మహతి-31

10
11

(సంచిక పాఠకుల కోసం ప్రసిద్ధ సినీ కవి, రచయిత శ్రీ భువనచంద్ర అందిస్తున్న ధారావాహిక.)

[చూడామణి గారి నలుగురు పిల్లలూ ఆమె కన్నబిడ్డలు కారని మృదుల ద్వారా తెలుసుకున్న అల ఆ విషయాన్ని సదాశివరావుగారికి చెప్పాలనుకుంటుంది. కానీ చాలా ఆలోచించి – ఇతరుల జీవితాలలోకి తొంగిచూడాలన్న కుతూహలం మంచిది కాదని తలచి ఆ విషయం అక్కడితో వదిలేస్తుంది. సాయంత్రం కళ్యాణిగారికి ఫోన్ చేస్తే, ఆమె ఎత్తదు. ఫాలాక్షకి చేసి మాట్లాడుతుంది అల. అక్క మీ ఇంటికే వస్తోందని చెప్తాడు ఫాలాక్ష. కాసేపయ్యాకా, కళ్యాణిగారు వస్తారు. వాళ్ళిద్దరూ బోలెడు కబుర్లు చెప్పుకుంటారు. హిందీ ‘ధీర’ కోసం సిర్సా వెళ్ళడం దగ్గర్నించి ‘శర్మిష్ఠ’ నిన్నటి షూటింగ్ వరకు మొత్తం విషయాలన్ని చెబుతుంది అల. కళ్యాణి గారు తెచ్చిన వంటకాలతో భోంచేసి ప్రశాంతంగా నిద్రపోతారు. మర్నాడు ఉదయం, షూటింగ్ అయ్యాక, ఇంటికి రమ్మని చెప్పి కళ్యాణిగారు వెళ్ళిపోతారు. ఫాలాక్షతో మాట్లాడుతుంది అల. కళ్యాణి, ఫాలాక్షల ప్రేమాభిమానాలు దక్కడం తన అదృష్టం అని అనుకుంటుంది. స్టూడియోకి వెళ్ళి మేకప్ వేయించుకుని షూటింగ్‌కి సిద్ధమవుతుంది. అక్క మీద గొడవపడి, ఇంట్లోంచి వెళ్ళిపోయి హాస్టల్‍లో ఉంటున్న చెల్లిని – ఇంటికి రమ్మని అక్క వచ్చి బతిమాలే సన్నివేశం అది. మృదుల బాగా చేసినా, అల సరిగా చేయలేకపోతుంది. పవన్ హెచ్చరికతో, మరో టేక్ చేద్దాం అని చెప్పి, ఈసారి అద్భుతంగా నటిస్తుంది. పవన్, బెడేకర్ గారు, హాస్టల్ మెంబర్లుగా నటించిన ఎక్స్‌ట్రా ఆర్టిస్టులు అందరూ అలని అభినందిస్తారు. మృదుల మెల్లగా వచ్చి అలని హత్తుకుని బుగ్గ మీద ముద్దుపెడుతుంది. లంచ్ తరువాత మృదుల రియాక్షన్‍ సీన్లు తీస్తాడు దర్శకుడు. ఇద్దరీ నటనా బాగుందని అభినందిస్తారు. అంత అద్భుతమైన రియాక్షన్స్ ఎలా ఇవ్వగలిగావని అల అడిగితే, మా అక్క చేసిన అల్లరికి మా అమ్మ మొహంలోని రియాక్షన్స్ గుర్తుకు తెచ్చుకున్నానని మృదుల చెబుతుంది. కొంతసేపయ్యాకా, డైరక్టర్ మధు వచ్చి అల కోసం హరగోపాల్‌ అనే అతను వచ్చాడని చెప్పి, పంపమంటారా అని అడుగుతాడు. – ఇక చదవండి.]

