మహతి-47

6
11

(సంచిక పాఠకుల కోసం ప్రసిద్ధ సినీ కవి, రచయిత శ్రీ భువనచంద్ర అందిస్తున్న ధారావాహిక.)

[అల నుంచి ఉత్తరం వస్తుంది. తాను ప్రేమలో పడ్డాననీ చెప్తూ, తన భావాలని ప్రతిబింబించే ఓ హిందీ పాటని రాస్తూ, తనకొచ్చిన హిందీలో ఆ పాటని వ్యాఖ్యానిస్తుంది. ప్రేమతో పేరుతో ఒకప్పుడు తిమ్మూని ఏడిపించిన సంగతి గుర్తొచ్చి, తనది మూర్ఖత్వమని అంటుంది. ప్రేమ పుట్టడానికీ కారణాలు అర్హతలూ ఉండవని అంటుంది. ఉత్తరం హఠాత్తుగా ముసిగినట్టనిపిస్తుంది మహీకి. అలసిన మహీ మనసుకి సాంత్వన కలిగిస్తుందా లేఖ. డా. శ్రీధర్ రాగానే టిఫిన్ పెట్టించి, కాపీ తాగుతూండగా, పెళ్ళి ప్రస్తావన తెస్తారు తాతయ్య. తాను కూడా చేసుకోవాలనుకుంటున్నాననీ చెప్తారు శ్రీధర్. మీ మనసులో ఎవరైనా ఉన్నారా అని తాతయ్య అడిగితే, ఆ అమ్మాయికి మీకు తెలిసినదే, కానీ ఆ అమ్మాయి ఒప్పుకోకుపోతే ఎలా అని సంకోచిస్తున్నానని అంటారు శ్రీధర్. ఎవరా అమ్మాయి అని అడిగితే, ఆ అమ్మాయి పేరు చెప్పే ముందు మీకు నా జీవితం గురించి చెప్పాలి అని తన వివరాలు చెప్తారు శ్రీధర్. తన మనసులో మాటని మహీకి చెప్పాలనుకున్నానని శ్రీధర్ అనడంతో తాతయ్య, మహీ విస్తుపోతారు. అది చిన్నపిల్ల అని తాతయ్య అంటే, చిన్నపిల్ల అయినా విజ్ఞత ఉన్న అమ్మాయి, తనైతే నా విషయాలన్నీ చెప్పి శ్యామలను ఒప్పించగలదని అంటారు శ్రిధర్. సంతోషించిన తాతయ్య, మహీ – శ్యామల గారిని ఒప్పించే బాధ్యత మాదే అంటారు. డా. సూరి కూడా శ్యామలతో మాట్లాడుతారు. పెళ్ళికి ఆమె అంగీకరిస్తుంది. అహల్య, గౌతమ్ దంపతులు పీటల మీద కూర్చిని వివాహం జరిపిస్తారు. పెళ్ళికి ఊరు ఊరంతా హాజరవుతారు. పెళ్ళయ్యాకా, ఓ రోజు అహల్య మళ్ళీ మహతికి – ఆమె నిర్ణయం గురించి గుర్తు చేస్తుంది. నువ్వు ఏమి కావాలనుకుంటున్నావో త్వరగా నిర్ణయించుకో అంటుంది. తల్లి తన తల నిమిరినా, ఆ స్పర్శలో ఇది వరకున్నట్టు లేదని మహి గ్రహిస్తుంది. తండ్రిలో కూడా ఏదీ వ్యగ్రతని గమనిస్తుంది మహతి. డా. శ్రీధర్, శ్యామల దంపతులను ఓ వారం రోజుల పాటు మైసూరు, బెంగుళూరులో గడపడానికి ఫంపుతారు. వాళ్ళూ వచ్చకా, తమ ఇంట్లోనే ఉంటారని తాతయ్య చెప్తారు. అవసరమైన మంచాలు, కుర్చీలూ ఇతర సామాను కూడా దగ్గరుండి మరీ కొంటారు. మీ అమ్మ ప్రవర్తనలో ఏదో తేడా ఉంది మహీ, మీ నాన్న కూడా ఏదో తెలియని చికాకు కనిపించిదని తాతయ్య మహితో అంటారు. తానూ గమనించాననీ, ఓ నెల క్రిందట అమ్మ ఫోన్ చేసి మాట్లాడిన మాటలు చెబుతుంది. అంటే నెల క్రిందటే ఏదో జరిగిందని అంటారాయన్. ఇద్దరికీ నిద్రపట్టదా రాత్రి. – ఇక చదవండి.]

