మహతి-23

8
13

(సంచిక పాఠకుల కోసం ప్రసిద్ధ సినీ కవి, రచయిత శ్రీ భువనచంద్ర అందిస్తున్న ధారావాహిక.)

[పవన్ దర్శకత్వంలో అల నటిస్తున్న ‘శర్మిష్ఠ’ అనే సినిమా మొదలవుతుంది. సినిమా ఓపెనింగ్‍కి సత్యమోహన్, వసంత్ వస్తారు. అప్పుడే పవన్ వసంత్ స్నేహితుడని తెలుస్తుంది అలకి. డైలాగ్స్ బట్టీ కొట్టవలసిన అవసరం లేదనీ, స్పాట్ ఛేంజస్ ఉంటాయని పవన్ చెప్తాడు. షూటింగ్‍లో పవన్ ఏక్ట్ చేసి చూపిస్తూంటే, ఒకసారి తను అనుకున్న విధానంలో నటించి చూపిస్తుంది అల. ముందు మౌనంగా ఉన్నా, తరువాత అలని మెచ్చుకుంటాడు పవన్. ఒక సన్నివేశంలో చాలా మెల్లగా, సున్నితంగా నటిస్తే, ఎందుకలా చేశావని పవన్ అడిగితే, రీరికార్డింగ్‍ని దృష్టిలో ఉంచుకుని అలా చేశానని అల చెబితే అతను బాగా సంతోషపడతాడు. ఈ విషయాలన్నీ సదాశివరావుగారితో చెప్తే, యంగ్ జనరేషన్ డైరక్టర్లు ఓపెన్ మైండ్‍తో ఉంటున్నారని చెప్తూ, అందరూ అలా ఉండరనీ, జాగ్రత్తగా ఉండమని చెప్తారు. ‘శర్మిష్ఠ’ హీరో నలుగురి ముందు చనువు ప్రదర్శిస్తుంటే ఇబ్బందిగా ఫీలవుతుంది అల. ప్రెస్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాస్తారు. తన ఇబ్బందిని హీరోగారికి ఎలా చెప్పాలో అర్థం కాక, సదాశివరావుగారికి చెప్పుకుంటుంది అల. వ్యక్తిగతంగా ఆ హీరో మంచివాడనీ, ఇలాంటి కథలు ఎంత వస్తే అంత పబ్లిసిటీ వస్తుందని అంటారు. పవన్ షూటింగ్ చేసే పద్ధతి మోడరన్‍గా ఉంటుంది. మొత్తం వర్క్ కంప్యూటర్‍లో చేసుకుంటాడు. ఈ సినిమాకి కెమెరామెన్ అయిన ముఖేష్ బెడేకర్‍తో పరిచయం చేసుకుని అతనితో హిందీ, ఇంగ్లీషులో మాట్లాడుతూ తన సంభాషణా నైపుణ్యాలు పెంచుకుంటుంది అల. ఇంటికి ఎప్పుడు ఫోన్ చేసిన తండ్రి ముక్తసరిగా మాట్లాడి పెట్టేయడం, అమ్మకి ఫోన్ ఇవ్వకపోవడంతో బాధపడుతుంది అల. ఓ రోజు ఫోన్ చేస్తే, అమ్మే ఎత్తుతుంది. అలకి ధైర్యం చెబుతుంది. పని మీద ధ్యాస పెట్టమని సూచిస్తుంది. ఒకరోజు సర్రీని షాపింగ్‍లో కలిసిన అల ఆమెను తన ఇంటికి పిల్చుకుని వస్తుంది. తనతో మామూలుగా ప్రవర్తించమని అడిగితే, తన ఒకప్పటి ప్రవర్తనకి బాధపడుతుంది సర్రీ. ఇద్దరూ కలిసి వంట చేసుకుంటారు. రాత్రికి ఉండిపోమంటే మాత్రం, ఉండలేను, వెళ్ళిపోవాలి అని చెప్పి వెళ్ళిపోతుంది సర్రీ. – ఇక చదవండి.]