మహతి-2 అల-18:

[dropcap]రెం[/dropcap]డు కుర్చీలు చెట్టు కిందవేసి టీ పంపమని ప్రొడక్షన్ బోయ్‌తో చెప్పాను. మృదులతో, “మృదులా నా క్లాస్‌మేట్ అతను. ఓ పది నిముషాలు మాట్లాడి పంపేస్తాను. ఎందుకంటే, రేపు షూటింగ్ ఔట్‌డోర్ కదా.. ఎర్లీగా లేవాలి. నువ్వు వెయిట్ చేస్తే ఓకే. లేకపోతే రేపు కలుద్దాం” అన్నాను.

“రేపా? రేపు కాల్‌షీట్ నాది లేదుగా! నీదీ హీరోదీ కాంబినేషన్. మర్చిపోయావా. పోనీ వెయిట్ చేస్తానులే” అంది. “వద్దులే. మళ్ళీ ఆలస్యం అయితే నీకు ఇబ్బంది.” అని నేను చెట్టు వైపుకి వెళ్ళాను.

చాలా స్టయిలిష్‌గా డ్రెస్ చేసుకొవచ్చాడు హగ్గీ. వాచీ కూడా ‘బ్రాండెడ్’ వాచీ.

“హాయ్” అన్నాడు నన్ను చూడగానే, కుర్చీ లోంచి లేవలేదు.

“హలో హగ్గీ, ఎలా ఉన్నారు.. బాగున్నారా.” అన్నాను కూర్చుంటూ.

“ఫైన్. నీ పిక్చర్ సూపర్ సక్సెస్ అయిందని తెలుసు. హిందీలో కూడా బుక్ అయ్యావుటగదా!” అన్నాడు. ‘నువ్వు’ అని అతని నన్ను సంబోధించడం నాకు చాలా చికాకు తెప్పించింది. నేను గౌరవంగా ‘మీరు’ అంటే, అతను ‘నువ్వు’ అనొచ్చా.

“ఆ విషయమూ తెలిసే వుండాలే.” చిన్నగా నవ్వి అన్నాను.

“మొన్న ఎయిర్‌పోర్ట్‌లో చూసినప్పుడు పలకరించ లేకపోయాను. ఆంటీ వుంది. మళ్ళీ ఆవిడ నువ్వు ఎవరూ అని అడిగితే, క్లాస్‌మేట్ అనీ, సినిమాల్లో వున్నావనీ చెప్పాల్సి వస్తుంది. అందుకే నీతో మాట్లాడలేదు.” అన్నాడు

“ఓహ్.. చాలా మంచిగా ఆలోచించారు.” అన్నాను.

“అంతేగా మరి! సరే, నీ రాబోయే పిక్చర్‌లో నన్ను సంగీత దర్శకుడిగా పరిచయం చెయ్యగలవా?” అన్నాడు

“నిన్నగాక మొన్న ఇండస్ట్రీలోకి వచ్చాను. రికమండ్ చేసేంత సత్తా నాలో లేదు. అదీ గాక మ్యూజిక్ డైరక్టర్‍ని నిర్ణయించేది నిర్మాతా, దర్శకులు, హీరో. అదీ హీరో ఇన్వాల్వ్‌మెంట్ సినిమాలో వుంటే. హీరోయిన్లు కాదు” స్పష్టంగా అన్నాను. అతని పెడసరం మాటలు నాకు నచ్చలా.

“మీకూ మీకూ చాలా రిలేషన్స్ వుంటాయిగా. నువ్వా రిలేషన్స్‌తో నాకు హెల్ప్ చేస్తావని వచ్చాను. అన్నట్టు మీ ఫ్రెండ్ మహతి ఎలా వుంది?” అతని మాటలకు లాగి చెంప పగలగొట్టాలని అనిపించినా చాలా తమాయించుకున్నాను. అందరూ ఇంకా పేకప్ కాలేదు. ప్రొడక్షన్ వేన్స్‌లో సామాను సద్దుతున్నారు.

