మహతి-38

7
15

(సంచిక పాఠకుల కోసం ప్రసిద్ధ సినీ కవి, రచయిత శ్రీ భువనచంద్ర అందిస్తున్న ధారావాహిక.)

[తాతయ్యతో మాట్లాడుతూ పర్యావరణానికి జరుగుతున్న నష్టం గురించి ఆవేదన వ్యక్తం చేస్తుంది మహి. కొన్నాళ్ళకి కర్రావూరి ఉప్పలపాడు పంచాయితీ 60వ వార్షికోత్సవం సందర్భంగా వేడుకలు జరుగుతాయి. జిల్లా కలెక్టరే గాక పంచాయితీరాజ్ చీఫ్ ఇంజనీరూ, నీటి పారుదల, పంచాయితీరాజ్ శాఖలు చూసే మంత్రి పాండురంగారావు గారూ, మరి కొందరు పెద్దలూ హాజరైన ఆ సభలో మాట్లాడే అవకాశం దొరుకుతుంది మహతికి. అప్పటికే స్కూలుకి, హాస్పటల్‍కి మహతి చేసిన సేవల గురించి పంచాయితీ ప్రెసిడెంట్ అధికారులకీ, మంత్రి గారికి చెప్తాడు. వారంతా మహతిని అభినందిస్తారు. తనకి అభినందించిన కలెక్టర్‍గారితో పర్యావరణం గురించి అవగాహన కల్పించే ప్రయత్నం చేయబోతున్నానని చెబుతుంది. సభలో తన ఆలోచనలను పంచుకుంటుంది. మహతి తాతయ్య, డా. శ్రీధర్, సత్యసాయి సేవా సంస్థల కన్వీనర్ మహతి ప్రసంగాన్ని, ఉద్దేశాన్ని మెచ్చుకుంటారు. తమ వంతు సాయం చేస్తామంటారు. మాటల సందర్భంలో శ్రీధర్ గారు అన్న ఓ మాటతో స్ఫూర్తి పొంది తాతయ్య వద్ద చదువుకోడానికి వచ్చే ‘అరుగు బడి’ విద్యార్థులకి తినుబండారాలు కొని ఇస్తుంది. అది చూసి స్పందించిన శ్రీధర్ తన వంతుగా వెయ్యి రూపాయాలు విరాళమిస్తారు. మరికొందరు కూడా ధన సహాయం చేస్తారు. ఆ ఊరిలోని చెప్పుల కొట్టు యజమాని సుబ్బారాయుడు ‘అరుగు బడి’ లోని ఎనిమిది మంది పిల్లలకి, ఇద్దరు పెద్దలకీ ఉచితంగా వారికి సరిపడిన కొత్త చెప్పులు ఉచితంగా ఇస్తాడు. కొందరు మహతి డబ్బులన్నీ హాయిగా జేబులో వేసుకుంటోంది అని అనడంతో, ఊరి ప్రెసిడెంటు గారినీ, సుబ్బారాయుడి గారినీ, కన్వీనరు గారినీ, మరో మహిళా మండలి సభ్యురాలు త్రిపుర గారినీ, మా వూరి రిటైర్డ్ హెడ్ మాస్టరుగారినీ సహకార సంఘం సభ్యులుగా ఏర్పరిచి మొత్తం లెక్కలన్నీ వ్రాసి వారి చేతిలో పెడ్తుంది మహతి. అమ్మమ్మ చెప్పిన మాటలు గుర్తుచేసుకుని తన లక్ష్యాల దిశగా నడుస్తుంది మహి. – ఇక చదవండి.]

