మహతి-13

5
7

(సంచిక పాఠకుల కోసం ప్రసిద్ధ సినీ కవి, రచయిత శ్రీ భువనచంద్ర అందిస్తున్న ధారావాహిక.)

[కుసుమ చనిపోయిందన్న వార్త విన్న మహతి విచలితమవుతుంది. చివరి రోజుల్లో తనతో సరిగా లేదని బాధపడినా, కుసుమని తాను సరిగా అర్థం చేసుకోలేదని భావిస్తుంది మహీ. స్త్రీల పట్ల జరుగుతున్న అరాచకాలను తలచుకుని బాధపడుతుంది. అమ్మానాన్నలు జరిగిన విషయాలన్నీ పక్కనబెట్టి భవిష్యత్తు మీద దృష్టి సారించమని సలహా ఇస్తారు. హరగోపాల్‍కి బాగోలేదని రహీమా చెబుతుంది మహీకి. వాళ్ళ ఇల్లు ఎక్కడో కనుక్కోమని, వెళ్ళి చూసోద్దామని అంటుంది మహి. తమ పనిమనిషి ఉండేది ఆ ప్రాంతంలోనేననీ, కనుక్కుంటానని చెబ్తుంది. హగ్గీకి బాలేదన్న సంగతి అమ్మకి చెబుతుంది మహీ. తాను ఊహించానని అంటుందామె. ఎలా ఊహించావని మహీ అడిగితే, ఎప్పుడు చూసినా సినిమాల్లోకి వెళ్ళిన వాళ్ళ సంగతి గురించే ఆలోచిస్తూ తను మాత్రం అన్యాయానికి గురికాబడ్డానని అనుకుంటాడు; ఎన్నిసార్లు వివరంగా చెప్పినా, మరుసటి రోజుకి మళ్ళీ మొదటికొస్తాడు, చెప్పీ చెప్పీ ఓ విధంగా విసిగిపోయామని అంటుందామె. సాయంత్రం హగ్గీ ఇంటికి వెళతారు మహీ, రహీమా. లోపలి గదిలో పడుకున్న హగ్గీని పలకరిస్తారు. అనారోగ్యం ఏమిటని అడుగుతుంది రహీమా. అనారోగ్యం అంటూ ప్రత్యేకంగా ఏదీ లేదనీ; అసలు ఏదీ చెయ్యాలని లేదనీ; ఎవరితోటీ మాట్లాడాలనీ లేదని అంటాడు. ఎవరితో మాట్లాడినా టన్నుల కొద్దీ నీతులూ బోధనలూ, విసుగొచ్చిందని అంటాడు. సరే బయల్దేరుతామని అంటుంది మహీ. అప్పుడే వెళ్ళిపోతారా అని అడుగుతాడు. ఏదీ చెయ్యాలనీ, ఎవరితోటీ మాట్లాడ కూడదనీ అనుకునేవాడి దగ్గర ఏం మాట్లాడాలని అంటుంది మహీ. మాటల్లో హగ్గీ తన సెల్ఫ్ పిటీని బయటపెట్టుకుంటాడు. కాస్త కఠినంగా మాట్లాడి, న్యూనతాభావం నుంచి బయట పడమని చెప్తుంది మహీ. నా బాధ నీ బాధ కాదా అని అడుగుతాడు హగ్గీ. నీ బాధని నా బాధగా ఎందుకు భావిస్తానని అడుగుతుంది మహీ. కాసేపటికి అక్కడ్నించి వచ్చేస్తారు మహీ, రహీమా. అదేంటి అతనితో అంత హార్ష్‌గా మాట్లాడేవు అని అడిగి, మీరిద్దరూ లవ్‍లో ఉన్నారని చాలామంది అనుకుంటున్నారని చెప్తుంది రహీమా. విస్తుపోయిన మహీ అదేం లేదని అంటుంది. మర్నాడు ఉదయం హగ్గీ వాళ్ళ అమ్మ మహీ ఇంటికొస్తుంది. హగ్గీతో స్నేహం మానవద్దని కోరుతుంది, అందుకు కారణం వివరిస్తుంది. మహీ వాళ్ల అమ్మ తామొచ్చి హగ్గీతో మాట్లాడతామని ఆమెకి చెప్పి పంపిస్తుంది. అమ్మమ్మ తాతయ్యలతో ఊరికి వెళ్తుంది మహీ. కుసుమ చనిపోయే ముందు తనకి రాసిన ఉత్తరం గురించి మహీకి చెప్తారు డా. శ్రీధర్. కుసుమ ఎంత వేదన అనుభవించిందో తెలుస్తుందని అంటారు. హాస్పటల్‍కి వెళ్ళి చూస్తే, ఆసుపత్రి బాగా అభివృద్ధి చెంది కనిపిస్తుంది. అక్కడ కుసుమ తల్లీ తండ్రీ కనిపిస్తారు. ముసలావిడకి అనారోగ్యం వల్ల అక్కడ చేర్చారు. చిక్కిశల్యమైపోయిన ఆవిడ కుసుమ విషయంలో తనని క్షమించమని మహిని అడుగుతుంది. భవిష్యత్తులో ఏం చేయాలో త్వరగా నిర్ణయించుకోమని మహీకి అమ్మానాన్నలు, అమ్మమ్మా తాతయ్యలు చెప్తారు. – ఇక చదవండి.]