“లక్ష మందిలో ఒకరికి కూడా నీలాంటి స్వరం ఉండదనీ నువ్వు చాలా టేలెంటెడ్ సింగర్‌వనీ, ఏదో ఓ నాడు గొప్ప పేరు తెచ్చుకుంటావనీ ‘నా ఫ్రెండ్’ మహతి మొన్ననే, అంటే, నువ్వు నాకు ఎయిర్‍పోర్ట్‌లో కనపడ్డావని చెప్పినప్పుడే అన్నది” అన్నాను. నా మాటల్లోని తీవ్రత నాకే తెలుస్తోంది. మహతిని ‘నా ఫ్రెండ్’ అనీ, అతన్ని ‘నువ్వు’ అని కావాలనే అన్నాను.

“నీ ఫ్రెండ్ నీకు గొప్పే కావచ్చు. కానీ ప్రేమించిన నన్ను చీట్ చేసి వాళ్ళ అమ్మా బాబుల్ని మా యింటికి పంపి మా అమ్మ ఎదురుగా నాకు సుద్దులు చెప్పించింది. చూపిస్తా.. ఏదో ఓనాడు నేనేమిటో చూపిస్తా. ఇంతకీ నువ్వు నాకు రికమెండ్ చేస్తావా లేదా?” అన్నాడు నిలదీస్తున్నట్లు.

“సారీ. ఐ కెన్ నాట్” లేచాను. నాకు అతనంటే అసహ్యం వేసింది.

“తిమ్మూతో నీ ప్రేమాయణం నాకు బాగానే గుర్తుంది” అన్నాడు వంకరగా నవ్వుతూ.

“అలాగా. ఆ సంగతి అలా వుంచితే, ప్రొడక్షన్ వాళ్ళు ఈ కుర్చీల కోసం వెయిట్ చేస్తున్నారు. లేస్తావా?” అన్నాను కావాలనే పెద్దగా నవ్వుతూ.

ఏమనుకున్నాడో ఏమో గబగబా లేచి వెళ్ళి పోయాడు, కనీసం చెప్పకుండా. బహుశా భయపడి వుండొచ్చు – లేక మనసులో మరో ఆలోచన వుండొచ్చు. నేను కారు వైపు చూస్తే, హగ్గీ ఓ కాస్ట్లీ  కారులో కూర్చుని కార్ స్టార్ట్ చెయ్యడం కనిపించింది. నా కారు రాగానే నేను ఎక్కబోతుండగా మృదుల వచ్చి “నేనూ వస్తున్నా” అన్నది. “ఓహ్.. చాలా హేపీగా ఉంది” అన్నాను ఆమె చేతులు పట్టుకుని.

“అలా.. నువ్వు హేపీగా లేవు. నీ క్లాస్‍మేట్‍గా వచ్చినవాడి వల్ల హర్టయ్యావు. ఎలా తెలుసని అడక్కు. నీ ముఖంలో ఏ భావమూ దాగదు” అన్నది.

“ఏమైనా సీరియస్ మేటరా?” మళ్ళీ తనే అడిగింది.

“లేదు. క్లాస్‌మేట్ మీద హక్కు వుంటుందనుకుంటున్నాడు యీడియట్. సంగీత దర్శకత్వం ఇప్పించాలట” కసిగా అన్నాను.

