మహతి-18

4
10

(సంచిక పాఠకుల కోసం ప్రసిద్ధ సినీ కవి, రచయిత శ్రీ భువనచంద్ర అందిస్తున్న ధారావాహిక.)

[పదకొండో రోజున సర్రీ హోటల్‍కి వస్తుంది. రాగానే అలతో కాస్త వెటకారంగా మాట్లాడుతుంది. అల పట్టించుకోదు. సర్రీ మౌనంగా తనకి ఎలాట్ చేసిన గదికి వెళ్ళిపోతుంది. కాసేపటికి మళ్ళీ అల గదికి వచ్చి, మీ అమ్మగారు వచ్చారట కదా అని అడుగుతుంది. అల తన అమ్మ జయలక్ష్మి గారిని పరిచయం చేస్తుంది. సర్రీని చూడగానే ఆవిడ, ఏమ్మా నువ్వు ఉమాసుందరి కూతురివా అని అడుగుతారు. ఆశ్చర్యపోయిన సర్రీ మీకెలా తెలుసు అంటుంది. ఉమా, తానూ చిన్నప్పుడు కలిసి చదువుకున్నామనీ, సర్రీ అచ్చు తల్లి నోట్లోంచి ఊడిపడినట్లు ఉందని ఆవిడ అంటారు. సర్రీ మొహంలో విషాదాన్ని గుర్తించి ఏమైందమ్మా, అమ్మ ఎలా ఉంది, ఎక్కడుంది అని అడిగితే, తనకి పదేళ్ళ వయసులో తన తల్లి చనిపోయినట్లు చెప్తుంది సర్రీ. ఆరోజు ముగ్గురు కలిసే భోం చేస్తారు. రెండో షెడ్యూల్ షూటింగ్ మొదలవుతుంది. అంతా సజావుగా సాగిపోతుంది. రెండో షెడ్యూల్ షూటింగ్ మొదలయ్యాక జయలక్ష్మి గారు విజయవాడ వెళ్ళిపోతారు. సెకండ్ షెడ్యూల్ షూటింగ్ పూర్తయ్యాకా, మళ్ళీ 20 రోజులు విరామం ప్రకటిస్తారు. తల్లిని పంపించమని ఇంటికి ఫోన్ చేస్తే, అల నాన్న కుదరదంటారు. అలనే విజయవాడ రమ్మని చెప్తారు. తాను చిత్రాణి గారితో వాళ్ళ ఊరికి వెళ్తున్నట్టు సర్రీ అలకి చెప్తుంది. తనతో తన ఊరికి రావచ్చుగా అని అల అడిగితే, అలని హత్తుకుని తన జీవితం గురించి రెండు ముక్కల్లో చెబుతుంది. తర్వాత అక్కడ్నించి వెళ్ళిపోతుంది. ఓ రోజు డైలాగ్ రైటర్ ఆదివిష్ణు అలతో మాట్లాడుతాడు. పరిశ్రమలో రాణించాలంటే చేయాల్సినవి, చేయకూడనివి సూచిస్తారు. తానేమైనా తప్పు చేస్తున్నానా అని అల అడిగితే, చేయట్లేదు, మామూలు హెచ్చరికలా చెప్తున్నాను అని వెళ్ళిపోతాడాయన. ఎల్లుండి నుండి షూటింగ్ మొదలని చెప్పి, అంతకు ముందు షూట్ చేసిన ఫైట్ సీన్ బాగా వచ్చిందని చెప్తారు సదాశివరావు గారు. అల లోని ప్రతిభని మెచ్చుకుంటారు. మొదట్లో పూర్తి సపోర్ట్ ఇచ్చిన నిర్మాత, మర్నాడు షూటింగ్ అనగా హఠాత్తుగా చేతులెత్తేస్తాడు. ఎవరు ఫోన్ చేసినా ఎత్తడు. నటీనటులు, సాంకేతిక నిపుణులూ అందరూ షాక్ అవుతారు. ఏం చేయాలో ఎవరికీ ఏమీ పాలుపోదు. ఎవరికి తోచిన సలహాలు వాళ్ళిస్తారు. అందరినీ తనకి సహకరించమని అడుగుతాడు వసంత్. అప్పడు ఎడిటర్ మణి ఓ విషయం చెప్తాడు. ప్రొడ్యూసర్ గారి అబ్బాయి, అతని ఫ్రెండ్స్ ఎడిటింగ్ రూమ్‍లో అల సీన్‍లన్నీ ఒకటికి పదిసార్లు వేయించుకుని చూశారనీ, అలని పచ్చిపచ్చిగా వర్ణించారనీ, ఈ వ్యవహారంలో అతని హస్తం ఏమైనా ఉండచ్చని అంటాడు మణి. మీటింగ్ హాల్ అంతా నిశ్శబ్దమై పోతుంది. అల గుండె ఒక్క క్షణం ఆగిపోతుంది. – ఇక చదవండి.]

