మహతి-52

14
14

(సంచిక పాఠకుల కోసం ప్రసిద్ధ సినీ కవి, రచయిత శ్రీ భువనచంద్ర అందిస్తున్న ధారావాహిక.)

[మహిళామండలి ఎన్నికల్లో ఓడిపోయాక, త్రిపురకీ మహీకి ప్రజాస్వామ్యం మీద చర్చ జరుగుతుంది. చట్టాలలోని లొసుగులను ప్రస్తావిస్తారు త్రిపుర. ఒక వ్యక్తిని ఎన్నుకోవాలంటే అతనిలో/ఆమెకో ఏమేం గుణాలు చూడాలో ఆలోచిస్తుంది మహతి. ఏదో ఒక రోజు మార్పు తప్పకుండా వస్తుంది, ఓ తుఫానులా వస్తుంది, మార్పుని అంగీకరించని వారిని కబళిస్తూ వస్తుందంటాడు తాతయ్య. ఓడిపోయినందుకు బాధపడద్దూ, ఈ ఓటమి రేపటి గెలుపుకి తొలిమెట్టవ్వాలి అని త్రిపురకి చెప్తాడు తాతయ్య. అహల్య మహీకి ఉత్తరం రాస్తుంది. భర్తతో వచ్చిన పొరపొచ్చాల వల్ల ఇద్దరూ ఎంత నలిగిపోతున్నదీ రాస్తుంది. అలా అని తొందరపడి అక్కడికి రానక్కరలేదని అంటుంది. నువ్వేం కావాలనుకుంటున్నావో త్వరగా నిర్ణయంచుకోమని మాత్రం మరోసారి నీతో చెప్పాలనే ఈ ఉత్తరం రాసానని అంటుంది. ఆ ఉత్తరం గురించి తాతయ్యకి చెప్పాలా వద్దా అని సంశయించి, చివరికి చదివి వినిపిస్తుంది. తాము జోక్యం చేసుకోవడం వాళ్ళకి ఇష్టం లేదనీ, వేచి చూద్దామని అంటాడు తాతయ్య. మహీ చేస్తున్న గ్రామ సేవా కార్యాక్రమాలను మెచ్చుకుంటూ, సైన్యంలో ఎప్పుడూ ఉండాల్సిన సన్నద్ధత గురించి ప్రస్తావిస్తూ సురేన్ మహతికి ఉత్తరం రాస్తాడు. అమ్మ రాసిన ఉత్తరం నిరాశ కలిగిస్తే, సురేన్ రాసిన ఉత్తరం ఉత్సాహాన్నిస్తుంది. శ్రీధర్, శ్యామల దంపతులు ఒకరికొకరు తోడుగా నిలవడంతో, వారి మొహాలలో ఓ వెలుగును చూస్తుంది మహతి. ఆసుపత్రి నుంచి ఎంత ఆలస్యంగా వచ్చినా, శ్రీధర్ గారికి ఏదో ఒకటి వేడిగా చేసిపెట్టడంలో శ్యామల పొందే తృప్తిని గుర్తిస్తుంది మహతి. హఠాత్తుగా ఆమెకి అభిమన్యు గుర్తొస్తాడు. అతనికి ఎవరు పెడతారని అనుకుంటుంది. కొద్దిసేపు మహి మనసు నిండా అభిమన్యు గురించిన ఆలోచనలే. ఎందుకు అభిమన్యు గురించి ఆలోచిస్తున్నావంటూ సడన్‍గా మహతి మనసు ఆమెను ప్రశ్నిస్తుంది. అతని గురించి ఎక్కువగా ఆలోచించడం, చిలవలు పలవలుగా ఊహించడం తన మనసు చేస్తున్న తప్పు అని గ్రహించాకా, నిద్ర పడుతుంది మహతికి. – ఇక చదవండి.]

మహతి-3 మహి-19

“ప్రియమైన మహీ, కాలం శరవేగంతో దూసుకుపోతుంటే ప్రపంచమే ఇవాళ అరచేతిలో ఇమిడిపోతుంటే, ఈ ఉత్తరాలు ఏమిటని ఆశ్చర్యపోతున్నావా?