“అలా, ఎప్పుడైతే మనం సినిమాల్లోకి వచ్చామో, అందరూ మన మీద హక్కు వుందనుకుంటారు, అభిమానులతో సహా. ఏ మాత్రం చికాకు పడ్డా ‘అదేంటండీ మేం మీ అభిమానులం అని కూడా చూడకుండా మాట్లాడతారు’ అంటారు. ఇదెంత పూలపక్కో, అంత ముళ్ళపక్క కూడా. మనసులోనించి ముందు ఆ చికాకుని తీసెయ్. హాయిగా రిలాక్సడ్‌గా ఉండు. ఎందుకంటే మన మనసు మన దగ్గరే వుండాలి. ఎవడి చేతుల్లోని రిమోట్ లానో వుండకూడదు. నువ్వు నవ్వాలని అనుకుంటే నిన్నాపేవాడు యీ లోకంలో ఉండడు. అలానే నిన్ను ఏడ్పించగల వాడూ యీ లోకంలో వుండడు.. నువ్వు నీకై నిలబడితే నీ నవ్వు – నీ కన్నీళ్ళు నీవే, నీ ఒక్కరివే కావాలి. ఎవర్ని ఎంత దూరంలో పెట్టాలో అంత దూరంలోనూ పెట్టు! వాళ్లు పిచ్చి మాటలు మాట్లాడితే పిచ్చి వార్నింగ్ ఇవ్వు. ఏనాడూ ఎప్పుడూ ఎక్కడా బేలగా వుండకు. నీకు నువ్వే రాణి, నీకు నువ్వే రాజా, నీకు నువ్వే మంత్రి” నా చెయ్యి గట్టిగా నొక్కి అన్నది, అదీ డ్రైవర్‌కి వినపడనంత మెల్లగా.

***

మృదుల ఎంత చెప్పినా హగ్గీ మీద అసహ్యమూ కోపమూ తగ్గలేదు సరికదా, తిమ్మూ గురించి వాడు వాగిన మాట, ‘రివేషన్స్’ మెయింటెయిన్ అని వాడు వాడిన అర్థమూ నాకు పిచ్చి కోపాన్ని కల్గిస్తూనే వుంది. సినిమాల్లోకి వచ్చాక వచ్చే రూమర్లు వేరు, ఇలాంటి గతపు నీడలు వేరు.

మొదట నేను చేసిన పని ‘మహతి’కి ఫోన్ చెయ్యడం. అన్నీ చెప్పి చివర్లో మహతి గురించి వాడు అన్ని మాటలు కూడా చెప్పాను. అది చాలా సేపు సైలెంటైంది. ఆ తరువాత మెల్లగా అన్నది “అలా, నువ్వేం భయపడక్కరలేదు. వాడో బురదగొడ్డు (విషం లేని పాముల్లో ఒక రకం. పొలాల్లో తిరుగుతూ ఎలుకల్ని మింగి జీవిస్తుంది గనక వ్యవసాయదారులు వాటిని చూసినా చంపరు). నేను బాధపడుతున్నది ఓ మనిషి ఇంతగా దిగజారడం గురించి.. మరోసారి నీ దగ్గరకు వచ్చే ధైర్యం చెయ్యడు. అందువల్ల వాడి గురించి నువ్వు మర్చిపోవచ్చు. ఒకవేళ వస్తే నేను హైదరాబాదులోనే వున్నాననీ, వాడు చెప్పిన మాటలు నాకు చెప్పావని చెప్పు. చస్తే మళ్ళీ నీ జోలికి రాడు. ఇక తిమ్మూ విషయం తెలిసినా ఎవరూ సీరియస్‌గా తీసుకోరు. కావాలంటే తిమ్ము చేతనే అటువంటిదేమీ లేదని చెప్పిస్తా. ఈ విషయం ఆలోచించి నీ మనసుని పాడు చేసుకోకు. వాడి ‘లెవెల్’ నీ ఎదుట చూపించడానికి వచ్చుంటాడు. సంగీత దర్శకుడు కాదలుచుకున్న వాడికి కావలసింది సాధన, ప్రజ్ఞ. బెదిరింపుతోనో రికమండేషన్ తోనో ఎవరూ పైకి రాలేరు, ముఖ్యంగా సినీ ఫీల్డులో. అక్కడ కావలసినది తపన, సాధన, నిరంతర కృషి. సో, డోంట్ వర్రీ” అని చెప్పి ఫోన్ పెట్టేసింది. మహతి చెప్పిన రీజనింగ్‌తో నాకు చాలా రిలీఫ్ అనిపించింది. హాయిగా భోంచేసి పడుకున్నాను. ‘స్నేహితులు’ మనసుకి వైద్యులాంటి వారు. వారు తగ్గించలేని మనోక్లేశం ఏదీ లేదు.

