మహతి-21

5
13

(సంచిక పాఠకుల కోసం ప్రసిద్ధ సినీ కవి, రచయిత శ్రీ భువనచంద్ర అందిస్తున్న ధారావాహిక.)

[డబ్బింగ్ థియేటర్ లోకి అల ఎంట్రీ పరమాద్భుతంగా జరిగుతుంది. ఐజి రాలేదు కానీ, వారి సెక్రటరీ వస్తారు. ప్రొడ్యూసర్ కొడుకు, మాజీ మంత్రి కొడుకూ షాక్‌ అయి, అలని ‘మేడమ్’ అని సంబోధించడం మొదలెడతారు. హంగు ఆర్భాటంతో వచ్చిన అలని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. సదాశివరావు గారూ, వసంత్ డబ్బింగ్ చెబుతుంటే, వారి నుంచి నేర్చుకుంటుంది అల. తన డైలాగ్‍లు ఎలా చెప్పాలో ప్రాక్టీస్ చేస్తుంది అల. రకరకాల వేరియషన్స్‌తో చెప్పి, ఏది బాగుందో చెప్పమని ఫాలాక్షని అడుగుతుంది. వారం రోజులలో తన పాత్ర డబ్బింగ్ పూర్తిచేస్తుంది అల. డబ్బింగ్ పూర్తయ్యాకా, రీరికార్డింగ్ జరుగుతుంది. రీరికార్డింగ్ పూర్తయ్యాకా, బయ్యర్లు, ఎగ్జిబిటర్లు క్యూ కడతారు ధీర సినిమా కొనడానికి. ప్రివ్యూ షోకి మహతి, సురేన్, ఫాలాక్ష, కల్యాణి, తన అమ్మానాన్నగార్లని ప్రత్యేకంగా పిలిపించుకుంటుంది అల. ప్రివ్యూ చూసిన అందరూ అలని అభినందిస్తారు. – ఇక చదవండి.]

మహతి-2 అల-8:

[dropcap]పె[/dropcap]ద్ద పెద్ద సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడుతుంటే ‘ధీర’ సినిమా మాత్రం బిగెస్ట్ సక్సెస్ అయింది. నా పేరు మారుమోగిపోయింది. నాతో పాటు పేరువొచ్చింది సత్యమోహన్ గారికి, సదాశివరావుగారికి. సదాశివరావుగారు కన్నింగ్/ఛాలెంజింగ్ పాత్రను అద్భుతంగా చేస్తే వసంత్ డైరెక్టర్ భావాల్ని ఎక్స్‌లెంట్‌గా పలికించారు. నిశ్చల్ నిగమ్ పర్శనాలిటీ బాగున్నదనీ, కొంచెం సాధన చేస్తే మంచి హీరో అవుతాడనీ వచ్చింది. సర్రీకి కూడా మంచి గుర్తింపే వచ్చింది.

‘ధీర’ సినిమా చాలా రికార్ట్స్ బద్దలు చేసింది. సత్యమోహన్ మూడు బిగ్ హీరోస్ ఫిల్మ్స్‌కి సైన్ చేస్తే, సదాశివరావుగారూ వసంత్ కేరక్టరు ఆర్టిస్టులుగా ఏడెనిమిది సినిమాలకి బుక్ అయ్యారు. సదాశివరావుగారు కావాలనే చాలా ఎక్కువ ఎమోంట్ అడిగినా నిర్మాతలూ మారు మాట్లాడకుండా యాక్సెప్ట్ చేశారట.

“ఓ సీనియర్ మోస్ట్ కో-డైరెక్టర్‌గా ఎంత సంపాదించానో యాక్టర్‌గా ‘ధీర’ వల్ల అంతకి రెండు రెట్లు అడ్వాన్స్ తీసుకున్నాను అలా” అని సంబరపడిపోయారు.

కేరక్టర్ ఆర్టిస్టుగా వసంత్ కూడా సెటిలైపోతానన్నారు.

