మహాకవి నీరజ్ జీవితంలో ప్రేమ సంబంధాలు

0
3

[box type=’note’ fontsize=’16’] “నీరజ్ జీవితం అంతా ప్రేమమయం. ఎటువంటి భేదభావం లేకుండా అందరికీ ఆయన తన మనస్సులో చోటు ఇచ్చారు. ప్రేమను పంచారు” అంటున్నారు డా. టి. సి. వసంత. [/box]

[dropcap]ఈ[/dropcap] వ్యాసాన్ని హిందీలో కాన్పూర్‌కి చెందిన ప్రముఖ కవయిత్రి, రచయిత్రి ‘సఫలతా సరోజ్’ వ్రాశారు. డా. టి. సి. వసంత తెలుగులోకి అనువదించారు.

1

సుఖంలో అందరూ స్నేహితులే, కష్టం వచ్చినపుడు ఒక్క స్నేహితుడూ లేడు. ప్రేమ దేవుడిచ్చిన వరదానం. ప్రకృతి ఇచ్చిన కానుక. దీని రీతి, ప్రీతి, ప్రతీతి అనుపమమైనది. మానవుడిలో ఎన్నో భావోద్వేగాలు ఉంటాయి. అందులో ముఖ్యమైనది ప్రేమ ఉద్వేగం. ఈ ప్రేమ ఉద్వేగం మనలని బయటి ప్రపంచంతో కలుపుతుంది. ఈ సంబంధం కలపడమంటే మన ఆత్మని విశ్వవ్యాప్తం చేసుకోవడమే. ఇది ఒక అన్వేషణ. ఈ అన్వేషణ సత్యం శివంతో ముడిపడి ఉంది. అందువలనే ఎంత విరోధం ఉన్నా, ఎన్ని తుఫానులు వచ్చినా ఎప్పుడు విజయం ప్రేమదే. ప్రేమే జయించింది. అమృతం ప్రేమకు మాత్రమే లభించింది.  అంటే అమృతతత్వమే ప్రేమ. ఈనాడు సమాజంలోని హింస, అత్యాచారాలు, అన్యాయాలు పేట్రేగిపోయాయి. మానవతా విలువలు మంటకలిసిపోతున్నాయి. ప్రేమ రాహిత్యమే దీనికి కారణం. కాని ఎప్పుడెప్పుడైతే లోకంలో ద్వేషం, శత్రుత్వం పెరిగిపోయాయో, ప్రపంచం యావత్తు బాంబుల దాడులతో అతలాకుతలం అయిందో, ఆ ఆ సమయంలో ఎవరో ఒకరు ప్రేమ ప్రవక్తలు అవతరించారు. రాముడు, కృష్ణుడు, క్రీస్తు… ఇంకా ఎందరో… శూన్యం నుండి శిఖరం దాకా ప్రయాణం చేసిన నీరజ్ దాకా. చరిత్ర దీనికి సాక్షి. మనస్సులను మనస్సులతో కలిపే ఒక అద్భుతమైన శక్తి నీరజ్‌లో ఉంది. మానవత్వం అనే శంఖారావాన్ని ఆయన పూరించారు.
కులమతాల కన్నా గొప్పది ధర్మం
ధర్మం కన్నా ఇంకా గొప్పది కర్మ
కర్మకాండ కన్నా ఇంకా గొప్పది మర్మం
కాని అన్నింటి కన్నా గొప్ప వామనుడైన మనిషే గొప్పవాడు.
మనిషి మనిషిని ప్రేమిస్తే ధార్తియే స్వర్గం అవుతుంది
(నీరజ్ రచనావళి)

నీరజ్ జీవితం అంతా ప్రేమమయం. ఎటువంటి భేదభావం లేకుండా అందరికీ ఆయన తన మనస్సులో చోటు ఇచ్చారు. ప్రేమను పంచారు. దీనికి కారణం ఆయన జీవిత సంఘర్షణ – ఆటుపోట్లు. మానస మరుభూమిలో ఏకఛత్ర రాజ్యం చేసే ఈ సమ్రాట్ ప్రేమించడమే కాదు, ప్రేమను ఇవ్వడం కూడా నేర్చుకున్నారు. ఆయన గీతాల స్వర లహరులలో జగత్తే ప్రేమమయం అయింది. అసలు ఎందరో వారి గీతాలను చదివి ప్రేమించడం నేర్చుకున్నారు. భావాల ఈ మహల్‌కి నమ్మకం అనే పునాదిపైన సంవేదనల ఇటుకలతో బలం చేకూర్చారు. భక్తి-శక్తుల ఈ ప్రాచీరాలని ఎవరూ కూల్చకూడదని నీరజ్ అనుకున్నారు. అందుకే నీరజ్ తన గీతాల ద్వారా ప్రేమను బలపరిచారు.

