మహతి-39

3
12

(సంచిక పాఠకుల కోసం ప్రసిద్ధ సినీ కవి, రచయిత శ్రీ భువనచంద్ర అందిస్తున్న ధారావాహిక.)

[మహతికి వచ్చిన గుర్తింపు తనకి కాస్త ఇబ్బందిని కలిగిస్తుంది. కొంతమంది కలెక్టర్ గారికి చెప్పి తమ సమస్యలు పరిష్కరించమని కోరితే, డిపార్టుమెంటు ద్వారా వెళ్ళాలి అని వారిని ఒప్పించి పంపుతుంది. మహిళమండలిలో ఎందుకు చేరలేదని ఓ రోజు త్రిపుర అడిగితే, మెంబర్ని కాకపోయినా, తాను ఆవిడకి సపోర్టుగా ఉంటానని చెబుతుంది మహతి. ప్రెసిడెంట్ గారు కూతురు పుట్టినరోజు చాలా ఘనంగా చేస్తారు. దాదాపు రెండు వేల మందికి భోజనాలు పెడతారు. త్రిపుర, మహతి వెళ్తారు. ఆ ఖర్చుతో ఒక స్కూలే కట్టచ్చని త్రిపుర అంటే, నిరుపేదలకి కనీసం ఒక పూటైనా భోజనం దొరికిందిగా అని మహతి అంటుంది. 38 ఐటమ్స్‌ని వడ్డిస్తారు. విఐపిలకీ, వివిఐపిలకీ అరటి ఆకుల్లో వడ్డించి బయట జనాలకి పేపరు ప్లేట్స్, యూజ్ అండ్ త్రో మంచి నీళ్ళ గ్లాసులు ఉపయోగిస్తారు. కార్యక్రమం పూర్తయి మర్నాడు ఎంగిలి ప్లేట్లు, గ్లాసులూ రోడ్లని ఆక్రమిస్తాయి. మహతి పంచాయితీకి ఆఫీసుకు వెళ్ళి చెప్పడంతో వాళ్ళు వాటిని తీయించి, ఊరి చివర పారేస్తారు. కానీ గాలికి పేపర్లు ప్లేట్లూ, గ్లాసులు మళ్ళీ రోడ్ల మీదకి వచ్చేస్తాయి. ఏం చేయాలని ఆలోచిస్తుంటే, పర్యావరణంపై ప్రజలలో అవగాహన కల్పించాలని అంటారు త్రిపుర. ఈ అవగాహన కార్యక్రమాన్ని పిల్లలతో ప్రారంభించాలని అంటుంది మహతి. పేపర్ ప్లేట్లకు బదులు విస్తళ్ళ వాడకాన్ని ప్రోత్సహించాలని అనుకుంటారు. అన్ని స్కూళ్ళకి వెళ్ళి ప్లాస్టిక్, పాలిథిన్ వాడకం వల్ల వచ్చే అనర్థాలని పిల్లలకి వివరించాలనీ, యజమానుల అనుమతి తీసుకుని గోడల ప్లాస్టిక్ అనర్థాలని రాయించాలని నిర్ణయిస్తారు. ఓ రోజు హైస్కూల్లో విద్యార్థులకి ప్లాస్టిక్ అనర్థాలని వివరించి తిరిగి వస్తుండగా – త్రిపుర మాట్లాడుతూ, స్వరూపారాణి అనే అమ్మాయి అత్తవారింట్లో గొడవలై, పుట్టింటికి వచ్చేసిందని, విడాకులకి అప్లయి చేసిందని చెప్తారు త్రిపుర. అప్పుడు కుసుమ గురించి ఆవిడకి చెబుతుంది మహతి. త్రిపుర గారితో కల్సి కుసుమ వాళ్ళింటికి వెళ్తుంది మహతి. కుసుమ నానమ్మా, అమ్మా ఏడుస్తారు. – ఇక చదవండి.]