పెద్ద పెద్ద హీరోల సరసన బ్లాంక్ చెక్‌తో నాకు చాలా ఆఫర్లు వచ్చాయి. “అమ్మా.. ఇదో చిత్రమైన ఇండస్ట్రీ.. విజయాశ్వాన్ని ఎక్కి దౌడు తీసేటప్పుడు వంద మంది వందిమాగధులు నీ చుట్టూ వుంటారు. ఒక్క ప్లాప్ వస్తే చాలు అందరూ దూరం జరుగుతారు. హీరోల నెవరూ ఐరన్ లెగ్ అనరు. హీరోయిన్లని మాత్రం ఐరెన్ లెగ్ అనో, అచ్చి రాలేదనో లక్ష వంకలు పెడతారు. ఏ సినిమానైనా చాలా జాగ్రత్తగా కథ అదీ విని కాంటాక్టు సంతకం చెయ్యి. నువ్వు జాగ్రత్త ఎందుకు పడాలో పోను పోను నీకే తెలుస్తుంది” అన్నారు సదాశివరావుగారు నాతో.

మాకు పే చెక్క్ సినిమా రిలీజైన రోజునే ఇచ్చారు. ఎవరి కెంత ఇచ్చారో గానీ నాకు మాత్రం 3 లక్షల రూపాయలకు చెక్కు అందమైన గోల్డెన్ కలర్ బ్రీఫ్ కేసులో పెట్టి ఇచ్చారు. మిగతా వారికి కూడా అనుకున్నదానికంటే ఎక్కువే ఇచ్చారని తెలిసింది. ఎందుకంటే పిక్చర్ సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది గనక.

సినిమా అయిపోయింది. ఇంకా కల్యాణిగారింట్లో వుంటూ వారికి ఇబ్బంది కలిగించడం కష్టంగా ఉంది. వారు ఎప్పటిలాగానే ప్రేమ పంచిస్తున్నా, నిమూషానికోసారి వారి ఫోను నాకోసం మోగడం నాకే ఇబ్బందిగా అనిపించింది. అదే విషయం నన్ను కంగ్రాట్స్ చేసిన ఫాలాక్షతో అన్నాను.

“యస్.. ఇబ్బంది సంగతి పక్కన పెడితే, మాకు ఇవ్వాల్సిన ప్రియారిటీ మాకు ఇవ్వాలి. నౌ యూ ఆర్ ఎ పబ్లిక్ ఫిగర్. నిజం చెబితే తొలి పిక్చర్ తోనే సెలబ్రటీ అయ్యారు. ఓ పని చేద్దాం. జూబిలీ హిల్స్‌లో మాకింకో బంగళా ఉంది. మీరు అక్కడికి షిఫ్ట్ అవండి. సెక్యూరిటీ ఉండడమే కాదు.. ఫీల్డుకి అందుబాటులో ఉంటారు” అన్నాడు ఫాలాక్ష.

“ఈ ఇంటికి నేను అతిథిని కాను. కానీ, ఆ యింటికి నేను ఖచ్చితంగా అద్దె చెల్లించే పద్ధతిలోనే మీరన్న మాటకి ఓకె అంటాను” అన్నాను.

“అలాగే. అప్పుడే మీకు కూడా ‘ఇది నా గూడు’ అనే అనే నమ్మకమూ, ధైర్యమూ ఉంటుంది. అయితే నామినల్ రెంట్ చాలు. అక్కడ ఉన్నది కేవలం కేర్‌టేకర్సే. వాళ్ళ జీతభత్యాలు చూసుకోండి చాలు” అన్నాడు ఫాలాక్ష.

“కొత్త కారు ఇప్పుడు అనవసరం. ఎలాగూ మీ సినిమా కంపెనీ వాళ్లు కార్లు పంపుతారు గదా. అయినా సేఫ్టీకి ఇక్కడ పడి ఉన్న కార్లలో ఒకదాన్ని అక్కడ పార్క్ చేయిస్తా. అవసరం అయినప్పుడు డ్రైవర్‌కి ఫోన్ కొట్టి ఆ కారు మీరు ఉపయోగించుకోవచ్చు”. కారు ప్రాబ్లమూ తానే తీర్చాడు ఫాలాక్ష. నా మనసులో ఒకటే ఆలోచన. నాతో ఉండేది ఎవరూ? అమ్మని తీసుకురావాలని నా గుండె నిండా ఉంది. కానీ నాన్న అన్నా తమ్ముడూ అమ్మని పంపుతారా? ఒక వేళ ఎంటైర్ ఫేమిలీని బెజవాడ నుంచి హైదరాబాద్‌కి ఫిఫ్ట్ చేస్తే? ఎన్నో ఎన్నో ఆలోచనలు.

“హలో.. ఏమిటి ఆలోచిస్తున్నారు?” ముఖం ముందు చిటికె వేసి అన్నాడు ఫాలాక్ష.