మహతి-3 మహి-5

[dropcap]వా[/dropcap]రం రోజులు గడిచాయి చాలా ఉత్సాహంగా, చాలా అద్భుతంగా. ఊరిలో నేనంటే ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చింది. అది నాకు ఎంత సంతోషాన్ని ఇచ్చిందో అంత ఇబ్బందినీ కలిగించింది. తెలిసినవారూ, తెలియనివారూ కొందరు వారి సమస్యలని నాతో చెప్పి, ‘కలెక్టరు గారి ద్వారా’ పరిష్కరించమని అడిగేవారు “అమ్మా.. అవి ఆయా డిపార్ట్‌మెంట్స్ ద్వారా వెళ్ళాలి గానీ, నోటి మాటలతో జరుపవు. అదీగాక, వూరి కోసం కలెక్టర్ గార్ని సంప్రదించవచ్చును గానీ, వ్యక్తిగత సమస్యలతో కాదు” అని చెప్పి వారిని ఒప్పించేసరికి తల ప్రాణం తోక లోకొచ్చేది. నవ్వూ వచ్చేది. కలెక్టరు గారు చనువుగా మాట్లాడినంత మాత్రాన నన్ను గుర్రు పెట్టుకుంటారనే గ్యారంటీ ఏది.

తాతయ్యకి మాత్రం భలే పొద్దుపోతోంది. ఒకవైపు స్కూలులో పని, ఇంకోవైపు హాస్పిటల్‍కి వచ్చే సహాయకులతో మాటామంతి. “ఆయన ఏ సమస్యకైనా చక్కని పరిష్కారాలు చూపుతారు..” అనే పేరు తాతయ్య కొచ్చింది.

చదువుకీ తెలివితేటలకీ తేడా ఎంతా అని అడిగితే, సప్త సముద్రాల విస్తీర్ణమంత అని ఖచ్చింతంగా చెప్పగలను. ఆ రెంటికీ మించినది సంస్కారం.

***

“నువ్వెందుకు మహిళా మండలి సభ్యురాలివి కాలేదూ?” త్రిపుర గారు ఓ రోజున నన్ను అడిగారు.

“నేనింకా ‘మహిళ’ను కాదు గదా! విద్యార్థినిని” అన్నాను నవ్వి. త్రిపుర గారి గురించి నాకు తెలుసు. ఆమె నిజమైన సోషల్ వర్కర్. మహిళాభ్యుదయాన్ని గురించి నిజంగా పాటు పడే వ్యక్తి.

“నవ్వుతాలికి కాదు మహీ.. నిజంగా అడుగుతున్నా. ఈ వయసులో నీకున్న మెచ్యూరిటీ ఏభై ఏళ్ళు దాటిన మా మహిళా సభ్యుల్లో మచ్చుకి కూడా కనిపించదు.

ఎప్పుడూ నగలూ, చీరలూ, అల్లుళ్ళూ, కూతుళ్ళ గురించిన కబుర్లూ, మనవడు మనవరాళ్ళ ముచ్చట్లే కానీ, ‘సేవ’ గురించి ఒక్కమాట ఎత్తరు. ఇక వాళ్ళల్లో వాళ్ళకున్న అసూయలకీ, అహంకారాలకీ అంతే లేదు. ఎప్పటి కప్పుడు ఆ సంఘం నుంచి విడిపోదామనిపిస్తుంది. కానీ, ఏది చెయ్యాలన్న ఓ సపోర్టు వుండాలిగా. నువ్వు గనక చేరితే, నిజంగా మనం మహిళాభ్యుదయానికి సరైన బాటలు వేయచ్చు” అన్నారు త్రిపుర గారు.

“నేను మెంబర్ని కాకపోయినా మీకు నూటికి నూరుపాళ్ళు సపోర్టుగా నిలబడతాను. ఎందుకంటే, మెంబరైతే రిస్ట్రిక్షన్స్ ఎక్కువుంటాయి.” అన్నాను. త్రిపుర గారు దీర్ఘంగా నిట్టూర్చి, “అదీ నిజమే, మనంతట మనం చేసేటప్పుడు చిత్తశుద్ధితో ఏదైనా చేయగలం. అదే సంస్థలో అయితే లక్షాతొంభై హద్దులు, మూతి విరుపుళ్ళు, విమర్శనాస్త్రాలు.” అన్నారు. ఓ అరగంట ఆమెతో మాట్లాడాక అర్థమయింది, నాలాగే త్రిపురగారికీ సమాజం పట్ల ఆలోచన, అవగాహన వుందని. న్యాయం చెబితే నాలో వున్నది ఉత్సాహం, ఆమెలో వున్నది అవగాహన. ఓ వారం గడిచింది.

