మహతి-62

9
14

(సంచిక పాఠకుల కోసం ప్రసిద్ధ సినీ కవి, రచయిత శ్రీ భువనచంద్ర అందిస్తున్న ధారావాహిక.)

[అహల్య విజయవాడకి బయల్దేరుతుంది. మనిషి ఎప్పుడూ ఒంటరే అని అనుకుంటుంది. తనకి నిజమైన తోడు తన నీడేనని అనుకుంటుంది. బస్సులో పక్కసీటు ఆవిడ తన పేరు రుక్మిణి అని పరిచయం చేసుకుని తన గురించి, తమ కుటుంబం గురించి చెప్తుంది. తనకి ముగ్గురూ ఆడపిల్లలేననీ, ముగ్గురికీ ఇల్లరికం వచ్చే అబ్బాయిలని పెళ్ళి చేయాలని అనుకుంటున్నానని అంటుంది. ఆ ఆలోచన సరైనది కాదని అంటుంది అహల్య. ఆమె అలాగే మాట్లాడుతుంటే, తనకు ఓ గంట రెస్ట్ కావాలని చెప్పి నిద్రపోతుంది అహల్య. గంటసేపు గాఢనిద్రపోచి లేస్తుంది. ఈ గంటలో బయట జరిగిన గందరగోళం గురించి చెప్తుంది రుక్మిణి. కొద్దిసేపయ్యాకా, ఓ బస్సు ప్రయాణంలో తన అత్తగారికి గుండెనొప్పి రావటం.. సమయానికి వేరే వేన్‍లో వస్తున్న ఓ భక్తుల బృందంలోని వైద్యుడి ద్వారా సాయం అందిన వైనాన్ని చెబుతుంది రుక్మిణి. తనది ప్రేమ వివాహమేననీ, తన బావనే ప్రేమించాననీ, కానీ అత్త బావకి వేరే సంబంధం చూస్తుంటే – చచ్చిపోతానని బెదిరించి – బావని పెళ్ళి చేసుకున్నానని చెబుతుందామె. ఇప్పుడు మీ బావ మీతో ఎలా ఉంటున్నారని అహల్య అడిగితే, మగవాడు బయటి ఆకర్షణలకి లొంగకుండా చూసుకోవాల్సింది ఆడదేనని అంటూ, తాను బావని అనుక్షణం కనిపెడుతూనే ఉంటానని చెప్తుంది రుక్మిణి. ఇందిర లాంటి మనిషి తన బావ జీవితంలోకి వస్తే ఏం చేస్తుందో ఆమెను అడగాలనుకుంటుంది అహల్య. కానీ అడగలేక మౌనంగా ఉండిపోతుంది. – ఇక చదవండి.]

మహతి-4 మహతి-అల-9

అల:

[dropcap]“ఎ[/dropcap]క్కడ సంగీతానికీ నృత్యానికీ ప్రాధాన్యత లభిస్తుందో.. అక్కడ ఆనందం తాండవిస్తుంది” అన్నారు కమల్‌జీత్ సింగ్ (కెమేరా చీఫ్).

నేను వింటున్నాను. “సంగీతం చెవుల ద్వారా హృదయాన్ని స్పృశిస్తుంది. వాయువు లేనిదే సంగీతం లేదు. సృష్టి మొదలైంది కూడా వాయువుతోనే. మన ప్రాణం, శరీరం అన్నీ ఆధారపడి వున్నది యీ వాయువులతోనే” అన్నారు మళ్ళీ. కమల్‌జీత్ వృద్ధుడు కాదు. ఎమ్.ఎ. ఫిలాసఫీ గోల్డ్ మెడలిస్ట్. తండ్రి అనేక సినిమాలకి కెమేరామెన్‌గా పని చేశారు. తండ్రి పోయాక, ఆయన మాటలోనే చెప్పాలంటే, “మా నాన్న ఉపయోగించిన కెమేరాలు మౌనంగా ప్రశ్నించేవి.. ‘ఆయన వెళ్ళిపోయారు, కానీ మేము పని చేసే స్థితిలోనే ఉన్నాము కదా’ అని. అందుకే నేను కష్టపడి కెమేరామాన్‌ని అయ్యాను.”

“కెమేరాలు మాట్లాడతాయా?” వింటున్న కమేడియన్ జూలూ నాగర్ అన్నాడు చిన్న వ్యంగ్యంతో.

