – చుట్టుకుని మడియునట్లు; మనసు కోరికలన్నిటినీ – కోరి దహియించుకుపోయేమయా!నెమ్మనములో పేరాశలను రూపుమాపేసి,నీ వైపు త్రిప్పుకో, చెన్నమల్లేశా!” అన్న వచనం ప్రతి బ్రతుకునకొక నిర్వచనంగా అలరారింది.

నువ్వులలో దాగిన నూనెలా భావంలో దాగిన బ్రహ్మమై ఉన్న చెన్న మల్లికార్జునుని అంతు కనుగొనలేము అంటూ, సామాన్యమైన సంగతిని అసమానంగా విశేషం చేసింది.

“కొండమీద ఇల్లు కట్టుకుని

మృగములకు బెదిరితే ఎలా

సంతలో ఇల్లు కట్టుకుని

గోలకు వెరచిన ఎట్లయ్యా”

కష్ట ప్రయాణంలో నిర్భయత్వాన్ని చాటింది.

అక్క తనకు కలిగిన ఆపదలకు ముందుగానే సిద్ధ పడింది. “బండ కట్టుకుని సముద్రంలో మునిగితే కష్టాలకు కడ ఉంటుందా! తిన్న తరువాత ఆకలి వేస్తుందంటే తప్పంటాను” అనుకుంది.

వనమంతా నేవె ,వన,ము లోని దేవ తరువులన్ని నీవె

పగలు రేయి ఉదయం అస్తమయం అన్నీ అని నమ్మి బయలుదేరింది కనుక భూగోళం అనే కటిక చీకటిలో అద్దాన్ని చూడాలనుకుంది.

పేరులో ఆడదైనంత మాత్రాన లోటేమిటి? భావించి చూస్తే మగ రూపు! అని లింగ భేద నిరాససక్తతను తెలిపింది. చిక్కు పడిన చోట్ల ఏదన్నా ఒప్పు కోవాలి అన్నది.

వెయ్యి సంవత్సరాల నాడు అక్క మహాదేవి తపస్సు చేసిన కదళీవనం గుహలు ఆ శ్రీశైల మహాక్షేత్రంలో ఉన్న అద్భుత రమణీయ ప్రశాంత ఆధ్యాత్మిక దర్శనీయ స్థలాలలో ప్రముఖమైనవి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here