మహతి-2 అల-5:

[dropcap]ఏ[/dropcap] ఒక్కరి ముఖంలోనూ రక్తం లేదు. అవాక్కయ్యారు.

“వాట్?” గది ప్రతిధ్వనించేలా అరిచారు సత్యమోహన్.

“యస్.. నా దృష్టిలో నిజం అదే. మరో కారణం కనిపించదు”

“కానీ ఆ కుర్రాడు అంత దుష్టుడా?” షాక్‍లో అన్నారు సదాశివరావు గారు.

“అతను నాకు తెలుసు. కానీ అతని ఫ్రెండ్ కూడా మరో వెధవ. వాటి తండ్రి రాజకీయ నాయకుడే కాదు, మాజీ మంత్రి కూడా. వాడికి డ్రింక్సూ, డ్రగ్సూ అన్ని రకాల సులక్షణాలూ వున్నాయి. వాడ్ని సెట్‍లోకి రానివ్వద్దని ముందే చెబుదామనుకున్నా. కానీ ప్రొడ్యూసర్ కొడుకుతో వచ్చేవాడ్ని నేనెలా ఆపగలను? అసలు ఎవరైనా ఎలా ఆపగలరు? ఆ కుర్రాడు, అంటే ప్రొడ్యుసర్ గారి కొడుక్కూడా కాస్త ప్రొడక్షన్ వ్యవహారాలు చూస్తున్నాడుగా” నింపాదిగా చెప్పాడు డుప్లేకర్. అతను మహారాష్ట్రియన్.

“సో, మంత్రి కొడుకు మన ప్రొడ్యూసర్ కొడుకుని ఇరకాటంలో పెట్టి ఉండాలి” సాలోచనగా అన్నాడు కమలాక్ష (రైటర్).

“బయటపడని విషయం ఇంకోటి కూడా వుంది. మాజీ మినిస్టర్ బహుశా స్లీపింగ్ పార్ట్‌నర్ కూడా కావచ్చుగా యీ సినిమాకి. లేకపోతే ఆ మాజీ మినిస్టర్ కొడుకు అంత ధైర్యం ఎలా చేస్తాడూ?” అన్నాడు ఎడిటర్ మణి.

నా మనసు ఇందాకే పనిచెయ్యడం మానేసింది. అంత షాక్ తిన్నాను. సజావుగా సంద్రంలో పయనిస్తున్న నౌక ఫటాల్న పేలిపోతే? ఏం ఆలోచించాలో ఎలా ఆలోచించాలో కూడా నాకు అర్థం కాలేదు.

“సారీ అలా.. నీ పరిస్థితి నాకు అర్థం అవుతోంది. సినిమా ఆగిపోయినా, నేను సర్వనాశనమైనా సరే – నిన్ను మాత్రం బలికానివ్వను, ఆలోచిద్దాం, వీళ్ళని ఎలా దారికి తీసుకురావాలో. ఇంతమటుకూ ప్రొడ్యూసర్ కొడుకూ, మాజీ మంత్రి కొడుకూ నీ మీద ఆశపడ్డారని మనం అనుకోవడమే గానీ, స్పష్టమైన ‘ఫీలర్’ ఏదీ రాలేదు కదా!” నాకు ధైర్యం చెబుతూ అన్నారు సత్యమోహన్.

“వాళ్ళు డైరక్టుగా బయటపడరు. ఎందుకంటే వాళ్ళు రెప్యుటేషనూ పోతుంది. ఇన్‍డైరక్టుగా తెలియపరుస్తారు” చిత్రాణి అన్నది.