మహతి-3 మహి-6

[dropcap]“ఆ [/dropcap]దరిద్రుడు మూడు నెల్లు తిరక్కుండానే పెళ్ళి చేసుకున్నాడటే. అత్తింటికి వెళ్ళనని ఎంతగా ఏడ్చినా నేను పట్టించుకోలేదే తల్లీ.. యీ ముసలిదాని అరుపులకి భయపడి నా బిడ్డని చంపుకున్నానే తల్లీ..” లెంపల్ని టపాటపా కొట్టుకుంటూ ఏడుస్తోంది కుసుమ తల్లి. కుసుమ బామ్మ నోరు మూసింది.

త్రిపుర కుసుమ తల్లిని అరగంట సేపు ఓదార్చుతూనే ఉన్నారు. అప్పటికి కాస్త ఆవిడ సర్దుకుని “లేదమ్మా.. దానికి జబ్బొచ్చి హాస్పిటల్‍లో వున్నప్పుడు యీ మహతే సేవలు చేసింది. చచ్చిపోయే ముందు కూడా కుసుమ మహతినే తలుస్తూ ప్రాణం విడిచిందట” కళ్ళొత్తుకుంటూ అన్నది కుసుమ తల్లి.

నా గుండెల్లో గునపం గుచ్చినట్టు అయింది. కనీసం అది ఒక్క ఉత్తరం నాకు వ్రాసినా దాని అత్తగారితో యుద్ధం చేసైనా తీసుకు వచ్చేదాన్ని. నిస్సహాయతతో నా నోరు మూతబడి పోయింది. ఎవరిని నిందించాలి? పరువు ప్రతిష్ఠలే ముఖ్యమనే పెద్దలనా? ఇష్టం లేనప్పుడు స్పష్టంగా చెప్పలేని చిన్నలనా? పెళ్ళికీ చావుకీ ముడిపెట్టే అమ్మమ్మలూ బామ్మలూ తాతయ్యలనా? ఒక నిండు జీవితం పండుటాకులా నేలరాలి పోయింది. ముసలావిడ ఎండిపోయి వుంది. కుసుమ తల్లి పరిస్థితీ దీనంగా వుంది. ఒక పక్కన కూతురు పోయిన బాధ, మరో పక్క భర్తను పోగొట్టుకున్న బాధ.

అరుగు మీద నించి లోపల చూస్తే కుసుమ ఫొటోకి దండ వేసి వుంది. పెద్ద ఫొటో.. బ్రతికి ఉన్నప్పటి ఫొటో. పెళ్ళికూతురుని చేసినప్పటి ఫొటో. అది నా కళ్ళలోకి సూటిగా చూస్తున్న భావన. ఆ పక్కనే కుసుమ తండ్రి ఫొటో. ఆ కళ్ళల్లో తప్పు చేసిన భావన. మనాది తోనే పోయాడుగా మరి.

త్రిపుర గారు ఓదారుస్తూ వీలున్నంత ధైర్యాన్ని, బాధను భరించే ఓర్పునీ వారిలో కలిగించడానికి ప్రయత్నంచారు. ఈ దుఃఖం వారిని నీడలాగా రాత్రింబవళ్ళు వెంటాడుతుందని నాకు స్పష్టంగా తెలిసింది.

ఒక్క తొందరపాటు నిర్ణయం, పనికిరాని పరువు ప్రతిష్ఠల మీద మమకారం రెండు ప్రాణాల్ని బలి తీసుకుంది. అంతేగాదు, ఇద్దరు జీవచ్ఛవాల్ని మిగిలించింది.

“వాళ్ళిదర్ని చూస్తుంటే ఏడుపు తన్నుకొస్తోంది మహీ. ఇప్పటిదాకా ఉగ్గబట్టుకుని వున్నాను. ఓహ్.. ఎంత విషాదం. ఏం చూసుకుని బ్రతుకుతారూ? తట్టెడు ఆస్తి వున్నా ఆనందం శూన్యం కదా!” తిరిగి వస్తుండగా అన్నారు త్రిపుర.

“ఆనాడు మా అమ్మానాన్నలతో పోట్లాడి దాన్ని తీసికెళ్ళినా బ్రతికుండేదేదేమో!” నా మాటలు నాకే సరిగ్గా వినబడలేదు.