నీవు భయపడకు – ప్రేమించు
ప్రేమ ఎప్పుడు పవిత్రమైనదే
ప్రేమ మోహానికి మూలం
ప్రేమ కళ్ళకి మర్యాదా మన్ననలనిస్తుంది
ప్రేమ వలననే సంస్కారం వస్తుంది
ప్రేమ రహిత మానవుడు చరిత్రహీనుడు
(ప్రాణ్ గీత్)

ప్రేమ లేని జీవితాన్ని మరుభూమిగా ఎంచే నీరజ్ గీతం – ‘సుఖ్ కే సాథ్… సుఖంలో అందరూ స్నేహితులే – కష్టం వచ్చినప్పుడు ఒక్కడూ లేడు..’ నాకు ఎంతో నచ్చిన గీతం. కారణం ఏదైనా సరే, ఈ గీతాన్ని ఎన్నిసార్లు చదివినా అన్నిసార్లు నీరజ్ బాధని నేను అంతే అనుభవిస్తాను. ప్రేమ విషయంలో ఆయన మోసపోయారు. ఎందరో బాధపెట్టారు. అయినా ఆయన ఈ మోసాన్ని స్వీకరిస్తూ ఇది తన విజయం అని అంటారు. ఇది వారి జీవితంలోని చెరపలేని నిజం. కాని వీటన్నింటినీ మించి ఒక నిజం ఉంది. ఈ వ్యక్తి నా దృష్టిలో దీర్ఘమైన మౌనం కప్పుకున్న ఒక శిథిల మందిరంలాంటి వారు. దాని ధ్వని మందిరంలో వేలాడదీయబడే గంట లాంటిది. దాని స్వరలహరులలో అపారమైన శక్తి, ఆనందం, ఉల్లాసం ఒక నదియై బలమైన ఒరవడిలో నా అంతరాత్మలో నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. మోసం దగాలకి దూరంగా లోపలి ఉదాత్త ఎత్తులు అర్థం చేసుకోవడమే మానవత్వాన్ని అర్థం చేసుకోవడం. కాని బాధ ఏమిటంటే ఈ ప్రపంచంలోని అందరిని ఒక తాటి మీద నడిపించాలని తపన పడే నీరజ్‌కి ఏం లభించింది?

ఒక రోజు నిద్ర నుండి లేవగానే చూస్తే
నా నలువైపులా మోసకారుల గుంపు
ఒక గుంపు ఇటువైపు నుండి అయితే రెండో గుంపు అటువైపు నుండి
దోచుకుంటున్నాయి…
క్షణక్షణం నా జీవితపు ఘటం ఖాళీ అవుతోంది
అందరి కళ్ళు నా మూట మీదే
అది నాది… నాది… అని కొట్టుకుంటున్నారు
దొరికిన వాళ్ళందరు మానసచోరులే
కాని హృదయాన్ని దోచుకునే వాళ్ళు ఏ ఒక్కరూ లేరు.
(కావ్యాంజలి)

ఇదంతా అక్షరాలా నిజం. అవకాశవాదులు ఈ లోకంలో అందరూ ఆయన్ని దోచుకున్నారు. ఈ దాత గుమ్మం నుండి ఎప్పుడూ ఎవరు ఖాళీ చేతులతో వెళ్ళలేదు. కాని వారి నిజ జీవితంలో మాత్రం అంతా ఖాళీయే. అసలు ఎవరూ ఎప్పుడు ఈ విషయం గురించి ఆలోచించలేదు. చిన్నప్పుడు చేతిలో కాణీ లేదు. యౌవనంలో ప్రేమ రాహిత్యం… ఇప్పుడు.. ఇంత పెద్ద ఇంట్లో బావురుమంటున్న గోడల మధ్య ఒంటరిగా… ఒక చేతికర్ర సహాయంతో జర్జర ముసలితనపు బరువును మోస్తున్న నీరజ్… తనవాళ్ళ మధ్య ఉన్నా ఒంటరితనం… పేరు ప్రతిష్ఠలు, ఆస్తిపాస్తులు (పద్మశ్రీ, పద్మభూషణ్, విశ్వవిద్యాలయానికి….) అన్నీ ఉన్నా  జీవితం అంతా శూన్యం. ఆరోపణలు, ప్రత్యారోపణల దెబ్బలతో గాయపడ్డ తన స్వయంని అర్థం చేసుకోవడం కంటే అసలు అర్థం చేసుకోలేకపోవడం… ఇంకా ఇంకా ప్రేమ కోసం తపన పడే వృద్ధుడైన నీరజ్ కళ్ళల్లో ఏదో వెలితి… ప్రేమ – మమతల కోసం ఈ క్షణం కూడా ఎదురుచూపులు… ఇదీ ఆయన జీవితం.

2

చాంద్ నాకు తల్లితో సమానం.

ఈరోజు దాకా, నేనేమిటి చాలామంది నీరజ్ కాన్‌పూర్ వాసి అయిన డా. చాంద్ కుమారిని ప్రేమించారు అని అనుకుంటారు. ‘చాంద్’ అనే శబ్దం ఆయన గీతాలలో ఎన్నోసార్లు వచ్చింది. ఎన్నోసార్లు అసంతృప్తి వెల్లడయింది. ప్రపంచమంతా ప్రసిద్ధి చెందిన ఆయన గీతం “కారవాఁ గుజర్ గయా, గుబార్ దేఖ్‌తే రహే! … (బిడారు కదిలింది ఎడారిని చూస్తూ నిలుచుండి పోయా), ఇంకా కొన్ని గీతాలు ఈ ప్రేమ గర్భం నుండే పుట్టాయి అన్న నా ఆలోచన తప్పు అని వారు చెప్పిన అసలు సత్యం గురించి తెలుసుకున్నాక నాకు తెలిసింది. “చాంద్, ఆమె భర్త డా. కిషన్ ఇద్దరూ నన్ను ఎంతగానో ప్రేమించారు. చాంద్‌ని నేను వదినా అని పిలిచేవాడిని. ఆమె వయసులో నాకన్నా పెద్దది. నా కష్టకాలంలో వాళ్ళు నన్ను ఎంతో ఆదరించారు. అక్కున చేర్చుకున్నారు. ఒకరోజు నేను డా. కిషన్‌తో అన్నాను – మీ ఋణం తీర్చుకోడానికి నాకు ఏ ఆస్తిపాస్తులు లేవు. మీరిద్దరూ నాకు ప్రేమను పంచారు. కాని నేను మీకు ఏమీ ఇవ్వలేకపోయాను. కాని నా పుస్తకాన్ని మీకు అంకితం చేయాలనుకుంటాను- అని. డా. కిషన్ తన భార్య చాంద్‌ని ఎంతగానో ప్రేమించారు. వారిది ప్రేమ పెళ్ళి. అందువల్ల చాంద్‌కే అంకితం చేయమని అన్నారు. చాంద్ ఒక ఫోటో ఇచ్చింది. ఆమె ఎంతో అందంగా ఉంటుంది. ఆ ఫోటో ‘విభావరి’లో వేయించాను. అప్పుడు అందరూ నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. మా ఇద్దరి మధ్య సంబంధాన్ని అంటగట్టారు. అసలు నాకు ఆవిడకూ వీళ్ళనుకుంటున్న సంబంధం లేదు. అసలు ఆవిడ నాకు తల్లితో సమానం.

