మహతి-51

7
13

(సంచిక పాఠకుల కోసం ప్రసిద్ధ సినీ కవి, రచయిత శ్రీ భువనచంద్ర అందిస్తున్న ధారావాహిక.)

[స్వరూపరాణి విషయంలో మహిళామండలిలో తీవ్రమైన చర్చ జరుగుతుంది. అనారోగ్య కారణాల వల్ల కొంతకాలంగా మహిళామండలికి దూరంగా ఉన్న సరోజిని మళ్ళీ వస్తారు. స్వరూపరాణి తల్లికి సహేతుక కారణం లేకుండా మద్దతు తెలపడంపై ఆమె ప్రెసిడెంటును ప్రశ్నిస్తారు. ప్రెసిడెంటు ఎంతలా సమర్థించుకోవాలని చూసినా, తన వాదనతో తిప్పికొడ్తారు సరోజిని. వాళ్ళిద్దరి మధ్య వాదన పెద్దదై, చివరికి పెనుగులాట వరకూ దారితీసిందని త్రిపుర మహీకి చెప్తారు. ప్రెసిడెంటు స్వరూపరాణి తల్లికి సపోర్ట్ చేయడం వెనుక ఉన్న ఉద్దేశాన్ని త్రిపుర వెల్లడిస్తే, మహీ ఆశ్చర్యపోతుంది. ఇంత నీచ రాజకీయమా అని ఆశ్చర్యపోతుంది. మాటల మధ్యలో అభిమన్యు ప్రస్తావన వస్తే, దేనికి అన్వేషిస్తున్నాడో అతనికే స్పష్టంగా తెలియదని అంటారు త్రిపుర. కాసేపయ్యాకా, టీ పెడుతుంటే, డా. శ్యామల చాలా అనీజీగా ఉన్నట్లు కనిపిస్తే, వదినా ఏమైందని అడుగుతుంది మహీ. చాలా అనీజీగా, వాంతి వచ్చేలా ఉందని శ్యామల అనడంతో, పిరియడ్స్ వచ్చి ఎంత కాలమైందని అడిగి, శుభవార్తే అయి ఉంటుందంటారు త్రిపుర. డా. శ్రీధర్‍కీ, మిగతా వారికీ తీపి కబురు అందుతుంది. అమ్మనాన్నలు గుర్తొచ్చి, పోనీ ఓసారి వెళ్లొద్దామా అనుకుని, మళ్ళీ వద్దనుకుంటుంది మహీ. ఓ రోజు సరోజిని, వనజతో సహా మరికొందరు స్త్రీలు మహీని కలవదానికి వస్తారు. తామంతా కలిసి రాబోయే మహిళామండలి ఎన్నికలలో ప్రెసిడెంటుగా త్రిపుర గారిని ప్రతిపాదిస్తున్నామనీ, అయితే ఆవిడ అంగీకరించలేదనీ, ఆమెను ఒప్పించే బాధ్యత మహీ తీసుకోవాలని కోరతారు. కాసేపుండి వెళ్ళిపోతారు. మహీ, శ్యామల, తాతయ్య కలిసి త్రిపురని ప్రెసిడెంట్ పదవికి పోటీ చేసేలా ఒప్పిస్తారు. కానీ త్రిపురకి మద్దతిస్తామన్నవాళ్ళు అటువైపు దూకటంతో ఓట్లు చీలిపోయి, ఆమె ఓడిపోతారు. హమ్మయ్య హాయిగా ఉందంటారు త్రిపుర. – ఇక చదవండి.]

