కాజాల్లాంటి బాజాలు-24: మహానటుడు…

2
10

[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]

[dropcap]భా[/dropcap]ర్యాభర్తలన్నాక ఎంత అన్యోన్య దంపతులైనా ఎప్పుడో ఒకసారి చిన్నగానైనా మాటా మాటా అనుకోకుండా ఉండలేరు. మరింక మామూలు దంపతులయితే సాధారణంగా వారానికోసారైనా ఒకరిమీదొకరు విసుక్కోకుండా ఉండలేరు. కాస్త నోరు పడేసుకునేవారయితే పక్కవాళ్లకి కూడా వినిపించేట్లు దెబ్బలాడుకుంటారు. అవును కదా!

ఇంకా చెప్పాలంటే భార్యాభర్తలు ఒకరు మరొకరి ముందు ఎన్నాళ్ళని నాటకాలాడగలరు! ఎవ్వరినైనా కొన్నాళ్ళే కదా నాటకాలాడి మోసం చెయ్యగలరు. కానీ ఇదిగో ఇలాంటి దంపతుల గురించి చదివిన వార్తలు మనని అయోమయంలో పడేస్తాయి. అదేంటంటే ఒకాయన తన భార్యని ఏకంగా 62 యేళ్ళపాటు అబధ్ధం ఆడి మోసం చేసాడుట. విడ్డూరంగా ఉందా! మోసమంటే అలాంటి ఇలాంటి మోసం కాదు. తను చెవిటీ, మూగ అని ఇంట్లో భార్యనీ, పిల్లల్నీ కూడా అరవైరెండేళ్ళ పైన ఆయన నమ్మించేసాడుట.

అమెరికాలోని కెనటికట్‌లో ఉంటున్న బారీ డాసన్ (Barry Dawson) అనే 84 యేళ్ళ పెద్దమనిషి 80 యేళ్ళ భార్య డరోతీ (Dorothy) తో 62 యేళ్ళ పైన చేసిన కాపురంలో తను చెవిటివాడనీ, మూగవాడనీ చెపుతూ ఆవిడ ముందు ఎప్పుడూ నోరిప్పలేదుట. చెవిటీ, మూగా అయిన భర్తతో విషయాలు చెప్పడానికి పాపం ఆ మహాసాధ్వి డరోతీ రెండేళ్ళపాటు కష్టపడి చెవిటివారితో మాట్లాడే చేతిసైగలు చేసే భాష నేర్చుకుందిట. కానీ అతనికి అర్ధమయ్యేలా ఆమె నేర్చుకునేటప్పటికి ఆ మహానుభావుడికి చూపు కూడా కాస్త మందగించిందన్నాడుట. ఇలా చూపు మందగించిందనడం కూడా కూడా నాటకమేనేమో అంటోందిట ఆ మహా ఇల్లాలు ఇప్పుడు.

ఈ దంపతులకి అరుగురు పిల్లలూ, పదముగ్గురు మనవలూ ఉన్నారు. అందరూ కూడా ఆయన మూగా, చెవిటీ అనే అనుకున్నారు. ఒకసారి ఈ మహానుభావుడు ఏదో చారిటీ షోలో ఉండాల్సిన సమయంలో ఒక బార్ లో కరాకె నైట్ లో పాడుతుండడం యూ ట్యూబ్ లో ఇంట్లోవాళ్ళు చూసారుట. అంతే, ఇంకేముంది..అతి రహస్యం బట్టబయలయింది.

ఇన్నేళ్ళూ తననింత మానసిక క్షోభ పెట్టినందుకు ఆ ఇల్లాలు కాస్త దండిగానే మనోవర్తి అడుగుతోందిట. అడగదా మరీ!

కానీ ఆ మహానుభావుడి తరఫు లాయరుగారు ఏమంటున్నారంటే, భార్యను మోసం చెయ్యడం అతని ఉద్దేశ్యం కాదనీ, బరీ డాసన్ అలా చెవిటీ, మూగగా నటించినందువల్లే వారి వైవాహిక జీవితం ఇన్నేళ్ళూ సవ్యంగా నడిచిందనీ వాదిస్తున్నాడుట. పైగా బరీ డాసన్ చాలా నెమ్మదైనవాడనీ, ఎక్కువగా మాట్లాడే తత్వం కలవాడు కాదనీ, కానీ అతని భార్య డరోతీ ఎదుటి మనిషిని చికాకు పెట్టేంత వాగుడుకాయనీ, ఆ డాసన్ అలా చెవిటీ, మూగగా మోసం చెయ్యకపోయుంటే అరవైయేళ్ళ క్రితమే వాళ్ళు విడాకులు తీసేసుకుని ఉండేవారనీ వాదిస్తున్నాడుట. ఒకరకంగా చూస్తే ఆ డాసన్ తన భార్యా, కుటుంబం కోసమే అలా నటించాడని చెప్పాడుట లాయరు. బాగుందా ఈ వాదన!

అటువంటి భర్తతో కాపురం చేసిన డరోతీ ఈ అరవైరెండేళ్ళూ పడిన మానసికక్షోభని ఎవరు తీర్చగలరు! ఏ విషయమైనా అతనికి అర్థమయ్యేలా చెప్పడానికి పాపం ఆవిడ రెండేళ్ళపాటు చెవిటివారికి అర్థమయ్యే అ చేతిసైగలు కష్టపడి నేర్చుకుందిట. ఇంతా నేర్చుకున్నాక బహుశా భార్య దగ్గర విషయాలు వినడం ఇష్టం లేకనో యేమో కళ్ళు కూడా సరిగా కనపడటం లేదన్నాడుట. పైగా అతని లాయరు వితండవాదం ఒకటీ.. ఆ డాసన్ అలా నటించాడు కనకే అరవై రెండేళ్ళపాటు వాళ్ల కాపురం నిలబడిందీ అంటాడుట.

కట్టుకున్న పెళ్ళాం ముందు అన్నేళ్ళు మహాద్భుతంగా నటించిన ఆ డాసన్‌కి ఆస్కార్ అవార్డ్ లాంటిదేమైనా ఉంటే ఇవ్వచ్చేమో కదా! గబగబా వెళ్ళి ఘట్టిగా పోట్లాడేసుసుకుంటున్న భార్యాభర్తల నెవరినైనా చూడాలి.. లేకపోతే ఈ చదివిన వార్తకి రాత్రికి నిద్రపట్టేలాలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here