“ఓ గంట డిస్పర్స్ అవుదాం. గంట తరవాత కలుద్దాం. కొంచెం ఆలోచించాలి. మీరూ ఆలోచించండి. వసంత్, మీరూ సదాశివరావు గారూ నాతో ఉండండి” అన్నారు సత్యమోహన్.

ఎక్కడ లేని నిస్సత్తువ నాలో ముంచుకొచ్చింది. మెల్లగా లేచి నా రూమ్ లోకి వెళ్ళి తలుపులు వేసుకున్నాను. నా వెనకే వచ్చిన సర్రీకి, చిత్రాణికీ కూడా నాతో మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. మంచం మీద వాలిపోయాను.

ఇప్పుడు ఏం చెయ్యాలీ? మాట్లాడకుండా విజయవాడకి తిరిగి వెళ్ళిపోతే? నవ్వే వాళ్ళు నవ్వుతారు. కొద్దో గొప్పో ఎగతాళీ చేస్తారు. ఎంత కాలం? మహా అయితే ఓ రెండు నెలలో ఏడాదో. కాలేజీలో మళ్ళీ చేరి డిగ్రీ పూర్తి చెయ్యొచ్చు. ఆ తరువాత నిజంగా జీవితంలో ఏదన్నా సాధించవచ్చు.

జీవితానికి ‘చదువు’ ఎంత ముఖ్యమో అప్పుడు తెలిసింది. అంతరాంతరంగంలో ఒక నమ్మకం మాత్రం ఉంది – నాకేమీ జరగదనీ, యీ మబ్బు తొలగి పోతుందనీ. ఒకవేళ తొలగకపోతే? తల పగిలిపోయేంత తలనెప్పి. ‘పికాసో’కి ఫోన్ చేసి ఓ స్ట్రాంగ్ టీ తెమ్మని చెప్పాను.

మంచం మీద పడుకునో, ఏడుస్తునో, దీర్ఘాలు తీస్తోనో గడిపే సమయం కాదిది.

ఎందుకో మహతి గుర్తుకొచ్చింది. నా డైరీని పిచ్చిపిచ్చిగా వెతికాను. నెంబరు దొరికింది. గబగబా డయల్ చేశాను. చేస్తునే కనకదుర్గ అమ్మవారికి మొక్కుకున్నాను. భక్తి పెద్దగా లేని నేను, దేవుడికి మొక్కటం ఇదే మొదటిసారి.

“హలో” అంది మహతి. దాని గొంతు నిండా ఎనర్జీనే.

“మహీ.. నేను అలని మాట్లాడుతున్నానే”

“ఓహ్.. టెల్ మీ హీరోయిన్.. నేను నీకు ఏ విధంగా సేవ చేయగలనూ!” సరదాగా ఆనందంగా అన్నది మహతి.

“ముందు నేను చెప్పేది విను” గబగబా చెప్పటం మొదలుపెట్టాను.

***

గంట తరువాత ఫ్రెష్‌గా తయారై మీటింగ్ హాల్‍కి వెళ్ళాను. అప్పటికే అందరూ అసెంబుల్ అయ్యారు. అందరి మొహాలూ నీరసంగానే ఉన్నాయి. నా ఫ్రెష్ ఫేస్ చూసి వారిలో ఆశ్చర్యం.

“రామ్మా” ఆహ్వానించారు సదాశివరావు గారు. వెళ్ళి కూర్చున్నాను.

“ఎనీ ఐడియాస్?” అడిగారు సత్యమోహన్. ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు.

“పోనీ మనం ఎంతెంత పెట్టగలమో అంతా పెట్టుకుంటే?” అన్నాడు శ్రావణ్.

“చాలదు. అంతేకాదు, మీ సొంత డబ్బులు పెట్టడం నాకు ఇష్టం లేదు” స్పష్టంగా అన్నారు సత్యమోహన్.

“ఎనీ ఫైనాన్షియర్స్?” వసంత్ అన్నాడు.

“నో ఛాయిస్. ప్రొడ్యూసర్‍ కూడా ఓ పార్ట్‌నర్. అతనికి తెలీకుండా నేను కాంటాక్ట్ చెయ్యకూడదు” నిట్టూర్చారు సత్యమోహన్.