మహతి-3 మహి-18

[dropcap]“మ[/dropcap]హీ.. బానిసత్వంలో మగ్గిపోతున్న వాళ్ళు స్వాతంత్ర్యాన్ని మనసారా కోరుకుంటారు. ప్రాణత్యాగం చెయ్యడానికి కూడా సిద్ధపడతారు. స్వాతంత్ర్యం కోసం కలలు కంటారు. పోరాటాలు సాగిస్తారు. చివరికి ఆ స్వాతంత్ర్యం వస్తుంది. చిత్రం ఏమిటో తెలుసా? ఆ స్వాతంత్ర్యాన్ని ఎలా ఉపయోగించుకోవాలో వాళ్ళకి తెలీదు. అప్పుడు స్వాతంత్ర్యం అనేది ‘పిచ్చివాడి చేతిలో రాయి’గా మారుతుంది. వాడు ఆ రాయితో ఇతరుల్నయినా కొడతాడు. లేకపోతే తన నెత్తి మీద తానైనా కొట్టుకుంటాడు. ఇవ్వాళ ప్రజాస్వామ్యం అనేది పిచ్చివాడి చేతిలో రాయి మారింది. స్వాతంత్ర్యాన్ని, అదే ఓటు హక్కుని ఎలా వినియోగించుకోవాలో ప్రజలకి తెలీదు. ప్రజలకి తెలిసిందల్లా వ్యక్తి పూజ, కుల, మత నేపథ్యం ప్రభుత్వంలో ఎవరుంటే వారికి సలామ్ కొట్టడం. ‘జో హుకుమ్’ అని కాళ్ళ వద్ద పడి వుండటం. స్వాతంత్ర్యం అంటే ఏమిటో, దాన్ని ఎలా సమర్థవంతంగా వినియోగించాలో చెప్పిన వాడెవడూ? సరే, తెలిసిన వాళ్ళు సామాన్యులకు బోధించారా? లేదు. కళ్ళెదుట హత్య జరిగినా, లక్ష మంది చూసినా, ఎవడూ సాక్ష్యం చెప్పడు. కారణం భయం. దోషికి సంవత్సరాలు గడుస్తున్నా శిక్షపడదు. కారణం మనకి వాయిదా ‘వరం’ వుండనే ఉందిగా. బెయిల్ వస్తుంది. ఆ బెయిల్ మీద ఉంటూ ఏమైనా సాగించవచ్చు.. ఎన్నేళ్ళయినా తప్పించుకోవచ్చు. మహీ.. చట్టాల్లో లొసుగులు. ఎందుకు మార్చం? మారిస్తే నాయకులకి మనుగడ వుండదని బాగా తెలుసు గనుక!” సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారు త్రిపుర గారు. ఆవిడ అన్న మాటల్లో ప్రతి ఒక్కటీ నిజమే.

“మనం అనుసరిస్తున్న పద్ధతిలోనే అనేక లోపాలున్నాయి. వాటిని సవరించుకోవాలన్న తపన మాత్రం పై వాళ్ళకి లేదు. అందుకే రాజకీయమంటే నిందలు, పరస్పర దూషణలు, నోట్ల వరదలు, హత్యలు, కోట్లాటలు వంటి వాటికి నిలయంగా మారింది. సామాన్యుడు ప్రశాంతంగా బ్రతికే అవకాశం రోజు రోజుకీ సన్నగిల్లిపోతోంది” అన్నారు మళ్ళీ త్రిపురగారే.

నేనేమీ మాట్లాడలేదు. ఎందుకంటే నాకు తిరుగుతున్నవీ అవే ఆలోచనలు. ఒక వ్యక్తిని ఎన్నుకోవాలంటే ఏవేం చూడాలీ? ఇది ప్రశ్న.

1.అతని ప్రవర్తన 2. అతని సమర్థత 3. అతని గుణగణాలు 4. అతని దృష్టి దేని మీద వుంది అనే అంశం. దృష్టి ధనం మీదా? పదవి మీదా? సేవ మీదా? తన కుటుంబం, స్వీయ స్వార్థం మీదా etc. 5. అతని చదువు సంధ్యలు, అవగాహనా పరిధి 6. అతను ఎంత వరకూ ప్రజలకు ఉపయోగపడగలడు 7. ప్రస్తుతం అతని ఆర్థిక పరిస్థితి, సమాజంలో అతనికున్న గౌరవాభిమానాలు.

