(సంచిక పాఠకుల కోసం ప్రసిద్ధ సినీ కవి, రచయిత శ్రీ భువనచంద్ర అందిస్తున్న ధారావాహిక.)
[సిర్సా సిటీ అద్భుతంగా ఉందని గ్రహిస్తుంది అల. ఓ ఆపేక్ష ఆ నగరం మీద ఆమెకి కలుగుతుంది. తన ఫోన్ నెంబరు ఇచ్చి ఏ అవసరం వచ్చినా ఫోన్ చేయమని చెప్తాడు హరిలాల్. షూటింగ్ జరిగే చోటు, తన బస అయిన ‘రోజ్‍బడ్’ రిసార్ట్స్ చేరుకుంటుంది అల. అది చాలా ఖరీదైన రిసార్ట్ అనీ 300 ఎకరాల్లో విస్తరించి ఉందని చెప్తాడు హరిలాల్. లోపలికి ప్రవేశించగానే పెద్ద పెద్ద బేనర్‍లు ఫోటో స్టాండ్‍లలో అల ఫోటోలతో ఆమెకు స్వాగతం చెప్తారు. దర్శకుడు అమిత్ సక్సేనా వచ్చి పలకరిస్తాడు. తన అసోసియేట్ డైరక్టర్ తరుణీ కిద్వాయ్‌ని పరిచయం చేస్తాడు. తరుణీ, అల ఇద్దరు పరస్పరం పలకరించుకుంటారు. హిందీ, ఇంగ్లీషు భాషలపై పట్టు పెంచుకోవాలనుకుంటుంది అల. మహతికి ఫోన్ చేస్తే తగిన సూచనలు చెప్తుంది. సాయంత్రం హీరో వినోద్‌తో సహా మొత్తం యూనిట్ అంతా బ్లూబెర్రీ హాల్‍లో అలని కలవడానికి వస్తారని చెప్తుంది తరుణి. సాయంత్రం చెప్పిన సమయానికి అందంగా తయారై ఉంటుంది. అలని చూసి ఆశ్చర్యపోతుంది తరుణి. అలని ప్రెస్‍కి పరిచయం చేసే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తారు నిర్మాతా, దర్శకుడు. అలని అల్కా సుభాష్ అని పరిచయం చేస్తారు. ఆమె గురించి లేనిపోని గొప్పలు కల్పించి చెప్తారు. కాసేపయ్యాకా, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డోర్ గుండా అలని వేదిక బయటకి, అక్కడి నుండి తన విల్లాకి తీసుకువస్తారు వినోద్, తరుణి. అలని రిలాక్స్ అవమని, తన భోజనం అయ్యేదాక తరుణి ఉంటుందని చెప్పి, అల బుగ్గ మీద చిన్న ముద్దు పెట్టి వెళ్ళిపోతాడు వినోద్. అవాక్కవుతుంది అల. తరుణి కూడా అలని కౌగిలించుకుని రెండు బుగ్గల మీదా ముద్దులు పెడుతుంది. – ఇక చదవండి.]
మహతి-2 అల-12:
[dropcap]ఒ[/dropcap]క్కసారిగా తరుణిని అవతలికి నెట్టేశా.
“భయపడ్డావా నేనూ ఆడదాన్నేగా! అయినా నీ అందం ఆడవాళ్ల మనసుల్ని సైతం మరపించేది. అల్కాజీ, నా కౌగిలింత కేవలం మీ అందానికి మెచ్చుకోలు మాత్రమే. జస్ట్ ఎప్రిసియేషన్” కుర్చీలో కూర్చుని అన్నది.
నేను కొంత స్తిమితపడే ప్రయత్నం చేశాను.
“హీరోగారు నన్ను మీతో పంపించింది మీ అవసరాలు కనిపెట్టి చూడడానికి. మీకు హాట్ డ్రింక్స్ కావాలంటే మీ పేరు బయటికి రాకుండా నేనే తెప్పిస్తా. In fact, కారులోని మేకప్ కిట్‍తో బాటు అవీ వున్నాయి” అన్నది.
