మహతి-29

11
12

(సంచిక పాఠకుల కోసం ప్రసిద్ధ సినీ కవి, రచయిత శ్రీ భువనచంద్ర అందిస్తున్న ధారావాహిక.)

[తమ మీద తీసిన ఓ షాట్‍లో అల నటన బావుందనీ, తన ముఖంలో భావాలు చక్కగా పలుకుతాయని అంటుంది మృదుల. సినీరంగంలో విజయవంతంగా రాణించాలంటే కొన్ని సూత్రాలు చెబుతుంది మృదుల. రిలేషన్స్ మెయిన్‌టెయిన్ చేయాలని అంటుంది. తన మాటలు అలకి నచ్చినట్లు లేవని, ఆమె ముఖమే చెబుతోందని అంటుంది. అదేమీ లేదనీ, షూటింగ్ జరిగేటప్పుడు తన ధ్యాస అంతా చెయ్యాల్సిన సీన్ మీద, చెప్పాల్సిన డైలాగ్ మీదే ఉంటుందని, మనసుని డైవర్ట్ కానివ్వనని చెప్తుంది అల. రాత్రి 10.30 వరకూ షూటింగ్ సాగుతుంది. వాళ్ళిద్దరి మధ్యా సీన్స్ బాగా వస్తాయి. మృదులని అక్కగానే భావిస్తానని అల అంటే, వద్దని చెప్పి, ఫ్రెండ్‍గా చూడమంటుంది మృదుల. మర్నాడు ఉదయం కాఫీ తాగుతుండగా హిందీ హీరో వినోద్ ఫోన్ చేస్తాడు. కాసేపు మాట్లాడి తరువాతి షెడ్యూల్‍లో ఆగ్రా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ తానే స్వయంగా చూపిస్తానని చెప్తాడు. ఇంకొంచెం సేపు మాట్లాడి పెట్టేస్తాడు. మహతికి ఫోన్ చేసి జరిగినదంతా చెప్తుంది అల. మృదులది అతి జాగ్రత్త అనీ, ఆ విషయం ఆమెకీ తెలియకపోవచ్చనీ అంటుంది. ఆర్థికపరమైన అంశాల్లో సినిమా రంగంలోని స్త్రీలే కాదు, అందరూ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలని చెప్తుంది మహతి. సదాశివరావు గారు వస్తారు. మృదుల తెలుసా అని ఆయనని అడిగితే, తెలుసని చెప్పి, మృదుల గురించి, వాళ్ళమ్మ గురించి అలకి చెప్తారాయన. చాలా అందగత్తె అనీ, మంచి మనిషి అనీ, ఒక దశలో తాను ఆమెను పెళ్ళి చేసుకుందామని అనుకున్నానని, ఆవిడ వద్దన్నదని చెప్తారు. ఆమె చనిపోయేంత వరకూ చక్కని స్నేహితుల్లా మసలుకున్నామని చెప్తారు. ఆమె చనిపోయే సమయంలో తాను పక్కనే ఉన్నాననీ, అంతకుముందు రోజే ‘నేస్తమా.. నాకు బ్రతకాలనుంది, బ్రతికించవూ’ అని అడిగిందని – కన్నీళ్ళతో చెప్తారు. ఆయన బాధనీ కన్నీళ్ళని చూసిన అల హృదయం బరువెక్కుతుంది. – ఇక చదవండి.]

మహతి-2 అల-16:

[dropcap]షూ[/dropcap]టింగ్ ముమ్మరంగా నడుస్తుంది. ఆ సినిమాలో, అంటే, ‘శర్మిష్ఠ’ లో నేను అక్కకి ఎదురుతిరిగి మాట్లాడాలి. ఒక విధంగా ఆవిడ నన్ను అసహ్యించునే అంతగా ప్రవర్తించాలి.

“ఎందుకూ?” అన్నాను నేను

“సారీ అలా.. ఎందుకో నీకు చెబితే, ఆ సీన్ నీ బుర్రలో వుండి యీ సీన్‍కి 100% న్యాయం చెయ్యలేవు. నీ మీద నిజంగా మీ అక్క అసహ్యించుకునేంత నిష్ఠూరంగానూ మాట్లాడాలి. ఆ ఫైర్ నీ కళ్ళలో కనబడాలి.”