ఎన్ని గంటలు ఫోన్‌లో మాట్లాడినా అవన్నీ గాలిలో కలిసిపోవడం నిజం కదూ! భావం మాత్రం కొంత మనసుకి అందుతుంది. మిగతాది కనబడని గాలిలో కలిసిపోతుంది.

ఉత్తరం అలా కాదుగా! భావమాధుర్యం అంతా అక్షరాల్లో ప్రవహించి కంటి ద్వారా మెదడుకి చేరి మస్తిష్కంలో నిక్షిప్తమై అమరమౌతుంది. అందుకే యీ ఉత్తరాలు.

ఇంకొటి చెప్పనా.. పిచ్చి పిచ్చి భావాలే అనుకో.. కొన్ని వాటిని ఏర్చి కూర్చి ఓ క్రమంలో రాసి ఇది నా ‘కవిత’ అని అనుకుంటే వచ్చే సంతోషం అద్భుతం మహీ!

ఓ సాయంత్రం షూటింగ్ అయ్యాక సరదాగా రాసుకున్నాను. ఫ్రెండ్‌వి కనుక వినక తప్పదు మరి..

~

‘నేను నిరంతరం శ్రమిస్తా
నాలో నేనే రమిస్తా
నా గుండెను చేరే ప్రతి శ్వాసా
నాకు ‘ప్రణవమే’
నా నాశిక నుండి వెలువడే
ప్రతి నిశ్వాసా నాకు ‘అక్షరమే’
శ్వాస నిశ్వాసల
ఊయలలూగుతూ
ఆశనిరాశల స్వప్నాలు
రచిస్తున్నాను
ఎవరేమన్నా
ఏమనుకున్నా
లోకాన్నంతా
క్షమిస్తా
నాలో నేనే
రమిస్తా..!’

~

సాహిత్యం నిజంగా నాకో వ్యసనం అయిపోయింది.

అబ్బ.. ఎన్ని గొప్ప పుస్తకాలు.. ఆ పుస్తకాలు నన్ను మరో లోకంలోకి తీసుకుపోతున్నాయి. ఢిల్లీ, అంటే ఓల్డ్ ఢిల్లీ జమ్మా మసీదు దగ్గర వందలాది సెకండ్ హేండ్ పుస్తకాలు. ఓ ఫ్రెండ్ (తమిళ టెక్నిషియన్) చెబితే ఆర్. కె. నారాయణ్ గారి పుస్తకాలు కొన్ని కొన్నాను. ఇంగ్లీషులో నేను చాలా పూర్ అని తెలుసు గదా! పుస్తకాలు చదవడం మొదలెట్టాక నిఘంటువు లేకపోయినా భావం అర్థం అవడం మొదలెట్టింది. మొదట The Guide నవల చాలా కష్టపడి చదివి, Guide హిందీ సినిమా (అదే కథ దేవానంద్, వహీదా, S.D. బర్మన్) చూశాను. డైరెక్టర్ విజయ్ ఆనంద్. మహీ.. తప్పక అలాంటి సినిమా చూడాలే. నవల చదివాక చూశాను గదా.. మరింత మరింత ఆనందించా.

ఓ పాట ఉందీ ‘ఆజ్ ఫిర్ జీనేకి తమన్నా హై/ఆజ్ ఫిర్ మర్‍నే కా ఇరాదా హై’ అంటూ. పాట ఎంత అద్భుతంగా ఉందో. మనసు కోరుకున్న స్వేచ్ఛ ఎలా ఉంటుందో ఆ పాట చూస్తే తెలుస్తుంది.

అర్థం కూడా సింపుల్. మరోసారి బ్రతకాలనే నేననుకుంటున్నా. మరోసారి మరణించాలనీ కోరుకుంటున్నా అని (చనిపోవడం ఎందుకో తెలుసా, మళ్ళీ స్వేచ్ఛగా బ్రతకడానికి. బ్రతకడం ఎందుకో తెలుసా. మరోసారి మరణించి జన్మించడానికి). ఎంత బాగుందో కదా!

ఎన్నెన్ని నీతో పంచుకోవాలని హృదయం ఉవ్విళూరుతుందో. అయినా తప్పదుగా. నువ్వుక్కడ నేనిక్కడ. ఓ సినీ కవి అన్నాడులే –

“దూరముంటానులే దగ్గరయ్యేందుకు” అని. (పాట గువ్వా గోరికతో, భువనచంద్ర, విజయబాపినీడు, రాజ్ కోటి, బాలు, S. జానకి గారు, చిరంజివి, భానుప్రియ).

