మహతి-32

2
11

(సంచిక పాఠకుల కోసం ప్రసిద్ధ సినీ కవి, రచయిత శ్రీ భువనచంద్ర అందిస్తున్న ధారావాహిక.)

[షూటింగ్ స్పాట్‍లో తనని కలవడానికి వచ్చిన హరగోపాల్ వద్దకు వెడుతూ, కాసేపు వెయిట్ చేస్తే సరే, లేకపోతే రేపు కలుద్దాం అని మృదులతో చెప్తుంది అల. తనకి మర్నాడు కాల్‌షీట్ లేదని చెప్తుంది మృదుల. చాలా స్టయిలిష్‍గా డ్రెస్ చేసుకుని, బ్రాండెడ్ వాచీ పెట్టుకుని వచ్చిన హగ్గీ కుర్చీ లోంచి లేవకుండానే అలని పలకరిస్తాడు. అల మీరు అని అంటుంటే, అతను నువ్వు అంటాడు. అల తర్వాతి సినిమాలో తనని సంగీత దర్శకుడిగా రికమెండ్ చేయమని అడుగుతాడు. తనకి అంత సత్తా లేదని అంటుంది అల. హీరోలతో ఉన్న రిలేషన్స్‌తో హెల్ప్ చేస్తావని వచ్చాను అంటూ మహతి గురించి చెడ్డగా మాట్లాడుతాడు. కోపం అదుపు చేసుకుని అతన్ని వెళ్ళిపోమంటుంది అల. తిమ్మూతో నీ ప్రేమాయణం నాకు బాగానే గుర్తుంది అని వంకరగా నవ్వుతాడు హగ్గీ. ప్రొడక్షన్ వాళ్ళు ఈ కుర్చీల కోసం వెయిట్ చేస్తున్నారు. లేస్తావా అని అల అంటే విసురుగా లేచి వెళ్ళిపోతాడు. ఇంతలో తన కారు వస్తే, అల ఎక్కబోతుండగా, తానూ వస్తున్నానంటూ మృదుల వస్తుంది. నెమ్మదిగా వివరాలు అడిగి అలకి కాస్త ధైర్యం చెబుతుంది. మహతికి ఫోన్ చేసి జరిగినదంతా చెప్తుంది. హగ్గీ మహతిని అన్న మాటలు కూడా చెబుతుంది. అన్నీ జాగ్రత్తగా విన్న మహతి అతన్ని పట్టించుకోనవసరం లేదని అంటుంది. అల మనసు కాస్త తేలికపడుతుంది. మర్నాడు షూటింగ్‍లో రొమాంటిక్ సీన్స్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి హీరో ప్రమోద్ అలకి చెప్తారు. డాన్సులో తాను చేస్తున్న తప్పుల వల్ల ప్రమోద్ గారు కూడా మరో టేక్ చెయ్యాల్సిరావడం గమనించగానే అల మరింత శ్రద్ధ వహించి డాన్స్ సరిగ్గా చేస్తుంది. ఆయన అభినందిస్తారు. మర్నాడు ఉదయం అల ఇంటికి వచ్చిన సదాశివరావు గారు ఎవరో కుర్రాడు నిన్న నిన్ను ఇబ్బందిపెట్టాడట కదా అని అడిగితే, మీకెలా తెలుసు అని అంటుంది. తనకెలా తెలిసిందో ఆయన చెప్తారు. జరిగినదంతా వివరిస్తుంది అల. ఆయన హగ్గీ సంగతి తాను చూసుకుంటాననీ, ఆ విషయం ఇక మర్చిపొమ్మని చెప్తారు. – ఇక చదవండి.]

