మహామౌనం – మహత్కావ్యం

2
6

[box type=’note’ fontsize=’16’] “మౌనంగా జ్ఞాన బోధ చేసిన దక్షిణామూర్తి కవిలేఖిని నుండి ప్రసరింపజేసిన జ్ఞాన జ్యోత్స్న ఈ కావ్యం” అంటూ ‘మహామౌనం’ పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు డా తుమ్మలపల్లి వాణీకుమారి. [/box]

[dropcap]ఆ[/dropcap]చార్య ముదిగొండ వీరభద్రయ్య గారు తెలుగు సాహిత్యరంగంలో సుప్రసిద్ధులు; లబ్ధ ప్రతిష్ఠులు. తన అధ్యాపకత్వంతో ఎంతో మంది శిష్యులను తీర్చిదిద్దిన ఆచార్యులు; గొప్ప వైణికులు; కావ్య శాస్త్రకోవిదులు. ఆధ్యాత్మిక సాధకులు. పుట్టపర్తిలో శ్రీసాయి సన్నిధిలో అంతర్ముఖులై ఉన్న వీరి అంతరంగం అక్షరరూపం దాల్చిన మహత్కావ్యం ‘మహామౌనం’. పుస్తకం ముఖచిత్రం నుండి చివరనున్న కావ్యకర్త ఛాయాచిత్రం వరకు అద్భుతంగా అనిపిస్తుంది. ఆచార్య వీరభద్రయ్య గారు తమ అనుభవసారాన్నంతా, ఆధ్యాత్మిక సాధననంతా దీనిలో పొందుపరిచారు. ముందుగా అద్భుతమైన ముఖచిత్రాన్ని గురించి వీరభద్రయ్య గారు స్వయంగానే చెప్పారు. “వటవృక్షం దక్షిణామూర్తి నెలవు” “అరుణాచలేశ్వరుడు సిద్ధునిగా తన రూపు తాను చూచుకొనే గిరిపై నెలకొన్న జ్ఞానవృక్షం “జ్ఞానజ్యోతిని చల్లగా హాయిగా ప్రసరించే శివప్రకాశం”, “భారతో పఖండానికి దీవెనలతో శక్తి ప్రసరిస్తున్న దేవతావృక్షం” అంటూ.

దక్షిణామూర్తి, అరుణాచలేశ్వరుడు, ఆకాశంలో భారత ఉపఖండం – ఈ భావనే ఎంతో గొప్పగా ఉంది. పున్నమి వెన్నెల్లో భక్తులు అరుణగిరికి ప్రదక్షిణం చేస్తారు. గిరి ప్రదక్షిణం అంటే ఈశ్వరునికి ప్రదక్షిణం చేయటమే. పైగా దక్షిణామూర్తికి నెలవైన ఈ వటవృక్షం అరుణగిరిపై ఉండటం. ఆ శివ ప్రకాశం కావ్యమంతటా కనుపిస్తుంది.

చుట్టూ అంధకారం వ్యాపించినప్పుడు మెరుపు మెరిస్తే అది మనకు దారి చూపిస్తుంది; మన చుట్టూ ఉన్న వస్తువులను స్పష్టంగా కనుపించేలా చేస్తుంది. అదే జ్ఞానమనే విద్యుల్లేఖ హృదయాకాశంలో తళుక్కుమంటే ఆవిష్కృతమయ్యేది సత్యం. గహనమైన విషయాలను చిన్న చిన్న మాటల్లో చెప్పటం ఎంతో పరిణతి ఉన్న కవికి తప్ప సాధ్యం కాదు. అయితే వీరభద్రయ్య గారు కవి మాత్రమే కాదు – కవిత్వ తత్త్వాన్ని ఆకళింపు చేసుకొని ఆ రహస్యాలను పాఠకులకు విప్పి చెప్పగలిగిన గొప్ప విమర్శకులు. అందుకే కవిలా కేవలం కవిత్వమే చెప్పలేదు; విమర్శకునిలా కేవలం కవిత్వ మర్మాన్ని విప్పి చెప్పలేదు. రెండూ ఒకరే కాబట్టి చెప్పదలచుకొన్న విషయాన్ని సూటిగానే కాక అందంగానూ చెప్పారు. అదేదో ప్రయత్నించి శ్రమపడి చెప్పినట్లనిపించదు. అలవోకగా చెప్పినట్లనిపిస్తుంది. ఇదంతా స్వీయానుభవం కావటమే దీనికి కారణం.

తన ధర్మమని సూర్యభగవానుడు
ఈ దిక్కునుంచి ఆ దిక్కు దాకా పయనించి
దినాంతాన ఎవరి స్తుతులూ ఆశించకుండా కనుమరుగవుతాడు
తారకాచంద్రులకు అవకాశమిస్తూ
రవ్వంత కీర్తి కాంక్ష లేదు
తరువాతి తరం ప్రతిభావంతులపై అసూయాద్వేషాలు లేవు”

– ఈ మాటలు వీరభద్రయ్య గారికి వర్తిస్తాయి. శిష్యులైనా, పరిచితులైనా, అపరిచితులైనా వారిలోని ప్రతిభాలేశాన్ని గుర్తించి గౌరవించి ప్రోత్సహించే సౌజన్యమూర్తి.