“కుసుమ పోనని ఏడ్చినా తల్లిదండ్రులూ ముసలావిడా బలవంతంగా కాపురానికి పంపారు. కుసుమ చనిపోతుందని వాళ్ళు వూహించి వుండరు. కుసుమ మనసు ఎప్పుడో చచ్చిపోయి వుండాలి.. ఇష్టంలేని కాపురం చేస్తూ. కానీ మహీ, హాయిగా సాగుతున్న నా జీవితంలోంచీ నన్ను బలవంతంగా మా పుట్టింటి వాళ్ళు లాక్కొచ్చారు. డబ్బున్నదన్న అహంకారంతో విడాకులూ ఇప్పించారు. అప్పట్లో నేను చదివింది ఎయిత్ క్లాసు. ఇంటి పరిస్థితులు చూసి నా కాళ్ళ మీద నేను నిలబడక తప్పదని గ్రహించి, ప్రయివేటుగా మెట్రిక్ కట్టి పాసయ్యాను. ఆ తరువాత, బి.ఎ. ప్రయివేటుగా కట్టి పాసయ్యాను. మహీ, ఒక చిన్న మాట తేడా.. అంతే.. నా జీవితం ఇలా అయింది. డబ్బు వుందనే అహంకారం డబ్బుతోటే పోయింది. నాన్న పోగానే సామ్రాజ్యం అన్న చేతికి వచ్చింది. ఆయన మంచివాడే. కానీ వదిన? ఒక ఆడది తలచుకుంటే మరో సాటి ఆడదాన్ని ఎంత హింసకీ ఆవేదనకీ గురి చేయగలదో దేవుడికి కూడా తెలీదు. ఓ అన్‌ట్రెయిన్డ్ టీచర్ ఉద్యోగం సంపాయించుకొని ఆ నరకం నించి బయటపడ్డా, మా అమ్మనీ బయటపడేశా. ఓ అయిదేళ్ళు ఆవిడా ఏడుస్తూనే బతికింది. ‘త్రిపురా.. మీ నాన్న అహంకారం నీ జీవితాన్ని బద్దలు చేసిందే’ అని ఆవిడా ఓనాడు లోకాన్ని వదిలి నిష్క్రమించింది. నేను ఉన్నాను. సాటి మహిళల కోసం ఏదన్నా చేయాలని, నా తండ్రి ఆస్తిలో నా వాటా కోసం కోర్టుకెళ్ళాను. ఎన్ని దూషణలూ తిరస్కారాలూ ఎదుర్కోవాలో అన్నీ ఎదుర్కున్నాను, మహీ.. జీవితం నేర్చే పాఠాలు ఎవరూ నేర్పరు. ఎనీవే.. నాకో ఆలోచన వచ్చింది. రేపు మళ్ళీ కుసుమ ఇంటికి వెడదాం. ఓ బస్తాడు అడ్డాకులు తీసుకెళ్ళాలి. కుసుమని తలచుకుంటూ ఆ అడ్డాకుల్ని విస్తళ్ళుగా కుట్టి ఇమ్మని చెబుదాం. డబ్బు కాదిక్కడ.. వారికో వ్యాపకం వుండాలి. వాటిని ‘కుసుమ’ పేరుతోనే మార్కెట్ చేద్దాం. ఖచ్చితంగా వాళ్ళు ఒప్పుకుంటారు. వాళ్ళ మనసుల్లో గడ్డగట్టిన అపరాధభావనని ఈ విస్తళ్ళు కుట్టడం అనే పని తగ్గిస్తుంది” అన్నారు త్రిపుర.

అది రోడ్డని కూడా చూడకుండా త్రిపుర గారిని కౌగిలించుకుని అన్నాను – “మేడమ్.. యు ఆర్ ఏ జీనియాస్”. చిన్నగా నవ్వారామె.