మహతి-2 అల-10:

[dropcap]‘శ[/dropcap]ర్మిష్ఠ’లో నా ఫస్టు కాల్షీట్స్ 10 రోజులు. అవి కంప్లీట్ అయిపోయాయి. సత్యమోహన్ గారి కథ జరుగుతూనే ఉంది. హిందీ ‘ధీర’కి మరో తొమ్మిది రోజులు అయితే గానీ కాల్షీట్లు మొదలుకావు. హిందీ ‘ధీర’కి నలభై లక్షలు ఆఫర్ చేశారు. “అది నిజంగా తక్కువే. అయినా ఇంట్రడక్షన్ ఫిలిం కదా. ఒప్పుకో. అది సక్సెస్ అయితే నెక్స్ట్ పిక్చరే 75 లక్షలు చెప్పొచ్చు” అన్నారు సదాశివరావు గారు. కళ్యాణి గారి సలహా మీద వనస్థలిపురం దగ్గర 300 గజాల ఇళ్ళ స్థలం 18 లక్షలు పెట్టి కొన్నాను, నా పేరు మీదే. అమ్మకి తప్ప ఎవరికీ చెప్పలేదు. కళ్యాణి గారి సలహా మీదే 10 లక్షలు బ్యాంక్ లోన్ తీసుకున్నాను. ష్యూరిటీ సంతకం ఆమే పెట్టారు.

ఏదో తెలియని సంతోషం. సంతోషం పక్కనే విచారం. నా వాళ్ళకి చెబితే ఎంతో సంతోషిస్తారని. అమ్మ ససేమిరా చెప్పొద్దన్నది.  మహతి చాలా సంతోషించి, “మన బేచ్ మొత్తంలో స్వంతంగా స్థలం కొనుక్కున్నది మొట్టమొదట నువ్వే అలా. కంగ్రాట్స్..” అన్నది. ఫాలాక్ష కూడా ఫోన్ చేసి అభినందించారు. ఈ విషయం సదాశివరావు గారికి కూడా చెప్పలేదు. సర్రీకి చెప్పలేదు.

‘శర్మిష్ఠ’ ఫస్ట్ టెన్ డేస్ షూటింగ్ శరవేగంగా నడిచింది. హీరో గారు కూడా నేను బాగా చేసినప్పుడు ఎప్రీషియేట్ చేస్తూ, సరిగ్గా చెయ్యలేకపోయినప్పుడు సలహా ఇచ్చి ధైర్యం చెబుతూ చాలా కో-ఆపరేట్ చేశారు. పవన్ సరే సరి. షూటింగ్ – స్క్రిప్ట్ – స్క్రిప్ట్ – షూటింగ్ తప్ప ఆ మనిషికి మరో లోకం లేదా అనిపించేది. ఎప్పటికప్పుడు డైలాగ్స్‌ని మారుస్తూ, బ్రీఫ్ చేస్తూ, బెటర్‍మెంట్ కోసం తపించేవారు. ‘రేపు పెళ్ళయితే ఈయన అసలు భార్యతో గంటైనా గడుపుతారా?’ అనిపించి నవ్వుకునేదాన్ని. ఓ రోజు తెలిసింది – అతను ప్రేమించి పెళ్ళిచేసుకున్నాడనీ, పెళ్ళయిన ఆరు నెలలకే మ్యూచువల్‍గా విడిపోయారని. కారణం ఇతని ‘వర్క్‌హాలిక్’ సిస్టమ్ ఆమెకి నచ్చక. “భర్తలు గొప్పవాళ్ళు, బాగా సంపాదించేవాళ్ళు, గొప్ప సెలెబ్రిటీలు అయితే భార్యలు గొప్పగా ఫీల్ అవుతారు. కానీ, పెళ్ళాలతో ఆ భర్తలు అంత సమయం గడిపే వీలుంటుందా? ఊహూ. ఆ విషయం నూటికి 90 మంది సెలెబ్రిటీ భార్యలు ఆలోచించరు. సాధించి సాధించి చంపుతారు. అదే, భర్త సంపాదించకుండా ఖాళీగా ఉంటే ఇంకా నరకం చూపిస్తారు పెళ్ళాలు. అసలు భార్యలకి ఏం కావాలీ? ఆ విషయం వాళ్ళకే తెలీదు. తెల్సింది ఒక్కటే, సంసారంలో నిప్పులు పోసుకోవడం” సదాశివరావు గారు ఓనాడు నాతో అన్నారు.

“అదేం?” అన్నాను.