మహతి-2 అల-19:

[dropcap]లం[/dropcap]చ్ టైంలో అందరం ఒక చోట భోజనం చేస్తున్నాము. ప్రమోద్ కుమార్ గారి ఇంటి నించి మాంఛి గారెలు, అల్లం పచ్చడీ, బెండకాయల పులుసూ, పులిహోర ఓ పెద్ద కేరేజీలో వచ్చాయి. అందరికీ స్వయంగా ఆయనే వడ్డించారు. మధ్యలో బెడేకర్ గారు, “ప్రమోద్‌జీ ‘సమరవీరుడు’ సినిమాకి 18 సెన్సారు కట్స్ పడ్డాయట” అన్నారు. కాసేపు సెన్సార్ కబుర్లు జరిగాయి. ప్రద్యుమ్న అనే సీనియర్ కేరక్టర్ ఆర్టిస్టు – అందరితోనూ సినిమా బాబాయ్ అని పిలిపించుకునేవారు – మాట్లాడుతూ

“మీకు తెలుసా.. బి.ఎన్. రెడ్డిగారు తీసిన ఏ సినిమాకీ ఒక్క కట్ కూడా పడలేదు” అన్నారు. “ఓహ్. గ్రేట్” అన్నారు ప్రమోద్.

“అంతే కాదు సార్, నిర్మాతా దర్శకుడు ఒకరే అయితే సినిమా చాలా బాగా వస్తుందని చెప్పేవారు” అన్నారు సినీ బాబాయ్.

“100% కరెక్ట్. ఎందుకంటే, కథ సంపూర్ణంగా వచ్చేవరకు ‘సిట్టింగ్స్’ నడుస్తూనే వుంటాయి. బడ్జెట్ చేతుల్లోనే ఉంటుంది. ఇష్టం వచ్చిన రీతిగా పెరగదు.” అన్నాడు పవన్.

“విషయం వచ్చింది గనక చెబుతున్నా.. మూడు టేబుల్స్ ముఖ్యం అంటారు సినిమాకి. మొదటిది రైటింగ్ టేబుల్. అంటే, కథ, స్క్రీన్‍ప్లే, మాటలు, పాటలు ఈ టేబుల్ చూసుకుంటుంది. మొదట సిద్ధం కావలసిన మెటీరియల్ ఇదే.

ఇక రెండో టేబుల్ ఫైనాన్స్ టేబుల్. ఎంత ఖర్చు పెట్టాలి, ఎవరికి ఎంత ఇవ్వాలి. ఏ డిపార్ట్‌మెంట్‌కి ఎంత ఖర్చు అవుతుంది? నటీనటులు, మిగతా వారి రెమ్యునరేషన్ etc etc డిసైడ్ చేసే బడ్జెట్ టేబుల్ ఇదన్న మాట.

ఇక అతి ముఖ్యమైనది మూడో టేబుల్. ఎడిటింగ్ టేబుల్. ఏది వుంచాలి, ఎంత మటుకూ వుంచాలి, ఏది కట్ చేసి పారెయ్యాలి అని నిర్దుష్టంగా నిర్ణయించబడేది యీ టేబుల్ దగ్గరే. ఓ మోస్తరు సినిమాలైనా సరిగ్గా ఎడిట్ చెయ్యబడితే సూపర్ హిట్టవుతాయని చాలా సార్లు నిరూపింపబడింది.” అన్నారు హీరో ప్రమోద్ గారు.

“చాలామందికి తెలీని విషయం చెప్పనా.. ఆంధ్రాలో స్టూడియోలు ఎక్కడ నిర్మించారో తెలుసా? రాజమండ్రి – దుర్గా సినీ టోన్ – చిత్రం సంపూర్ణ రామాయణం; విశాఖపట్నం – ఆంధ్రా సినీ టోన్ – భక్త జయదేవ, మోహినీ భస్మాసుర; కాకినాడ – సినీ ఎలెక్ట్రిక్ లైనింగ్.” అన్నారు సినిమా బాబాయ్.