***

“ఈ విస్తళ్ళలో పెట్టే ప్రతి భోజనం కుసుమ ఆత్మని శాంతింప చేస్తుందని కుట్టండి. ఎవరో ఎవరి జ్ఞాపకార్థమో ఓ సత్రం కట్టిస్తారు. ఆ సత్రంలో బస చేసిన వారు ఆ సత్ర నిర్మాతల్ని ఆశీర్వదిస్తారు. కట్టించిన వారెవరో బస చేసినవారికి తెలియకపోవచ్చు. అలాగే విస్తరి కుట్టిన మీరు, భోంచేసే వారికి తెలియకపోవచ్చు. కానీ, ఎవరో మీ కుసుమను తలచుకుంటూ, మీరు కుట్టిన విస్తరిలో తృప్తిగా భోంచేస్తున్నారు అనుకుంటే ఎంత శాంతిగా వుంటుందీ! అమ్మా మీకు ఆస్తిపాస్తులున్నాయి. కావాలంటే ఓ వంద కట్టలు మీరే కొని ఇవ్వొచ్చు. అది కాదు కావల్సింది. మీరు స్వయంగా, మీ హస్తాలతో కుడితే వచ్చే శాంతి వేరు.” నెమ్మదిగా ప్రశాంతంగా కుసుమ అమ్మగారికీ, ఆవిడ అత్తగారికీ, అంటే ముసలావిడకీ వివరించారు త్రిపుర గారు.

కుసుమ అమ్మగారు మెల్లగా తలాడించింది.

“నేను నా దుర్మార్గపు పనికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. తల్లుల్లారా, మనసా వాచా కుసుమనే తలుస్తూ కుడతాను” కళ్ళ వెంట కన్నీరు జారుతుండగా అన్నది ముసలావిడ. అదీ ఇదీ మాట్లాడి ఇంటికొచ్చాం.

“ఇక నించీ వాళ్ళు వేదనలో మగ్గిపోరు.” అన్నారు త్రిపుర. “నీకు తెలుసా మహీ.. బుక్ బైండింగ్ నేర్చుకున్నాను, చదువుకునే ప్రాసెస్‌లో. ఓ పలకల కంపెనీలో కూడా పని చేసేదాన్ని నా ఫీజు నేనే కట్టుకోవాలనే పంతంతో. మనసుని కట్టడిలో పెట్టాలంటే ఏదో ఓ వ్యాపకం ఉండాలి. లేకపోతే అది వేదనలో మునగటానికే ఇష్టపడుతుంది” అన్నారు త్రిపుర గారు.

“మేడమ్.. వారు.. అంటే మీ భర్త గారు మిమ్మల్ని బాగా చూసుకునేవారా?” అడిగాను. కుతూహలం కనబరచడం తప్పని నాకు తెలుసు.

“చూసుకున్నారు. కానీ, అతనూ నిస్సహాయుడే. చదువు సంధ్యలు వున్నా ఉద్యోగం చెయ్యడం అనేది నామోషీ. ‘ఎవడికో సలాం కొడుతూ సంపాయించేదీ డబ్బేనా’ అని యీసడించేవారు. పోనీ స్వతంత్రంగా ఏదన్నా చెయ్యమంటే, దానికీ ఏదో ఒక సాకు చెప్పేవారు” నిట్టూర్చారు.

“పెళ్ళి సమయానికే ఆయనకి ఉద్యోగం లేదని తెలుసా?” అన్నాను.

“ఊహూ.. ఆ సమయంలో ఏదో కంపెనీలో జాబ్ చేస్తున్నారు. జాబ్ లేకుంటే ఎవరూ పిల్లని ఇవ్వరని తల్లిదండ్రులు బలవంతంగా ఆయన్ని జాబ్‍లో చేర్చించారట. పెళ్ళి  అయిన వారానికే ఉద్యోగం మానేశారు” నిర్లిప్తంగా అన్నారు త్రిపుర గారు.

“మరి సంసారం ఎలా గడిచేది?”