ప్రెసిడెంటు గారి ఆహ్వానంతో వారింటికి వెళ్ళాను. త్రిపుర గారు కూడా వచ్చారు. ఆ రోజు ప్రెసిడెంటు గారి కూతురు పుట్టినరోజు. చాలా అట్టహాసంగా జరిగింది. దాదాపు రెండు వేల మందికి భోజనాలు పెట్టారు. VIP లకు లోపలి వైపు విందుచేశారు. VIP ల సంఖ్య 500 మందికి ఎక్కువే. VVIP లకి వారి గెస్ట్‌హౌస్‌లో భోజనాలు ఏర్పాటు చేశారట. వాళ్ళెంత మందో నాకు తెలీదు.

“ఇంత ఖర్చుతో ఓ స్కూలే కట్టచ్చు” అన్నారు త్రిపుర గారు.

“కనీసం నిరుపేదలకి ఒక పూటైనా భోజనం దొరికిందిగా.” అన్నాను.. భోజనాలకి ఎగబడుతున్న జనాన్ని చూసి.

“అదీ నిజమే.” నిర్లిప్తంగా అన్నారు త్రిపుర.

మమ్మల్ని సగౌరవంగా పిలిచారు… VIP కేటగిరీలోనే వెళ్ళాము. వడ్డించిన ఐటమ్స్ చూసి మతిపోయింది. కర్రావూరి ఉప్పలపాడు లాంటి పంచాయితీ గ్రామంలో అంత పెద్ద విందుని ఎవరూ వూహించను కూడా వూహించి వుండరు.

మొత్తం 38 ఐటమ్స్, మాకు పేద్ద అరిటాకుల్లో వడ్డించారు. అరిటాకుల్ని తూర్పు గోదావరి జిల్లా నించి ప్రత్యేకంగా తెప్పించారట. అలాగే మడత కాజాలు, పూతరేకులు, జీళ్ళు. ఆ మూడు స్వీట్సుని స్వీట్ బాక్సులో పెట్టి రిటర్న్ గిప్ట్‌గా ఇచ్చారు, ఓ పెద్ద పులిహోర పొట్లంతో సహా. ఓ బేగ్ నిండా ఫ్రూట్స్ కూడా గిప్ట్‌గా ఇచ్చారు.

38 ఐటమ్స్‌ని ఏమంటాం? రుచి చూడాలన్నా కష్టమే. భోజనం ముగించి బయటికి వచ్చేప్పుడు బెజవాడ నుంచి పొద్దున్నే తెప్పించిన కిళ్ళీలు సిద్ధం.

మాకేమో అరిటాకుల్లో వడ్డించారు. బయట జనాలకి పేపర్ ప్లేట్స్, ప్లాస్టిక్ (కాదు, యూజ్ అండ్ త్రో) గ్లాసులు. అట్టహాసంగా, కోలాహలంగా ఉంది వాతావరణం. అదృష్టవశాత్తు నేను తాతయ్యకి ఇంటి దగ్గరే వంట చేసి వచ్చాను. కమ్మని గుత్తొంకాయ కూర, టమోటా పప్పు, కొబ్బరి మామిడి రోటి పచ్చడి.. మెంతి మజ్జిగ, వడియాలు. వాళ్ళనీ, వీళ్లనీ పలకరించి ఇంటికొచ్చాను.

చిత్రం ఏమిటంటే, అక్కడ తిన్నప్పుడు కడుపు నిండినట్టే వుంది. ఇంటికి వచ్చాక, అదీ నడిచి వచ్చాక ఆకలిగా వున్నట్టనిపించింది. ఎందుకో తెలీదు. ఆకలి వేసినా తాతయ్య నవ్వుతాడని తినలేదు. స్వీట్ బాక్సు విప్పితే రెండు పూతరేకులు, రెండు మడత కాజాలు, రెండు జీళ్ళు, వాటితో పాటు కొన్ని అరిసెలు కూడా వున్నాయి. తాతయ్య కంచంలో ఒకటి వేసి నేనో అరిసెని నమిలాను. మహా రుచిగావుంది.. నువ్వులు బాగా అద్దారు మరి. విందు విశేషాలు తాతయ్యకి చెప్పాను.