[dropcap]“క[/dropcap]లలు కన్నీరుగా మారొచ్చు. కానీ కన్నీళ్ళు కలగా ఎన్నటికీ మారవు” చదివి నాన్నకి వినిపించాను.

“అద్భుతంగా ఉంది” అన్నాడు నాన్న.

“అవునే మహీ – నువ్వు కవితల్లాంటి వాక్యాలు వాక్యాల్లాంటి కవితలు వ్రాయడం ఎప్పుడు మొదలెట్టావూ?” కుతూహలంగా అడిగింది అమ్మ.

“ఓ రోజు రాధాకృష్ణుల ప్రేమ గురించి ఆలోచన వచ్చిందమ్మా. అప్పుడో చిన్న కవిత వ్రాశాను.

‘అర్ధరాత్రి వెన్నెలలో
యమున పరవశించింది
శ్రీకృష్ణుడు తరలివచ్చెనంటూ
ఒక కల గన్నది’ అని.

అది పుస్తకంలో వ్రాసుకున్నాను. అది చూసిన మన డా. శ్రీధర్ గారు చాలా మెచ్చుకుని కవితలు వ్రాయడం కంటిన్యూ చెయ్యమన్నారు.” అన్నాను.

“భలే. మహీ సర్వసమర్థకురాలు” గొప్పగా అన్నాడు తాతయ్య.

“అదేం లేదు తాతయ్యా. మనసులో పుట్టిన ఆలోచనల్ని తోచినట్టు వ్రాయడామే గానీ, కవిత్వం సంగతి నాకేం తెలుసు?” బిడియంగా అన్నాను.

“ఇంకోటి చెప్పవే” అన్నది అమ్మమ్మ. నాకు నవ్వొచ్చింది. ఎందుకంటే, కాకిపిల్ల కాకికి మహా ముద్దు అని.

“ఒకే.. చెప్తాను.” అని

‘బాధపడ్డ గుండె చెరువౌతుంది –
అదే ప్రేమ పంచితే –
గుండె చెరువంతై –
నిన్ను ప్రేమిస్తుందీ!’

అన్న కవిత వినిపించా.

“వహ్వ.. వహ్వ” అన్నది కల్యాణి (చెల్లెలు) ఎగతాళిగా.

“నోరు ముయ్యవే.. అది రాసిన కవిత ఆటకాయతనంగా వినిపించినా, అర్థం చాలా వుంది” కల్యాణిని కసిరి అన్నది అమ్మమ్మ.