“ఆయన తల్లిదండ్రుల డబ్బు మీద. వాళ్ళు గొప్ప ధనవంతులు కాకపోయినా, కొద్దోగొప్పో ఉన్నవాళ్ళే. మా మామగారు మంచివారు. కొడుక్కి బుద్ధి చెప్పే ప్రయత్నం చేశారు. అత్తగారికి కొడుకంటే పంచ ప్రాణాలు, విపరీతంగా గారాబం చేశారు. దాంతో ఎంత చెడాలో అంతా చెడాడీయన. ఆ విషయమే మా నాన్న నిలదిస్తే చాలా అమర్యాదగా మాట్లాడారు. మా నాన్నకి కూడా కోపం వచ్చి నన్ను బలవంతంగా పుట్టింటికి తెచ్చేశారు. వాళ్ళు విడాకుల పత్రం పంపించారు. ‘వాడేనా విడాకులు అడిగేదీ? సంతకం పెట్టి వాడి మొహాన కొట్టు’ అన్నారు మా నాన్న. ఏవుందీ! కుసుమ భర్తలా యీయనా మూడు నెలల్లో రెండో పెళ్ళి చేసుకున్నాడు” నిట్టూర్చారు త్రిపుర.

“ఆ కాపురం అయినా..” ఆగాను.

“ఆ అమ్మాయి తెలివైంది. వేరే కాపురం పెట్టించింది. ఆస్తి మీద అజమాయిషీ మొదలెట్టింది. ఇద్దరు పిల్లలు పుట్టాకా అత్తమామల్ని అవుట్ హౌస్ లోకి పంపి తాను సామ్రాజ్యాన్ని ఆక్రమించింది.”

“ఇవన్నీ మీకెలా తెలిశాయి?” అడగకూడదనే అడిగాను.

“చుట్టాలు ఉంటారుగా. ఇక్కడి కబుర్లు అక్కడికీ, అక్కడి కబుర్లు ఇక్కడికీ అందించడానికి” ఉదాసీనత కనబడిందావిడ నవ్వులో.

చాలా ప్రశ్నలు అడగాలని అనిపించినా అడగలేదు. “మగవాడికీ, ఆడదానికీ పుట్టుకతోనే కొన్ని తేడాలుంటై. నేననేది శారీరికమైన వాటి గురించి కాదు. మానసికమైన తేడాలు. మహీ, కొందరి రూపం పురుషుడిదైనా మనసు స్త్రీ మనసు లాగా అతి సున్నితం. కొందరి రూపం స్త్రీ అయినా మానసికంగా చాలా టఫ్‌గా ఉంటారు. సో.. రూపాన్ని బట్టి అంతర్గుణాలని గుర్తించలేము. ఇంకోటి ఏమంటే ప్రతి పురుషుడిలోనూ ఒక స్త్రీ, ప్రతి స్త్రీ లోనూ ఒక పురుషుడూ ‘తత్వం’గా ఉండి తీరుతారు. అండం, బీజం కలిస్తేనే కదా పిండం ఉద్భవించేదీ!” అన్నారు త్రిపుర.

ఆ తరువాత మాటలు సాగలేదు. జరిగిన సంభాషణ నన్ను చాలా సార్లు వెంటాడింది. ప్రతి జీవితమూ ఓ నవరసాలూ నిండిన నవలే. ఎటొచ్చీ కొందరికి శోకరసం, కొందరికి బీభత్స రసం ఎక్కువగా దక్కుతాయనిపించింది. ప్రతి మనసులోనూ ఓ పూడ్చలేని శూన్యం ఉందని కూడా అనిపించింది.

***

“ఏమిటీ ఆలోచిస్తున్నావు?” అన్నాడు తాతయ్య. మేం కుసుమ ఇంటికి వెళ్ళడం, విస్తళ్ళ కథ చెప్పి చివర్లో త్రిపుర గారి కథ కూడా చెప్పాను.

“ఆమె చాలా లోతైన మనిషి. విజ్ఞురాలు. నువ్వు చాలా నేర్చుకోవచ్చు ఆమె నుంచి” అన్నాడు తాతయ్య.

“నీకెలా తెలుసు తాతయ్యా” ఆశ్చర్యంగా అన్నాను.

“దాన్నే అనుభవం అంటారు. ఓ మనిషిని చూసినప్పుడు ముందు నీ మనసే చెబుతుంది వారి ప్రవృత్తి గురించి. నూటికి నూరు పాళ్ళూ చెప్పక పోయినా నూటికి అరవై పాళ్ళు సరిగ్గానే చెబుతుంది. ఎటొచ్చీ, నీ మనసు నీతో ఏం చెబుతోందో వినాలంటే కొంచెం సాధన చెయ్యాలి” అన్నాడు తాతయ్య.