***

హీరో ప్రమోద్ కుమార్ చాలా జాలీ మనిషి. ఆయన భార్య చాలా అందగత్తె అని విన్నాను. ఇద్దరు పిల్లలు.. చిన్నపిల్లలే. “యూ నో.. నేను కొంచెం లేటు గానే పెళ్ళి చేసుకున్నా. దాని వల్ల లాభం ఏమిటో తెలుసా? పిల్లలు చిన్నవాళ్ళు గనక నా వయసు జనాలు కాస్త తగ్గించి లెక్కిస్తారు” గట్టిగా నవ్వి అన్నారాయన. నేనూ నవ్వేశా.

“ఇదిగో పిల్లా.. షూటింగ్‌లో సరదాగా, హాయిగా, సొంతింట్లో ఉన్నట్లు వుండాలి. అందరికీ ఒక కుటుంబమే వుంటుంది. మనం చేసే ప్రతి సినిమా ఓ కుటుంబం లాంటిదే, కనుక మనం బహు కుటుంబీకులమన్నమాట.” ఈ మాట నాకు చాలా నచ్చింది. ఆ మాటే ఆయనతో అన్నాను.

“ఇదిగో.. రొమాంటిస్ సీన్స్‌లో మాత్రం హాయిగా ఫ్రీగా వుండు. ఆ క్షణాల్లో నువ్వు ‘అల’గా కాక హీరోయిన్ పాత్రలో ఒదిగిపోవాలి. చూపూ, నవ్వూ, ముఖమూ, చేతులు – సర్వమూ ప్రేమని ఒలికించాలి. కౌగిలింతలో ఆ ‘వేడి’ ఎక్స్‌ప్రెషన్స్‌లో కనబడాలి” అంటూ సాంగ్స్ కోసం నన్ను ప్రిపేర్ చేశారు.

“మోహన వల్లి అని ఓ నటి వుండేది. చాలా అందగత్తె. అయినా ఏం లాభం, రొమాంటిక్ సీన్ వచ్చి నప్పుడల్లా విరేచనం కాక ఇబ్బందిపడేవాడి మొహం పెట్టేది. ఇక సీన్ చెయ్యడానికి మూడ్ ఎక్కడ్నించి వస్తుందీ?” – మళ్ళీ ఆయనే అంటూ, ఆవిడ మొహం ఎలా పెట్టేదో అనుకరించారు. నవ్వీ నవ్వీ నాకు పొట్ట నొప్పి వచ్చింది. అందరి మా వంక ఆశ్యర్యంగా చూడటమే. బహుశా నన్ను ఫ్రీగా వుంచడానికి హీరోగారు ప్రయత్నిస్తున్నారని బేడేకర్ గారికి తెలుసనుకుంటా. జస్ట్ చూస్తున్నారు.

‘చెరువు గట్టున చల్లగాలిలో

వయసు తెచ్చిన వలపు హోరులో

సాగుచున్నా నిదిగో చూడూ

ప్రియతమా నువు రావా తోడు’

ఇదీ పల్లవి.

‘నాగరా’ లోంచి మధురంగా వినిపించింది. ‘నాగరా’ అంటే టేప్ రికార్డర్ లాంటిది. అందులోనించే లోకేషన్‌లో షూటింగ్ కోసం సాంగ్స్‌ని వినిపిస్తారు.

“బాగుంది కదూ పల్లవి. ఇప్పుడిప్పుడే తెలుగు పాట ట్రెండ్ మార్చుకుని తెలుగుదనం కోల్పోతోంది. ఈ టైమ్‌లో యీ మెలడీ రావడం నిజంగా ముదావహం” అన్నారు ప్రమోద్.