నేనూ ఆలోచిస్తున్న విషయం అతనికి చెప్పాను. అతను చాలా సేపు సైలెంటుగా ఉన్నాడు. చివరికి “ఈ సబ్జక్టు గురించి నేను బాగా ఆలోచిస్తేగానీ జవాబు చెప్పలేను. మీరు యీ విషయాన్ని మహతి గారితో కూడా చర్చించండి. ఎందుకంటే, తను బ్రిలియంట్ మాత్రమే కాదు.. మానవ స్వభావాల్ని బేరీజు వెయ్యడంలో దిట్ట” అన్నాడు.

“యస్. మీరు చెప్పిన ప్రకారమే చేస్తాను” అన్నాను.

మహతి మాత్రమే ఓ చక్కని ఆలోచన చెప్పగలదని ఫాలాక్ష మహతి పేరు చెప్పగానే నాకనిపించింది.

***

ఆఫర్లు చాలా వచ్చాయి. మొత్తం నాలుగు సినిమాలకి సైన్ చేశాను. కథ విన్నాక సదాశివరావు గారితో చర్చించి నిర్ణయం తీసుకున్నాను. అంతే కాదు ఆయన్ను నేను ‘బాబాయి’ అని పిలుస్తున్నాను. ఎందుకో ఓ అనుబంధం అలా ఏర్పడింది. ఆయన అందుకు నూటికి నూరుపాళ్ళూ అర్హుడే. ఎవరి విషయలూ ఆయన ఎప్పుడూ నా దగ్గరే కాదు ఎవరి దగ్గరా ఎత్తడం నేను చూడలేదు. మంచితనం, మానవీయత మూర్తిభవించిన ‘మనిషి’ ఆయన. హీరోయిన్‌గా ఏ విషయాలూ గమనించాలో, ఎందుకు పాత్రని ఒప్పుకోవాలో ఎందుకు పాత్రని రిజక్టు చేయ్యాలో ఆయన విశ్లేషించి చెప్పేవారు.

ఆ నాలుగు సినిమాల్లో ఒకటి సత్యమోహన్ గారిది. ఆనాడు ఇండస్ట్రీలో ఉన్న ముగ్గురు టాప్ హీరోల్లో ఒకరు సత్యకుమార్ గారి కొత్త సినిమా హీరో, హీరోయిన్ నేనే.

“అమ్మాయ్.. హీరోల దగ్గర్నించీ, డైరెక్టర్ల దగ్గర్నించీ బ్రేక్‌ఫాస్ట్ అనో లంచి డిన్నరూ అనో ఆఫర్లు వస్తాయి. వీలున్నంత వరకూ తప్పించుకో. అలా కుదరనప్పుడు ఎప్పుడూ నీతో కూడా ఎవర్నయినా తోడు తీసికెళ్ళు. ఒంటరిగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళకు.” అని నన్ను ముందరే హెచ్చరించారు సదాశివరావుగారు.

“భోజనానికేగా” అమాయకంగా అన్నాను.

ఆయన పకపకా నవ్వి “ఇక్కడ వాటి అర్థాలు వేరులే” అన్నారు.

నాకు అర్థం కావలసినంతగా అర్థం అయింది. కనకనే నేను కొత్త ఇంట్లోకి మారిన రోజునే అసిస్టెంట్‌గా పెట్టుకున్నా. సినిమాలు వచ్చినప్పుడు ప్రొడ్యూసర్లు ఇస్తారు. మిగతా టైములో నెలకి ‘ఇంత’ జీతం అని స్పష్టంగా మాట్లాడుకున్నా. జుబ్లీ హిల్స్ లోనే వినాయక మెస్ అని ఓ బ్రాహ్మిన్స్ మెస్ ఉంది. అక్కడ పరిశుభ్రంగా చేస్తారని సదాశివరావుగారు చెప్పారు.

వాళ్ళతో మాట్లాడి భోజనం ఏర్పాటుకి మాట్లాడాను. మెస్ యజమాని పేరు గోవింద నారాయణశర్మ. మనిషిని చూడగానే మంచి ఇంప్రెషన్ కలిగింది. ఓ అరగంట నాతో మాట్లాడి నా ఇష్టాఇష్టాలు కనుక్కుని వెళ్ళారు.