3

కొన్ని కలలు కల్లలయినా జీవితం చచ్చిపోదు.

(తొలి ప్రేమ ఎప్పుడూ పొందలేకపోయాను)
తరువాత వారు నాకు చెప్పిన సంగతులివి -జీవితంలో మొట్టమొదట ‘యశోద’ అనే అమ్మాయి ప్రవేశించింది. ఆ సమయంలో మా నాన్న చనిపోవడం వలన తల్లికి దూరంగా మా మామయ్య హర్‌దయాళ్ (వారు లాయర్) ఇంట్లో ఏటాలో ఉండేవాడిని. యశోద మృదుస్వభావం కలది, సంస్కారవంతురాలు. ఆమె అంటే నాకెంతో ఇష్టం. ఆమెను పెళ్ళి చేసుకోవాలనుకున్నాను. కాని ఆమె తండ్రి నేను బీదవాడినని ఒప్పుకోలేదు. ఆమె పెళ్ళి వేరొకరితో అయింది. నా కలల పల్లకీని దోచుకుంటుంటే నేను చూస్తూ నిల్చుండిపోయాను. అంతకంటే ఏం చేయగలను? అప్పుడప్పుడు నా  బీదతనం చూసి రోదించేవాడిని. అప్పుడప్పుడు నా దురదృష్టం చూసి. కాని కొన్ని కలలు కల్లలయినా జీవితం చచ్చిపోదు. ఏది జరగాలో అదే జరిగింది. ఇప్పుడు ఆమె పరాయిది. అసలు ఆమె గురించి ఆలోచించడమే మహా పాపం. కాని విధి ఆడే ఆట చూడు – ఏడెనిమిది సంవత్సరాల క్రితం నేను ఉరియాకి ఒక ప్రోగ్రాం సందర్బంగా వెళ్ళాను. ‘ఉరియా’లో యశోద ఉంటుందని ఎవరో చెప్పారు. తను బతికి ఉందో లేదో తెలియదు. ఒక్కసారి ఆమెను చూడాలనుకున్నా. ఎంతగానో వెతికాను. ఆమె ఇంటికి వెళ్లాను. ఆమె ఇంటి పరిస్థితి, ఆమె జీవితాన్ని చూసి ఎంతో బాధపడ్డాను. చేతికి గాజులు లేవు, నుదుటిన బొట్టు లేదు. మాసిపోయి, వెలిసిపోయిన చీర కట్టుకుని ఉంది. సంకోచంగా ఆమె నన్ను కూర్చోమని ఒక చాప పరిచింది. నేను స్తబ్దుగా ఉండిపోయాను. జీవిత బాటలో ఒకవేళ ఆమె ఈ పరిస్థితిలో కలిసి ఉంటే నేను గుర్తు కూడా పట్టేవాడిని కానేమో? వచ్చే ముందు ఆమె ఎంత వారించినా ఆమె చేతిలో 5000 రూపాయలు పెట్టాను. కాని ఆమె నాతో వ్యవహరించిన తీరు – నవ్వుతూ ఒక సోదరుడి పట్ల ప్రవర్తించే తీరులో… అంతే అట్లా జరిగిపోయింది.