ఇవి కాక ఇంకెన్నో ఉండొచ్చు. కానీ ఇప్పుడు మనం నాయకుల ఎన్నికలకు ఏ ప్రమాణాలు పాటిస్తున్నాం? ఇవన్నీ ప్రజలు అసలు ఆలోచిస్తున్నారా?

త్రిపురగారు అపజయం వల్ల క్రుంగిపోయి మాట్లాడటం లేదు. సమాజం తీరుకి వేదనపడి మాట్లాడుతున్నారు. సమాజం బాగుండాలనే ఆక్రోశంతో మాట్లాడుతున్నారు.

 “అమ్మా.. ఓ రామరావణ యుద్ధానికి ముందూ, మహాభారత యుద్ధానికి ముందు కూడా అనేక చర్చలు మాత్రమే కాదు, సంధి ప్రయత్నాలు, నచ్చచెప్పే ప్రయత్నాలు కూడా ఎన్నో జరిగాయి. కానీ, ఏవీ సత్ఫలితాలు ఇవ్వలేదు. ఎందుకంటే, ఏ యుద్ధంలోనైనా మనిషి నైజం అంతే! మార్పు చెందినట్లు కనిపిస్తుంది.. కాని మారదు. ఒకప్పుడు రాజులకు, ఆంగ్లోయులకూ విధేయులుగా, వున్న భారతీయులు ఇప్పుడు మంత్రులకూ అధికారులకూ విధేయులుగా ఉంటున్నారు. పదవుల పేరు మార్పేగానీ, పాలకుల, పాలితుల నైజంలో మార్పు లేదుగా! కానీ, ఒక రోజు వస్తుంది మార్పు, ఆ మార్పు తుఫానులా వస్తుంది. సునామీలా వస్తుంది. మార్పుని అంగీకరించని వాళ్ళని కబళిస్తూ వస్తుంది. ఇదే చరిత్ర.. యుగయుగాలుగా చరిత్ర చర్వితచర్వణ మౌతోంది కూడా” తాతయ్య మాటలలో కొంత నిర్వేదం. త్రిపురా, నేను, శ్యామలా కూడా తాతయ్యని శ్రద్ధగా వింటున్నాం.

ఓ మౌనం మబ్బులా కమ్మేసింది. రాతి యుగం నించి రాకెట్ యుగందాకా మానవుడి సహజ ప్రవృత్తి ఏమీ మారలేదు. Man is a social animal అని అన్నది అందుకేనేమో.

“కొండగుహల్లో నించి నివాసం కోట్ల విలువ చేసే భవంతులకి మారినా పశు ప్రవృత్తి, ఇతరులపై పెత్తనం చెలాయించాలనే తుచ్ఛ కాంక్ష, కొనసాగుతూనే ఉన్నాయి.

Give and take పద్దతి పోయింది. మిగిలింది only take.. అంటే దోచుకో. డబ్బునీ, మానాన్ని మర్యాదనే కాదు, స్వేచ్ఛనీ, భవప్రకటనా హక్కుని కూడా దోచుకున్నవాడే ‘నేత’ అవుతున్నాడు” నిర్వేదంగా అన్నాడు తాతయ్య.

“దేశం కోసం ధన, మాన, ప్రాణాన్ని ధారపోసిన వాళ్ళని ఒకనాడు చూస్తే,, దేశానికి చిల్లిగవ్వ విలువ కూడా ఇవ్వని మహానుభావుల్ని ఈనాడు చూస్తున్నాను. దేశం కోసం యువకులు ఊరికంబాల్ని సగర్వంగా ఎక్కారు ఆనాడు. మానవతని నడిరోడ్డున ఊరి వేస్తున్నారు ఈనాడు. సారవంతమైన భూమిలో పడ్డ విత్తనం అద్భుతమైన ఫలాల్నిస్తుంది. అదే రాళ్ళ మీదో ఇసుకలోనో పడితే?” మెల్లగా లేస్తూ అన్నాడు తాతయ్య.