మహతి-3 మహి-14

[dropcap]జా[/dropcap]గ్రత్త.. జాగ్రత్త.. జాగ్రత్త (జాగురూకతో వుండు)

జాగో.. జాగో.. జాగో (మేలుకో మేలుకో మేలుకో)

ఈ రెండు మాటలు జీవితానికి అతి  ముఖ్యమైనవని అర్థమయింది. ఎప్పుడూ మేలుకొనే ఉండటం ఎవరికీ సాధ్యం కాదు. కానీ మెలకువతో వుండు, అంటే, సంసిద్ధంగా ఉండు అని కూడా అనుకోవచ్చు. ఎప్పుడూ జాగ్రత్తగా వుండడమూ సాధ్యం కాదు కానీ మనని మనం కాపాడుకునే స్థితిలో తప్పకుండా ఉండగలం. కష్టమూ సుఖమూ అనేవి జీవితమనే నాణానికి బొమ్మ – బొరుసుల్లాంటివి. బొమ్మలేని బొరుసూ లేదు. బొరుసు లేని బొమ్మా లేదు. అందుకే అవి ఒకచోట అటూ ఇటూ వున్నా, ఏనాడూ ఒకరి మొహం ఒకటి చూసుకోవు. అలానే కష్టం వచ్చినప్పుడు సుఖం, సుఖంలో వున్నప్పుడు కష్టం ఉండనే ఉండవు. కానీ మహారచయిత అన్నారు –

బాధే సౌఖ్యమనే భావన రానీవోయ్. ఆ ఎరుకే నిశ్చలానందమోయ్.. బ్రహ్మానందమోయ్ అని

అది ఎప్పుడు జరుగుతుందీ? కష్ట సుఖాలని సమదృష్టితో చూడగలిగినప్పుడు. ఆ రెండూ జీవితంలో తప్పని సరైన భాగాలే అని స్పష్టంగా గుర్తించనప్పుడు.

“పోనీ మనిద్దరం అక్కడికి వెళ్ళి ఓ నెల పాటు ఉంటే సంగతి తెలుస్తుందేమో?” అన్నాడు తాతాయ్య.

“వద్దు తాతయ్యా. అది పరిస్థితిని ఇంకా సీరియస్ చేస్తుంది. వాళ్ళు మన ఎదుట మరింత అసహాజంగా, అంటే, కృత్రిమంగా జీవించాల్సిన పరిస్థితి ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఉన్నది పిల్లలే గనక వ్యవహారం వేరు. నన్నూ ‘దీనికి ఏమీ తెలీదని’ పక్కన పెట్టినా, నిన్ను అలా అనుకోరు గదా! ప్రస్తుతానికి మనం ఊహిస్తున్నాం. అంతే. దీనివి వెనుక ఏముందో తగిన సమయంలో బయటపడటమే మంచిది” అన్నాను నేను.

ఓ హాలు, ఓ గది, వంట గది మాక్రింద ఉంచుకుని మిగతా ఇల్లాంతా శ్రీధర్ దంపతుల కోసం సిద్ధం చేశాం. వంట విడిగా చేసుకోవాలని శ్యామల గారు అనుకుంటే, మా వంటగదినే ఆవిడా షేర్ చేసుకోవచ్చు.

“ఏమిటి మహీ.. ఒకలాగా వుంటున్నావు?” అన్నది త్రిపురగారు.

“మామూలుగానే ఉన్నానే!” అన్నాను నేను

“మామూలుగా లేవని నీకు తప్ప అందరికీ తెలుసు. లోకంలో 80% అందర్నీ అన్నిట్నీ గమనిస్తారు. వారికి అవసరం ఉన్నా, లేకపోయినా. అదొక జీవలక్షణమే. కానీ ఆ 80% తమని తాము గమనించుకోరు. ఇతరులలో తేడాలని ముఖ భంగిమలతో సహా గుర్తు పట్టగలిగే వీళ్ళే తమలోని మార్పుని గమనించలేరు” చిన్నగా నవ్వి అన్నది త్రిపురగారు.