“ఆహా.. ఇంత కాలానికి నీ పుణ్యం వల్ల నాకు తెలిసిందే మహీ, మీ అమ్మమ్మకి కవిత్వం అర్థమవుతుందని!” పకపకా నవ్వి అన్నాడు తాతయ్య. అయితే అందులో చతురతే గానీ వెటకారం లేదు.

“దేవుడు చదువు నా నుదుట్న వ్రాయలేదు గానీ, లేకపోతే ఏ కలెక్టరో జడ్జో అయి మిమ్మల్నో ఆట ఆడించే దాన్ని కాదూ!” సరదగానే ఓ విసురు విసిరింది అమ్మమ్మ.

“ఇంతకీ ఏం చెయ్యదలచుకున్నావూ?” సూటిగా నా వంక చూసి అన్నాడు నాన్న.

“డాక్టరయితే సేవలు – రోగులు, లాయరైతే కేసులు – కోర్టులు, ఇంజనీరైతే ప్లానులు – ప్రాజెక్టులు, పొలిటీషియన్ అయితే పార్టీలు (రాజకీయ) లంచాలు లేక అహంకారాలు అధికారాలు – నాన్నా, అన్నిట్లోనూ నాకు డిఫెక్ట్‌లే కనబడుతున్నాయి. చదువు కోసం డబ్బు ఖర్చు పెట్టడం, మళ్ళీ ఉద్యోగం వచ్చాక ఆ డబ్బుకి పదింతలు సంపాయించడం. జీవితం ఎలా అయిందంటే గర్భసంచీలోంచి భూశయనం దాకా డబ్బే ముఖ్యపాత్ర పోషిస్తోంది. దేవుడు లేని కోవెలనైనా ఊహించగలం గానీ, డబ్బు లేని జీవితాన్ని ఊహించలేము” మనసులో వున్న మాటను చెప్పాను.. నిస్సంకోచంగా.

అందరూ సైలెంటయ్యారు. నిజమేగా మరి! నన్ను చదివించడానికి అమ్మా నాన్నా రెడీ. కానీ నా మాటలు కొంత కన్‍ఫ్యూజన్‌ని వారి మనసులో కలిగించాయి.

“అంటే? డాక్టరు, లాయరు, ఇవేమీ నీకు ఆనలేదా?” అడిగింది అమ్మమ్మ.

“అమ్మా.. ఏం చదివినా చివరకు ఏమిటీ? ఉద్యోగం సంపాయించి డబ్బులు పోగెయ్యడం. ఆ తరువాత ఎవర్నో ఒకర్ని పెళ్ళి చేసుకుని పిల్లల్ని కనడం – వాళ్ళని మళ్ళీ చదివించడం. ఇదేనా జీవితమంటే? చదువు అంతిమ లక్ష్యం ఉద్యోగమూ, సంపాదననే? మరి జీవితపు అంతిమ లక్ష్యం ఏమిటీ?” ఓ క్షణం ఆగాను. నాన్న కళ్ళల్లో కుతూహలం. అమ్మ బ్లాంక్‍గా చూస్తోంది.