“మనసుంటే మీ చేతిలోని పెన్నూ మాట్లాడుతుంది జూలూ భాయ్. సృష్టిలో ప్రాణం లేనిదంటూ ఏదీ లేదు. ఆఖరికి రాళ్ళల్లో కూడా ప్రాణం ఉంది. కాకపోతే ఎండకి ఎందుకు వేడెక్కుతాయి, ఎందుకు మంచుకి చల్లబడతాయి?” నవ్వి అన్నారు కమల్‌జీత్. ఆయన వయసు 38-40 మధ్యలో ఉండొచ్చు.

“ప్లీజ్.. మీరు వాయువుల సంగతి చెబుతున్నారు. కొనసాగించండి” రిక్వెస్టు చేశాను. తెలియనది తెలుసుకోవడమేగా జ్ఞానం అంటే!

“యస్.. ముఖ్య వాయువులు అయిదయితే, ఉపవాయువలు అనేకం. మొదటిది ప్రాణవాయువు. ఆకలిదప్పులు కలిగించి ఆహారాన్ని జీర్ణింపచేసేది ఇదే. ఇది లేనిదే ప్రాణం లేదు. రెండోది అపాన వాయువు. మల మూత్రాలని బయటకి నెట్టిది. శుక్రాన్ని (వీర్యాన్ని) విడిచేట్టు చేసేదీ యూ అపాన వాయువే. మూడోది ఉదాన వాయువు. తినే ఆహారాన్ని కంఠం నించి మింగేలా చేసేది యీ వాయువే. సుషుప్తి అవస్త నించి మళ్ళీ జాగ్రదావస్తకు మనుషుల్నీ జీవుల్నీ తెచ్చేది కూడా యీ ఉదాన వాయువే. నాలుగోది సమాన వాయువు. ఉదాన వాయువుచే పంపబడిన ఆహారాన్ని అన్నీ నాడులకీ సమానంగా పంపేదీ సమాన వాయువు (ఆహారాన్ని అంటే ఆహారం అందిచే శక్తిని). ఇక అయిదవది వ్యాన వాయువు. ఇది అణువణువునా శరీరంలో వ్యాపించి స్పర్శను గ్రహింప చేస్తుంది. భోజన పదార్థాల పిప్పినీ రసాన్నీ వేరు చేస్తుంది” అన్నారు కమల్.

“ఓరి నాయినోయ్.. మనకి తెలీకుండానే మన శరీరంలో ఇన్ని అద్భుతాలు జరుగుతున్నాయా? దీన్ని బట్టి చూస్తే శరీరమే ఓ మహాయంత్రం. దీన్ని పని చేయిస్తున్నది ఓ మహా చైతన్యం” ఆశ్చర్యంగా అన్నది తరుణీ కిద్వాయ్.

“కాక? గుండె, కాలేయం, కిడ్నీలు, ఇవన్నీ మన ఆజ్ఞతో కాదుగా పని చేస్తున్నదీ, తమంతట తాము కూడా పని చేయలేవు. ఎందుకంటే చనిపోయిన వాడి అవయవాలు పని చేయలేవుగా. అంటే, వీటన్నిటినీ పని చేయించే ఓ మహా కర్త ప్రతీ జీవిలోనూ ఉండితీరాలి గదా!” అన్నాడు నిర్మల్ కక్కర్. అతను డైరెక్షన్ డిపార్టుమెంట్‌లోనే కొత్తగా చేరాడు. అంతకు ముందు ఆయన బ్రీచ్‌కేండీ హాస్పటల్‍లో మేల్ నర్స్‌గా పని చేశాడు.

“కమల్ జీ.. మీరు చెప్పండి. చాలా అద్భుతంగా ఉన్నది” అన్నాను నేను. నా దగ్గర ఉన్న మంచి అలవాటు ఏమంటే మంచి విషయం ఏదన్నా అది నోట్ బుక్‌లో నోట్ చేసుకోవడం. దానికి ముందు మనసులో రిజిస్టర్ చేసుకోవడం.

“..ఓ విషయం తెలుసా, మనం కళ్ళు మూసేలాగా, తెరిచేలాగా చేసే వాయువు పేరు కూర్మము. మన కళ్ళు చూసేట్టు చేసే వాయువు పేరు నాగము. మనకి తుమ్ముల్ని కలగ చేసి శరీరంలోంచి కొన్ని పదార్ధాలని బయటపడేసే వాయువు పేరు కృకరము. గర్భాన్నించి పిండాన్నిబయటకు తోసి ప్రసవ కారకమయ్యే వాయువు పేరు ధనంజయము. ఇదే చనిపోయాక దహనం వరకూ శరీరపు భాగాల్ని కలిపి వుంచేది. మరో చిత్రం చెప్పనా.. మనకి ఆవలింతల్ని కలుగేసే వాయువు పేరు దేవదత్తం. ఆవలింత నిద్రకే కాదు, గుండెకి ఆక్సిజన్ తగ్గినప్పుడూ ఆవలింత వస్తుంది” అన్నాడు కమల్‌జీత్.