“సారీ, త్రిపురగారూ, నేను ఏనాడూ ఎవర్నీ గమనించడానికి ఇష్టపడను. ఆ క్షణంలో వారి పరిస్థితిని గమనించి తదనుగుణంగా నా ప్రవర్తనను మలచుకుంటాను.” అన్నాను.

“ఆ విషయం నాకు తెలుసు కనకనే స్పష్టంగా నిన్ను అడిగాను. సంథింగ్ ఈజ్ వర్రీయింగ్ యూ. ఏదో విషయంలో నువ్వు కలవరపడుతున్నావు. తెలిస్తే నాకు తోచిన సలహానో సహాయమో చెయ్యగలను.” నా భుజాన్ని తట్టి అన్నది త్రిపుర.

“ఒక విధంగా మీరు రైటే. కానీ ఆలోచనలన వెనకాల రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి – నాకే తెలీదు. రెండవది – నా కెరీర్ గురించి. ఇదివరకు ఆ విషయంలో మన మధ్య చర్య కూడా జరిగింది. ఒక విధంగా మా అమ్మ చెప్పినట్లు నేనే ఫ్యూచర్‍ని ఎంచుకోవడంలో అస్పష్టంగా, కేర్‍లెస్‌గా ఉన్నానా అని కూడా అనిపిస్తోంది” అన్నాను. త్రిపుర గారు నా వంక సాలోచనగా చూశారు, కానీ, ఏమీ మాట్లాడలేదు.

“నేను ఏం చెయ్యాలో నేనే నిర్ణయించుకుంటానని చెప్పి చదువు నించి యీ గ్యాప్ తీసుకున్నాను. అమ్మమ్మగారు పోయిన దుఃఖం నుంచి తాతయ్యని డైవర్ట్ చెయ్యగలిగాను. ఓ సోమరితనంలా కాక, ఊరి బాధ్యతను కూడా కొంత తీసుకోగలిగాను. అయితే ఆ బాధ్యతని బాధ్యత అని కూడా అనలేము. నిజమైన బాధ్యత అని ఎప్పుడు అనిపించుకుంటుందంటే, నేను చేసే ప్రతి పని వెనుకా ప్రభుత్వ ఆమోదం స్పష్టంగా ఉన్నప్పుడు” అన్నాను.

నాలో నేను చాలా రోజుల్నించీ ఆలోచిసున్న ఆలోచనల సారాంశం కూడా ఇదే. అశక్తుడు ఏనాడూ నలుగురికి సాయపడలేడు. ఒకవేళ సహాయపడినా అది వ్యక్తిగత సాయమే అవుతుంది గానీ, ప్రజలందరి ప్రగతికీ ‘మెట్టు’ కాలేదు.

“నా మాట ఒక్కటే మహీ.. దయచేసి నీ గ్రాడ్యుయేషన్ పూర్తి చెయ్యి. ఆ తరువాత నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా ఎవరికీ ఇబ్బంది ఉండదు. అమ్మమ్మగారు దేహం చాలించకపోతే నీ చదువు యథాతథంగా కంటిన్యూ అయ్యేది. ఏదేమైనా, ఫస్టు నీ డిగ్రీ కంప్లీట్ చెయ్యి” నా మొహం వంకే చూస్తూ అన్నారు త్రిపురగారు. నేను తలాడించాను. ఆ కదలికలో ‘అవునూ కాదూ’ రెండూ లేవు.

***

అకాల వర్షం. వర్షానికి ముందు తెరలుతెరలుగా గాలి వీచసాగింది. గాలి అంతలోనే తీవ్రంగా మారింది. వేపచెట్ల ఆకులు, బాదాం, పున్నాగ చెట్ల ఆకులు చిటుకు చిటుకున రాలిపోతున్నాయి. ఏ మాత్రం శ్రమ తీసుకోకుండా రెమ్మల నించి కొమ్మల నుంచీ ఆకులు రాలిపోతున్నాయి.