“అదే విషయాన్ని మళ్ళీ మళ్ళీ వందసార్లు ఆలోచించాను. సంఘసేవ చేస్తున్నామనే వారి లక్ష్యం రాజకీయ పదవులు. స్త్రీల కోసం పోరాడే వారి లక్ష్యం కీర్తి, పేపర్లో పేరు కోసమే పోరాటాలూ, ఉద్యమాలు. లోకంలో అనేక ఘోరాలు జరుగుతున్నై. జరిగినప్పుడు మాత్రం ఆహా ఓహో ఘోరం, అమానుషం అంటూ అరుపులు పెడబొబ్బలూ మొదలుపెడతారు. తరువాత పత్రికలూ ఛానల్సూ నాయకులూ ప్రజలూ కూడా గప్ చుప్. ఇదా మనం ఆశించే సమాజం? ఇదేనా సమసమాజ న్యాయం? మొగలాయి పరిపాలన, ఆంగ్ల పరిపాలనా చెల్లిపోయింది. ఇంకా మనం చదువుతుంది లార్డ్ మెకాలే గురించీ, రిప్పన్ గురించీ, రాబర్ట్ క్లైవ్ గురించీ, మౌంట్‌బాటెన్ గురించే! అక్బరు, ఔరంగజేబుల పాఠాలే మీరు చదివారు. నేనూ అవే చదివాను. బహుశా మరి కొన్ని శతాబ్దాలు కూడా అవే పాఠాలు రాబోయే తరాల్ని క్షణక్షణానికీ ‘మీరు బానిసలు’ అని గుర్తుకు తెస్తూనే వుంటాయి. ఇంకెంత కాలం ఇలా గత చరిత్రలు చదువుతూ, తవ్వుతూ గత కాలంలో బ్రతుకుతాం?” నా మాటల్లోని ఆవేశం నాకు తెలుస్తోంది.

“లార్డ్ క్లైవ్ అనే కుటిలుడు డివైడ్ అండ్ రూల్ అనే దుర్మార్గపు దుష్ట పన్నాగం పన్ని, రాజులకీ రాజులకీ మధ్య చిచ్చుపెట్టి, భారతదేశం మొత్తాన్నీ ఇంగ్లాండు రాణి గుప్పెట్లో పెట్టాడు. సరే, చచ్చీ చెడీ స్వాతంత్ర్యం తెచ్చుకున్నాం. మరి మనవాళ్ళేం చేశారూ? మనిషికీ మనిషికి మధ్య కుల, మత, వర్గ, వర్ణ వివక్షతను రేపెట్టి అదే డివైడ్ అండ్ రూల్ పన్నాగంలో విభేదాల్ని సృష్టించారు, కేవలం ఓట్లను చీల్చి గద్దెనెక్కడం కోసం. లోకంలో ఉండేవి రెండు రకాలైన జాతులనేది వీళ్ళకి తెలీదా? ధనవంతులు, ధనహీనులు, యీ రెండేగా! కాదు.. కులానికీ, కులానికీ మధ్య చిచ్చురేపారు. మతానికీ మతానికీ మధ్య చిచ్చురేపారు. దేవుళ్ళ మధ్యే వైరం సృష్టించిన మనం నిజంగా బుద్ధిజీవులమా? మన స్వార్థం కోసం బంగారాన్నీ, బొగ్గునీ, మైకాని, ఇనుప ఖనిజాన్నీ అన్నిటినీ తవ్వేసే సగరపుత్రులం కాక మనకి మనుషులమని పిలువబడే అర్హత ఉందా? పుట్టిన ప్రతి వ్యక్తీ చావక తప్పదు. మహా బతికితే వందేళ్ళు. ఆ తరువాత? యీ కాస్త దానికోసం ఇన్ని కుళ్ళు, హత్యా రాజకీయాలు నడపాలా? ప్రకృతిని నాశనం చేసి మన నెత్తిన మనమే భస్మాసుర హస్తం పెట్టుకోవాలా?” ఆగాను.

ఏదో వేదన కడుపులోంచి తన్నుకొస్తోంది. మానవుల నైజం మారదా? ప్రకృతిని నాశనం చెయ్యడం మానరా? తోటి మనుషుల్ని మనుషులుగా గుర్తించరా? వేలాది ప్రశ్నలు బుర్రలో మెరుపుల్లా మెరుస్తున్నాయి.

చాలాసేపు అందరూ సైలెంటుగానే ఉన్నారు.