“ఒక పని చేద్దాం సార్. రేపు షూటింగ్ మొదలుపెడదాం. ప్రెస్‍నీ పిలుద్దాం. దాని కోసం మా అందరి దగ్గర డబ్బుల కన్నా మీరిచ్చిన అడ్వాన్స్ చెక్ అలానే ఉంది. అది మార్చి తెస్తూ షూటింగ్ మొదలైన విషయం తెలియవలసిన వాళ్ళకి తెలియజేసేలా చేద్దాం. వాళ్ళు బైటపడనన్నా పడాలి, లేక యథాతథంగా షూటింగ్ ఏర్పాట్లు చెయ్యడానికి సిద్ధపడాలి” అన్నాను.

“వాళ్ళు కాంటాక్ట్ చేస్తే?” మణి అన్నాడు.

“చెయ్యరు”

“చేస్తే?” రెట్టించాడు మణి. పకపకా నవ్వాను.

“వాళ్ళు కాంటాక్ట్ చేస్తే ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు మణిగారు. రిజల్టు చాలా ఘోరంగా ఉంటుంది” నవ్వుతూనే అన్నాను. అంత ధైర్యంగా ఎలా చెబుతున్నానో ఎవరికీ అర్థం కాక నివ్వెరపోయారు.

“అంత ఖచ్చితంగా ఎలా చెబుతున్నారూ?” మణి మళ్ళీ రెట్టించాడు.

“పిల్లీ కుక్కా కుందేలూ తాబేలూ కూడా తమ తమ రక్షణ చేసుకోగలవు. నా పేరు అల.. కాదు.. ‘ధీర!’” అన్నా నిర్భయంగా.

“సరేనమ్మా.. అలాగే మొదలెడదాం. నీ చెక్కూ నా దగ్గరనున్న సొమ్ము రెండు రోజుల షూటింగ్‍కి సరిపోతుంది” ఏదో నిశ్చయంతో తానూ లేచి, “అమ్మాయ్.. నీ ధైర్యం చూస్తే నాకూ బలం వచ్చింది.. కమాన్ గైస్” ఉత్సాహం తెచ్చుకుని మరీ అన్నారు సత్యమోహన్.

అందరూ నా వంక ఆశ్చర్యంగా చూడటం నేను స్ఫుటంగా గమనించినా, గమనించనట్టే నేను బయటకొచ్చా.

***

అనుకున్న అద్భుతం జరిగింది. షూటింగ్ అట్టహాసంగా మొదలవంగానే అందరూ చాలా ఆనందపడ్డారు. ప్రెస్ వాళ్ళు, ఛానెల్ వాళ్లు తృప్తిగా టిఫిన్స్ చేసి, కాఫీలు, సిగరెట్లు సేవించి కవర్లు జేబులో పెట్టుకుని, “సర్, ఓ చిన్న సర్‍ప్రైజ్‍గా మీ నటీనటుల పరిచయం కూడా మాకూ, పత్రికలకీ కలిగిస్తే బాగుంటుందేమో!” అన్నారు.

“ఆ విషయం చాలా చాలా ఆలోచించాం. అసలు నిజం చెప్పాలంటే ఓ అతి పెద్ద వ్యక్తి మమ్మల్ని సంప్రదించారు. షూటింగ్ మొదట్లోనే యూనిట్ తీసుకున్న నిర్ణయాలు వారికి చాలా నచ్చాయనీ, ఎనీ టైమ్ ఇదే యూనిట్‍తో సినిమా తియ్యడానికి సిద్ధంగా ఉన్నాననీ. అది మాకు మా ప్రాజెక్టు మీద నమ్మకం ఇంకా పెంచింది. షూటింగ్ యీ షెడ్యూల్‍తో ముగుస్తుంది. ఫస్ట్ కాపీ రాగానే మీ అందరికీ డిన్నర్ ఇచ్చి, షో వేసే ముందే అందరినీ పరిచయం చేస్తా” నవ్వుతూ అన్నారు సత్యమోహన్. ప్రెస్ కాన్ఫరెన్స్ ముగిసింది.

కావాలనే మేం షూటింగ్‍లో ఉండిపోయాం. ప్రెస్ ముందుకు వెళ్లలేదు. కవర్లు కొంచెం బరువైనవే పెట్టాల్సి వచ్చింది.