“సారీ, నాకలాంటివేమీ అలవాటు లేదు” అన్నాను.
“అలా అయితే నేను కొంచెం తెచ్చుకుంటాను. అన్నట్టు మీరు భోంచేసేటప్పుడు కంపెనీగా ఉందామని నా డిన్నర్ కూడా మీ డిన్నర్ తోటే ఆర్డర్ చేశా. మీరు స్నానం చేసి బట్టలు మార్చుకోండి. అన్నట్టు మీ వార్డ్‌రోబ్‍లో కొత్త నైటీలు కూడా ఉంటాయి” అన్నది తరుణి.
నేను ఏమీ మాట్లాడకుండా అలాగే నిలబడ్డా.
“సారీ, నేను మీ ప్రైవసీకి భంగం అనుకుంటే వెంటనే వెళ్ళిపోతా” అని లేచింది.
“నో.. నో.. మీ భోజనం మీరు కానివ్వండి. నాక్కొంచెం ఒంటరిగా తినటం అలవాటు. భోం చేశాకే మీరు వెళ్ళవచ్చు” అన్నాను, సూట్ లోపలి రూమ్ లోకి వెడుతూ.
‘కీ హోల్’ లో నుంచి నన్ను చూస్తుందా అన్న అనుమానం వచ్చినా నేను లెక్క చేయకుండా బాత్ రోబ్ తగిలించుకుని బాత్‍రూమ్ లోకి వెళ్ళాను.
చాలా తీరిగ్గా స్నానం చేసి అక్కడ వున్న నైటీ వేసుకుని మళ్ళీ ముందు రూమ్ లోకి వచ్చాను. ఫుల్ బాటిల్‍లో సగం ఖాళీ చేసిందా అనిపించింది. తలెత్తి నా వంక చూసింది. నేను చాలా సూటిగా ఆమె కళ్ళల్లోకి చూశాను. ఇది ఫాలాక్ష నాతో చెప్పిన ట్రిక్. మిలిటరీలో డైరక్టుగా కళ్ళ వంకే చూసి మాట్లాడాలట. అది మనసులోని ‘నిర్భీతి’ని, ధైర్యాన్ని తెలియజేస్తుందిట.
“సారీ, నేను నాకు కావలసిన చపాతీలూ కూరా రిసెప్షన్ నుంచి బాక్సులు తెప్పించి పేక్ చేసుకున్నాను. నేను నా రూమ్‍కి వెళ్లి తింటాను” కళ్ళు దించుకుని అన్నది.
“నో ప్రాబ్లమ్ తరుణీజీ. మీరు తినేసే వెళ్ళొచ్చు” టేబుల్ మీద పెట్టిన ఐటమ్స్ దగ్గరకి వెళ్ళి కుర్చీ లాక్కుని కూర్చుని అన్నాను.
“లేదు లేదు..” గబగబా లేవబోయింది.
“నో.. నో.. మీరు వెళ్ళిపోతే నేను హర్ట్ అవుతాను” కళ్ళల్లోకి సూటిగా చూస్తూనే అన్నాను.
మౌనంగా నేనో ప్లేట్ తీసుకుని వడ్డించుకోసాగాను. ఓ క్షణం ఆగి, తనూ ఓ ప్లేట్ తీసుకుని వడ్డించుకోవటం మొదలుపెట్టింది. పర్దార్థాలు హాట్ బాక్సుల్లో వున్నాయి గనుక వేడిగానూ, రుచిగానూ కూడా వున్నాయి.
“అది సర్‍సోంకా సాగ్, అది మఖ్ఖిదా రోటీ, నార్త్ స్పెషల్స్..” ఒక్కొక్క దాని గురించీ వివరిస్తూ నాకూ వడ్డించింది, వినయంగా, పొందికగా.
“ఓహ్.. ఐ నెవర్ టేస్టెడ్” అన్నాను రోటీ ముక్క తుంపుతూ.