ఎకామిడేషన్, ఫుడ్ ప్రోబ్లమ్స్ సాల్వ్ అయిపోయాయి. నెల రోజులు దాటినా ‘ధీర’ జైత్రయాత్ర సాగుతూనే వుంది. నేను సైన్ చేసిన ఓ సినిమా కథ సరిగా కుదరక ఆరు నెలలు పోస్టుపోన్ అయింది. మరొకటి చర్చల్లో ఉంది. సత్యమోహన్ గారి స్క్రిప్టు శరవేగంగా జరుగుతోంది. నాల్గవ సినిమా ‘శర్మిష్ఠ’ పదిహేను రోజుల్లో మొదలు కాబోతోంది. నెలకి 10 రోజుల చొప్పున అయిదు నెలలు కాల్ షీట్స్ వారికిచ్చాను.

అప్పుడొచ్చింది మరో అద్భుతమైన ఆఫర్, హిందీ ఫీల్టు నించి. నాకు పిచ్చి సంతోషం కలిగింది. ఎందుకంటే ‘ధీర’ సినిమానే వాళ్ళు హిందీలో రీప్రోడ్యూస్ చేస్తున్నారట. వినేద్ కపూర్ హీరో, నేను హీరోయిన్.

వినోద్ కపూర్ ఓ సెన్సేషనల్ హీరో. బాబీ చిత్రంతో రిషికపూర్, దిల్‌వాలే పిక్చర్‌తో షారూఖ్ ఖాన్ ఎంత ఫేమస్ అయ్యారో, ‘కోయూ అజనబీ’ సినిమాతో అతను అంత సక్సెస్సయ్యాడు. ప్రస్తుతం ఉన్న హీరోలందరి కంటే యంగ్ వినోద్ కుమారే. పైగా బాచిలర్. ప్రస్తుత యువతలో కాని కలలరాజు వికె.

 “ఓహ్.. బూరెల బుట్టలో పడ్డావమ్మయ్. రెండో పిక్సరే హిందీది. అంటే ఆంధ్రా నుంచి నేషనల్ లెవెల్‌కి ఎదిగి పోయావన్నమాట!” అన్నారు సదాశివరావుగారు.

“ఓహ్.. వాట్ ఎ జాయ్” మహా సంతోషంగా శుభాకాంక్షలు చెప్పి అన్నది మహతి.

“చూశారా.. వెన్నెలనీ వెలుగునీ ఎవరూ మూసి పెట్టలేరు” షేక్ హాండ్ ఇస్తూ అన్నాడు ఫాలాక్ష.

“కంగ్రాట్స్ అలా.. నీలో ఏదో ఉంది. అదీ నాడు ప్రపంచం గుర్తిస్తోంది” భుజం తట్టి అన్నారు సత్యమోహన్.

“అనంతా.. నా జీవితం ఓ ఫెయిల్యూర్ అనకున్నానే. కాదు.. నీ సక్సెస్ చూస్తే అది నువ్వు కాదు.. నేనే అన్న గర్వం నాకు కలుగుతోందే. అమ్మా.. ప్రతీ పైసా కూడా బెట్టుకో. నీకు కావల్సిన సర్వస్వం నువ్వే కనుక, నీ పేరు తోనే కొను” అన్నది అమ్మ. నాకు కళ్ళు చెమర్చాయి.

నాకెందుకో అమ్మ కంఠ స్వరంలో చెప్పలేని వేదన కనిపించింది. హైద్రాబాద్ వచ్చాక ఇప్పటి వరకూ విజయవాడ వెళ్ళటం పడలేదు.

సినిమా చూసిన రోజున నాన్నగారు అన్నారు, “అనంతా ఓ షో మొత్తం నా స్నేహితులకి వేయించి చూపించాలే. జనాలకి నా కూతుర్ని చూసి దిమ్మదిరిగిపోవాలి. అవ్వాళ అందరికీ భోజనాలు పెట్టిస్తా. జనాలు కుళ్ళుకు చావాలి” అన్నారు. నాకు నాన్నగారి ఆనందం చూసి నవ్వొచ్చింది. ఇతరులు ఎందుకు కుళ్ళిపోవాలి. కొద్దిగా అసూయపడొచ్చు. అదీ పడకపోవచ్చు. ఇవ్వాళ ఆలోచిస్తుంటే ఆయన మాములుగా మాట్లాడినట్లు అనిపించలేదు.