4

బతుకు, జీవితం అంతా వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది

(‘నీరజ్’ని ఒక ‘గీత్‌కార్’గా చేసిన ఆ మహిళ)
ఎందరో మహిళలతో నీరజ్ ప్రేమ సంబంధాల గురించి అంతో ఇంతో అందరికీ తెలుసు. కాని ఆయన ఎన్నో సంవత్సరాలు తన మనసులో ఒక మహిళను ఆరాధించారు. ఆమె గుజారాతీ రచయిత్రి, సమాజ సేవిక అయిన కుందనికా కపాడియా. కొన్ని రోజుల క్రిందట ‘అమర్ ఉజాలా’లో ఆమె ఆర్టికల్ ఒకటి ప్రచురితం అయింది. నేను నీరజ్ బాబాకి ఫోన్ చేసి కుందన్ కపాడియా ఆర్టికల్ చూశారా అని అడిగాను. తను చూడలేదని వారు చెప్పారు. రెండు నిమిషాల తరువాత ఫోన్ చేసి ఫోటో కూడా వుందా అని అడిగారు. మళ్ళీ రెండు నిమిషాల తరువాత ఫోన్ వచ్చింది. జుట్టు నల్లగా ఉందా? లేకపోతే నా జుట్టు లాగా తెల్లపడ్డాయా? అన్నారు. నేను అచ్చం మీలానే అని చెప్పాను. మళ్ళీ ఫోన్ వచ్చింది. మీరు మాటి మాటికి ఫోన్ చేస్తున్నారు, “నాకు మీ మాట స్పష్టంగా తెలియడం లేదు. బహాదూర్ భయ్యాని మాట్లాడమని చెప్పండి” అన్నాను. బాబా ఏదో చెబుతూనే ఉన్నారు. కాని అంతగా ఏమీ అర్థం కాలేదు. ఫోన్ కట్ అయింది. మళ్ళీ మరోసారి పది నిమిషాల తర్వాత ఫోన్ వచ్చింది. “పేపరు తెప్పించాను. కాని అందులొ ఎక్కడ వుందో తెలియలేదు” అన్నారు. “ఆగండి నేను పేపరు తెస్తాను, చూసి చెబుతాను” అని చెప్పాను. మళ్ళీ రెండు నిమిషాల తర్వాత ఫోన్ వచ్చింది. నేను మనోరంజన్ మండే లో వెతుకున్నాను. అందులో ఉంది. నేను నవ్వుతూ అన్నాను – “అభియాన్‌లో ఉంది”. నేను చెప్పగానే ఫోను కట్ అయింది.
మరో సంఘటన – ఈ మధ్య నేను మైత్రేయి పుష్ప మీద ఒక ప్రత్యేక సంచిక తీసుకువచ్చాను. దానిని ఆవిష్కరించాక నేను బాబాని కలవడానికి ఆలీగఢ్ వెళ్ళాను. నేను ఇంటర్‌నెట్ ద్వారా కుందనిక ఫోటోలు కొన్ని నా మొబైల్‌లో డౌన్‌‌లోడ్ చేసుకున్నాను. బాబాకి చూపెట్టాను. కొంచెం సేపు అయ్యాకా అన్నారు – “నేను ఈమెను చూడను, పన్నెండేళ్ళ ప్రేమను ఒక్క క్షణంలో మరిచిపోయింది.” మళ్ళీ అన్నారు, “పెద్ద బొట్టున్న ఆ ఫోటో చూపించు”. “ఇప్పుడే అన్నారు చూడనని?” అన్నాను. మళ్ళీ అడిగారు. మళ్ళీ మళ్ళీ అడిగారు. నాలుగు గంటలలో ఆ ఫోటోను బాబా నలభైసార్లు చూశారు.
అక్కడి నుండి వెనక్కి వచ్చేడప్పుడు ఆలోచనలో పడ్డాను – నిజానికి ఎన్ని సంబంధాలు ఉండనీ, ఎందరితోనైనా ఉండనీ కాని నిజమైన ప్రేమ చచ్చిపోదు. ఆ ప్రేమ నీరజ్ గీతాలకు ఒక కొత్త మలుపు, కొత్త ఆలోచన, కొత్త దిశ ఇచ్చింది. నీరజ్ ‘విభావరి’ అంకితంలో రాశారు – “కలియన్ లాగ నీవు నా నుండి దూరం అయ్యావు, జ్ఞాపకం అయి వచ్చావు.. ఉచ్ఛ్వాసమై వెళ్ళిపోయావు, కాని నీవు ఏనాడో ఒకనాడు రాగాల రథం పైన వస్తావు, ఆ రోజు కోసం నిరీక్షిస్తూ స్మృతిపథంలో ఈ గీతాల నిధిని వెదజల్లుతూ వెళ్తున్నాను.”
నీరజ్ ఎన్నో గీతాలు – యహ్ ప్యార్ న హోగా కమ్, జబ్ న తుమ్ హీ ఇస్ సంసార్ మే, ముఝే న కరనా యాద్ తుమ్‌హారా, తుమ్‍హారా బినా ఆరతీ కా యహ్ దియా, ఇస్ తరహ్ తమ్ హువా సాంస్ కా యహ్ సఫర్, నిరాకార్ జబ్ తుమే దియా ఆకార్, ఏక్ తేరా బినా ప్రాణ్ ఓ ప్రాణ్ కా సాంస్ సిసక్‌తే ఉమ్ర్ భర్, జిస్ దిన్ యాద్ న ఆయీ పాత్ తక్ న పఠాయి, చల్‌తే… చల్‌తే షామ్ హోగయీ, ముఝె తుమ్ భూల్ జానా, జబ్ సునా సునా లగే జీవన్ అపనా….
ఎన్నో వేల గీతాలు… ‘నీరజ్ కీ పాతీ’లో కూడా చాలా గీతాలు – పహలే రోజు మిలా కర్‍తీ థీ తుమ్ చుప్ చుప్ కర్, ఆజ్  హై యహ్ హాల్‍ కి ఖత్ సే ములకాత్ నహీఁ, ఆజ్ హై తేరా జనమ్ దిన్ తేరీ ఫూల్ బగియా మే, ప్యార్ కర్ కే నిభానా హి న థా గర్ తుమ్ కో జిన్ మే…
‘య’, ‘నీ’, ‘క’, ‘జ’ వర్ణాల ద్వారా సంబోధన చేయబడిందో, అది కుందనికా కపాడియాకి అంకితం.
ఈనాటికి ఏ రహస్యం అయితే ఎవరికీ తెలియదో, ఆ కాలంలో నెహ్రూనగర్ పోస్టుమ్యాన్ దానిని గురించి చెప్పగలుగుతాడు.