***

స్కూళ్ళకి వెళ్తున్నాం. ప్లాస్టిక్, పాలిథిన్ మానవాళికీ, భూమికీ చేసే అనర్థాలని వివరిస్తున్నాం. మొదట్లో నేనూ, త్రిపుర గారూ మాత్రకు వెళ్ళేవాళ్ళం. తరవాత డాక్టర్ గారి క్లాస్‌మేట్ డా. సూరి గారు కూడా వారానికోసారి బెజవాడ నించి వచ్చి స్కూళ్ళల్లో అవగాహనా కార్యక్రమం జరిపేవారు. ఆయనా శ్రీధర్ గారిలా చాలా ఉత్సాహి. అనేకానేక విషయాలు పిల్లలలో చెబుతూ చలా దగ్గరయిపోయారు పిల్లలకి.

కుసుమ అమ్మగారూ నాయనమ్మ చాలా దీక్షతో పనిచేస్తున్నారు. వాళ్ళే కాక మరో పది మంది స్త్రీలు కూడా విస్తళ్ళు కుడుతున్నారు.

“కొంపలో ఈగల్నీ దోమల్నీ తరిమే వాళ్ళం. ఇప్పుడు హాయిగా టైంపాస్ అవుతోందమ్మా” అన్నారు సుశీలమ్మగారు. ఇంత పెద్ద బొట్టుతో పెద్ద ముత్తయిదువగా ఆమె నడుం బిగించేసరికి మరో అయిదారు మంది ఆవిడతో పాటు కలిశారు.

హాస్పటల్లో షెడ్డు కట్టడం వల్ల మా ‘పాక’ ఖాళీ గానే ఉంది. అక్కడే చాపలు పరిపించారు తాతయ్య, పదకొండింటికల్లా వాళ్ళు వచ్చి ఇక్కడే కుట్టి, ఇక్కడే విస్తళ్ళు ఆరబెట్టి, కట్ట కట్టి ఇక్కడే పేరుస్తున్నాడు. మా పాకే గోడవున్ అయింది.

ఊరి లోని షాపుల వాళ్ళని కూడా చెప్పాము, పేపర్ ప్లేట్లకి బదులుగా విస్తళ్ళ వాడకాన్ని ప్రోత్సహించాలని.

“మద్రాసుకి ఎగుమతి చేస్తే మంచి లాభాలు వస్తాయి. అయితే ఇంకా ఎక్కువమంది కుడితే గానీ మనం సప్లై చెయ్యలేము. ఒకప్పుడు చీపుళ్ళు, విస్తళ్ళు ఆంధ్రా నించే తమిళనాడుకి వెళ్ళేవి.” అన్నాడు రాంబాబు.

“అయితే ‘టముకు’ వేయిద్దాం. ఇష్టం అయినవారు మన పాక దగ్గరికి రమ్మని” అన్నాడు తాతయ్య.

“అది మంచి నిర్ణయం” అన్నారు త్రిపుర.

‘టముకు’ అంటే ఒక వ్యక్తి ‘డప్పు’ మ్రోగిస్తూ ఊరివాళ్ళకి ఎనౌన్సు చెయ్యడం అన్నమాట. మొదట్లో ఊరికి ఏదీ అమ్మకానికి వచ్చినా టముకు వేయించేవారు. పంచాయితీ వారు ప్రజలకు ఏది చెప్పాలన్నా ‘టముకు’ ప్రధాన ప్రచార సాధనం, ఆ తరవాత రిక్షాల్లో మైకు సెట్లు పెట్టుమని ప్రచారం చేసేవారు (ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో ‘టముకు’ వేయించే పద్ధతి వుంది).

సాయంకాలానికి బిలబిలా ఆడవాళ్ళు వచ్చారు. దాదాపు 15 మంది. పాక ఫుల్ టైమ్ విస్తళ్ళ గొడవున్‍గా మారింది. కక్కరాల పుల్లయ్య గారు (వైశ్య దుకాణాదారు) అడ్డాకుల్ని తక్కువ ధరకి సప్లై చేస్తానని ముందుకొచ్చారు.