“అదంతే. ఇక్కడున్న గొప్ప గొప్ప హీరోల భార్యలూ, డైరక్టర్ల భార్యలూ భర్తల్ని ఎంతగా కాల్చుకు తింటారో నీకు తెలియదు. చేతి నిండా డబ్బు కావాలి. నౌకర్లూ, చాకర్లూ, కార్లూ, బంగళాలూ కావాలి. క్లబ్బులూ, పేకాటలూ కూడా చాలామందికి కావాలి. కానీ భర్త బాగోగులు మాత్రం అక్కర్లేదు. ఇంక పిల్లలైతే నిజంగా ఋణానుబంధాలే. వాళ్ళ లగ్జరీస్‍కి అంతుండదు. అందుకే సెలెబ్రిటీస్‌కి ‘సన్ (son) స్ట్రోకులూ, డాటర్ స్ట్రోకులూ’ తప్పనివి!” అని కూడా అన్నారు.

ఇవన్నీ నేను ఏనాడూ ఎరగనివి. నా నాలెడ్జి ఎంతని!

“సినిమా అనేది ఓ తపస్సు లాంటిది. అది 9 టు 5 ఆఫీసు వర్క్ కాదు. అందుకే అది పర్సనల్ లైఫ్‍ని బలిగోరుతుంది” అన్నారు సదాశివరావు గారు.

ఆయన ఉండేది శబరీ మేన్షన్స్‌లో. అక్కడన్నీ సింగిల్ రూమ్స్ ఉంటాయి. అందరూ బేచిలర్సే ఉండేది. ఆ మేన్షన్ దగ్గరే ఇస్త్రీ బండీ, ఇడ్లీ, దోసలమ్మే రెండు మూడు తోపుడు బళ్ళూ ఉంటాయి. పొద్దున్నే ఆ తోపుడు బళ్ళ నుంచి కుర్రాళ్ళు ఫ్లాస్కుల్లో మేన్షన్ రూముల్లో ఉండే వారికి టీ కాఫీలు సప్లయి చేస్తారు. మంత్లీ ఖాతాలు కూడా ఉంటై గనుక డబ్బు లేకపోయినా పస్తులుందక్కర్లేదు.

ఆ మేన్షన్ నేనుండే బంగ్లాకి దగ్గరలోనే వుంది. అందుకే పని లేనప్పుడల్లా సదాశివరావు గారు వచ్చి కాసేపు ఆ మాటా ఈ మాటా చెప్తూ వుంటారు. నేనూ వారికి కాఫీ టిఫెన్లు ఏర్పాటు చేస్తా. నాతో పెద్ద తోడు ఆయన. ఒక్కోసారి నా ‘పాత్ర’ అర్థం చేసుకోవడానికి కూడా ఆయన ఇచ్చే సహాయం అద్భుతం. ప్రస్తుతం ఆయన 3, 4 సినిమాల్లో కేరెక్టర్స్ వేస్తున్నారు.

“మంచి ఇల్లు చూడొచ్చుగా!” అన్నాను.

“ఇళ్ళు చాలానే దొరుకుతై. డబ్బుకి ఇబ్బందే లేదు. కానీ అనంతా, జనాలు దొరుకుతారా? మేన్షన్ నిండా తడి ఆరని కలలు కనే యువకులు. చిన్న పాత్ర లభిస్తే పొంగిపోతారు. దొరుకుతుందన్న వేషం దొరక్కపోతే క్రుంగిపోయి మంచానికి అతుక్కుపోతారు. నేనంటూ వున్నాను గనక, వాళ్ళతో మాట్లాడటం, అప్పుడప్పుడూ ధైర్యం చెప్పడం, ఓదార్చడం, రేపటి మీద ఆశ కల్పించడం లాంటివి చేస్తూంటా. నిజం చెబితే వాళ్ళుండబట్టి నా బతుక్కీ ఓ అర్థం ఉందన్న సంతృప్తి నాలో ఉంది” చెప్పి సైలెంటయ్యారు రావు గారు.

అప్పుడనిపించింది – ‘ఈయనలోనూ ఒంటరితనమూ, శూన్యమూ భయంకరంగా పేరుకుపోయాయ’ని.

“అవును.. మనిషి ఎదిగిన కొద్దీ లభించే వరాలు ఒంటరితనమూ, ఏమీ ఎవరితోనూ చెప్పుకోలేని దైన్యమూ. కొండ మీదకి ఎక్కీ ఎక్కీ శిఖరాగ్రానికి చేరతావు. అలా చేరేవరకూ నీ ఏకాగ్రతా పట్టుదలా ధైర్యమూ నీకు నీడలా అనుక్షణం తోడుంటై – ఎక్కిన తరువాత చూస్తే నీ చుట్టూ శూన్యమైన ఆకాశం తప్ప ఏదీ వుండదు, ఎవరూ వుండరు” నిర్లిప్తంగా అన్నారు రావు గారు.