సాయంత్రానికి అన్ని ఛానల్సూ న్యూస్‍ని కవర్ చేశాయి.

“సారీ సత్యా, నేను అర్జెంటుగా నార్త్‌కి వెళ్ళాల్సి వచ్చింది. ఇందాకే వచ్చా. ఎమౌంట్స్ నేను పొద్దుటికల్లా తీసుకొస్తా. షూటింగ్ ఎలా జరుగుతోంది?” సాయంత్రం 7 గంటలకల్లా ప్రొడ్యుసర్ సత్యమోహన్‍గారికి ఫోన్ చేశాడు. కథ సుఖాంతం.

“అసలా ఐడియా ఎలా వచ్చిందీ?” ఒంటరిగా నన్నడిగారు సత్యమోహన్. “మహతీ ఎఫెక్ట్” అన్నాను నవ్వుతూ.

“అంటే?” ఆశ్చర్యంగా అన్నారు సత్యమోహన్.

“నా ఫ్రెండ్ మహతికి ఫోన్ చేశా. అది ఇచ్చిన ఐడియా ఇది. షీ యీజ్ బ్రిలియంట్. అంతే కాదు ట్రబుల్ షూటర్. మా వూళ్ళో హాస్పటల్స్‌నీ, స్కూల్స్‌నీ అది స్పాన్సర్లని దబాయించి మరీ బాగు చేసింది. నా క్లాస్‍మేట్ అయినా అదంటే వాళ్ళ వూరి ప్రెసిడెంట్ దగ్గర్నించీ నెత్తిన పెట్టుకుంటారు. నేను ప్రాబ్లమ్ చెప్పిన వెంటనే అదన్నది – ‘బెదిరించే వాడికి బెదిరింపే మందు’ అని. అవసరమైతే ‘రిలయన్స్’ లాగా పబ్లిక్ షేర్స్‌కి వెళ్ళైనా సినిమా కంప్లీట్ చెయ్యచ్చు – అని ధైర్యం చెప్పింది. ఆ మాటే మీకు అందిస్తే, మీరు అద్భుతంగా ప్రెస్‍లో చెప్పారు” నవ్వి అన్నాను.

“ఆ అమ్మాయిని తప్పక చూడాలి. అలా, ఏదేమైనా నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది” సంతోషంగా అన్నారు సత్యమోహన్.

చకచకా రోజులు గడిచి పోతున్నాయి. మళ్ళీ ఏ విఘ్నం వస్తుందోనన్న జాగురూకతతో, చాలా ఫాస్ట్‌గా షూటింగ్ చేశారు సత్యమోహన్, యూనిట్.

ఇరవై ఐదు రోజులు పడుతుందనుకున్న షెడ్యూలు కేవలం 18 రోజుల్లోనే పూర్తయింది. గుమ్మడికాయ కొట్టేశాం.

(షూటింగ్ ప్రారంభంలో కొబ్బరికాయ కొడితే, షూటింగ్ పూర్తయ్యాకా, గుమ్మడికాయ కొట్టడం ఆనవాయితీ).

చిత్రాణి, సర్రీ, మణీ, శ్రావణ్ అందరూ నాకంత ధైర్యం ఎలా వచ్చిందో తెలుసుకోవడానికి చాలా చాలా ప్రయత్నాలు చేసినా, నా చిరునవ్వే వారికి సమాధానం అయింది.

షూటింగ్ అయిపోయి బయలుదేరే ముందు సత్యమోహన్, “అలా.. ఒకవేళ ప్రొడ్యూసర్ దిగి రాకపోతే?” అన్నారు.

“అప్పుడు మా మహతే ఏదో ఓ మార్గం వెతికి తీరుతుంది. ఓటమిని అంగీకరించడం దాని డి.ఎన్.ఎ.లో లేదు” నవ్వి అన్నాను.

“ఖచ్చితంగా మహతిని నేను కలవాలి. ఆడియో రిలీజ్ మహతి తోనే చేయిద్దాం” అన్నారాయన ఉత్సాహంగా.