ఆన్సరు మరుసటి రోజునే దొరికింది. నాన్న ఫోను. “అమ్మాయ్, నేను కొంచెం పని మీద హైద్రాబాదు వస్తున్నా. సాయంత్రం కాస్త తీరిక చేసుకో. మాట్లాడాలి” అన్నారు. ఎందుకో నాకా వార్త సంతోషం కలిగించలేదు, సరి కదా ఓ గాభరా లాంటిది కలిగించింది. ఈ ఇంటి అడ్రస్ నాన్నకి అమ్మకీ తెలుసు.

కానీ చూడలేదు. అయినా ఎడ్రస్ కనుక్కోవడం ఎంత సేపు. మంచం మీద పడుకుని ఆలోచిస్తుంటే అనిపించింది, నాలో స్వార్థమూ అహంకారమూ ఏమైనా ప్రవేశించాయా అని.

తనంతట తనే నాన్న అడ్రస్ కనుక్కుని వచ్చారు. మనిషి చాలా ఉత్సాహంగా ఉన్నారు. “ఏమీ లేదే, నా ఫ్రెండు హైద్రాబాదు వస్తుంటే అతని కార్లోనే వచ్చాం. అతనే నన్ను మన గేటు ముందు దింపేసి వెళ్ళాడు. సాయంత్రానికి వచ్చి ఇక్కడే ఉంటాడు. భోజనం ఏర్పాట్లు బాగా చేయ్యాలి. బాగా డబ్బున్నవాడు మరి” అన్నాడు. నాకు ఎంత కోపం వచ్చిందంటే, మా అమ్మతో యీయన అనే మాటలు ఇవే. ఎవడికో డబ్బుంటే నాకేంటి?

“నాన్నా.. అవసరమైతే మీరిద్దరూ బయటికెళ్ళి భోజనం చేసి రండి. ఇంకో విషయం ఏమంటే, ఈ ఇల్లు కల్యాణిగారిది. నేనే ఇల్లు దొరికే వరకూ ఇక్కడ తలదాచుకుంటున్నా. నాతో పాటు మీరూ మీ ఫ్రెండూ కూడా ఉన్నారని తెలిస్తే బాగోదు” అన్నాను నిష్కర్షగా.

“అదేమిటే, మా ఫ్రెండు చెల్లెలు జూబ్లీ హిల్స్ లోనే ఉంటుందిట. బ్రహ్మాండంగా వాళ్ళకి దగ్గర్లోనే ఇల్లు వెతికి పెడతానన్నాడు. వాళ్ళబ్బాయి కూడా ఏదో కంపెనీలో పని చేస్తాట్ట. కొత్త ఇల్లు చూసేసిగాని వెళ్ళను. మరో విషయం ఏమిటంటే, మీ అన్న చదువు ఆల్‌మోస్ట్ అయినట్టే. తమ్ముడ్ని ఇక్కడైనా మంచి స్కూల్లో చేర్చవచ్చు. అలాగయితే మీ అమ్మని కూడా ఇక్కడే నీతో అట్టిపెట్టుకోవచ్చు. నా సంగతంటావా, మహా అయితే ఓ ఆర్నెల్లు ఓపిక పడితే అక్కడి విషయాలనన్నీ ఓ కొలిక్కి తెచ్చి రిజైన్ చేసేసి వచ్చేస్తా. అందరం ఒకే చోట ఉండొచ్చు” చిద్విలాసంగా అన్నాడు.

అక్కడి విషయాలు ఓ కొలిక్కి తేవడం అంటే, ఆ ఇల్లు అమ్మేయ్యడం అన్న మాట. పేకాటే కారణమై ఉండొచ్చు.

“సారీ నాన్నా, ఇంకా నేనే కుదురుకోలేదు. నేను ఓ మాదిరిగా సెటిల్ కావడానికే అయిదారేళ్ళు పడుతుంది. ఆ తరవాత చూద్దాం. అప్పటి వరకూ అందరం కలిసి ఉండటం కుదరదు. పంపిస్తే అమ్మని మాత్రం పంపించు.” నిర్మొహమాటంగా అన్నాను.

“చాలా కంపెనీలవాళ్ళు లక్షల్లోనే నీకు అడ్వాన్సు లిచ్చారుటగా. ఏ పేపరులో చూసినా అవే విషయాలు. హాయిగా ఓ ఇల్లు కొనిస్తే మంచిదిగానీ వాళ్ళ పంచనా వీళ్ళ పంచనా పడివుండడం ఎందుకూ?” చికాగ్గా అన్నాడు.