“మరి” నా గొంతులో సుడి తిరిగిన భయం నాకే తెలిసింది.

ఠక్కున ఆయన ఏం చెప్పారో ఆయనకి తెలిసింది. “బంగారూ, నీకెప్పుడూ అటువంటి స్థితి రాదులే” అని తల నిమిరి వెళ్ళిపోయారు.

***

‘ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఏర్‍పోర్ట్’లో లాండ్ అవగానే నా ఒళ్ళు ఝల్లుమంది. మేము తూ.గో. జిల్లా, ప.గో. జిల్లా పరిసరాలని ‘ధీర’కి ఎంచుకున్నట్లుగా, వాళ్ళు ‘సిర్సా’ (Sirsa) పరిసరాలని ఎంచుకున్నారు. ఢిల్లీ నుంచి సిర్సాకి ట్రైన్‍లో కంటే కారులో బాగుంటుంది అన్నాడు నన్ను రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన ప్రొడక్షన్ మేనేజర్ హరిలాల్.

హరిలాల్‍కి ఎక్కువగా తమిళం, కొద్దిగా తెలుగు అర్థం అవుతుంది. మనం చెప్పింది చక్కగా విని, హిందీలో ఆన్సర్ చెబుతాడు. ఇంగ్లీషూ ఓహో అని కాకుండా మా బెజవాడ వాళ్ళలాగే మాట్లాడతాడు. అతనిది హిస్సార్ టౌన్. అంటే అది సిర్సాకి దగ్గరగా ఉంటుందిట.

చాలా కంఫర్టబుల్ ‘ఇన్నోవా’. ఒంటరిగా హైదరాబాద్ నుంచి ఢిల్లీకి రావడానికి చాలా భయపడ్డాను. అక్కడ ఉండే వీళ్ళ ప్రొడక్షన్ మేనేజర్ నన్ను హైదరాబాదులో ఫ్లైట్ ఎక్కించారు. సినిమా వాళ్ళకి సౌత్ టు నార్త్, నార్త్ టు ఈస్ట్ లింక్స్ ఉంటాయని తరవాత తెలిసింది. ఒక్క ప్రొడక్షన్ మేనేజర్ చాలు, అన్నీ చూసి పెట్టడానికి – లొకేషన్లతో షూటింగ్ లైసెన్సులతో సహా. హైదరాబాదులో నన్ను ఎక్కించింది ‘రాజు’ అనే ప్రొడక్షన్ మేనేజర్. చాలా మర్యాదగా ఉన్నారు. “మీరేమీ కంగారు పడనక్కరలేదు. అవుట్ గేట్ దగ్గర నేమ్ బోర్డ్స్‌తో సిద్ధంగా ఉంటాడు. అతని పేరు హరిలాల్” అని చెప్పి, అతని నెంబర్ కూడా ఇచ్చాడు. పోలికలు కూడా చెప్పాడు. ఎడమ బుగ్గ మీద కందిగింజంత పులిపిరి కాయ, నీలి కళ్లు అని.

“ఫ్రెష్ అవుతానంటే రోతక్ (Rohtak) లో మనకి తెలిసిన మంచి హోటల్ ఉంది. స్నానపానాలు చెయ్యెచ్చు” అన్నాడు హరిలాల్.

“వద్దండీ నేను ప్రయాణానికి సిద్ధమండీ” అన్నాను.

“బాత్‌రూమ్ etc.” అన్నాడు తల పక్కకి తిప్పి.

“నో ప్రాబ్లమ్” అన్నాను. అవన్నీ ఫ్లయిట్ లోనే కానిచ్చా.

చాలామంది యీ విషయాల్ని గురించి పట్టించుకోరు. ఆడవాళ్ళకి ఈ విషయాలే చాలా ఇబ్బంది కలిగిస్తాయి. మగవాళ్ళకైతే ఓపెన్ ఎయిర్. ఆడవాళ్ళకి అలా కుదరదు గదా.

“ఓహ్.. దివ్యమైన రోడ్స్. రియల్లీ యూ విల్ ఎంజాయ్” అంటూ లగేజ్ అతనే పట్టుకున్నాడు. వద్దన్నా వినలా.