“త్రిపురమ్మా.. ఓటమిలోంచే గెలుపు పుట్టుకొస్తుంది. చీకటిని చీల్చుకునే వెలుగొస్తుంది. అందెందుకూ ఒక చిన్న ఆవగింజైనా భూమిని చీల్చుకుని బయటకొస్తేనే గదా మొక్కగా మారేదీ! ఈ ఓటమి నీ గెలుపుకి రేపు మొదటి మెట్టవ్వాలి. బలం పుంజుకో” గది దాటి వెళ్తూ వెళ్తూ త్రిపురని ఉద్దేశించి అన్నాడు తాతయ్య.

ఆ నాలుగు మాటలూ నాకూ ఎంతో స్ఫూర్తినిచ్చాయి. ఆ పలుకులు పుట్టిందీ ఓ వ్యగ్రత నించే గదా!

“ఎంతయినా పెద్దవాళ్ళు మనతో వుండటం భగవంతుడు ఇచ్చిన వరం. అమ్మా, ఇవ్వాళ నాకు తెలుస్తోంది. పెద్దవాళ్ళ విలువ. ఇట్లాంటి చిన్న వాళ్ళ ప్రేమ.” అని నా బుగ్గని తాకి, త్రిపురగారి ఒళ్ళో పడుకుంది శ్యామల. శ్యామల కళ్ళల్లో నీళ్ళు. అవి ప్రతిఫలిస్తున్నది త్రిపురపై, నాపై ప్రేమని.

***

“నేను మన వూరు వచ్చి చాలా రోజులయింది. బహుశా నెలలు కూడా. ఎంత ప్రయత్నించినా నేను ‘నా’ లాగా ఉండలేకపోతున్నాను. స్పష్టమైన కారణాలు కూడా ఏదీ లేదు. స్త్రీ మనసు నిజంగా ప్రకృతి లాంటిదే. ఒక్కోసారి పుష్పించి ఫలాలిస్తుంది. ఒక్కోసారి శిశిరంలో చెట్లు ఆకులు రాల్చేసుకున్నట్టు ఆకుల్ని రాల్చేసుకుంటుంది. ఒక్కోసారి ఎండాకాలంలో నదిలా ఎడిపోతుంది. మరోసారి వర్షాకాలపు గలగలా ఆనంతంగా ఆనందంగా పొరలి పొరలి ప్రవహిస్తుంది.

మహీ.. ఇప్పటినా స్థితి నాకే తెలీదు. చెప్పానుగా నా సమస్య, ఓ స్పష్టత లేదని! నా ప్రవర్తన వల్ల మీ నాన్నో, మీ నాన్న మౌనం వల్ల నేనో ఎడంగానే ఉంటున్నాము.

ఇద్దరం కూర్చుని చర్చించుకోవచ్చు. అది చాలా మంచిది కూడా! కానీ ఒక్కసారి అదే అహంకారాలకి దారితీస్తే? అది చాలా విషమంగా మారుతుంది. అంటే, పెనం మీద నుంచి పొయ్యిలో పడటం అంటారు చూడూ, అలాగన్న మాట.

ఏదేమైనా కొంత కాలం యీ హిమజ్వాల ఆరదని మాత్రం మనసుకి తెలుస్తోంది.

ఇప్పటికే నా ఈ మార్పుని నువ్వూ తాతయ్యా అంటే మా నాన్న పసిగట్టే వుంటారని నాకు తెలుసు. కానీ, ఏదో చెప్పడానికీ, ఏదో చెయ్యడానికీ ఇది సమయం కాదు.

నువ్వేం కావాలనుకుంటున్నావో త్వరగా నిర్ణయంచుకోమని మాత్రం మరోసారి నీతో చెప్పాలనే ఈ ఉత్తరం రాస్తున్నాను. కంగారు పడాల్సిన, పరిగెత్తుకు రావాల్సిన పరిస్థితి మాత్రం ప్రస్తుతానికి లేదని స్పష్టంగా చెప్పగలను. అందుకే త్వరగా నిర్ణయించుకో. మా నాన్నని నువ్వు చాలా బాగా చూసుకుంటున్నావు. నువ్వు చదువు కొంత కాలం ఆపడం కూడా భగవత్ నిర్ణయమే కావచ్చు. జాగ్రత్త ధైర్యంగా ఉండు. ఇట్లు మీ అమ్మ – అహల్య.”