“నువ్వన్నంత పెద్ద మొత్తంలో ఎవరూ నాకు అడ్వాన్సులివ్వలేదు. అయినా నా కాళ్ళ మీద నేను నిలబడే వరకూ ఏ బరువూ నేను ఎత్తుకోదలుచుకోలేదు” అన్నాను.

“ఓహో.. మేమంతా వచ్చి నీ నెత్తి మీద కూర్చుంటామానుకుంటున్నావా. పెద్దాడికి ఉద్యోగం వస్తే వాడి సంపాదనతోనే బతుకుతాంగానీ నీ సొత్తు మాకెందుకూ? బెజవాడ ఇల్లు అమ్మిన సొమ్ము చాలు నాకూ మీ అమ్మకీ, నీ తమ్ముడి చదువుకీ.” నావంక కోపంగా చూసి అన్నాడు.

“మీరు నాకు బరువనో, నేను మీకు బరువనో అనటం లేదు. కనీసం మరో మూడేళ్ళదాకా కలిసి ఉండటం కుదరదు అంటున్నాను.” స్థిరంగా అన్నాను. ఏ మాత్రం బెసికినా తన తెలివితేటలతో నన్ను మొహమాటంలోకి నెడతాడని తెలుసు.

“ఓహో.. సినిమా నీళ్ళు బాగా వంట పట్టాయన్న మాట.” వక్రంగా అన్నాడు. ఈ ‘నాన్న’ నేను చూసిన నాన్న కాదు.

“నేను చేసింది కేవలం ఒక్క సినిమా. అంతటికే సినిమా వాళ్ళ వంటపట్టవు. మీరు ఎలా అర్థం చేసుకున్నా కనీసం మూడేళ్లు వరకూ నేను విడిగానే ఉంటాను” అన్నాను నిర్మోహమాటంగా.

“మా ఫ్రెండు వాళ్ళ కొడుక్కి నిన్నిస్తానని మాట ఇచ్చాం” కోపంగా అన్నాడు. మొహం ఎర్రబడింది.

“నన్నడక్కుండా మాట ఇవ్వడం మీ తప్పు. అతనికి ఏం చెప్పుకోవాలో మీరే చెప్పుకోండి” సీరియస్‌గా అన్నాను.

కారు హారన్ మ్రోగింది. బాల్కనీలో నుంచి చూస్తే నాన్న ఫ్రెండు కుటుంబరావు నిలుచున్నారు. యీ కుటుంబరావు మా ఇంట్లోనే మెక్కుతుంటాడు. వీడి కొడుకు ఒక జూలాయి వాడు.

“నాన్నా.. మీ ఫ్రెండు వచ్చారు” తలుపు తీసి అన్నాను.

“అంటే?” కోపంగా చూసి బయటికి వెళ్ళిపోయాడు. ఏం చెప్పాడో ఏమో వాళ్ళు మళ్ళీ కార్లో కూర్చుని బయలుదేరారు. ఒక్కసారిగా ఎక్కడ లేని నిస్సత్తువా నన్ను ముంచేసింది. కనీసం నాన్నకి కాఫీ కాదు గదా మంచి నీళ్ళు కూడా ఇవ్వనేలేదని గుర్తొచింది. ఇంటికి ఫోన్ చేశా. అమ్మే ఎత్తింది. జరిగిందంతా వివరంగా చెప్పాను.

“అలా.. ఇప్పుడు వాళ్ళు వెళ్ళింది ఫుల్లుగా మందేసుకోవడానికి. మీ నాన్నకి యీ మధ్యే ఆ అలవాటు అయింది. ‘నీ కూతురికేం హీరోయిన్.. కోట్లు సంపాయిస్తుంది’ అని ఫ్రెండ్స్ ఎక్కేస్తున్నారు. ఆయన చాలా మంచివాడు కాకపోయినా చెడ్డవాడు కాదు. కానీ, యీ మధ్య మందు వేసుకుని నానా గొప్పలూ చెప్పకుంటున్నాడు. మకాం హైద్రాబాద్‌కి మార్చేస్తాననీ, ఉద్యోగం మాని వ్యాపారం పెడతాననీ తెగ ఊయలూగుతున్నాడు. నిష్కర్షగా చెప్పెయ్. వాళ్ళు మళ్ళీ మళ్ళీ నీ ఇంటికి వచ్చేలోపునే నువ్వు కల్యాణిగారి ఇంటికి వెళ్ళిపో. ఎవర్నీ లోపలికి పంపొద్దని యీ ఇంటి దగ్గరా కల్యాణి గారి ఇంటి దగ్గరా కూడా సెక్యూరిటీకి చెప్పు. ఓ భార్యగా నేనిలా భర్త గురించి మాడ్లాడకూడదు. కానీ చెప్పక తప్పట్లేదు. ఇంట్లోకి రానిస్తే కళ్ల నీళ్ళు పెట్టుకునో, ఏడ్చో, కాళ్ళు పట్టుకుని బ్రతిమాలో నిన్ను ఒప్పించే ప్రయత్నం ఆయన చేస్తాడు” ఆగిందో క్షణం అమ్మ.