బహుశా నీకు దూరంగా ఉన్నందుకే నేమో పదే పదే మనసు నిన్నూ నీ స్నేహాన్ని తలుచుకుంటోంది.

ప్రియమైన నెచ్చెలీ.. ప్రస్తుతానికి సెలవు. ఓ మాట చెప్పనా, నవ్వక్కడ క్షేమంగా ఉంటే, నేనిక్కడ ఖచ్చితంగా బాగుంటా. మిత్రదేవో భవ.. నీ. అల.”

***

ఎంత మంచి మాట రాసింది ‘మిత్రదేవో భవ’ అని. ఉత్తరం చదివి చాలా ఆనందించాను. కాసేపు ఆలోచించాను కూడా, ‘ఎందుకు నా మనసు నా వయసు వారిలా ఆలోచించడం లేదూ’ అని.

అల అక్కడ జ్ఞానాన్ని, స్నేహ, ప్రేమ సౌరభాలనీ పెంచుకుంటుంటే, నేనిక్కడ నావి కాని సమస్యల గురించి ఆలోచిస్తున్నాను. ఎప్పుడో రేచల్ వాళ్ళ నాన్న గారిచ్చిన పుస్తకాలు కొన్ని పేజీలు చదివి అమ్మమ్మకీ తాతయ్యకీ వినిపించడం తప్ప మళ్ళీ పుస్తకాల జోలికే పోలేదు.

నా చిన్నతనంలో పిచ్చిగా ఎన్ని పుస్తకాలని చదివానో! మరి ఇప్పుడో? లైబ్రేరియన్ గారికి మాట ఇచ్చిన తర్వాత కూడా నేను గ్రంథాలయానికి పోయి ఒక్క పుస్తకం తెచ్చుకోలేదు.

జీవితం సజావుగా గడవాలంటే, పుస్తకాలని చదవడం తప్పనిసరి. ఎందుకంటే, పుస్తకం ఇచ్చేది స్పష్టమైన పరోక్ష అనుభవాలనే కాదు. అద్భుతమైన జీవస్పూర్తిని కూడా.

మళ్ళీ పుస్తకాలు చదవడం మొదలెట్టాలని నిర్ణయించుకున్నాను. వెంటనే లైబ్రరీకి వెళ్ళాను కూడా.

“రేపు చెయ్యాలనుకున్న పనిని ఇవ్వాళే చెయ్యి. తర్వాత చేద్దామనుకున్న పనిని ఇప్పుడే చెయ్యి” అని ఓ నాడు మా ఇంగ్లీషు లెక్చరర్ గారు ఓ చక్కని వాక్యాన్ని చెప్పారు.

అది గుర్తుకొచ్చే లైబ్రెరికి వెళ్ళాను. అల రాసినట్టే R.K. నారాయణ్ గారి ఇంగ్లీషు నవలకి తెలుగు అనువాదాలు ఉన్నాయా అని అడిగాను.

మార్గదర్శి (ద గైడ్), ప్రయోజకుడు (ది ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్) స్వామి, స్నేహితులు (స్వామి ఎండ్ ఫ్రెండ్స్) మూడు పుస్తకాలు దొరికాయి. అర్జంటుగా తెచ్చేసుకున్నాను. “అమ్మయ్య మళ్ళీ పుస్తకాలు చదివి వినిపిస్తావన్న మాట” నవ్వాడు తాతయ్య.

నేను నవ్వాను. కానీ, అందులో బాధే ఎక్కువుంది. ఎందుకంటే మా వూరికొచ్చిన దగ్గర్నుంచీ ఇప్పటి వరకు ఏవో చందమామలు వగైరా తప్ప నవలలు చదివి వినిపించలేదు. పారమార్థిక గ్రంథాలు అసలు చదవలేదు.

ఆ రాత్రి నేనూ, తాతయ్య, శ్యామల, శ్రీధర్ గారూ, త్రిపుర గారూ కలిసి ‘గైడ్’ సినిమా చూశాం. శ్యామలకి హిందీ అద్భుతంగా వచ్చు అన్న సంగతి ఆ రోజే మాకు తెలిసింది. అదో అద్బుత చిత్రం.