“అవునవును. కాని బాబాయ్.. తెలుగు సినీ చరిత్ర సమగ్రంగా ఎవరూ గ్రంథస్థం చెయ్యలేదు. అటువైపు ఎవరన్నా దృష్టి పెడితే, అద్భుతమైన విషయాలు తరువాత తరానికి తెలుస్తాయి. ఉమ్మడి మద్రాసులో మొట్టమొదటి పర్మనెంట్ థియేటర్ కట్టిన ఘనుత మన రఘుపతి వెంకటరత్నం నాయుడు గారిది. థియటర్ పేరు ‘గెయిటీ’. ఆ తరవాత ‘క్రౌన్, గ్లోబ్’ అనే మరో రెండు థియేటర్లని మద్రాస్ లోనే నిర్మించారు.”

“స్టూడియోలన్నీ గోడౌన్లు గానూ, మాల్స్ లానూ, మార్కెట్స్ లాగానూ మారుతున్న యీ కాలంలో ఆ విషయాలు ఎవరికి గుర్తుంటాయి? ఎవరు గుర్తు పెట్టుకుంటారు. చాలా మంది వెళ్ళిపోయారు.. సినిమా తాలూకూ అనంతమైన జ్ఞానాన్ని వారిలోనే నిక్షిప్తం చేసుకుని. కొందరు ఉన్నా వారినెవరూ సంప్రదించరు. అందరికీ కావల్సింది పరిగెత్తే గుర్రాలే. పరుగు ఆపిన యౌధాశ్వాలని ఎవరు పట్టించుకుంచారూ?” నిట్టూర్చారు సినిమా బాబాయ్.

నాకెందుకో ఆ విషయాలన్నీ చాలా కొత్తగాను, హాయి గొలిపే వాటిలాగానూ కనిపించి, అప్పుటి కప్పుడు మధు నుంచి రెండు వైట్ పేపర్లు తీసుకొని నోట్ చేసుకున్నాను. ఇంటికెళ్ళాక ఓ నోట్ బుక్ దీని కోసం ప్రత్యేకించాలని అనుకున్నాను.

ఎన్ని వేల మంది మేధావుల మనోమథనం యీనాటి సినిమా. మూకీలు. ఆ తరువాత టాకీలు – ఆ తరువాత గేవా కలర్ – యీస్ట్‌మన్ కలర్స్, సింగిల్ ప్రొజెక్టర్లు, సింపుల్ సౌండ్ నించి డాల్బీ వరకూ ఆపైన వచ్చిన అధునాతన సౌండ్ సిస్టమ్ వరకు ఎంత మనోమథనం జరిగివుండాలి. మనసులోనే ఆ పుణ్యపురుషులకి దండం పెట్టాను.

కుటుంబంలో రిలేషన్స్ బలపడినట్లే, సినిమా సినిమాకీ బాంధవ్యం పెరుగుతుంది. అంతమేరా ‘స్వంత’ వాళ్ళతో బాంధవ్యం కొంచెం తరుగుతుంది. అదీ నిజమేగా! ఎవరితో ఎక్కువగా కాలాన్ని గడుపుతామో అక్కడే స్నేహం వెల్లివిరుస్తుంది.

షూటింగ్ షెడ్యూల్ అయిపోయింది. 35% ‘శర్మిష్ఠ’ పూర్తయింది. చాలా చాలా బాగా వస్తోంది. అఫ్‌కోర్స్ చాలా చాలా మార్పులతో.

సత్యమోహన్ గారి సినిమా స్టార్ట్ కావాలి. మరో పది రోజుల తరువాత ‘ధీర’ హిందీ సినిమాలో పాల్గొనాలి. ‘హిందీ’ అనుకోగానే వినోద్ కపూర్ గుర్తొచ్చారు. కమల్ జీత్ గారూ గుర్తొచ్చారు. తరుణీ కిద్వాయ్ ఎలా వుందో!

అమ్మకి ఫోన్ చేశాం. లక్కీగా అమ్మ ఒక్కతే ఇంట్లో వుంది. సంతోషంతో అమ్మకి ఒక నిముషం మాటలు రాలేదు. “అమ్మా.. ఎలా వున్నావమ్మా” మళ్ళీ మళ్ళీ అడిగాను.