గీతాలు నేను ఎందుకు రాస్తానో ఆ రహస్యం నీకు
నెహ్రూనగర్ పోస్టుమ్యాన్  చెప్పగలుగుతాడు.
నా కళ్ళ మీద ఏ కన్నీటి పొరలైతే ఉన్నాయో
వాటిని ఒక ప్రియురాలే తొలగించగలుగుతుంది.
(కాన్‌పూర్ కే నామ్ పాతీ)

ఒకటే భావం, ఒకటే ఆలోచన సూత్రంలో గుచ్చబడిన ఒకే భాగంలో ఎగిరే ఈ ప్రేమ, అంతఃకరణ లోని ఉచ్ఛ స్థాయి ప్రవృత్తులను మెరుగుపెట్టిందో, వికాసానికి కారణం అయ్యిందో, ఆ ప్రేమ ఆయన గీతాలకు శక్తి అయింది. ఇది కేవలం క్షణికమైన ఉద్రేకపు ఉప్పెన ఎంత మాత్రం కాదు, కలుషితమైన ప్రేమ కాదు. శృంగారం కానే కాదు. ఆ ప్రేమ స్థూలంగా, శారీరికంగా కొంతగా అయి ఉండి కూడా భావాత్మకమే అంతా. దీని ఉత్పత్తి శరీరం నుండి కావచ్చు కాని పూర్తిగా మానసికమే, ఉదాత్త ప్రేమయే. స్పటికం లాంటిదే. కుందనిక మనసులో లేకపోయినా నీరజ్ ఆత్మలో మాత్రం కుందనికే నిండి ఉంది.

నీవు గుర్తుకు రాగానే
నేను నా చిత్రాన్ని గుండెలకు హత్తుకుంటాను.

నీరజ్ గీతాలన్నింటిలోనూ కృత్రిమత ఎక్కడా లేదు. అంతా అనుభూతియే. ఇదంతా సత్యం. కేవలం కామం కానే కాదు, ఆత్మను చైతన్యపరిచే ఆత్మప్రకాశం ఉంది. అంతటా వెలుగునిచ్చే కణాలే. కేవలం శారీరక వాంఛ కానే కాదు. చైతన్యంతో కూడిన రసజ్ఞ సంగీతం ఉంది. అందులో ఆత్మచైతన్యం కనిపిస్తుంది. ఇందులో స్ఫూర్తిమయ భావ విస్ఫోటన ఉంది. పరిష్కృత అస్తిత్వ ప్రకాశాస్నాత మర్మాచ్ఛావాసం కూడా ఉంది. అందులో కవి ప్రగాఢ ప్రేమ, నిస్వార్థ ఉదాత్తమైన ప్రేమ ఔన్నత్యం శబ్ద సాధన కనిపిస్తాయి.
ఇప్పుడు నేను వారి కావ్య సౌందర్యాన్ని మాత్రమే చెప్పడం లేదు. ఆయన ఏ అమ్మాయిని అయితే ప్రేమించారో, ఆ అమ్మాయి పట్ల ప్రవర్తించిన తీరులో కొత్త తప్పు ఉందని ఇప్పటికీ బాధ పడుతున్నారనీ, ఆమె కనిపిస్తే కాళ్ళకు దండం పెట్టి క్షమార్పణ అడగాలని ఆయన కోరుకుంటున్నారని నాకు తెలుసు. ఇదే ఆయన చేసుకునే ప్రాయశ్చిత్తం. ముక్తికి ఆధారం. నేను ఇంతకు ముందే చెప్పాను. నా సమయమే వారితో ఎంతగానో ముడిపడి ఉందని. వారి ఈ కోరిక నెరవేరడానికి నేను కుందనిక కోసం అన్ని చోట్లా వెతికాను, భక్తితో, శ్రద్ధతో, ప్రేమతో వెతికాను. ఆకాశ పాతాళాలు ఏకం చేశాను. ఈ అన్వేషణలో నాకు శ్రీ విజయ్ బహాదుర్ సింహ్, సోమ్ ఎంతో సహాయపడ్డారు. అయినా మేము సఫలీకృతులం కాలేకపోతున్నాం. ఇంతలో నవనీత్ (ముంబయి నుండి వెలువడే పత్రిక) నుండి ఫోన్ వచ్చింది. కాని కొన్ని కారణాల వల్ల నేను ఫోన్ ఎత్తలేకపోయాను. రెండో రోజు ఫోన్ చేస్తే హింది కార్యాలయం బంద్ ఉంది, కాని అనుకోకుండా గుజరాత్ కార్యాలయానికి ఫోన్ కనెక్ట్ అయ్యింది. ‘దీపక్ దోషి’ సంపాదకుడు. అసలు ఏం మాట్లాడాలో తోచలేదు. అప్పుడు కుందనిక పేరు గుర్తుకు వచ్చింది. అసలు నీరజ్ కాన్‌పూర్ వచ్చినప్పుడు “మీరు ఒకరితో మాట్లాడాలి” అన్నాను. “ఎవరితో?” అని ఆయన అడిగారు. “నేను చెప్పను” అని నేనన్నాను. అయినా నా పట్టుదల గురించి ఆయనకు తెలుసు.  ఆయన సరేనని అన్నారు. నేను ఫోన్ కలిపి ఇచ్చాను. అసలు లేచి కూర్చోలేని స్థితిలో ఉన్న ఆయన ఒక్క ఉదుటన లేచి కుర్చున్నారు. వారి కంఠంలో మూలుగు బదులు ఎంతో శక్తి కనిపించింది. ఆయన మానస ప్రేమ ఉప్పొంగింది. ఉద్వేగంతో అన్నారు – “కుందన్! అరె కుందన్! నా కుందన్! నీవు ఎక్కడ ఉన్నావు? నీ కోసం ఎంత వెతికానో తెలుసా? నేను అన్న మాటలకు నిన్ను క్షమాపణ అడగుతున్నాను. నన్ను క్షమించు కుందన్”. అటువైపు నుంచి కుందన్ కంఠం వినిపిస్తోంది. కంఠంలో అస్పష్టత ఉంది. స్వరం చిన్నగా వినిపించింది – దాదాపు 50 సంవత్సరాల తరువాత.
ఆ రోజు నీరజ్ ఒక చిన్నపిల్లవాడిలా కనిపించారు. నిర్మలత్వం, అమాయకత్వం ఆ ముఖంలో కనిపించాయి. చాలా కాలం క్రితం వారి ఒక కవితను చదివాను – ప్రేమించిన వారి గుర్తులను నేను మనస్సులో – తులసి పూజల్లో సాయంత్రం వెలిగే సౌభాగ్యవతి దీపంలా నిలుపుకున్నాను. ఆయన ఎవరికి మోసం చేయరు, చేయలేరు అని నాకనిపించింది. ఎవరినీ మరిచిపోరు. సంబంధాలని నిలబెట్టాలంటే ఆయన దగ్గర నుండే నేర్చుకోవాలి. ఆ రోజు వారి పట్ల నాకున్న శ్రద్ధ – భక్తితో కూడిన ఆసక్తిగా మారింది. అసలు వారు ఎంతో ఆనందంతో ఉప్పొంగిపోయారో అంతకంటే వంద రెట్లు ఆనందం నాకు కలిగింది. రాత్రంతా వారి అమాయకమైన మొహం నా కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది. ఎవరంటారు ఆయన చరిత్రహీనుడని? ఒకవేళ చరిత్రహీనులకి నిర్వచనం ఇదే అయితే ప్రపంచంలో ప్రతీ వ్యక్తీ చరిత్రహీనుడైతే… కనీసం మానవత్వం ఈ భూమి మీద నిలుస్తుంది. మానవత్వం మంటల్లో కలిసిపోదు. నీరజ్‌కి కుందన్‌తో పరిచయం 1953లో బొంబయిలోని నవగ్రహ కార్యాలయంలో అయింది. అక్కడ ఆయన కవితా పఠనం కోసం వెళ్ళారు. కుందన్ కూడా అక్కడికి వెళ్ళింది. మొదటి వరుసులో కూర్చున్న ఆమె ‘మృత్యుగీతం’ విని ఎంతగానో ఏడ్చింది. ‘లిఖ్ లిఖ్ భేజత్ పాతీ’ లో నీరజ్ రాసారు –