“మైగాడ్.. మైగాడ్” ఆశ్చర్యంతో లేచి నిలబడింది తరుణీ కిద్వాయ్.

“ఇవన్నీ ఇప్పుడు కాదు కొన్ని లక్షల సంవత్సరాలు క్రితమే భారతీయ ఋషులు, గురువులు కనిపెట్టినవి. కనిపెట్టడమే కాదు వాటికి నామకరణం కూడా చేశారు. మనమెంత ఘనులమంటే, వారిచ్చిన జ్ఞానాన్ని చూడను కూడా చూడకుండా హేళన చేస్తాం. సృష్టిలో తమ సంస్కృతిని తానే హేళన పరిచే జాతి బహుశా మనదేనేమో! అతి చిన్న దేశాలూ భాషలూ కూడా తమ ఉనికిని తమ ప్రాణం కంటే ఎక్కువగా కాపాడుకుంటుంటే, మనం మాత్రం విదేశీ భాషలకీ సంస్కృతికీ బానిసలవుతున్నాం” బాధగా అన్నారు కమల్‌జీత్.

“కమల్.. ఇవన్నీ తెలిస్తే లాభం ఏమిటీ? తెలీకపోతే వచ్చే నష్టం ఏమిటీ?” జులూ నాగర్ అన్నాడు. గొంతులో చిన్న హేళన ధ్వనించింది.

“నష్టమూ లాభమూ వ్యాపారానికి. జ్ఞానానికి కాదు. నువ్వు ఎవరు? అంటే నేను జూలూని అంటావు. అంటే నీ కనిపించే శరీరం తోటి నీ ముఖం తోటి నిన్ను నువ్వు ఐడెంటిఫై చేసుకుంటావు. నువ్వు అంటే అవేనా? లక్షలాది నాడులు, ఎముకలు, అనేకానేక అవయవాలు, వాటిని నిరంతంరం పని చేయించే ఓ మహా వ్యవస్థ వీటి సంగతి ఏమిటీ? అవి నీవి కాదా. కేవలం బాహ్యంగా కనపడే నువ్వు మాత్రమే నీవా? జూలూ, నువ్వు కమేడియన్‌వి. నవ్వించడం తెలుసు, బాగా తెలుసు. ఒకరు భౌతిక శాస్త్రజ్ఞుడు. అతనికి భౌతిక శాస్త్రం గొప్పగా తెలుస్తుంది. మరి మన ఋషులూ, మహర్షులు, బ్రహ్మర్షులు భౌతికానికి మూలమైన ఆదిభౌతికతని సాధించారు. వారి దృష్టి బాహ్య దృష్టి కాదు. మనో దృష్టి. అందుకే కర్మేంద్రియాలూ, జ్ఞానేంద్రియాలూ అనే వాటిని స్పష్టంగా గుర్తించి, ఆలోచించి అనంతమైన పరిశోధనలు చేశారు. అంతెందుకు, గ్రహణాలు పట్టు విడుపుల సమయాలు మన పంచాంగంలో సంవత్సరం ముందరే మనకి తెలుస్తాయి. ఇంగ్లీషు కేలండర్లో ఉంటాయా? అంతెందుకూ, భౌగోళిక, అణు, జ్యోతిష్య, గణిత, వైద్యశాస్త్రాలు పుట్టింది ఎక్కడా?” ఆగారు కమల్‌జీత్.

అతని మీద నాకు మరింత గౌరవం కలిగింది. ఎంతో నేర్చకోవలసింది ఉందని తెలిసింది. ఇప్పటి వరకూ ఆధ్యాత్మికత వైపూ భారతీయ సంస్కృతి వైభావం వైపూ దృష్టి సారించనందుకు సిగ్గు కూడా కలిగింది.

“ఓకె, సర్. వినోద్ సార్ రెడీ” అసోసియేట్ డైరెక్టర్ ఎనౌన్స్ చేశాడు. అందరం లేచి ‘షాట్’ పొజిషన్ తీసుకున్నాం.

సినిమా ఘాటింగుల్లో జనరల్‌గా షాట్ గ్యాప్‌లో పేకాట ఆడేవాళ్ళు. అది ఆ జనరేషన్ వాళ్ళు. ఇప్పటి జనరేషన్ సెల్ ఫోనులో మునిగిపోతున్నారు. కానీ, కమల్‌జీత్ వంటి వారు ఇప్పటికీ మంచి మంచి సబ్జెక్టుల మీద చర్చిస్తూనే ఉండటం నా అదృష్టం.