శరీరం నుంచి ప్రాణం కూడా అలాగే సెకనులో వెయ్యో వంతులో విడివడిపోతుందా? మృత్యువుకి మనం భయపడతాం. మనలా ఏ జీవి మృత్యువుకి భయబడదు. ఎక్కడో చీమలు లాంటివి తప్ప – ఏవీ రేపటి గురించి ఆలోచించవు. కాలప్రవాహానికి ఎదురీదవు. రేపటి కోసం కడుపు కట్టుకునో, ఇతరుల పొట్ట కొట్టో యీనాడు అవి కూడబెట్టవు. ఆకలినీ ఆన్యాయాన్ని కూడా మౌనం గానే భరిస్తాయి. ఎందువల్ల?

‘ఏదో ఒకనాడు యీ అద్భుతమైన లోకాన్ని శూన్య హస్తాలతో విడిచిపోవాలి’ అనే ఎరుక తోనా? జనన మరణాన్ని సంఘటనలుగా కాక సహజంగా తీసుకోవడం వల్లనా? క్షణక్షణమూ తీవ్రమవుతున్న గాలిని చూస్తున్నా.

మనిషికి తప్ప కోటానుకోట్ల జీవుల్లో వేటికీ జ్ఞాన గ్రంథాలు లేవు.  బైబిలూ, ఖురానూ, భగవద్గీతా వంటి మహాగ్రంథాలు ఉన్నాయనే వాటికి తెలీదు. అసలు ఈ గ్రంథాల అవసరమే వాటికి లేదు. మరి మనిషి కెందుకూ? గ్రంథాలు మనిషి సృష్టించినవి. మనిషిని గ్రంథాలు సృష్టించలేదు. మరి ఎందుకూ మతం పేరుతో మనిషి ఒకరినొకడు నరుక్కునేదీ, చంపుకునేదీ?

ఆకులు వేల సంఖ్యలో రాలిపోతున్నై. గాలి వీచడం ఆగాకా, క్షణాల్లో వర్షం మొదలైంది.

శ్వాస ఆగిన మరుక్షణమే మరో ‘యాత్ర’ ప్రారంభం అవుతుందా? సన్నగా మొదలైన వర్షం తీవ్రమవసాగింది. చినుకుల చిటపటలు ఎలా వినిపిస్తున్నాయంటే, చితుకుల చిటపటలా వినిపించాయి.

వానతో పాటు గాలి, నాట్యం చేస్తోంది. గాలీ వానా విజృంభించి చెట్లకూ చేమలకూ అభ్యంగన స్నానాలు చేయిస్తున్నాయి. దుమ్ము కొట్టుకుపోయిన చెట్లు కొమ్మలు రెమ్మలూ వానలో స్నానమాడి దుమ్ము దులుపుకుని పచ్చగా మెరుస్తున్నాయి.

మామూలు వాన జడివానగా, గాలి సుడిగాలిగా మారింది. లక్షల బిందెల నీటిని ఏనుగులు తొండాలతో చిమ్మినట్టు, ఆకాశంలోంచి పృథ్వి మీదకి వాన అనబడే అమృతం చిమ్మబడుతోంది.

కళ్లారా చూస్తున్నాను. ఈ అనంతమైన ప్రకతిలో నేనెంత? కొండ మీద చీమ నడిస్తే కొండ అరిగిపోతుందా? కోటానుకోట్ల జీవజాతుల్లో మనిషిదీ ఒక జాతి. వాటన్నిటికీ లేని అవలక్షణం మనిషికి మాత్రమే ఉంది. వీడు ‘దేవుడ్ని’ సృష్టించి, ‘ధనాన్ని’ సృష్టించీ ‘వ్యాపారం’ చేస్తున్నాడు. దేన్నైనా అమ్ముతాడు. లాభం ఉంటుందనుకంటే నిస్సిగ్గుగా దేనికైనా అమ్ముడుబోతాడు. తాను ‘మనిషి’ నని మరిచి దేనికైనా సరే చేతులు చాచి మరీ దేబిరిస్తాడు ఎందుకిలా? నా ప్రశ్న లాగానే వర్షం ఉధృతమైంది.