నాకెందుకో లోలోపల ఓ భయం ఉంది. కట్లపాము అంత తేలిగ్గా తగ్గదు. షూటింగ్ లాస్ట్ షెడ్యూల్‍లో రాని ప్రొడ్యూసర్ కొడుకూ, మాజీ మంత్రి కొడుకు చివరి మూడు రోజుల్లో వచ్చారు. డబ్బింగ్ చెప్పడానికి నేను హైదరాబద్ వెళ్ళి తీరాలి. వాళ్ళూ నాతోనే బయల్దేరితే లేదా, హైదరాబాద్ వెళ్ళాకా, కొత్త ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తే? మళ్ళీ ఆలోచనల మేఘాలు మనో ఆకాశంలో అశాంతిగా తేలుతున్నాయి.

“ఏంటీ డల్‍గా ఉన్నావూ?” సత్యమోహన్ గారు అడిగారు.

“ఇప్పుడు నేనూ హైదరాబాద్ రావాలిగా!” అన్నాను.

“నువ్వెందుకు డల్‍గా వున్నావో నాకు కొంత అర్థమయింది. ఇంకాసేపట్లో మనం బయల్దేరాలి. నువ్వూ, వసంత్, సర్రీ నా కారులోనే వస్తున్నారు. డోంట్ వర్రీ. అదీ, అందర్నీ పంపించాకే మనం బయలుదేరుతాం” చిన్నగా నవ్వి ధైర్యం చెప్పారు సత్యమోహన్.

ఎంత ధైర్యం తెచ్చుకున్నా, మహతికి ఫోన్ చెయ్యాలనిపించి ఫోన్ చేశాను. అన్నీ విని, “ఓ గంట ఆగి చేస్తా” అన్నది.

“డోంట్ వర్రీ, సురేన్ తెలుసుగా, మా అన్నయ్య. ఆర్మీలో పని చేస్తున్నాడు. వాడు మొన్ననే వచ్చాడు. వాడి ఫ్రెండ్ మీ లొకేషన్ దగ్గర వూళ్ళోనే ఉంటాడు. అతన్ని మీ హోటల్‍కి పంపుతా. నీ వంక చూడ్డానికి దమ్మెవడి కుంటుందీ!” అని పకపకా నవ్వింది. రియల్ ట్రబుల్ షూటర్.

“సర్.. మా మహతి ఓ ఫ్రెండ్‌ని తోడుగా పంపుతానంది” ఆనందంగా చెప్పాను సత్యమోహన్ గారితో.

“ఓహ్.. పెర్సనల్ సెక్యూరిటీ.. వాహ్! అయితే అతనూ మన తోటి నా కార్లోనే వస్తాడు. వసంత్‍ని ప్రొడ్యూసర్ కొడుకు కార్లో పంపిస్తా” నవ్వుతూ అన్నారాయన.

సాయంత్రం 7.30కి వచ్చాడతను. చూడగానే మతిపోయింది. ఆరడుగుల మూడంగుళాల ఎత్తు, ఏభై ఆరు అంగుళాలు కనీసం ఉండే ఛాతీ. ముఖం మాత్రం చాలా సున్నితంగా ఉంది. కళ్ళు ఉత్సాహంతో మెరుస్తున్నాయి. చిరునవ్వు అద్భుతం. సూటిగా వచ్చి, “అల గారూ, సురేన్ నా ఫ్రెండ్. నా పేరు ఫాలాక్ష. నేనూ ఆర్మీ వాడినే. మీరు నా దగ్గర ఏ మాత్రం సందేహించక్కరలేదు. సరేనా” హాయిగా నవ్వి అన్నాడు ఫాలాక్ష. అతన్ని చూడగానే అందరి మొహాల్లో ఓ ఆశ్చర్యం. అతని స్ట్రక్చర్ అటువంటిది. నమస్కారం చేసి, అందర్నీ పరిచయం చేశాను. అందరూ ఆశ్చర్యంతోనే అతనితో కరచాలనం చేశారు. అతని నడకలో ఓ హుందాతనం, నవ్వులో నిష్కల్మషం, నిర్మలత్వం. నా మనసు దూదిపింజలా అయిపోయింది. మాటలు పెదవి దాటి బయటికి రానంటున్నాయి.

“మీరు చాలా మితభాషి అనుకుంటున్నాను. కరెక్టేనా?” సూటిగా కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు.