“ఒకప్పుడు మీ అమ్మ కూడా నీలాగే ఆలోచించేది మహీ. అయితే ఆ కాలం వేరు. అప్పటి మనుషుల జీవితాలు ఇప్పుడున్న విధంగా దుర్భరంగా లేవు. ఒకప్పుడు జార్జ్ వాషింగ్టన్‌ను ఎవరో అడిగారట – ‘యీ లోకం బాగుపడాలంటే ఏం చెయ్యాల’ని. ఆయన చెప్పాడట ‘రాజకీయ నాయకుల్ని తుంగలో తొక్కిన మరుక్షనం ప్రపంచం బాగుపడుతుంది’ అని. అలాగని అందరూ చెడ్డవారు కాదు, కొందరు నిస్సందేహంగా మంచివారే, దేశ ప్రగతినీ, సౌభాగ్యాన్నీ కోరుకునేవారే” ఆగాడు నాన్న

“అమ్మ కూడానా?” ఆశ్చర్యంగా అన్నాను. నేను ఊహించలా.

“ఎందుకంట ఆశ్చర్యం? సమజాంలో ప్రతి వ్యక్తికీ సమాజంలో జరుగుతున్న అన్యాయాలని ఎదిరించాలనే ఉంటుంది. నాయకుల్ని నడిరోడ్డు మీద నిలబెట్టి మరీ ప్రశ్నించాలనే ఉంటుంది. సమాజంలోని అవకతవకల్ని సరిదిద్దాలనీ, అసమానతల్ని కడిగి పారెయ్యాలనీ కూడా ఉంటుంది. కానీ, స్వాతంత్ర్యం అని మనం అనుకుంటున్నది నిజమైన స్వాతంత్రమేనా? ఒక స్త్రీ సంగతి పక్కనపెట్టు, ఒక పురుషుడైనా నిర్భయంగా తిరిగే, ప్రశ్నించే అవకాశం ఉందా? తెల్లవాళ్ళ హుకుం మనల్ని బానిస చేసింది. అంతకు ముందు మరో ఎనిమిది వందల సంవత్సరాల పాటు మరో బానిసత్వాన్ని తలకెత్తుకున్నాం. ఓ చిత్రం చెప్పనా మహీ, యీ రోజు మనల్ని ఎవరూ బానిసలు చెయ్యలా. మనకి మనమే బానిసలయ్యాం. మన పిల్లల్ని భయభక్తుల పేరిట మనకే బానిసల్ని చేస్తున్నాం.” సుదీర్ఘంగా నిట్టూర్చాడు నాన్న. తాతయ్యా అమ్మమ్మా అమ్మ కూడా వింటున్నారు, నరేంద్ర, కల్యాణితో సహా.

“అవును.. పోలీసులంటే భయం, అధికారులంటే భయం, కోర్టులంటే భయం, రౌడీలు, గూండాలు, రేపిస్టులు, గాంగ్‌స్టర్‌లు, కబ్జాదారులూ ఎవరిని చూసిన భయమే. ఎందుకంతే వాళ్ళని కంట్రోల్ చేసేదెవరూ? న్యాయం ముంగిట చేయి జాస్తే న్యాయం కన్నా ముందర వాయిదాలూ, అవతల వాళ్ళ పరపతే మనిషిని చంపేస్తున్నాయి. Justice delayed is the justice denied అన్న న్యాయ సూత్రానికి విలువేముంటుందీ సత్వర న్యాయం జరక్కపోతే? డబ్బుతో సాక్ష్యాలు తారుమారవుతాయి. కోర్టుల్లో గెలిచేది ఎప్పుడూ తెలివైన లాయరే గానీ, న్యాయం కాదు. పోలీసుల్ని రక్షక భటులంటాం. నిజంగా మనని రక్షించేంత అధికారం వారికి కల్పించామా? ఒక కోర్టులో ఇచ్చిన తీర్పుని మరో కోర్టు కొట్టేస్తుంది. వై? ఎందుకు అలా? కోర్టు మారితే న్యాయసూత్రాలు మారిపోతాయా? ఇక అధికారులు.. వారు ఏనాడైనా జనానికి అందుబాటులో ఉంటారా? అసలు లంచం (నజరానా) లేకుండా ఏ పనైనా అవుతుందా? ఆ విషయం అధికారులకూ, పాలకులకూ తెలియదా? ఎవర్నడగాలీ? ఎవర్ని ప్రశ్నించాలీ? నిజానిజాల్ని ప్రజలకి తెలియజెప్పాల్సిన పత్రికలే పత్రికాధిపతుల కొమ్ముకాస్తూ అరాచకీయాల కొమ్ముకాస్తే, సామాన్య మానవుడి కళ్ళు తుడిచేదెవరూ?” నాన్న గొంతులోనూ ఓ వేదన, ఓ విహ్వలత.