మా అమ్మ వ్రాసిన ఉత్తరం ఇది.

మా అమ్మ నాకు మొదటి సారిగా మీ అమ్మ అహల్య అని వ్రాసిన ఉత్తరం. అదీ బై పోస్టులో.. అదీ నా పేరున. కేరాఫ్ ఎడ్రస్ మా తాతది.

పర్సనల్ లెటర్ అనుకున్నాడేమో తాతయ్య, ‘ఎవరిదీ?’ అని అడగలేదు. ఉత్తరంలోని విషయాలు చెప్పాలో లేదో కూడా నాకు తెలీక మౌనంగా ఉన్నాను సాయంత్రం వరకూ.

సాయంత్రం మాత్రం చెప్పడమే మంచిదని చవివి వినిపించాను. “భగవంతుడి నిర్ణయం అనుకుంటాను అని వ్రాసిందంటే మనం దూరంగా ఉంటమే దానికీ సౌకర్యంగా ఉందని అనిపిస్తోంది. ఈడొచ్చిన పిల్లవి నువ్వు. కాటికి కాచుకున్న వాడిని నేను. వాళ్ళ మధ్య ఏముందో మనకి తెలియకపోవడమే మంచిదని వాళ్ళు అనుకోవడంలో తప్పులేదు. వేచిచూడటం ఒకటే మనం చెయ్యగలిగింది” అన్నాడు తాతయ్య నిట్టూర్చి.

“బహుశా అమ్మమ్మ ఉంటే బావుండేదేమో తాతయ్యా” సన్నగా అన్నాను.

“అదీ నిజమమే కావొచ్చు. కానీ, మీ అమ్మ ఎప్పుడో తన మనసు విప్పి ఎవరితోనూ చెప్పుకోదు. కనీసం సంప్రదింపులు కూడా జరపదు. అదలా ఉంచితే అహల్య ఓ విధంగా గొప్ప మేధావి. ఏదీ చెప్పదు.. కానీ చేసి చూపిస్తుంది. ఎంత అసాధ్యాన్నానా తలుచుకుంటే సాధ్యం చేసి మరీ చూపిస్తుంది. ఏదో జరుగుతోంది. బహుశా త్వరలోనే విషయాన్ని మనకి చెబుతుందని నా మనసు చెబుతోంది. తను వ్రాసిన ఉత్తరంలో కూడా సమాచారం ఉన్నదే కానీ, ‘తడి’ అనేది లేదు.” నా మనసులో నేను అనుకుంటున్న మాటనే తాతయ్య చెప్పాడు. ఉత్తరంలో నిజంగా ‘తడి’ లేదు.

***

“మహీ.. నువ్వు చాలా సమాజ హితమైన పనులు చేస్తున్నావని నాన్నగారు తన ఉత్తరంలో వివరించారు. నాకు చెప్పలేని ఆనందం కలిగింది. మిలటరీ జీవితాన్ని నేను ఏరి కోరి ఎంచుకున్నాను. ఇక్కడ మనగలగాలంటే అంతులేని ఓపిక ఉండాలి. నిరంతరం సాధన ఉండాలి. ఎందుకంటే యుద్ధం ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలీదు. కనుక నిరంతంరం శ్రమిస్తోనే ఉండాలి. చెమటోడుస్తోనే ఉండాలి.