“గత నెల రోజుల నుంచి ఇంట్లో జరుగుతున్న రగడ ఇదే. ఆయనకి కావాల్సింది గొప్పలు. అందుకోసం మకాం హైద్రాబాదు నీ దగ్గరికి మార్చి, ఫ్రెండ్సందరికీ నీ వైభవం చూపించాలి” మళ్ళీ ఆగింది అమ్మ.

నాకు మాట రాలేదు. మనుషులు ఎందుకిలా మారిపోతారు?

“అలా.. అన్నీ తరువాత చెబుతా. ముందు నువ్వు కల్యాణిగారి ఇంటికి పో” అని పెట్టేసింది అమ్మ.

కార్లో వెడుతూ ఆలోచిస్తే ఏడుపొచ్చింది. అంతకు ముందు నాన్నకి ఉండే దురలవాటు జనాన్ని పొగిడి భోజనాలు పెట్టించడం. పేకాటలో శనాదివారాలు గడపడం. అంతే. అదీ పెద్ద స్టేక్స్‌తో కాదు. మందు ఆయనకి అలవాటు లేదు. నేను హీరోయిన్‌గా పేరు తెచ్చుకోవడం ఆయన పతనానికి నాంది అయిందా?

అమ్మకి ఎప్పుడూ విశ్రాంతి లేదని తెలుసు. ఇప్పుడీయన బెజవాడ వెళ్ళాక నా మీద వున్న కోపం అంతా అమ్మ మీద చూపిస్తే దేవుడా.. ఆడజాతిని ఇంత హీనమైన బతుకు ఎందుకిచ్చావు అనిపించింది.

మరో ఆలోచన వచ్చింది. ఇప్పుడు జరిగిన విషయమంతా కల్యాణిగారికి చెప్పాలా వద్దా. చెబితే నా కన్న తండ్రిని నేనే చులకన చేసినట్లు అవుతుంది. చెప్పకపోతే సెక్యూరిటీకి చెప్పి తీరాలిగా. అయినా నాన్న ఆయన ఫ్రెండు తాగి కల్యాణిగారి ఇంటికొచ్చే దైర్యం చేస్తారని నేననుకోను. కారుని ఆపి STD బూత్ నించి మహతికి ఫోన్ చేశా.

అంతా విన్నది. “అలా, కల్యాణిగారి ఇంటికి వద్దు. వెనక్కు తిరిగి నీ ఇంటికే వెళ్లు. సమస్యని పరిష్కారించాలంటే సమస్యకి దూరంగా పారిపోవడం పరిష్కారం కాదు. మీ నాన్నగారు తన ఫ్రెండుతో కలిసి ఇప్పుడు నీ ఇంటి కొచ్చే ధైర్యం చెయ్యరు. మెల్ల మెల్లగా grip లోకి లాగి ప్రయత్నాలు చేస్తారు. బహుశా మందు కొట్టి వాళ్ళ ఫ్రెండు చెల్లెలింటికి వెళ్తారు. రేపు పొద్దున్న మాత్రం నువ్వు వీలున్నంత తొందరగా కల్యాణి గారి ఇంటికి వెళ్ళిపో. సెక్యూరిటీ వాళ్ళతో ‘స్టోరీ సిటింగ్’ కోసం స్టూడియోకి వెళ్తున్నట్లు చెప్పు.