“బాగున్నానే. పేపర్లలో నీ ప్రోగ్రెస్ చూస్తున్నా. నీకు తోడునైనా కాలేకపోతున్న బాధ.” అమ్మ గొంతులో చెప్పలేని బాధ.

“పర్వాలేదమ్మా. నేను ధైర్యంగానే వుంటున్నా. నాతో వుంటే, నీకు కాస్త విశ్రాంతి చిక్కుతుందని నా ఆలోచన. చిన్నప్పట్నించీ పని చేస్తూనే వున్నావు.” అన్నాను.

“ఆడదానికి విశ్రాంతి రెండు చోటుల్లోనేనే. ఒకటి తల్లి కడుపులో వున్నప్పుడు, రెండోది నేలతల్లి కడుపులోకి వెళ్ళిపోయినప్పుడు.” సుదీర్ఘంగా నిట్టూర్చి అన్నది.

ఆపైన అరగంట సేపు తృప్తిగా మాట్లాడి, “నాన్న ఏమన్నా మారారా అమ్మా” అన్నాను.

“ఆకాశమన్నా కరుగుతుందేమోగాని, మగవాడి అహంకారం మాత్రం కరగదే అనంతా. నీ మీద ప్రేమ కన్నా, తను చెప్పింది నువ్వు విని తీరాలనే అహంకారం అది. మార్పు కోరుకోవడం కన్నా, ‘మారరు’ అని నిశ్చయం చేసుకుంటే జీవించడం కాస్త మెరుగవుతుంది” కాస్త అమ్మ గొంతులో నిర్లిప్తత, ఎన్నేళ్ళ మౌనమో అది.

“జీవితం శాశ్వతం కాదని అందరికీ తెలుసు. ఏదోనాడు అన్నిట్నీ విడిచి వెళ్ళిపోవాలనీ తెలుసు. మరి ఎందుకోసం యీ పరుగులాట? ఎందుకు శాంతంగా సంతోషంగా వుండలేరూ? పదవీ వ్యామోహం ఒకరికైతే, ‘పేరు’ పిచ్చి ఇంకొకరిది. నా మాటే సాగాలనే ‘పంతం’ ఒకరిదైతే ఒంటరితనంతో కుళ్ళిపోయే వారు ఇంకొకరు. చిత్రం ఏమిటో తెలుసా అనంతా.. అందరి గమ్యాలూ ఒక్కటే! ఎప్పుడు ఎదురు వొస్తుందో తెలీని మృత్యువే.” అమ్మ గొంతులో ఎప్పుడూ లేని నైరాశ్యం.

“పోనీ అమ్మా.. ఆయన అన్నట్టే కానిద్దాం.. కనీసం నిన్ను నాతో వుంచుకోవచ్చుగా” అన్నాను కన్నీళ్లతో.

“ఏనాడు ఆ పని చెయ్యకు. నా బాధదేముందే. అదేమీ కొత్తది కాదు. ఒక్కసారి నువ్వు ‘ఊ’ అంటే నీ చేతుల్లోంచి నీ జీవితాన్ని లాగేసుకుంటాడాయన. వద్దు తల్లీ. ధైర్యంగా ఉండు. ఇంకెప్పుడూ పిచ్చి మాటలు మాట్లాడనులే” అన్నది అమ్మ.

“నువ్వు చెప్పింది నా బాగు కోసం. నేను ఆలోచిస్తున్నది కేవలం కాసేపు నిన్ను విశ్రాంతిగా వుండటం చూడటం కోసం” అన్నాను.