“వహాఁ కౌన్ హై తేరా ముసాఫిర్ జాయేగా కహాఁ
దమ్ లే లే ఘడీ భర్, యే ఛయ్యా, పాయేగా కహాఁ.”

పాట వింటుంటే గుండెలో కలుక్కుమంది.

“కెహెతే హైఁ జ్ఞానీ, దునియా హై ఫానీ
పానీ పే లిఖీ లిఖాయీ”

(జ్ఞానులు చెబుతారు ఈ లోకమే ఓ నీటి మడుగని.. దేవుడు రాసినదీ, మనిషి రాసుకున్నవీ అన్నీ నీటి మీద రాతలే – అని).

ఎంత నిజం. ఒక్కో పాటా ఒక్కో ఆణిముత్యం. నవలని సినీకరించడం ఎంతో కష్ట సాధ్యం!

రాత్రి కలల నిండా గైడ్ పాటలూ, దేవానంద్ వహీదాల నటనలే.

ఎవరంటారూ సినిమా మంచిని బోధించలేదనీ!

“ప్రతి వ్యక్తి పుట్టుకతోనే నటుడు. ఆడైనా, మగైనా” అన్నాడు తాతయ్య మర్నాడు ఉదయం అందరూ కాఫీ తాగుతూ వుండగా.

“ఎలా?” అడిగారు డా. శ్రీధర్.

“ఒక మనిషిలోనే అనేక మనుషులు ఉన్నారు గనుక” నవ్వాడు తాతయ్య.

“అది ఎలాగ?” అడిగారు త్రిపుర.

“శ్రీధరా, మీ నాన్నగారికి నువ్వు కొడుకువి. రేపు పుట్టబోయే బిడ్డకి నవ్వు నాన్నవి. మీ తాతగారికి నువ్వు మనవడివి. మీ బిడ్డకి బిడ్డ పుడితే నువ్వే తాతయ్యవి. ఉంటే నీ బావకి నువ్వు బావమరిదివి, నీ బావమరిదికి నువ్వు బావవి. మీ మామకి నీవు అల్లుడివీ, నీ అల్లుడికి నీవు మామవి. ఇక్కడ నీలో ఓ తండ్రి, ఓ కొడుకు, ఓ తాత, ఓ మనవడు, ఓ బావ, ఓ బావమరిది, ఓ మామ, ఓ అల్లుడు వగైరా వగైరా ఇందరు శ్రీధర్‌లు ఉన్నారన్నమాట.

తండ్రి దగ్గర కొడుకుగానే ప్రవర్తిస్తావు. కొడుకు దగ్గర తండ్రిగానే ప్రవర్తిస్తావు. అలాగే ఇతర బాంధవ్యాల దగ్గర కూడా. అక్కడ నువ్వేమీ నటించవు. అత్యంత సహజంగానే నీలానే నువ్వు ప్రవర్తిస్తావు. అక్కకి తమ్ముడిగా, చెల్లెలికి అన్నగా వగైరా వగైరా అవునా?” అన్నాడు తాతయ్య.

“ఓహో.. నిజం తాతగారూ” అన్నారు శ్రీదర్.

“అందుకే ‘జీవితమే ఒక నాటకరంగం. మనమంతా పాత్రధారులం’ అన్నాడు షేక్‌స్పియర్. దాన్నే ఓ పాటగా మలిచారు మన తెలుగు కవి” అన్నారు త్రిపుర.

“సముద్రాల జూనియర్ గారు ‘సుడిగాలిలో ఎగిరే పతంగం జీవితమే ఒక నాటకరంగం – అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం’ అన్నారు ‘బ్రతుకు తెరువు’ చిత్రంలో. అబ్బ.. అద్భుతమైన పాట. నాగేశ్వరావు, సావిత్రి నటించలేదు,. జీవించారు. చూసి తీరాల్సిన సినిమా. కనీసం పాటలైనా చూసి తీరాలి” మహా ఉత్సాహంగా మళ్ళీ అన్నారు త్రిపుర.

ఆవిడకి సినిమాలంటే అంత ఇష్టమని ఇప్పుడే నాకు తెలిసింది.