God! ఎంత పెద్ద సీనో.. “అసలు నువ్వు నాకేం చేశావూ?” అంటూ మొదలైన మాటల ప్రవాహం నాలుగున్నర నిమిషాలు సాగుతూనే వుంది. అదృష్టం ఏమంటే మధ్యలో ఎక్కడా ‘cut’ పడలేదు. అయితే నేను చాలాసార్లు డైలాగ్స్‌ని చదువుకుని జీర్ణించుకోవడంతో ఫస్ట్ టేకే ok అయింది. మృదుల రియాక్షన్స్ ఎంత అద్భుతం అంటే చెప్పలేను. రెండు కెమెరాలతో ఆ సీన్ తీశారు. ముందుగా మొత్తం స్టోరీ మీద మార్క్ చెయ్యడం వలన ఎక్కడా తొట్రు పడలేదు. అయితే రిహార్సల్స్ మాత్రం అయిదారు సార్లు చేసాకే ‘టేక్’ చెప్పారు.

డైరక్టర్ ఓకే చెప్పాక అందరూ క్లాప్స్. మృదుల బొట చొటా కన్నీళ్ళు కార్చింది షాట్ చివరిలో. అవి గ్లిజరిన్ కన్నీరు కాదు. బహుశా ఆవిడ చెల్లెళ్ళో, అక్కో నాలానే ప్రశ్నించి వుండాలి. లేకపోతే అంత సహజంగా ఆ సీన్‌లో నటించలేదు.

పవన్ మా ఇద్దర్నీ చాలా మెచ్చుకున్నాడు. ఇద్దరి భుజాలు పట్టాడు. “మీరిద్దరూ యీవేళ్టికి పేకప్ అయి రెస్ట్ తీసుకోండి. ఇవ్వాళ మరే వర్కు లేదు. నేను మిగితా ఆర్టిస్టులతో ఇవాళంతా షూట్ చేసుకుంటా. రేపు మీరు ఇవాళ్టి లాగే 9కి రెడీ అయితే చాలు” అన్నాడు. నిజం చెబితే, ఓ హెవీ సీన్ చేశాక, ఆ ఇంపాక్ట్ బాడీ మీద చాలా సేపు వుంటుంది. ఆ అనుభావం ఆ రోజున నాకు సంపూర్ణంగా తెలిసింది.

ఇంటికొచ్చేశాక సదాశివరావుగారికి ఫోన్ చేశాను.

“బంగారం.. పొద్దున్న చాలా ఎమోషనల్ అయ్యాను సారీ” అన్నారు.

“బాబాయ్ గారూ. మీరేమీ ఎమోషనల్ కాలేదు. ఇప్పుడు నేను ఫోన్ చేసింది నాతో భోజనం చెయ్యడానికి వీలవుతుందా’ అని అడగడానికి. ఇంకా చెయ్యలేదు. కేవలం చపాతీ, టమాటా బంగాళ దుంప కాప్సికమ్ కలిపి కూర. మాంఛి నిమ్మకాయ మజ్జిగ. మీరు వస్తానంటే చపాతీ కూర చేస్తాను. ఒకవేళ వీలవదంటే హాయిగా మజ్జిగ తాగి పడుకుంటాను. ఇవాళ ‘నో’ హాటల్/మెస్ భోజనం” అన్నాను.

“అయ్యయ్యో.. అలా కాదులే. అభోజనంగా ఉండకూడదు. వస్తాను” అన్నారు. ఆయనకి ఆకలి కంటే, నేను తిండి తినననే కంగారు ఆయన మాటల్లో వినిపించింది.

కనకాక్షిని కూరలు తరగమని, నేను చపాతీ పిండి కలిపేశా. సదాశివరావు గారు ఇరవై నిముషాల్లో వచ్చేసరికి కూర తయారు అవుతూ వుంది. ఆయన్ని సోఫాలో కూర్చోమని నేను రిలాక్స్‌డ్‌గా కూర రెడీ చేశా. సమయం 3 గంటలు.

“చాలా రుచిగా వున్నాయి అలా, చపాతీ కూరా” చక్కగా ఆస్వాదిస్తూ అన్నారు. ‘సలాడ్’ కూడా వుంది.

నేను తింటూ పొద్దున్న జరిగిన హెవీ సీన్ గురించి, మృదుల చివర్లో బొటా బొటా కన్నీరు కార్చడం గురించి చెప్పాను.