‘సెల్’ అంటే నాకు కొంచెం విముఖతే. అది దగ్గరున్న క్షణం నించీ పోచుకోలు మాటలు, ఉబుసు పోని మాటలు, వ్యర్థ ప్రసంగాలు, పనికిరాని చెత్తని చూడటం. వంటబడతాయని నా ప్రగాఢ నమ్మకం. అందుకే దాని జోలికి పోలేదు. దాని బదులుగా పుస్తకాలు చదివే అలవాటు చేసుకున్నా.

చాలా మందికి ఇంకో ఉద్దేశ్యమూ ఉంది, సినిమా వాళ్ళకి సినిమా తప్ప ఏదీ రాదని. ఆ ఆలోచన ఎంత తప్పో ఇక్కడికి వచ్చాకే నాకు అర్థమైంది. అద్భుతమైన మేథావి వర్గామూ సినిమా పరిశ్రమలో ఉంది. వాళ్ళు కేవలం వర్కర్స్ కాదు నిష్ణాతులు.

***

“ఫెంటాస్టిక్ అలా.. నువ్వు నన్ను ఆశ్చర్యపరుస్తునే ఉంటావు, ప్రతిసారీ” అన్నాడు అమిత్ సక్సేనా, షాట్ కాగానే.

“నన్ను కూడా అమిత్. భాష సరిగ్గా రాకపోయినా అల భావాన్ని ముఖంలో పలికించే తీరు అద్భుతం” నా భుజం తట్టి అన్నాడు వినోద్.

నాకేం చెప్పాలో తెలియలేదు. ఒకటి మాత్రం నిజం. ఒక పాత్రని పోషించేటప్పుడు నన్ను నేను మరిచిపోతాను. ఆ పాత్ర, దాని తాలూకు ప్రభావం నా మీద చాలా సేపు ఉంటుంది. అలా ఉండటం మంచిదో కాదో కూడా నాకు తెలీదు.

నాకు ఒక విషయం ఎప్పుడు చిత్రంగానే ఉంటుంది. ‘ధీర’ తెలుగులో అతి చిన్న బడ్జెట్‌తో తీయబడ్డ సినిమా. దాన్ని అతి పెద్ద బడ్జెట్‌తో ఇప్పుడు హిందీలో తీస్తున్నారు. అక్కడక్కడా ప్రాంతీయపరమైన మార్పులు, భాషాపరమైన మార్పులూ తప్ప కథ అదే. అయినా, షూట్ చేసినంత సినిమానే కంపేర్ చేస్తే అదీ ఇదీ ఎక్కడెక్కడో ఉన్నాయి. దీనిలో ఓ రిచ్‌నెస్, ఓ విశాలత కనిపిస్తుంది. అఫ్‍కోర్స్ నా నటనలోనూ చాలా మార్పు ఉంది. కెమెరాకి కొత్త కనుక కాస్త జంకు బిడియం లాంటి వాటిలో నా తృప్తి మేరకు అందులో నటించలేకపోయానన్న విషయం ఇప్పుడు తెలుస్తోంది.

“అమ్మాయ్.. నీకు ప్రాణాయామం నేర్పుతా, నేర్చుకో” అన్నారు కమల్‌జీత్ లంచ్ బ్రేక్‍లో. మేమిద్దరమే అప్పుడు లంచ్ చేస్తున్నాం. వినోద్ రైటర్స్, డైరెక్టర్‌తో కలిసి స్టోరీని మళ్లీ డిస్కస్ చేస్తున్నాడు.

“సర్..” అన్నాను. అది నేను వూహించని విషయం గనక.

“నువ్యు పాత్రలో లీనమైపోవడం నిజంగా గ్రేట్. కొన్ని వేలమందిలో ఒకరికో ఇద్దరితో మాత్రమే అది సాధ్యం అవుతుంది. కానీ,” ఆగారు.

“చెప్పండి సార్” అన్నాను కుతూహలంగా.

“కొన్ని పాత్రలు మనసులో నిలిచిపోతాయి. అవి నీ మీదా, నీ మనసు మీదా చూపించే ప్రభావం నువ్వు ఊహించను కూడా లేవు. అందుకే షూట్ అయిపోయాకా నువ్వు బయటపడాలంటే అత్యంత సులువైన, అత్యంత సరైన మార్గం ప్రాణాయామం. అయితే సరిగ్గా చేస్తే అది ప్రాణాయామం. గురుమార్గం కాకుండా, ఇష్టం వచ్చినట్లు చేస్తే అది ప్రాణాయామం కాదు – ప్రాణానికి అపాయం అవుతుంది” అన్నారు కమల్.