మళ్ళీ మళ్ళీ ఆలోచనలు. “ఏమిటీ, సుదీర్ఘంగా ఆలోచిస్తున్నావు?” గుడి మండపంలో వర్షానికి తల దాచుకున్న సన్యాసి అడిగాడు. అతను చూస్తే యువకుడు. మహా అయితే పాతికేళ్ళు ఉండొచ్చు. కానీ వేసుకుంది కాషాయం. అసలు అతను నన్నా అలా అడగటమే చిత్రంగా అనిపించింది.

“మీరేమనుకుంటున్నారూ?” అన్నాను.

“అస్పష్టమైన ఆలోచనలతో ఇబ్బంది పడుతున్నావని అనిపించింది. అందుకే అడిగాను.” నవ్వుతూ అన్నాడు.

“సమస్య స్పష్టమైనదైతే ఆలోచనలు స్పష్టం గానే ఉంటాయి. అపసవ్యమైన సమస్యలకు పుట్టేవి అపసవ్యమైన ఆలోచనలే” అన్నాను.

“అవునేమో!” అని వర్షాన్ని చూడసాగాడు. వర్షం కుండపోతగా మారింది. మండపం అంతా తడి తడిగానే ఉంది. బట్టలు – వర్షానికి కాకపోయినా గాలి మోసుకొస్తున్నజల్లుకి తడిసిపోయాయి. జల్లు కొద్దిగా కొట్టే ఓ మూల చూసి, నేను కూర్చుని, అతన్ని కూర్చోమన్నాను. కూర్చున్నాడు.

“మీది ఈ ఊరు కాదు.” అన్నాను. ఆలోచనలు తరుముకొస్తున్నప్పుడు మౌనం కంటే మాటలు బెటర్ అనిపించింది.

“అవును. యీ ఊరు కాదు. అసలు సన్యానులకి ఏ ఊరూ సొంతం కాదు.”

వర్షం వంక చూస్తూనే నాకు బదులిచ్చాడు.

“అలా ఎందుకూ?” అన్నాను.

“స్వార్థాన్ని జయించడంలో అది ఒక మార్గం. నా ఊరు, మా ఊరు, నా వాళ్ళు, మా వాళ్ళు, మనవాళ్ళు వంటివి చాలా బలమైన ఉక్కు సంకెళ్ళు. వీటిని తెంచుకోవాలంటే సాధన తప్పదు” అన్నాడు వానని ఆస్వాదిస్తూ.

“ఈ వర్షం మీకు వచ్చిందా?” అన్నాను.

“ఇది వర్షం కాదు. పృథ్వి దాహం తీర్చే అమృతం” అన్నాడు

“ఇందాక నేనూ అదే అనుకున్నాను” అన్నాను. అతను నావంక చూసి చిన్నగా నవ్వి, “అంతే కాదు.. పంచభూతాల్లో నాల్గవది జలం. ఈ జలం లేకపోతే భూమి ఉద్భవించేది కాదు. సృష్టి లోని జీవులన్నీ పంచభూతాత్మకాలే, పంచభూత నిర్మితాలే” అన్నాడు. ఆధ్యాత్మికతకి నేను దూరం. అందుకే నాకేదో తెలిసీ తెలియనట్టుగా అనిపించింది.

“మీరేం చదివారు” అన్నాను కొంత మౌనం గడిచాక.

“లౌకికమైన చదువు చాలా చదివా. కానీ అదేమీ నాకు  తృప్తినీ ఆనందాన్నీ ఇవ్వలేదు. జీవితంలో వాటి అవసరం కూడా నాకు కనిపించలేదు” చిన్నగా అన్నాడు.

“మరి బ్రతకడానికి డబ్బు? ఆ డబ్బు, డబ్బు తెచ్చే ఆహారం వస్త్రాల కోసం జనాల మీద ఆధారపడతారా?” సీరియస్ గానే అన్నాను. అతను నావైపు తిరిగి సూటిగా చూసి “మీరేం చేస్తున్నారూ!?” అన్నాడు.

“చదువుతూ మానేశా” అన్నాను.

“ఎందుకు మానేశారూ?”