“బహుశా ఆమెకి ఆమె అక్క చెల్లెళ్ళు గుర్తుకి వచ్చి వుండాలి” అంటూ, “నన్ను అక్కా అని పిలవొద్దంది. అక్కచెళ్ళెలంటే అసహ్యమంది. ఫ్రెండ్‌గా భావించమంది” అని మృదుల అన్నమాటలు కూడా చెప్పాను. ఆయన చిన్నగా నవ్వి, ఆ మాటలు పైపైకి అన్న మాటలు. అక్క చెల్లెళ్ళు నిజంగా సోమరిపోతులు, అహంభావులు, వాళ్ళని భరించడం ఎవరి తరమూ కాదు. వాళ్ళ మీద అసహ్యంతో మృదుల వేరే వుంటున్నా ఇప్పటికీ వాళ్ళకి డబ్బు పంపిస్తూనే వుంది. వాళ్ళ నిజంగా పిశాచాలే. వాళ్ళ అమ్మ దిగులుకీ, ఆ దిగులుతో మరణానికీ కూడా వాళ్ళే కారణం. మృదుల మాత్రం నిజంగా మృదువైన హృదయం కలది. వాళ్ళ అమ్మలాగా” అన్నారు.

“ఆవిడ పేరేమిటి బాబాయ్ గారూ” అడిగాను.

“అసలు పేరు చూడామణి. పినిచూ పేరు చెప్పాలని లేదు. చెప్పినా గ్రూప్ డాన్సర్ల పేరు ఎవరికి తెలుస్తుందీ? అసలు వెండితెర మీద పేరే వెయ్యరుగా. ఆమె చాలా గొప్ప డాన్సర్. వెంపటి వారి దగ్గరే కూచిపూడి నృత్యం నేర్చుకుంది. చాలామంది మాస్టర్లకు వెన్నుదన్నుగా వుండేది. కంపోజింగ్ ఆవిడదీ, పేరు మాస్టర్‍దీ”.

“అందుకే మీరు పెళ్ళి చేసుకోలేదు కదూ!” అన్నాను.

“నిజం చెబితే అవును. ‘మణి’ పోయాక అనిపించింది, యీ బంధాలు మిగిల్చేది బాధేనని. అలా, నేను ఎవరికీ చెప్పకపోయినా చాలా మంది చెవులు కొరుక్కున్నారు.. నలుగురు పిల్లల తల్లి వెనకాల పడ్డాననీ, ప్రేమలో నిండా కురుకుపోయాయననీ! ఎవరు ఎవరిని ఎందుకు ప్రేమిస్తారో ఎవరికి తెలుసు? ఎవరు చెప్పగలరు. ఇప్పటికీ ‘మణి’ గురించి నా భావమూ, నా ప్రేమా ఏ మాత్రమూ మారలేదు. ఒక అద్భుతమైన వ్యక్తి ‘మణి’, అంత నిస్వార్థపరురాలినీ, ప్రేమమయినీ నేను చూడలేదు.” చేతులు కడుక్కుని అన్నారు సదాశివరావుగారు. నేను సైలెంటై పోయాను. సదాశివరావు గారి వాృదయంలో అంత చోటు సంపాదించిన ‘మణి’ గారంటే నాకు చాలా గౌరవం కలిగింది, చాలా చాలా ఆవిడ్ని చూడాలనే కోరిక కలిగింది. కానీ ఫోటో ఏమన్నా వుందా అని రావు గార్ని అడగలేకపోయాను.