ఓ అరగంట తరవాత శ్రీధర్ గారు వచ్చారు. ఆయన “మహి.. భోజనానికి పిలిచారు. వెళ్ళి భోంచేశాను. అప్పుడు ఆకలి తీరినట్టే అనిపించింది. ఇప్పుడైతే ఆకలి..” అన్నారు.

“ఒక్కసారిగా అన్నీ ఐటమ్స్‌ని చూస్తే కడుపు నిండిపోతుంది. అంటే, కొంచెంగా తిన్నా పూర్తిగా నిండినట్టు అనిపిస్తుంది. ఆకలి తరువాత పుడుతుంది. అరిసెలు వున్నాయి తిను బాబూ” అన్నాడు తాతయ్య కొంటెగా. నేను అరిసె ఎందుకు తిన్నానో ఆయనకి అర్థమైందన్న మాట.

నేనూ నవ్వేశాను. గిఫ్ట్ బేగ్‌లు మగవాళ్ళకి ఇవ్వలేదు అనుకుంటా.. డాక్టరు గారు వచ్చింది ఖాళీ చేత్తోనే. ఓ అరిసె, ఓ పూతరేకు ఓ మడత కాజ ప్లేట్‌లో పెట్టి ఓ గుత్తొంకాయ కూడా ప్లేట్‌లో పెట్టా.

“ఇదేమిటి?” ఆశ్చర్యంగా అన్నారు డాక్టర్.

“తిని చూడండి! ముందు గుత్తొంకాయని మాయం చేసి, తరువాత స్వీట్స్ మీద పడండి. ఇదిగో ఇది స్పెషల్ కిళ్ళీ, తాతకి ఒకటిచ్చాను.” అన్నాను.

“రెండు కిళ్ళీలు తెచ్చారా?” అన్నారు.

“ఊహూ.. నా కోటా ఒక్కటే. రెండోది త్రిపుర గారి కోటా. ఆవిడకి కిళ్ళీ పడదట. బలవంతంగా నా చేతిలో పెట్టారు” అన్నాను.

“విందులో ఆదరువుల కంటే గుత్తొంకాయే దీ బెస్ట్” అన్నారు శ్రీధర్.

“మహీనా మజాకా” నవ్వి ఖాళీ ప్లేటు తీసుకెళ్ళాను.

***

విందు అద్భుతం. ఊరంతా ఇదే మాట. ప్రెసిడెంటు గారి పరపతి ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. కానీ, ఎవరు పారేశారో గానీ ఎంగిలి పేపర్ ప్లేట్లు, గ్రాసులూ రోడ్లని ఆక్రమించుకున్నాయి. పంచాయితీ ఆఫీసుకి వెళ్ళి చెప్పాను, వాటన్నిట్నీ తీయించేయ్యమని. సాయంకాలానికి తీశారు. కానీ వూరి చివర వాటిని పారేశారు. గాలికి ఎగురతూ కొన్ని, గాలికి దొర్లుతున్న గ్లాసులు కొన్నీ మళ్ళీ రోడ్లని ఆక్రమించాయి.

“ఇప్పుడేం చెయ్యాలి?” త్రిపుర గారితో అన్నాను.

“మహతీ, ప్రస్తుతానికి ఏమీ చెయ్యలేము. ప్రెసిడెంటు గారికి చెబితే, మళ్ళీ వాటిని ఏరి పారేయించేస్తారు. కానీ,..” ఆగారవిడ.

“ఊ.. కానీ?” రెట్టించాను.

“కక్ష పెంచుకుంటారు. ఎందుకంటే విందునిచ్చింది ఆయనేగా. ఒకవేళ ఏమీ అనుకోకుండా ఏరి పారేయించినా, యూజ్ అండ్ త్రో గ్లాసుల వల్ల పర్యవరణానికి ముప్పు తప్పదు. అలాగే అవి పేపర్ ప్లేట్స్ అయినా వాటి మీద అతి సన్నని పాలిథిన్ లేయర్ ఉంటుంది. పర్యావణానికి అవీ కీడు చేసేవే.” అన్నారు.

“మరేం చెయ్యాలీ?”