“ఊహూ.. అదేం కాదు!” నాకు తెలియకుండానే తలవొంచుకుని అన్నాను. ఇంతలోకి సత్యమోహన్, చిత్రాణి, సర్రీ వచ్చారు. సదాశివరావు గారు కూడా వచ్చారు, చిన్న బేగ్‍తో.

“వీరూ వస్తారు” సత్యమోహన్ అన్నారు, అందరికీ పరిచయం చేశాక. “ఓ పని చేస్తా.. నేను వేరే కారులో వెళ్తా” చిత్రాణి అన్నది.

“ఆడవాళ్ళు ముగ్గురూ వెనక ఎక్కండి. సత్యమోహన్ గారూ, ఫాలాక్ష గారు ఫ్రంట్‍లో ఉంటారు. నేనే మరో కారులో వస్తా” అన్నాను సదాశివరావు గారు.

“నో. నో. మీరు కాదు. నేనే వెళ్తా..” తనే బయలుదేరింది చిత్రాణి. వసంత్ అన్నారు, “నేను చిత్రాణి గార్ని మా కారులో తీసుకొస్తా” అని. ప్రాబ్లమ్ సాల్వ్‌డ్.

“సత్యమోహన్ గారు.. మీరూ ఓకే అంటే నేను డ్రైవ్ చెయ్యానా? మీరు చాలా అలసటగా కనిపిస్తున్నారు” స్నేహపూరిత స్వరంతో అన్నాడు ఫాలాక్ష.

“అంతకంటేనా! నిజం చెబితే చాలా అలసిపోయాను. శారీరకంగా కంటే మానసికంగా. కానీ, మీరు అతిథులు” అన్నారు సత్యమోహన్.

“అలా దూరం పెట్టకండి ఇంకో విషయం ఏమంటే, నాకు లాంగ్ డ్రైవ్ అంటే చాలా ఇష్టం” స్టీరింగ్ ముందు కూర్చున్నాడు ఫాలాక్ష.

“అలా.. నువ్వు ముందు కూర్చో.. నేనూ రావు గారూ కాస్త రిలాక్స్ అవుతాం” అన్నారు సత్యమోహన్. నేను మొదట కాస్త బిడియపడ్డా, ధైర్యం తెచ్చుకుని ముందు సీట్లోనే కూర్చున్నా. నాకు తెలుసు, సత్యమోహన్ గారు మానసికంగా ఎంత నలిగిపోయి వుంటారో, ఎంత అలసిపోయి ఉంటారో. ప్రొడ్యూసర్ రాగానే ఆయన చేసింది మా అందరికీ హాఫ్ పేమెంట్స్ అర్జంటుగా ఇప్పించటం.

నాను నేనిచ్చిన ఎడ్వాన్స్ చెక్ ఎమౌంటే గాక మరో యాభై వేల చెక్ కూడా ఇచ్చారు. ఫుల్ పేమెంట్ పిక్చర్ రెడీ అయ్యాక అని అందరితోటీ చెప్పారు.

కారు స్టార్ట్ అయింది. ఓ నలభై మైళ్ళ పాటు ఏ మాటలూ లేవు. కారు స్లో చేసి, “సత్యమోహన్ గారూ, మీకు డ్రింక్స్ ఏమైనా అలవాటు ఉందా? రాబోయే విలేజ్‍లో నా ఫ్రెండ్ రంగారావు వున్నాడు. మాంఛి ఆర్మీ స్పెషల్స్ వాడి దగ్గర ఉంటాయి” అన్నాడు ఫాలాక్ష.

“ఓహ్.. ఎలా చెప్పాలా అని నేనే ఇబ్బంది పడుతున్నా. నాయనా, నేను రిలాక్స్ అయ్యేది రోజుకో రెండు పెగ్గుల మందు తోనే. సత్యా రెగ్యులర్ కాదు గానీ, ఇవాళ నాకు కంపెనీ ఇవ్వమని బతిమాలతా” ఉత్సాహంగా అన్నారు సదాశివరావు గారు.

“ష్యూర్ అంకుల్” హాయిగా నవ్వి స్పీడ్ పెంచాడు ఫాలాక్ష.

“మీరూ తీసుకుంటారా?” అప్రయత్నంగా అడిగా.