“మీరు చెప్పాకే నాకు అర్థమైంది తాతయ్యా. మనిషి కనపడటానికి ఒకడే అయినా అనేక మనుషులు ఆ మనిషిలోనే దాగుంటారని. అందుకేనేమో ఇప్పుడు నాకు గుర్తొచ్చింది ‘సాగర సంగమం’లో మహానుభావుడు వేటూరి వ్రాసిన

‘నరుని బ్రతుకు నటన
ఈశ్వరుని తలపు ఘటన
ఆ రెంటి నట్టనడుమ
నీకెందుకింత తపన’ అనే మాటలకి అర్థం” అన్నారు శ్రీధర్.

“నిజమేగా.. నువ్వు చెప్పిన ప్రకారం నరుడు బ్రతుకు నటనేగా. ఎన్ని పాత్రలను ఏకకాలంలో మనం పోషిస్తున్నామూ!”

శ్రీధర్ మొహంలో ఆనందాశ్చర్యాలు.

“అవును బాబూ సినిమాని మనం తేలిగ్గా తీసి పారేస్తాం. కానీ అది తప్పు. ఆకాశమార్గాన సంచరించే సంగీత సాహిత్యాలని కిందకి దింపి అతి సామాన్యుడికి అందుబాటులోకి తెచ్చింది సినిమానేగా!

ఆ సినిమానేగా కృష్ణదేవరాయల్నీ, కృష్ణడినీ, రామదాసునీ, రాముడ్నీ, కాళిదాసునీ, భోజరాజునీ, అన్నమయ్యనీ, మొల్లమాంబనీ, రావణాసురుణ్నీ గాంధీగార్నీ కూడా సజీవంగా తెరమీదకి తెచ్చి వారి గురించిన అవగాహన మనకి కల్పించింది. రామాయణం వింటే బాగుటుంది. సంపూర్ణ రామాయణమో, సీతాకల్యాణమో, సీతారామకల్యాణమో, లవకుశో చూస్తే షడ్రసోపేత భోజనం తిన్నంత హాయిగా సుష్టుగా ఉంటుంది. ఎందుకంటే, సినిమాలో సంగీత సాహిత్యాలకి పెద్ద పీట వేస్తారు గనుక. పెద్దలు, పండితులే గాదు, సామాన్యులు, నిరక్షరాసులు కూడా ఆ పాటల్ని పాటుకోవచ్చు. పాడుతూ ఇతరుల్ని అలరించవచ్చు కూడా” అన్నాడు తాతయ్య.

‘అల ఎంత అదృష్టవంతురాలు’ అనిపించింది నాకు. అలసిన మనసులకి సంగీత సాహిత్యలే కాదు, సినిమా కూడా సాంత్వననిస్తుంది.

‘కాసు’ మనుషులు అవసరాలు తీరిస్తే ‘కళ’ మనసు అవసరాన్ని తీర్చి ఆనంద పరుస్తుంది. ‘కళాకారులు ఎంత అదృష్టవంతులు’ అనుకున్నాను.

“కళాకారులు అదృష్టవంతులు” అని పైకే అన్నాను.

“ఏం, నువ్వు కళాకారిణివి కాదా?” సూటిగా అడిగారు శ్రీధర్. శ్యామల నవ్వుతూ చూస్తోంది నేనేమని చెబుతాను అని. చుట్టూ చూశా. తాతయ్య, త్రిపుర గారూ కూడా జవాబు కోసం చూస్తున్నారు.

“కాదు. ఒకప్పుడు కొంచెంగా పాటలు పాడేదాన్ని. కాస్తో కూస్తో సంగీతం కూడా నేర్చుకున్నాను. అది ప్రవేశం వరకే గానీ, ఇతర్లను అలరించేంతగా కాదు” అన్నాను.

“అదేమిటమ్మా, నువ్వు చాలా గొప్పగా పాడి బహుమతులు కూడా గెల్చుకున్నావుగా!” ఆశ్చర్యంగా అన్నాడు తాతయ్య.

“నిజం చెబితే అది అనుకరణ కిందే వస్తుంది. నిజమైన కళ నాలోంచి రావాలి” అన్నాను సిన్సియర్‌గా.