ఆమె తినటం మొదలెట్టాకే నేనూ తింటున్నాను. కనకాక్షి (టచప్ ఉమన్, ‘ధీర’) చెప్పిన విషయాలు నాకు బాగానే గుర్తున్నాయి. నిజంగా ఆ హరియాణవీ, పంజాబీ ఫుడ్ అయిటమ్స్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా ‘మిర్చీ కా సాలన్’, కడీ పకోడా. భోజనం దాదాపు అరగంట సేపు కొనసాగింది. తప్పు నాదే, ఏ పదార్థమైనా, ఆవిడ తిన్నాకే నేనూ తింటున్నా. బహుశా గ్రహించిందనుకుంటా, తొందరగానే ముగించింది. ఓ రెండు నిముషాలు మౌనంగా వుండి, హేండ్స్ వాష్ చేసుకుని వచ్చింది.
“అల్కాజీ.. భోజనం విషయంలో కూడా మీరు భయపడటం నేను గమనించాను. నిజంగా నా ప్రవర్తన మీద నాకే సిగ్గేస్తోంది” నా రెండు చేతులూ పట్టుకుని బాధగా అంది. నేనేమీ మాట్లాడలేదు. కానీ ఆవిడ చేతులు చల్లగా వున్నాయి. ముఖంలో ఓ తప్పు చేసిన ఫీలింగ్.
“రిలాక్స్ తరుణీజీ. రిలాక్స్. నేనేమీ అనుకోలేదు. మనం కలిసి పని చెయ్యాలి కదూ. బీ మై ఫ్రెండ్ అండ్ గైడ్ మీ” అన్నాను. ఈసారి నా చేతుల్ని విడిపించుకోలేదు. ఆమె ముఖంలో రిలీఫ్ కనబడ్డది. “థాంక్యూ థాంక్యూ” అని బయటకి వెళ్ళి ‘గుడ్‍నైట్’ అని తలుపు దగ్గరకు లాగింది.
నేను లోపలి వైపు లాక్ చేసుకుని నిశ్చింతగా పడుకున్నాను. అటువంటి బెడ్ గురించి నేను ఏనాడూ వూహించను కూడా లేదు. చాలా మెత్తగా, చిరు వెచ్చగా, అమ్మ ఒడిలాగా అనిపించింది.
మా అమ్మతో మాట్లాడాలనిపించింది. అమ్మ నిద్రపోతూ వుంటుంది. లేకపోతే నా గురించే ఆలోచిస్తూ వుంటుంది. ఎక్కడి అల.. ఎక్కడి అల్కా సుభాష్!
మెల్లగా ఓ మబ్బులా, ఓ మంచు తరగలా నిద్ర నా కనుల మీద వాలింది. వాల్ క్లాక్ శబ్దం టిక్ టిక్ మంటూ నాకు చిచ్చికొట్టడం కొంచెంగా తెలిసింది.
***
“తరుణీ కిద్వాయ్ చాలా ఫాస్ట్. ఏ పనీ పెండింగ్‍లో పెట్టరు. అర్ధరాత్రి అయినా పని పూర్తి చేశాకే సెలవు తీసుకుంటుంది. టెలిగ్రాఫిక్ మెమరీ. అల్కాజీ.. మీకేం కావల్సినా తనతో చెప్పండి. She’ll do it happily.” అన్నారు అమిత్ సక్సేనా మరుసటి రోజు షూట్‍లో కలిసినప్పుడు. “యస్సర్” అన్నాను.
“మీరు స్టూడెంటూ, నేనేమీ టీచరూ కాదు.. యస్సర్ అనడానికి. యూ కెన్ కాల్ మీ యాజ్ అమిత్” నవ్వి అన్నారు. తెలుగు ఫీల్డుకీ, హిందీ ఫీల్డుకీ తేడా కొంచెం కొంచెం తెలుస్తోంది. హిందీలో అందరూ అందరితోటీ ఏ విధమైన భేషజాలు లేకుండా మాట్లాడుతారు. తెలుగులో రిజర్వేషన్స్ ఎక్కువ. అఫ్‍కోర్స్ శ్రమ ఒకటే.