“ప్రాణాయామం మీద కొంత అవగాహన ఉంది. కానీ ఖచ్చితమైన పద్ధతి తెలీదు” అన్నాను.

“సరే. సాయంత్రం షూటింగ్ అయ్యాక నేర్పుతా, నీకూ వినోద్‌కి కూడా” అన్నారు కమల్‌జీత్ సింగ్ సిద్ధూ.

“థేంక్యూ సర్” ఆనందంగా కరచాలనం చేశాను.

“చాలా సంతోషం అలా. ఇవ్వాళ చెప్పేవాళ్ళ ఉన్నారు, వినేవాళ్ళే లేరు. నేర్పేవాళ్ళు ఉన్నారు.. నేర్చుకునేవాళ్ళే లేరు” చిన్నగా నవ్వి అన్నారు కమల్‍జీత్.

“సర్.. మీ పిల్లలు ఏం చేస్తారూ?” అడిగాను కుతూహలంగా.

“ఓ యాక్సిడెంట్ వల్ల నా భార్య చాలా దెబ్బతిన్నది. ఓ సమయంలో అబార్షనే గాక గర్భాశయాన్ని కూడా తీసేయ్యాల్సి వచ్చింది. సో.. మా పిల్లలు మేమిద్దరమే” నవ్వాడాయన.

“ఆంటీని నాకు చూపించరూ?” అడిగాను. కాసేపు సైలెంటుగా నా వంక చూసి అన్నారు, “తప్పకుండా, సండే హాలిడే కదా, శాటర్‍డే సాయంత్రం షూటింగ్ అయ్యాక వెళ్దాం..” అన్నారు.

***

మహతికి ఎప్పటికప్పుడు ఫోన్ చెయ్యాలని అనిపిస్తున్నా బలవంతంగా ఆ కోరికను అణచుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు తీస్తున్నవి చాలా ముఖ్యమైన సీన్లు. నా మనసు మీద ఇది తప్ప మరే భారమూ పడకూడదని జాగ్రత్తలు తీసుకుంటూ, నాకు నేనే కొన్ని పరిమితుల్ని ఏర్పరచుకున్నాను. అలాగని అక్కడి విషయాన్ని పూర్తిగా మనసు లోంచి తీసెయ్యలేదు. మహీ, కల్యాణీ కూడా నాకంటే మంచిగా ఆలోచించగలరు. నాకు తెలియకుండానే ఇందిర గారి మీద ఓ సాఫ్ట్ కార్నర్ నాలో ఉంది. బహుశా ఒకప్పటి నాలోని మొండితనం, మూర్ఖత్వం ఇప్పుడు ఆమెలో చూడటం వల్ల కావచ్చు.

“స్క్రిప్టులో చిన్న సంభాషణ మార్పులమ్మా, ఒక అరగంట బ్రేకు” అన్నారు కమల్‍జీత్ నేను వెళ్ళగానే.

“సర్.. మొన్నటి సబ్జెక్టు చెప్పరూ. ఆవేళ వాయువుల గురించి చెప్పారు” అన్నాను కుర్చీలో కూర్చుంటూ.

“అలా వాయువులు మాత్రమే కాదు. అద్భుతమైన నాడులు కూడా ఉన్నాయి. ఓ మాట చెప్పనా.. ఈ శరీరమే ఆ అనంత విశ్వానికి ప్రతిరూపం. ఇది నేను చేస్తున్నది కాదు. సైన్సే చెబుతుంది. మన శరీరంలో ఉండే ప్రతి ఎలక్ట్రానూ పరిభ్రమిస్తూనే ఉంటుందిగా వలయాకారంలో. ఎన్ని వేల కోట్ల ఎలక్ట్రానుల సంఘటితం యీ శరీరం! ప్రతిదీ ఆ విశ్వంలోని గ్రహాల లాగే పరిభ్రమిస్తోంది. ఆ అనంతమైన గ్రహాలనీ నక్షత్రాలనీ ఏ శక్తి కట్టిపడేసి ఒకటిగా నిలుపుతోందో, అంటే విడిపోయి పడిపోకుండా నిలుపుతోందో, అదే శక్తి, యీ శరీరాన్ని కూడా విడిపోయి పడిపోకుండా నిలుపుతోంది.” ఓ క్షణం ఆగారు కమల్‍జీత్. నేను వింటున్నాను. ఓ నలుసుని 50 వేల రెట్లు పెంచి చూపించే ‘స్కోప్’ లో చూస్తే మన శరీరమూ ఓ మహా విశ్వమై సాక్షాత్కరిస్తుందని అనిపించింది