సద్గురువులు ఉపదేశిస్తారు; శిష్యులు వింటారు. అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తారు. సాధన చేస్తారు. కానీ సత్యం ఆవిష్కృతమై అనుభవంలోకి వచ్చినప్పుడు ఇక అంతా వెలుగే – లోపలా బయటా కూడా.

జ్ఞాన విద్యుల్లేఖ హృదయాకాశంలో తళుక్కుమంది – సత్యావిష్కారం జరిగింది. ఆ విషయాన్ని ఒక్క మాటలో ఎంత సూటిగా చెప్పారో చూడండి –

“సద్గురూపదేశం వాస్తవమై అనుభూతికి వచ్చింది”

పై పై పూజలతోనో, నమస్కారాలతోనో, నియమాలతోనో హృదయ కుసుమం వికసించి పరిమళాలు వెదజల్లదు. జగత్తు, జీవుడు, ఈశ్వరుడూ – ముగ్గురూ ఏకమైనప్పుడు సహజంగా పరిమళాలు వెదజల్లుతుంది. ఈ కవిత చూడండి –

“సూర్యోదయం కాగానే ఆయనవైపు తిరిగి
రెండు చేతులూ జోడించి నమస్కరించాను
చేమంతి విచ్చుకొని పకపకా నవ్వింది!
బంతి పువ్వు చెప్పింది
మల్లినాథసూరిలాగా వ్యాఖ్యానం
చేతులు ముడిస్తే దండం అవుతుందా?
మాలాగా పరిమళాల వెదజల్లితే
అవుతుంది కానీ! అని”

– ఈ కవితలో ఇంకా చాలా పంక్తులున్నాయి. ఒకే వస్తువు ఒక్కొక్కరికి వారి వారి స్థాయిని, మనస్థితిని బట్టి అనేక విధాలుగా కనుపిస్తుంది. ఆ విషయాన్ని కావ్యకర్త ఎంతో చక్కగా చెప్పారు.

“భయగ్రస్తునికి వెన్నెలలోనూ
కొబ్బరిచెట్టు పిశాచంగా
కొబ్బరి బొండాం
దాని తలకాయగా
కొబ్బరిమట్ట విరబోసుకున్న దాని శిరోజాలుగా అగుపిస్తాయి
శివోపాసకునికి
శివజటాజూటంగా
చంద్రబింబంగా
వరదహస్తాలుగా అగుపిస్తాయి”

అయితే ఆ స్థాయికి చేరుకోవాలంటే ఎంతో సాధన కావాలి. ఆ సాధననంతటినీ క్రమంగా వివరించారు వీరభద్రయ్య గారు. తరువాత మనసు అన్నిటినీ ఆపేసి మహామౌనంలోకి జారిపోయింది.

మనసులో అనుకున్నమాట బయటకు వచ్చి అందరికి వినిపించే ఆఖరిదశ వైఖరి. అయితే అవన్నీ దాటి అంటే వైఖరి, మధ్యమ, పశ్యంతీ నుండి కింది కిందికి వచ్చి పరావాక్కులో కలసి మహామౌనంగా మిగిలిపోయింది. మాటలేని మహామౌనమిది. కావ్యమంతటికీ ప్రాణభూతమైన కవిత ఇది. దక్షిణామూర్తి మౌనరూపమైన దాక్షిణ్యం దీనిలో కనుపిస్తుంది.

“పరా… పరమ మౌనం
దాక్షిణ్యమూర్తి దక్షిణామూర్తి
నేను, తాను గీత చెరపిన
దక్షిణామూర్తి దాక్షిణ్యమూర్తి”

రమణులు “నిన్ను నీవు తెలుసుకో” అంటారు. ఆ “నేను” నేనుగా ఉండాలంటే పైనున్న ఆవరణలన్నీ తొలగిపోవాలి. స్వచ్చమైన మనోముకురాన్ని కప్పేసేవేవైనా సాయుజ్యానికి ఆటంకాలేనంటారు ఈ కవి. నీటిలో పాలచుక్కనో, తేనె చుక్కనో వేయటాన్ని ఉపమానంగా చెప్పారు. అవి నీటిని రుచికరంగా చేస్తాయేకాని నీరు తన సహజత్వాన్ని కోల్పోతుందని సులభంగా, అర్థమయ్యేలా చెప్పారు.

“మనఃక్షేత్రంలో దేన్నీ నాటనీయకుండా
నా సుక్షేత్ర నైర్మల్యాన్ని కాపాడుకోవడమే
సాయుజ్యానికి మొదటి మెట్టూ, చివరిమెట్టూ” అన్నారు.