“వస్తాను కన్నా వస్తాను. చిన్నాడికి కూడా కాస్త లోకజ్ఞానం వచ్చాకా అందర్నీ వదిలేసి నీ దగ్గరకే వస్తాను. ఎందుకంటే, నీ బాధ్యత నాకు చాలా ముఖ్యం. అందుకే, నువ్వు ధైర్యంగా వుండు. సంతోషంగా వుండు. ఎక్కడ నువ్వుంటే అదే నీ ఇల్లనుకో. నీ మంచి కోరేవారే నీ బంధువులనుకో. అనంతా, తల్లి ఆశీస్సులు కనపడని కవచం లాంటివి. నా దీవెనలు నిన్నెప్పుడూ రక్షిస్తూనే వుంటాయి” అమ్మ గొంతు నిండా ప్రేమ. ఫోను పెట్టేసింది. బహుశా మా నాన్న, అన్నో వచ్చే సమయం అయివుండాలి. మనసులోనే అమ్మని తలచుకుని అమ్మ ఒడిలో పడుకున్నా. తెలియుండానే నిద్రలోకి జారుకున్నా.

***

“సాయంత్రానికి అక్కడుంటా” పొద్దున్నే ఆరింటికే ఫోన్ చేసింది మహతి. నాకు ఆనందంతో డాన్స్ చెయ్యాలనిపించింది. ‘ధీర’ తెలుగు సినిమా రోజు నించి ఇప్పటి దాకా ఓసారి మా అమ్మని తప్ప ఎవర్నీ చూడలేదు. హరగోపాల్‌ని చూసినా అతను ఇచ్చింది అతి నికృష్టమైన జ్ఞాపకమే. మహతి అంటే నాకు ప్రాణం. స్నేహన్ని మరువని మనిషి తను.

“అబ్బా” ఆనందంగా అరిచాను.

“ఎందుకూ ఎక్కడికీ అని అడక్కు. అన్నీ సస్పెన్స్. నీ అడ్రస్ నాకు ఇచ్చావుగా, డైరెక్టుగా వచ్చేస్తా” అన్నది. నాకు ప్రస్తుతం ఏ షెడ్యూలూ లేదనీ ఓ పది రోజులు ఖాళీగానే వుంటాననీ మొన్ననే దానికి చెప్పిన విషయం జ్ఞాపకం వచ్చింది.

“చాలా సంతోషంగా వుందే మహీ” అన్నాను. నా గొంతు సంతోషంతో నిండిపోయింది.

“నాకూ బోలెడంత సంతోషమే. ద్విభాషానటీమణిని చూడబోతున్నాను గదా! అన్నట్టు ఆటోగ్రాఫులూ, ఫోటోలూ ఇస్తావా? పిచ్చి మొహమా, నేను హైదరాబాద్ వస్తున్నది వేరే పని మీద. కానీఆ పనులన్నీ నిన్ను చూసి, నీతో తీరిగ్గా మాట్లాడుకున్న తరువాతే.” అన్నది.

ఇంకేం కావాలీ?

కనకాక్షితో ఇల్లు అద్దంలా వుండాలనీ, కొత్త ఫ్లవర్స్‌తో ప్లవర్ వాజ్ లని నింపాలనీ, అన్ని రకాల కురగాయలు తేవాలనీ ఏవేవో పనులు పురమాయించాను.

నా అంతట నేనే నా రూమ్ క్లీనింగ్ పెట్టుకున్నాను. అది క్లీన్‌గా లేదని కాదు.

సదాశివరావుగారికి చెప్పాను.. మహతి వస్తోందని. “సత్యమోహన్ గారికి కూడా చెప్పమ్మా. అందరూ సంతోషిస్తారు” అన్నారాయన ఆనందంగా.

కళ్యాణి గారికి ఫోన్ చేసి చెప్పా. “ఇద్దరూ ఇక్కడికి వచ్చేయ్యండి. మహతిని చూడాలని నాకు చాలా ఉత్సాహంగా ఉంది.” అన్నది కళ్యాణి గారు.

***

‘స్నేహాలింగనం’ అంటే అంత అదంగావుంటుందని నేను వూహించలేదు. అసలు తన మీద నాకు ఇంత ప్రేమ ఉందని తెలిసిందీ ఆనాడే. ఎప్పుడో తప్పిపోయిన ప్రాణం తిరిగి వచ్చినంతగా అనిపించింది. చాలాసేపు నా నోట మాట రాలేదు.