“ఓ ఉదాహరణ చెబుతా. మా ఊళ్ళో మా చుట్టం ఒకరికి కళ్ళు మూతబడటం ఆగిపోయింది. కళ్ళు తెరుచుకునే ఉండేవి. అదెంత నరకమో భరిస్తే గానీ తెలియదు కదూ. నిద్ర ఉండదు. కళ్ళ మంటలు. కన్నీరు కారదు. లూబ్రికేషన్ లేక కళ్ళు ఎండిపోయేవి. రకరకాల ఐ డ్రాప్స్ వాడారు. ఆఖరికి అమెరికా దాకా కూడా వెళ్ళాచ్చాడు. కానీ జబ్బు తగ్గలా. అప్పుడు మా పక్క ఊరి ఒకాయన వచ్చాడు.. తాను యీ జబ్బుని తగ్గిస్తానని. ఆయన ఓ మామూలు ఆయుర్వేద వైద్యుడు. ముందు మా చుట్టానికి ప్రాణాయామము, యోగాసనాలు నేర్పుతూ, ఒక ప్రత్యేక పద్ధతిలో ప్రత్యేక యోగాసనంతో శ్వాస క్రియ చెయ్యనున్నాడు.

చిత్రం ఏమంటే 15 రోజుల్లో కళ్ళు మూతలు పడ్డాయి. ‘ఎలా?’ అని అడిగితే ఆయన చెప్పాడు – కూర్మము అనే ఉపవాయువుని సృష్టించే రస గ్రంథి లోపించిందనీ, దానికి శ్వాస ద్వారా, ప్రత్యేక యోగాసనం ద్వారా ప్రేరణ కలిగించడం వల్ల జబ్బు తగ్గిందనీ. అప్పుటి నించీ నాకు యీ సూక్ష్మ విషయాల మీద ఆసక్తి కలిగింది” అన్నారు కమల్. ఆ విషయం విన్నాక నాకూ అపరిమితమైన ఆసక్తి పెరిగింది. మానవ శరీరమే ఓ అత్యంత అద్భుతమైన యంత్రం అని అర్థమైంది. అదే అన్నాను కమల్‌జీత్‌తో.

“యంత్రమే కాదు.. పరిశోధనాలయం కూడా. ఆ విషయాన్ని స్పష్టంగా గుర్తించి, విశ్వాన్ని శరీరానికి అనుసంధానం చేసిన మహాయోగి మాస్టర్ C.V.V. చాలా జాగ్రత్తగా శ్రద్ధగా పరిశీలిస్తే కానీ వారి స్థాయిని అందుకోలేము. కొన్ని అక్షర సంపుటాలలో వారు సృష్టించిన ‘ఎడ్జస్టుమెంట్స్’ అపూర్వం, అద్భుతం” అన్నారు కమల్‍జీత్.

“మాస్టర్ గారి గురించి విన్నాను. అంతే. వారి బోధనలు వినలేదు. వారి శిష్యులు ఉన్నారని తెలుసు. సర్, మీరు నాకు బోధ పరుస్తారా?” అడిగాను ఆయన్ని.

“సమయం దొరికినప్పుడల్లా నాకు తెలిసింది చెబుతాను. అలా, కొన్ని పుస్తకాలు కూడా సజెస్ట్ చేస్తాను. వినడం ఒక ఆనందమైతే, పుస్తకాలు చదివి తెలుసుకోవడం మదానందం. ఆచరించి ఇతరులకు బోధించడం పరమానందం” అన్నారు కమల్.

అసిస్టెంట్ డైరక్టర్ రావడంతో మా సంభాషణకు బ్రేక్ పడింది.