లగేజ్ విషయంలో కూడా నాకు హెల్ప్ చేసింది సదాశివరావు గారే. “అమ్మాయ్. రెండో మూడో కేజువల్ డ్రెస్సులు, రెండు చీరలు, రెండు నైటీలు, లోదుస్తులు మాత్రమే తీసుకెళ్ళు. డ్రెస్సులు ఎలాగూ వాళ్ళే అమరుస్తారు. నగలు కూడా సింపుల్‍గా ఓ గొలుసు, ఉంగరంతో వెళ్ళు. కావల్సిన నగరు వాళ్ళే ఎరేంజ్ చేస్తారు. ఓ నోట్ బుక్, పెన్ను దగ్గర పెట్టుకో. మంచివారనుకున్న వారి నెంబర్లు మాత్రం తప్పక నోట్ చేసుకో. మా అందరి నెంబర్లు, అంటే నాది, సత్యమోహన్‍దీ, పవన్‍దీ, ప్రొడక్షన్ మేనేజర్ రాజుదీ, కళ్యాణి గారిదీ, అందరి నెంబర్లు నోట్ చేసుకో. మరో నోట్ బుక్‍లో కూడా. ముందు జాగ్రత్తకి చెబుతున్నా. షూస్ ఒక పెయిర్ చాలు. అన్నీ వాళ్ళే కొంటారు” అని అన్ని జాగ్రత్తలూ చెప్పారు. అది ఎంతో మంచిదయింది. ఓ మీడియం సూట్‍కేసూ, ఓ మాదిరి షోల్డర్ బ్యాగ్‌తో వచ్చాను.

హాయిగా గాలి పీల్చుకున్నాను. ఇన్నోవా కొత్తది. ఎ.సి. సూపర్. రిలాక్స్‌డ్‍గా కూర్చున్నాకా అన్నాడు “మీకు ఊళ్ళ గురించి కొంచెం కొంచెం చెబుతూ వుంటాను. షూటింగ్ గాప్‌లో అవన్నీ చూడొచ్చు. మా హర్యానా పాడిపంటలకి అత్యంత ప్రసిద్ధి పొందింది. యాదవులు ఎక్కువ. జాట్‍లు. వారు ధీరులు. ప్రాణాలు పోయినా పోరు ఆపని వీరులు. అయితే చాలా శాంతమూర్తులు. హర్యానా చాలా శాంతియుతమైన రాష్ట్రం. ఇక్కడ థర్డ్ లాంగ్వేజ్‍గా ఒకప్పుడు తెలుగు ఉండేది. ఆ తరువాత ఆడపిల్లలు దొరకక, హర్యానా వాళ్ళు కేరళ నించి మలయాళీ అమ్మాయిలని వేలకొద్దీ, వివాహం చేసుకున్నారు. ఇప్పుడు మలయాళం, తమిళ్ కూడా హర్యానా సిటీల్లో వినపడతాయి. ఒకప్పుడు ఇడ్లీ, దోశ, సాంబార్, వడ అంటే ఎవ్వరికీ తెలిసేది కాదు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల పుణ్యమా అని లెక్కలేనన్ని సౌత్ ఇండియన్ హోటల్స్, రెస్టారెంట్లు వచ్చాయి” అన్నాడు.

“థాంక్యూ హరిలాల్ జీ.. ఇట్స్ గ్రేట్” అన్నాను. నేనన్న దానికి గొప్ప అర్థం లేదని నాకు తెలుసు. కానీ నిజమైన కృతజ్ఞత అతను నా ముఖం చూసి తెలుసుకున్నాడని తప్పక చెప్పగలను.

“ఇక్కడ మాట్లాడే భాష హరియాణవీ. ఈ భాషలి లిపి లేదు. హిందీ లోనే వ్రాయటం, చదవటం. అది కాక బాగిడీ, మార్వారీ, పంజాబీ, హిందీలు జనాలు మాట్లాడుతారు. హిందీ వస్తే గనుక మా భాష తొందరగానే పట్టుబడుతుంది. అయితే భాష ఉచ్చారణలోనూ, పొందికలోనూ కొంత కఠినత్వం అంటే మొరటుగా వుంటుంది” చెప్పాడు. సైన్ బోర్డులన్నీ హిందీలో వున్నాయి. ఇంగ్లీషులో కూడా వున్నాయి గనుక చదవగలుగుతున్నాను.