“ఇక సాహిత్యం. ఒకప్పటి సాహిత్యం మండే మనసును చల్లబరిచేది. ఇప్పుడు ఎవడు ఏది రాసినా ‘లే.. లేచి రా.. నరుకు.. చంపు..’ అనే నినాదాల కవిత్వాలే. ‘సరేనయ్యా లేద్దాం.. ఏం చేద్దాం?  ఏం చేస్తే నిరుపేద బతుకు బాగుపడుతుందో స్పష్టంగా చెప్పు’ అని అడుగు. వాడి నోరు పెగలదు. కేవలం నరకడం చంపడం వల్ల ఇన్ని వేల సంవత్సరాలలో మానవాళికి ఏం ఒరిగిందీ? నువ్వేం చెయ్యాలో నీకే స్పష్టత లేనప్పుడు, ఎందుకు అమాయక జనాల్ని ఉసిగొల్పటం? లీడర్ ముందుండడు. వెనకాల ఉండి అమాయకుల్ని ముందుకు నెడతాడు. చచ్చేది అభం శుభం తెలీని పిచ్చి సహచరులే.” ఈసారి నాన్న గొంతులు వేదనే కాదు, ఆవేదానా ధ్వనించింది.

“కార్పోరేట్ వాళ్ళకి వేల వేల కోట్ల రుణం ఇవ్వటానికి బ్యాంకులకి అధికారం ఎవరిచ్చారూ? సామాన్యుడు వంద రూపాయలు కట్టలేకపోతే వాడి ఆస్తిని జప్తు చేసే సదరు బ్యాంకులు, రుణం పేరు మీద బ్యాంకుల్ని నిలువునా ముంచిన మహానుభావుల్ని ఎందుకు వదిలేస్తున్నాయీ? ఏం? వారిని ప్రశ్నించే ధైర్యం లేకనా? అంటే, సామాన్యుడి కొక న్యాయం, ధనవంతుడి కొక న్యాయం.. ఓహ్.. మనం ఎక్కడున్నాం?” విహ్వలంగా అన్నాడు నాన్న.

ఆయనలో ఇంత బడబాగ్ని దాగుందని నేనేనాడూ ఊహించలేదు. అమ్మ కళ్ళు విప్పార్చి ఆయన వంకే చూస్తుంది.