***

“జీవితం అంటే ఏమిటో తెలుసా? ఏడేళ్ళ పిల్లాడికి ఎంత తెలుసో డెబ్బై ఏళ్ళ మనిషికీ అంతే తెలుస్తుంది. కారణం అది నిత్య ప్రవాహం. ఈ క్షణం మనకి తెలుసు. మరు క్షణం ఏమవుతుందో తెలిసినది ఎవరికీ? అందుకే ‘గతం’ మనకి అవగతమవుతుంది. భవిష్యత్తు అగోచరమే. నిజం చెబితే వర్తమానం అనేది లేదు. కదిలిపోతూ గతంలోకి జారిపోయే క్షణాలనే మనం క్షణికమైన వర్తమానం అంటాం. గతాన్ని గనక వదిలి వెయ్యగలిగిచే ప్రతి క్షణమూ నూతనమే.” ఆ సాయత్రం ప్రాణామాయానికి ముందు ఓ చక్కని జీవితావగాహన కలిగిస్తూ అన్నారు కమల్. ఆయన పూరక కుంభకాల నుంచి మొదలెట్టి శ్వాస లోపలికి వెళ్ళేప్పుడు, బయటికి పంపేప్పుడు, నిలిపి ఉంచినప్పుడూ జరిగే అతి సున్నతమైన మార్పులని ప్రాక్టికల్‌గా వివరిస్తుంటి నాకు అర్థమైంది.. ఎంత అమూల్యమైన ‘యోగాన్ని’ మనం పోగొట్టుకుంటున్నామో. ప్రాణాయామ ప్రక్రియ ఎవరైనా చేయొచ్చు. ఎవరైనా లబ్ధి పొందొచ్చు. దానికి కుల, మత, వర్గ భేదాలు అంటవు.

రాత్రి 9.30కి వినోద్ ఆయన కాటేజీకీ, నేను నా కాటేజీకీ వెళ్ళాం.

“ఏమన్నా జరిగిందా.. కుఛ్ హో గయా?” చిలిపిగా అన్నది తరుణి.

“నో తరుణీ. అలాంటిది జరిగితే ముందు నీకే చెబుతా. యూనిట్‍లో నాతో చనువుగా ఉండే స్త్రీవి నువ్వేగా. అయినా మేం ఇద్దరం వెళ్ళింది కమల్‌జీత్ కాటేజీకి. అది నీకు తెలీదు గదా!” నవ్వేసి అన్నాను. ఇక్కడ కోపం తెచ్చుకోవడం వల్ల ప్రయోజనం లేదు. ఇక్కడే కాదు.. ఎక్కడైనా సరే. కల్యాణి గారు చెప్పినట్లు ప్రతిచర్య, ప్రతిబింబం, ప్రతిసవ్వడి (శబ్దం) అనవసరం కదా!

“నువ్వు చాలా ఎదిగావు అలా. మీ సౌత్ ఇండియన్స్ చాలా తెలివైన వాళ్ళే కాదు, ఫాస్ట్ లెర్నర్లు” అంది తరుణీ కిద్వాయ్.

“తెలివీ, నేర్చుకోవడంలో వేగం సౌత్, నార్త్ లను బట్టి ఉండదు తరుణీ. మన ఆలోచనలను బట్టీ, అవగాహనను బట్టీ ఉంటుంది. ఎనీ వే, రేపు మళ్ళీ మేం బయటకు వెళ్తున్నాం. కావాలంటే నువ్వూ రావచ్చు” అని నా కాటేజ్ తలుపులు తెరుచుకుని లోపలికెళ్ళాను.

చల్లటి నీళ్ళతో ముఖం కడుక్కుని, క్రొత్తగా నేర్చుకున్న ప్రాణాయామం ఓ పది నిముషాలు చేసి, ఓ గ్లాసుడు గోరు వెచ్చని బాదం పాలు తాగి కళ్ళు మూసుకొని నిశ్చంతగా పడుకున్నా. పది నిముషాల్లో నిద్రలోకి జారుకుంటానని నాకు తెలుసు. అందుకే ఆ పది నిముషాలూ దేని గురించి ఆలోచించడం కాదు గదా, తలవను కూడా తలవను.

***

“మానిసి ని తిరగేస్తే సినిమా: జీవితమూ అంతే” జులూ నాగర్ అన్నాడు.

“అవును” అన్నాను. అతనంటే నాకు మంచి ఇంప్రెషన్ ఉండేది. కమల్‍జీత్‌ మాటల్ని కొంచెం ఎగతాళిగా తీసుకున్నప్పటి నించీ నేను కాస్త ముక్తసరిగా ఉంటున్నాను.

“కమల్‌జీత్ చాలా సౌమ్యుడే కాదు.. జీనియస్” అన్నాడు జూలూ.

“అవును” అన్నాను. నాకు నవ్వొచ్చింది. నేను ఎందుకు ముక్తసరిగా ఉంటున్నానో అతడు గ్రహించి ఉండాలి.

“కానీ అలా జీ, వేదాంతం ఎట్సెట్రా లకి మీ వయసు సరైంది కాదు. మీరు అధిరోహించవలసిన మెట్లెన్నో ఉన్నాయి. ఈ ఇండస్ట్రీ అంత అనూహ్యమైన పరిశ్రమ సృష్టిలో మరొకటి ఉండదు. కొందర్ని మొదటి సినిమాతోనే పైకెత్తి ఆకాశపు ఆఖరి అంచున నిలబెడుతుంది. మళ్ళీ అధః పాతాళానికీ తొక్కుతుంది. ఇదీ అదీ కూడా అనూహ్యమే. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి” నర్మగర్భంగా అన్నాడు జూలూ, ది గ్రేట్ కమేడియన్.