“ఏయ్ పిచ్చీ.. విశ్రాంతిగా నీకు ఇష్టం వచ్చినంత సేపు నన్ను చుట్టుకుని వుందువు. సరేగానీ, ముందు కాఫీ ఏర్పాట్లు ఏమన్నా చేస్తావా?” నా భుజాన్ని గట్టిగా నొక్కి నవ్వుతూ అన్నది మహతి. దాన్ని అలాగే కౌగిలించుకుని సోఫాలో కూర్చోమని చెప్పి పక్కన కూర్చున్నాను. కనకాక్షి “పొద్దున్నించీ మీ కోసమే నమ్మా, తిండి కూడా తినకుండా ఎదురు చూస్తున్నారు” అన్నది.

“వచ్చేశానుగా. ఇప్పుడు హాట్‍ హాట్‌గా నేనే చేసి మీ మేడమ్ గారికి తినిపిస్తా, సరేనా” అన్నది మహతి.

***

కల్యాణి గారి ఇల్లు వచ్చేవరకూ సినిమాల సంగతీ, నాన్న సంగతీ అమ్మ సంగతీ చెబుతూనే వున్నాను. అది ఎప్పటిలా శ్రద్ధగా విన్నాది.

“నిన్ను చూస్తే ఫస్ట్ టైమ్ చూసినట్టు లేదు మహతీ.. ఓ.. నువ్వూ మీ అన్నయ్య ఒకే పోలిక కదూ!” మహతిని దగ్గరకి తీసుకొని అన్నది కళ్యాణిగారు.

“అవునండీ, నేను మా అన్నయ్య అమ్మ ముగ్గురం మూసపోసినట్టు వుంటాం. మీసాలు మాత్రం మా అన్నయ్యకే ప్రత్యేకం” అన్నది మహతి.

“ఓసి నీ మాటలు కోట దాట.. ఏమన్నావ్.. మీసాలు మాత్రం మీ అన్నయ్యకే ప్రత్యేకమా. మా తమ్ముడికీ వున్నాయి చిట్టి తల్లీ” అన్నది కళ్యాణిగారు పకపకా నవ్వుతూ.

భోజనాలు అయ్యేసరికి రాత్రి 10-30. అక్కడే పడుకున్నాం నేనూ, మహతి. నిద్ర లోకి జారేసరికి 12.30 అయింది.

“మా నాన్నగారి మేనత్త కూతురు యీ వూళ్లోనే వుందిట. అసలు మా నాన్నగారు ఏనాడు ఆ విషయాలు మాతో చెప్పలేదు. మా నాన్న మేనత్త కూతుర్ని చేసుకోలేదని మేనమామ మేనత్తా మా నాన్నగారిని చాలా ఇబ్బంది పెట్టారట. మొన్న సాయంత్రం ఆవిడ దగ్గర్నించి, అంటే మా నాన్నకి భార్యగా రావలసి, తప్పిపోయిన ఆవిడ నించి ఫోన్ వచ్చింది. మా నాన్నకి షాకు. అమ్మనీ నన్ను కూడా బయలుదేరతీశారు. వాళ్ళిద్దరూ అశోక్ నగర్ లోని ఆవిడ, అంటే ఇందిర గారి దగ్గరికి వెళ్ళారు. నేను నీ కోసం వచ్చేశా.” అన్నది మహతి నాతో పొద్దున కాఫీ తాగుతూ.

“ఓరి బాబోయ్. ఇంత కాలం తరువాత మళ్ళీ ఫోనా?” అన్నా ఆశ్చర్యంగా.

“విచిత్రం ఏమిటో తెలుసా? ఈ విషయం మా అమ్మకీ నాన్నకీ తెలిసినా మా ముందు ఏనాడూ బయట పడలేదు. అసలు తనకో మేనత్త, మేనమామ, వాళ్ళకో కూతురూ వున్న సంగతే మా నాన్న మాముందు ఎత్తలేదు. అఫ్‌కోర్స్ – చెప్పాల్సినంత గాఢమైన విషయం కూడా కాదనుకో!” అన్నది మహతి.