“వాటి వాడకాన్ని ఎన్నిసార్లు గవర్నమెంటు నిషేధించినా, అవి రావణాసురుడి తలల్లాగా మళ్ళీ మళ్ళీ పుట్టుకొస్తూనే వున్నాయి. వాటి నుంచి ప్రకృతిని రక్షించాలంటే వాటి వాడకం వల్ల వచ్చే నష్టాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలి. ఆ అవగాహన కార్యక్రమం ఓ రోజో పది రోజులో జరిపితే సమస్య పరిష్కారం కాదు. నిరంతరం మళ్ళీ మళ్ళీ ప్రజలకు బోధిస్తూనే వుండాలి. భూమికి జరిగే నష్టాన్ని వివరిస్తునే వుండాలి. అలా చేస్తూ పోతే కొంతమంది మారే అవకాశం వుంది” అన్నారు త్రిపుర. నేను ఆలోచిస్తున్నాను.

“ఏమి ఆలోచిస్తున్నావూ?” అన్నారు త్రిపుర.

“అవగాహనా కార్యక్రమం పెద్దలతో ప్రారంభించినా, పెద్ద మార్పురాదు. ఆ అవగాహనని పిల్లల్లో కలిగించాలి. వారి మనసుల్లో నాటుకునేలా చేయగలిగితే తరాలకి తరాలే బాగుపడతై” అన్నాను.

“శభాష్ మహీ.. ప్రతి స్కూలుకీ వెళ్పాలి. వారానికో సారైనా పిల్లలందరికీ సోదాహరణంగా వివరించి చెబుదాం. అవసరమైతే, వ్యాసరచన పోటీలు, డిబేట్లు వారితోటే చేయించి ప్రోత్సాహక బహుమతులు ఇద్దాం” నా భుజం తట్టి అన్నారు త్రిపుర.

“పేపరు ప్లేట్లకి ఆల్టర్‌నేటివ్ అరిటాకులు, విస్తళ్ళూ. అరిటాకుల సంగతి సరే. విస్తళ్ళ వాడకాన్ని గనక జనాలు ఫాలో అయ్యేట్టు చేయగలిగితే, చాలావరకూ యీ ప్లాస్టిక్, పాలిథిన్ దౌర్భాగాన్ని తప్పించవచ్చు.” అని కూడా అన్నారు త్రిపుర గారు.

“అవును. ఒకప్పుడు విస్తళ్ళు కుట్టడం ద్వారా కొన్ని కుటుంబాలు మంచి రాబడిని పొందేవి” అన్నాను నేను.

ఒకప్పుడు పేద బ్రాహ్మణ స్త్రీలకి ఆదాయం విస్తళ్ళు కుట్టడం ద్వారానే లభించేది. అడ్దాకుల్నీ బస్తాల్లో తెప్పించేవారు వైశ్య వ్యాపారులు, వారినించి అడ్డాకుల్ని తెచ్చుకుని విస్తళ్ళు కుట్టేవారు పేద మహిళలు. చదువుతో సంబంధం లేకుండా కొద్దో గొప్పో ఆదాయం పొందవచ్చు విస్తళ్ళ తయారీలో.

***

“మహీ.. ఒకప్పుడు ఎవరు భోజనాలకి పిలిచినా, ఎవరి చెంబు గ్లాసులు వాళ్ళే పట్టుకుపోయేవారు. అప్పుడే ‘టిప్ టాప్’ షాపులు ఉండేవి కాదు. అంటే, షామియానాలూ, అద్దెకి కుర్చీలూ, భోజనం బల్లలూ, వంట పాత్రలూ, గ్లాసులూ ప్లేట్లూ ఇచ్చే పద్ధతి ఉండేది కాదు. ఏ శుభకార్యమైనా ‘పందిళ్ళు’ వేయించేవారు. చక్కగా మామిడాకుల తోరణాలు కట్టేవాళ్ళు. భోజనానికి చక్కని తుంగ చాపలు పరిచేవారు. అవి వెడల్పు అడుగున్నర, పొడుగు ఎనిమిది అడుగులు వుండేవి. టేబుల్ భోజనాలు అప్పట్లో లేవు. ఇళ్ళల్లో కూడా పీటల మీద కూర్చొని భోం చేసేవాళ్ళం” అన్నాడు తాతయ్య.