ఏదో ఓ హోటల్, అదీ రోడ్డు పక్కనున్న హోటల్ దగ్గర ఆపి ‘టీ’లు చెప్పాడు. దుకాణాదారు వెంటనే చాయ్ పాత్రలో టీ పొడి, పాలు కొంచెం అల్లం, చక్కెర వేసి ఫ్రెష్‍గా టీ పెట్టాడు. నా ఆశ్చర్యం చూసి, “ఇక్కడ ఎప్పుడూ.. అంటే నార్త్‌లో ఎప్పుడూ ఆర్డర్ చేశాకే ఫ్రెష్‍గా పెట్టి ఇస్తారు. సౌత్ లోలా ఫ్లాస్కుల్లో పోసి వుంచరు. నార్త్‌లో కాఫీ కంటే టీ బాగుంటుంది. ఫిల్టర్ కాఫీ కావాలంటే కొంచెం కష్టమే” అన్నాడు. నాకొచ్చిన హిందీలో, “కోయీ బాత్ నహీ, హరిలాల్ జీ. చాయ్ ఓకే” అన్నా.

టీ అద్భుతంగా వుంది. ఎందుకంటే టీని pure milk తో చేశారు గానీ అందులో నీరు కలపలేదు. అందుకే చిక్కగా, మహారుచిగా వుంది. మనవాళ్ళు అరలీటరు పాలకి అయిదు కప్పుల నీళూ కలిపి చేస్తారు. అసలు సిసలు ‘టీ’ని ఆస్వాదించాలంటే నార్త్ లోనే అని నిర్ధారించుకున్నా. హైదరాబాద్ ఇరానీ చాయ్‍లు కూడా చాలా చాలా బాగా వుంటాయి.

“హర్యానాలో చూడాల్సిన అతి ముఖ్య ప్రదేశం కురుక్షేత్ర. రెండవది గుడుగావ్ (Gurgaon, Gurugram).  గురుగ్రామ్ అనబడే ద్రోణాచార్యుని అప్పటి గ్రామం. ఇప్పుడు గుర్గాఁవ్ ఆల్‍మోస్ట్ ఢిల్లీలో కలిసిపోవడమే కాగ ఐటి హబ్ గానూ, కార్పోరేట్ హబ్ గానూ రూపొందింది. అక్కడికి దగ్గరే ఉన్న ‘సోనా’లో hot springs (అంటే అత్యంత వేడిగా భూమిలో నుంచి పైకి ఉబికి వచ్చే బావుల్లాంటివి) చూడచ్చు, కొంచెం ఓపిక చేసుకుంటే. సోనిపత్ (సోనిపట్టు), పానిపట్ (పానిపట్టు) కూడా హర్యానా లోనివే” ఆగి టీని ఆస్వాదించటం మొదలుపెట్టాడు.

సౌత్ అంతా దారికి అటూ ఇటూ పచ్చని పొలాలతో కొబ్బరి చెట్లతో, మామిడి తోటలతో కళకళలాడుతుంది. ఇక్కడా గ్రీన్ పేచెస్ కనబడుతున్నాయి.

“ఓ సీసమ్ కా పేడ్” అని రోడ్డు పక్క చెట్లని చూపించాడు. అంటే ‘సీసమ్’ అనే చెట్లన్న మాట. యూకలిప్టస్ బారులు కూడా రోడ్ల పక్క కనిపించాయి. ఇక్కడా గుంపులు గుంపులుగా కొంగలు ఆకాశంలో ఎగురుతున్నాయి.

కారు ఒక చోట ఆపాడు. దట్టంగా చెట్లు. చెట్ల పైనా చెట్ల కింద నీడలో కనీసం 50, 60 నెమళ్ళు హాయిగా ఉన్నాయి.

“ఆ పురి విప్పిన నెమళ్ళు మగవి. పింఛం విప్పి ఆడేవి మగ నెమళ్ళే. ఆడవి అందంగా ఉండవు” నవ్వి అన్నాడు. నెమలి అరుపులు మాత్రం, ఏ మాత్రం వినసొంపుగా లేవు.

‘భివానీ’ దరిదాపులకి చేరాం. “మీకు లస్సీ రుచి చూపిస్తా” అని ఓ టీ స్టాల్ దగ్గర ఆపాడు. ఓ పక్క టీ అయితే, మరో పక్క లస్సీ.. ఇంకో పక్క ‘చూలా’ మీద వేడి వేదిగా తయారవుతున్న ఆలూ పరోటాలు. నేతి వాసన ఘుమాయిస్తోంది.