“నో. ఆర్మీ డే రోజున మాత్రం హాయిగా ఎంజాయ్ చేస్తాం. ఇక ఫ్రెండ్స్ పుట్టిన రోజులకి తప్పదు గదా. అనంతా మేడం, మేము సైనికులం. మందు తీసుకున్నా మితంగా, క్రమశిక్షణతో తీసుకుంటాం. ప్రస్తుతం మాత్రం అసలు ముట్టుకోను. డ్రైవింగ్‍లో వున్నా కదా!” నవ్వుతూ అన్నాడు ఫాలాక్ష.

ఒక పక్క నాతో మాట్లాడుతున్నా, అతను ఒక్కసారి కూడా తల తిప్పి నా వంక చూడలేదు. అతని కాన్‍సన్‌ట్రేషన్ రోడ్డు మీదే వుంది. ఆ విషయం నాకు బాగా నచ్చింది.

“ఓహ్.. గ్రేట్” అన్నాను. ఎందుకన్నానో నాకే తెలియదు.

ఓ విలేజ్ దగ్గర కారు ఆపి, రోడ్డు పక్కన ఇంట్లోకి వెళ్ళి పది నిమిషాల్లో ఓ బుట్టతో బయటకి వచ్చాడు ఫాలాక్ష. అతనితో బాటు ఇంకొకతను లుంగీ, షర్టుతో బయటకొచ్చాడు. ఫాలాక్ష అంతా ఎత్తు కాదు గానీ, అతనూ అయిదు అడుగుల పదకొండు అంగుళాలు హైట్ ఉండొచ్చు. వెల్ బిల్ట్. అందర్నీ పరిచయం చేశాడు ఫాలాక్ష.

“జీవితంలో మొదటిసారి.. ఓ సినిమా డైరక్టర్స్‌నీ, హీరోయిన్‍నీ కలుసుకోవడం. ఎ గ్రేట్ డే టు రిమెంబర్” నవ్వి అని, “నా పేరు పాండురంగారావు. నేను సురేన్, ఫాలాక్ష ముగ్గురం ఎంట్రీమేట్స్‌మి. అందుకే ముగ్గురం ఒకేసారి లీవులో వచ్చాం” అన్నాడు.

మరో పది నిమిషాల్లో కారు బయలుదేరాకా, “సర్, ఆ బుట్టలో మాంఛి స్కాచ్ బాటిలూ, సోడాలు, తినడానికి అరిసెలు, కజ్జికాయలు, జంతికలు, చేగోడీలు పెట్టి ఇచ్చాడు మా ఫ్రెండ్. అన్నట్టు మూడు గ్లాసులు కూడా ఉన్నాయి” అన్నాడు ఫాలాక్ష.

“ఆలస్యం ఎందుకూ. ఏ చెట్టు కిందో ఆపితే ముహూర్తం పెట్టేద్దాం” ఉత్సాహంగా అన్నారు సదాశివరావు గారు. సదాశివరావుగార్ని అంత ఉత్సాహంగా నేనెప్పుడూ చూడలేదు. అందుకే నవ్వొచ్చింది. రావుగారది గమనించారు.

“అమ్మాయ్.. నవ్వుకో నవ్వుకో. ఇదిగో నీకు త్వరగా పెళ్ళై, నీ బిడ్డ ఆర్మీలోనో, ఎయిర్‌ఫోర్స్ లోనే చేరి, సెలవల కొచ్చేప్పుడు ఇలా మిలట్రీ సీసాలు నాకు తెచ్చి పెట్టాలని ఆశీర్వదిస్తున్నా” నవ్వుతూ అన్నారు సదాశివరావు గారు.

రోడ్డుకు పక్కగా ఉన్న ఓ పంట కాలవ వంతెన మీద ఆనాటి మందు ముచ్చట ప్రారంభం అయింది.

“ఖాళీ బిస్లరీ బాటిల్స్‌లో మందూ, సోడా, వాటరూ పద్ధతిగా కలుపుకుంటే, ప్రయాణమూ సాగుతుంది. మజానూ వస్తుంది” అన్నారు రావు గారు. అప్పటికప్పుడు రెండు బిస్లరీ బాటిల్స్‌ని పానపాత్రలుగా మలిచి, మళ్ళీ కారెక్కారు ఇద్దరూ. కారు స్టార్టయింది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here