“నువ్వు అద్భుతంగా వంట చేస్తావు. అది కళ కాదా? శ్యామల ఆపరేషన్ చేసి కుట్లు వేస్తే, ఆ కుట్లు ఎంబ్రాయడరీలా వుంటాయి. ఎంత నైపుణ్యం అంటే పేషంట్‌కి నెప్పి తెలీనంత సున్నితంగా కుట్లు వేస్తుంది. అది కళ కాదా? పొద్దున్న లేచిన దగ్గర్నుంచీ తాతయ్య ఎందరో బాధితుల్ని తన మాటలతో ఓదార్చి పంపుతారు. అది కళ కదా? త్రిపుర గారు అందర్నీ తన సొంత బిడ్డల్లా ప్రేమిస్తారు. అది భగవంతుడు ఇచ్చిన వరం కాదా? ఆ వరం కళ కన్నా ఉన్నతమైనది కాదా?” గుక్క తిప్పుకోకుండా అన్నారు డా. శ్రీధర్. నేను పకపకా నవ్వేశాను. చెప్పడానికి ఏముందీ? వంటని, ‘పాక కళ’ అంటారుగా మరి!

“ఇవ్వాళ ‘బెన్ హర్’ సినిమా చూద్దాం. టెక్నాలజీ హిమాలయామంత ఎత్తు ఎదగక ముందు చిత్రించిన మరో అద్భుత చిత్రమది. అలాగే ‘టెన్ కమాండ్‌మెంట్స్’. అవి చూసి తీరాల్సిన సినిమాలు” అన్నారు శ్రీధర్.

“వాటి గురించి విన్నాను గానీ చూడలేదు” అన్నారు త్రిపుర.

“సిడిలు ఇప్పుడు ధారాళంగా దొరుకుతున్నాయిగా, చూద్దాం చూద్దాం” ఉత్సాహంగా అన్నాను నేను.

“నలుగురూ ఓ చోట కూర్చుని సినిమా చూడటం, నలుగురూ ఓ చోట కూర్చుని చక్కగా కబుర్లు చెప్పుకుంటూ భోంచెయ్యడం, నలుగురూ సరదాగా వెన్నెల్లో మడత మంచాలు వేసుకుని వెన్నెల్ని చూస్తూ పాటలు పాడుకోవడమో, నక్షత్రాల్ని చూస్తూ మైమరచి పోవడమో, ఎంత బాగుంటుంది. అసలు మనిషి ప్రకృతినీ, ప్రకృతిలోని సౌందర్యాన్ని గమనించడం ఎప్పుడో మానేశాడు. ఎంత సేపూ డబ్బు, డబ్బు. శవం పక్కన కూర్చుని కూడా ఫోన్‌లో మాట్లాడేవి వ్యాపారం గురించే. వానని చూసి, వానలో తడిసి ఆనందించిన విషయం బాల్యంతో పాటు మరిచి పోతున్నారు నేటి యువత” వేదన నిండిన స్వరంతో అన్నారు త్రిపుర.

“త్రిపురమ్మ.. మాకు మీరు… మీతోనే మేముంటాము. మన ముగ్గురికీ తాతయ్య కుటుంబం ఉంది. మీరే బేలగా మాట్లాడితే నేనేమైపోను? అప్పటి అనాథ బ్రతుకుని తలుచుకుని ఇప్పటి యీ మధుర క్షణాల్ని పాడు చెయ్యను. అమ్మా, మనందరం మన మనసులు కోరుకున్న విధంగా హాయిగా కలిసి మెలిసి ఉందాం” త్రిపుర ఒళ్ళో తల పెట్టుకుని మంద్ర స్వరంతో అన్నది శ్యామల. నెలలు నిండుతూ ఉన్నట్లుగా పొట్ట పైకే కనిపిస్తోంది. అలసిపోతోంది కూడా.

అలాగే అన్నట్టు తలాడించి శ్యామల తల నిమురుతున్నారు త్రిపుర.

ఆ దృశ్యం అద్భుతంగానే కాక అపురూపంగా అనిపించింది. సడన్‌గా నాకు మా అమ్మ గుర్తు వచ్చింది. శ్యామలకి త్రిపురగారు సాంత్వన కలిగించగలరు. మరి మా అమ్మకి???

టీ పెట్టే నెపంతో కిచెన్ లోకి వెళ్ళాను.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here