“అలా జీవితం కూడా ఓ సినిమా లాంటిదే. ‘మనిసి’ ని తిరగేస్తే ‘సినిమ’ అవుతుంది. బాల్యం నించీ ఇప్పటి వరకూ కరిగిపోయిన క్షణాల జ్ఞాపకాలు తప్ప చేతిలో ఏం మిగిలాయీ? ఆ క్షణాల్లో ఎక్కువ గుర్తుండేవి బాధపడిన క్షణాలు, సంఘటనలు మాత్రమే. సుఖించిన క్షణాలు జ్ఞాపకం వున్నా అప్పటి గాఢత ఇప్పుడు వుండదు. కారణం వయసూ మనసూ రెండూ పెరగడం. బహుశా ఓ రెండేళ్ళు మేము స్నేహంగా వున్నది. సహజీవనం చెయ్యలేదు. ఏ చెట్టుకిందో చక్కగా కూర్చుని మాట్లాడుకునే వాళ్ళం. తినడానికి తను ఏదో ఒకటి చాలా పొందిగ్గా తెచ్చేది; నీళ్ళ సీసాతో సహా” ఓ క్షణం ఆయన గతం లోకి వెళ్ళినట్టు ఆయిన కళ్ళే చెప్పాయి. ఓ చిన్న నిట్టూర్పు. “ఆమెకి జబ్బు చేశాక నేను వాళ్ళ ఇంటికే వెళ్ళేవాడ్ని. మృదుల అక్క చెల్లెళ్ళ ప్రవర్తన వేరుగా ఉండేది. మృదుల మాత్రం చాలా వినయంగా, ప్రేమగా ఉండేది. నిజం చెబితే ఆమెని సినిమాల్లో చేర్పించింది కూడా నేనే, నా స్నేహితుడైన ఓ మలయాళీ దర్శకుడి ద్వారా. మంచి పేరు తెచ్చుకుంది. కానీ క్విక్‌గా ఎదగాలని తొందరపడింది. మణి ఉండగానే మృదుల హీరోయిన్ అయింది.”

మళ్ళీ నిశ్శబ్దం నాట్యమాడింది.

“చనిపోయినప్పుడు మణికి ముప్పై ఆరేళ్ళు.”

“అంత చిన్న వయసులోనా?” షాక్ తిని అడిగాను.

“ఈ నలుగురి భారం మణి మనసునీ శరీరాన్నీ నాశనం చేసింది. ఒక్క మృదుల తప్ప మిగతా ముగ్గురూ ‘డిమాండ్’ చేసే వాళ్ళే!” మళ్ళీ కాస్త నిశ్శబ్దం.

“ఆవిడ పోయాక ఆవిడ భారం మృదుల భుజానికెత్తుకుంది. ఆ జలగల వల్ల మృదుల జీవితం అసవ్యస్తం అయింది. ఓ మలయాళీ నటున్ని మృదుల పెళ్ళాడింది. జరిగిన ఘోరం ఏమిటో తెలుసా? మృదుల అక్కే వాడితో కులకడం. ఆ పెళ్ళి పెటాకులయింది. పోనీ ఆ అక్క అన్నా ఆ రిలేషన్ నిలుపుకుందా అంటే లేదు. వచ్చి మళ్ళీ మృదుల నెత్తినే కూర్చుంది. వద్దమ్మా. ఇవన్నీ విని నువ్వు బాధపడి నిద్ర చెడగొట్టుకుంటావు.” లేచారు సదాశివరావు గారు.

“ఇంకాస్సేపు కూర్చొండి. లెమన్ టీ ఇస్తా. తాగి  వెడుదురుగానీ” అన్నాను. “సరే” అన్నారు.

లెమన్ టీ సినిమా వాళ్ళ అలవాట్లలో ఒకటి. మధ్యాహ్నం భోజనం అయ్యాక కాసేపు రెస్టు తీసుకుని (సెట్‍లో) లెమన్ టీ తాగి  ప్రెషప్ అవుతారు. లెమన్ టీ తయారు చెయ్యడం నేను కూడా బాగా నేర్చుకున్నా. లెమన్‌తో బాటు కొద్దిగా పంచదారా (బ్రౌన్‌ది), కొంచెం తేనె, కొంచెం పొడి బెల్లం (బెల్లంపొడి – నాటుది) మిక్స్ చేసి ఓ యాలక్కాయ చితగ్గొట్టి పడేస్తే మంచి రుచీ వాసనా వస్తాయి. సెట్‌లో టీ తయారు చేసే ఓ వ్యక్తి నాకు యీ టిప్ ఇచ్చాడు.

“ఓహ్.. చాలా బాగుందమ్మాయ్.” సంతోషంగా టీ సిప్ చేసి అన్నారు సదాశివరావు గారు.

***

నాకూ మృదులకీ మధ్య పెద్ద సీన్స్ అయిదున్నాయి. సినిమా కథ ప్రకారం చిన్నప్పుడు తల్లి చనిపోతే ‘అక్కే’ (అంటే మృదులే) నన్ను పెంచి పెద్ద చేస్తుందన్న మాట. ఒక సన్నివేశంలో నేను ఆమెని బాగా బాధ పెట్టడం, ఆవిడ తట్టుకోలేక కుళ్ళి కుళ్ళి ఏడవడం నిన్నటి సీన్‍లో తీశారు.