“తావూజీ.. మేమ్ సాబ్ మద్రాసీ హై.. ఏక్ అచ్ఛాసా లస్సీ పిలాదో” అన్నాడు. అని, “మీరు ఆంధ్రా అంటే ఇప్పుడు అందరికీ తెలుస్తుంది.. ఎన్.టి రామారావు జీ పుణ్యాన. ఇతను పెద్దగా న్యూస్ వినడు. అందుకే మద్రాసీ అన్నా. సారీ” అన్నాడు.

కీర్తిశేషులైన ఎన్.టి.ఆర్. పేరు హర్యానాలో వినబడటం నాకు అమితమైన ఆనందాన్ని కలిగించింది. ఒక పేద్ద పొడవాటి గ్లాసు నిండా చిక్కటి లస్సీ. పెరుగు, అది గడ్డ పెరుగులో నీళ్ళు కలపలేదు. ఐస్ ముక్కలూ, పంచదారా, రూఅఫ్జా ఓ అరకప్పుడూ కలిపి బ్రహ్మాండంగా చిలికాడు. ఆ టేస్టు అమోఘం. ఎంతలా అంటే ‘అమ్మ కడుపు చల్లగా’ లాగా నా కడుపు చల్లగా హాయిగా వుంది. భివాని ఊరిని నేను చూడలేదు. ఆ లస్సీ మత్తుకు ఒళ్లు తెలీకుండా ఆ కార్లోనే నిద్రపోయా. ప్రామిస్.

“రాబోయేది హాన్సీ (Hansi). ఆ తరువాత వచ్చేది హిస్సార్. హిస్సార్ తరువాత సిర్సా. అక్కడ ఏర్‍ఫోర్స్ స్టేషన్‍కి వెళ్ళే దారిలో రామ్‍లాల్ టీ దుకాణం వుంది. మీరు టీ తాగి తీరాలి. అలాగే శర్మా రెస్టారెంట్. ఈ శర్మ సౌత్ ఇందియన్ శర్మ కాదండి. శర్మ (Sharma) అంటే నార్త్ ఇండియన్. మసాలా దోశ వెయ్యటంలో ఎక్స్‌పర్ట్. రూఅఫ్జా కలిపి మిల్క్ షేక్ కూడా సూపర్‍గా తయారు చేస్తాడు” అన్నాడు హరిలాల్, నేను కళ్ళు తెరిచి సరిగ్గా కూర్చోవటం చూసి.

“ఇందాకటి లస్సీకే నాకు మత్తొచ్చింది. పిచ్చి నిద్రపోయాను” అన్నాను నవ్వి. “అది కాదు మేడం. బాగా తెల్లవారు ఝామున లేచి ఉంటారు. అంతే” తనూ నవ్వి అన్నాడు హరిలాల్.

“మీరు లంచ్ చేస్తానంటే హిస్సార్‍లో చేద్దాం. అక్కడ గవర్నమెంట్ గెస్ట్ హౌస్ దగ్గర ‘షెకావత్’ ధాబా ఉంది. పక్కా పంజాబీ, రాజస్థానీ, హరియాణవీ వెజ్ అయిటమ్స్ దొరుకుతై. బెస్ట్ అనుకోండి” అన్నాడు.

“నిజంగా నాకు ఆకలి పెద్దగా లేదు. కానీ మీ వర్ణన టెంప్టింగ్‍గా వుంది” నవ్వాను.

“నో.. నో.. నిజంగా సూపర్ ధాబా అది. అదీగాక ఓనర్ కొడుకు నా తమ్ముడి క్లాస్‍మేట్. ఏక్ దమ్ ఫస్ట్ క్లాస్ ఖానా మిలేగా” అన్నాడు.

భోజనం సంగతి చెప్పను. ఎందుకంటే కొన్ని వర్ణనలకు అందవు. ఎంత ఉత్సాహం వచ్చిందంటే హిస్సార్ భోజనమూ ప్లస్ వారు ప్రత్యేకంగా ఇచ్చిన ఎ.సి.రూమ్ లో కాసేపు రెస్టు తీసుకోవటం! హరిలాల్ నా వద్ద పర్మిషన్ తీకుని వారి బంధువుల్ని కలవడానికి సిటీలోకి వెళ్ళాడు ఓ గంట పాటు. ఆ గంటలో అరగంట పడుకుని, పది నిమిషాల్లో ఫ్రెష్ అయ్యాను.

