హాయిగొలిపే తెమ్మెరలు – శారద కథలు

3
6

[శ్రీమతి శారద గారి ‘మలయమారుతం’ అనే కథాసంపుటిని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

[dropcap]ఆ[/dropcap]స్ట్రేలియాలో నివసించే శ్రీమతి శారద తెలుగు సాహితీలోకానికి సుపరిచితులే. శారద గారు ఎన్నో కథలు, నవలలు రాశారు. అనువాదాలు చేశారు. ఆస్ట్రేలియాలో ఓ ప్రభుత్వ సంస్థలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న శారద గారు సంగీత సాహిత్య రంగాలలో విశేషంగా సేవలందిస్తున్నారు. ఇటీవల 15 కథలతో ‘మలయమారుతం’ అనే కథాసంపుటిని వెలువరించారు. ఇది వారి రెండవ స్వీయకథల సంపుటి. ఈ పుస్తకంలోని కథలన్నీ 2005-2021 మధ్య కాలంలో వివిధ ప్రింట్, ఆన్‍లైన్ మేగజైన్లలో ప్రచురితమైనవే.

~

మనిషి మనసును అగాధంతో పోలుస్తూ అంతరంగపు అలజడిని అత్యంత సహజంగా చిత్రీకరించిన కథ ‘అగాధం’. ఇతరుల జీవితాలనీ, ఎమోషన్స్‌నీ శాసించగలిగే శక్తి ఉంటే ఒక్కోసారి మనిషిలో శాడిజం ఎలా పెరుగుతుందో శ్యామల పాత్ర ద్వారా వెల్లడిస్తారు రచయిత్రి. ఇతరుల వ్యక్తిగత జీవితాలలో అనవసరమైన జోక్యం చేసుకుంటే ఏం కోల్పోతామో ఈ కథ ద్వారా తెలుస్తుంది.

తల్లి ప్రేమని మరో కోణంలో చూపిన కథ ‘మాతృదేవో భవ’. భగవంతుడి ప్రేమకీ, అమ్మ ప్రేమకీ మధ్య ఉండే తేడాని ప్రస్తావిస్తుందీ కథ. తనకి పుట్టిన పిల్లలు మిగతా పిల్లలకంటే ప్రత్యేకమని, వాళ్ళ బాల్యం నుంచి భావించిన సరోజ తన పిల్లలని అలాగే పెంచి పెద్ద చేస్తుంది. పెళ్ళిళ్ళ కూతురు విషయంలో ఒకలాగా, కొడుకు విషయంలో ఒకలాగా మాట్లాడుతుంది. తమ పిల్లలు అమాయకులనీ, మిగతా పిల్లలే గడుసువాళ్ళని భావించి వాస్తవాలను గ్రహించక తమ ఆలోచనా విధానం సరైనదే అని నమ్మే తల్లిదండ్రులు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరాన్ని చాటుతుందీ కథ.

కాస్త అనిశ్చితి ఉంటేనే జీవితం ఉత్సాహంగా ఉంటుందని భావించే సురేఖ కథ ‘మలుపు’. ముభావంగా ఉండే భర్తకీ, ఉల్లాసంగా ఉండే సురేఖకీ పొంతన కుదరదు. పైగా తనకి పిల్లలు పుట్టరని వైద్యులు చెప్పాకా, వాళ్ళ జీవితంలో స్తబ్ధత వచ్చేస్తుంది. ఒకప్పుడు ఉన్న ‘జీవితాన్ని తన చెప్పుచేతలలో ఉంచుకోగలనే ధీమా’ సురేఖలో సడలిపోతుంది. ఒక ప్రయాణంలో తారసపడిన ఓ పాత స్నేహితురాలి వల్ల గతం గుర్తు చేసుకుని తను చేసిన తప్పు ఇద్దరి జీవితాలని ప్రభావితం చేసిన వైనాన్ని వెల్లడిస్తుంది. ఆ స్నేహితురాలు బస్సు దిగి వెళ్ళిపోతూ సురేఖకి చెప్పిన మాటలు గొప్ప సత్యాల్లాంటివి.