“జీవితంలో ఏం చెయ్యాలో, యీ లోకానికీ, ప్రకృతికీ, మనుషులకీ ఎలా ఉపయోగపడాలో నిర్ణయించుకోడం కోసం” అన్నాను సిన్సియర్‍గా.

“అంటే, మీరు చదువుకోవడమూ లేదు, సంపాందించడమూ లేదు. మరి మీకు అన్న వస్త్రాలు ఎలాగొస్తున్నాయి?” సూటిగా అడిగాడు

“మా అమ్మానాన్న ఉన్నారు” అన్నాను తల ఎగరేసి. కానీ నేనూ, ‘పరాన్న భుక్కునేగా’ అని నాకే తెలిసింది.

“గుడ్. నాకూ డబ్బు బాగా ఉన్న అమ్మానాన్నా ఉన్నారు. కనుక నేనూ చేయి చాచటం లేదు. ఇతరుల మీద అంతకన్నా ఆధారపడటం లేదు” చిన్నగా నవ్వి అన్నాడు.

“అంటే ఇలాగే..” ఏమడగాలో తెలియక ఆగిపోయాను.

“అచ్చం మీలాగే! ఏం చేస్తే బాగుంటుందా అని ఆలోచిస్తూ కాషాయ వస్త్రాలతో కాపురం చేస్తున్నా” పకపకా నవ్వి అన్నాడు. నాకు చాలా కోపం వచ్చింది. వెళ్ళిపోదామని అనుకున్నాను గానీ ఓ అపరిచితుడి ముందు ఓడిపోవడం అవుతుంది.

నిజాన్ని నిజంగా ఒప్పుకుంటే, తల తిక్క మాటలు మాట్లాడింది నేనేగా! భుక్తి కోసం ఏం చెయ్యవా? అని కవ్వించింది నేనేగా! తల వొంచుకున్నాను.

“నేను మిమ్మల్ని హర్ట్ చెయ్యాలని ఆ మాటలు మాట్లాడటం లేదు. నేనూ వెతుకుతున్నా. జ్ఞానం కోసం, సత్యం కోసం, ధర్మం కోసం, శాంతి కోసం వెతుకుతూనే వున్నా. ఒకప్పుడు సిగరెట్‌తో నిద్రలేచి విస్కీతో పడుకునేవాణ్ణి. ఓ సంఘటనతో నా మీద నాకే అసహ్యం వేసింది. స్నేహితులు, సరదాలూ, లాంగ్ డ్రైవ్‍లూ, టూర్సూ.. ఓహ్.. జీవితాన్ని ఓ తుఫాను మాదిరిగా గడిపేవాణ్ణి. ఓ యాక్సిడెంట్ నా కళ్ళు తెరిపించింది. ఓ దూడ నా కారు కింద పడింది. దాని తల్లి పరుగులు పెడుతూ వచ్చింది. దూడ శవం చుట్టూ పిచ్చిదానిలా తిరుగుతోంది. నా గుండె పడిలింది. ఎందుకంత ఫాస్టుగా డ్రైవ్ చెయ్యాలీ? ఓ నిండు ప్రాణాన్ని ఎందుకు హరించాలి? దూడ యజమానులకి దిట్టంగా డచ్చిచ్చాను, కానీ ఆ దూడ తల్లికి?” – సైలెంటయ్యాడు అతను.

అతను చెబుతున్నదంతా నా కళ్ళ ముందు జరిగినట్టుగా అనిపించింది. ఓహ్.. ఎంత దైన్యం ఆ తల్లిది!

“కారు ఎక్కడం మానేశాను. పనికిమాలిన స్నేహితుల్ని వదిలించుకున్నాకే నాకు అర్థమయింది – నిజంగా వాళ్ళు పనికిమాలినవాళ్ళనీ, కేవలం జల్సాల కోసం నా స్నేహం చేశారనీ. మళ్ళీ ఆ ఊరు వెళ్ళి అదే గోవుని యజమాని నుంచి కొని, కాలి నడకతో నేను మా ఇంటికి తెచ్చాను. చిత్రం ఏంటంటే, మా ఇంటికొచ్చిన నాల్గవ నెలలో అదో బుల్లి తువ్వాయిని కన్నది. దేముడెంత దయామయుడూ! చనిపోయిన బిడ్డని మరిపించడానికి ఓ కొత్త బుజ్జాయిని దానికి కానుకగా ఇచ్చాడు.”