ఊరికే సెట్‍లో అబ్జర్వ్ చేస్తూ కూర్చున్నా. పొద్దున్న 9కి కాల్‍షీట్. లంచ్ అయ్యాకా కూడా వినోద్ కపూర్ రాలేదు. నా ఆశ్చర్యం చూసి, తరుణి – “ఇక్కడ ఎంత ఆలస్యంగా వస్తే అంత డిమాండ్ వున్నట్టు. అఫ్‌కోర్స్, ఠంచనుగా ఆన్ టైమ్‌లో వచ్చేవారూ ఉన్నారు. కానీ వేళ్ళ మీద లెక్కపెట్టచ్చు” అన్నది నవ్వుతూ.
“ఇవ్వాళ మీకు ఏ సీనూ లేదు. ఉండొచ్చు, హాయిగా రెస్టూ తీసుకోవచ్చు. అల్కాజీ, నటీనటులకి ఆరోగ్యమూ, నిద్రా చాలా ముఖ్యం. ఏ మాత్రం అలసటగా వున్నా కెమెరా పట్టేసుకుంటుంది” తనే మళ్ళీ అన్నది.
దాదాపు మూడు గంటలకి నేను మళ్ళీ నా విల్లాకి వెళ్ళిపోయా. నిజంగా కాసేపు నిద్రపోవాలనిపించింది. అంతేకాదు, జరిగిన విశేషాలన్నీ మహతితో పంచుకుంటే తప్ప ప్రాణానికి తృప్తి కలగదు. విల్లాకి వెళ్ళి చూస్తే అంతా నీటుగా అందంగా సర్ది ఉంది. ఓ బాస్కెట్ నిండా పళ్ళూ, బిస్కట్లు, చాక్లెట్లూ నింపి ఉన్నాయి.
ఒక చాక్‍లెట్ బార్‍లో సగం తుంపి నోరు తీపి చేసుకున్నాను. మహతికి ఫోన్ చేశాను. విషయాలన్నీ వివరించాను. ఓ నిముషం అది మౌనంగా ఉంది.
“నేను అన్నయ్య ఫోటో, ఫాలాక్ష ఫొటో నీకు పంపుతాను. వాటిని నీ రూమ్‍లో కనిపించేలా పెట్టు. ఎవరు అంటే, నీ బ్రదర్స్ అనీ ఆర్మీలో ఉన్నారనీ చెప్పు. ఎందుకంటే, నార్త్ లో ప్రతి ఇంటి నుంచీ ఒకరైనా డిఫెన్స్ ఫోర్సెస్‍లో వుంటారు. వారికి ఖచ్చితంగా మిలిటరీ వారంటే గౌరవం వుండి తీరుతుంది. రెండోది ఏదంటే, అందరూ వడ్డించుకు తినేటప్పుడే నువ్వూ నీక్కావలసింది తిను. ఇక డిన్నర్ అయితే పూర్తిగా తలుపులు వేసుకున్నాకే తిను. ఇది అందర్నీ అనుమానించటం కాదు. మనకి మనం తీసుకునే జాగ్రత్త. సామాన్యంగా హీరోయిన్ల వెంట వాళ్ళ అమ్మో, నాన్నో, ఆంటీలో ఎవరో ఒకరు వుంటారు. అమ్మ నీ పక్కన లేకపోవడం నిజంగా లోటే అయినా, అలా, జీవితాన్ని ఒంటరిగా గడుపుకునే విధానమూ ఓ అద్భుతమైన సాధనే. నువ్వు ఎవరి మీదా ఆధారపడకుండా జీవించే ధైర్యం, ఇపుడు నువ్వు జీవిస్తున్న జీవితమే నేర్పిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ బేలగా, అధైర్యంగా కనపడకూడదు. నీ నోట్లోంచి ‘కమాండ్’ రావాలే గానీ కంగారు కాదు!” చాలా చక్కగా ధైర్యం చెప్పింది.