ఎదుటి వ్యక్తులు సంతోషంగా ఉంటే హర్షించలేని జనాలు ఒక్కోసారి వాళ్ళ వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూసి, వాళ్ళని ఇరుకున పెట్టే అవకాశం లభిస్తే మానసికంగా హింసించి సంతృప్తి పడతారు. ఒకే ఆఫీసులో పని చేసే మృణాళిని, లక్ష్మిల విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఆఫీసులో మృణాళినికి లభించే గౌరవం లక్ష్మికి కంటగింపుగా ఉంటుంది. అనుక్షణం ఆమెతో పోల్చుకుంటూ, ఆమె పట్ల నెగటివిటీని పెంచుకున్న లక్ష్మికి మృణాళినిని ఇబ్బంది పెట్టచ్చు అనే అవకాశం దొరుకుతుంది. దాన్ని వాడుకోవాలనే ఉద్దేశంతో ఆమెని కాఫీ తాగుదాం రమ్మని పిలుస్తుంది. ఆ సందర్భంలో మృణాళిని మాట్లాడిన తీరు, చెప్పిన విషయాలతో లక్ష్మి మొహంలో చిన్న వెలుగు వస్తుంది. ‘నా మీద నా అయిష్టత కొంచెం తగ్గినట్లుంది’ అనుకుంటుంది. జీవితాన్ని సానుకూలంగా చూసేవారి ప్రభావం తోటివారి మీద కూడా ఎంతో కొంత పడుతుందని చెప్పే కథ ‘చాపల్యం’.

పూడ్చలేని నష్టం కలిగించిన వాళ్ళని క్షమించటం ఎంత కష్టమో చెప్పే కథ ‘నిశ్శబ్దపు హోరు’. అత్యంత ఆత్మీయులే మనని కష్టపెడితే, వాళ్ళని దూరం చేసుకున్నా, మనసులోని వేదన తీరక మౌనంలోనూ ఓ రకమైన ధ్వని నిరంతరం ప్రతిధ్వనిస్తూనే ఉంటుందని ఈ కథ చెబుతుంది. అయినా దూరం చేసుకున్న వాళ్ళని తిరిగి దగ్గరకు చేసుకునే అవకాశం జీవితం మళ్ళీ ఇస్తుందని ఈ కథ చెబుతుంది. ఆ అవకాశాన్ని దక్కించుకుంటామా, వదిలేసుకుంటామా అనేది విజ్ఞత!

ఒక ప్రమాదంలో అంధురాలై జీవితాన్ని నిస్సారంగా గడుపుతున్న ఓ టీచర్‌లో మార్పు తెస్తాడు ఆదిత్య. కళ్ళు ఉన్నప్పుడు ఆమె ఎంతో పాజిటివ్‍గా ఉండేదో ఆమెకే గుర్తు చేసి, తన నిస్సహాయతని జయించి, పిల్లలకి మళ్ళీ పాఠాలు చెప్పేలా చేస్తాడు. ఆమె సంగీతంలో తన అభిరుచిని కొనసాగించి, కచ్చేరీ చేసే స్థాయికి ఎదిగేలా ప్రేరణనిస్తాడు. మనకి తారసపడే కొందరు వ్యక్తులు ఇబ్బంది పెడితే, మరికొందరు స్ఫూర్తినిచ్చి జీవితాన్ని ఓ గాడిలో పెడతారని ‘వేగుచుక్క’ కథ చెబుతుంది.

ఒక వ్యక్తి తన వ్యక్తిత్వాన్నీ, ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టి జీవితంతో రాజీ పడుతూ బ్రతికే స్థితిలోనూ నిబ్బరంగా ఎలా ఉండగలరు? నిస్సహాయతే లోంచే వేదనని తట్టుకోగల శక్తి వస్తుందా? ఆర్థికంగా భర్త మీద ఆధారపడ్డ భార్యలకు విలువ ఉండదా? ఉమ్మడి కుటుంబాలలో కనబడే బాధ్యతా రాహిత్యానికి ఎవరు కారకులు? ఎలా ఎన్నో ప్రశ్నలు వేస్తుంది ‘ప్రహేళిక’ కథ.

ఏకానేకం’ తమ అవకాశాల్ని పరాయివారు తన్నుకుపోతున్నారన్న అభిప్రాయంతో ఉండేవారి గురించిన కథ. ఆస్ట్రేలియాలో భారతీయులకు ఎదురయిన హేళనలూ, తెలంగాణ ఉద్యమ ఘటనలను మేళవిస్తూ అల్లిన కథ.

మధ్యతరగతి మనుషులు తమ వాదనలని, అభిప్రాయాలని చెల్లించుకోవడం కోసం ఎలా ప్రవర్తిస్తారో, బంధాలను ఎలా తూకం వేస్తారో చెప్తుంది ‘ముసుగులు’ కథ. తమ స్వార్థానికి/ప్రయోజనానికి అనుగుణంగా వాదనలని నిర్మించుకుంటూ, కొండొకచో తోటివారిని నెట్టేస్తూ జీవితపు పరుగుపందెంలో ముందుకు వెళ్ళిపోవాలనుకుంటారు కొందరు. ఎదురుదెబ్బలు తగలనంత వరకూ సాఫీగానే సాగిపోతుంటాయి ఇలాంటివాళ్ళ జీవితాలు.