నిన్ను గుర్తు పడతానో పట్టనో అని రాసావు.
నా పరిచయం మరిచిపో అన్నావు కాని
అసలు ఈ  హృదయంలో ఒక్క శ్వాస అయినా
ఆ బాధతో నిండనిదంటూ లేనే లేదు.
నాకు గుర్తు ఉంది. ‘మృత్యుగీత్’ విన్నాక
నీ కళ్ళల్లో కమ్ముకున్న ఆ మబ్బు తునక
గులాబీ రెక్కల మీద కూర్చుని
మంచు సూర్యుడిని
చూడడానికి బయలుదేరిందా?
(కాన్‍పూర్ కే నామ్ పాతీ – అజనబీ దోస్త్ సే)

ప్రకృతిలో నడిచే సమస్త జీవన చక్రపు ప్రగతికి వెనకాల ఒక మూల శక్తి నిరంతరంగా పనిచేస్తుందని చదివాను, విన్నాను. ఆ శక్తే ఆకర్షణ శక్తి. నది సాగరాన్ని కలవడానికి ఎందుకు వెళ్తుంది? చకోరం చంద్రుడినే ఎందుకు చూస్తుంది? లోహం చుంబకం వైపే ఎందుకు ఆకర్షితురాలవుతుంది? నీరజ్ చదివే రీతుల్లోనా లేక ఆయనలో ఉన్న అందమా? ఆకర్ష వ్యక్తిత్వమా! లేక ఇంకా మరేదైనానా? ఏది కుందన్‌ని నీరజ్ వైపు ఆకర్షితురాలైటట్టు చేసింది? అభిమానం క్షయం అవుతూ ఆత్మశక్తి విలీకరణ కూడా అయింది.
కుందన్ నీరజ్ పేరు మీద రాసిన కొన్ని ఉత్తరాలలోని కొన్ని అంశలు –