“ఇంకో మాట, నిన్ను అంత డబ్బిచ్చి, అన్ని సదుపాయాలు కల్పించి హీరోయిన్‍గా బుక్ చేసింది నీతో సినిమా తీయడానికే. అఫ్‍కోర్స్, ట్రైల్స్ వేయడం అనేది అన్ని చోట్లా వుంది. ఏం.. మన కాలేజీలోనూ వుందిగా. కనుక ధైర్యంగా వుండు. ఇతరులు నీకు ట్రైల్ వేస్తున్నారంటే నీలో చెప్పలేనంత సౌందర్యం ఉందన్న మాట” అంటూ నవ్వేసింది.
అంతకు ముందు సంగతి ఏమైనా, మహతితో మాట్లాడాక వెయ్యి ఏనుగుల బలం వచ్చింది. హాయిగా బెడ్ మీద పడుకున్నా. విశ్రాంతిగా హాయిగా నిద్రపట్టింది.
***
“యూ ఆర్ ఏన్ ఏంజిల్ ఆఫ్ బ్యూటీ” అన్నాడు వినోద్ కపూర్. మేమిద్దరం షూటింగ్ స్పాట్‍లో వేసిన చిన్న మంచం సెట్‍లో కూర్చుని వున్నాం. ఈ సీన్ తెలుగు ‘ధీర’లో లేదు.
“మీ తెలుగు సినిమా నేను చూసా. నీ పెర్‍ఫార్మెన్స్ అద్భుతం. కానీ రిచ్‍నెస్ మిస్సింగ్. అందుకే, చాలా మార్పులూ చేర్పులూ చేశాం, హిందీ, ఇతర నార్త్ ఇండియన్ కల్చర్‍కి తగనిట్టు. అల్కా.. నీకు చాలా గొప్ప ఫ్యూచర్ వుంది” సూటిగా నా కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు. నేనేమీ మాట్లాడకపోతే బాగోదని, “థాంక్యూ సర్” అన్నాను.
“No sir, you can call me Vinod” అన్నాడు నవ్వి.
అసిస్టెంట్ డైరక్టర్ ఫారుఖ్ సిద్ధిఖి వచ్చి సీన్ చదివి వినిపించాడు. ఆ సీన్‍లో ఒక చోట నేను వినోద్‍ని గాఢంగా కౌగిలించుకోవాలి. నేను సైలంటయ్యాను.
“అల్కా.. ఇది షో బిజినెస్. ప్రతీ సీన్ వెనుక అనంతమైన హార్డ్ వర్క్ వుంటుంది. డోంట్ వర్రీ. ఆఫ్ట్రాల్ హగ్ చేసుకోవాలి, అంతేగా. నువ్వు హగ్ చేసుకునేది కూడా నువ్వు అమితంగా ప్రేమించిన (సినిమాలో) వ్యక్తిని. పులినో, సింహాన్నో కాదు” పకపకా నవ్వి చెయ్యి అందించాడు. అతను చెప్పిన మాటలు నాకు సబబుగానే అనిపించాయి. అయినా చుట్టూ పాతిక మంది వుంటారు గదా!
ఆ సీన్ కంప్లీట్ చెయ్యటానికి దాదాపు మూడున్నర గంటలు పట్టింది. కొన్నిట్లో కౌగిలి గాఢత లేదు. కొన్నిట్లో ముఖంలో ఎక్స్‌ప్రెషన్ వారికి కావల్సిన విధంగా పలకలేదు.
“పోనీ.. రేపు చేద్దామా?” అన్నాడు వినోద్. నాకు చాలా పౌరుషం వచ్చింది. “నో సర్. ఇవ్వాళే పూర్తి చేద్దాం. అర్ధరాత్రి అయినా” స్థిరంగా అన్నాను.