నాకేమనిపిస్తోందో తెలుసా? ఫిజికల్‍గా ఫిట్ అయిన ప్రతి యువకుడూ యువతీ కనీసం అయుదు సంవత్సరాలైనా డిఫెన్స్ సర్వీసెస్‌లో పని చేయాలనీ, అటువంటి చట్టం భారత ప్రభుత్వం తేవాలనీ. ఎందకంటే, దేశానికి ‘యువత’ ఎంత ముఖ్యమో, బాధ్యత లేని యువత అంత సమస్యాత్మకం. ఓ క్రమశిక్షణ, ఓ బాధ్యత ఉండకపోతే యువత చెడు వైపు మళ్ళడానికి నూటికి నూరు పాళ్ళు అవకాశం వుంది.

మహీ, ఏమైనా నువుంటే నాకు గర్వమే కాదు.. గౌరవం కూడా. నేను సరిహద్దులో దేశం కోసం నిలబడితే, నువ్వు పల్లె తల్లి కోసం నిలబడ్డావు. నాన్న చక్కగా నువ్వు చేస్తున్న పనులను వివరించకపోతే, నాకు తెలిసేదే కాదు. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ మహీ. తాతయ్యకు నా వందనాలు. అయినా చూసుకోవడానికి నువ్వున్నావుగా. ప్రేమతో సురేన్.”

***

ఇది మా అన్నయ్య వ్రాసిన ఉత్తరం. అమ్మ ఉత్తరం అందిన మరుసటి రోజున ఈ ఉత్తరం నాకు చేరింది. ఎంత పొంగిపోయానో. ఎన్ని సార్లు ఆ ఉత్తరంలోని మాటల్ని మళ్ళీ మళ్ళీ తాతయ్యకి వినిపించానో!

“ఎంత అదృష్టం మహీ! గొప్ప తల్లిదండ్రులు, గొప్ప తాతయ్య, గొప్ప అన్నయ్య, మంచి తమ్ముడు చెల్లెలూ.. దీన్నే అంటారనుకుంటా – పెట్టిపుట్టాలి – అని. నాకెలా ఉందో తెలుసా? జీవితంలో మొదటిసారి ‘కుటుంబం’ ఎలా ఉంటుందో తెలుస్తోంది. నా చుట్టూ నన్ను ప్రేమించే వాళ్ళే ఉన్నారనే ఆనందం కలుగుతోంది. లవ్ యూ మహీ” అంటూ ప్రేమగా కౌగిలించుకున్నది శ్యామల. ఆమెకి కూడా మా వూళ్ళోనే పోస్టింగ్ ఇచ్చారు. క్రమం తప్పకుండా శ్రీధర్‌తో పాటు శ్యామల వదిన కూడా హస్పటల్‌కి వెళ్ళి వస్తూనే వుంది.

‘తోడు’ అనేది జీవితాలకి ఎంత ఆనందాన్ని, సాంత్వనని ఇస్తుందో శ్రీధర్, శ్యామలల వివాహం తెలియజేప్పింది. ఆ ఇద్దరూ ఒంటరివాళ్ళే. జంటగా మారాక ఇద్దరి ముఖాల్లోనూ ఓ వెలుగు. జీవితాల్లో ఓ నిండుతనమూ వచ్చాయి. డా. శ్రీధర్ మరింత ఉత్సాహంతో పని చేస్తున్నారు. తండ్రి కాబోతున్న ఆనందం శ్రీధర్ గారికి మరింత శాంతినీ, ఉత్సాహాన్ని ఇచ్చిందనుకుంటాను. ఆందరితో మరింత ప్రేమగా మరింత శ్రద్ధగా మసులుకోవడం నేను కళ్ళారా చూస్తున్నాను.

హాస్పటల్ నుంచి ఎంత ఆలస్యంగా వచ్చినా శ్యామల వదిన శ్రీధర్ గారికి ఏదో ఒకటి తాజాగా వండి పెట్టడం గమనించాను. ఆ వండటంలో ఉండే శ్రద్ద నన్ను ఎంతో ఆకట్టకునేది.

సడన్‌గా అభిమన్యు గుర్తొచ్చేవాడు. అతనికి ఎవరు పెడతారు? అతని కసలు తిండి యావ లేనే లేదు. కానీ, చక్కగా వండి పెడితే హాయిగా ఆనందంగా వంటల్ని మెచ్చుకుంటూ తినేవాడు.