“నేను చూశాగా తాతయ్యా! ఇప్పటికీ మీ పెద్ద పీట అలాగే వుందిగా” అన్నాను.

“అవును. అది మీ అమ్మమ్మ మేం కొండపల్లి వెళ్ళినపుడు బలవంతంగా కొనిపించింది. అంతకు ముందు ఓ పీట ప్రత్యేకంగా ఉండేది గానీ, యీ పీటకి నాలుగు మూలలా వెండి బిళ్ళల్ని కొట్టించింది. దాని మీద కూర్చుంటే ఓ సింహసనం మీద కూర్చొన్నట్టు ఉండేది. మహీ, నీకో రహస్యం చెప్పవా? ఆ పీట కొన్నది నేనైనా, డబ్బు నాది కాదు. నాకు తెలీకుండా వాళ్ళమ్మ గారిచ్చిన గాజుల్లో ఒకటి అమ్మేసి, ఆ పీట, పెద్ద వెండి కంచం, వెండి గ్లాసూ, రెండు వెండి గిన్నెలూ, చెంచాలు కొన్నది. నా చేత కొనిపించింది పీట మాత్రమే. మిగతావి కంసాలి ఆచారి దగ్గరే కొని తెచ్చింది. పీట డబ్బుల్ని నాకు చెప్పకుండా జేబులో పెట్టింది. అదేం అని అడిగితే, ‘నా మొగుడు వెండి కంచంలో తినాలని నా కోరికా ముచ్చటా కూడా’ అన్నది” సైలైంటయ్యాడు తాతయ్య.

నాకు కళ్ళు చెమ్మగిల్లాయి. నాకు తెలుసు.. ఆ వెండి సామానంతా అమ్మమ్మ పెట్టెలోనే జాగ్రత్త పరిచింది. అవ్వాళ నేను “అదేంటి అమ్మమ్మా తాతగారి ప్లేటూ, గ్లాసులూ” అంటుండగానే, “మీరంతా, ముఖ్యంగా అల్లుడు గారు మామూలు కంచాల్లో భోంచేస్తుంటే, తాతయ్యకి వెండి కంచంలో వడ్డించడం బాగుంటుందా?” అన్నది.

“అమ్మమ్మ గుర్తొచ్చిందా! ఏమో.. ఎంత మరిచిపోదామన్నా, మరుపుకి వస్తేగా!  పోనీ అది గయ్యాళిదైనా బాగుండేది. కానీ కాదుగా” అన్నాడు తాతయ్య కండువాతో కళ్ళు తుడుచుకుని. కాసేపు మౌనంగా వుండిపోయాడు.

“అది తాతయ్యా, మా సమస్య. మొదటి విస్తళ్ళ వాడకాన్ని పోత్సహించాలి. ప్లాస్టిక్ వాడటంలో వచ్చే నష్టాల గురించి అవగాహన కలిపించాలి. మరో ముఖ్యమైన ఆలోచన ఏమంటే, అసలు పెళ్ళి ఖర్చు కంటే, పెళ్ళి విందుల ఖర్చు ఎక్కువ అవుతోంది. గొప్పవాళ్ళ సంగతి సరే, ఎంత ఖర్చు పెట్టినా ఇబ్బంది లేదు. వాళ్ళని చూసి అనుకరించే మధ్యతరగతి వారి బాధ చెప్పనలవి కాదు. పెళ్ళి గొప్పగా చేస్తారు. ఊబి లాంటి అప్పులో మునిగిపోతారు.” అన్నాను.

“పులిని చూసి నక్క వాతలు పెట్టుకోవడం అని దీన్నే అంటారు. వాళ్ళు ఖర్చుపెట్టేది నల్ల డబ్బుని తెలుపు చేసుకోవడానికి. వీళ్ళు ఖర్చు పెట్టేది అర్థం లేని ఆడంబరాలకి పోయి అనర్థాన్ని కొని తెచ్చుకోవటానికి. విస్తళ్ళు వాడమని ప్రజలకు ఎలాగోలా నచ్చ చెప్పొచ్చు. మహిళా మండలి తరఫున విస్తళ్ళు చవకగా దొరికే ఏర్పాటు చేస్తే మరీ మంచిది. ఇక విందు భోజనాల విషయంలో ఆలోచిద్దాం, ఏదో ఓ ఉపాయం దొరక్క పోదు.” అన్నాడు తాతయ్య.