“అన్నీ అందరితోనూ చెప్పలేరు అమ్మాయిలు. చెప్పకూడదు కూడా” అన్నది కల్యాణి గారు.

“మీకూ సీక్రెట్స్ వుంటాయా” అన్నది మహతి చిలిపిగా.

“ఆడదాని హృదయమే ఓ రహస్యాల పుట్ట. రహస్యాల్లో కూడా రకరకాలుంటాయి, కొన్ని ఆనందాన్నిచ్చేవి. కొన్ని తలచుకోవడానికే ఇబ్బంది పెట్టేవి. కొన్ని మనసులోనే సమాధి అయిపోయాలి. కొన్ని తలచుకున్నప్పుడల్లా ఆహ్లాదపరిచేవి. కొన్ని మహా వృక్షాలు, రోజురోజుకీ ఎదిగేవి. కొన్ని శిధిలాలు. కొన్ని కేవలం బుడగలు” కాఫీ మరింత మా గ్లాసుల్లో పోస్తూ అన్నది కళ్యాణి గారు. ఆవిడ ముఖం నిర్మలంగా ఉంది.

“మీ సంగతి చెప్పలేదు” అన్నది మహతి.

“బోలెడున్నాయి. మహతీ.. రహస్యం అంటేనే గుండెల్లో నిక్షిప్తమైనదని అర్థం. అది బయటపెడితే రహస్యం ఎలా అవుతుంది?” నవ్వింది కళ్యాణి.

“అది సరేగానీ, ఆ ఇందిర గారు ఎందుకు ఫోన్ చేసి పిలిపించింది? ఒకవేళ కొడుకెవరైనా వున్న నీకు వరస కాదుగా!” అన్నది కళ్యాణి గారే మళ్ళీ.

“నాకూ తెలీదమ్మా. ఇక్కడి కొచ్చే ఉత్సాహంలో నేమ ఏమీ అడగలేదు. అసలు నేను ఏదీ కూడా మా పేరెంట్స్‌ని అడగను. అవసరమైతే వాళ్ళే చెబుతారుగా” అని సిన్సియర్‌గా అన్నది మహతి.

“ఏదో సీరియస్ వ్యవహారమే అయివుంటుంది. అందుకే మీ అమ్మని కూడా బయలుదేరమన్నారు మీ నాన్నగారు. బహుశా హెల్త్ కండీషన్ అయి ఉండొచ్చు” అన్నది కళ్యాణి గారు.

“ఏమో మరో గంటలో బయలుదేరి వెళ్తానుగా! వెళ్ళాక తెలుస్తుంది” అన్నది మహతి.

“మరి మా డైరక్టర్ గారినీ, సదాశివరావు గారినీ ఎప్పుడు కలుస్తావు?” అన్నాన్నేను.

“డోంట్ వర్రీ. కనీసం నెల రోజులకి సరిపడా బట్టలు సద్దుకోమన్నారు నాన్నగారు. కనుక మీ సినిమా పరిభాషలో వాళ్ళందరికి ‘కాల్‌షీట్’ ఇచ్చి నన్ను చూసే భాగ్యాన్ని ప్రసాదిస్తాను” నాటకీయంగా అన్నది మహతి.

“అమ్మాయిలూ టిఫిన్ చెయ్యకుండా బయలుదేరితే మాత్రం వూరుకోను. మహీ, అక్కడికి వెళ్ళాక విషయం ఏమిటో నాకు చెప్పు. ఏ సహాయం కావాల్సినా చెయ్యడానికి సిద్ధం.” అన్నది అన్నది కళ్యాణి.

“ఆ విషయం 100% తెలుసు అమ్మా. మీ గురించి అల ఎంతో చెప్పింది” అన్నది మహతి.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here