“ఫెంటాస్టిక్.. నీ ఎక్స్‌ప్రెషన్స్ అద్భుతం” మూడున్నర గంటల తరువాత అమిత్ సక్సేనా చప్పట్లు చరిచి అన్నారు. అప్పుడు అర్థమయింది, సినిమాని సీరియస్‍గా తీసుకోవాలని.
ఎనిమిది రోజులు అద్భుతంగా గడిచాయి. సినిమాని సీరియస్‍గా తీసుకున్నప్పటి నుండి నా పాత్ర ఇంకా బాగా ఎలా చేయొచ్చో ఒకటికి పదిసార్లు ఆలోచించి మరీ చేస్తున్నాను.
‘పవన్’ లాగే (‘శర్మిష్ఠ’ సినిమా దర్శకుడు) అమిత్ సక్సేనా కూడా నాకు ఫ్రీహాండ్ ఇచ్చారు. నిజం చెబితే రాబోయే సీన్స్‌ని ముందే నా చేతికి ఇస్తున్నారు స్క్రిప్టుని. నాకు హిందీ రాదు.. ఇంగ్లీషూ అంతంత మాత్రమే. తరుణీ కిద్వాయ్ నాకు అన్‌కండీషనల్‍గా సహాయం చేస్తోంది. ఎలా పలకాలో ఫారూఖ్, తరుణీ నాకు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఏమైనా హిందీ, ఇంగ్లీష్ నేర్చుకుని తీరాలని నిర్ణయించుకున్నాను.
“అదేమీ బ్రహ్మవిద్య కాదే. ముందర ఎన్ని బూతులు మాట్లాడినా, మెల్లగా నీకే భాష పట్టుపడుతుంది. అయినా మనం తెలుగు వాళ్ళం, భాషల్ని క్షణాల్లో పట్టెయ్యడం మనకి వెన్నతో పెట్టిన విద్య.” ధైర్యం చెప్పింది మహతి.
అందరి తోటీ వచ్చీ రాని హిందీనే మాట్లాడుతున్నా. కొంచెం పరవాలేదనే ధైర్యం వచ్చింది.
షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
“మీ సౌత్ లాగా మేమూ పర్‍ఫెక్ట్ ప్లానింగ్ తోనే షూటింగ్ మొదలెడతాం. కానీ ప్రీ ప్రొడక్షన్‌కీ, పోస్ట్ ప్రొడక్షన్‍కీ టైమ్ ఎక్కువ తీసుకుంటాం. సౌత్‍లో సినిమా అనేది ఓ ప్రొఫెషన్. ఇక్కడ సినిమా అనేది మాకు జీవితం, అన్నం పెట్టే అన్నపూర్ణ. మరో విషయం ఏమంటే, మీలాగా మాకు, అంటే డైరక్టర్స్‌కి కుప్పలు తెప్పలుగా సినిమాలు వచ్చి పడవు. ప్రతి సినిమా ఓ యాసిడ్ టెస్టే!” అన్నారు అమిత్ సక్సేనా.
“అఫ్‍కోర్స్.. మీ సౌత్ ఇండియన్ స్పీడుని తట్టుకోవాలని మేమూ స్పీడ్ పెంచాం. కానీ, వుయ్ నో.. వుయ్ ఆర్ మిస్సింగ్ ద సోల్” అన్నాడు వినోద్ కపూర్.