ఒకప్పుడు పాటలు అప్పుడప్పుడు వినడమే తప్ప వాటి మీద అవగాహన పెద్దగా వుండేది కాదు. సంగీతజ్ఞానం నిల్. సినిమాల్లోకి వచ్చాకే అర్థమవుతోంది. ఓ పాట పుట్టాలంటే సంగీత దర్శకుడూ, రచయితా ఎన్ని నొప్పులు పడాలో. పవన్ మా వైపు రావడం చూశాను.

“బావుందయ్యా పవన్. మంచి, సింపుల్ పల్లవి రాయించావు. ట్యూన్ కూడా అదిరింది. ఫాస్ట్ బీట్ జనాన్ని ఎంతగా అలరించినా, చివరికి మిగిలేవి మెలడీ లేనయ్యా” అని మెచ్చాకున్నారు ప్రమాద్.

“కుమార ధూర్జటి అని ఓ కొత్త రచయిత చేత వ్రాయించానండి. అతను చాలా ఎడ్యుకేటెడ్ అయినా, అతని మనసు ‘పల్లెతల్లి’ని మరువలేదండి. ‘తల్లి పేగు’ ఎంతో గొప్పదో, ‘పల్లె పేగు’ అంతే గొప్పది అంటాడండి. మిమ్మల్ని కలవాలని చాలా ఉబలాట పడుతున్నాడు.” అన్నాడు పవన్.

“తప్పకుండా కలుస్తానయ్యా, నేను మాత్రం ఏ పట్నం లోంచి ఊడిపడ్డానూ? నేను పుట్టిందీ పల్లెటూరే.. చిన్నప్పుడు మా నాన్నతో పాటు నేనూ పొలానికెళ్ళేవాణ్ణి” నవ్వి అన్నారు ప్రమోద్.

“అందుకే సార్ మీ మనసు మాటా స్వచ్ఛమైనవి.” గౌరవం ధ్వనించింది పవన్  మాటల్లో.

***

‘నాగరా’ వారికి కూడా చాలా ఓపిక వుండాలి. వారికే ఏమి, అందరికీ ఓర్పు తప్పదు. ‘డాన్సు’ అంటే ఒకప్పుడు నాకు చులకన. ఇప్పుడు తెలుస్తోంది.. డాన్సుకీ చాలా చాలా చాలా ఏకాగ్రత కావాలని. నేను తప్పు చేసిన ప్రతిసారీ ప్రమోద్ గారు కూడా మరో టేక్ చెయ్యాల్సిరావడం గమనించగానే చాలా శ్రద్ధతో డాన్స్ మాస్టర్‌ని గమనించి నేర్చుకోవటం మొదలుపెట్టాను.

“గుడ్” అన్నారు ప్రమోద్ గారు. ఆయనా నా ఆలోచనలను గమనించారని నాకు అర్థం అయింది.

ఔట్‌డోర్ లోనే ఒక పల్లవి, ఒక చరణం షూట్ చేశారు. సాయంకాలం 6.30 కి బ్రేకు ఇచ్చారు.

“నైట్ వద్దు పవన్.. మిగతా సాంగ్ మరో చోట తీద్దాం” అన్నారు ప్రమోద్.

“ఓకే సార్” అని కొన్ని కోజ్ అప్‌లు తీసుకుని పేకప్ చెప్పారు డాన్స్ మాస్టర్. డాన్సులు, ఫైట్లూ తీసేడప్పుడు టోటల్ ఇవ్వాల్వ్‌మెంట్ డాన్స్ మాస్టర్స్‌దీ, ఫైట్ మాస్టర్లదీ. స్పార్ట్, కట్ కూడా వాళ్ళే చెబుతారు. కంపోజ్ చేసిన ఫైట్‌నీ, డాన్స్‌నీ ఓకే చేసేది మాత్రం డైరెక్టరే. ఎడిటింగ్ కూడా డాన్స్, ఫైట్ మాస్టర్లు చూసుకుని ఎడిట్ చేసిన భాగాన్ని డైరెక్టర్ ఓకే చెప్పాకీ ముందుకెడతారు.