నేను త్రిపుర గారూ ఒక ప్లాన్ రెడీ చేశాం. అన్ని స్కూళ్ళకీ (హైస్కూల్‌తో సహా) వెళ్ళాలనీ, పిల్లలకి ప్లాస్టిక్, పాలిథిన్ వాడకం వల్ల వచ్చే అనర్థాలని వివరించాలనీ. అలాగే, యజమానుల అనుమతి తీసుకుని గోడల మీద కూడా ప్లాస్టిక్ అనర్థాలని వ్రాయించాలనీ అనుకున్నాం.

“మన హాస్పటల్ గోడల మీద కూడా వ్రాయించు” అన్నారు డాక్టర్ గారు. “అలాగే” అన్నాను తలాడించి.

***

“ప్రొద్దుటూరి వాళ్ళ అమ్మాయి ఇంటికి వచ్చేసింది. విడాకుల కోసం అప్లై చేసిందట” అన్నారు త్రిపుర గారు, మేం హైస్కూల్లో విద్యార్థులకి ప్లాస్టిక్ అనర్థాలని వివరించి తిరిగి వస్తుండగా.

“ఎవరూ? స్వరూపరాణా? ఏం జరిగిందీ?” అన్నాను. స్వరూపరాణి నాకు బాగా తెలుసు. నా కంటే పదేళ్ళు పెద్దదయినా ఎంతో ఫ్రెండ్లీగా వుండేది. ఆ అమ్మాయి పెళ్ళయి రెండేళ్ళయింది. వారి పూర్వీకులది ప్రొద్దుటూరు. అందుకీ వాటిని ప్రొద్దుటూరి వారంటారు.

“కనుక్కోవాలి మహి – పెళ్ళి చాలా గొప్పగా జరిగింది. ప్రొద్దుటూరు బంగారు వ్యాపారానికి పేరుమోసిన నగరం కదా. స్వరూపకి చాలా నగలు పెట్టారు. దాదాపు నలభై లక్షలు నగలు. వరుడి వాళ్ళు కూడా బాడా డబ్బున్న వారే. వాళ్ళూ ఓ యాభై లక్షల నగలిచ్చారు. వీళ్ళు కట్నంగా ఎంతిచ్చారో తెలీదు గానీ, భారీగానే ముట్టజెప్పారని విన్నాను. రెండేళ్ళు పూర్తి కాకముందే యీ విడాకులు గొడవ ఏమిటో అర్థం కావడం లేదు. అసలు యువతీయువకులకు పెళ్ళి మీద, సంసారం మీద అవగాహనే లేదు. అవి ప్రేమ వివాహాలైనా, పెద్దలు కుదిర్చిన సంబంధాలైనా ‘రిజల్టు’ ఒకలాగే వుంటోంది.” త్రిపుర గారి గొంతులో బాధ ధ్వనించింది.

“కారణాలు ఏమైనా, విడిపోయాలని అనుకున్నప్పుడు విడిపోవడమే రైటు. లేకపోతే, ఆ సంసారంలో ఉత్పన్నమయ్య పరిస్థితుల ‘నరకం’ తట్టుకోవడం అంత తేలిక కాదు.” అంటూ కుసుమ జీవితం గురించి చెప్పాను. కుసుమ గుర్తుకి రాగానే గుండె చెరువైంది.

త్రిపురగారితో కలిసి కుసుమా వాళ్ళింటికి వెళ్ళాను.

కుసుమ వాళ్ళమ్మగారూ నాయనమ్మా వున్నారు. కుసుమ నాన్నగారు దిగులుతోనే పోయారు. “నేనే కుసుమని చంపేసాను మహి. నాకు చావే రావడం లేదే” అంటూ భోరున ఏడ్పింది ముసలావిడ. కుసుమ అమ్మగారు తల వొంచులేని మౌనంగా ఉంది, తుఫాను రాబోయే ముందు సముద్రం లాగా..

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here