మలయ సమీరం’ అందమైన ప్రేమ కథ. గత జ్ఞాపకాల మధుర పరిమళం. ఆస్ట్రేలియా కేంద్ర ప్రభుత్వం స్వలింగ విహాహాలకి అనుమతినిచ్చిన నేపథ్యంలో అల్లిన కథ ‘ఉన్నదానికీ – అనుకున్నదానికీ’.

కష్టం ఎదురైనప్పుడు ఎలా ప్రవర్తించాలో చాలాసార్లు తోచదు. ఆప్తుల సలహాలు తీసుకుంటాం. కొన్నిసార్లు ఆ సలహాలు మనకి నచ్చవు. సమస్యని మనకోణం నుంచి కాక వాళ్ళ కోణం నుంచి చూసి, చెప్పిన సలహాల్లా తోస్తాయి. అందుకే కొన్ని సందర్భాలలో మన మనసు చెప్పినదే వినాలని చెప్తుంది ‘మారేది మార్పించేది’ కథ.

ఏం పోగొట్టుకుంటున్నామో, ఏం సాధిస్తున్నామో అర్థం కాని జీవితాలు నేటి బ్రతుకులు అంటుంది ‘మలయమారుతం’ కథ. ఒక అమ్మాయి జీవితంలోని వివిధ దశలను కర్నాటక సంగీతంలోని రాగాలతో పోలూస్తూ చెప్తుందీ కథ. ఏం కోల్పోయినా, జీవితంలో పోరాడే స్ఫూర్తిని మాత్రం పోగొట్టుకోకూడని సూచిస్తుందీ కథ.

ఆస్ట్రేలియాలోని అబోరిజిన్ల గురించి చెప్పిన కథ ‘చేయూత’. అక్కడ స్థిరపడిన వారికి మూలవాసులపై ఉన్న వ్యతిరేకతనీ, అభద్రతనీ వెల్లడిస్తుందీ కథ. ‘మా మీద జాలి చూపించేవాళ్ళు మా వెనుక నవ్వుకుంటారు’ అనుకునే మైఖేల్ తమకి సాయం చేయడానికి వచ్చే పద్మకి అవసరమైనప్పుడు ఎలా ఆసరా అయ్యాడో ఈ కథ చెబుతుంది.

ఎన్ని దుర్ఘటనలు ఎదురయినా, ఎన్ని సార్లు మనసు గాయపడినా, మన జీవితాన్ని మన నియంత్రణలో ఉంచుకోవడం, వీలైనంతగా పాజిటివ్‍గా గడపడం చాలా అవసరమని చెప్తుంది ‘సజీవం’ కథ. కొన్ని సందర్భాలలో జీవితం బరువెక్కిపోతుంది, ఇక అంతా చీకటే అనిపిస్తుంది. కానీ చూడగలిగితే ఆ చీకటిలోనూ కాస్త వెలుగు కనబడి భవితకు దారి చూపుతుంది. చాలా చక్కని కథ.

కొన్ని నిస్సహాయతలూ, ఆశలు, నిరాశల వల్ల కొన్నిసార్లు మనుషులలో అసహ్యకరమైన మానసిక స్థితి ఏర్పడుతుంది. స్వాభావికంగా వాళ్ళు చెడ్డవాళ్ళు కారు. కొన్ని పరిస్థితుల్లో అలా ప్రవర్తించి తమ ఈగోని చల్లార్చుకుంటారు. ఈ క్రమంలో స్నేహాలనీ, బంధాలనీ దూరం చేసుకుంటారు. కొందరి దృష్టిలో చెడ్డవారిగా మిగిలిపోతారు. ఈ కథల్లో అలాంటి వ్యక్తులు కనబడతారు. చాలామంది జీవితాలలో ఇబ్బందులు ఎదురవుతాయి. వాటిని వారెలా అధిగమించారో ఈ కథలు చెబుతాయి. అయిపోయిందీ జీవితం అనుకున్న స్థితి నుంచీ ఇంకా ఉంది జీవితం అనే స్థితి వరకూ నడిపే సానుకూల దృక్పథం కలిగి ఉన్న పాత్రలనేకం.

చిన్న చిన్న సంభాషణలు, లోతైన భావాలు, కళ్ళకు కట్టే సన్నివేశాలతో ఈ కథలు హాయిగా చదివిస్తాయి.

***

మలయమారుతం (కథాసంపుటి)
రచన: శారద
ప్రచురణ: అనల్ప పబ్లికేషన్స్,
పేజీలు: 140
వెల: ₹ 150
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
అనల్ప పబ్లికేషన్స్, 7093800303
ఆన్‍లైన్‍లో ఆర్డర్ చేసేందుకు:
https://telugu.analpabooks.com/malayamarutham

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here