సిర్సా వరకు ప్రయాణం సుఖంగా సాగింది. అదో రకమైన ఎండ. సౌత్ టైపుది కాదు. ‘ఈ ‘సిర్సా’ అనబడే నగరం నా హిందీ సినిమాలకి మొట్టమొదటి నేల అవుతున్నది’ అనుకోగానే ఓ జలదరింపు, ఓ పులకరింత, ఓ బెరుకు, ఓ కంగారు.

‘Sirsa Welcomes You’ అన్న బోర్డు దగ్గర కారు ఆపించి, నగ్న పాదాలతో కారు దిగి నేలకి రెండు చేతులూ ఆన్చి నమస్కరించాను. ఎందుకో మా అమ్మ గుర్తొచ్చింది.

***

మొదటే చెప్పినట్లు నా పేరు ‘అల’ అనబడే అనంతలక్ష్మి. ఓ యావరేజ్ స్టూడెంట్‍ని. తిమ్మూ అనబడే తిరుమలరావుని ఘోరంగా ప్రేమించి అతన్ని వేటాడిన దాన్ని. మహతి మాటలతో కొంచెం మారి, నన్ను నేను మార్చుకునే లోగా సినిమాల్లో నటించే ఛాన్స్ దొరికింది. అక్కడి నించీ జీవితం మారిపోయిది. నా మొదటి సినిమా ‘ధీర’ తెలుగులో 200 రోజులు ఆడింది. అప్పటిదాకా మూలనున్న సత్యమోహన్ బిజీయస్ట్ డైరక్టర్ అయ్యారు. నా మొదటి హిందీ సినిమా కూడా ‘ధీర’ రీమేకే. అయితే దానికి ‘హంటర్ వాలీ’ అని పేరు పెట్టారు. తెలుగులో ఎంత పొదుపుగా తీశారో, హిందీలో అంత లావిష్‍గా తీశారు. చెప్పలేనంత రిచ్‍గా తీశారు. నా కాస్ట్యూమ్స్‌కే దాదాపు 90 లక్షలయిందట. స్క్రీన్ మీద నన్ను నేను చూసుకుంటే పిచ్చెక్కింది. అప్పుడనిపించింది ‘రిచ్‍గా తియ్యాల్సిన సినిమాలని రిచ్‍గానే తియ్యాలి’ అని.

హిందీ సినిమా హీరో పేరు వినోద్ కపూర్. మా జోడీ ఎంత అద్భుతంగా స్క్రీన్ మీద ఉన్నదంటే, రాజ్ కపూర్ – నర్గిస్, హేమమాలినీ-ధర్మేంద్ర, రాజేంద్రకుమార్ – సాధన లాగా ఉందని పేరొచ్చింది.

ఎంతో మంది, మహతి, ఫాలాక్ష, కళ్యాణి, వసంత్, సదాశివరావు గారి లాంటి అద్భుత వ్యక్తులు నా జీవితాన్ని సరైన దారిలో వెళ్ళేలా పరిశ్రమించారు.

[కానీ చదువరీ –

జీవితం అనూన్యం. సక్సెస్ ఎంత గొప్పదయినా నిజంగా శాంతినివ్వగలదా? ఇచ్చే శక్తి సక్సెస్‍కి ఉందా? డబ్బు అన్నీ కొనగలదు. పదవినీ, పరుపునీ, ఆస్తినీ, ప్రతిష్ఠనీ, గౌరవాన్నీ, హంగునీ, ఆర్భాటాన్నీ – అన్నీ కొనగలదు. మనశ్శాంతిని కొనగలదా?]

ఇప్పుడు చెప్పలేను. ఎందుకంటే ‘సిర్సా’ నగరపు తొట్ట తొలి అడుగులో వున్నాను. షూటింగ్ ఇప్పటికింకా ప్రారంభం కాలేదు. ఆ.. చెబుతాను. అల అనే నేను ఇంకా సక్సెస్ మొదటి మెట్టు మీదే కదా ఉన్నదీ! ఏ పువ్వూ ఠక్కున ఒక్కసారిగా విచ్చుకోదు. నేనూ అంతేనేమో. జీవితపు ‘రేకలు’ విప్పుకుంటూ మీ ముందుకు మళ్ళీ మళ్ళీ వస్తూనే వుంటాను.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here