“మీకు వంట నేర్పిన మీ అమ్మగారికి వెయ్యి దండాలు” అని పదార్థాలని మెచ్చుకుంటూ తినేవాడు. అంతేకాదు, ఎవరు ఏ చిన్న సహాయం చేసినా నోరారా మెచ్చుకునేవాడు. ఎంత మంచి లక్షణం అదీ!

నాకు మాత్రమే కాదు, అభిమన్యు రోజుకోసారైనా అందరికీ గుర్తొస్తున్నాడు.

“అబ్బ.. ఆ పిల్లవాడుంటేనా, ఏ సమస్యనైనా చిటికెలో పరిష్కరించేవాడు. మహీ, అట్లాంటి మనుషులు చాలా అరుదుగా పుడతారు!” అని రోజుకోసారైనా అంటాడు తాతయ్య.

అంతే కాదు, ఊళ్ళో కూడా ఎక్కడో అక్కడ అభిమన్యు గురించిన మాటలు జరిగేవి. అతని నిర్మలత్వము, సేవానిరతీ, అందరినీ కలుపుకుపోవడమూ ఊరు ఊరంతా గుర్తించిందని నాకు సంపూర్ణంగా అర్థమయింది.

ఎందుకు నేను అభిమన్యు గురించి ఆలోచిస్తున్నాను? సడన్‍గా నా మనసు నన్ను ప్రశ్నించింది. అవును. ఎందుకూ? ఆలోచించాలంటే ఓ బెరుకు, ఓ కంగారు.

లోకం మనని భయపెడుతుందని జనాలు అంటారు. లోకం అంటే లోకులే కదా!

నిజానికి మనం నిజంగా భయపడేది మన మనసుకే. లోకంలో ఎన్ని విషయాలనైనా తర్కిస్తాం, విశ్లేషిస్తాం. విమర్శిస్తాం. కానీ మన మనసుని మాత్రం మనం విశ్లేషించుకోలేం. మన మనసులోని ఆలోచనల్ని మనం గమనిస్తున్నా స్పష్టపరచలేం.

సడన్‌గా అల గుర్తొచ్చింది. అదేగా మొన్న వ్రాసింది ‘దిల్ అప్‍నా ఔర్ ప్రీత్ పరాయీ’ అనే పాట అర్థాన్ని.

అంటే, నా హృదయం..?

నా మనసుని నేనే విదిల్చి బయటకొచ్చాను. ఎందుకంటే అభిమన్యు నా జీవితంలోకి రానే రాడు. అతని గమ్యం వేరు.. నా గమ్యం వేరు.

ట్రైన్లో ప్రయాణించిన వ్యక్తులు కూడా, స్నేహితులు అవగలరే గాని, ప్రేమికులు కాలేరు. ట్రైన్ దిగాక ఎవరిదారి వారిది గనుక.

మళ్ళీ అర్థం పర్థం లేని నా ఆలోచనలకి నాకే నవ్వొచ్చింది. ట్రైన్లో ప్రయణించిన వారు స్నేహితులే కారు ప్రేమికులు కూడా కాగలరు. లక్షాతొంభై సినిమాల్లో ఆ ప్రేమలు చిత్రీకరించబడ్డాయి కూడా.

అయినా మేం గుళ్ళో కలిశాం. తుఫాను తగ్గాక కలిసి మెలిసి పని చేశాం. అంతే. అదో స్నేహ పరిమళం. దానికి చిలవలు పలవలుగా ఊహించడం నా మనసు చేస్తున్న మొదటి తప్పు – అని గట్టిగా నిర్ణయించుకున్నాక నిద్రపట్టింది ఆ రాత్రి.

కలల్లో మాత్రం వరదల్లో కొట్టుకుపోతున్న నేను, నన్ను రక్షించి బయటకు తీసుకొచ్చిన సురేన్.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here