“సరే మద్రాసుకీ, ఇతర వూళ్ళకి సప్లై చేసే పనులు నేను చూసుకుంటా. వీటితో పాటు కుంకుడుకాయలు, చీపుళ్ళకి కూడా చాలా గిరాకీ వుంది” అన్నారు బొల్లిపల్లి ముత్తయ్య (వీరికి బుక్ స్టాలుంది).

“నేను భాగస్వామిని అవుతా” అన్నాడు రాంబాబు. అందరం ఉత్సాహంగా లేచాము.

ఒక సమస్యకు పరిష్కారంగా ఓ చిన్న బీజం పడింది.

“రోజుకో గంట కేటాయించి ఇంటింటికీ ప్రచారం చేస్తే?” అన్నారు ఓనాడు డా. సూరి.

“అవును. అది మరీ మంచిది” అన్నాడు తాతయ్య.

“ముందు మనకి సోషల్ వర్కర్స్ కావాలిగా” అన్నారు త్రిపుర.

“స్టూడెంట్స్‌లో సేవా భావాన్ని నాటాలే గానీ, నాటితే తిరుగుండదు” అన్నారు డా. సూరి.

“ఆ విషయాలలో సాయి సేవా కేంద్రాల సహాయం కూడా తీసుకుందాం” నేనన్నాను.

“యస్.. ‘లవ్ ఆల్, సర్వ్ ఆల్’ అనేది సాయి నినాదం” అన్నారు త్రిపుర గారు.

ఆ రోజున చాలా నిర్ణయాలు తీసుకున్నాం. మొదటి అడుగు దిగ్విజయంగా పడింది.

***

“ఏదో టముకు వేయించారట?” ప్రెసిడెంటు గారు అడిగారు. ఆ స్వరం మామూలుగా లేదు. త్రిపురగారు చెప్పిన మాట జ్ఞాపకం వచ్చింది. “మహీ.. రాజకీయ నాయకుల అనుమతి తీసుకోవాలి. లేకపోతే వాళ్ళు చాలా సైలెంటుగా మన కార్యక్రములను భగ్నం చేస్తారు. కావాలనుకుంటే భస్మమూ చేస్తారు” అని. ప్రెసిడెంటు గారితో చెబుదామనే అనుకున్నా. అయితే ఉత్సాహంలో ఆ మాట మరుగున పడింది.

“సార్.. ప్రారంభించక ముందే మీకు చెబుదాం అని అనుకున్నాం. ప్రజల రియాక్షన్ ఏమిటో తెలియకుండా మీ దగ్గరికొస్తే, మీరు ఇబ్బందిలో పడతారని అనుకున్నాం. అసలీ విస్తళ్ళ కార్ఖానా ఎందుకు పెట్టాలని అనిపించిందంటే..” అని మొదలు పెట్టి ప్లాస్టిక్, పాలిథిన్‌లు మానవాళికి చేసే అపకారమూ, దాన్ని అరికట్ట వలసిన బాధ్యత etc etc మొత్తం చెప్పాను.

“ఈ కార్యక్రమంలో దేశంలోనే మన పంచాయితే నంబర్ వన్ కావాలంటే..” అని మరో అరగంట ఆయన బుర్ర తినేసి, చివరిగా

“సార్.. ప్రారంభం మీరే చెయ్యాలి. మీ మాట ప్రజలు వింటారు. ప్లాస్టిక్, పాలిథిన్ వస్తు సముదాయాన్ని మనం పూర్తిగా తగ్గించగలిగితే, అద్భుతమైన పేరు మీకే వస్తుంది. సార్.. ఈ ఉద్యమాన్ని మీరే ముందుండి నడిపించాలి” అన్నాను చాలా వినయంగా.

ఒక్కసారిగా లేచి నా చేతులు పట్టుకుని “శభాష్ మహీ.. నేనే ముందుంటాను” అన్నారు మహదానందంగా!

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here