“తలలో పిశాచాలు నాట్యం చేస్తుంటే, ఒంటి మీద రామచిలకలు వాలుతాయా? బాబూ గౌతమ్, మహీ – మీరిద్దరిలోనూ ఉన్నది సత్యమైన ఆగ్రహమూ, ఆవేశమే. రాజు తాటికల్లు తాగుతుంటే బానిస భగవద్గీత పఠిస్తాడా? అలాగే, ధర్మం పక్కన అధర్మం, న్యాయం పక్కన అన్యాయం, శాంతి పక్కన అశాంతి, హింస పక్కన అహింస – జననం పక్కనే మరణం లాగా ఎప్పుడూ ఉన్నాయి. రామరాజ్యంలోనూ అశాంతి రేగింది. మహాభారత కాలంలోనూ హింస హిమాలయమంత ఎత్తుకు ఎదిగింది. మన సమాజాన్ని మనమే బాగు చేయాలి, మన ప్రవృత్తి మనమే మార్చుకోవాలి. అమ్మా మహీ, జరుగుతున్న అన్యాయల గురించీ, అక్రమాల గురించీ నీకు చక్కని అవగాహన ఉంది. అయితే, ఆ పరిస్థితిని ఏ విధంగా అనుకూలంగా మార్చుకుని సమాజాన్ని బాగు చెయ్యాలో ఆ దిశగా ఆలోచించు. స్వాతంత్ర్య సమరంలో హింస, ఆయుధమే స్వాతంత్ర్య సిద్ధికి మూల కారణాలవుతాయన్న నిర్భీతులూ ఉన్నారు. అహింస ఒక్కటే స్వాతంత్ర్యాన్ని సిద్ధింపజేస్తుందన్న గాంధీవాదూలు ఉన్నారు. హింస మరింత హింసకు దారి తీస్తుందన్నది జగమెరిగిన సత్యం. అందుకే, ఆలోచనతో వివేచనతో, నువ్వేం చెయ్యాలో నింపాదిగా మనసులో చర్చించుకుని, నీ నిర్ణయాన్ని చెప్పు” నెమ్మదిగా, శాంతంగా అన్నాడు తాతయ్య.

“అదే మంచిది మహీ..” లేచాడు నాన్న ఓ సుదీర్ఘ నిట్టూర్పు విడిచి. ఆ నిట్టూర్పు శబ్దం అందరికీ స్పష్టంగా వినిపించింది.

***

“నువ్వు చాలా అదృష్టవంతురాలివి మహీ! నిన్న మీ సంభాషణ అంతా నేను విన్నాను. అఫ్ కోర్స్, వినాలని వినలేదు. పక్క గదిలోనే ఉన్నాను గనుక చెవులబడింది. మీ నాన్నగారు, మీ అమ్మగారు, మీ తాతయ్య అందరికీ దేశం పట్ల, ప్రజల పట్ల ప్రేమ అనంతంగా ఉంది. బాధా వుంది. ప్రస్తుత పరిస్థితులను మెరుగుపరచాలనే బాధ్యతా మీ మాటల్లో నాకు ధ్వనించింది. మొన్నటి దాకా నువ్వు ఓ మంచి డాక్టరువైతే బాగుండేదని మనసులో అనుకునేవాడ్ని. ఉహూ. డాక్టరు వృత్తి ఎటువంటిదంటే, పశువుల్ని పలుపుతో రాటకి కట్టిపడేసేట్టు, వైద్యుల్ని బాధ్యతలకి కట్టిపడేస్తుంది. అదో లోకం. ఆ లోకంలో రోగులే తప్ప ప్రజలూ, ప్రజల సమస్యలూ ఉండవు. నిన్న రాత్రి మీ అందరి మాటలూ విన్నాకా నిన్ను కేవలం డాక్టరుగా ఊహించుకోలేను. వ్యక్తి రుగ్మతలను బాపడానికి లక్షమంది డాక్టర్లున్నారు. ఇప్పుడు బాపవలసింది సమాజ రుగ్మతల్ని.” అన్నారు డా. శ్రీధర్.

ఆయన నిన్ననే టౌన్‌కి వచ్చారు. ఆయనన్ని మా ఇంట్లో మేం ఉంచేశాం. భోం చేసి పడుకున్నారనుకున్నాం గాని, వింటారని అనుకోలేదు. అయినా హాల్లో పెద్దగా మాట్లాడుకుంటుంటే పక్కనే వున్న గెస్ట్ రూమ్‍కి ఎందుకు వినిపించదూ?

నేను తలెత్తి ఆయన వంక చూస్తే ఆయన కళ్ళల్లో ఓ చెప్పలేని అభిమానం ఆప్యాయత. మెల్లగా తల దించుకున్నా. ఏం చెప్పాలో ఆ క్షణం నాకే అర్థం కాలేదు.

మళ్ళీ కలుద్దాం.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here