మహా అయితే మీ నాన్నగారు ఇంట్లో రెండు గంటలు వెయిట్ చేసి వెళ్ళిపోతారు. ఒక వేళ వెళ్ళకపోయినా మీ నాన్నతో ఇందాక మాట్లాడినట్లు నిర్మొహమాటంగా మాట్లాడు. ఆ ఫ్రెండు పక్కనున్న సరే. ఫ్రెండ్ ఎదుట షేమ్ కావడానికి మీ నాన్నగారూ ఇచ్చగించరు కనక ఏ విషయమూ నీ ముందు పేరు తెచ్చే సాహసం చెయ్యరు” అన్నది. థాంక్స్ చెప్పాను. కారుని వెనక్కి పొమ్మన్నాను. వెళ్తు వెళ్తు కొన్ని ఫ్రూట్స్ కొనుక్కన్నాను.

మహతి చెప్పింది 100% కరెక్ట్ అని మరుసటి రోజున రుజువైంది. నాన్న ఆయన ఫ్రెండూ తెల్లారే వరకే అంటే 6.30కే ఇంటికొచ్చారు. నేను బయటకి వెళ్ళడానికింకా రెడీ కాలేదు. ఇద్దరూ పైకొచ్చారు.

కాఫీ ఇప్పించా కనకతో. ముందు రోజు రాత్రి ఏడింటికే కనకని పిలిపించుకున్నాను. అంటే, కార్లో తిరిగొస్తూ కనకని చౌరాస్తా దగ్గర కార్లో ఎక్కించుకుని తీసుకొచ్చా.

“మరి ఏం ఆలోచించావు?” అన్నారు నాన్న ఆయన ఫ్రెండు ముందరే.

“కనీసం మూడేళ్ళ దాకా గ్రేస్ పిరియడ్ నాన్నా. అయినా నీకు తెలీంది ఏముందీ. నా కాళ్ళ మీద నేను నిలదొక్కుకోవాలని నువ్వేగా పదికి పాతిక సార్లు చెప్పిందీ” అన్నాను నవ్వుతూ.

“అవునవును. అలాగే చేద్దాం. అయినా ఇప్పుడు అంత తొందరేముందీ” అని ఆయనా సమాధానంగా నవ్వారు. ఆ నవ్వులో సహజత్వం లేదు. ఓ ఉక్రోషం ఉంది.

“ఓ హిందీ సినిమా కూడా చేస్తున్నావటగా అమ్మాయ్.” అన్నాడు కుటుంబరావు.

“అవును బాబాయ్ గారు. ‘ధీర’నే మళ్ళీ హిందీలో తీస్తున్నారు.”

“బాబాయ్ గారేంటీ, మామయ్యా అను” అన్నాడు నాన్న.

“ఆయన్ను చూస్తే బాబాయ్ గారూ అనే పిలవాలనిపించింది నాన్నా. అలాగే పిలుస్తా. ఏం బాబాయ్ గారూ” అన్నాను కుటుంబరావుతో.

“అలాగలాగే” ఏం చెప్పాలో తెలీక కంగారుగా అన్నాడాయన. మరో అరగంట కూర్చుని శర్మగారి మెస్ నుంచి తెప్పించిన ఇడ్లీలు, గారెలు, ఉప్మా తిని బయలుదేరి వెళ్ళిపోయారు. ఓ సుదీర్ఘమైన నిట్టూర్పు నా నాశిక నించి వెలువడింది.

ఓ మహా యుద్ధానికి ఇది ‘నాంది’ మాత్రమే అనిపించింది. డబ్బు.. మనిషి కనిపెట్టినవి అతి ముఖ్యమయినవీ, అతి అనాలోచితమైనవీ రెండు. ఒకటి డబ్బు, రెండోది ఎండమావి లాంటి పరువు ప్రతిష్ఠ. డబ్బు మనుషుల్నీ మనసుల్నీ అర్జంటుగా కలుపగలదు, విడగొట్టగలదు, ప్రాణం పోయ్యగలదు, ప్రాణాలూ తీయించగలదు. అద్భుత శిఖరాల్ని ఎక్కించనూగలదు. అధఃపాతాళానికి తొక్కనూ గలదు. గౌరవాన్ని ఇచ్చేదీ ధనమే. అగౌరవమనే అంధకారంలోకి నెట్టేది ధనమే.

అరగంటసేపు నా మనసు మనసులో లేదు.

జరిగిందంతా మహతికి చెప్పాను. “అలా.. జస్ట్ టేక్ ఇట్ యీజీ. అలలకి భయపడితే సముద్ర స్నానం ఏనాటికీ చెయ్యలేవు” అన్నది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here