  1. కవి మనం ఏ గమ్యం వైపు నడుస్తున్నాం.. రాత్రుల రాజకుమారుడిగా, నిద్ర శృంగారంగా మార్చే ఆ కల ఏమిటి? మన మనసు-శరీరాలు, ప్రాణాల దాహాన్ని తీర్చే, మనం పొందాలనుకునే ఆ బిందువు ఏది?
  2. మనం కేవలం ప్రేమించడం కాదు, ప్రేమ ద్వారా జీవితంలో కొత్త అర్థాన్ని, కొత్త సత్యాన్ని, కొత్త సౌందర్యాన్ని, కొత్త తత్వాన్ని పొందుతున్నాం. నీవు అనునిత్యం నా ఆత్మను ఇంకా ఉజ్వలంగా చేస్తున్నావని నాకు అనిపిస్తోంది.
  3. ఒక ఆత్మ మరో ఆత్మను గుర్తు పట్టింది. నేను ప్రేమించాను. నాతో ఉన్న రిక్తతను నింపడానికి కాదు, పూర్ణత్వానికి పవిత్రత ఇవ్వడానికే నిన్ను ప్రేమించాను.
  4. నీవు నా శక్తివి, చేయూతవు, నమ్మకానివి, ప్రకాశ స్వరుపానివి. ‘లిఖ్ లిఖ్ భేజత్ పాతీ’ చదివేటప్పుడు ఈ ప్రేమ కేవలం ఒక ఆకర్షణ మాత్రమే అని ఎంత మాత్రం అనిపించలేదు. బహుశా ఆకర్షణ ప్రేమ సౌందర్యం యొక్క మౌలికమైన మహత్వపూర్ణమైన ఉపాదానం. కాని వస్తువు బాహ్యరూపంపైన ఆకర్షణ కలుగుతుంది. ప్రేమ అంతర్గతమైన భావన, హృదయపు లోతుల్లో ఉంటుంది. వ్యక్తిగత ప్రణయ భావన నిరూపణకి పూర్వాభాస అని కూడా అనుకోవచ్చు. కాని దీని ప్రస్థానం ఆధ్యాత్మిక ప్రేమ విశ్వప్రేమ వైపే. ఇది సత్యం.

ఈ లేఖలు చాలా రోజులు ఇద్దరి మధ్య నడిచాయి అని నీరజ్ చెప్పారు. “ఆవిడ రాసిన ఉత్తరాలు సురక్షితంగా నా పెట్టెలో ఉన్నాయి. కొన్ని ఉత్తరాల సంకలనం వచ్చింది. వాటిలో గొప్పదైన తత్వం ఉంది. కాని కొన్ని ఉత్తరాలు… నేను వాటిని నా నిజ సంపత్తిగా అనుకుంటాను. వాటిలో నా ప్రేమ సుగంధం ఉంది. నా చివరి ఊపిరి వరకు నేను వాటిని సంరక్షిస్తూనే ఉంటాను. ఆమె గుర్తుకు వచ్చినప్పుడల్లా ఆ ఉత్తరాలను గుండెలకు హత్తుకుంటాను. వాటితోనే మాట్లాడుకుంటాను. ఆమె ప్రతి రోజు ఒక ఉత్తరం రాసేది. నేను ఆ ఉత్తరాల కోసం పరితపించేవాడిని, ఎదురుచూసేవాడిని – లిఖే జో ఖత్ తుఝె వో తేరీ యాద్ మే, ఫూలోంకి రంగ్ సే దిల్ కీ కలమ్ సే తుఝ్‌కో లిఖీ రోజ్ పాతీ, ఆమె కోసమే రాసాను. ప్రేమ ఇంకా… ఇంకా పెరిగింది. వంద రెట్లయింది. స్పర్శించని, చూడని, చెప్పని ఒక భావుకత నాకు శాంతి లేకుండా చేసింది. నిలువ నీడ లేకుండా చేసింది. ఆమె నీరజ్ నీవు రావా? అని రాస్తూ ఉండేది. నీవు వస్తావని నా నమ్మకం. ఆలస్యం కావచ్చు కాని హృదయ ఆవేదనను తెలుసుకోకుండా ఉండలేం. మనసు స్వరాన్ని వినకుండా ఉండలేం. 1954లో నేను ఆమెను కలవడానికి బొంబాయికి వెళ్ళాను. మొట్టమొదటిసారి చూసాను. చూడడానికి మాములుగా ఉంది. కాని తెలివితేటలకు నేనెంతో ప్రభావితుడయ్యాను. రూపలావణ్యం నాకు నగణ్యమే. నేను మానసికంగా ఆమెకు ఎంతో దగ్గరయ్యాను. నన్ను ఆమె సముద్రపు ఒడ్డుకు తీసుకువెళ్ళింది. ఒడ్డు దగ్గరి ఇసుకపైన స్నిగ్ధ అలలతో ఆడుకుంటూ, గుంపుల మధ్యలో మొదటిసారిగా –

రెండు గులాబీ పూలను నా పెదవులు స్పర్శించినప్పటి నుండీ
మనసులో సుగంధం నిండిపోయింది, జగత్తంతా మధువనంలా అనిపించింది
(నీరజ్ కే ప్రేమ్ గీత్)

తర్వాత మేం ఇద్దరం తరచుగా కలుస్తూ ఉండేవాళ్ళం. ఆమె బొంబాయిలో ఒక ఫ్లాట్ తీసుకుంది. ఈ ప్రేమ గ్రాహిస్తకమైనది కాదు. సమాజ మర్యాద కూడా కాదు. అసలు సమాజపు ఈ మర్యాద – మన్ననలో అంతా బోలుతనమే ఉంది. నేనెప్పుడు ఈ ముసుగు వేసుకోలేదు. నా ప్రేమ మానసికమైనది, శారీరకమైనది అయినా ఈ దగ్గరితనంలో కామ దుర్గంధం లేదు. ఉన్నతమైన ఆత్మసమర్పణ ఉంది. నేను ఆమెతో ఎన్నో నగరాలకు వెళ్ళాను. ఆత్మీయంగా ఉండేవాళ్ళం. నేను ఏ ప్రేమ కోసం అయితే లోకాన్ని ఎదిరించడానికి సిద్ధంగా ఉన్నానో ఆమె ఆ ప్రేమను దాచిపెట్టుకునేది. పెళ్ళి చేసుకునే ధైర్యం ఆమెలో లేదు. ఆమెతో నేను కలిసినప్పుడు నేను ఉన్నతమైన స్థానంలో ఉన్నాను. పేరు ప్రతిష్ఠలు సంపాదించాను. ఆ రోజుల్లో వేలమంది ఆడపిల్లలు నన్ను కోరుకునేవారు. నేనే అనుకుంటే ఆమెను వదిలేసే వాడిని. కాని నేను అట్లా చేయలేదు. పెళ్ళి చేసుకుందాం అన్నాను. కాని ఆమె ససేమిరా ఒప్పుకోలేదు. సావిత్రి (నా భార్య) అధికారాన్ని తను లాక్కోదని చెప్పింది. అసలు విషయం ఏమిటో తెలియదు కాని ఆమె నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. నేను దాదాపు రెండు సంవత్సరాలు పిచ్చివాడినై తిరిగాను. ఆమెను వెతికాను. ఆమె ఏ ట్రైన్‌లో వస్తూ పోతూ ఉంటుందో ఆ ట్రైన్ వెనక పరిగెత్తేవాడిని. మేమిద్దరం కలిసి వెళ్ళిన చోట్లల్లా కళ్ళల్లో వత్తులు వేసుకుని వెతికేవాడిని. గంటలు, రోజులు, నెలలు ఎదురు చూసేవాడిని. దాదాపు 12 సంవత్సరాల తరువాత ఆమెకు పెళ్ళి అయ్యిందన్న సంగతి తెలిసింది.”