మరో కవితలో కళాసాధకుని హెచ్చరించారు. ఇలా –

“గులాబీ పువ్వుకు కొన్ని అంగుళాలకిందనే
కంటకమూ మొలిచినట్లు
కీర్తి పుష్పానికి వెన్నంటే
అహంకార కంటకమూ మొలుస్తుంది”

పుష్పకంటకం పూవును రక్షిస్తే అహంకార కంటకం ప్రతిభా ప్రదర్శకునికి ఉన్నట్లు తెలియకుండానే భక్షిస్తుంది. భక్షించటంతో ఆగక తలకెక్కి భస్మాసురునిలా భస్మం చేస్తుందన్నారు. ప్రతి కళాసాధకుడూ ప్రతిక్షణం గుర్తు పెట్టుకోవలసిన నిత్య సత్యాలు ఈ మాటలు. సత్వ, రజస్తమో గుణాలు కళాసాధనలో పోషించే భూమికలను చెపుతూ సాత్త్వికమైన కళాసాధన ఔన్నత్యాన్ని, నైర్మల్యాన్ని, పరమార్థాన్ని గురించి రెండే మాటల్లో ఎంత చక్కగా చెప్పారో చూడండి –

“దివ్యభూమి నుంచి స్రవించే ఈ సరస్వతి
మళ్ళీ దివ్యభూమికి చేర్చే దివ్యసాధనం”

మోదుగ చెట్టులో, ఆ పూలలో వైరుధ్యాల మాటున దాగిన భారతాత్మను వెదకి పట్టుకున్నారు వీరభద్రయ్య గారు. మోదుగు పూలు కవికి “ప్రకృతిమాత చిచ్ఛక్తి రూపాంతరాలు”గా కనుపించాయి.

“సహనం మాటున దాగి ఉన్న సాత్త్విక క్రోథం
క్రోథం మాటున దాగి ఉన్న వైశ్విక ప్రేమ”

వైరుధ్యాల మాటున దాగిన భారతాత్మను గురించి ఇంత చక్కగా చెప్పటం అనితరసాధ్యం. దివ్యమైన కాంతి తనపై ప్రసరించి తానొక వెలుగుముద్దగా మారతాడు సాధకుడు. కానీ అంతకుముందు తాను చూసిన ప్రకృతి సౌందర్యం కళ్ళ ముందు కదలాడదా? ఆ రేఖాచిత్రాలన్నీ 7వ కవితలో కనుపిస్తాయి. కవిలోని భావుకతకు అద్దం పడుతున్నదీ కవిత. ఎన్నెన్ని చిత్రాలు! “భూమాత తన ఆనందం కోసం చిత్రించుకొన్న ఉద్యానవన శోభలూ, చిత్రం లఖించబోయి కాషాయ వర్ణమంతా ఒలకబోసికొనే తూర్పుదిక్కూ” – ఇలా ఎన్నెన్నో అందమైన ప్రకృతి దృశ్యాలను ఒడిసిపట్టిన కెమెరా ఈ కవిత.

ప్రతిభను గురించి చెపుతూ

“కైలాసగిరి శిఖరానికది నిచ్చెనే కానీ
పాతాళానికది జారుడు బండకాదు” అంటారు.

“నాకు నేను ఎంత మరుగుపడిపోయానో
నన్ను వెదుక్కోవాలని కూడా తెలియని మౌర్ఖ్యం”

ఈ కవితను చదవగానే ఉలిక్కిపడని వారు, నిజమే కదా – ఇంతటి మూర్ఖత్వంతో బ్రతుకుతున్నానా అనుకోనివారు మనలో చాలామందే ఉంటారు. యోగవిద్యను గురించి చెపుతూ…

“తన ఉనికిని కప్పిపెట్టే చెత్తా చెదారాన్ని
తొలగించే మార్జనకళ” అన్నారు కవి.

మార్జనకళ అనేమాట చాలా గొప్పగా అనిపించింది నాకు. మార్జనాన్ని కళగా భావించటం నిజంగా గొప్ప ఊహ. సాధకుడు నియమనిష్ఠలతో, ఆత్మసాక్షాత్కారాన్ని పొందటం కంటే కళగా భావిస్తే కష్టంగాకాక ఇష్టంగా ఉంటుందేమో! కవి స్వయంగా వైణికుడు. లలితకళలలో ప్రథమగణ్యాలైన సంగీత సాహిత్యాలు రెండిటిలో ప్రావీణ్యమున్న వారు కాబట్టి ఈ మాట అనగలిగారని అనుకుంటున్నాను. పంచేంద్రియాలు లోనికి తెస్తున్న చెత్తా చెదారాన్ని తొలగించి కవి యోగి అయి “చిత్సరసిలోనుంచి ప్రభవించిన దివ్యకమలాన్ని” అందుకోవటంతో కావ్యం సమాప్తమయింది. మౌనంగా జ్ఞాన బోధ చేసిన దక్షిణామూర్తి కవిలేఖిని నుండి ప్రసరింపజేసిన జ్ఞాన జ్యోత్స్న ఈ కావ్యం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here