ఇవాల్టి సీన్ ఏమంటే, మృదుల శ్రీనివాస్ అనే వ్యక్తి ప్రొపోజల్‌ని తిరస్కరించడం, ఆ ప్రాసెస్‌లో నేను తన చెల్లిని కాననీ, కూతుర్నని అతన్ని నమ్మించడం. ఆ విషయం నేను విని, “ఇంతకాలం నన్ను మోసం చేశావు” అని అలిగి బయటికి వెళ్ళి పోవడం, తను నన్ను ఆపితే, “నా తండ్రి ఎవరో నువ్వు నాకు చూపినప్పుడే నీ దగ్గరకు వస్తానని నిలదీసి నిష్ఠూరంగా మాట్లాడి బయటికి వెళ్ళడం. సీన్ అనగానే చప్పట్లు.

సీన్ పెద్దదే. నావి మాటల తూటాలయితే తనవి కన్నీటి అభ్యర్ధనలు. అద్భుతంగా నటించింది మృదుల, కళ్ళల్లో గ్లిజరిన్ అంటని కాలువలే.

సీన్ అయిపోయాక నేను మృదుల దగ్గరికి వెళ్ళి మనస్ఫూర్తిగా కావలించుకున్నాను. కాఫీ బోయ్ తెచ్చిన ప్లేట్‌లో నించి తీసి స్వయంగా నేనే ఆమె చేతికిచ్చాను.

వినిపించీ వినిపించకుండా “థాంక్స్’’ అన్నది.

ఆ రోజూ ఒంటి గంటకల్లా మాకు పేకప్ చెప్పేశారు పవన్. ఆ రోజు షార్టేజి వల్ల “ఇద్దరికీ ఒకే కారు ఓకేనా?” అన్నారు పవన్ కొంచం ఇబ్బందిగా. ఎందుకంటే హీరోయిన్ కారులో ఎవరినీ కూర్చోబెట్టరు. మరొకటేమిటంటే, హీరో హీరోయిన్లకి ఇచ్చే కార్లు మామూలు కార్లు కావు. ఖరీదైనవీ కంఫర్ట్ ఇచ్చేవి.

“నో ప్రాబ్లం సార్.. నేను వేరే వాళ్ళ కారులో వెడతాను” అన్నది మృదుల.

“వద్దు మృదులా.. నువ్వు నా కారులోనే రా. ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ వెడదాం” అని మృదుల చెయ్యి పట్టుకుని నా కోసం వచ్చిన కారులో కూర్చోబెట్టాను.

“ఒక్కసారి నువ్వు ఇలా ఎడ్జస్టు కాగలవని తెలిస్తే రేపట్నించి ఒక్కళ్ళని కాదు, ఓ గ్రూప్‌నే నీ కార్లో ఎక్కిస్తారు మేనేజర్లు” డ్రైవర్‌కి వినబడనంత చిన్నగా అన్నది మృదుల. నేను హాయిగా నవ్వేశాను. “మృదులా బెజవాడ సిటీ బస్సులు నీకు తెలీదు. వాటిల్లో పిచ్చిగా తిరిగిన దాన్ని నేను. అయినా నువ్వు నాతో రావడమే నాకూ ఇష్టం.” అన్నాను.

ఆమె తన చేతిని నా చేతి మీద వేసి గట్టిగా ప్రేమగా నొక్కింది. అన్నట్టు మృదుల చాలా మెల్లగా మాట్లాడుతుంది. ఎవరితో మాట్లాడుతుందో వారికి తప్ప ఎవరికీ వినిపించనంత మెల్లగా మాట్లాడుతుంది.

“ఇవాళ మా అమ్మ గుర్తుకొచ్చింది. నీకు నిన్నో మొన్నో చెప్పాను గదా – మేం నలుగురమని. నిజం చెబితే, నాతో సహా అందర్నీ ఆమె పెంచిందే గానీ కనలేదు. ఆ విషయం అమ్మ చాలా జాగ్రతగా దాచుకున్న డైరీ చూసి, చదివి తెలుసుకున్నాను. ఇప్పటికీ నేనా విషయం నా అక్కచెల్లెళ్ళకి చెప్పలేదు. నలుగురిలో నేనొక్కదాన్నే ఆవిడ రక్త సంబంధీకురాలిని. మా అమ్మ చెల్లెలి కూతుర్ని.” సైలెంటైంది. నేను షాక్ తిన్నాను. ఈ విషయం సదాశివరావు గారికి కూడా తెలియదనుకుంటా.