ఇప్పుడతని గొంతులో ఇందాకటి వ్యాకులత లేదు.

“అది దాని బాధని మళ్ళించుకోగలిగింది. నేను ఎప్పుడు ఆవుల్నీ చూసినా, దూడల్ని చూసినా నన్ను నేను క్షమించుకోలేకపోయేవాడిని. అప్పుడు నాకో ఋషితుల్యుడు కనపడ్డారు. జనన మరణాల జీవిత చక్రం గురించి, అవస్థాత్రయం, గుణత్రయాల గురించి చిన్నచిన్న మాటలతో నన్ను శాంతపరిచారు. ఓ రెండేళ్ళు ఇలా ‘పని’ అనే మాటనో, ‘సుఖం’ అనే మాటనో మనసులోకి రానివ్వకుండా, ప్రకృతిలో అణువుగా మమేకమై బ్రతకమన్నారు” ఆగాడతను.

తేలిపారజూశాను. చాలా స్ఫురద్రూపి. విశాలమై నుదురు. చక్కని కళ్ళు.

“ఇప్పుడు ఎలా ఉంది మీకు? ప్రపంచం తెలుస్తోందా?” అనడిగాను కుతూహలంగా.

“క్షణ క్షణం వదలి వెళ్ళిపోయే కాలంలోని భాగమేగా యీ ప్రకృతీ యీ జీవరాశులు. అందువల్ల తెలిసింది కూడా క్షణికమైనదే. అందుకే, జ్ఞానిగా కంటే ‘సాక్షి’ గా యీ లోకాన్ని చూస్తుంటే అనిర్వచనీయమైన ఆనందం కలుగుతుంది” అన్నాడు అర్ధ నిమీలిత నేత్రాలతో.

“అదెలా?” అడిగాను.

“మీరెవరో నాకు తెలీదు. నేనెవరో మీకు తెలీదు. మిమ్మల్ని కళ్ళతో చూడగానే, మీ మనసులో ఏవో అస్పష్టమైన ఆలోచనలు తిరుగుతున్నాయనిపించింది. మీతో మాట్లాడితే మీకు కొంచెం డైవర్షన్ దొరుకుతుందని భావించి మాట్లాడాను. దీని కోసం ఎవరి పేరూ ఎవరికీ తెలియాల్సిన అవసరం లేదు గదా! ఈ సృష్టిలో మీరో జీవి, నేనో జీవీ. అలాగే అన్నీ కూడా!” అన్నాడు.

“ఆనందం ఎలా కలిగింది?” అన్నాను.

“ఇందాక మీ మొహం ఏదో తెలియని మబ్బులో కూరుకుపోయినట్లు అనిపించింది. ఇప్పుడు తేటగా, తేలికగా కనిపిస్తోంది. మీకు కాస్త శాంతి లభించడమే నాకు కలిగిన ఆనందం” అన్నాడతను. ఆ మాటల్లో నూటికి నూరుపాళ్ళు స్వచ్ఛత, నిజాయితీ నాకు కనిపించాయి.

“మా ఇంటికి ఒక్కసారి వస్తారా?” అడిగాను ఆత్రంగా.

“మనం కలవాలని ఇక్కడ కలుసుకోలేదుగా, వర్షం కలిపింది. ఇక ఇంటికి వెళ్ళడం సంగతా? ఇది మీరు నన్ను ఆహ్వానించడంలోకే వస్తుంది. కానీ ఎందుకు నన్ను మీ ఇంటికి ఆహ్వానిస్తున్నారో చెప్పగలరా? చెప్పలేరు. సమాధానం మీకే తెలీదు గనక” నవ్వి మండపం దిగి నడక మొదలెట్టాడతను. వర్షం బాగా తగ్గింది.

“సరే సరే, కనీసం మీ అసలు పేరైనా చెబుతారా?” అడిగా. అతను వెడుకున్న వాడు చటుక్కున వెనక్కు తిరిగి, “దానికేం భాగ్యం.. నా పేరు అజ్ఞాని” అన్నాడు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here