“భారతీయ సినిమా ఓ విచిత్రమైన మార్పుకి లోనయింది. హాలీవుడ్ మాత్ర్రమే కాక ఇతర దేశాల సినిమాలూ భారతీయ సినిమాని చాలా ప్రభావితం చేస్తున్నాయి. పూర్వకాలంలో ఓ సినిమాని చాలా రిలాక్స్‌డ్‍గా తీసేవారు. తొందర తొందరగా పూర్తి చేయాలనే తొందరపాటు ఏనాడూ వుండేది కాదు. కథ మీద, డైలాగ్స్ మిద, స్క్రీన్ ప్లే మీద, సంగీతం మీద ఎన్నో సిటింగ్స్ జరిగేవి. ఇవ్వాళ అలా కాదు. అప్పటి ఆర్టిస్టులు ప్రతి పాత్రకీ ఓ ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. దాంతో హీరో హీరోయిన్లు మాత్రమే గాక ప్రతి చిన్న పాత్రా సినిమాలో తనదైన ముద్ర వేసుకునేది” నిట్టూర్చి అన్నారు కమల్ జీత్‍సింగ్. ఆయన చాలా సీనియర్ కెమెరామాన్. చాలా పెద్ద పెద్ద సినిమాలకు పని చేశారు. ఆయనంటే అందరికీ ఎంతో గౌరవం. పర్‍ఫెక్ట్ కెమెరామాన్ (సినిమాటోగ్రాఫర్).
“అవును కమల్‍జీ. ఇప్పుడంతా హీరో చుట్టూనే తిరుగుతోంది. ఎందుకంటే అభిమానుల పిడివాదం” నవ్వి అన్నాడు వినోద్.
“నో వినోద్.. నా ఉద్దేశం అది కాదు. హీరో సినిమా అనే శరీరానికి ప్రాణం లాంటి వాడు. బిజినెస్ జరిగేదే అతని పేరుని బట్టి. నా ఉద్దేశం ఏమంటే, సినిమా చర్చలకి మనం సరైన సమయం ఇవ్వడం లేదని” సిన్సియర్‍గా అన్నారు కమల్‍జీత్.
ఈ కబుర్లన్నీ జరిగేవి షాట్ గాప్‍లో. మెల్లిమెల్లిగా ఆ వాతావరణానికి అలవాటు పడిపోయాను. వీలున్నంత వరకూ షూటింగ్ స్పాట్‍లో వుంటున్నాను. వినోద్ కూడా తొందరగానే షూటింగ్‌కి వస్తున్నాడు. సన్నివేశాల చర్చల్లో పాల్గొనే అవకాశం నాకు ఇస్తున్నారు.
పది రోజుల కాల్‍షీట్లు పది క్షణాల్లా గడిచిపోయాయి.
“నెక్స్ట్ మనం కలిసేది ఆగ్రాలో. ఫతేపూర్ సిక్రీలో కూడా కొన్ని షాట్స్ వుంటై. ఆల్ ది బెస్ట్” – లాస్ట్ డే నాకు సెండాఫ్ ఇస్తూ అన్నారు అమిత్.
“అల్కా, యూ ఆర్ ఎ వండర్‍ఫుల్ ఆర్టిస్ట్” జస్ట్ ఓ హగ్ ఇచ్చి అన్నాడు వినోద్.
“మిస్ యూ అల్కా..” హగ్ చేసి అన్నది తరుణి.
“ఐ టూ తరుణీ” అన్నాను. నిజంగానే.
“ఖుష్ రహో బేటీ, ఫిర్ మిలేంగే” అన్నారు కమల్‍జీత్.
ప్రతి వాళ్ళూ నాకు వీడ్కోలు పలికారు. నాకు ఇచ్చిన చిన్న చిన్న గిఫ్టులన్నీ ఓ రెండు సూట్‍కేసుల్లో (అవి యూనిట్ వాళ్ళు కొని బహుకరించినవే) సర్దింది తరుణి అవ్వాళ మధ్యాహ్నం.
మళ్ళీ హరిలాల్ కారుతో సిద్ధం అయ్యాడు. ఎందుకో నాకు బొటబొటా కన్నీళ్లు కారాయి.
“డోంట్ వర్రీ బేబీ” దగ్గరగా తీసుకుని అన్నాడు వినోద్. మెల్లగా తల వూపి కార్లో కూర్చున్నాను.
కారులో టేప్ రికార్డర్‌లో పాట వస్తోంది:
“జిందగీ ఏక్ సఫర్ హై సుహానా
యహాఁ కల్ క్యా హో కిస్ నే జానా” అంటూ.
(ఇంకా ఉంది)