ప్రతి క్రాఫ్ట్‌కు తనదైన ఓ ముద్ర ఉంటుంది. అన్ని భాగాల్నీ సమన్వయం చేయడమే దర్శకుని మొదటి పని. అందుకే దర్శకునికి 24 క్రాఫ్ట్‌లతోనూ సంబంధమే కాదు, పరిచయమూ సమర్థతా కూడా వుండాలి.

పవన్ సూక్ష్మగ్రాహి. తన పాటని ఎలా కంపోజ్ చేయించుకోవాలో తెలిసినవాడు. అంటే, ‘విజన్’ వున్నవాడు. ఆయన ప్రతి పాటా కొంత కథని చెబుతుంది. ఈ పాట కూడా!

***

“ఏమ్మా ఎవరో కుర్రాడు, అంటే మీ క్లాస్‌మేట్ షూటింగ్ స్పాట్‌కి వచ్చాడని తెలిసింది. ఏమైనా ఇబ్బంది పడ్డావా?” అనడిగారు సదాశివరావు గారు పొద్దున్న.

“మీకెలా తెలుసూ?” ఆశ్వర్యంగా అడిగాను. ఆయన పకపకా నవ్వి “మనం వుండే ఇండస్ట్రీలో ఏదీ దాగదు. సరే సస్పెన్సు ఎందుకూ, ఆ కబురు నీకు ఇచ్చిన మధు చెప్పాడు. మధు వుండేది నేనుండే మేన్షన్ లోనే.” అన్నారు.

“ఏం చెప్పాడు?” అడిగాను.

“కలవడానికి వెళ్ళేప్పుడు ప్రశాంతంగా వెళ్ళావనీ, కలిసి కార్లో ఎక్కేప్పుడు నీ ముఖం జేవురించి వున్నదనీ మధు చెప్పాడు. ఇదేమీ కొత్త కాదు. ఎందరో వస్తారు. కొందరి రాక మనకు హాయిని కలిగిస్తే, కొందరి రాక విపరీతమైన చికాకు తెప్పిస్తుంది. మధు ఎందుకు అబ్జర్వ్ చేశాడని ఇబ్బంది పడకు. హీరో హీరోయిన్లు వెళ్ళిపోయేంతవరకూ మిమ్మల్ని సేఫ్‌గా చూసుకోవడం మా బాధ్యత. అందుకే, మీరు వెళ్ళవరకు మా డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ గమనిస్తూనే వుంటుంది” అన్నారు ఒకేసారి నా సంశయాలని తీరుస్తూ,

ఓ క్షణం ఆలోచించి హరగోపాల్ గురించి చెప్పాను. మేమందరమూ కాలేజీ స్టూడెంట్స్‌మనీ, అతనో సింగరని, ఎట్సెట్రా ఎట్సెట్రా అన్నీ చెబుతూ, “బాబాయ్ గారూ, ఇందులో నాదీ ఒక కథ వుంది” అంటూ ‘ తిమ్మూ’ గురించి చెప్పాను. హగ్గీ మొన్న నాతో మాట్లాడిన ప్రతి మాటా పూసగుచ్చినట్టు చెప్పాను. అంతా శ్రద్ధగా విని,

“ఇంతే కదా! హాయిగా రిలాక్స్ అయిపో తల్లీ. నేనున్నానుగా. నేనే కాదు, నా వెనకో పెద్ద సైన్యమే వుంది!” అని హాయిగా నవ్వేశారు. అప్పుడర్థమైంది మేన్షన్ అంతా ఆయన్ని దేవుడిగా చూస్తారని. నిశ్చింతగా నవ్వాను.

“ఓ మంచి మాట చెప్పనా? తిమ్మూ నీ మనసులోకి వచ్చిందీ, పారిపోయిందీ ఎందుకో తెలుసా? నిన్ను ఓ నటిని చెయ్యడానికే. భగవంతుడి లీల అంటే ఇదే.” అని నా తల నిమిరి మెల్లగా మెట్లు దిగారు సదాశివరావుగారు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here