“ఓ చిత్రం చెప్పనా అలా, యీ పరిశ్రమలో కన్న కూతుళ్ళ చేతా కొడుకుల చేతా చాలామంది ‘అమ్మా’ అని పిలిపించుకోరు. ‘అక్క’ అని పిలిపించుకుంటారు. అలాంటిది మా అమ్మ తను కనని పిల్లల చేత ‘అమ్మ’ అని పిలిపించుకుంటూ స్వంత పిల్లల కంటే మిన్నగా పెంచిందంటే ఏమనాలి! ఆవిడ మనసో ప్రేమ వృక్షం. ఇవ్వాళా, నిన్నా సీన్‍ని రిపీట్ చేస్తే, ఆమెని ఎదిరించి బయింటికి వెళ్ళింది నేనే, నిష్ఠూరపు మాటలాడిందీ నేనే. నా పాత్రని యీనాడు నువ్వు పోషిస్తే, నన్ను కనని, కన్నతల్లి పాత్ర ‘అక్క’ పాత్రలా నేను పోషించా.” అన్నది. ఆమె కళ్ళ నిండుగా నీళ్ళు.

***

సినిమా వాళ్ళంటే జనాల దృష్టిలో మహా ధనవంతులనీ, మహా రిచ్ లైఫ్‌కి అలవాటు పడినవాళ్ళనీ, కేరక్టర్ లేని మనుషులనీ. వాళ్ళకేం తెలుసూ? ఎన్ని చెరువుల కన్నీళ్లు చెంపల మీదే ఇంకిపోతాయో, ఎన్ని చీకటి మెరుపుల మరకలు మనసులో దాగి ప్రతిరోజు ఎట్లా చిచ్చు రేపుతాయో!

వృత్తిపరంగా చూసినా, సినీ పరిశ్రమలోని ఏ వృత్తి వారైనా సైనికుల్లా అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. ‘పని’ దొరికిన క్షణం నించే పని పూర్తయ్యే దాకా 100% ఏకాగ్రతలో వుండాలి. ఒక్క క్షణపు నిర్లక్ష్యం నిన్ను పాతాళానికి తొక్కేస్తుంది.

ఓ గొప్ప నటుడే. చాలా టేలంట్ ఉన్న వాడే. హీరో వస్తే కుర్చీలో నించి లేవలేదని అతన్ని క్షణాల మీద సినిమా నించి తప్పించడమేకాక, ఏ సినిమాలోనూ అవకాశం రానివ్వకుండా చేశారు.

ఓ కేరక్టర్ ఆర్టిస్టు రావల్సిన డబ్బుని అయిదారు సార్లు అడిగాడని ‘ట్రబుల్‍సమ్ ఆర్టిస్ట్’ అన్న పేరుతో శంకరగిరి మాన్యాలు పట్టించారు. జారుడు మెట్ల మీద కూడా వేగంగా పరిగెత్తడం లాంటిది సినిమా జీవితం. ఒక్క క్షణం పరుగు మందగించినా పడిపోక తప్పదు.

***

కన్నీళ్ళతో నున్న మృదులని దగ్గరగా హత్తుకున్నాను. డ్రైవర్ వెనక్కి చూశాడు, ముందు ఎవర్ని దింపాలో కనుక్కుందామని.

“మృదులా నాతో మా యింటికి రావూ” అన్నాను ప్రేమగా.

“వద్దు అలా.. మరో రోజు.. మనసు బాగన్నప్పుడు తప్పక వస్తా.. నేను వచ్చే చౌరస్తాలో దిగిపోతా” అన్నది నా చేతులు పట్టుకుని.

లక్ష మాటలు చెప్పలేని భావం ఒక ‘స్పర్శ’ తెలియచేస్తుంది. తను ఒంటరిగా వుండాలనుకుంటోందని నా హృదయానికి అర్థమైంది. చౌరాస్తా దగ్గర ఆపించి తనని ఫ్రీగా వదివేశా. చూడా‘మణి’ గారి వ్యక్తిత్వం నాకు హిమాలయమంత ఎత్తుగా గోచరించింది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here