మనం ఎప్పుడైనా జివన పథంలో కలిస్తే
నేను కన్నీళ్ళతో, నీవు నవ్వులతో
నా వైపు ఒక్క క్షణం మాత్రం చూడు
ఎందుకంటే నా గమ్యం నీవే
అసలు బతికేదే నీ కోసం
మరచి పోగలిగితే మరచిపో.
(నీరజ్ కే ప్రేమ్ గీత్)

నీరజ్ చెప్పిన ఈ మాటలన్నీ విన్నాక నేనెంతో ఆలోచించాను. కుందనిక నిజంగానే ప్రేమించింది. లేకపోతే ఇది వయస్సు వలన కలిగిన ఆకర్షణా? యవ్వనం పురి విప్పిందా? ఇక్కడ కుందనిక నీరజ్‌కు రాసిన ప్రేమలేఖలలోని కొన్ని అంశాలను చెబుతాను.

  1. నేను పశ్చాత్తాపపడటం తప్పంటాను.
  2. ఒకవేళ మనం ఎక్కడైనా కలిసినా, మనం ఎక్కువ రోజులు కలిసి ఉండే పరిస్థితే లేదు.
  3. నీవు వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలి, నేను వెళ్ళిపోవాలి. దారి మనలని పిలుస్తోంది. పెడచెవిన పెట్టలేం కదా!

నేను ఈ ఆర్టిక‌ల్‍ని ఒక మంచి అందమైన మలుపుతో ముగిద్దామనుకున్నాను. కాని ఇంతలో కుందన్ ఫోను వచ్చింది. ఆమెకి నీరజ్ పట్ల కోపంగా ఉంది అని చెప్పింది. నీరజ్ ఏ లేఖలనైతే బయటపెట్టారో (సంకలనం – లిఖ్ లిఖ్ భేజత్ పాతీ), ఒకవేళ ఆయన ఇట్లు చేసినందుకు పశ్చాత్తాపపడితే, ఆ సంకలనంలో తను ప్రేమించిన ఆ అమ్మాయి చనిపోయిందని రాయాలి అని అన్నది. ఈ లేఖలన్నీ వ్రాసి ఇప్పుడు కోపం ఎందుకు? ఈ సంకలనం చూసి ఆనాడు ఆమె ఎంతో సంతోషపడ్డది అనీ, సంకలనం ఇది రెండో ముద్రణ అని నీరజ్ అన్నారు. రెండో రోజు ఆవిడ మళ్ళీ నాతో మాట్లాడింది. నీరజ్ పట్ల ఆమె అపరాధం చేసింది అన్న భావన నాలో ఉంది – “నీ కంఠం మా అమ్మాయి కంఠంలా ఉంది. నీవు చిన్నదానివి. నా మాటలను అర్థం చేసుకోగలుగుతున్నావో లేదో మరి తెలియదు. ప్రేమే జీవితం కాదు. యథార్థమైన భూమిపైన నా ఊహలన్నీ చెల్లాచెదురయ్యాయి. గమ్యం లేని జీవితాన్ని నేను జీవిస్తున్నాను. నీరజ్ నా వాడై కూడా నా వాడు కాదు. ఎదురు చూడడం, గుచ్చిపొడిచే మనుషుల చూపులు, ఒంటరితనం… నీరజ్‌ని నేను పోగొట్టుకోదలచుకోలేదు  కాని నేను ప్రేమించిన నీరజ్ వేరు, ఈయన వేరు (ఇంకా ఆవిడ అన్న మాటలను బయటపెట్టదలచుకోలేదు). మరి కుందనికా మీరే – పరాయివాళ్ళ కోసం బలిదానం చేయడం మీలోని గొప్ప గుణం అని అన్నారు కదా! నా ఊహలకి నీవు దుఃఖం కలిగించినా నేను నా దుఃఖాన్ని మరచిపోతాను అని అన్నారు కదా! మరి చావు అనే మాట ప్రాయశ్చిత్తం అంతిమ దశ అని ఎట్లా అంటారు? ఆయన మిమ్మల్ని మరచిపోవాలని మాటిమాటికి ఎందుకంటారు? సమయంతో పాటు ఆయన ప్రేమ చనిపోనప్పుడు నీరజ్ మిమ్మల్ని మరచిపోవాలని ఎట్లా అనుకుంటారు?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here