“మీరిచ్చిన సూచనను ఎప్పుడూ జ్ఞప్తిలో ఉంచుకుంటాను” వినయంగా, పొందికగా జవాబిచ్చాను. నా ఫస్ట్ డెరక్టర్ సత్యమోహన్ గారు, “అమ్మాయీ.. అతి పరిచయం పెంచుకోవాలని చూసేవాళ్ళనీ, అడక్కుండా సలహాలిచ్చే వాళ్ళనీ, నిన్ను పొగుడుతూ మరొకర్ని కించపరిచే వాళ్ళనీ, ఎప్పుడూ దూరంగా ఉంచు. అలా దూరం పెట్టలేకపోతే వినయంగా సమాధానం చెప్పి ఏదో ఒక పనిని సృష్టించి అక్కడినించి తప్పుకో” అని చెప్పడం నాకు గుర్తుంది.

“థాంక్యూ అలా జీ. నేనెప్పుడూ నీ మంచిని కోరేవాణ్ణే. కామిక్ సీన్స్‌లో ఎప్పుడు సందేహం వచ్చినా నన్నడుగు. బెస్ట్ టిప్స్ ఇస్తాను” అన్నాడు జులూ ఆనందంగా. దాంతో ఆ సంభాషణకి చెక్ పెట్టగలిగాను.

ఆ మరుసటి రోజునే తెలుగు ‘ధీర’ లో లేని ఓ కామెడీ సీన్ హిందీలో పెట్టారు. అప్పటి వరకు నాకు కామెడీ సీన్లు లేవు గనక కామెడీని ఎలా పండించాలో తెలీదు.

“ఎందుకు వర్రీ?” అన్నాడు వినోద్. నేను ‘కామెడీ’ చెయ్యటం ఇదే తొలిసారని చెప్పాను.

“అలా.. ఏ సీన్ అయినా టైమింగ్ మీద ఆధారపడుతుంది. టైమింగ్ కరెక్టుగా ఉంటే సామాన్యమైన డైలాగ్ కూడా అద్భుతంగా పండుతుంది. టైమింగ్‌ని చూడు” అని సలహ ఇవ్వడమే కాక తన దగ్గరున్న వీడియో ప్లేయర్‌లో రెండు మూడు సన్నివేశాలు చూపించాడు. అలా జానీవాకర్, మెహమూద్, దుర్గా ఖోటే వంటి మహానుభావుల ఎక్స్‌ప్రెషన్స్ చూడగలిగాను. తెలుగులో గిరిజనీ, సూర్యకాంతాన్ని, రమాప్రభని గుర్తుకు తెచ్చుకున్నాను.

“ఎదురు లేదోయ్ బెదురు లేదోయ్” అని నాకు నేనే ధైర్యం చెప్పుకుని నమ్మకంతో షాట్ లోకి అడుగుపెట్టాను.

సింగిల్ షాట్, ఒకే టేక్‍లో ఓకే అయింది.

“వాహ్! భలే చేశావు అలా. నీ మీద ఫుల్ కామెడీ పిక్చర్ ప్లాన్ చెయ్యొచ్చు. ఇప్పటిదాక నీ మీద కాన్ఫిడెన్స్ లేదు. హాస్యాన్ని పండించగలవని ఇప్పుడే తెలిసింది. మరిన్ని కామెడీ సన్నివేశాలు రాయిస్తా. పిక్చర్ నీకూ కూడా ప్లస్ అవుతుంది” నా చేతులు పట్టుకుని ఊపేస్తూ అన్నాడు అమిత్ సక్సేనా. అందరూ అభినందించారు. వినోద్ కళ్ళ తోనే గ్రేట్ అన్నట్టు ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు. షాక్ తిన్నది జూలూ.

“కామెడీ నువ్వు ఎప్పుడు నేర్చుకున్నావు?” షాక్‍తో అడిగాడు.

“నేర్చుకోలేదు.. అలా వచ్చిందంతే” వినయంగా చెప్పాను.

“సరే.. ఇక పోటాపోటీ” అన్నాడు జూలూ పెద్దగా నవ్వుతూ.

నవ్వించడం ఓ యోగమని జంధ్యాలగారు ఎప్పుడో చెప్పారు గదా!

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here